అచ్చుయంత్రానికి పూర్వం పాశ్చాత్య పుస్తక సంస్కృతి

మనం పుట్టిన దగ్గర నుండి పుస్తకాన్ని చూస్తూనే ఉన్నాం. మరి పుస్తకం పుట్టినప్పటి సంగతులో? ఎప్పుడు పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఎలా ఉండేది? ఏం వేసుకునేది? అసలు పుస్తకాన్ని ఎవరు చేరదీసారు? ఎవరు కాళ్ళరాసారు? కాలగతిన పుస్తకం ఎన్ని మార్పులకు లోనయ్యింది? ఎన్ని హొయలు పోయింది? ఘనమైన చరిత్రగల మన ఈ నేస్తం చిన్ననాటి ఫొటో ఆల్బం తిరగేసే అవకాశం వస్తే? దానికి తోడు, పుస్తకం పుట్టుపూర్వోత్తరాలను గురించి బోలెడు కబుర్లు కూడా జతైతే?
అలాంటి విశేషాలన్నెంటినో, పప్పు నాగరాజుగారూ, పరుచూరి శ్రీనివాస్ గారూ ఈ వ్యాసరూపేణ మన ముందుకు తీసుకొచ్చారు. మరికేం ఆలస్యం?! అచ్చుయంత్రాలింకా మనుగడలోకి రాక ముందు పాశ్చాత్య పుస్తక చరిత్రను గురించిన అనేక విశేషాలను చదివి తెల్సుకోండి.
ఇలాంటి వ్యాసం పుస్తకం.నెట్‍లో ఇదివరకెన్నడూ రాలేదు. ఎంతో శ్రమకోర్చి రాసిన ఈ వ్యాసాన్ని పుస్తకం.నెట్‍లో ప్రచురించదల్చినందుకు వ్యాసరచయితలిద్దరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు.  ఇక్కడ మొదలైన ఈ వ్యాసపరంపర నిరాటంకంగా, దిగ్విజయంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి మరోసారి అభినందనలు!  – పుస్తకం.నెట్

 ***

 “మాటనీ రాతనీ ఒక ఇరుసుతో కలుపుకొని ముందుకుసాగే జోడెడ్లబండి భాష.”

వాక్యం రాసినవెంటనే నాలిక కరుచుకున్నాం, ఎందుకంటే – రాతకంటే, మాట ఒక నాలుగాకులు ఎక్కువే చదివింది మరి. మానవుడు తన పరిణామక్రమంలో బుద్ధిజీవిగా ఎదిగి సుమారుగా ఏభైవేల ఏళ్ళ పైమాటే అయినప్పటికీ, మొట్టమొదటి లిపి ఆవిర్భవించి సుమారుగా ఆరువేల సంవత్సరాలు మాత్రం గడిచింది. అంటే, మానవుడు సంఘజీవిగా, మేధావిగా ఎదిగి, సాంఘికవ్యవస్థలకి ఊతపట్టైన సమాచారవ్యవస్థలని ఏర్పరుచుకోవడంలో రాత అర్వాచీనమైన ఆచారమేగానీ, అనాదినుంచీ ఉన్న మౌలికమైన అవసరంకాదు. ప్రపంచంలో ఎన్నో వేలభాషలు పుట్టి, గతించినప్పటికీ, చెప్పుకోదగ్గ లిఖిత సాహిత్యం ప్రాధాన్యం సంతరించుకున్న భాషలు పట్టుమని 106 మాత్రమే. ఈనాడు వాడుకలో ఉన్న మూడువేల పైచిలుకు భాషల్లో లిఖిత సాహిత్యం ఉన్న భాషలు గట్టిగా లెక్కపెడితే వందకిలోపే [1]. లిపులు పుట్టకముందే, ఎన్ని భాషలు కాలగతిలో అంతరించిపోయాయో లేదా మరోభాషగా రూపాంతరం చెందాయో, వేరొక భాషతో కలిసిపోయాయో ఇదమిద్ధంగా లెక్కచెప్పలేం. ఈనాటికీ వాడుకలో ఉన్న ఎన్నో భాషలకి లిపివ్యవస్థలేదు, వాటిని రాయడం ఎలాగో ఎవరూ కనిపెట్టనూలేదు.

రాతకోతలెన్ని ఉన్నా భాషకి శబ్దమే శాశ్వతమైన పట్టుకొమ్మ. వినేదానికి, చూసేదానికి మధ్యనున్న మౌలికమైన తేడాని, లోతుగా విశ్లేషిస్తూ మక్‌లూహన్ (Macluhan), “అక్షరం మనిషిని అద్భుతమైన శ్రవణప్రపంచం నుండీ తటస్థమైన దృశ్యంలోకి బదిలీ చేసింది” అంటాడు [2]. మాటగాని, పాటగాని కేవలం వినిపిస్తుంది కాని కనిపించదు. అందుకని దాన్ని మనం ఏకమొత్తంగా ఒక స్థలంలో చూడలేం, అది కాలంతో పుట్టి, కాలంలో కలిసిపోతుంది. అందుకే, సంగీత రూపకాల స్వరూపాన్ని గుర్తించగలం కానీ, గుర్తుపెట్టుకోవడం చాలామందికి కష్టం. చిత్రమో, కథో, కావ్యమో, శిల్పమో, ఇల్లో, మేడో అయితే – దాని స్వరూపాన్ని గ్రహించడం, గుర్తుపట్టడం కష్టసాధ్యమైన పని కాదు.శబ్దానికి అస్తిత్వం కాలంలోనే ఉంటుంది. దృశ్యానికి అస్తిత్వం దేశంలోనే (Space) ఉంటుంది. శబ్దం కాలంలోనే ఉంటుంది కాబట్టి క్షణికమైనదనీ, రాత దేశంలో ఉంటుంది కాబట్టి శాశ్వతమైనదనే అభిప్రాయంతోనే లిపికి అక్షరం అని పేరు పెట్టారు. అక్షరం అంటే నాశనం లేనిది అని అర్థం [3]. రాత ద్వారా భాషని గ్రహించడం ఏదో తేలికగా జరిగిన మార్పు కాదు. ఈ అనుభవం మనిషి చేతనావస్థని పూర్తిగా మార్చేసింది.అర్థవంతమైన శబ్దానికి అక్షరం స్వరూపాన్నిస్తుంది. ఈ కారణంవల్లనే వోల్తైర్‌ రాతని “పెయింటింగ్ ఆఫ్ ది వాయిస్” అన్నాడు. “Scripta Manent, Verba Volent” అనే నానుడి ఈనాడు “రాత శాశ్వతం, మాట క్షణికం” అనే అర్థాన్ని ఆపాదించుకున్నా, ప్రాచీనకాలంలో అది “తన వేళ్ళే సంకెళ్ళై, కదలలేని మొక్కలా” పలకకి అంటుకుపోయినది అక్షరమనీ, ఆ మొక్క కొమ్మల మీదనుంచీ రెక్కలు తొడిగి ఎగరగలిగే పక్షివంటిది మాట అనే అర్థంలోనే వాడేవారట [3]. ప్రాచీనులందరూ, నిర్జీవమైన అక్షరాలకి తన గొంతుతో ప్రాణం పొయ్యడం చదువరి బాధ్యతగా భావించేవారు. అందుకే మనసులో నిశ్శబ్దంగా చదువుకోవడం ప్రాచీన నాగరికతలన్నింటిలోనూ గర్హించబడింది.

ఈనాడు ఇంటర్నెట్టుద్వారా వచ్చిన సమాచార విప్లవం మనందరి సమిష్టి అనుభవంతో అంతర్భాగమైపోయన పుస్తకాలని, పుస్తకంతో ముడిపడ్డ ప్రింటింగు, పబ్లిషింగు, చదవడం మొదలైనవాటన్నిటినీ సమూలంగా మార్చేస్తుందనో, మూలపడేస్తోందనో, కాలరాచేస్తోందనో ఆందోళన చెందుతున్నాం. ఇంటర్నెట్టు ద్వారా రాత, రాతతో ముడిపడ్డ సమాచార వ్యవస్థ ఎంతగా మార్పుచెందాయో, ముఖ్యంగా వాటివల్ల మన చేతనావస్థ ఎంతగా మార్పుకి, అంతకన్నా ఎక్కువగా ఒత్తిడికి లోనవుతోందో ఇప్పుడు అందరికీ అనుభవైకవేద్యమే. అంతకంటే మౌలికమైన మార్పు రాతవల్ల మానవ సమాజాల్లో వచ్చింది. కాని, జ్ఞానసముపార్జనకి, సమాచారాన్ని సృష్టించడం నుంచీ, సరఫరా చెయ్యడం వరకూ అన్నిటికీ రాతమీద ఆధారపడిపోయిన మనకి, కేవలం మౌఖికత ఆధారంగా సమాచార వ్యవస్థలని నిర్మించుకున్న ఒకప్పటి సమాజాలయొక్క సాంస్కృతిక దృక్పథం ఎలా ఉండేదో అంతుచిక్కదు, ఎందుకంటే అటువంటి సంస్కృతులని మనం, మనకి తెలిసిన వ్యవస్థల ఆధారంగానే బేరీజు వేస్తాం. ఈనాడు సాహిత్యపరమైన, తాత్వికమైన, శాస్త్రీయమైన ఆలోచనలు, వాటి వ్యక్తీకరణల స్వభావం, లక్షణాలు మానవుడి అస్తిత్వంలో విడదీయరాని అంతర్భాగంగా మనం అనుకుంటాం కానీ, ఇవన్నీ రాతఅనే ప్రక్రియ మన  అంతశ్చేతనకి అందించిన వనరులు. కేవలం శబ్దంమీద ఆధారపడ్డ సంస్కృతిలో మౌలికంగా ఆలోచనలు, భావనలు సృష్టించి, వాటిని భధ్రపరుచుకునే వనరులు చాలా వేరుగా ఉంటాయి. అందుకే ‘వాక్‌ సాహిత్యం’ అన్న భావనే అసంబద్ధం అంటాడు వాల్టర్ ఒఞగ్ [4], [5]. ఉదాహరణకి, వేద వాఙ్మయాన్ని మౌఖికరూపంలోనే సృజించి, పరిరక్షించుకునే క్రమంలో వైదిక ఋషుల అనుక్రమణిక వ్యవస్థలు ఏర్పడ్డాయని, గాత్ర ప్రధానమైన వేదపాఠాన్ని యథాతథంగా భద్రపరచడంకోసం ఒక్కో కుటుంబం ఒక్కో “టేప్‌ రికార్డర్‌”లా పనిచేసేదని, ఈ వ్యవస్థలోంచే కాలక్రమంలో బ్రాహ్మణుల గోత్రాలు ఏర్పడ్డాయని లోతుగా విశ్లేషిస్తూ వాదించారు మహదేవన్ [6]. ఇటువంటి సమాజాలలో, గురువుగారు చెప్పినది రాసుకోవడానికి కూడా వీలులేని సందర్భాలలో “ధారణ” అతి ముఖ్యమైన నైపుణ్యంగాను, మేధకి కొలమానంగాను పరిగణించబడేది. విన్నదాన్ని మరచిపోకుండా, యథాతథంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో పద్ధతులు ఉండేవి. ఛందస్సు వ్యాకరణబద్ధంగా లిఖిత సాహిత్యాన్ని సృష్టించడం కోసం కంటే, ధారణాపద్ధతిగానే ఇప్పటికీ అవధానాలలోనూ, ఆశువుగా పద్యం “అల్లడం”లోనూ, పద్యాన్ని “నడక” ద్వారా సులువుగా గుర్తుంచుకోవడంకోసమే ఎక్కువగా ఉపయోగిస్తారు. అవధానంచేసేవారికి “ధారణ” అతి ముఖ్యమైన శక్తిగా ఇప్పటికీ చెప్పుకుంటాం కదా?

ఒక దశాబ్దంక్రితం వరకూ లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు, ఇప్పుడు ఇంటర్నెట్టు విజ్ఞాన సర్వస్వం. కాని, ఒకప్పుడు గురువులు, గణాచారులు (shamans), పూజారులు, పురోహితులు, ఉపాధ్యాయులు, మునులు, కథలు చెప్పేవారు, పాటలుపాడేవారు మొదలైన సమాచార వ్యవస్థతో సంబంధమున్న వ్యక్తులే విజ్ఞానభాండాగారాలు. వారికి సమాజంలో ఎంతో విలువ ఉండేది. ఈ నాటికీ ఈ పరిస్థితిలో పెద్దగా మార్పేమీలేదు. పరిపాలనా రంగంలోను, కార్పొరేటు కంపెనీలలోను కనపడే లాబీయిస్టులు, స్పిన్ డాక్టర్లు, సమాచార అధికార్ల (#Lobbyists, spin doctors, chief information officers#) దగ్గర నుండి విలేకరులు, రచయితలు, వ్యాఖ్యాతలు చేస్తున్న పని కూడా అదే. అయితే, రాతమూలంగా వచ్చిన మార్పులు అన్ని సంస్కృతులలోనూ ఒకేరకంగా జరగలేదు. ముందు రాతతో రాజీపడడానికి, అటుపైన దాన్ని సొంతం చేసుకోడానికి ఒక్కో సమాజము, సంస్కృతి ఒక్కోలా స్పందించింది.

ఈ వ్యాస పరంపరలో, రాతమూలంగా మానవచరిత్రలో సంభవించిన మౌలికమైన మార్పులని విపులంగా చర్చించడం, ముఖ్యంగా అటు పాశ్చాత్య సంస్కృతి లిఖిత వ్యవస్థని ఆకళించుకున్న తీరు, మన సమాజం లిఖిత సంస్కృతికి స్పందించిన తీరులోనూ ఉన్న మౌలికమైన భేదాలని విపులంగా ప్రదర్శించడం మా ముఖ్యోద్దేశం. ఈ చరిత్రని మూడు భిన్న కోణాలలోంచి అధ్యయనం చెయ్యవలసి ఉంటుంది. మొదటిది సామాజిక చరిత్ర కోణం (Social History). ఇందులో మతానికి-సమాచార వ్యవస్థలకి ఉన్న అవినాభావమైన సంబంధం, విశ్వవిద్యాలయాల, లైబ్రరీల పాత్ర, ప్రచురణరంగంలో వచ్చిన మార్పులు, మొదలైనవి సమాజ సమీకరణాలని మౌలికంగా ఏ విధంగా ప్రభావితం చేశాయి అనే అంశాన్ని అధ్యయనం చెయ్యడం. రెండవది సాంస్కృతిక చరిత్ర కోణం (Cultural History). విభిన్నకాలాల్లో, భిన్న సంస్కృతుల మధ్య మౌఖిక, లిఖిత సంస్కృతుల మధ్య రాపిడి, వాటిల్లో దశలవారిగా వచ్చిన పరిణామాలని విశ్లేషించడం. మూడవది ఆలోచనల చరిత్ర కోణం (History of Ideas). అంటే లిపుల ఆవిర్భావం, అక్షర వ్యవస్థ ఏర్పడడం, అక్షరాలు, ఫాంట్లు, పుస్తకాలు, వాటి రూపకల్పనలో వచ్చిన మార్పులు, కాలీగ్రఫీ వంటి కళారూపాల చరిత్ర, రాత పరికరాలు, పుస్తకాలు రాయడం, తయారుచెయ్యడంలో వచ్చిన మార్పులు గురించిన చర్చ. ప్రాచీనకాలంనుంచీ సాంకేతిక పరిజ్ఞానం మారుతున్నకొద్దీ, పాత సాంకేతిక వ్యవస్థలు పోయి వాటి స్థానంలో కొత్త సాంకేతిక వ్యవస్థలు ఏర్పడుతూ వచ్చాయో లోతుగా చర్చించాలి. అంటే రాయడం ఉన్న వ్యవస్థలో గ్రాఫిక్‌ ఆర్ట్ వంటి కొత్త కళలు ఏర్పడడం, ఎలక్ట్రానిక్,కంప్యూటింగ్, డిజిటల్ టెక్నాజీలు ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులకి అవసరమైన వనరులు, పరికరాలు, అన్నిటికంటే ముఖ్యంగా ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించాయో కొంత లోతుగా పరిశీలించాలి.

భాషని అక్షరాలలో పెట్టడం వేర్వేరు రకాలుగా (Alphabetic, Syllabic, Ideographic, Logographic) పరిణమించింది. ఇందులో మొదటిభాగంగా, ప్రస్తుత వ్యాసం, అక్షరవ్యవస్థ (alphabetical systems) ఆవిర్భావంనుంచీ, గూటెన్‌బర్గ్ ప్రింటింగు యంత్రం కనిపెట్టడానికి పూర్వం వరకూ పాశ్చాత్య పుస్తక సంస్కృతిని చారిత్రకకోణంలో సమర్పించే ప్రయత్నం.

****

ఎన్నో పాత జానపద సినిమాల్లో చూసే ఉంటాం: రాజుగారు సింహాససం మీద ఠీవిగా అధిష్ఠీనులై ఉంటారు. పొరుగుదేశం నుంచీ వచ్చిన దూత అందంగా చుట్ట చుట్టిన పట్టువస్త్రం ఒకటి బొడ్డులోంచి తీసి, రెండుచేతులతోనూ ఎంతో వినయంగా దాన్ని రాజుగారికి సమర్పిస్తాడు. రాజుగారు, దాన్ని మంత్రికో, విదూషకుడికో ఇచ్చి చదవమని అనుజ్ఞ ఇస్తారు. సదరు వ్యక్తి వినయంగా రెండు చేతులతోను అందుకుని, ఎడంచేత్తో దాని దండెని పట్టుకుని, కుడిచేత్తో విప్పి, మొహానికి ఎదురుగా పెట్టుకుని, రాజసంగా చదువుతాడు.

Fig-1: Ancient Papyrus Scrolls

క్రీ.శ. రెండో శతాబ్దివరకూ, “పుస్తకాలు” అన్నీ ఇలానే ఉండేవి – వీటినే “Scroll” (Papyrus Scrolls) అనేవారు. ప్రాచీనకాలంలో, పాశ్చాత్య ప్రపంచంలో పుస్తకాలంటే పాపిరస్ పై రాసిన చుట్టలే. పాపిరస్‌ పుస్తకాల చుట్టలు ఇరవైఐదు అడుగులనుంచీ నూరు అడుగుల పొడుగువరకూ ఉండేవి. ఒక్క పాపిరస్‌ పైనే కాకుండా, రాయడంనేర్చిన దగ్గరనుంచీ మనిషి ఎన్నో ఉపరితలాలపై రాసాడు – మనదేశంలో ఉత్తరాదిన భూర్జపత్రాలమీద , దక్షిణాదిన తాళపత్రాలమీద రాసేవారు. ఇవికాకుండా, కర్రపలకలమీద, కుండలపైన, లోహాలమీద, రాతిపైన రాసిన శిలాక్షారాల మాట సరేసరి. ఆధునికయుగంలో రాళ్ళనుంచీ కంప్యూటర్లవరకూ ఎన్నో ఉపరితలాలపై రాస్తూ ఉన్నప్పటికీ, పుస్తకంలో రాసిన రాతే ఈనాటికీ శంఖంలో పోసిన తీర్థం. క్రీ.శ. రెండో శతాబ్దిలో రోమన్లు ప్రవేశపెట్టిన “కోడెక్”తో (ఎడంవైపు కుట్టి, బైండింగు చేసిన, పలుచని తోలుపత్రాల దొంతర) ఆధునిక పుస్తక ప్రస్థానం మొదలైందనుకోవచ్చు. పాశ్చాత్య పుస్తక సంప్రదాయం గ్రీకో-రోమన్‌ సంప్రదాయాలతో విడదీయరానంతగా ముడిపడి ఉన్నప్పటికీ, ప్రాచీన గ్రీకు రోమన్‌ నాగరికతలు రెండూకూడా మెసొపొటేమియా, ఈజిప్టులతో సంబంధ బాంధవ్యాలు నెరిపాయనీ, వాటి ప్రభావం గ్రీకో-రోమన్‌ లిపులపై, పుస్తక సంస్కృతిపై అమితంగా ఉందనికూడా పరిశోధకులందరూ ఏకగ్రీవంగా అంగీకరించే విషయమే [7]. అందుకని, పాశ్చాత్య పుస్తక సంస్కృతి గురించి విపులంగా చర్చించేముందు, ప్రాచీన పుస్తక చరిత్ర గురించీ తలాస్పర్శిగానైనా తలచుకోవడం అవసరం. తిరుమల రామచంద్రగారి లిపుల చరిత్ర అనే పుస్తకం తెలుగులో అందరికీ తెలిసిన పుస్తకమే, ఆ పుస్తకంలో రామచంద్రగారు ఆయన కాలంలో లభ్యమైన పరిశోధనలు, సమాచారము, చరిత్రని అందరికి అందుబాటులో ఉండే శైలిలో రాశారు. ఇంటర్నెట్టులో, లిపుల చరిత్రపై కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గారు పొద్దులో కొన్ని పరిచయ వ్యాసాలు రాసారు. ఆ వ్యాసాల్లో మరికొంత సమాచారం దొరుకుతుంది [8], [9].

