కథ 2010

పంపిన వారు: అరి సీతారామయ్య
కథ 2010 మీద డిట్రాయట్ తెలుగు లిటరరీ క్లబ్ డిసెంబర్‌ సమావేశంలో జరిగిన చర్చా సారాంశం. -ఆరి సీతారామయ్య.

కథ 2010 సంపాదకులు: వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌. ఈ చర్చలో పాల్గొన్న వారు: వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, నర్రా వెంకటేశ్వరరావు, మారంరాజు వెంకటరమణ, బూదరాజు కృష్ణమోహన్‌, మద్దిపాటి కృష్ణారావు, నేను.
***

కూర ఎందుకు బాగుందో చెప్పమంటే చెప్పటం కష్టం. కానీ, ఉప్పో కారమో ఎక్కువో తక్కువో అయితే, లేక కూర మాడిపోతే, చెప్పటం సులభం. కథ విషయంలోకూడా అంతే.

డిసెంబర్ సమావేశంలో డీటీయల్సీ సభ్యులం కథ 2010 లో ఉన్న కథల గురించి చర్చించాం. ఈ సంకలనంలో ఉన్న 13 కథల్లో 3 కథలు చాలా బాగున్నాయి: మథురాంతకం నరేంద్ర గారి “చిత్రలేఖ“, “తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి గారి “గారడీ“, కాశీభట్ల వేణుగోపాల్ గారి “నిశ్శబ్దస్వరం“. టెక్నిక్ పరంగా పెద్దింటి అషోక్ కుమార్ గారి “రణనినాదం అను 7 ఎపిసోడ్ల కథ” కూడా బాగుందనిపించింది. కొన్ని కథలు (వి. చంద్రశేఖరరావు గారి “హెచ్. నరసింహం ఆత్మహత్య“; మహమ్మద్ ఖదీర్‌బాబు గారి “గెట్ పబ్లిష్‌డ్‌“; వాడ్రేవు చినవీరభద్రుడు గారి “పాఠాంతరం“) ఫరవాలేదు అనిపించాయి.

ఇక మాడిపోయిన కథలూ, ఉప్పోకారమో సరిగ్గాలేని కథలు చాలా ఉన్నాయి. వాటిమీద జరిగిన చర్చా సారాంశం ఇది.

బెజ్జారపు రవీందర్ గారి “కొత్త రంగులద్దుకున్న కల”

ఈ “కథ”లో కొందరు జ్ఞానులు ఉంటారు. ‘జనం’ ఉన్నాడు. మాకు అర్థం అయినంతవరకూ జ్ఞానులు రాజకీయ నాయకులు. జనం తెలంగాణ ప్రజలు. ఒక జ్ఞాని రాజీనామా చేస్తున్నట్లు నటిస్తాడు. ఒక అమ్మలగన్నయమ్మ, చాలా పెద్దమ్మ ప్రస్తావన ఉంటుంది. ఇది సోనియా గాంధీ గురించి అనిపిస్తుంది.

ఈ “కథ” చదవటం కష్టం అయింది అని మా అందరి అభిప్రాయం. ఇందులో కథ లేదు, కథనం లేదు, పాత్రలు లేవు, ఉపన్యాసాలూ అభిప్రాయాలూ తప్ప మరేమీ లేవు.

కథలో మొదటి రెండు వాక్యాలు చూడండి: “నాటకం రిహార్సల్ రణస్థలిలోని యుద్ధ నినాదాల్లా పరమ భయంకరంగా సాగుతుంది. సంభాషణలు జరుగుతుండగానే ఆ రేకుల షెడ్డు లో ఉన్నట్టుండి అడవులు మొలుస్తున్నాయి.” రిహార్సల్ అన్న పదం ఏకవచనం, యుద్ధ నినాదాలు బహువచనం. ఈపోలిక బాగాలేదనిపించింది. అక్కడ జరుగుతుంది రిహార్సల్ అని చెప్పిన మరుక్షణంలోనే రిహార్సల్ ని సంభాషణలు అంటాడు రచయిత. పైగా అడవులు మొలవటమేంటీ? కథ ఆరంభమే అనాలోచితంగా ఉందనిపించింది. ఈ కథలో కనిపించే మరికొన్ని ప్రయోగాలు, “విషాద ఈలలా”, “వెలుగు రేకల స్పర్శ”, “ఖండిత చేతులు,” రచయితకు భాష మీద పట్టు లేదని సూచిస్తున్నాయి.

