Secrets of the Earth – Aika Tsubota

(International Children’s book day సందర్భంగా…)
******************
కొన్ని నెలల క్రితం కొత్తపల్లి పత్రిక లో స్పూర్తివంతమైన పిల్లల గురించి మొదలైన ఒక శీర్షిక సందర్భంలో, ఐకా సుబోతా గురించి తెలిసింది. అప్పుడే ఆమె రాసిన “సీక్రెట్స్ ఆఫ్ ది ఎర్త్” చదివాను. 35 పేజీల చిన్న బొమ్మల పుస్తకం. ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటి అంటే మన పర్యావరణం గురించి, భూమి గురించి, ఇందులోని జీవరాసుల గురించి – అతి సామాన్యమైన భాషలో పిల్లలకి, భూమికి మధ్య జరుగుతున్న సంభాషణలా కథ చెప్పింది ఐకా సుబోతా. అయితే? అంటారా? ఈ పుస్తకం రూపొందించినప్పుడు సుబోతా వయసు పన్నెండేళ్ళు.

ఇక ఈ పుస్తకం వెనుక నేపథ్యం: తమ స్కూల్లో పర్యావరణం గురించి ఇచ్చిన హోమ్వర్క్ అసైన్మెంట్ కోసం ఈ బొమ్మల పుస్తకం తయారు చేసింది సుబోతా. పుస్తకం సిద్ధమైన కొన్నిరోజులకే బ్రెయిన్ హేమరేజ్ తో మరణించింది. ఆమె జ్ఞాపకార్థం ఆమె తల్లిదండ్రులు ఈ పుస్తకాన్ని ఆ స్కూల్లో పంచి పెట్టారు. అయితే, క్రమంగా ఈ పుస్తకం గురించి అందరికీ తెలిసి వివిధ భాషల్లోకి అనువదితం అయ్యి, ఎంతో పేరు తెచ్చుకుంది.

పుస్తకం విషయానికి వద్దాం. రూమీ అనే ఆరో క్లాసు అమ్మాయి లైబ్రరీలో పుస్తకాలు చూస్తూ ఉంటే తనకి భూమి మీద ఒక పుస్తకం “సీక్రెట్స్ ఆఫ్ ది ఎర్త్” కనబడుతుంది. ఐచీ అన్న తన్న స్నేహితుడికి ఈ సంగతి చెప్పి పుస్తకం తెరువబోతూ ఉండగా, వాళ్ళ ముందు ఒక ఆకారం ప్రత్యక్షమవుతుంది. “నా పేరు భూమి, నా కథ చెబుతాను మీకు” అంటూ మొదలుపెడుతుంది. తన జన్మ వృత్తాంతం, మనుషుల మూలాలు, చెట్ల ప్రాముఖ్యత, నీరు, మట్టి – వీటి కథ, సూర్య రశ్మి ఉపయోగాలు, వివిధ రకాల జీవరాశులు-వాటి మధ్య సంబంధాలు, పర్యావరణం గురించి ప్రాథమిక అవగాహన, ఇలాగ – ఆ ముప్పై ఐదు పేజీలూ, ఒక ప్రాథమిక స్థాయి సైన్సు పుస్తకంలాగా, వివిధ విషయాలను తేలిక భాషలో అర్థమయ్యేలా చెబుతుంది. దానితో పాటే, ప్రస్తుతం భూమికి ఉన్న సమస్యలు ఏమిటి? మనుషులు చేసే పనుల వల్ల పర్యావరణం ఎలా ప్రభావితం అవుతుంది? అది అలాగే కొనసాగితే ఏమవుతుంది? ఆమ్ల వర్షాలేమిటి? ఓజోన్ పొరలో చిల్లులేమిటి? చెట్లు కొట్టేయడం వల్ల ఏమవుతుంది? వీటన్నింటి వల్ల మనకి కలిగే నష్టం ఏమిటి? భవిష్యత్తులో ఇదంతా తగ్గించడానికి మనం ఏం చేయగలం? పర్యావరణ పరిరక్షణ కోసం ఎవరు పని చేస్తున్నారు? – ఇలాగ ఎన్నో విషయాలను ఆ పిల్లలతో సంభాషిస్తూ భూమి వాళ్లకి తెలియజేస్తుందన్నమాట.

ఇలా భూమి కథ చెప్పి టాటా చెప్పగానే, పుస్తకం మూసుకుపోతుంది. భూమి వెళ్ళిపోయాక, పిల్లలు ఇద్దరిలో జ్ఞానోదయం కలిగి, పర్యావరణం కోసం తమ పరిధిలో తాము చేయగలిగినవి చేస్తూ, చుట్టు పక్కల వారిని కూడా ప్రోత్సహిస్తూ ముందు సాగుతారు. చివర్లో రాసిన నోట్ లో, ఐకా సుబోతా మరొక్కసారి అందరం కలిసి పర్యావరణం కోసం పని చేద్దాం అని పిలుపు నివ్వడంతో పుస్తకం ముగిసింది.

ఇవన్నీ సాధారణంగా స్కూలు స్థాయి నుండీ పిల్లలకి చెప్పే అంశాలే అయినా, చెప్పిన పద్ధతిలోని సరళతా, రాసిన సంభాషణలూ చూస్తే, రాసింది పన్నెండేళ్ళ అమ్మాయంటే ఒక్క పట్టాన నమ్మబుద్ధి కాదు. ఇప్పటి లెక్కలో ఇంతకంటే తాజా సమాచారం, ఇంతకంటే ఆకర్షణీయమైన బొమ్మల్లో, రంగుల్లో ఇప్పటి పిల్లలకి అందుబాటులో కూడా వచ్చేసి ఉండవచ్చు. కానీ, సుబోతా ఆ వయసులోనే ఎంత ఆలోచించిందో తలుచుకుంటే నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. అన్నట్లు, పుస్తకం కుడి నుండి ఎడమకు చదవాలి, చూడాలి ;)పిల్లలకే కాదు, పెద్దలకి కూడా దీన్ని తప్పక చదవమని చెబుతాను.

పుస్తకం ఆంగ్ల అనువాదం తాలూకా పీడీఎఫ్ అరవింద్ గుప్తా సైటులో ఉచితంగా చదివేందుకు లభ్యం. (పీడీఎఫ్ లంకె)
ఈ పుస్తకాన్ని మంచిపుస్తకం సంస్థ వారు “పుడమి రహస్యాలు” పేరిట తెలుగులోకి అనువదించారు (పుస్తకం వివరాలు).

You Might Also Like

Leave a Reply