మెసొపొటేమియా, ఈజిప్టు, ఇస్రాయెల్, గ్రీకు నాగరికతలలో లిపులు, లైబ్రరీలు

సుమారుగా రెండువేల పదచిత్రాలతో (Logograms), వందకిపైగా ధ్వనిచిత్రాలతో (Phonogram) కూడిన లిపి క్రీ.పూ. నాలుగో సహస్రాబ్దికే మెసొపొటేమియాలో ఉండేది. సుమేరియన్లు అభివృద్ధి చేసిన ఈలిపినే కాలక్రమంలో అక్కాడియన్లు (Akkadians) తమ సొంతం చేసుకున్నారు. అక్కడనుండీ అది ఆసియాలో మిగిలిన ప్రాంతాలకి వ్యాపించింది. కొన్ని వందల ఏళ్ళపాటు తప్పటడుగులు వేసినా క్రమేపీ బలపడి, లిఖిత సాహిత్యం ఏర్పడింది. కేవలం లిఖిత సాహిత్యం పుట్టడమొకటేకాకుండా, దాని ప్రాముఖ్యతని గుర్తించి, రాసినదానిని భద్రపరుకోవచ్చనే అతి ముఖ్యమైన సామాజిక మార్పు కూడా అస్సీరియాలో క్రీ.పూ. ఏడోశతాబ్దినాటికే వచ్చింది.

అస్సీరియాని పాలించిన అషుర్‌బనిపాల్(Ashurbanipal), తన రాజధాని నిన్వెలో (Nineveh) ఒక లైబ్రరీని స్థాపించాడు. అనాటికి, ప్రపంచంలో అదే అతి పెద్ద లైబ్రరీ. ఆయన తన ప్రతినిధులని ప్రపంచంలోని నలుమూలలకీ పంపి, అప్పటి అస్సీరియా, బాబిలోనియాలో దొరికిన సాహిత్యాన్నంతా తన గ్రంథాలయంలో చేర్చాడు. ఈనాడు, ప్రపంచ సాహిత్యంలో తొలి ఇతిహాసంగా ప్రసిద్ధిగడించిన The Epic of Gilgamesh –  అషుర్‌బనిపాల్ లైబ్రరీలోనిదే. ఈ లైబ్రరీ పతనావస్థకి చెందేనాటికి అందులో ఇరవైఐదువేలకిపైగా మట్టిపలకలు (Tablets) ఉండేవి. వాటిల్లో అతిముఖ్యమైనది గిల్గమేష్ ఇతిహాసం. కేవలం లైబ్రరీలని నెలకొల్పడమే కాకుండా, అక్కడి మట్టిపలకలని వర్గీకరించడం, ఒక పద్ధతిప్రకారం వాటికి పట్టికలు తయారుచెయ్యడం మొదలిన లైబ్రరీ సైన్సుకి కూడా ఇబ్లా, నిప్పూరు లైబ్రరీలలో అంకురార్పణ జరిగింది. అషుర్‌బనిపాల్‌ లైబ్రరీకిచెందిన కొన్ని మట్టిపలకలు ఈనాటికీ సురక్షితంగా ఉన్నాయి.

ఈనాడు మనకి బొమ్మకి, రాతకి మధ్య తేడా ఎవరూ చెప్పకుండానే తెలుసు. కాని, రాత ఆవిర్భావం, మాటని/వస్తువుని/శబ్దాన్ని  చిత్రించడంతో మొదలైంది కాబట్టి, బొమ్మనుంచీ, రాత వేరుపడటం, లిపుల ఎదుగుదలలో వచ్చిన అతి ముఖ్యమైన పరిణామం. అస్సీరియా లైబ్రరీలో దొరికిన పలకలలో బొమ్మలూ, చిత్రాలు ఎక్కువగా లేకపోయినప్పటికీ, జామెట్రీ సంబంధమైన రేఖా చిత్రాలు కొన్ని దొరికాయి. అవేకాక అప్పటి న్యాయవ్యవస్థని సూత్రీకరించిన హమ్మురాబి, న్యాయదేవత షమాస్ (Shamash) బొమ్మని, తన పుస్తకంలో చిత్రించాడు.

ఈజిప్టులో పుస్తకం

సుమేరియన్ల శరాకారలిపికి (Cuneiform), ఈజిప్టియన్ల హైరోగ్లిఫ్ లిపికి మౌలికమైన భేదాలున్నా, ఈజిప్టియన్ల లిపి సుమేరియన్ల ప్రభావంతో అభివృద్ధి చెందిందా, లేదా అదొక స్వతంత్ర లిపి వ్యవస్థా అనే విషయం పరిశోధకుల మధ్య ఈనాటికీ వివాదాస్పదమైన అంశమే. అలాగే, సింధునాగరికతలో బయటపడిన “రాతలు” ఒక లిపి వ్యవస్థా, కాదా అనేది ఇప్పటికీ ఖచ్చితంగా తేలలేదు. సింధునాగరికతనాటి సమాజం పూర్తిగా మౌఖికనాగరికతే అనే వాదం ఇప్పుడు పరిశోధకుల మధ్య బలంగా వినిపిస్తున్న వాదం, అత్యంత వివాదస్పదమైన వాదం కూడా [10].

ఏమయినప్పటికీ, క్రీ.పూ. రెండో సహస్రాబ్దినాటికే ఈజిప్టులో ఆరువందల పదచిత్రాలు, వంద ధ్వనిచిత్రాలు, ఇరవైనాలుగు అక్షర సంకేతాలతో కూడిన లిపి ఉండేది. కర్రపలకలమీదా, మమ్మీలకి చుట్టిన గుడ్డలపైనా, దేవాలయాల గోడలమీద ఎన్నో రాతలు రాసినప్పటికీ ఈజిప్టియన్ల రాతంటే ముందుగుర్తుకు వచ్చేది పాపిరస్‌ పత్రాలే. హాలీవుడ్‌ సినిమాల పుణ్యమా అని Book of The Dead  కూడా ఎంతో ప్రఖ్యాతిని గడించింది. వీటిసంగతి ఎలా ఉన్నా, జగద్విఖ్యాతి గడించిన అలగ్జాండ్రియా లైబ్రరీ ఈనాటికీ ప్రపంచ పుస్తక సంస్కృతిలో మరువలేని మైలురాయి.

అలగ్జాండ్రియా లైబ్రరీ నిజానికి పురాతన ఈజిప్టు నాగరికతకి సంబంధించినది కాదు. అలగ్జాండర్‌ చక్రవర్తి దండయాత్రలో ఈజిప్టు గ్రీకుల ఏలుబడిలోకి వచ్చింది. అలగ్జాండర్‌కి ప్రపంచ సాహిత్యాన్నంతా ఒకచోట చేర్చాలనే బృహత్ప్రణాళిక ఉండేది. ఆ సంకల్పం ఆయన జీవితకాలంలో అడియాసే అయినా, అటుపిమ్మట ఈజిప్టుని పాలించిన మొదటి టాలమీ (క్రీ.పూ. 367-282) అలగ్జాండ్రియాలో లైబ్రరీని స్థాపించాడు. అరిస్టాటిల్ శిష్యుడు తియోఫ్రాస్ట్రస్ ని లైబ్రరీని నిర్వహించమని ఆహ్వానించాడు. అయితే తియోప్రాస్ట్రస్‌ వెళ్ళకపోయినా, అరిస్టాటిల్ శిష్యవర్గానికి చెందిన డిమిట్రియస్ అలగ్జాండ్రియాలైబ్రరీని అరిస్టాటిల్ నెలకొల్పిన వర్గీకరణ ప్రాతిపదికగా నిర్వహించాడట. అలగ్జాండ్రియా లైబ్రరీ ఒక్క లైబ్రరీకాదు – అది రాజప్రాసాదంలో ఉన్న భవంతిలో కొంత భాగం, సముద్రం ఒడ్డున ఉన్న భవంతిలో కొంతభాగం, ఊరిలో మరికొన్న చోట్ల ఉండేది. డిమిట్రియస్ లెక్క ప్రకారం సముద్రం ఒడ్డున ఉన్న లైబ్రరీలో 42,800 పుస్తకాలు, రాజప్రాసాదంలో ఉన్న పెద్ద లైబ్రరీలో నాలుగులక్షల వరకూ అవిభక్తంగా ఉన్న మిశ్రమమైన పుస్తకాల చుట్టలూ, మరో తొంభైవేల ప్రత్యేకమైన పుస్తకాలు ఉండేవి. జూలియస్‌ సీజర్‌ అలగ్జాండ్రియాని ముట్టడించినపుడు ప్రమాదవశాత్తూ సముద్రపు ఒడ్డున ఉన్న లైబ్రరీ భవంతి అగ్నిప్రమాదానికి గురైందని ఒక కథనం. అయితే, ఈ ప్రమాదంలో ఎన్ని పుస్తకాలు బూడిదైపోయాయో ఖచ్చితంగా తెలీదు – ఒక లెక్క ప్రకారం, సుమారుగా నలభైవేల పుస్తకాలు నాశనం అయిపోయాయని అంటారు. ఈ లైబ్రరీ పతనం గురించిన మరొక కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. క్రీ.శకం 647 లో అలగ్జాండ్రియాని ఆక్రమించుకున్న కాలిఫ్ ఒమార్‌ని ఆయన సైన్యాధ్యక్షుడు “ఈ లైబ్రరీని ఏం చెయ్యమంటా”వని అడిగాడట. కాలిఫ్ “అందులో పుస్తకాలు కొరానుతో సమ్మతిస్తే వాటి అవసరం మనకిలేదు, విభేదిస్తే అవి మనకి అక్కరలేదు” అన్నాడట. ఆ విధంగా, ఆయన అలగ్జాండ్రియా లైబ్రరీని తగలబెట్టించాడంటారు [11].

మెసొపొటేమియాలోనూ ఈజిప్టులోనూ అనాదిగా సెక్యులర్ లిఖిత సంస్కృతే అభివృద్ధి చెందింది. అస్సిరియా, బాబిలోనియా, అలగ్జాండ్రియాలోని లైబ్రరీలు, వాటిని నెలకొలిపి వాటిని ఎంతో వ్యయప్రయాసలకోర్చి అభివృద్ధి చేసిన తీరు పరిశీలిస్తే, జ్ఞానం పుస్తకరూపంలో పదిలపరుచుకోవచ్చుననే ఆలోచనకి వారు ఎంతో ప్రాధాన్యాన్ని ఇచ్చారని ఒప్పుకోక తప్పదు. పుస్తకంద్వారా, కేవలం తమ స్థానిక తెగలయొక్క సమాచారాన్ని మాత్రమే కాకుండా, ప్రపంచం నలుమూలలనుండీ సమాచారాన్ని సేకరించి, భద్రపరచుకోవచ్చని, ఆ సమాచారాన్ని అధ్యయనం చెయ్యడం ద్వారా తమ పరిధిని పెంచుకోవచ్చని వారు భావించారు. మూడువేల ఏళ్ళ కిందట వచ్చిన ఈ మార్పు మానవ ఇతిహాసాన్ని సమూలంగా మార్చేసింది. “గ్లోబల్ విలేజి” అని ఈనాడు మనం అలవాటుపడిపోయిన ఈ చిన్ని ప్రపంచానికి పునాదులు మూడువేళ్ళనాటివి. అయితే, పాశ్చాత్య లిఖిత సంస్కృతి ముందుగా మతం పునాదిగానే ఆరంభమైంది. బైజాంటైన్ సామ్రాజ్యం కాలంనాటికి గాని పాశ్చాత్య లిఖిత సంస్కృతికి, ఈజిప్టు, గ్రీసు, మెసొపొటేమియా సంస్కృతుల హ్యూమనిస్టు ధోరణి వంటబట్టలేదు.

ఇజ్రాయెల్‌లో పుస్తకం

క్రీ.పూ. పదహారో శతాబ్దినాటికే ఇజ్రాయెల్‌లో రాయడం ఉన్నప్పటికీ, క్రీ.పూ ఎనిమిదో శతాబ్దినాటికి రాజ్యవ్యవహారాలన్నీ రాతకోతల రూపంలోకి వచ్చాయి. అతిపురాతనమైన బైబిలు భాగాలుకూడా సుమారుగా ఇదేకాలానికి చెందినవని పరిశోధకుల అభిప్రాయం[12]. ప్రాచీన యూదుల సాహిత్యంగురించీ ప్రముఖంగా ప్రస్తావించవలసినవి Dead Sea Scrolls. ఖిర్బెత్ ఖుమ్రాన్ దగ్గరున్న పదకొండుగుహల్లో బయటపడిన రమారమి ఎనిమిదివందల డాక్యుమెంట్లని ఇప్పుడు dead sea scrolls అని వ్యవహరిస్తున్నారు. క్రైస్తవానికి పూర్వం యూదుల బైబిల్లో (Old Testament) కొన్ని భాగాలు ఇందులో ఉన్నాయి. వాటితోపాటు మరికొన్ని ప్రార్థనాగీతాలు, సామాజిక ధర్మసూత్రాలు కూడా దొరికాయి. Dead Sea Scrolls సంగతి ఎలా ఉన్నా, యూదులకి అతిముఖ్యమైన మత గ్రంథం తోరా. కాలగతిలో వారు అణగద్రొక్కబడ్డా, ప్రపంచం నలుమూలలకి విసిరివేయబడ్డా, అనాదిగా యూదులని ఒక సంఘటిత శక్తిగా కలిపిఉంచింది వారి పవిత్ర గ్రంథం తోరానే. తోరాని రాయడంలో యూదులకి ఎన్నో నియమాలు ఉన్నాయి. తోరాని జంతు చర్మంతో చేసిన పలుచని తోలుపత్రాలపైన మాత్రమే (Parchment) రాసేవారు. ఒక్కో పేజీపై రెండు, లేదా మూడు నిలువ వరుసలకి మించకుండా రాయాలి. పేజీలో అచ్చుతప్పులు తక్కువగా ఉంటే, వాటిని ఆ పేజీలోనే సరిదిద్దేవారు, ఒకవేళ అచ్చుతప్పులు ఎక్కువగా ఉండి, కొత్తగా రాయవలసి వస్తే, తప్పులున్న పేజీలన్నీ ఒకచోట “తోరాసమాధిస్థలం”లో సమాధిచేసేవారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడంవల్ల, ఎన్ని శతాబ్దాలు గడిచినా, ఎంత మంది, ఎన్ని సార్లు తోరాకి నకళ్ళు రాసినా, అందులో అక్షరం కూడా చెక్కుచెదరకుండా యూదులు కాపాడుకోగలిగారు. మౌఖిక సంప్రదాయమైన వైదికమతంలో వేదాన్ని ఎన్నోవేలఏళ్ళపాటు ఏ మార్పులు లేకుండా పరిరక్షించుకోవడానికి వేదపాఠం నియమాలు, వేదం చదివే పద్ధతుల్లో చాలా నిర్దుష్టమైన నియమాలు ఇలాగే ఉంటాయి. క్రీ.పూర్వం 1800 నాటికే  మెసొపొటేమియా, ఈజిప్టు, ఇస్రాయెల్ ప్రాంతాలలో మాటకి – అది పలికినా, రాసినా – ఒక బలీయమైన శక్తి ఉంటుందనే నమ్మకం దృఢమైన నమ్మకం ఉండేది – వాటిని బీజాక్షరాలుగా, మహిమాన్వితమైన మంత్రాలుగా భావించేవారు. పవిత్రమైన మతపరమైన సిద్ధాంతాలను రాసినప్పుడుగానీ, పలికినప్పుడుగానీ పొరపాట్లు జరిగితే ఊహించని ఉపద్రవాలు ఎదుర్కొనవలసి వస్తుందని అనుకునేవారు. అందుకే, “ధారణ” అతి ముఖ్యమైన సామర్థ్యంగా భావించేవారు. మొదట్లో శబ్దానికున్న సమ్మోహన శక్తి, క్రమంగా రాయబడిన మాటకి కూడా ఆపాదించబడింది ఇస్రాయెల్ ప్రాంతంలోనో మొదట్లో పుట్టి, అటుపైన అన్ని మతోద్యామాలకి ప్రాకిందని చరిత్రకారులు భావిస్తారు [13]. మతపరమైన ప్రవచనాలు, గాథలు ముందు మౌఖికంగాను, అటుపైన లిఖితరూపంలోనూ ఎలా వ్యాపించాయి, మతపరమైన ధార్మిక చింతనలు మౌఖికరూపంలోంచి లిఖితరూపంలోకి రావడంలో మతాధిపతుల/మతశక్తుల ప్రబలమైన కారణాలు మొదలైన విషయాలు రాబోయే వ్యాసాలలో విపులంగా చర్చిద్దాం.

రాయడంద్వారా సమాచారాన్ని, సంస్కృతిని భద్రపరుచుకోవడం, మతపరమైన సాహిత్యాన్ని ఎనలేని శ్రద్ధతో లిఖిత రూపంలో కాపాడుకోవడం, లైబ్రరీలు నెలకొల్పి  పుస్తకాలని సేకరించి, వర్గీకరించడం, పుస్తకచరిత్రని (Bibliographic History) చరిత్రలో ముఖ్యమైన అంగంగా పరిగణించడం లిఖిత సంప్రదాయంలో అతిముఖ్యమైన అంశాలు. లిఖిత సంస్కృతికి అంకురం  మెసొపొటేమియా, ఈజిప్టు, ఇజ్రాయిల్‌ పుస్తక సంస్కృతులులో పుట్టి, అది  గ్రీకో-రోమన్ లిఖిత సంప్రదాయాలని ప్రభావితం చేసింది. క్రీ.పూ.  పదిహేడో శతాబ్దంనాటికే గ్రీకులకి రాయడం తెలిసినా, క్రీ.పూ. 1200 లో మైసీనియన్ సామ్రాజ్యం పతనమవ్వడంతో అతిప్రాచీనమైన గ్రీకులిపి కూడా కాలగర్భంలో కలిసింది. అటుపిమ్మట, క్రీ.పూ. ఎనిమిదో శతాబ్దినాటికి, ఫెనీషన్ (Phonecian)  లిపినుంచీ ఆధునిక గ్రీకు “అక్షరలిపి” (Alphabetic Script) ఆవిర్భవించిందని పరిశోధకుల అభిప్రాయం.  గ్రీకుల అక్షరలిపే సుమారుగా ఆధునిక అక్షరలిపులన్నిటికీ మాతృకగాకూడా పరిశోధకులు భావిస్తారు [14].   ఫెనీషాకి (Phonecia)  చెందిన వ్యాపారస్తులు ఈజిప్టునుంచీ పాపిరస్‌ని గ్రీసుకి ఎగుమతి చేస్తుండేవారు.  వారి బైబ్లో రేవుపట్టణమే గ్రీకుల బిబ్లోస్ అనే పదానికి మూలం.

గ్రీకునాగరికతలో పుస్తకం

సోక్రటీసు కాలంనాటికే గ్రీకు సాహిత్యం పాపిరస్ చుట్టలపై రాసేవారు. ఏథెన్సులో ఆనాటికే పుస్తక విక్రయం కూడా ఉండేది. ఏథెన్సు బజారులో ఒక మూల అర్ధచంద్రాకారంగాఉన్న స్థలంలో (ఆర్కెస్ట్రా) పుస్తకాల దుకాణాలు ఉండేవి. ప్లేటో కథనం ప్రకారం, అక్కడ అనక్సాగోరస్ రచనలు సెకెండు-హాండు కాపీలైతే ఒక డ్రాకమ్ కి దొరికేవట [15] (ఆ రోజుల్లో చవకే – ఈ సొమ్ము ఒకరోజు కూలి వేతనం కంటే తక్కువే మరి). కానీ, సోక్రటీసు కాలంనాటికి రాసినది చదవడంపై అంతగా గౌరవం ఉండేది కాదు – ముఖ్యంగా సోక్రటీసుకి పుస్తకాలనుంచీ చదవడం అంటే గిట్టేది కాదు. ప్లేటో డైలాగుల్లో, ఎడో డైలాగులో ఫీడ్రస్‌కి సోక్రటీసుకి మధ్య రాసినదానిని చదవడంపై ఒక సంవాదం ఉంది. అందులో, రాతకి, జామెట్రీ, అస్ట్రానమీలకి దేవత అయిన Thoth ఈజిప్టు రాజుని సందర్శించి తను కనిపెట్టిన శాస్త్రాల  ఉపయోగాలు వివరిస్తాడు. రాత విశిష్టతని చెప్తూ, టాత్ “ఈ విద్య మనుష్యుల జ్ఞాపకశక్తిని, మేధని అభివృద్ధి చేస్తుంది” అంటాడు. కాని, ఈజిప్టు రాజు దాంతో సమ్మతించడు. మనుషులు రాయడం నేర్చుకోవడంవల్ల జ్ఞాపకశక్తిని కోల్పోతారు, ఎందుకంటే ప్రతీది కాగితంమీద రాసుకోవడంవల్ల, ప్రయత్నించి ఏ విషయాన్ని తమంతతాముగా, తమ జ్ఞాపకాలలో భద్రపరచుకోవడం అవసరం ఉండదు. అప్పుడింక మనుషుల బుర్రలలో ఏమీ ఉండదు. “And, it is not true wisdom that you offer your disciples, but only its semblance, for by telling them of many things without teaching anything, you will make them seem to know much, while for most part they will know nothing. And, as men filled not with wisdom but with the conceit of wisdom, they will be a burden to their fellow men” అంటాడు. ఒకరకంగా సోక్రటీసు మాటల్లోని నిజాన్ని ఒప్పుకోకతప్పదు – ఈ రోజుల్లో మనకి, అమ్మ, నాన్నల ఫోను నంబర్లే గుర్తుండవు – అవి ఫోను “మెమొరి”లో భద్రంగా ఉన్నాయి కాబట్టి!. ఈ కథ ఫీడ్రస్‌కి చెప్పి, సోక్రటీస్‌ ఇంకా – రాయడం పెయింటింగుని పోలినదే. ఒక చిత్రకారుడు ఎంతో సొగసుగా దివ్యసౌందర్యంతో అలరారే ఒక గొప్ప బొమ్మ గీయవచ్చుగాక, ఆ బొమ్మ జీవంతో ఉట్టిపడుతుండవచ్చుగాక, కాని ఆ బొమ్మని నీవు ప్రశ్నిస్తే, దాని సమాధానం మాత్రం ఉత్త ఉత్కృష్టమైన నిశ్శబ్దమే! అదే విధంగా, రాసిన పదాలు మనతో సంభాషిస్తున్నట్టుగా ఉంటాయి, కాని వాటిని నువ్వు ప్రశ్నించలేవు, అవి నీకేవిధమైన సమాధానాలని ఇవ్వలేవు, ఏ రకంగానూ నీ సందేహాలని నివృత్తి చెయ్యలేవు. పదే, పదే చెప్పినదానిని మాత్రమే అవి చెప్పగలవు” అంటాడు [16].

