పుస్తకం
All about booksపుస్తకలోకం

February 16, 2012

బాలల సాహిత్యం

నండూరి రామమోహనరావు సంపాదకీయం, ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ ౨౦, ౧౯౭౬ (April 20, 1976).
(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాసావళి” నుండి యూనీకోడీకరించబడినది. దీన్ని ఇక్కడ ప్రచురించడం పై ఎవరికన్నా కాపీరైట్ సమస్యలుంటే – editor@pustakam.net ను సంప్రదించగలరు. – పుస్తకం.నెట్)
**********************
మనకున్న బాల వాఙ్మయం రాజకుమారులు, రాజకుమార్తెలు, మాంత్రికులు, వారి ప్రేమలకు, సాహసాలకు, మాయలకు సంబంధించిన కథలు, లేదా, భారత భాగవతాది పురాణాల నుంచి సేకరించి రాసిన కథలు.

ఈనాటికీ బాలసాహిత్యం పేరుతో ఇవే ఎక్కువగా వెలువడుతున్నాయి. కేవలం ఉబుసుపోకకు చదువుకొనడానికి తప్ప మరి దేనికీ పనికిరాని ఇట్టి సాహిత్యమే ఎక్కువగా వస్తున్నది. ఈ విధమైన సాహిత్యం అసలే రాకూడదని మా అభిప్రాయం కాదు. కాని, పిల్లల మనస్సులకు ఉల్లాసాన్ని చేకూర్చడానికి ఉద్దేశించిన సాహిత్యంతో పాటు, వారి మనస్సులకు వికాసాన్ని కలిగించగల రచనలు ఎందుకు రావడంలేదన్నదే మా బాధ.

ఇది వైజ్ఞానిక యుగం. ఈ యుగ ప్రభావం మన నిత్య జీవితంపై విశేషంగా పడుతున్నది. కానీ, మన బాలవాఙ్మయాన్ని పరికిస్తే, అసలు ఈ యుగంలో మనం నివసిస్తున్నామనే విషయమే పిల్లలకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నామా అనిపిస్తుంది. ఈనాడు రైళ్ళు, బస్సులు, కార్లు, సైకిళ్ళు మొదలైన ప్రయాణ సాధనాలు లేనిదే రోజు గడవదు. టెలిఫోన్, టెలిగ్రాఫ్,రేడియో,సినిమా -ఇట్టి సాంకేతిక పరికరాలు లేనిదే పూట గడవదు. ఒకప్పుడు పాశ్చాత్య సామ్రాజ్యాల స్థానంలో ఈనాడు ఎన్నో స్వతంత్ర దేశాలు అవతరించాయి. దేశాల మధ్య, జాతుల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి. ఈ సంబంధాల ప్రభావం మన నిత్యజీవితంపై పడుతున్నది. శాఖోపశాఖలుగా విస్తరించిన విజ్ఞానశాస్త్రాలు అపారవేగంతో పురోగమిస్తున్నాయి. మానవులు చంద్రమండలంలోకి వెళ్లి తిరిగివచ్చారు. దూరగ్రహాలను చేరడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ విధంగా, మన కళ్ళ ఎదుట ఎన్నెన్నో అపూర్వ సంఘటనలు జరిగిపోతున్నాయి. వీటిని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం బహుసా ప్రతి బాలునికి, ప్రతి బాలికకు సహజంగా ఉంటుంది. ఈ కుతూహలాన్ని తీర్చగల ప్రాథమిక సాహిత్యం-బేసిక్ లిటరేచర్ మనకు ఏపాటిగా వున్నదని ప్రశ్న వేసుకుంటే, దాదాపుగా లేదనే సమాధానం వస్తుంది.