పసుపులేటి గీత గారి “ట్రోజన్ హార్స్”

బి.టి.బాక్టీరియా నుంచి ఒక జన్యువును వంకాయ జన్యుపదార్థంలోచేర్చితే, ఆ వంకాయను కాయతొలిచే పురుగు తినదు. అందువల్ల వంగతోటకు ఆ పురుగును చంపటానికి మందు వెయ్యాల్సిన అవసరం ఉండదు. ఈ ఆలోచనతో బి.టి. వంకాయను ప్రవేశపెట్టాలని 2009-2010 లో ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నానికి నిరసనగా రాసిన కథ ఇది. ఇందులో కొంత మేజిక్‌రియలిజం ఉంది. వంగతోట పెంచుతున్న ఒక రైతుకు ఊదారంగు గుర్రం దొరుకుతుంది. అది వంగతోటలో తిరిగితే, కాయతొలిచే పురుగులన్నీ పోయి, వంగతోట అంతా బాగుంటుంది. కానీ ఈ గుర్రం పక్కనున్న పొలాల్లోకి పోవటం వల్ల అక్కడి పంటలన్నీ నాశనం అవుతాయి (ఇలా జరగటానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ విషయం రచయిత్రికి తెలియకపోవచ్చు. ఇలాంటి రచనలకు పరిశోధన అవసరం. లేకపోతే రచయితపై పాఠకులకు నమ్మకం పోవటంతోపాటు, వస్తువే అపనమ్మకానికి గురయ్యే అవకాశం ఉంది). కొంతకాలం తర్వాత రైతు ఒక కలగంటాడు. అందులో వంకాయ చెప్తుంది: ఊదారంగు గుర్రం ఒక ట్రోజన్‌హార్స్ లాంటిదనీ, దాని లోపల బి.టి. ఉన్నాయనీ. కలలో బి.టి. అతన్ని తరుముతుంది. పరిగెత్తుతూ అలసిపోయిన రైతును ముసనోబు ఫుకువొకా రక్షిస్తాడు.

ఈ కథ లో రెండు ప్రయత్నాలున్నాయి. ఒకటి బి.టి. వల్ల ప్రమాదాలున్నాయని చెప్పటం, రెండోది పాండిత్య ప్రదర్శన. నిజానికి అది పాండిత్య ప్రదర్శన కూడా కాదు. ఊరికే అసందర్భమైన పరభాషాషా ప్రయోగం. ఈ కథ ఉద్దేశం బి.టి. వంకాయ గురించి వ్యవసాయదారులనో, తెలుగు సమాజాన్నో హెచ్చరించాలనే ప్రయత్నమైతే, వాడిన ఉపమానాలు తెలుగు జనబాహుళ్యానికి అర్థమయ్యేభాషలో ఉండాలిగాని, పీటర్ పాన్‌నీ, జిన్‌ఫాండెల్ రెడ్‌వైన్‌నీ ఉదహరించడం, ఎవరికీ అర్థం కాకుండా కవిత్వం చెప్పి వీపుతట్టుకోవటం లాంటిదే. ఈ అనవసర పాడిత్య ప్రదర్శన వల్ల కథ చదవటం కష్టం అయింది. కథకు ఫుట్‌నోట్స్ రాయాల్సిన అవసరం వచ్చింది. ఉదాహరణకు కొన్ని వాక్యాలు చూడండి:

“మెత్తటి మాంసపు తెల్లని భీతి…నా రెప్పల కివతల యెహుదా అమిచా కలవరిస్తూ ఉండగానే రెప్పలకవతల హఠాత్తుగా అది మెత్తటి మాంసపు నీలి భీతిలా కదిలింది.” ఇది మాకు అర్థం కాని వాక్యం.