సోక్రటీసు మాటల్లో అప్పటికింకా ప్రబలంగా ఉన్న మౌఖిక సంస్కృతియొక్క మౌలిక స్వభావం గోచరిస్తుంది. మౌఖికత్వంలో ఉండే “డైనమిజం” సోక్రటీసుకి లిఖిత వ్యవస్థలో కనిపించలేదు, అందుకే దానిని ఆయన స్వాగతించలేకపోయాడు. కాని, ఆశ్చర్యంగా ఆయనే ఈనాటికీ ప్రపంచంలో మేటి రచయితల్లో ఒకడిగా పరిగణించబడే ప్లాటోని తయారుచేసాడు. ప్లాటో తన గురువు మౌఖికంగా చేసిన వాదనంతా, అద్భుతమైన లిఖిత సాహిత్యంగా మలచి, ప్రపంచానికి ఎనలేని కానుకగా ఇచ్చాడు. సోక్రటీసు, ప్లాటోకాలంనాటికి అక్షరవ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినట్టుగా ఈ కథలవల్ల తెలుస్తుంది. అతి కొద్ది కాలంలోనే – ఒక్క తరంలోనే, గురువునుంచీ శిష్యుడి హయాం వచ్చేసరికి వచ్చిన పెనుమార్పులు పరిశీలిస్తే, అతికొద్ది కాలంలోనే రాత, చాపకింద నీరులా గ్రీకుల తాత్వికచింతనని ఆక్రమించిందని అనిపించకపోదు. ప్లాటో శిష్యుడు అరిస్టాటిల్ కాలానికి, అది ఉప్పెనగా మారింది. ఆయన చేతిలో గ్రీకు సంస్కృతి పూర్తిగా లిఖిత సంస్కృతిగా పరిణామం చెందింది.

అరిస్టాటిల్‌ పుస్తకాల పురుగు – ఆయన్ని నడిచే విజ్ఞాన సర్వస్వంగా భావించేవారు. ఆయన నడుస్తూ శిష్యులకి పాఠాలు చెప్పేవాడట, అందుకే అరిస్టాటిల్ అకాడమీకి పెరిపిటాటిక్ అకాడమి (నడిచే విద్యాలయం) అని పేరొచ్చింది. అరిస్టాటిల్ ప్రపంచంలో నలుమూలలనుంచీ పుస్తకాలు తెప్పించేవాడు. ఆయన దగ్గరున్న పుస్తకాలు గుట్టలు గుట్టలుగా పోగవడంతో వాటిని వర్గీకరించుకోవలసి వచ్చింది. ఈవిధంగా లైబ్రరీ సైన్సుకి కూడా అరిస్టాటిలే పితామహుడు. అవసానకాలంలో, అరిస్టాటిల్ తనప్రియ శిష్యుడు తియోఫ్రాస్ట్రస్‌కి లైబ్రరీని వారసత్వంగా ఇచ్చాడు. అలా అరిస్టాటిల్‌ నుంచీ తనకి సంక్రమించిన పుస్తకాలకి, తన సొంతపుస్తకాలుకూడా కలిపి తన శిష్యుడు నెలియస్‌కి ధారాదత్తం చేసాడు తియోఫ్రాస్ట్రస్‌. అయితే, ఏథెన్సులో మారిన రాజకీయ పరిస్థితులమూలంగా నెలియస్ ఏథెన్సుని వదిలి స్కెప్సిస్‌కి తన మకాం మార్చుకున్నాడు. ఆయనతోపాటే అరిస్టాటిల్‌ లైబ్రరీకూడా స్కెప్సిస్‌కి చేరింది. దురదృష్టవశాత్తూ నెలియస్‌ వారసులంతా నిరక్షరకుక్షులు. వారి హయాంలో లైబ్రరీ నిర్లక్ష్యానికి గురైంది. అట్టాలిడ్‌ రాజులు అలగ్జాండ్రియా లైబ్రరీకి పోటీగా పెరగామమ్‌లో నెలకొల్పిన లైబ్రరీకోసం రాజ్యంలో పుస్తకాలన్నీ కొనడమో లేదా బలవంతంగానో సొంతం చేసుకుంటున్నారని విని భయపడి నెలియస్ వారసులు అరిస్టాటిల్ పుస్తకాలన్నిటినీ ఒక నేలమాళిగలో దాచిపెట్టేసారు. ఆ తర్వాత చాలాకాలానికి అపెల్లికాన్ అనే లైబ్రరియన్ ఎంతో డబ్బుపెట్టి నెలియస్ వారసుల దగ్గరనుంచీ అరిస్టాటిల్ పుస్తకాలన్నిటినీ కొన్నాడు. కాని అప్పటికే చాలా పుస్తకాలు జీర్ణావస్థలో ఉండటంవల్ల ఆయన వాటిల్లో కొన్నిటికి నకళ్ళు రాయించాడు. అటుపిమ్మట, అవి కాలక్రమంలో కాళ్ళీడ్చుకొంటూ రోముచేరాయట [17].

పాశ్చాత్య లిఖిత సంస్కృతిపై గ్రీకుల ప్రభావం ఎంతలోతైనదో చెప్పనవసరంలేదు. ఈజిప్టు, మొసపటోమియా, ఇజ్రాయిల్ లలో రాయడం, లైబ్రరీలు నెలకొల్పడం, పుస్తకాలు సేకరించడం మొదలైనవి అభివృద్ధి చెందినా, పాశ్చాత్య సంస్కృతిలో తాత్వికచింతనకి, శాస్త్రీయమైన, తార్కికమైన ఆలోచనాపద్ధతులకి గ్రీసుదే పుట్టినిల్లు.

రోమన్ సామ్రాజ్యం, క్రిస్టియన్-లాటిన్ లిఖిత సంస్కృతి

గ్రీసుదేశానికి, ఇటలీలోని ఇట్రాస్కన్ (Etruscan) తెగలకి వాణిజ్య సంబంధాలు అనాదిగా ఉండేవి. ఇట్రాస్కన్ ప్రజలు క్రీ.పూ ఏడో శతాబ్దిలోనే గ్రీకుల  సంపర్కం ద్వారా రాయడం నేర్చుకున్నారు. ఈవిధంగా ఇటలీలో ప్రవేశించిన లిపి క్రీ.పూ .నాలుగో శతాబ్దినాటికి తనకంటూ ఒక నిర్దుష్టమైన రూపాన్ని ఏర్పరచుకుంది. మూడు శతాబ్దాలపాటు బలీయమైన శక్తిగా ఉండిన ఇట్రాస్కన్ తెగలు క్రీ.పూ 509 లో లాటిన్ భాష మాట్లాడే రోమన్లచేతిలో పరాజితమయాయి. ఈవిధంగా గ్రీకులనుంచీ ఇట్రాస్కన్లకి, వారినుండీ రోమన్లకి లిపి సంక్రమించింది. అటుపిమ్మట, రాజకీయ అధికారం ఎవరిదైతే, ఆ లిపే పెత్తనం చెలాయించసాగింది. స్పెయిను, ఫ్రాన్సు, పోర్చుగల్‌, రుమేనియా దేశాల ప్రాచీన భాషని లాటిన్ భాష రూపుమాపింది. ఈనాటి ఆ దేశాల భాషలకి లాటిన్‌ భాషే మాతృక అని మనకి తెలుసు. జర్మనీ, డెన్మార్కు, ఇంగ్లాండు, స్కాట్లండు, ఐర్లాండు, స్వీడను, నార్వే, ఫిన్లాండు, బెల్జియమ్, హాలండ్‌, స్విట్జర్లాండు దేశాల భాష లాటిన్ కాకపోయినా, వారి లిపి మాత్రం లాటిన్ అక్షరలిపి [18]. Fig-2లో సెమిటిక్, గ్రీకు, లాటిన్ భాషల అక్షరాలు ఒకదానినుంచి మరొకటి ఎలా రూపాంతరం చెందాయో చూడవచ్చు.

Fig 2: The transformation of Alphabet in Semitic, Greek and Latin
Fig 3: Inscription Letters with Serif Decoration

దాదాపుగా ప్రతి భాషలోనూ ప్రాచీనమైన అక్షరాలు రాతిపైన చెక్కడానికి అనువుగా ఉంటాయి – అందుకే, పురాతనలిపులు చాలావరకూ సరళమైన రేఖల ఆధారిత స్వరూపాలేగానీ, గొలుసుకట్టు రాతల్లో ఉపయోగించే వంకర్లు, గుండ్రటి ఆకారాలు వాటిల్లో కనిపించవు. రాతిమీద రాతలకి కూడా అలంకరణలు చెక్కడం క్రీ.పూ రెండో శతాబ్దినాటికే ఉండేది. Fig-3లో అక్షరాల తలకట్టుమీదా, కొన్ని చోట్ల అక్షరాల అడుగునా ఉన్న సెరిఫ్ (Serif) అలంకరణలు గమనించవచ్చు.   మనదేశంలో, రాతిపైచెక్కిన శాసనాలలో, శాసనం కిందఉండే సంతకంమాత్రం అలంకరణలతో చెక్కే సంప్రదాయం హర్షవర్ధనుడి కాలంనుండి ఉండేది. ఈ అలంకరణలని పుష్పలిపి అనేవారు [19]. ఈ వ్యాసం తరువాతి భాగాలలో, మన దేశంలో లిపుల ఆవిర్భావం, రాత వ్యవస్థలు, కాలిగ్రఫీ, మొదలైన అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించబడతాయి.

Fig 3a: A calligraphic Inscription from India

ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తున్న లాటిన్‌లిపి; విడివిడి పేజీలని ఎడంవైపు కుట్టి, దళసరి అట్టలమధ్య బైండింగు చేసే ఆధునిక పుస్తకానికి మాతృక అయిన కోడెక్ (Codec); రచయితల రచనలని సేకరించి, ప్రచురించి వాటిని పంపిణీ చేసే ప్రచురణకర్తలు; పుస్తకాలలో పేజీలపై అందమైన బోర్డరులు, పెయింటింగులు, పుస్తకంలోని విషయాన్ని ఉద్దీప్తం చేసే మినియేచరు బొమ్మలు – ఇవన్నీ రోమన్లు పాశ్చాత్య పుస్తక ప్రపంచానికిచ్చిన వెలకట్టలేని కానుక. చిచెరొ (Cicero) స్నేహితుడు అట్టికస్ (Atticus) ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి ప్రచురణకర్త అనుకోవచ్చు. అట్టికస్, ఆయనతోబాటు ఆయన స్నేహితులు మరికొందరు కలిపి ప్రముఖ రచయితల రచనలని సేకరించి, ఒకరు బయటకి చదువుతూ ఉండగా, అనేకమంది లేఖకులచేత నకళ్ళు రాయించి వాటిని అమ్ముతూ ఉండేవారు. అయితే, రచయితలకి “రాయల్టీలు” ఇచ్చిన దాఖలాలు మాత్రం లేవు.

పాపిరస్ చుట్టలు ఒకదానికొకటి అంటించి, వాటిని పొడుగ్గా తయారుచేసే పద్ధతి రోమన్లు కనిపెట్టారు, ఒక్కో పాపిరస్ “పుస్తకం” ఆరు-ఏడు మీటర్ల పొడుగు కూడా ఉండేది. వాటిపై నిలువుగా పదిహేనునుంచీ ముప్పై అక్షరాలు నిడివిఉండేటట్టు, పొడుగ్గా రాసుకుంటూ పోయేవారు. ప్రతి కాలమ్‌లోనూ 25 నుంచీ 45 లైన్ల దాకా ఉండేవి. పాపిరస్‌ నుంచీ పార్చమెంటుకి మారడంలో కేవలం సౌలభ్యం ఒక్కటే కాకుండా, కొన్ని రాజకీయ కారణాలు కూడా పార్చమెంటు అభివృద్ధి కావడానికి తోడ్పడ్డాయి. పాపిరస్‌ ఎక్కువగా ఈజిప్టునుంచి దిగుమతి చేసుకునేవారు. ఈజిప్టు రాజు టాలమీ, పెర్గామమ్ లో అలగ్జాండ్రియా లైబ్రరీకంటే పెద్దలైబ్రరీ స్థాపించేప్రయత్నాలు జరుగుతుండండంతో, పాపిరస్ ఎగుమతులన్నీ నిలిపించేసాడు. దాంతో, మిగిలిన దేశాలవారికి పాపిరస్ కి ప్రత్యామ్నాయమార్గాలు వెతుక్కోవలసివచ్చింది. ఈ ప్రయత్నాలలో పార్చమెంటుని (పలుచని తోలుపత్రాల దొంతర) అభివృద్ధి చేసారు. సుమారుగా క్రీ.పూ ఒకటో శతాబ్దినాటికే పార్చమెంటు పుస్తకాలు ఉండేవి. క్రీ.శకం నాలుగో శతాబ్దినాటికి, యూరోపంతా పార్చమెంటే వాడేవారు.

క్రీ.శ. 330 లో కాన్‌స్టాంటైన్ చక్రవర్తి ఇప్పటి టర్కీలోని ఇస్తాంబుల్ ని రోమన్ సామ్రాజ్యానికి రాజధానిగా చెయ్యటంతో, రోమన్ సామ్రాజ్యం రెండుగా చీలింది. తూర్పున, కాన్‌స్టాంటినోపుల్ రాజధానిగా బైజాంటైన్‌ సామ్రాజ్యం సుమారొక వెయ్యి సంవత్సరాలపాటు వెలసిల్లినా, పశ్చిమాన మట్టుకు రోముకా అదృష్టం దక్కలేదు. ప్రపంచాన్ని అంతకుముందెన్నడూ ఎరుగని రీతిలో ఒకతాటిపైకి తెచ్చిన రోమన్‌ సామ్రాజ్యం సుమారుగా క్రీ.పూ 476 నాటికి, అనేక కారణాలవల్ల అంతర్గతంగా క్షీణించి, అంతరించింది. బైజాంటైన్ సామ్రాజ్యం మాత్రం తొమ్మిదో శతాబ్దంవరకూ ఉచ్ఛదశలో ఉండి పిమ్మట క్రమక్రమంగా క్షీణిస్తూ, పదిహేనో శతాబ్ది పూర్వార్ధంవరకూ ఎలాగో నిలదొక్కుకుంది. రోమను సామ్రాజ్యం తూర్పు, పడమర రాజ్యాలుగా వేరుపడినప్పటినుండీ, యూరోపులో సాంస్కృతిక, చారిత్రక శక్తుల పరిణామంకూడా రెండు విభిన్నమార్గాల్లో జరిగింది.

ముందుగా, పశ్చిమ యూరోపులో వచ్చిన సాంస్కృతిక, చారిత్రక మార్పులు ప్రస్తావించి, అటుపైన బైజాంటైన్‌ సంస్కృతి ప్రభావం పరిశీలిద్దాం.

క్రీ.శ. ఐదోశతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం పతనమైనప్పటినుండీ పదిహేనో శతాబ్దంనాటి రినైసాన్స్ వరకూ ఉన్న కాలాన్ని చరిత్రకారులు “మధ్యయుగాలుగా”  వర్గీకరిస్తారు. ఈ సంధి సహస్రాబ్దిలో యూరపులో వచ్చిన మార్పులని స్థూలంగా మూడు ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక శక్తుల ప్రభావంగా చెప్పుకోవచ్చు:

అ. రోమన్ సామ్రాజ్యం అంతమొందాక, యూరోపులో నెలకొన్న రాజకీయ శూన్యతని భర్తీచేస్తూ, రోమన్‌ చర్చి అధికారాన్ని హస్తగతం చేసుకుని, “పవిత్ర రోమన్ సామ్రాజ్యం” రావడం మధ్యయుగాల యూరోపు చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టం. ఒకపక్క పాశ్చాత్య యూరపునంతా సాంస్కృతికంగా, మతపరంగా ఒకతాటిపైకి తెస్తూ, మరోపక్క ఆసియాలోని ముస్లిము మతంతో క్రైస్తవానికి జరిగిన ఘర్షణ ప్రపంచచరిత్రని ఎంతగానో ప్రభావితం చేసింది.

ఆ. ఇదేకాలంలో యూరోపులో వేరు వేరు జాతులు, తెగలు అన్నీ ఇష్టంగానో, బలవంతంగానో క్రైస్తవానికి తలవొగ్గడంతో, చర్చి అండదండలతో కరొలిఙ్గన్‌ సామ్రాజ్యం (Carolingian Empire) , షార్లమాన్‌ చక్రవర్తి (Emperor Charlemagne) సారధిగా ఏర్పడింది. ఆ రాజవంశాలే కాలక్రమంలో యూరోపియన్ దేశాలుగా ఏర్పడ్డాయి. సుమారుగా పదోశతాబ్దం వరకూ రాత పూర్తిగా మతసంబంధమైన వ్యవహారాల్లోనే ఉండేది, అదీకూడా ఎక్కువగా సన్యాసుల మఠాలకే పరిమితం అయిఉండేది. ఎనిమిది, తొమ్మిది శతాబ్దాలలో షార్లమాన్ చక్రవర్తి రాతని, లిఖిత వ్యవహారాలని సన్యాసుల ఆరామాలనుండీ బయట ప్రపంచానికి తీసుకువచ్చాడు. ఆయన, రాయడం తెలిసినవారిని ప్రత్యేకంగా తన కొలువులోకి ఆహ్వానించి, రాయడం, రాసినదానిని చదవడం సామాజిక వ్యవహారాలలోకి కూడా ప్రవేశపెట్టాడు. క్రీ.శ 787 లో, లిఖితరూపంలో ఉన్న చట్టాలనే, మౌఖికమైన ఆచారాలకన్నా ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాలని ఒక “ఫిర్మన్” జారీచేసాడు. ఈ కాలంలోనే, కరొలిఙ్గన్‌ దస్తూరిలో కొత్త విరామచిహ్నాలు ప్రవేశపెట్టబడ్డాయి.

ఇ. యూరోపు సాంస్కృతిక ప్రస్థానంలో, మధ్యయుగాల్లో క్రైస్తవానికి, లాటిన్ భాషకి అవినాభావమైన సంబంధం ఉంది. లాటిన్ భాష అధికార భాషగా, సాహిత్యభాషగా, మతభాషగా యూరోపంతా స్థిరపడింది. అందువల్ల, ముఖ్యంగా క్రైస్తవ సంఘారామాల్లో, ప్రత్యేకంగా లేఖనశాలలు నెలకొల్పి బైబిలు, ఇతర మతపరమైన గ్రంథాలన్నీ క్రైస్తవ సాధువులు అవిరామంగా నకళ్ళు రాసేవారు. క్రైస్తవాన్ని యూరోపునంతా విస్తరించడానికి, ప్రజలని క్రైస్తవమతానికి మార్చడానికి బైబిల్‌ని లిఖితరూపంలోకి తేవడం, దేశభాషల్లో మౌఖిక రూపంలో ఉన్న సాహిత్యంకంటే, పవిత్రమైన లాటిన్‌భాషలో లిఖించబడ్డ బైబిల్‌ గొప్పదనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడం, కొత్తమతాన్ని ప్రచారం చెయ్యడంకోసం యూరో్పులో పలుచోట్ల నెలకొల్పిన సంఘారామాలు – ఇవన్నీ మౌఖిక సంప్రదాయం లిఖిత సంప్రదాయంగా మారడంలో, బలమైన పుస్తక సంస్కృతి ఏర్పడడంలో ప్రముఖమైన పాత్రని పోషించాయి. క్రైస్తవ సంఘారామాలలోని లేఖనశాలలు యూరోపియన్ పుస్తక సంస్కృతిలో అతి ముఖ్యమైన పాత్రని పోషించాయి [20].

లిపులనుంచీ దస్తూరిల ఆవిర్భావం, రాయడం ఒక కళారూపంగా అవతరించడం

లాటిన్‌ లిపిలో కేపిటల్, మినిస్క్యూల్ (పెద్ద బడి, చిన్నబడి) శైలులు ఏర్పడటం ఆ కాలంలో రాత పరంగా వచ్చిన అతి పెద్ద మార్పు. ఇప్పుడు పిల్లల ప్రాథమిక పాఠశాలల్లో చెప్తున్నారో లేదో తెలియదుగానీ, మా చిన్నప్పుడు ఇంగ్లీషు అక్షరాలు నాలుగు ‘బడులు’ మా చేత దిద్దించేవారు. గొలుసుకట్టు లేదా కలిపిరాత కోసం ఒక పెద్దబడి, ఒక చిన్నబడి, విడి విడిగా రాయడంకోసం ఒక పెద్దబడి, ఒక చిన్నబడి ఇంగ్లీషు అక్షరాలకి ఉన్నాయి కదా?

