మంత్రనగరిలో మాయల వేటలో..

తెల్లని అట్టపైన నెత్తుటి కత్తిని పట్టుకొని నాలుకను పెదాల కిందకు జార్చి, నల్లటి ఆకారం ఒకటుంది. దాని కింద “The Sorcerer’s Apprentice” అని పుస్తకం పేరు. దాని కింద, పుస్తకానికి ఏక వాక్య నిర్వచనం: An incredible journey into the world of India’s Godmen అని. అసలైతే ఇలాంటి పుస్తకాలను చూసి పక్కకు పెట్టేస్తాను. కానీ ఈ అట్టపై నన్ను అమితంగా ఆకర్షించినది ఒకటుంది. అది రచయిత పేరు: Tahir Shah. వీరిదే గత ఏడాది, “In Arabian Nights” చదివాక ఆ పేరును విస్మరించటం కుదరలేదు నాకు.

పాతాళభైరవిలో తోటరాముడు గుర్తున్నాడా? రాకుమారిని వలచి, ఆమెను పెళ్ళాడాలనుకుంటే రాజుగారొచ్చి డబ్బూ, దస్కం పట్టుకురమ్మంటారు. ఇది కనిపెట్టిన నేపాలీ మాంత్రికుడు చక్కగా ఉచ్చు పన్ని తోటరాముడిని ఇరికించి, తన మనోభీష్టం నెరవేర్చుకోబోతాడు. ప్రేమ కోసం అలా వలలో పడిపోతాడు, పాపం ఆ పసివాడు!

తాహీరుడూ అభినవ తోటరాముడే. ప్రేమకోసం కాదు, చిన్ననాటి కలైన “మాజిక్ నేర్చుకోవాలి” అని పట్టుబట్టి ఏ తోడూ లేకుండా భారతదేశానికి వస్తాడు. ఆ కలకు నేపథ్యం ఏమిటంటే, తాహీర్‍కు పదకొండేళ్ళ వయసులో అతనికేదో ముప్పు ఉందని తలచి, అతణ్ణి కాపాడడానికి భారతదేశం నుండి ఒకడు ఇంగ్లాండులో ఉన్న తాహీర్ ఇంటికి వస్తాడు. అతడు తాహీర్ పూర్వీకుల సమాధికి కాపలాదారు. ఆ పనిని వదిలి ఈ పిల్లవానికి ముప్పు తప్పించడానికి తాపత్రయపడతాడు. అనుక్షణం తాహీర్‍కు నీడలా ఉంటాడు. అలా ఉన్న సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. తాహీర్ అతడి నుండి కొద్దిగా ’ఇంద్రజాలం’ నేర్చుకుంటాడు. కానీ, కారణాంతరాల వల్ల అది అర్థాంతరంగా ముగిసిపోతుంది.

అలా చిన్నప్పుడు చెదిరిపోయిన కలను తాహీర్ యుక్తవయసు వచ్చినా మర్చిపోకుండా, ఎలా అయినా అతడి నుండే మాజిక్ నేర్చుకొని ఒక ప్రముఖ మెజిషియన్ అవ్వాలని ఇక్కడకు వస్తాడు. అతడి పూర్వీకుల సమాధి ఉన్న ’బుర్హాన’ కు చేరుకుంటాడు. తన కోరికను బయటపెడతాడు. కాని అతడి చిన్ననాటి గురువు, విద్య నేర్పించేంత విద్య తన వద్దలేదనీ, తన గురువు వద్దకే పంపిస్తాడు ’హాకిమ్ ఫిరోజ్, కలకత్తా!’ అన్న అరకొర చిరునామా ఇచ్చి.

ఆ చిరునామాను పట్టుకొని, కలకత్తా వంటి మహానగరంలో ఆయన్ని వెతకడానికి బయలుదేరుతాడు. దారిలో వారణాసిని దర్శిస్తాడు. కలకత్తాకు చేరిన కొద్ది రోజులకే ఫిరోజ్ కనిపిస్తాడు. ముందు ఒప్పుకోకపోయినా, తర్వాత తాహీర్‍ను శిష్యుడుగా ఒప్పుకుంటారాయన. అక్కడి నుండి మొదలవుతాయి తాహీర్ అంతులేని కష్టాలు.

తాహీర్‍కు ఆయన వెళ్ళబోతున్న గురువును గూర్చి ఇలా హెచ్చరించబడతాడు:

‘Are you out of your mind?’ he bellowed. ‘You have no idea who you’re talking about! Hakim Feroze is no ordinary teacher. His training is no simple course for someone with a passing interest in conjury. It’s not a course at all – it’s a way of life… a tortuous regime – drill after drill under a sadist. As he torments those in the clutches, you wonder what act of sanity brough you to his door. Most of the time he makes you study absurd subjects. You hardly learn any “magic” when you’re studying under him. Now that I think about it, you must not make contact with him. You are too precious to be mishandled by that man!’

అయినా సరే, అక్కడికే వెళ్తాడు మనవాడు. అదెలా ఉంటుందయ్యా, అంటే పులులన్నింటిలో పెద్దపులిని ఎన్నుకొని, అది నోరు తెరవను మొర్రో అంటున్నా బతిమాలి నోరు తెరిపించి, దాని నోట్లో తల పెట్టటం లాంటిది. ఇంత చొరవ చూపించాక, ఊరుకుంటే అది పెద్దపులి ఎందుకు అవుతుంది? ఆ తర్వాత జరిగేవన్నీ చదివి తరించాల్సిందే! ఈ అభినయ తోటరాముడు, అలా తన లక్ష్యసాధనకై వలలో తానంతట తాను చిక్కుకుంటాడు. పైన చెప్పిన ఒక్క పేరా కొన్ని పేజీల చిత్రహింసలా పరుచుకుంటూ పోతాయి. మన కథల్లో అయితే ఓ సాహసవీరుడి పక్కన ఒక స్నేహితుడుండి, హాస్యాన్ని పండిస్తూ ఉంటాడు. ఇక్కడ మన అభినయ తోటరాముడు మరో సాయం లేకుండా, తన కష్టాలన్నింటినీ ఎక్కడా శృతి తప్పకుండా, హాయిగా నవ్విస్తూ చెప్పుకొస్తాడు. ద్విపాత్రాభినయం అనుకోవచ్చు.