“ఊదారంగు దేహనగరంలోమూలమలుపులేవో మెటామార్ఫిక్ సైఫర్లని డీకోడ్ చేస్తున్నాయి.” ఇదీ అంతే.

“నా మెదడులో పాదరసంస్ప్రింక్లర్ గిర్రున తిరిగింది.” దీన్ని తెలుగులో రాస్తే బాగుండేది.

“…అమ్మలోంచి ఎడ్వర్డ్ మంచ్ ‘స్క్రీమ్’ ప్రతిధ్వనిస్తోంది. ”

“అమ్మకీ, నాకూ మధ్య రోనాల్డ్ ఎమరీక్ మయన్ క్యాలెండర్తో భూమిని రెండుగా చీల్చాడు. అమ్మకి నా మొఖంలో చార్లీఫ్రాస్ట్ కపిపించాడు. నాకు అమ్మ ముఖంలో మెగా సునామీ కనిపించింది. ”

“దాని మాటల్లో, చూపుల్లో కాలిఫోర్నియన్ జిన్ఫ్రాండెల్ రెడ్వైన్ నామీద వెన్నెల వానై కురిసింది. ”

ఇంకా ఇలాంటివి ఎన్నో. తన అభిప్రాయాలనూ, భావాలనూ సరళమైన తెలుగులో రాయటం రచయిత్రికి కుదరలేదా? లేక తను చెప్పదల్చుకున్న భావాలకు తగిన మాటలు తెలుగులో లేవా?

ఈ కథకు శీర్షిక ట్రోజన్ హార్స్ అని పెట్టారు రచయిత్రి. ఇది చాలామందికి తెలిసిన కథే కావచ్చు. కానీ రచయిత్రికి సరిగ్గా తెలియదనిపిస్తుంది. “రాత్రయ్యాక బొమ్మలోని ట్రోజన్స్ (సైనికులు) నెమ్మదిగా బయటికి వచ్చి..” అనీ, మరోచోట, “ఊదారంగు గుర్రంనుంచి వచ్చిన ట్రోజన్సే” అనీ రాశారు. ట్రోజన్‌హార్స్ లో దాగి ఉన్నది గ్రీకు సైనికులు, ట్రోజన్లు కాదు. శీర్షికగా వాడిన కథ గురించే రచయిత్రికి సరైన అవగాహన లేకపోతే ఇక కథ నిండా వాడిన బరువు మాటల అర్థం తెలుసోలేదో అని అనుమానం కలుగుతుంది.

భగవంతం గారి “చిట్టచివరి సున్నా”, చింతపట్ల సుదర్శనం గారి “ఇన్సైడర్”, సతీ ష్‌చందర్ గారి “కాక్‌టెయిల్‌”

చిట్టచివరి సున్నా” లో ఎవరిదో పాత న్యూస్పేపర్ మైదాపిండి పొట్లాం రూపంలో దొరుకుతుంది కథానాయకుడికి. దానిమీద మార్జిన్లో రాసిఉన్న సూసైడ్ నోట్ అతని దృష్టికి వస్తుంది. అందులో చివరి వాక్యం, “జీవిత సత్యాన్ని తెలిపే ‘ఆ’ పదార్థంతో పులుసు వండుకొని చివరి సారిగా తృప్తిగా భోంచేసి వెళ్ళిపోవాలి” చదివి, ఆ పదార్థం ఏమిటో కనుక్కోవాలి అని నిర్ణయించుకుంటాడు.