Fig 5: The three writing styles

మొదట్లో, పెద్ద అక్షరాలు ముఖ్యంగా రాతిపై, భవంతులపై శాసనాలు, చట్టాలు, సూత్రాలు, ప్రకటనలు చెక్కడం కోసం వాడేవారు. అవి అందుకోసమే రూపొందించబడ్డాయి కూడా. రాతిపైన చెక్కడానికి సౌలభ్యంకోసం పెద్ద అక్షరాల సైజు సుమారుగా ఒక అంగుళంకి తక్కువకాకుండా ఉండేది. అంగుళం పరిమాణంలో ఉండేదికాబట్టే, దానికి అన్షల్ (Uncial) దస్తూరి అనే పేరు వచ్చింది. కాని, ఇదే అక్షరాలని పుస్తకాలలో రాసేటప్పుడు, వాటి సైజుని బాగా కుదించవలసి వస్తుంది. చాలాచిన్న పరిమాణంలో రాసినప్పుడు ఈ అక్షరాలు చదవడానికి వీలుగా ఉండవు. ఎందుకంటే ఉలితో రాయిమీద చెక్కడంలో సౌలభ్యంకోసం పెద్ద అక్షరాలన్నీ సుమారుగా సరళరేఖలు లేదా పెద్ద వంపులున్న ఆకారాల్లోనే ఉంటాయి. అంతేకాకుండా చాలా అక్షరాలకి ఒకటే నమూనా ఉంటుంది. ఉదాహరణకి B,P,R అక్షరాలు ఒక నమూనాలోనూ, C,Gలు మరొక నమూనాలోనూ E,F లు వేరొక నమూనాలోనూ ఉంటాయి. వీటిని చిన్నసైజులో రాసినప్పుడు ఒక నమూనాకి చెందిన అక్షరాలన్నీ ఒకేలా ఉండి చదవటం కష్టమయిపోతుంది. రాసేవారికి కూడా వేగంగా రాస్తూ స్పష్టతని సాధించడం కష్టతరం అవుతుంది. అందుకే, కాపిటల్ అక్షరాలతో వేగంగా చదవడానికి వీలుగా కుదురుగా పెద్ద పెద్ద వాక్యాలు రాయడం కష్టసాద్యమైన పని. ఈ సమస్యలని పరిష్కరించడం కోసం చిన్నబడి అక్షరాలు సృష్టించబడ్డాయి. చిన్న అక్షరాలలో సుమారుగా ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన రూపం ఉంటుంది. ఉదాహరణకి, b,p,r; c,g, e, f అక్షరాల స్వరూపాలు ఒకదానినుంచీ మరొకటి ఎంతో వేరుగా ఉండి, ఎంత చిన్న సైజులో రాసినా దేనికది సుళువుగా గుర్తుపట్టడానికి వీలుగా ఉంటాయి. చిన్నబడి అక్షరాలనే మినిస్క్యూల్ దస్తూరి అనేవారు.

నిజానికి, ఒక భాషని రాయడానికి ఇన్ని వైవిధ్యమైన అక్షర శైలుల అవసరంలేదు. విరామ చిహ్నాల సాయంతో వాక్యం యొక్క తుది, మొదలు తెలుస్తుంది కావునా పెద్దబడి అవసరం ఏమీ కనబడదు. కానీ, రినైసాన్సు కాలంలో, పుస్తకాలలో అందమైన మినియేచర్ పెయింటింగులు పేజీకి నేపథ్యంగా వేసేవారు. ఆ ప్రక్రియలో వాక్యంలోని మొదటి అక్షరాన్నికూడా వన్నె చిన్నెలతో రాయడం సంప్రదాయంగా మారింది. ఆ విధంగా పెద్ద అక్షరాలుకూడా ఈనాటికీ అస్తిత్వాన్ని నిలుపుకున్నాయి.

బ్లాక్ లెటర్‌ (Blackletter)

Fig 6: BlackLetter Style

పదకొండో శతాబ్దినాటికి, కరొలిఙ్గన్‌ మినిస్క్యూల్ వాడకం కాస్త వెనకబడి, తిరిగి అన్షల్ దస్తూరిలే ఊపందుకున్నాయి. కాలక్రమంలో అన్షల్ శైలిని పుస్తకాలలోరాయడం కోసం కుదించటంవల్ల అక్షరం మధ్యలో వెడల్పు తగ్గి, అవి పొడుగ్గా కురచగా అయిపోయాయి. వెడల్పు తక్కువుండి, పొడుగు ఎక్కువగా ఉండటం గోథిక్ కళలన్నిటిలో ముఖ్యమైన, మౌలికమైన నిర్మాణ వేదిక (Design Platform) కాబట్టి, ఈ దస్తూరి కూడా కాలక్రమంలో గోథిక్ బ్లాక్‌లెటర్ అయిపోయింది. ఈ దస్తూరిని  సెయింట్ గాల్ (St. Gall Monastery) సంఘారామంలోని లేఖనశాల ప్రాచుర్యంలోకి తెచ్చిందని ప్రఖ్యాత అమెరికన్ కాలిగ్రాఫరు జేమ్స్ హెయస్ నిర్ధారించాడు [21]. పరీక్షగా గమనిస్తే, ఈ శైలిలో అక్షరంలోని రేఖల మందం ఎంత ఉందో, అక్షరం మధ్యలోని వెడల్పు కూడా సుమారుగా అంతే ఉండటం గమనించవచ్చు. ఆ కారణం వల్ల, ఇవి రాతిపైన ఒకటో, రెండో వాక్యాలు చెక్కడానికైతే అందంగానే ఉంటాయిగానీ, పుస్తకంలో పేజీలకి పేజీలు రాసినప్పుడు అలుక్కుపోయి అన్ని అక్షరాలు ఒక్కలాగే ఉన్నట్టు కనిపిస్తాయి. అందుకే, రినైసాన్సు కళాకారులకి అన్షల్ దస్తూరిలు నచ్చలేదు. వీటి గోథిక్ లక్షణాలవలన సంప్రదాయాన్ని, ప్రాచీనతని, పరంపరాగత అధికారాన్ని సూచించటానికి ఇప్పటికీ బైబిలు వంటి మత గ్రంథాలలోనూ, న్యూస్‌ పేపరు మకుటాలలోనూ వాడుతున్నారు. బీరు, మందు సీసాల లేబిళ్ళపై వాటి జర్మన్ మూలాలని సూచించటానికి కూడా బ్లాక్ లెటర్ ని వాడుతూ ఉంటారు. ఒకనాటి బ్లాక్‌లెటర్ దస్తూరి ఆధారంగా ఫ్రెడరిక్‌ గౌడి రూపొందించిన బ్లాక్‌లెటర్‌ ఫాంటు  ఈనాడు చాలా ప్రాచుర్యాన్ని పొందింది.

Fig 7: Goudy’s Black Letter Font

బెనివెంటన్ శైలి (Beneventan Scripts)

Fig 8: Beneventan Style

ఇటలీలోని నేపుల్స్ వద్ద క్రీ.శ 520 లో సెయింట్ బెనెడిక్ట్ మాంటి కస్సినో (Monte Cassino) అనే సంఘారామాన్ని స్థాపించాడు. సుమారు రెండు వందల ఏళ్ళపాటు కస్సినోలోని లేఖనశాలలో రూపుదిద్దుకున్న దస్తూరి ఇటలీలోని పుస్తకాలపై, అటుపైన యూరోపులో మిగిలిన ప్రాంతాలలోనూ చాలా ప్రభావం చూపింది. కస్సినో దస్తూరినే ఈనాడు బెనివెంటన్ దస్తూరికి మాతృకగా పరిశోధకులు పరిగణిస్తున్నారు [22]. ఈ దస్తూరిలో రాస్తున్నప్పుడు కలం ఎడంవైపుకి తిప్పి పట్టుకుని రాసినట్టుగా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. మొత్తం దస్తూరంతా బరువుగా ఉండే మొదలు, తుది తట్టులపై (stroke) ఆధారపడ్డట్టుగా ఉంటుంది. స్థూలదృష్టికి చాలా అందంగా తోచినా, పరీక్షగా చూస్తే అంతా పైన పటారమే. ఎందుకంటే, ఇందులో పొడుగు, వెడల్పు రెండూ తక్కువైపోయి మొత్తం అక్షరాలన్ని అలికినట్టు ఉంటాయి.

రోటుండా శైలి (Rotunda)

Fig 9: Rotunda Letters

బ్లాక్‌లెటర్, బెనివెంటన్ దస్తూరిలలోని లోపాలని సవరించిన శైలిగా రోటుండాని అభివర్ణించవచ్చు. పదమూడు, పద్నాలుగు శతాబ్దాలలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చి, పదిహేనో శతాబ్దంలో ఇటాలియన్ రినైసాన్సు కళాకారుల సౌందర్యారాధనలో తడిసిన సిరిమల్లె మొగ్గల్లే ఉండే ఈ దస్తూరి ఎన్నో ఆధునిక ఫాంట్లకి మాతృక. ఈ దస్తూరే , ఇప్పటి లాటిన్‌/ఇంగ్లీషు అక్షరాలకి నమూనా. శ్రద్ధగా పరిశీలిస్తే, ఈ దస్తూరిలో అక్షరంలోపల ఖాళీ ఎక్కువగా ఉండటం మూలానా, అక్షరంలోపలి జాగాకి అక్షరం-అక్షరం మధ్యజాగాలకి ఉన్న నిష్పత్తి మూలానా, అక్షరాలలోని నిలువుగీతలకి అక్షరం మొత్తంగాఉండే గుండ్రటి ఆకారానికి మధ్య కుదిరిన చక్కటి సమతౌల్యంవల్ల ఇవి చూడటానికి చక్కగానూ, చదవటానికి సౌలభ్యంగానూ ఉంటాయి. ఇవేకాకుండా, అన్నిరకాల శైలులు కలగలసిన కక్కర-బిక్కర దస్తూరిలు (Bastarda Scripts), గొలుసుకట్టు రాతలు కూడా పన్నెండో శతాబ్దంనాటికి వాడుకలో ఉండేవి. అయితే, దేశభాషల్లో సాహిత్య సృష్టి లేకపోవడం, అధికార భాష, సాహిత్య భాషా కూడా లాటినే అవ్వడం, పుస్తకాలు రాయడం ఎక్కువగా క్రైస్తవ సంఘారామాల్లోని లేఖనశాలలలోనే ప్రధానంగా కేంద్రీకృతమవ్వడంవల్ల, ఈ కాలంలో వచ్చిన పుస్తకాలన్నీ ఎక్కువగా మతపరమైనవే. ఈ కారణాలవల్ల, పుస్తకాలు రాయడం అందుబాటులోకి వచ్చినప్పటికీ, వాటి ప్రాభవం అన్నిరంగాలకీ విస్తరించలేదు. ఈకాలంలో అభివృద్ధిలోకి వచ్చిన దస్తూరిలలో కూడా కొంత కాలిగ్రాఫిక్ ఛాయలు కనిపించినప్పటికీ, పూర్తి స్థాయిలో కాలిగ్రఫీ ఒక కళగా వెల్లివిరియడానికి పాశ్చాత్య ప్రపంచానికి, అదేకాలంలో బైజాంటైన్ ఆసియాలో పెల్లుబికిన సాంస్కృతిక విప్లవంతో సంపర్కం అవసరం అయింది. ఆనాటి బైజాంటైన్ సామ్రాజ్యంలో ప్రాచీన నాగరికతలన్నీ ఒకచోట కలిసాయి. అక్కడ విశ్వవిద్యాలయాలుండేవి, ఒక్క లాటినే కాకుండా గ్రీకు సాహిత్యం, ఇతర మతాలు, ఇస్లాంతో సంపర్కం మొదలైనవన్నీ కూడా రోమన్ పరిపాలనా వ్యవస్థకిందకి రావడంవల్ల, పశ్చిమ యూరపుకి భిన్నంగా అన్నిరంగాలలోనూ శాస్త్రీయ విజ్ఞానం, కళలు అభివృద్ధి చెందాయి.

బైజాంటైన్‌లో పుస్తకం

Fig 10: Byzantine Empire under Justinian

బైజాంటైన్‌ సామ్రాజ్యం జస్టినియన్ (Emperor Justinian) చక్రవర్తి కాలంనాటికి, గ్రీకు, ఈజిప్టు, అనటోలియా, బాల్కను ప్రదేశాలు కలుపుకొంటూ, ఆసియాలో పెర్షియావరకూ విస్తరించింది. ఇప్పటివరకూ ఈ వ్యాసంలో ప్రస్తావించిన ఈజిప్టు, గ్రీకు, ఇజ్రాయల్, రోమన్ సంస్కృతులన్నీ ఆసియా పందిరిలో, బైంజాటైన్‌ అధికార ఛత్రచ్ఛాయ కిందకి వచ్చాయి. గ్రీకుల ఏథెన్సు, ఈజిప్టియన్ల అలగ్జాండ్రియా, యూదుల జెరుసెలెమ్, ప్రాచీన మెసొపొటేమియాలో అప్పుడప్పుడే క్రైస్తవ కేంద్రంగా వెలసిన ఆంటియోక్ ఒకే రాజకీయ ఛత్రచ్ఛాయలో ఉండటం కంటే వైవిధ్యం, వైరుధ్యం ఏంకావాలి? దానికి తోడు ఆనాడు రాజకీయంగా ఆధిపత్యం క్రైస్తవానిది. కానీ, గ్రీసు, ఈజిప్టు మెసొపొటేమియాలు మూడూ ఎన్నో శతాబ్దాలపాటు మానవ ప్రస్థానాన్ని నిర్దేశించిన నాగరికతలు. కాలగతిలో రవ్వంత వెలిసిపోయినా, అవి కోల్పోయినది రాజకీయ, ఆర్థిక అధికారమే – వాటి తాత్విక, సాంస్కృతిక పునాదులు కాలప్రవాహం కూడా కూలగొట్టలేనంత పటిష్ఠమైనవి. క్రైస్తవం సామ్రాజ్యపు సింహాసనం నుంచీ పెత్తనం చెలాయించినా, గ్రీకుల, ఈజిప్టియన్ల, మెసపటోమియన్ల అనాది పాగన్ ఆరాధనల, ఆచారాల, సంప్రదాయాల గంగాజలంతో క్రైస్తవానికి జ్ఞానస్నానం (baptism) జరిగింది బైజాంటైన్‌ సామ్రాజ్యంలోనే. ఈనాటికీ గ్రీకు సాంప్రదాయ చర్చిమూలాల్లో బైంజాటైన్ పునాదుల చిహ్నాలు కనుమరుగవలేదు.

Fig 11: A Page from a Medical Encyclopedia

ధనికుల ఆడంబరం, కళాకారుల నైపుణ్యం, ప్రజల శ్రమ వల్ల తొమ్మిది పది శతాబ్దాలనాటికి విద్యలోనూ, కళలోనూ కొత్తహొయలు పొంగుకొచ్చాయి. చివరి రోజువరకూ బైజాంటైన్‌ సామ్రాజ్యం తనని తాను రోమన్ సామ్రాజ్యం అని చెప్పుకున్నా, తొమ్మిదో శతాబ్దం నాటికే , న్యాయశాస్త్రం తప్పించి మిగిలిన అన్ని రంగాలలోను లాటిన్ చిహ్నాలన్నీ మాయమయ్యాయి. హిరాక్లియస్ ఏలుబడినుండి గ్రీకే అధికార భాష, సాహిత్య భాష, వాడుక భాష. విద్యాబోధనంతా గ్రీకులోనే ఉండేది. సుమారుగా, పౌరులంతా – స్త్రీ,పురుష భేదంలేకుండా – అంతో, ఇంతో విద్యని అభ్యసించేవారు. అలగ్జాండ్రియా, ఏథెన్సు, కాన్‌స్టాంటినోపెల్, ఆంటియాక్‌లలో నాలుగు విశ్వవిద్యాలయాలు ఉండేవి. విద్యార్థులకి విద్య ఉచితంగానే బోధించేవారు. ఆచార్యుల వేతనాలు ప్రభుత్వమే భరించేది. అలెగ్జాండ్రియాలో వైద్య శాస్త్రం, ఏథెన్సులో తత్వశాస్త్రం, కానిస్టాంటినోపెల్లో సాహిత్యం, ఆంటియోక్‌లో సాహిత్యమీమాంస (Rhetoric) బోధించేవారు. ఇవేకాకుండా, ఫిలాలజీ, థియాలజీ, అస్ట్రానమీ, గణితశాస్త్రం, జీవశాస్త్రం, సంగీతం సాహిత్యం బోధించేవారు. నాస్తికుడైన లూసియన్, పాగన్ లిబనియుస్ రచనలు కూడా పాఠ్యపుస్తకాలలో ఉండేవి.

ఒరిబాసియస్, ఎటియస్సులిద్దరూ వేరువేరుగా ఆకాలంలోనే డెబ్భైవైద్యగ్రంథాల పట్టికతో ఒక విజ్ఞానసర్వస్వాన్ని తయారుచేసారట – వీటిల్లో టాన్సల్సు నుండీ హెమొరాయిడ్లవరకూ ఆపరేషన్లు చేసే ప్రక్రియలు, చెవి, కన్ను, ముక్కు, నోటి రోగాలకి మందులు, చికిత్సలు వగైరాలుండేవి. అనాటికవే వైద్యశాస్త్రంలో అవే గొప్ప విశ్లేషణాగ్రంథాలు. ట్రల్లెసుకి చెందిన అలగ్జాండర్‌ అనే వైద్య పరిశోధకుడు జీర్ణాశయ వ్యాధులని, ఊపిరితిత్తుల రోగాలని గుర్తించి నివారించడంపై పరిశోధనలు చేసి పాఠ్యపుస్తకాలు రాసాడు. ఆల్కెమీ, కెమిస్ట్రీ అలగ్జాండ్రియాలో చెట్టపట్టాలేసుకుని స్వైరవిహారం చేసాయి. ఇదే సమయంలో చరిత్ర రచనకి కూడా పునాదులు పడ్డాయి – ప్రపంచ చరిత్ర, చర్చి చరిత్ర, రోమన్‌ సామ్రాజ్యపు చరిత్ర, యుద్ధనీతులు – ఇట్లా రక రకాల చరిత్ర గ్రంథాలు వచ్చాయి [23].

విశ్వవిద్యాలయాలున్న నాలుగు నగరాల్లోనూ అకడమిక్‌ లైబ్రరీలు ఉండేవి. ఇవికాకుండా కాన్‌స్టాంటినోపుల్‌లో చాలా లైబ్రరీలు ఉండేవి. ఇవిగాక, క్రైస్తవ సంఘారామాల్లో (Monastery), సన్యాసులు ఎంతో ఒపికగా తయారుచేసుకొన్న లైబ్రరీలు ఉండేవి. అథోస్ (Monastic Library of Athos), స్టౌడియోస్ సంఘారామాల లైబ్రరీలు చెప్పుకోదగ్గవి. స్టౌడియోస్ సంఘారామంలో అప్పట్లో ప్రసిద్ధిచెందిన “లేఖనశాల” (Scriptorium) ఉండేది. అంటే, ఇప్పటి లైబ్రరీల్లో ఫొటోకాపీ సెంటరు వంటిదన్నమాట. అక్కడ సన్యాసులు ఓపిగ్గా ఎన్నో గ్రంథాలకి నకళ్ళు రాసేవారు. అక్కడి లేఖరులకి ప్రత్యేకంగా శిక్షణనిచ్చేవారు. అథోస్ సంఘారామంలో కూడా సుమారుగా పదహారువేల వ్రాతప్రతులుండేవని ఒక అంచనా [24].  ప్రజలలో చదువుకునేవారు ఎక్కువై, అక్షరాస్యత పెరగడంతో, పుస్తకాలకి, వాటి తయారీకి, వాటి అమ్మకాలకి గిరాకీ పెరిగింది. రాయడంలో కూడా కొత్త పద్ధతులు వచ్చాయి. తక్కువ స్థలంలో, చదవడానికి వీలుగా ఉండేటట్టు కొత్త దస్తూరిలు వచ్చాయి – అన్షల్ (Uncial), హాఫ్-అన్షల్ (Half-Uncial) దస్తూరిలలో కొత్తమార్పులు బైజాంటైన్ సామ్రాజ్యంలోనే వచ్చాయి. ఐరిష్-బుక్-ఆఫ్-కెల్స్ (Irish Book of Kells)  ఈ దస్తూరిలలో వచ్చిన పుస్తకాలలో ప్రఖ్యాతిగడించింది.

లైబ్రరీలు పెరగడంతోనూ, లేఖనశాలలు కూడా పెరిగాయి, వాటికి గిరాకీ పెరిగింది. క్రైస్తవ సంఘారామాల్లో, కేవలం మతపరమైన పుస్తకాలే కాకుండా, ఇతర సెక్యులర్ పుస్తకాలు కూడా నకళ్ళు చేసేవారు. కొన్ని లేఖనశాలలు నిరంతరంగా, ఏడాది పొడుగునా పనిచేసేవి – ఒకే పుస్తకానికి డజన్లకొద్దీ నకళ్లు రాసేవారు. మొత్తం పనంతా, లేఖకుల మధ్య విభజించుకునేవారు. వారందరికీ ఒక అధికారి ఉండేవాడు (armarius – Provisioner), ఆయన రాయడానికి కావాల్సిన పరికరాలన్నీ – కాగితాలు, కలాలు, ఇంకులు మొదలైనవన్నీ లేఖకులకి ఇవ్వడం, వారు కాపీచేసిన పేజీలు దేనికది వేరుచేసి, తప్పులు చూడడం మొదలైన పర్యవేక్షణంతా చూసేవాడు. ఈ విధంగా, బైజాంటైన్‌ సామ్రాజ్యంలో పుస్తక రచన, పఠనం పెద్దఎత్తులో ఒక ఉద్యమస్థాయికి చేరుకుని, లిఖిత సంస్కృతి బాల్యదశని దాటి, మౌఖిక సంస్కృతిని తోసిరాజనే స్థాయికి చేరుకుంది. ఉంబెర్తో ఇకో (Umberto Eco) రాసిన మొదటి నవల Name of the Rose, దాని ఆధారంగా షాన్‌ కానరీ కథానాయకుడిగా నటించిన హాలివుడ్‌ సినిమా చాలామందికి తెలిసి ఉండవచ్చు. ఆ నవల అంతా లేఖనశాలలోనూ, మాన్యుస్క్రిప్టుల చుట్టూనూ తిరుగుతూ ఉంటుంది. క్రీ.శ. 1327 లో ఇటలీలో, ఒక మొనాస్టరీలో జరిగిన హత్య నేపథ్యంగా, చాలా ఉత్కంఠగా సాగే ఈ నవలలో, ఇకో సెమియాటిక్స్, బైబిల్ విశ్లేషణలు, సాహిత్య సిద్ధాంతాలు అద్భుతంగా మేళవించాడు. చదవతగ్గ నవల, చూడతగ్గ సినిమా!