ఈ మాజిక్ కోర్సు పూర్తి చేయడానికి గానూ, తాహీర్ దేశాటన చేయాల్సి వస్తుంది. అందులో భాగంగా కలకత్తా – జమ్‍షెద్ పూర్- రౌర్కేలా-సంభల్‍పూర్-బొలాంగిర్-భవానిపట్టన-జగ్‍దల్‍పూర్-విజయవాడ-ఒంగోలు-తిరుపతి-మద్రాసు-బెంగళూరు-కర్నూలు-హైదరాబాదు-గుల్‍బర్గా-షోలాపూర్-బోంబేలను అదే వరుసలో ప్రయాణం చేస్తారు. కాకపోతే, ఈయన చేస్తున్నది మాయాజాలానికి సంబంధించిన కోర్సు కాబట్టి ఈయన ఎక్కువగా భారతదేశంలోని సాధువులను, అవతార పురుషులు, స్త్రీలను, మాంత్రికులను లేక వింతలూ, విడ్డూరాలపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఆ విధంగా ఈ పుస్తకం subtextకు పూర్తి న్యాయం చేకూరుతుంది.

ఇది ప్రధానంగా పాశ్చాత్యులకోసం రాసిన పుస్తకం. వారికెటూ ఇక్కడి ప్రతి విషయం వింతగా అనిపించచ్చు. కానీ ఈ పుస్తకంలోని కొన్ని విశేషాలను భారతీయులనూ సంభ్రమాశ్చర్యాలలో మునక వేయించచ్చు. ఈ పుస్తకంలో కనిపించే భారతదేశాన్ని ఈ పుస్తకంలోని ఒక పేరాతో చెప్పవచ్చుననుకుంటాను.

’Don’t forget,’ he said after a minute of thought, ‘that illusion and magic are taken far more seriosuly in India than in the West.I’ve told you this before. The faddish superstition of Elizabethan Europe is a feature of modern-day India. Conjury is used by godmen, healers, priests, sadhus, and many others. All of them are seeking to create an impact. The metaphysical is the key facet to life here… Indians explain the natural through the supernatural.’

ఆ వింతలూ, విశేషాలే కాక ఇందులో భారతీయ వీధులను, నగరాలను, మనుషులనూ, వారి ఆచారవ్యవహారాలనూ, భాషనూ అందమైన వచనంలో అందించారు రచయిత. ఉదాహరణకు, ఒక రైల్వే స్టేషన్‍ను అభివర్ణించిన తీరు:

India is accustomed to pandemonium on a grand scale. At any one time, it seems as if all nine hundred million people are careering about, guided by their own evolved form of Brownian motion. Like constellations in a distant cosmos, they move according to a predestined trajectories. And at the centre of each unending galaxy is India’s version of a Black Hole: a central railway terminus.

ఆయనతో పాటు పాఠకుడూ ఒక సుధీర్ఘ ప్రయాణంలో పాల్గొన్న అనుభూతి కలిగిస్తుంది ఈ పుస్తక పఠనం. ఉండడానికి మూడొందల పేజీలున్నా, నాకు చదివటం పూర్తయ్యేసరికి ఓ వేయి పేజీల చదివినట్టు అనిపించింది. ప్రతి రెండు మూడు పేజీలకు విరామం తీసుకోనిదే ముందుకు సాగడానికి కుదరలేదు.

ఇందులోవన్నీ యధార్థ సంఘటనలు. కొందరి పేర్లు మార్చినట్టు చెప్పారు రచయిత. అయినా కాల్పనిక సాహిత్యం చదివిన అనుభూతి కలిగిస్తుంది. బలమైన స్ర్కిప్ట్ aతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే డ్రామాలో ఉండాల్సిన అన్ని ఇందులో ఉంటాయి. ఇది యదార్థ రచన అంటే నమ్మశక్యం కాని ఘటనలు చాలా ఉంటాయి. ఎవరో చాలా తెలివిగా మామూలు విషయాలను చూసి, మిగితా అంతా కల్పన జోడించి రాసారనీ అనుకోవచ్చు. కానీ ఇది ’తాహీర్ షాహ్’ రచన కాబట్టి, ఆయన ఎలాంటి నిర్భీతితో పనులు చేపడతారో అంతకు ముందు చదివిన పుస్తకంలో తెల్సొచ్చింది కాబట్టి నేనింకా ఆనందాశ్చర్యాలకు గురయ్యాను.

This book is about journey – a journey of learning, a journey of exploring and observing. And it has a potential to journey into the reader, as well.  Pick it up, when you wanna embark on a incredible journey!

___________________________________________________________________________

Details:

Sorcerer’s Apprentice – An Incredible Journey Into the World of India’s Godmen

Author: Tahir Shah

Arcade Publishers

Price: US $ 14.95 or INR 680

 

 

 

You Might Also Like

One Comment

  1. 2012లో చదివిన పుస్తకాలు | పుస్తకం

    […] *Sorcerer’s Apprentice – Tahir Shah: అద్బుతమైన పుస్తకం. భారతదేశాన్ని ఇంతిలా పరిచయం చేయగలరని నేను ఎప్పుడూ అనుకోలేదు. […]

Leave a Reply