కొత్తగూడెం నుంచి బయలుదేరి అరవై రోజుల పాటు హైదరాబాద్లో, డిల్లీలో ఫుడ్ఫెస్టివల్స్ లో గడిపి, ఆ పదార్థం ఏమిటో తెలుసుకోలేక, తిరిగి కొత్తగూడెం చేరుకుని, అక్కడ ఒక హోటల్లో సర్వర్తో మాట్లాడుతుండగా గ్రహిస్తాడు ‘ఆ’ పదార్థం అంటే ఆనియన్ అని.

కథ ఏ వస్తువుమీద అయినా రాయొచ్చు. మామూలుగా ఏదో ఒకరి జీవితానుభవం కథావస్తువు అవుతుంది. కథ ఒక అభూత కల్పనకూడా కావచ్చు. మనకందరికీ తెలిసిన ఒక పొడుపు కథమీద పాతిక పేజీలు రాయటానికి చేసిన ప్రయత్నం ఈ కథ. అంతకు మించిన విలువేదీ కనిపించదు ఈ కథలో. చదవటం కష్టం కాలేదు, కానీ అనవసరంగా సాగదీసినట్లు అనిపించింది. క్లుప్తత లోపమే ఈ కథకు గుదిబండ.

ఈ కథలాగే చింతపట్ల సుదర్శన్‌ గారి “ఇన్‌సైడర్‌“, సతీష్‌చందర్‌గారి “కాక్‌టెయిల్‌” కూడా కృత్రిమ కథలు. కాకపోతే ఈ రెండు కథలూ క్లుప్తంగా ఉండటం వల్ల అంతగా విసిగించలేదు. ఇలాంటి కథలకు ఒక లక్షణం ఉంటుంది. కథలో నిజ జీవితాలు ఉండవు. పనిగట్టుకుని తయారుచేసిన సన్నివేశాలూ, పాత్రలూ ఉండటం వల్ల, కథలో రచయిత ఏమి చెప్పదలిచారో మనకు అర్థంకాదు. అందువల్ల రచయిత చివర్లో మనకు చెప్తారు కథ దేనిగురించో.

సతీష్‌చందర్‌ గారు “అమృతం పుచ్చుకున్న వాడు చావును జయిస్తాడు. విషం తాగిన వాడు బతుకును గెలుస్తాడు. వీళ్ళు (కథలో పాత్రలు) రెండూ కలిపి తాగేసినట్లున్నారు” అని చెప్తారు కథ చివర్లో. ఈ వాక్యాలతో కథను అన్వ్యయించుకునే ప్రయత్నం పాఠకులు చెయ్యాలి. అప్పటికీ అర్థం కాకపోతే అది మనలోపమే.

అదృష్టాన్నే నమ్ముకున్నవాళ్ళకోసం, జీవితంలో అద్భుతాలు జరగాలని ఆశపడేవాళ్ళకోసం, ఏ స్ట్రగులూ లేకుండా ఎగ్జిస్టు అవాలనేవాళ్ళకోసం, గుర్రాల్లాంటి కోరికలున్నవాళ్ళకోసం…” ఈ వాక్యంతో కథ ముగిస్తారు చింతపట్ల సుదర్శన్‌ గారు. నేను ఇంతవరకూ రాసిన కథ మీకు అర్థంకాలేదేమో, ఈ కథ ఇలాంటివాళ్ళగురించి రాశాను అని చెప్తున్నారు రచయిత.

రామా చంద్రమౌళి గారి “అతీతం”

ఇది సులభంగా చదివించిన కథ. సహజమైన సన్నివేశాలూ, పాత్రలూ. ఒక రిటైర్డ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, చాలా మంచి మనిషి, సామాజిక స్పృహ ఉన్న మనిషి, ఎంతో జ్ఞాపకశక్తి ఉన్న మనిషి, అనుకోకుండా అతనికి ఒకరోజు మాట పడిపోతుంది, స్పందన లేకుండా పోతుంది. ఆల్జీమర్స్ వ్యాధి వచ్చిందని డాక్టర్ నిర్ణయిస్తాడు. “కుళ్ళిపోతూ కంపుగొడుతున్న ఈ విలువలులేని వర్తమాన సమాజాన్ని…పశువులకంటే హీనంగా ప్రవర్తిస్తున్న ఈ దుర్మార్గ సమాజాన్ని….” నువ్వు భరించలేవు…అందుకే నీకీ వరంప్రసాదిస్తున్నాను” అని ఏదో అశరీరవాణి వినిపిస్తున్నట్లు అతని భార్య భావిస్తుంది.