అప్రస్తుతమైనా, బైజాంటైన్ అనే పేరువినగానే టక్కున గుర్తుకు వచ్చే పదం – ఆర్కిటెక్చరు. ఇస్తాంబుల్ అంటే గుర్తుకు వచ్చేవి హగియా సోఫియా, బ్లూమాస్క్. పూర్వకాలంలో నిర్మాణపద్ధతులు ఒక్కో కాలంలో, ఒక్కో సంస్కృతిలో ఒక్కోలా ఉండేవి. స్థూలంగా గ్రీకు, రోమన్‌, గోథిక్ (రోమనిస్క్‌) ఆర్కిటెక్చర్లు పాశ్చాత్య సంప్రదాయాలైతే (గ్రీకు సంప్రదాయాన్ని “పాశ్చాత్య సంప్రదాయం” అనడం కనీసం ఈ వ్యాస పరిధిలో నిర్దుష్టం కాదనుకోండి), ఈజిప్టు, బైజాంటైన్ , అరబిక్, చైనా, భారతీయ సంప్రదాయాలు ఆసియాకి చెందిన తూర్పు సంప్రదాయాలు. బైంజాటియన్ ఆర్కిటెక్చరు ఈ రెంటినీ ఏ మేధావో ఒకానొక స్ఫూర్తితో సమ్మోహితుడై మేళవించి సృష్టించిన సౌష్ఠవ సంగీతం అనిపించకమానదు. రోమనిస్క్ ఆర్కిటెక్చరు (గోథిక్‌) నిలువుగా, నిటారుగా నింగినంటుతూ మానవ నిర్మితమే అయినా, మానవుడు అందుకోలేని గమ్యాన్ని గుర్తుచేస్తూ మనిషి “చిన్న”తనాన్ని ఎత్తిచూపుతూ ఉంటుంది. బహుశా అందుకే ఇటలీలోని హ్యూమనిస్టు కళాకారులందరూ దీనిని గోథిక్ అనే ఈసడింపుమాటతో సత్కరించి, పూర్తిగా తిరస్కరించేసారు.

రోమన్ల భవంతులకి గ్రీకు శిల్పానికి ఆసియారంగులద్ది, నిటారైన గోథిక్ ఆర్చి నడుంవంచి దాన్ని సౌష్టవమైన గోళాకారపు డోముగా మార్చిపడేసారు బైజాంటైన్ శిల్పులు. గోథిక్ కట్టడాలలో ఎటునుంచి ఎటుచూసినా కంటిని తనవైపు లాక్కునే అనంతమైన సరళరేఖ ఒకటుంటుంది. గోడలైనా, నేలైనా, స్తంభాలైనా, ఒకదానివెంట ఒకటిగా ఉండే ద్వారాలైనా, ఆకాశాన్నంటే ఆర్చిలైనా మనకి కనిపించేది తిన్నటి, పొడుగాటి వంపులేని ఒక గీత. బైజాంటైన్ కళాకారులకి లైన్లు కాదు, రంగులుకావాలి. రంగురంగుల పాలరాతి మొసాయిక్కులతో వంపుసొంపుల లతాగుల్మాదులతో చెక్కిన చిత్రవిచిత్రమైన విన్యాసాలతో సూటైన సరళరేఖలని వారు తుడిచవతల పారేశారు.

Fig 12: Hagia Sofia

జస్టినియన్ చక్రవర్తి ఏలుబడినాటికి గ్రీకు, రోమను, ప్రాచ్యక్రైస్తవ సంప్రదాయాలన్నీ ఒకదాన్నొకటి పెనవేసుకుని బైజాంటైన్ సంప్రదాయంగా రూపుదిద్దుకున్నాయి. నికా తిరుగుబాటుదారులు (Nika Revolt ) రాజధానినంతా ఒక్కతోపులో విరగదీసినప్పుడు జస్టినియన్‌ దాన్నొక సువర్ణావకాశంగా మార్చుకుని రాజధానినంతా, రోములోని చర్చిలని తలదన్నే చర్చిలు, కోటలు, సంఘారామాలు, ముఖద్వారాలతో నగరాన్నంతా కనీవినీ ఎరుగనంత పెద్దఎత్తులో పునర్నిర్మించాడు. హగియాసోఫియా (Holy Wisdom), ఏ మహాత్ముడి స్మృతికో కాకుండా జ్ఞానానికి, సృజనాత్మక తార్కికభావనకి స్మృతి మంటపంగా నిర్మించిన ఏకైక భవంతి. అంథీమియస్, ఇసిడోర్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సారథులందరినీ ఒకచోట చేర్చి, అప్పటికి చర్చంటే బసీలికా (Basilica) అనే భావనని పూర్తిగా తుడిచిపెట్టి, సరికొత్త రూపానికి, నిర్మాణ పద్ధతికి శ్రీకారం చుట్టాడు. ఐదేళ్ళ పదినెలలపాటు లక్షన్నరకేజీలకిపైగా బంగారం, పదివేలమంది పనివాళ్ళ శ్రమ కరిగి వరదలై పారగా క్రీ.శ. 537 సంవత్సరం, డిసెంబరు ఇరవైఆరో తారీఖున హగియాసోఫియాలో మొదటి ఆరాధన జరిగింది. జస్టినియన్ చేతులెత్తి “Glory to God who has thought me worthy to accomplish so great a work! O Solomon! I have vanquished you!” అంటూ పరవశంతో పరవళ్ళు తొక్కాడు [25].

If the Gothic structure is a risen ape pointing us to the ultimate possibilities of our evolution, the Byzantine building is a fallen angel breathlessly reminding us how blessed we really are. గోథిక్ ఆర్కిటెక్చరుకి, బైజాంటైన్ ఆర్కిటెక్చరుకి ఉన్న తేడానే, గోథిక్ బ్లాక్ లెటర్ దస్తూరికి, హ్యూమనిస్టులు అభివృద్ధి చేసిన చిన్న గుండ్రటి అక్షరాల దస్తూరిలకి మధ్యకూడా ఉంది.

పన్నెండో శతాబ్దినాటికే బైజాంటైన్ సామ్రాజ్యం, ఒకవైపు తురుష్కుల దండయాత్రలకి, మరోవైపునుంచీ క్రూసేడర్ల తాకిడికి లోనయింది. సుమారుగా ఆసియామైనరు భాగం అంతా తురుష్కుల చేతిలోకి వెళ్ళిపోయింది. బైజాంటైన్‌ కళలు కాలక్రమంలో ఎంతగా అభివృద్ది చెందాయో, బైజాంటైన్ సామ్రాజ్యం అదే కాలంలో అంతగా తన సరిహద్దులని తురుష్కులకి కోల్పోయింది. ఎంతోమంది గ్రీకు పండితులు, కళాకారులు ఇటలీకి వలసపోయారు, ఎన్నో లైబ్రరీలు, పుస్తకాలు కూడా వారితోపాటుగా ఇటలీకి చేరుకున్నాయి. బైజాంటైన్‌ సామ్రాజ్యం తన వెయ్యేళ్ళ చరిత్రలో ఎదిగినంతకాలం ఎదిగి, ఎదిరించినంత కాలం ఎదిరించి, నిలదొక్కుకున్నంత కాలం నిలదొక్కుకుని, సాగినంతకాలం సాగి, చివరాఖరుకి నైసర్గికంగా క్షీణించి, నైతికంగా క్రుంగి, రాజకీయంగా కృశించి అంతర్లీనంగా కుళ్ళి, వరస యుద్ధాలతో, అంతర్వైరుధ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో తలమునకలై క్రీ.శ 1453, మే 29 న ఆఖరుసారిగా ఆట్టోమాన్ సుల్తాన్ రెండో మహ్మదు తాకిడికి పూర్తిగా పరాజితమైపోయింది.

రినైసాన్స్ ఇటలీ

కాన్‌స్టాంటినోపుల్లో వెయ్యేళ్ళు రెపరెపలాడిన గ్రీకో-రోమన్ జయకేతనం ఇస్లాముకి పట్టంకట్టి వచ్చినదారినే పుట్టింటిని పునరుద్ధరించడానికి ఇటలీకి చేరింది. బైజాంటైన్ సామ్రాజ్యం పూర్తిగా పతనం అయ్యేలోపే, ఎంతోమంది గ్రీకు పండితులు, కళాకారులు ఇటలీకి వలసవెళ్లడం ప్రారంభించారు. వారితో బాటుగా, వారి పాండిత్యం, వారి గ్రంథాలయాలు, వారి విప్లవధోరణులు, కొత్త ఆలోచనలు కూడా ఇటలీకి అక్కరకి వచ్చాయి. పదిహేనో శతాబ్దినాటి ఇటలీలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక వాతావరణం, అప్పటికే చిన్న, చిన్న స్వతంత్ర రాష్ట్రాలుగా ఏర్పడిన ఇటాలియన్ నగరాలు, అక్కడి సామాజిక స్వేచ్ఛ మొదలయినవి కూడా కలసి రావడంతో, బైజాంటైన్ సామ్రాజ్య పతనం ఒకరకంగా ఇటలీలో సాంస్కృతిక పునర్జాగృతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగియడానికి కావాల్సిన అంతఃప్రభావంగా (Undercurrent) తోడ్పడింది.

పద్నాలుగో శతాబ్దినాటికి, ఇటలీ రాజకీయ పరిస్థితి బైజాంటైన్ సామ్రాజ్యానికి పూర్తి విరుద్ధంగా ఉండేది. పడమటి రోమన్ సామ్రాజ్యపు నామమాత్రపు అధికారాన్ని లెక్కచేయక, ఇంకోపక్క చర్చి మాటలు పెడచెవినపెట్టి, ఇటలీలోని రాష్ట్రాలన్నీ స్వతంత్రాన్ని ప్రకటించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, ఇటలీ సాంస్కృతిక పునర్జాగృతికి (Italian Renaissance) పునాది పడింది. ఇటలీలో గొప్ప వాణిజ్య, వర్తకకేంద్రాలుగా తలెత్తిన వెనిస్, మిలన్, ఫ్లోరెన్సులలో ధనికుల దగ్గర డబ్బేకాకుండా అభిరుచి కూడా ఉండటంతో వారు సాహిత్యం, కళలు, అభ్యాసం, పాండిత్యాలకి పన్నీటిజల్లు పోసి పోషించారు. దిలాసాగా జీవితం నడుస్తున్నప్పుడు, డబ్బు-దస్కం పుష్కలంగా ఉన్నప్పుడు చర్చినేర్పిన భక్తిగీతాలు గొంతుకడ్డం పడితే ఆశ్చర్యంలేదు. ఈ నగరాలన్నిటిలోకి ఫ్లోరెన్సు (Florence) – చర్చి ధనార్జనమీద ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటిని నిర్లక్ష్యం చేసి బాంకింగు రాజధానిగా వేళ్ళూనింది. భాగ్యవంతులైన పౌరులకి కళలని ప్రోత్సహించడానికి, పుస్తకాలు ప్రచురించడానికి, కొనడానికి, ప్రైవేటు లైబ్రరీలు నెలకొల్పుకోడానికి ఆశ, అనువు చిక్కింది. వ్యక్తులకి, రాజకీయంగాగానీ, మతపరంగాగానీ ఎటువంటి ఆంక్షలకి, కట్టుబాట్లకి తలవొగ్గవలసిన అవసరం లేకపోవడంతో – మానవుడే నా సంగీతం, మానవుడే నా సందేశం అంటూ రినైసాన్సు హ్యూమనిజం ఫ్లోరెన్సు పేరుని సార్థకం చేస్తూ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరగబూసింది.

గ్రీకు, రోమను తాత్విక, సాహిత్యాలకి పునఃస్వాగతం పలకటం – మొదటితరం హ్యూమనిస్టు రచయితలు చిచెరొవంటి సంప్రదాయ లాటిన్ కవుల ధోరణిలో రాయడానికి ఎంతో ప్రయత్నించేవారు. ప్రాచీన సాహిత్యంపై, తాత్విక చింతనపై, పాత సంప్రదాయాలపై ,రచనలపై ఎక్కడలేని భక్తి శ్రద్ధలు పుట్టుకుని వచ్చాయి. ముఖ్యంగా గ్రీకు భాషా సాహిత్యాలంటే హ్యూమనిస్టులకి అమితమైన ప్రేమ – ఇవే ఒక్క ముక్కలో, రినైసాన్సు హ్యూమనిజం (Renaissance Humanism) ప్రధానమైన లక్షణాలు:

మరికొందరు హ్యూమనిస్టులు లాటిన్ నుంచీ వేరుపడి దేశభాషలలో కవిత్వం, సాహిత్యం సృష్టించారు. పెట్రార్క్ శిష్యుడు బొక్కాచొ (Boccaccio) టస్కన్‌ మాండలికంలో రాసిన దికామెరోన్ (Decameron) అనే కళాఖండం కూడా దేశభాషలో రాసిందే. ఇంగ్లాండులో జెఫ్రీ ఛాసర్ రచనలు లండను మిడిల్-ఇంగ్లీషుని ప్రాచుర్యంలోకి తెచ్చాయి. దేశభాషల్లో రచనలు రావటంమూలాన, అవన్నీ సామాన్య ప్రజలకి అందుబాటులోకి వచ్చాయి. పుస్తకాలకి డిమాండు పెరిగింది. పుస్తక వ్యాపారం ఒక వ్యవస్థగా మారింది [26]. దేశభాషల్లో సాహిత్య సృజన జరగడం, ఏ సమాజంలోనైనా ఒక ముఖ్యమైన మార్పు. అది ప్రజానీకంలో స్వతంత్ర కాంక్షని పెంపొందించటానికీ, కట్టుబాట్లనుండీ తెంచుకుని కొత్త దృక్పథం ఏర్పడటానికీ, మానవజీవితంలోని “ఎమోషన్” సాహిత్య వస్తువుగా రూపొందడానికి దోహదపడుతుంది, తద్వారా అంతకుముందు ఉన్న రచనాసూత్రాలన్నీ మారతాయి. ధార్మిక సాహిత్యం ప్రధానంగా బోధనాపరమైనది, దాని పరమావధి మనిషికి సద్బోధ చెయ్యడం, మానవుడి కోరికలకి, ఇష్టాలకి, కలలకి, కక్షలకి కళ్ళెం వేసి, మనిషిని సంఘజీవిగా ఇమడ్చడానికి అది ప్రయత్నిస్తుంది. లౌకిక సాహిత్యం దీనికి పూర్తిగా విరుద్ధం. ఏ చట్రంలోను ఇమడని, ఇమడలేని మానవ జీవితపు హోరు దానికి ప్రధానమైన సాహిత్య వస్తువు [27].

సరే – సామాజిక నేపథ్యంలో స్వతంత్రతకి ఆస్కారం ఉంది, ధనికుల ప్రాపకం ఉంది, కళలని వాణిజ్యంతో ముడిపెట్టే తెలివితేటలున్నాయి. సంప్రదాయ సాహిత్యం అందుబాటులో ఉంది. ఇంక ప్రపంచాన్ని కుదుపుకుదుపే ఉద్యమం ఆవిర్భవించటానికి కావాల్సిందల్లా – పాండిత్యాన్ని ప్రేమోద్వేగాలతో రంగరించి ప్రజల మనస్సులని రంజింపచెయ్యగలిగే ఒక సౌందర్య పిపాసి. ఈ గుణాలన్నీ రినైసాన్సు హ్యూమనిస్టు ఉద్యమానికి పితామహుడిగా కొలుచుకునే పెట్రార్కులోవరదలై పొంగాయి. పెట్రార్క్‌ లో హ్యూమనిస్టు ఉద్యమంలోని ఉద్రేకం, ఉద్వేగం, విలువలన్నిటినీ ధిక్కరించే ధైర్యం, హృదయాంతర్గత ప్రేమపిపాసకి తప్ప మరిదేనికీ తలవొగ్గకపోవడం మొదలైన లక్షణాలన్నీ మూర్తీభవించాయి. వృత్తిపరంగా పెట్రార్క్ న్యాయవాది. తప్పుడు సాక్ష్యం బనాయించాడనే ఆరోపణ ఆయనమీద పడింది. తన రాజకీయ జీవితానికి గొడ్డలిపెట్టంటి ఆ ఆరోపణని అబద్ధం అని నిరూపించడానికి కూడా ఒప్పుకోలేదు, కోర్టుకి పోలేదు. కోర్టు శిక్ష ప్రకటించింది. ఆయన ఊరొదిలి పలాయనం చిత్తగించాడు – ఊరూరా తిరుగుతూ, అప్పటికే స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న బొలోన్యాలో (Bologna) కొన్నాళ్ళు కాపరం పెట్టాడు. తండ్రి మరణంతో ఉన్న కాస్త అజమాయిషికూడా పోయి, న్యాయవాద వృత్తికి తిలోదకాలిచ్చాడు. తను అతిగా ప్రేమించిన రచయితల్లా రాయడానికి, వారిని మించడానికి ఉన్న జీవితాన్నంతా ధారబోసాడు. ఇంకొకరికి భార్య అయిన లౌరా అనే సౌందర్యరాశిని నిస్సిగ్గుగా, బహిరంగంగా ప్రేమించాడు. ట్రౌబడార్ల స్వేచ్ఛాగీతికల ఆత్మని పట్టుకున్నాడు. స్వేచ్ఛాప్రియత్వానికి, ప్రేమోద్వేగాలు, నిరంతర అధ్యయనం తోడయి పెట్రార్క్ కలం నుండి కవిత్వం గంగార్భ్హటై ఇటలీని ముంచెత్తింది. అప్పటివరకూ తన అభిమాన రచయితలందరూ రాసిన లాటిన్ భాషకి తిలోదకాలిచ్చి, అప్పటి టస్కన్ మాండలికంలోనే ఇటాలియన్ కవిత్వాన్ని ప్రజల నాలికలమీద నర్తింపచేసాడు. ఆయన కలంలో, ఉవ్వెత్తున ఎగిసే భావోద్వేగాలు యతి ప్రాసల పల్లకిలో ఒద్దికగా పల్లవులు పాడాయి. His poetry was the triumph of Italian vowel over Latin consonants [28].

ఏ దివిసీమలందు చిగురించిన ఏ మధురోహ మాతృకన్
ఆ దరహాసదీప్త రుచిరానన మాకృతి దాల్చెనో! నిజ
స్వాదుకళాప్రపూర్ణతను జాటగ నిట్టి మనోజ్ఞరూపమ
త్యాదరలీల ఆ ప్రకృతి యర్మిలి గూర్చినదేమొ యీ భువిన్!

ఏ జలకన్య కప్సరకు నే వనదేవతకిట్లు సొంపుగా
రాజిలు పైడి జాఱుకుఱు లల్లలలాడును పిల్లతెమ్మెరన్
ఈ జవరాలి సద్గుణములెన్నగవచ్చునె! ఆ మహత్వమ
వ్యాజము, కాని దాని పరమావధి నా మరణమ్మునందెగా!

ఆమె చంచలనేత్రాల నరయలేడు
తేనె పలుకుల, నగవుల, తీయనైన
ఆమె యూర్పుల నెరుగడు, అంతులేని
ప్రేమతత్త్వము అమృతమ్ము విషమటంచు
తెలుసుకోలేడు, అతడహా! పలవరించు
దివ్యసౌందర్యమునకునై తెలివిమాలి! [29]

తన ప్రేయసి లౌరామీద పెట్రార్క్ రాసిన కవిత హ్యూమనిస్టు ఉద్యమానికి కూడా అంతే చక్కగా వర్తిస్తుందేమో! పెట్రార్క్ సౌందర్య పిపాస ఎంత లోతుగా ఉండేదంటే, రాసిన ప్రతి అక్షరం కూడా అందంగా ఉండాలనేవాడు. ఆ సౌందర్య కాంక్షే, చేత్తో అక్షరాలని రాయడమనే ప్రక్రియని కూడా ఒక కళారూపంగా (కాలిగ్రఫీ)గా మార్చింది.  