మన రచయితలు ఈ విధమైన సాహిత్యం జోలికి పోరు. ఇట్టి సాహిత్య సృష్టి శ్రమతో కూడినపని. బహుసా దీనిపట్ల ఆదరం తక్కువ అని, దీనికి ప్రతిఫలం కూడా తక్కువ అని భయం కూడా ఉండవచ్చు. ప్రచురణకర్తలు కూడా ఇట్టి సాహిత్యాన్ని ప్రచురించడానికి ముందుకు రారు. వారికి కూడా బహుశా రచయితలకున్న భయాలవంటివే ఉండవచ్చు. కనుకనే మనకు బాలవాఙ్మయం అనగానే జానపద సాహిత్యాన్ని పోలినదే ఎక్కువగా వస్తున్నది.

రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మొన్న మద్రాసులో ఒక సభలో ప్రసంగిస్తూ, బాలబాలికలను బాధ్యతాయుతులైన పౌరులుగా తీర్చిదిద్దగల సాహిత్యం ఎక్కువగా రావాలని, అట్టి సాహిత్య సృష్టికి రచయితలు కృషి చేయాలని, విజ్ఞప్తి చేసారు. ఈ విజ్ఞప్తి సఫలం కావడానికి కేవలం రచయితల కృషి మాత్రమే చాలదు. లాభార్జనే ప్రధానమైన ప్రయివేట్ రంగంపై పూర్తిగా ఆధారపడి కూడా ప్రయోజనం లేదు. ప్రభుత్వం కూడా తన వంతు బాధ్యతను నెరవేర్చాలి.

ఈ బాధ్యతా అకాడమీల ద్వారా నిర్వహించవచ్చు. ఇటీవల మన రాష్ట్రంలో బాలల అకాడమీని నెలకొల్పారు. బాలల మనోవికాసానికి దోహదం చేయగల సాహిత్యాన్ని విరివిగా, చౌకగా, ఆకర్షనీయంగా ప్రచురించి, అందజేయడానికి ఈ అకాడెమీ ఎందుకు కృషి చేయరాదు? ఇందుకోసం ఒక ప్రత్యెక సంస్థను ఎందుకు నెలకొల్పరాడు?

ఏమిటి, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు – వీటిని ప్రశ్నా పంచాకంగా పేర్కొంటారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ప్రతి బాలునిలో, బాలికలో సహజంగా ఉదయించే ప్రశ్నలివి. వీటికి సమాధానాలు చెప్పి బాలబాలికల కుతూహలాన్ని తీర్చగల సాహిత్యం మనకి సమృద్దంగా రావాలి. కుతూహలాన్ని సకాలంలో సక్రమంగా తీర్చకపోతే, అది అసలే అణగారిపోతుంది. ఇట్టి కుతూహలం లేని బాలబాలికలు బాధ్యతాయుతులైన పౌరులుగా వికసించలేరు.About the Author(s)


2 Comments


  1. […] పుస్తకం.నెట్ లో పునర్ముద్రితం. లంకె ఇక్కడ. పుస్తకం వివరాలు: వ్యాఖ్యావళి (Vyakhyavali […]


  2. Good questions. Still looking for answers 🙂 First, there is some good literature. It needs to become more visible. Next we have to bring much much more and in Telugu ofcourse, original besides translations. One part of the solution involves encouraging our kids to express much more than they seem to do now. I was glad to see some such expressions (an interesting coincidence) today while looking at some contributions to kottapalli children’s magazine.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

యుగకర్త నిర్యాణం – 1983 నాటి వ్యాసం

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. తెల...
by పుస్తకం.నెట్
1

 
 

కొడవటిగంటి – 1980 నాటి వ్యాసం

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. తెల...
by అతిథి
1

 
 

చాసో సప్తతి – (1985 నాటి వ్యాసం)

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. తెల...
by అతిథి
1

 

 

మానవతావాది సార్త్ర

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. Jean-Paul S...
by అతిథి
0

 
 

మహాకవి అస్తమయం (1980 వ్యాసం)

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. దేవ...
by అతిథి
0

 
 

నవ్యకవితా పితామహుడు

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. కవి ...
by పుస్తకం.నెట్
0