ఒక్కసారిగా మాటపడిపోవటం, జ్ఞాపకాలు పూర్తిగా అనుకోకుండా నశించటం అల్జ్‌హైమర్‌ వ్యాధిలక్షణాలు కాదు. ముందుగా సమీప గతకాల జ్ఞాపకాలు కోల్పోవడం ఈ వ్యాధికి సాధారణంగా కనపడే లక్షణం. పైగా ఎక్కువగా ఆలోచించే వారికి అల్జ్‌హైమర్‌ వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువంటారు. ఈ కథలో వ్యక్తి రిటైర్డ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. బాగా చదువుతున్న మనిషి. సమాజంలో పెరుగుతున్న కుళ్ళు గురించి విపరీతంగా బాధపడుతున్న వ్యక్తి అని చెప్తారు రచయిత. అలాంటి మనిషికి మనసు విరగటం జరగొచ్చు. ఒక్క సారిగా మాట పోవటం, మతి భ్రమించటం, దాన్ని ఆల్జ్‌హైమర్స్ అనటం అశాస్త్రీయం.

ముగించే ముందు మరో రెండు విషయాలు.
పుస్తకం మొదటినుండి చివరిదాకా ఫుటర్‌లో “కథ 2009” అని ప్రింట్ అయింది. ఇది కథ 2010.
సంకలనంలోని 13 కథల్లో 5 కథల శీర్షికలు ఇంగ్లీషులో ఉన్నాయి. రచయితలకు తెలుగులో సరైన మాటలు దొరకటంలేదేమో.
ఈ కథలన్నీ చదివింతర్వాత తెలుగులో మంచికథలు రావటంలేదేమో అనిపించింది.

*************
(ఈ పుస్తకం ఆన్లైన్ కొనుగోలు లంకె ఇక్కడ. ఇక ఈ-పుస్తకం అద్దెకు/కొని చదవడానికి కినిగె.కాం లంకె ఇక్కడ.)

You Might Also Like

7 Comments

  1. కథావార్షిక 2010 | పుస్తకం

    […] భగవంతం గారి చిట్టచివరి సున్నా, వాడ్రేవు చినవీరభద్రుడు గారి పాఠాంతరం, ఈ రెండు కథల్నూ వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్ గార్లు కూడా 2010 లో వచ్చిన ఉత్తమ కథల జాబితాలో చేర్చారు (కథ 2010). […]

  2. Gireesh K.

    దురదృష్టవశాత్తూ, తెలుగు కథాసంకలనాలంటే భయపడే పరిస్థితి… కథ 1990-2009 సంకలనం ముందుమాటలో జంపాల చౌదరి గారు చెప్పెన మాటల్ని ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేకున్నా…

    “ఈ సంకలనాల్లో ఉన్న కథల్లో చాలవాటిలో ప్రధానంగా కనిపిస్తున్నవి రెండే రసాలు: విషాదం, భీభత్సం. తెలుగు జీవితాలలో మిగతా రసాలన్నీ ఉడిగిపోయాయా? లేక ఆ రసాలు కథావస్తువులుగా మలుచుకొనే నైపుణ్యం కరువైందా? ఆ రసాలు కథకు అవసరం లేదని సమిష్టిగా నిర్ణయిచుకొన్నామా? లేక “కథ” సంపాదకులు విషాద, భీభత్స ప్రధాన కథలనే ఎంపిక చేస్తున్నరా? కథలు ఇలాగే కొనసాగితే తెలుగు కథకు పాఠకులు మిగులుతారా?……

    ……
    మళ్ళీ మళ్ళీ చదువుకొని కొత్త పొరలను పక్కకు తీసి కొత్త అందాలు, కొత్త విశేషాలు గమనించి, కొత్త ఆలోచనలు, అనుభూతులు పొందే అవకాశాలిచ్చే కథలు బాగా తక్కువ. పాఠకుణ్ణి రచయితలు తక్కువగా అంచనా వేస్తున్నారని అనిపిస్తుంది…..”