కాలిగ్రఫీ

ఒక్కో వ్యక్తి మాటకారితనం ఒక్కోలా ఉంటుంది – కొందరు ఎంతసేపు మాట్లాడినా వినాలనిపించేటట్టు ఉంటుంది. కొంతమంది మాట వినసొంపుగా ఉంటుంది, మరికొంతమందిది దైన్యంగానో, లలితంగానో, తుళ్ళుతూనో, హాయిగానో, సౌమ్యంగానో, దర్పంగానో, విద్వత్తు తొణికిసలాడుతూనో, అజ్ఞానం మిన్ను ముట్టుతూనో, మాటమాటకి నవ్వుతూనో, ప్రతి మాటని పట్టి పట్టి పలుకుతూనో – రకరకాలుగా మనుషులు మాట్లాడతారు. ఇది మాట్లాడే శైలి. అలానే, రాయడంలో అక్షరాలని ఎన్ని రకాలుగా రాయవచ్చో ఊహిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అక్షరం ఒకటే, కాని దానికి అనంతమైన ఆకృతులు కల్పించవచ్చు – మనిషి కల్పనా చాతుర్యానికి హద్దులు లేవనే వాస్తవానికి నిదర్శనం అక్షర స్వరూపమే. సప్త స్వరాలతో సంగీతానికి హద్దులు లేనట్టే, ఒక చిట్టి అక్షరానికి ఎన్ని హొయలో? ప్రతి అక్షరంలోనూ ఇంకా మనం ఊహించని ఎంత అందముందో? అక్షరం ఆకృతినే అధ్యయనం చెయ్యడమే ధర్మంగా, రాయడమనే కర్తవ్యంలోంచి యదేచ్ఛగా చెలరేగిన కల్పనా చాతుర్యమే కళగా, సమాచారాన్ని అందించే సరళమైన సాధనాన్నే సృజనాత్మక మార్గంగా మార్చి, మాటకున్న శబ్దాన్ని ఆకృతిగా మారుస్తూ, అక్షర రూపాలతో చెలరేగిన సౌష్టవ స్వరూప సంగీతమే కాలిగ్రఫీ. అది ఆకృతికి ఆగ్నేయరూపం, మదిలో రెపరెపలాడిన నిశ్శబ్ద ప్రాణాయామానికి సస్వరూప జ్ఞానం. సాధారణమైన చిన్న సంకేతంలో నిబిడీకృతమై ఉన్న సున్నితమైన అంతర్దృష్టిని వెలికితీసే మహత్వ పటుత్వ ధారణా సిద్ధి. అక్షరాలకి చరిత్ర ఆపాదించిన సంకేత రూపానికతీతమైన సౌందర్యాన్ని సంపాదించిపెట్టే చింతామణి.

ఇంతకుముందు చెప్పినట్టుగా, యూరోపులో రినైసాన్సుకి పూర్వం, అన్నింటిలోనూ గోథిక్ శైలిని ఉపయోగిస్తూ ఉండేవారు. చర్చియొక్క రోమన్-లాటిన్ సంప్రదాయాలకి గోథిక్ శైలితో అవినాభావ సంబంధం ఉంది. రినైసాన్సు కళాకారులకి గోథిక్ శైలంటే పడేది కాదు, ఏకమొత్తంగా దానిపై తిరుగుబాటు ప్రకటించారు. ప్రతి కళలోనూ, ప్రతి రంగంలోనూ గోథిక్ శైలికి విరుద్ధమైన, వైవిధ్యమైన విప్లవాత్మకమైన మార్పుని తేవడమే ఒకరకంగా బూజుపట్టిన చర్చి “హెగీమొనీ”పై తిరుగుబాటుగా వారు భావించారు. పవిత్రతని తోసిరాజని, ఆనందానికి, అందానికి గజ్జెలు కట్టి నాట్యం చేయించారు. అప్పటికి మతపరమైన గ్రంథాలన్నీ గోథిక్ దస్తూరిలతోనే రాసేవారు. పెట్రార్క్ – కరొలిఙ్గన్‌ కాలంనాటి అందమైన, ఒంపుసొంపులున్న చిన్న అక్షరాల దస్తూరిని వెలికితీసి, దానికి కొత్త రూపునిచ్చి “హ్యూమనిస్ట్ దస్తూరి”కి అంకురార్పణ చేసాడు.

Fig 13: Humanistica Rotunda

దేశభాషల్లో సాహిత్య సృష్టి, సుసంపన్నమైన దేశకాల పరిస్థితుల వల్ల సమ్మోహితులైన కళాకారుల ఉత్తేజం రినైసాన్సు దస్తూరిలని అమితంగా ప్రభావితం చేసింది. కరొలిఙ్గన్‌ కాలంనాటి బ్లాక్‌లెటర్, అన్షల్ (Uncial), రోటుండా దస్తూరి శైలిలు తమ తమ “అవసరమైనంత మట్టుకే రూపం, అలంకారం అనవసరం” అనే స్వాభావిక ధర్మాన్ని పక్కన పెట్టి, సౌందర్యకాంక్షా సిరిగంధాన్ని ఒళ్లంతా అలముకున్నాయి. కరొలిఙ్గన్‌ కాలంనాటి పెద్ద అక్షరాల, చిన్న అక్షరాల మధ్య తేడాలు రినైసాన్స్ కాలంలో ప్రస్ఫుటమై, వాటికో ప్రత్యేకమైన అస్తిత్వం వచ్చింది. అవేకాకుండా, కరొలిఙ్గన్‌ కాలంలో నామమాత్రంగా ఉండిన  గొలుసుకట్టు దస్తూరి కూడా రినైసాన్సు కాలంలో చాలా అభివృద్దిలోకి వచ్చింది. కాలక్రమంలో ఈ హ్యూమనిస్టు రోటుండా హ్యూమనిస్టుల కోకిల పాటలకి లేలేత చూత పల్లవిగా మారింది. ఎన్నో వందల సంవత్సరాలు గడిచినా, ఎన్నో దేశాల్లో, మరెన్నో లిపులకి, డిజిటల్ యుగంలో కూడా ఎన్నో ఫాంట్ల రూపకల్పనకి మాతృకలుగా ఉపయోగపడ్డవి అప్పటి హ్యూమనిస్టుల సౌందర్యకాంక్షతో హొయలు దిద్దుకున్న దస్తూరిలే.  ఈనాడు ప్రయోగాల పేరిట ఫాంటు డిజైనర్లు ఇవే శైలులతో ఆటలాడుతూ ఉండొచ్చుగాక, కాని ఈ ఆధునికుల ప్రయోగాలు రినైసాన్సు కళాకారులు సృష్టించిన సృజన శిఖరంపైకి ఎగబాకే చీమలు మాత్రమే అంటారు డోనాల్డ్ అండర్సన్‌ [30].

శాసనలిపి (Inscription Letters)

Fig 14: Inscription Letters of Luca della Robbia

రినైసాన్సు కాలంలో ప్రాచీనతపైన మక్కువ పెరగటంవల్ల, మూలపడిన శాసనలిపికి (Inscription Letters) కూడా కొత్త అందాలు కూర్చడంలో ఆసక్తి పెరిగింది. పదిహేనో శతాబ్ది చివరిభాగంలో లూకా దెల్ల రొబియా (Luca della Robbia) వంటి శిల్పులు అందమైన శిలాక్షరాలని రూపొందించారు. సాధారణంగా అక్షరం చివర్లో పెట్టే సెరీఫ్ రొబియా చేతిలో కొత్త అలంకరణలు దిద్దుకోవడం పై చిత్రంలో గమనించవచ్చు. ఇంతకుముందు చూసిన కరొలిఙ్గన్‌ బ్లాక్‌లెటర్‌ చిత్రాలకి, లూకా సృష్టించిన దస్తూరికి మధ్య ఎంత తేడా ఉందో కూడా గమనించవచ్చు. లూకా తయారుచేసిన ఈ దస్తూరే ఈనాటి పాస్కల్ ఫాంటుకి (Pascal Typeface) మాతృక. లూకా వలే ఇంకెంతోమంది చెయ్యి తిరిగిన శిల్పులు పదిహేనో శతాబ్ది ఫ్లోరెన్సులో ఉండేవారు. అందరి గురించీ చర్చించడానికి ఈ వ్యాస పరిధి చాలదు గానీ, The Roman Letter పుస్తకం ఆసక్తి ఉన్నవారి దాహంతీర్చే ఊటబావి.

Fig 15: Modern Inscription Letters

ఇన్‌స్క్రిప్షన్ అక్షరాలు ఈనాటికీ భవంతులమీద, కంపెనీ లోగోలుగానూ, పుస్తకాలపై మకుటాలుగానూ వాడుతున్నారు. లండను వీధుల్లో ఓ గంటసేపు పచార్లు చేస్తే, భవంతులపైనా, వ్యాపారసంస్థల మకుటాలమీద, ప్రకటనలపైనా ఈ రోమన్ శిలాక్షరాలు లండను నగరం శోభని ఇనుమడిస్తూ, కాలిగ్రాఫిక్ దస్తూరిల గురించీ తెలియని సామాన్యులని కూడా పట్టినిలిపి పలకరిస్తూ ఉంటాయి.

హ్యూమనిస్టు దస్తూరిలు

రినైసాన్సు హ్యూమనిస్టులందరూ అందమైన దస్తూరిపై అమితమైన ఆసక్తిని కనపరచడానికి సౌందర్యారాధన ఒక్కటే కారణం కాదు. దేశభాషల్లో సాహిత్యం రావడం, ఒక్క మతపరమైన సాహిత్యమే కాకుండా అన్ని రంగాలకి సంబంధించిన పుస్తకాలు రావటం, ధనికులకి, విద్యావంతులకీ పుస్తకాలు సేకరించడం పట్ల మక్కువ పెరగటం మొదలైన పరిస్థితులు అందంగా పుస్తకాలు తయారుచెయ్యడమనే కళకి వాణిజ్యపరమైన వ్యవస్థని ఏర్పరిచాయి. దాంతో కళాకారులకి డిమాండు కూడా పెరిగింది. ఒక్కొక్కరి ప్రావీణ్యత బట్టీ వారికి డిమాండు, ఆర్జన ఉండేవి. ప్రసిద్ధులైన కాలిగ్రాఫర్లకి వారి సొంత లేఖనశాలలు, వారికింద పనిచేసే శిష్యవర్గమూ ఉండేవి. వెస్పాసియానో అనే ప్రముఖ ఫ్లోరెన్సు లేఖకుడి కింద సుమారుగా నలభైమంది లేఖకులు ఏడాదిపొడుగునా పనిచేసేవారు. ఈయన స్టూడియో ఒక్కటే, సుమారుగా రెండువందల గ్రంథాలని రాసిపెట్టిందని ఒక అంచనా.

Fig 16: Salutati’s Sample

అప్పట్లో, యూరోపుకంతటికీ ఇటలీలోని ఫ్లోరెన్సే పుస్తక తయారికి ప్రధానమైన కేంద్రంగా ఉండేది. యూరోపులో దేశ దేశాల రాజులు, ధనికులు, బిషప్పులు ఫ్లోరెన్సులోని లేఖకులచేత పుస్తకాలకి నకళ్ళు చేయించుకునేవారు. జొవాన్ని అరిటీనొ (Giovanni Aretino), గెరార్దొ దెల్లా చిరియాగొ (Gherardo della Ciriago), అంటానియో మారియో (Antonio Mario), విస్పసియానో దాబిస్తీచి (Vispasiano da Bisticci) మొదలైన ప్రఖ్యాతులైన లేఖకులందరూ ఫ్లోరెన్సులోనే ఉండేవారు.

Fig 17: Sinibaldi’s Sample

పెట్రార్క్, బొక్కాచొ, కలుచ్చొ సలుతాతి (Coluccio Salutati), పౌజ్జో బ్రచ్చలీని (Poggio Bracciolini)  మొదలైన హ్యూమనిస్టులందరూ కాలిగ్రఫీని అభ్యసించి, ఎన్నో దస్తూరిలని సృష్టించారు. ఇంతకుముందు కరొలిఙ్గన్‌ దస్తూరిలలో ఉన్న సమస్యలు ప్రస్తావించాం. హ్యూమనిస్టులు ఈ శైలులన్నిటికీ పదును పెట్టారు. పౌజ్జొ  తన జీవితంలో చాలా భాగం కాలిగ్రఫీని అభ్యసించడానికి ధారబోసాడు. అలెజ్జోలో పుట్టి, ఫ్లోరెన్సులో విద్యని అభ్యసించాడు. అటుపైన కలుచ్చొ సలుతాతి దగ్గర కాలిగ్రఫీ నేర్చుకున్నాడు. కొన్నాళ్ళు రోములోను, ఇంగ్లాండులోనూ పర్యటించాడు. ఈయన  హ్యూమనిస్టికా మినిస్క్యూల్  అనే దస్తూరికి మొట్టమొదటి నమూనాలు సృష్టించాడు. అటుపైన ఎందరో కాలిగ్రాఫర్లు ఈ దస్తూరిని మరింతగా మెరుగులు దిద్దారు.  అంటానియో సినిబాల్డి మరొక ప్రముఖ ఫ్లోరెన్సు కాలిగ్రాఫరు. సినిబాల్డి దేశ విదేశాల్లో ఎందరో రాజులకి, ధనికులకి పుస్తకాల నకళ్ళు చేసాడు. హంగరీ రాజు మథియాస్ కొర్వీనస్ లైబ్రరీలోని  ఎన్నో పుస్తకాలు సినిబాల్డి ఉల్లేఖించినవే. హ్యూమనిస్టు మినిస్క్యూల్ శైలేకాకుండా సినిబాల్డి వాలు దస్తూరి (హ్యూమనిస్టికా కర్సివా)లో కూడా సిద్ధహస్తుడు. వాలు దస్తూరిలన్నిటిలోకి  ఆణిముత్యమని సినిబాల్డి దస్తూరి ఈనాటికీ ప్రశంసలందుకుంటోంది [31].

ఛాన్సరీ కర్సివ్ (Chancery Cursive)

Fig 18: Arrighi’s Beautiful hand

వాటికన్లో పోపు కార్యాలయం పేరు ఛాన్సరి. అక్కడ పనిచేసే లేఖకులందరూ ఒకేలా రాయడంకోసం ఏర్పరుచుకున్న శైలీ సూత్రాల ఆధారంగా ఏర్పడిన దస్తూరి ఛాన్సరి అనేపేర ప్రఖ్యాతి గడించింది. ఈ దస్తూరిని రాయాలంటే ప్రతి అక్షరం రాసినవెంటనే, కలాన్ని ఆపి, ఎత్తి పక్కకి జరిపి పక్క అక్షరం రాయవలసి ఉంటుంది. పెద్ద అక్షరాలకి మాదిరిగానే, ఈ దస్తూరిలో ప్రతి అక్షరం యొక్క పొడుగు, వెడల్పు నిర్దుష్టంగా ఉంటాయి. అందుకే, ఈ దస్తూరిలో రాస్తే ఎవరు రాసినా “అచ్చు గుద్దినట్టు” ఒకేలా ఉంటాయి. ఈ దస్తూరి రూపకల్పనలో లుదావియొ అర్రిగి (Ludovio Arrighi) అతి ముఖ్యుడు. ఆయన దస్తూరిలో అనులోమ, విలోమాల్లో ఉన్న సౌష్టవం, g అక్షరానికి కర్సివ్ శైలికోసం మార్చిన తీరు చెప్పుకోదగ్గవి. బర్తలమేయో సాన్విటో (Bartolemeo Sanvito) ఈ దస్తూరిని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన మరొక కాలిగ్రాఫరు. సాన్విటోకి రోములో ఎన్నో భవంతులు కట్టి, భవంతులపై చెక్కిన శాసనలిపుల్లో సిద్ధహస్తుడైన జొవాన్ని జొకోందొతో (Giovanni Giocondo) సన్నిహితమైన స్నేహ బాంధవ్యాలు ఉండేవి. అందువల్ల సాన్విటో దస్తూరిలో ముఖ్యంగా పెద్ద  అక్షరాలలో ఈ ప్రభావం కనిపిస్తుంది [32].

Fig 19: Sanvito’s writing

అడోబ్ కంపెనీలో ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ఫాంట్లు రూపొందించిన రాబర్ట్ స్లింబాక్ (Robert Slimbach) రూపొందించిన సాన్విటొ ఫాంటు బర్తలమేయో సాన్విటో దస్తూరికి నివాళిగా రూపొందించినదే.

రినైసాన్సు కాలం కాలిగ్రఫీకి స్వర్ణయుగం. అప్పుడు పుస్తకాలపై ప్రేమాభిమానాలు, వెల్లువలా ఎగిసిన సృజనాత్మకత ఇవన్నీ అక్షరాలకి ఎనలేని అందాన్ని ఆపాదించాయి. ఈనాటికీ, అక్షరరూపకల్పనలో పాశ్చాత్య సంప్రదాయమే మరెవ్వరూ అందుకోలేనంత సుభిక్షతని సాధించడానికి మూలకారణం రినైసాన్స్ కళాకారులు పదిహేనో శతాబ్దిలో పాశ్చాత్య ప్రపంచానికి పంచి ఇచ్చిన పంచ భక్ష్యాల అక్షయపాత్రే! గూటెన్‌ బెర్గ్, మూవబుల్ టైపు ప్రింటింగు యంత్రాన్ని కనుగొన్నాక, పదిహేడు, పదునెనిమిదో శతాబ్దాలనాటికే ఇటలీ, ఫ్రాన్సు, జెర్మనీ, ఇంగ్లండులు అక్షరరూపకల్పనలో తమవైన ప్రత్యేకమైన సంప్రదాయాలు నెలకొల్పాయి. అలనాటి పెట్రార్క్,సినిబాల్డి, సాన్విటో, నిన్నటి స్టాన్లీ మోరిస్, గాడి, ఎరిక్ గిల్, బడోని, డిడాట్, గారమాండ్ నుండీ ఈనాటి హెర్మన్ జాఫ్ వరకూ ఎందరెందరో మహామహులు కాలిగ్రఫీని, లెటరింగుని ఫాంట్ డిజైన్ని మరే ఇతర కళకి తీసిపోని కళారూపంగా తీర్చిదిద్దారు.

 ఉద్దీప్త గ్రంథాల తయారీ (The Making of Illuminated Manuscripts)

రినైసాన్స్ పుస్తక సంస్కృతిలో అందమైన దస్తూరిలు ప్రధానమైన అంశమే అయినా, అదొక్కటే కాకుండా పుస్తకంలో ప్రతీపేజీని అందమైన బోర్డర్లతో, నేపథ్యాలతో తీర్చిదిద్దడం, రంగు రంగుల బొమ్మలతో పుస్తకాన్నీ, పుస్తకంలోని విషయాన్నీ ప్రదీప్తవంతం (Illumination) చెయ్యడం, పుస్తకాలకి అందమైన బైండింగులు చెయ్యడం, వాటిని భద్రపరచడం, వాటిల్లో తప్పులు దిద్దుకోవడం మొదలైన ఏ అంశాన్నీ రినైసాన్సు కళాకారులు వదిలిపెట్టలేదు. ఆనాడు, పుస్తకం “తయారుచెయ్యటం” ఒక దివ్యానుభూతిని కలగచేసే కళ, అది సౌందర్యోపాసనలో నిత్య నైవేద్యం. దస్తూరిలు ఎంత అందంగా ఉండేవో, నేపథ్యచిత్రాలు అంతకన్నా అందంగా ఉండేవి. పుస్తకాల బైండింగులు బంగారు తాపడాలతో చిత్రవిచిత్రంగా, ఒకరిని మించి ఒకరు చేసేవారు. ఇవన్నీ కూడా పాశ్చాత్య పుస్తక సంస్కృతిలో విడదీయరాని చారిత్రక అంశాలు.

రినైసాన్సు ఉద్యమం ఊపందుకున్నాక, అందమైన పుస్తకాల తయారీ కోసం ప్రత్యేకమైన శిక్షణలు వచ్చాయి. ఒక మాన్యుస్క్రిప్టు నకలు తయారు చెయ్యాలంటే – చిత్రకారులు, లేఖరులు, బైండర్లు, ప్రూఫులు చూసేవారు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివినవారు, అనువాదకులు ఇలా చాలామంది అవసరమయ్యేవారు. లేఖరులు, చిత్రకారులు స్వతంత్రంగా పనిచెయ్యడంకానీ, లేదా ఏ రాజుకో లేదా ధనికుడికోసమో ప్రత్యేకంగా పనిచెయ్యడంకానీ చేసేవారు. ఒకసారి వృత్తిగా మారడంతో, విలేఖనం, పుస్తకం తయారీలలో చాలా మార్పులు వచ్చాయి. పుస్తకాల “నాణ్యత”, సౌందర్యం చాలా ముఖ్యమైన అంగంగా మారింది. రకరకాల దస్తూరిలు, వన్నెలద్దే పద్ధతులు, బొమ్మలుగీయడంలో ప్రత్యేకతలు, బైండింగులో అనన్యమైన చాతుర్యం, కొత్త పద్ధతులు, రకరకాల ఇంకుల తయారీ – ఒకటేమిటి – పుస్తకం తయారీలో అన్ని రంగాల్లోనూ ఎన్నో కొత్త పద్ధతులు, హంగులు వచ్చాయి.

Fig 20: Ancient Parchment Shop in Florence

యూరపులో, పేపరు వినియోగానికి చాలా ముందునుంచే తోలుతోచేసిన పత్రాలు (పార్చమెంటు) వాడేవారు. మధ్యయుగాలనాటి పుస్తకాలలో చాలావరకూ అన్నీ తోలుపత్రాలపై రాసినవే. వీటిని తయారుచెయ్యడానికి ఓ పెద్ద ప్రక్రియ ఉండేది. ఆపైన, వాటిపై పుస్తకానికి నకలు రాయడానికి ప్రత్యేక శిక్షణ పొందిన లేఖకులు (Scribes) ఉండేవారు. ఇప్పుడు “స్టేషనరీ షాపు”ల్లో కాగితాలు, రీములు అమ్మినట్టే అప్పట్లో పార్చ్మెంటు దుకాణాల్లో అమ్మేవారు. ఇవి రకరకాల నాణ్యతల్లో దొరికేవి. 1301 లో ఇంగ్లాండులో డజను తోలుపత్రాల ఖరీదు ఎనిమిది షిల్లింగుల ఎనిమిది డైములు. అదే 1383 నాటికి, నాణ్యమైన పత్రాలు ఒక్కో పత్రం ఆరున్నరడైములుండేది. వెస్ట్ మినిస్టర్ అబ్బెకి తయారుచేసిన పుస్తకంకోసం కొన్న అతి ఖరీదైన తోలు పత్రాల వెల, దస్తాకి (దస్తా అంటే నాలుగు పత్రాలు, ఎనిమిది పేజీల దొంతర) ఆరున్నర డైములయినట్టు ఆధారాలున్నాయి [33]. అప్పటి ధరలబట్టీ చూస్తే, ఇది బంగారం కంటే కూడా ఖరీదే!)