  3. csrambabu

    Sitaramayya garu…namaskaram …mee sameeksha baavundi….chitralekha kadha kuda kastha kashtamaina kadhe…nachhina kadhalni kuda vishleshisthe bavundedi…print media lo intha nirbhithiga vimars ledu..netlo nayam…telugu type cheyalekapoyanu..emanukokandi….rambabu

  4. కుమారి

    “కథ” అనే కథాసంకలనం ఒక సంవత్సరంలో వచ్చిన ఉత్తమ కథా సంకలనం అనే భ్రమలు ఎవరికైనా ఉంటే ఈ వ్యాసంతో అవన్నీ పటాపంచలైపోతాయి. ఒకవేళ తెలుగు వచ్చిన ఇతర భాషల వారెవరైనా ఈ పుస్తకాన్ని కొని చదివినా కనీసం ఈ వ్యాసం చదివినా తెలుగు కథ స్థాయిపట్ల వాళ్ళు ఏమనుకుంటారు ?
    ఇవా ఉత్తమకథలు ? తెలుగు కథ ఇంత దీనస్థితిలో ఉందా ? 2010 వ సంవత్సరంలో ఇంతకంటె మంచికథలు రాలేదా ?

  5. drsjatin kumar

    a very direct and straight forward crticism rather a eye opener regarding the quality of telugu story (seetha ramaih garu namastae, sorry that i have not typed in telugu)DRJATIN

    1. ari sitaramayya

      Thanks, Jatin garu. Good to hear from you.

  6. పఠనాభిలాషి

    “మెత్తటి మాంసపు తెల్లని భీతి…నా రెప్పల కివతల యెహుదా అమిచా కలవరిస్తూ ఉండగానే రెప్పలకవతల హఠాత్తుగా అది మెత్తటి మాంసపు నీలి భీతిలా కదిలింది.”
    “ఊదారంగు దేహనగరంలోమూలమలుపులేవో మెటామార్ఫిక్ సైఫర్లని డీకోడ్ చేస్తున్నాయి.”
    “నా మెదడులో పాదరసంస్ప్రింక్లర్ గిర్రున తిరిగింది.”
    “…అమ్మలోంచి ఎడ్వర్డ్ మంచ్ ‘స్క్రీమ్’ ప్రతిధ్వనిస్తోంది. “
    “అమ్మకీ, నాకూ మధ్య రోనాల్డ్ ఎమరీక్ మయన్ క్యాలెండర్తో ”

    ఇది చదివితే పొట్ట చెక్కలయ్యే నవ్వొస్తోంది. ఏమిటీ? ఈ వాక్యరత్నాలన్నీ ఒక కథలోవే?? అందులోనూ, ఆ (2010) యేటి మేటి కథలో! అయ్యబాబోయ్! ఈ పుస్తకరాజం తప్పక కొనుక్కోవాల్సిందే! నా నలభై అయిదు రుపాయలతో తెలుగు కథ దుస్థితి కాస్త అయినా మెరుగు పడుతుందేమో?

    బీటీ వంకాయమీద ఉన్న తూష్ణీంభావం అనవసరమైన ఇంగ్లీషు ముక్కలు వాడడానికి (రచయిత్రికీ, ఆ కథ “పరిష్కరించిన” సంపాదకులకీ) లేకపోవడం గమనించదగ్గది.

Leave a Reply