అయితే, తోలు పత్రాలు మన్నికలో తిరుగులేనివి. వెయ్యిసంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉంటాయి. మెత్తగా, అతి నున్నగా, సన్నగా ఉండే Parchment సులువుగా, మడతలుపెట్టి బైండింగు చెయ్యడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా, వాడుతున్న కొద్దీ దాని మృదుత్వం (Suppleness) పెరుగుతూ ఉంటుంది. వాడకుండా మూలనపడేస్తే, తోలుకాబట్టి పెళుసుగా మారిపోతుంది. అందుకే, పాతకాలంనాటి పార్చుమెంటు వ్రాతప్రతిని తిరగేసి, పట్టుకుని చూస్తే అది ఎంత విరివిగా వాడబడిందో తెలుస్తుంది. అందుకే, ఇప్పటిలా అన్ని పుస్తకాలు ఒకేలా కాకుండా, ప్రతి పుస్తకానికి, ప్రతి ప్రతికీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండేది. ఒకచోట చేసిన పుస్తకం రంగు, “రుచి”, వాసన, దాని మృదుత్వం మొదలైన గుణాలు అది ఏ లైబ్రరీనుండీ, ఏ ప్రదేశంనుండీ, ఎవరి సేకరణనుండీ వచ్చిందో వాటిని ప్రతిఫలిస్తూ ఉండేది. ఈ గుణాలే, బిబ్లియోగ్రాఫి చరిత్ర పరిశోధకులకి పుస్తకం పుట్టు పూర్వోత్తరాలని గుర్తించడంలో ఎంతగానో ఉపయోగపడే “వేలిముద్రలు”.

Fig 21: Unbound Parchment Gathering

తోలుపత్రాలు నాలుగు పత్రాలు, ఎనిమిది పేజీలుగా మడతలు పెట్టుకునేవిధంగా దస్తాలుగా అమ్మేవారు. మనం ఈరోజుల్లో రూళ్లగీతల కాగితాలపై రాయడం చిన్నపిల్లలు దస్తూరి అలవాటు అయ్యేంతవరకూ మాత్రమే అనుకుంటాం. కానీ, అప్పట్లో పుస్తకం ఎంత గొప్పదైతే అందులో రూళ్ళు అంత విస్తారంగా ఉండేవి. పుస్తకంలో రాయడం ప్రారంభించడానికి ముందే లేఖరి పుస్తకం లేయవుట్‌ ముందుగా గీసుకోవడమో, లేదా ముందే గీసిఉంచిన పేజీలు కొనుక్కోవడమో చేసేవాడు. బొమ్మగియ్యడానికి జాగా, పేరాలో మొదటి అక్షరానికి జాగా, మార్జిన్లు, పేజీనంబర్లు అన్నీ ముందే మార్కు చేసుకునే వారు.

Fig 22: A Ruled Page from an unfinished manus

పేజీల ఎన్నిక అయిన తర్వాత, అసలు “రాత” పని మొదలయ్యేది. అప్పట్లో కలంతో రాసేపద్ధతికి, ఇప్పుడు ఫౌంటెను పెన్నులు, బాల్‌పాయింట్‌ పెన్నులతో రాసేవిధానానికి చాలా తేడా ఉంది. ఈనాడు మనం పెన్ను చూపుడువేలు, బొటనవేలు మధ్యన ఉంచి మధ్యవేలు కణుపుమీద ఆనించి పట్టుకుంటాం. పిడికిలి పుస్తకానికి ఆనించడం వల్ల వేళ్ళు కదుపుతూ అక్షరాలని రాస్తాం. అదే, కాన్వాసుపైన చిత్రపటం గీసే చిత్రకారుడు కుంచెని పట్టుకునే పద్ధతి చాలా వేరుగా ఉంటుంది. కాన్వాసుని కంటికి సమాంతరంగా ఉండే ఎత్తులో, మొహానికి ఎదురుగా, కాస్త వాలుగా  పెట్టుకుని, కుంచెని రంగులో ముంచి, మూడువేళ్ళతోనూ కుంచెని కదలకుండా పట్టుకుని, మొత్తం పిడికిలితోసహా, చెయ్యంతా కదుపుతూ పటం గీస్తారు. మధ్యయుగాలనాటి లేఖరి కలంతో రాసే పద్ధతి, కుంచెతో పైంటింగుగీసే పద్ధతికి దగ్గరగా ఉంటుంది. జీన్ మిలాట్ అనే లేఖరి తన స్టూడియోలో పుస్తకాల నకళ్ళు రాస్తున్న చిత్తరవులు రెండు దొరికాయి. Fig-23లో రాతబల్ల, కలం పట్టుకునే పద్ధతి, అసలు పుస్తకం పెట్టుకోడానికి, రాతటేబిలుకి పైన తిరిగే కొక్కేనికి వీలుగా ఒక బల్ల, ఇంకు సీసాలు, కలాలు, పాళీని పదునుచేసుకోడానికి ఎడమచేతిలో pen knife – ఇవన్నీ చూడవచ్చు. పెన్నులోంచి ఇంకు ధారగా వచ్చేటప్పుడు, అక్షరాలు ఏ దిశలోనైనా ఆపకుండా రాసెయ్యవచ్చు.

Fig 23: A portrait of a scribe at work

కాని, పెన్నుని ఇంకుబుడ్డీలో ముంచి, రాసేటప్పుడు పైనుంచీ కిందకి మాత్రమే stroke గియ్యగలం, కిందనుంచీ పైకి రాస్తే ఇంకు నిలవదు. రంగుతో బొమ్మగియ్యడానికి, పెన్సిలుతో గియ్యడానికి ఉన్న ఈ ప్రధానమైన తేడా బొమ్మలుగీసేవారందరికీ అనుభవమే. అందుకే, కాలిగ్రఫీలో మొదటి పాఠం – A అక్షరం రాయాలంటే, ఏకమొత్తంగా ఒకేసారి రాయరు. ఇంకులో పాళీ ముంచి మొదట ఎడమవైపు గీత రాసి, చెయ్యి ఎత్తి, కుడివైపు గీతగీసి, ఆగి, మధ్యలో గీత గీస్తారు. జీన్ మెలాట్ పట్టుకున్నట్టు కలం పట్టుకుని, పిడికిలి పేజీకి ఆనించకుండా రాయగలిగితే, అక్షరాలు painting strokes లా వాటంతట అవే వస్తాయి. అయితే, ఒక పేజీ రాయడానికి ఒక రోజు మొత్తం పట్టవచ్చుననుకోండి!

ప్రొఫెషనల్ లేఖరికి ఎన్నో రకాల దస్తూరిలలో రాయడం వచ్చేది, లేఖరి తన ఉపయోక్త (client) నుంచీ వసూలు చేసే ధర దస్తూరినిబట్టీ, పుస్తకంలో కావల్సిన బొమ్మలు, పేజీలో మొదటి అక్షరాలు, మొదటి లైన్లలో వైవిధ్యం వీటన్నిటిబట్టీ ఉండేది. ఒక లేఖరి తనకి వచ్చిన దస్తూరిలన్నీ ఉపయోక్తలకి చూపించటంకోసం ఒక కాగితంపై రాసుకున్నాడు. ఆ కాగితం ఆక్స్-ఫోర్డు దగ్గర దొరికింది. పదిహేనోశతాబ్దిలో కేంబ్రిడ్జి దగ్గర దొరికిన ఒక పుస్తకంలో ఆరోజుల్లో ఒక పుస్తకం నకలు చేయించడానికి సుమారుగా ఎంత ఖర్చు అయ్యేదో వివరాలన్నీ ఉన్నాయి. దీనిప్రకారం, తోలు కాగితాల దస్తా, చిన్న సైజైతే మూడు డైములు, పెద్ద సైజైతే ఆరుడైములు, నకలురాయడానికి ఎనిమిదిపేజీల ఆక్టావియోకి పదహారు డైములు, పెద్ద సైజైతే ఇరవై డైములు, అదే బైండింగుకి చిన్న సైజుకి రెండు షిల్లింగులు, పెద్ద సైజుకి రెండు డైముల ఆరు షిల్లింగులు అయేదట [34].

Fig 24: Sample of a Scribe’s handwriting sytles

పుస్తకం నకలు రాయడం పూర్తి అయ్యాక, లేఖరి చివర్లో ఆశ్వాసాంత గద్యాలు (Colophon) రాసే ఆచారం సర్వసాధారణం. ఈ కోలోఫోన్లే ఈనాడు పరిశోధకులకి ఎంతో విలువైన బిబ్లియోగ్రాఫిక్ సమాచారం. ఎవరు, ఎవరికోసం రాసారు, ఎప్పుడు రాసారు – సంఘారామం వివరాలు గట్రా ఈ కోలోఫోన్లలో ఉండేవి. ప్రాచీనకాలంలో ఇప్పటిలా “పేరుకోసం” ప్రాకులాట ఉండేది కాదని, ఎవరూ తమ పేర్లు అంతగా చెప్పుకొనేవారు కాదనే నమ్మకం ఈనాడు ఉంది. యూరోపియన్ వ్రాతప్రతుల్లో ఆశ్వాసాంతగద్యాలు పరిశీలిస్తే అనామకత్వం ఎంత అపోహో తేలిపోతుంది. ఈ మధ్యకాలంలో స్విట్జర్లండులోని Le Bouveret కి చెందిన బెనడిక్టైన్ క్రైస్తవ సాధువులు వారి సంఘారామాల్లోని పాత గ్రంథాలలోని కోలోఫోన్లు సుమారుగా ఇరవైవేలకిపైగా సేకరించి, వాటిని వర్గీకరించి ప్రచురిస్తున్నారు. కొంత ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, ఆ రోజుల్లో లేఖర్లగా చాలామంది స్త్రీలు కూడా ఉండేవారు.

నకలురాసే ప్రక్రియమాట ఎలా ఉన్నా, రినైసాన్సు పుస్తకాల అందం, వాటి సొగసు ఆ పుస్తకాలని “ప్రదీప్తవంతం” చేసిన పెయింటింగులది, పేజీలకి నేపథ్యంగా వేసిన చిత్ర, విచిత్రమైన బోర్డర్లు, వాటికి చేసిన అందమైన బైండింగు. పుస్తకం పతాకపేజీపైనా, ప్రతిపేజీకి నేపథ్యంగాను, పేజీకి బోర్డరుగాను చిత్రించిన అలంకరణలు, వన్నెచిన్నెలు అప్పటి పుస్తకాలని కళాఖండాలుగా, అపురూపమైన సాంస్కృతిక మూలధనంగా మార్చాయి.

Fig 25: A Scribe’s colophon

పుస్తకాలలో బొమ్మలు రెండు రకాలుగా ఉంటాయి – మనందరికీ తెలిసిన బొమ్మలు, పుస్తకంలోని విషయానికి అదనపు హంగుగానో, విషయాన్ని వివరించడానికి ఉపయోగపడే ఉద్దీపనగానో ఉంటాయి – ఉదాహరణకి ఈ వ్యాసంలో బొమ్మలు ఈ కోవకి చెందినవి. ఇవి వ్యాసంలో అంతర్భాగం కాబట్టి, వీటిని వ్యాసాంగాలు అనుకోవచ్చు. ఇక రెండోరకం బొమ్మలు, పుస్తకంలోని విషయానికి సంబంధించినవి కాకుండా, పేజీ నేపథ్యంగా వేసినవి – వీటినే

Fig 26: Corvina Illuminated Page Showing King Matthias’s emblems

ఈనాడు “Stationery” అంటున్నాం. ఖరీదైన డైరీలు, నోటుపుస్తకాలు, ఉత్తరాలు రాసుకోడానికి వాడే ప్రత్యేకమైన పేజీలు ఈ కోవలోకి వస్తాయి. సాధారణంగా, వీటికి పుస్తకంలోని విషయంతో సంబంధం ఉండనక్కరలేదు. ఇవన్నీ, ఆ పుస్తకం ఎవరిదో, ఆ వ్యక్తుల అభిరుచిని, హోదాని ప్రతిబింబిస్తూ ఉంటాయి. మధ్యయుగాల, రినైసాన్సు వ్రాతప్రతులలోని ప్రదీప్తపటాలు కూడా సుమారుగా ఈ కోవకి చెందినవే. ఉదాహరణకి, Fig-26 లో  పేజీ బోర్డరు చుట్టూ ఉన్న రకరకాల బొమ్మలలో, హంగరియన్ చక్రవర్తి మథియాస్ కొర్వీనస్ రాజ చిహ్నాలు నాలుగూ ఉన్నాయి. ఈ రకం బొమ్మలే కాకుండా, పుస్తకంలోని విషయాన్ని ఉద్దీపనం చేసే బొమ్మలు కూడా ఉండేవి. ఇవేకాకుండా, మూడోరకం అలంకరణలు – ఒక కళాకారుడికి చెందినవో, ఒక ప్రదేశానికి చెందినవో, కాలానికి లేదా ఒక “genre”కి సంబంధించిన బొమ్మలుకూడా అయిఉండవచ్చు. ఒక్కో కళాకారుడి స్టూడియోలోనూ, ఆయనకి మాత్రమే ప్రత్యేకమైన డిజైన్లు, పేజీ నేపథ్యాలు ఉండేవి. ఒకేరకం డిజైన్లు, చిత్రాలు ఎన్నో పుస్తకాలలో యథాతథంగా ఉపయోగించేవారు. మొత్తంమీద పుస్తకానికి, ఆ పుస్తకం తయారుచేసిన లేఖరులు, ప్రదీప్తకారులు, వారు పనిచేసిన, లేదా శిక్షణపొందిన చిత్రశాలల ముద్రలు – ఇవన్నీ అసాధారణంగా మేళవించడమే ప్రదీప్తకళ, అందుకే వాటికి “Illuminated Manuscripts” పేరు వచ్చింది. లేఖరుల లాగనే, ప్రదీప్తకారులు కూడా బొమ్మకింత, బోర్డరుకింత అని రుసుము వసూలు చేసేవారు. ఒక లెక్క ప్రకారం, పూర్తి పేజీ బొమ్మకి పన్నెండు డైములు, రంగుల మొదటి అక్షరాలకి, వంద అక్షరాలకి నాలుగు డైములు, కాపిటల్ అక్షరాలైతే పెన్నీకి వంద ఇలా వసూలు చేసేవారు. పుస్తకం బైండింగుకి పది, పన్నెండు షిల్లింగులు అయ్యేది. [35]

పుస్తకాన్ని ప్రదీప్తం చెయ్యటంలో వేర్వేరు అంగాలున్నాయి:

Fig 27: A Pattern Sheet of an Illumination Studio

ముఖచిత్రం – పుస్తకంలో మొదటి పేజీ, ముఖ్యమైన పేజీలకి ప్రత్యేకంగా చేసే అలంకరణలు. ఇవి పుస్తకం ఎవరికోసం చేసారో, ఎవరు చేసారో వారి చిహ్నాలన్నిటితోపాటూ పుస్తకంలోని విషయాన్ని ఉద్దీప్తం చేస్తూ ఉంటాయి.

రెండోది పుస్తకంలో ప్రతిపేజీ చుట్టూ అందంగా గీసిన లతాగుల్మాదుల బోర్డర్లు. ఇక మూడోది పేజీ మధ్యలో ఉండే బొమ్మలు. ఇవి ఇప్పటి పుస్తకాలలాగనే విషయానికి సంబంధించినవి. నాలుగు – ప్రతి పేజీలోనూ, మొదటి అక్షరం, మొదటి లైను, లేదా పేరాలో మొదటి అక్షరానికి చెక్కిన వన్నెచిన్నెలు (Drop-cap).

ఈనాడు, ఇటువంటి పుస్తకాలలో బొమ్మలు మనకి కేవలం అలంకారప్రాయంగా అనిపించినా, ఆ కాలంలో వాటికి సింబాలిక్ అర్థం ఉండేది. ఎక్కువగా కనిపించే అపోలో, మర్సియాస్ చిత్రం, నియోప్లాటోనిజంకి, వస్తుప్రపంచంకంటే, భావనా ప్రపంచం యొక్క గొప్పదనానికి ప్రతీకగా వాడేవారు. ఇలానే, చాలా బొమ్మలలో కనిపించే పచ్చిక మైదానంలో పడుకున్న లేడి బొమ్మ భగవంతుని సాంగత్యానికై తపించే ఆత్మకి ప్రతీకగా ఉపయోగించేవారు. ఈనాటి వాస్తవాధారిత ప్రపంచంలో “Symbolic Gestures”కి పెద్దగా విలువలేదు, కాని అప్పటి సమాజాలన్నిటిలోనూ అటువంటి మర్యాదలకి ఎంతో విలువ ఉండేది. వేగవంతమైన ఆధునికజీవితంలో కోల్పోయిన ఎన్నో వెలకట్టలేనివాటిల్లో ఇదొకటి.

పుస్తకాలని అచ్చు వెయ్యటంలోనూ, రాయటంలోనూ ఆనాటి నుండీ ఈనాటి వరకూ సుమారుగా ఒకటే పద్ధతి – దశలవారిగా ప్రతి పేజీ తయారవుతుంది. ముందుగా పుస్తకం నకలు తయారు చేసుకోడానికి, కొంతమంది లేఖర్లని కొంత పైకం ఇచ్చి కుదుర్చుకుంటారు. పుస్తకం ఓనరు, లేఖరి, ప్రదీప్తకారుడు ముందుగా పుస్తకం ఎలా ఉండాలో ఒక అవగాహనకి వస్తారు, దానిని బట్టి పుస్తకం ఖరీదు నిర్ణయించుకునేవారు. అటుపైన ముందుగా పేజీ డిజైను చేసుకొనేవారు. అటుపైన, పేజీలో వన్నెలు అద్దవలసిన అక్షరాలు ఎన్నిఉండాలో, లేదా మొదటి వాక్యంలో ప్రతి అక్షరం పరిణామం క్రమక్రమంగా తగ్గుతూ ఉండటం వంటి డిజైన్లు నిర్ణయించుకునేవారు. ఇలా ముందు అనుకున్న డిజైనుకి అనుగుణంగా పేజీకి రూళ్ళుగీసుకునేవారు. దస్తాలన్నీ అయిన తర్వాత అవి ప్రదీప్తకారుల చిత్రశాలకి పంపేవారు. బొమ్మలు, బోర్డర్లు గియ్యడం అయాక, బైండిగుకి పంపేవారు. సుమారుగా, ఈనాటికీ పుస్తకం “డిజైను”లో ఇదే ప్రక్రియ వాడుతున్నాం. అప్పటికీ, ఇప్పటికీ తేడా అల్లా ఒకటే – అప్పట్లో డిజైను నుంచి తయారీ వరకూ అంతా మనిషే చేసేవాడు. ఇప్పుడు ఆలోచనకి రూపకల్పన మాత్రం మనిషి మస్తిష్కం చేస్తే, మిగిలిన పనంతా మిషీన్లు చేస్తున్నాయి. అందుకని, కేవలం కొత్త సాంకేతిక పరిజ్ఞానం – అది ఏ విధమైనదైనా – పాతదానికంటే ఏ రకంగానూ గొప్పదనుకోవడానికి వీలులేదు. సమాజంలో కొత్త అవసరాలు పుట్టుకొచ్చినప్పుడు, వాటికి అనుగుణంగా కొత్త ఆలోచనలు, కొత్త భావనలు వస్తాయి. వాటి ప్రభావంతో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దానిమూలంగా సమాజంలో సంక్లిష్టత పెరుగుతూ ఉంటుంది, పెరుగుతున్న సంక్లిష్టతకి తిరిగి మనిషి కొత్త ఆలోచనలతో, కొత్త భావనలతో స్పందిస్తాడు. సంస్కృతికి, సమాజిక అవసరాలకి, సాంకేతికతకి మధ్య ఇటువంటి రాపిడి ప్రతి సమాజంలోనూ, అనాదిగా ఉన్నదే.

హ్యూమనిస్టు లైబ్రరీలు – బిబ్లియోతికా కొర్వీనయనా

Fig 28: King Mattias

రినైసాన్సు కాలంలోనే యూరోపులో లైబ్రరీ సంస్కృతికూడా వేళ్లూనింది. ఈ వ్యాసంలో పలుచోట్ల ప్రస్తావించినట్టుగా – ధనికులు, విద్యావంతులు, రాజులు, మతాధికారులు, కళాకారులు, పండితులు, శాస్త్రవేత్తలు మొదలైన వారందరికీ పుస్తకాల అవసరం ఉండేది, పుస్తకాలపై ఎనలేని ప్రేమాదరాలు ఉండేవి. ఇప్పట్లా, పుస్తకం కావాలంటే ఒక నొక్కుతో దాన్ని ఒళ్లోకి “దింపుకొనే” సౌకర్యం లేదు కాబట్టీ అప్పటికింకా ప్రింటింగు కూడా లేదు కాబట్టీ, ఎవరికి పుస్తకం కావాలంటే వారే వారిస్థోమతని బట్టీ, అభిరుచిని బట్టీ కావలిసిన విధంగా నకలు చేయించుకునేవారు. పుస్తకాలు సేకరించడం, వాటిని భద్రపరచడం కూడా ఒక కళగా, శాస్త్రంగా అప్పుడే అభివృద్ధి చెందింది. ఎవరి పుస్తకాలు వారే నకలు చేయించుకునేవారు కాబట్టి అప్పట్లో లైబ్రరీలు ఎక్కువగా ప్రైవేటు లైబ్రరీలే. లారెంజొ దామెడీచి, పెట్రార్కు మొదలైన పండితుల దగ్గర కొన్ని వందల పుస్తకాల లైబ్రరీలు ఉండేవి. అన్నిటిలోకి వాటికన్ లైబ్రరీ అతిపెద్ద లైబ్రరీ. వాటికన్ తర్వాత అతిపెద్ద లైబ్రరీ హంగరీ రాజధాని బుడాపెస్టులో ఉండేది. ఆ లైబ్రరీని స్థాపించిన హంగరీ రాజు మథియాస్ కొర్వీనస్ పేరుమీదుగా దానికి బిబ్లియోతికా కొర్వీనయనా అనే పేరువచ్చింది. పదిహేనో శతాబ్ది చివరి దశకంలో కొర్వీనా లైబ్రరీలో సుమారుగా మూడువేల సంపుటాలు ఉండేవని అంచనా.

రినైసాన్స్ ఉద్యమానికి ఫ్లోరెన్సు ముఖ్య కేంద్రంగా ఉండేదనీ, అక్కడ కేవలం కళాకారులు, పండితులు, కవులు, శాస్త్రవేత్తలే కాకుండా, లేఖకులు, చిత్రకారులు, బైండర్లతో కూడిన పుస్తక తయారీ వ్యవస్థకూడా ఉండేదనీ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా? ఇటలీ, ఫ్లోరెన్సులు ముందుండి నడిపిన ఉద్యమానికి ఎంతో దూరంలో – అట్టొమాన్ సామ్రాజ్యం పక్కలో బల్లెంలా ప్రతినిత్యమూ పొడుస్తూ ఉంటే – వరుస యుద్ధాలతో సతమతమైన హంగరీలో అతిపెద్ద హ్యూమనిస్టు లైబ్రరీ ఉండడమనేది చాలా ఆశ్చర్యం గొలిపే సంగతే.

కొర్వీనా లైబ్రరీ చరిత్ర ఒక్కటే కాకుండా, ఆ లైబ్రరీలో ఒకప్పుడు ఉండి ఈనాటికి చిరస్థాయిగా మిగిలిన పుస్తకాల వివరాలన్నీకూడా చరిత్రకారులకి తెలుసు. మూడువేల సంపుటాలలో ఈనాటికీ 216 పుస్తకాలు మాత్రం మిగిలి, చెల్లాచదురై అమెరికాలోను, యూరోపులోను ఎన్నో లైబ్రరీలలోనూ, మ్యూసియంలలోనూ భద్రపరచబడి ఉన్నాయి. ఎందరో పండితులని, కళాకారులని, శాస్త్రవేత్తలని తనదగ్గరకు రప్పించుకుని, ఉన్నన్నాళ్ళూ అత్యంత శోభాయమానమైన వెలుగు వెలిగి, ప్రతి పుస్తకము ఒక కళాఖండంగా, ఒక సౌందర్యశాలగా వెలుగు వెలిగిన కొర్వీనా లైబ్రరీ మన కథకి అవసరమైన అన్నిరకాల హంగులూ, హొయలూ ఉన్న కథానాయిక. ఇప్పటివరకూ, రినైసాన్సు పుస్తక సంస్కృతికి సౌందర్యం ఇంటిపేరని చెప్పుకున్నాం. కొర్వీనా లైబ్రరీలో పుస్తకాలు అత్యంత సుందరమైన కళాఖండాలుగా ఖ్యాతికెక్కాయి.

కాన్‌స్టాంటినోపుల్ తురుష్కుల చేతిలోకి వెళ్లేనాటికి, దానికి పశ్చిమ దిక్కున ఉన్న హంగరీకి సిగస్ముండ్ కుమారుడు హున్యది యానోష్‌ ఏలికగా ఉండేవాడు. హున్యది పరాక్రమవంతుడు, ప్రజ్ఞావంతుడు, సమర్థుడు కావడంచేత తురుష్కులని నయానా, భయానా ఒప్పించో, ఓడించో హంగరీలోకి వారు రాకుండా నిలువరించగలిగాడు. క్రీ.శ 1456 లో తురుష్క సేనలు బెల్‌గ్రేడ్‌ పట్టణాన్ని ముట్టడించినప్పుడు, హున్యది అమేయమైన శక్తి యుక్తులతో వారిని ఓడించి వారిని వెనక్కి పంపించాడు. ఆనాటి నుండీ హున్యది హంగరీల వీరగాథల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. హున్యది దక్షతవల్ల హంగరీకి ఒక అర్ధశతాబ్దం పాటు నిరంతర యుద్ధాలనుండీ విశ్రాంతి లభించింది. ఆ అర్ధశతాబ్దిలో ఆయన కుమారుడు మథియాస్ హంగరీ చరిత్రలో స్వర్ణయుగాన్ని నెలకొల్పాడు. పదహారు సంవత్సరాల నూనూగు యవ్వనంలోనే మథియాస్ సింహాసనం అధిష్ఠించాడు. విశాలమైన ఛాతీ, బలిష్ఠమైన భుజస్కందాలతో రాజసం ఉట్టిపడుతున్నట్టు ఉండేవాడు కానీ పాపం ఆయన కాళ్ళు మాత్రం కురచగా ఉండేవి – అందుకని, గుర్రంపై ఉన్నప్పుడు మాత్రమే రోమన్ గ్లాడియేటర్లా ఉండేవాడు. ఆయన చిన్నప్పటినుండే యానోష్ విటెజ్‌, యానోష్ పన్నోనియస్ అనే ఇద్దరు ప్రఖ్యాతులైన హ్యూమనిస్టు పండితులదగ్గర విద్యాభ్యాసం చేసాడు. యానోష్ పన్నోనియస్ ఆకాలంలో గ్రీకు, లాటిన్ సాహిత్యాలని మథించిన పండితుడిగా, కవిగా ప్రసిద్ధి చెందాడు. విటెజ్, యానోష్ లిద్దరిదగ్గరా మంచి లైబ్రరీలు ఉండేవి. వారి సాంగత్యంకోసం ఫ్లోరెన్సునుంచీ, ఇతర ప్రదేశాలనుంచీ ఎందరో పండితులు, కళాకారులు బుడాకి వస్తుండేవారు. అయితే, కొన్ని పరిస్థితులవల్ల వారి ఆస్తులని జప్తుచెయ్యవలసి వచ్చింది. యానుష్ దగ్గర ఉన్న గ్రీకు గ్రంథాలన్నీ ఈ రకంగా కొర్వీనాలైబ్రరీలో వచ్చి చేరాయి. దానికితోడుగా మథియాస్ ప్రతి ఏడాది, ఈ నాటి లెక్కల ప్రకారం మిలియన్ డాలర్లకి పైచిలుకే పుస్తకాలు సంపాదించడంకోసం వెచ్చించేవాడట. ఏడాదిపొడుగునా, మథియాస్ లైబ్రరీకోసం బుడాలో, ఫ్లోరెన్సులో, వియన్నాలో నలభైకి పైగా లేఖకులు, చిత్రకారులు పనిచేసేవారట. నేపుల్సు ప్రాంతానికి చెందిన ఆరగాన్ యువరాణి బియాట్రిస్ ని మథియాస్ పరిణయమాడాడు. ఆవిడతో పాటుగా ఎన్నో పుస్తకాలు బుడాపెస్టుకి వచ్చిచేరాయి. ఇటలీలోని కళాకారులుతో మథియాస్ కి దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయి.

1485 లో మథియాస్ ఆస్ట్రియాపై దండయాత్ర చేసి వియన్నాని ఆక్రమించుకున్నాడు. దాంతో, వియన్నాలోని హ్యూమనిస్టుల సంపర్కంకూడా ఆయనకి లభించింది. కొర్వీనా లైబ్రరీ అభివృద్ధి పథంలో ఇదొక మైలురాయి. 1485 కి ముందు లైబ్రరీలో పుస్తకాలపై వన్నె, చిన్నెలు అంత చెప్పుకోదగ్గవిగా ఉండేవి కావు. వియన్నాని ఆక్రమించుకున్నతర్వాత, అప్పట్లో జగద్విఖ్యాతిగాంచిన ఫ్లోరెన్సుకి చెందిన ప్రదీప్తకారులు – అట్టవాంటె, గియోవిన్ని బొకార్డి, అంటానియో డెల్ ఛెరికో మొదలైనవారి చేతుల్లోంచి జాలువారిన ఎన్నో అద్భుతమైన చిత్రాలంకరణలు ఈరోజు కొర్వీనా గ్రంథాలకి ప్రపంచ చరిత్రలో ఓ విశిష్టమైన గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ఈ కాలంలో తయారైన పుస్తకాలపైనే, తేదీలు, మథియాస్, బియాట్రిసుల మినియేచర్‌ చిత్రాలు కొర్వీనా పుస్తకాల ముఖపత్రాలపై మనకి కనిపిస్తాయి [37].

కొర్వీనా లైబ్రరీలో ఎన్ని పుస్తకాలుండేవి అనేది చరిత్రకారులకి ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. కొంతమంది 50,000 సంపుటాలుండేవంటారు, మరొకొందరు 500 కి మించలేదంటారు – ఈ రెండు సత్యాదూరాలే. అప్పటి స్థితిగతులన్నీ విశ్లేషిస్తే – అప్పటివారు రాసిన ఉత్తరాలు, ఆకాలంలో ఈ లైబ్రరీగురించిన ప్రస్తావనలు, కొర్వీనాలైబ్రరీకి సమకాలీన లైబ్రరీల సమాచారము, లైబ్రరీ భవంతి యొక్క వైశాల్యమూ – ఇవన్నీ పరిశీలించి కొంతమంది చరిత్రకారులు వేసిన అంచనా ప్రకారం మథియాస్ పోయేనాటికి, సుమారుగా 3000 సంపుటాలు ఉండొచ్చనే లెక్క ఇప్పుడు చరిత్రకారులందరూ ఒప్పుకుంటున్నారు. ఒక్కో సంపుటిలో ఒకటికన్నా ఎక్కువ పుస్తకాలుండేవి కాబట్టి, మొత్తంగా కొర్వీనా లైబ్రరీలో ఉన్న పుస్తకాల సంఖ్య 5000కి మించి ఉండకపోవచ్చు. అయితే, ఇవన్నీ కొర్వీనా ప్రధాన గ్రంథాలయంలో ఉండే హ్యూమనిస్టు సంపుటాల సంగతే. ఇవికాకుండా, వేరుగా అక్కడ మత గ్రంథాలకోసం ప్రత్యేకించిన మరో లైబ్రరీ ఉండేది, అవి కాకుండా మహారాణి బియాట్రిస్‌ దగ్గర మరికొన్ని సంపుటాలుండేవి[38].

“ఒక చిత్రం వేయిమాటల సాటి ” అనే నానుడి పదిహేనో శతాబ్దినాటి రినైసాన్స్ పుస్తకాల విషయంలో నూటికినూరుపాళ్ళు వర్తిస్తుంది. వాటిని తయారుచేసిన కళాకారుల గురించి, ఆ కళాప్రక్రియగురించి ఎంత వివరంగా చెప్పినా వాటిని స్వయంగా కళ్ళతో చూసినదానికి సాటిరాదు కదా? ఇప్పటివరకూ ఈ వ్యాసంలో ప్రస్తావించిన అంశాలన్నీ అత్యుత్తమ స్థాయిలో కొర్వినా లైబ్రరీ పుస్తకాలలో రూపుదిద్దుకోవడం చూడవచ్చు. దిగువునున్న slideshowలో బొమ్మలన్నీ ఒకప్పుడు కొర్వినా లైబ్రరీకి చెందిన పుస్తకాలలోని పేజీలే.

బిబ్లియోతికా కొర్వీనయినా – హ్యూమనిస్టు ఉద్యమం నొసట  హంగరీ దిద్దిన చంద్రవంక

[portfolio_slideshow size=large include=”11025,11026,11027,11028,11029,11030,11031,11032,11033,11034,11035,11036,11037,11038,11039,11040,11041,11042,11043,11044,11045,11046,11047,11048,11049,11050,11051,11052,11053,11054,11055,11056,11057,11058″ click=advance showcaps=true showtitles=true showdesc=true pagerpos=disabled]

***

కొర్వినా లైబ్రరీ పతనం

లైబ్రరీ ఉచ్ఛస్థితికి చేరుకుంటున్న దశలో 1490 లో మథియాస్ మరణించడం వల్ల దాని పెరుగుదల ఆగిపోయింది. మథియాస్‌ మరణించినపిదప ఆయన వారసులకి ఆయన దక్షత, కళాపిపాస లేకపోవడం చేత కొర్వీనా లైబ్రరీ క్రమక్రమంగా తన వైభవాన్ని కోల్పోయింది. లైబ్రరీలో పనిచేసే కళాకారులు, లేఖకులు పోషణలేక, బుడాని వదిలిపెట్టి స్వస్థలాలకి వెళ్ళిపోవడమో, మరొకచోట పనికి కుదురుకోవడమో చేసారు. మథియాస్‌ తన అక్రమ సంతానమైన ఇహోన్నస్ కొర్వీనస్‌కి పట్టంకట్టాలని చూసాడుగానీ, ఆయన మరణం తర్వాత ఇహోన్నస్‌ విరోధుల,దాయాదుల చేతిలో ఓడిపోయాడు. బుడానుంచీ పారిపోతూ, తనతో పాటుగా లైబ్రరీనుంచీ కొన్ని అమూల్యమైన పుస్తకాలనికూడా పట్టుకుపోయాడు.

అటుపైన, ఎంతోకాలం హంగరీకి మంచిరోజులు నిలవలేదు. వారసుల చేతకానితనం వల్ల రాజ్యంలో అవినీతి, అరాజకత్వం ప్రబలిపోయాయి. ధనికులు అందరూ స్వార్థపరులై, రైతులని పీడించసాగారు. భరించలేని సుంకాల బరువుతో విసిగిపోయిన ప్రజలు సైన్యంలో చేరి తిరుగుబాటు చేసారు. ఆ విధంగా హంగరీ రాజకీయంగా, ఆర్థికంగా క్షీణించింది. అదే అవకాశంగా, 1526 ఆగస్టు 29వ తేదీన తురుష్కులు హంగరీని ముట్టడించారు.

రాజప్రాసాదంలో మూడు లైబ్రరీలు ఉండేవి – మతగ్రంథాలన్నీ ఉన్న గ్రంథాలయం ఒకటి, కొర్వీనా లైబ్రరీ, ఇవికాకుండా రాయల్ ఆర్కైవ్సుకూడా బుడా రాజమందిరంలోనే ఉండేవి. ఆర్కైవ్సుని రక్షిద్దామనే వెర్రి ప్రయత్నంలో వాటన్నిటినీ ఒక ఓడలో ఎక్కించి, డాన్యూబు దాటిద్దామనుకుంది రాణి మేరి. కాని, దురదృష్టవశాత్తు, ఆ ఓడ చిన్నదవటంవల్ల, నదివంపులో మునిగిపోయింది. హంగరీ ఆర్కైవులన్నీ నదీగర్భంలో కలిసిపోయాయి. తురుష్కులు నగరంలోకి వచ్చే రెండువారాల్లో ఎందరో కొర్వీనా హ్యూమనిస్టు లైబ్రరీనుంచీ ఎన్నో అమూల్యమైన పుస్తకాలు తస్కరించి, ఎవరికి దొరికినవి వారు పట్టుకుపోయారు. అదృష్టవశాత్తు, ఈనాడు మనకి మిగిలిన కొర్వీనా పుస్తకాలు ఆ రెండువారాల్లో ఎవరెవరో ఎత్తుకుపోయినవే. మథియాస్ లైబ్రరీలో 2500 కోడెక్కులు ఉండేవి – ఈనాడు మనకి దొరికినవి 216 మాత్రమే. మిగిలినవన్నీ తురుష్కుల చేతిలోనూ, కాలగతిలోనూ పడి నలిగిపోయాయి. మిగిలిన 216 సంపుటాలు, ప్రపంచంలో నలుమూలలా ఉన్న మ్యూసియములలోనూ, లైబ్రరీలలోనూ ఈనాటికి చిరస్థాయిగా మిగిలి ఉన్నాయి [39].

ముగింపు

రినైసాన్స్ ఉద్యమం కేవలం కళలకి సంబంధించినది మాత్రమే కాదు, అది అనాటి పాశ్చాత్య ప్రపంచంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక, మత శక్తుల పరస్పర సంఘర్షణలోంచి పుట్టి, మానవేతిహాసాన్ని సమూలంగా మార్చిన నవీన దృక్పథం. రోమన్ సామ్రాజ్యం ఉచ్ఛస్థితికి చేరినప్పటినుండీ, క్రైస్తవ మతం యూరోపులో విస్తరించినప్పటినుండీ, పాశ్చాత్య సంప్రదాయం లిఖిత సంప్రదాయంగానే అభివృద్ధి చెందింది. పాశ్చాత్య లిఖిత సంప్రదాయంలో పుస్తకానికెంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకోవడానికి అక్కడి బిబ్లియోగ్రాఫిక్ పరిశోధనలు ఎంత లోతుగా, విస్తృతంగా జరుగుతాయో పరిశీలిస్తే సరిపోతుంది. ఏ పుస్తకం ఎవరు రాసారో, అది ఏ కాలానికి చెందిందో కొంత పరిశోధన ద్వారా తెలుసుకోవచ్చు, కానీ ఎప్పుడో ఐదువందల ఏళ్లనాడే పూర్తిగా ధ్వంసమైపోయిన లైబ్రరీకి చెందిన పుస్తకాలని ఖచ్చితంగా ఈనాటికీ గుర్తించగలుగుతున్నారంటే అక్కడి లిఖిత సంప్రదాయం మూలాలు ఎంత లోతైనవో అర్థమవుతుంది. అంతేకాకుండా, ఇప్పటికీ యూరోపులో ప్రింటింగుకి పూర్వం పుస్తకచరిత్రపై ఎన్నో పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. చేత్తోరాసి, బైండింగు చేసిన మాన్యుస్క్రిప్టులని, ఎంతో అందంగా తిరిగి ప్రచురిస్తున్నారు కొంతమంది ప్రచురణకర్తలు. మాన్యుస్క్రిప్టుల గురించి తెలుసుకోవడానికి, వాటి కాపీలని కొనడానికి కొత్తరకం ఉత్సాహం ప్రజల్లో ఉందనడానికి గత సంవత్సరం ఫ్రాంక్‌ఫర్ట్ ప్రపంచ పుస్తక ప్రదర్శనలో చాలా ప్రచురణసంస్థలు, ఎంతో అందంగా ముద్రించిన మాన్యుస్క్రిప్టులకి వచ్చిన గిరాకీయే నిదర్శనంగా చెప్పుకోవచ్చు [40]. ఇప్పటికీ, యూరోపులో పెద్ద మ్యూసియమ్‌లన్నీ ఏడాదికోసారైనా మాన్యుస్క్రిప్టు ప్రదర్శనలని నిర్వహిస్తూ ఉంటాయి. ఈ ఏడాది ప్రారంభంలో బ్రిటిష్‌ మ్యూసియం నిర్వహించిన ప్రదర్శన చాలా విజయవంతం అయిందికూడా. బి.బి.సి కూడా ఈ ప్రదర్శనపై కొన్ని టి.వి. ప్రోగాములు నిర్వహించింది [41].

ఇందుకు పూర్తిగా విరుద్ధంగా భారతదేశంలో వేళ్ళూనిన సంస్కృతి ప్రధానంగా మౌఖిక సంస్కృతి. క్రైస్తవం, ఇస్లాం, యూదు మతాలవారికి పవిత్ర గ్రంథాలున్నాయి. అవి లిఖిత రూపంలోనే ఉండేవి. అదే, భారత సంస్కృతిలో వేద వాఙ్మయం అంతా దాదాపుగా ఐదువేల సంవత్సరాలపాటు మౌఖిక రూపంలోనే పరిరక్షించబడింది. వేదాలనాటినుంచి, ఈనాటి వరకూ కొన్ని సాంస్కృతిక సందర్భాలలో శబ్దానికున్న ప్రాముఖ్యం, ప్రాధాన్యం దృశ్యానికి లేదు. గురుముఖతః నేర్చుకున్నదానికున్న విలువ పుస్తకపఠనానికిలేదు. నిజమైన జ్ఞానం/సాధన మౌఖికంగానే లభిస్తుందనేది పురాతనకాలం నుంచీ మనం నమ్మి ఆచరిస్తున్న పద్ధతి, అందుకే “పుస్తకస్తాతు యా విద్యా పరహస్తగతం ధనమ్” (పుస్తకంలో ఉన్న జ్ఞానం పరులసొమ్మువంటిది) వంటి నానుడులు ఉన్నాయి. మన సంస్కృతిలో కాలిగ్రఫీవంటి కళలు అంతగా అభివృద్ధి చెందకపోవడానికి, సంస్కృత వాఞ్మయంలో రాత ప్రక్రియ అతి తక్కువగా ప్రస్తావించబడడానికి, బహుశా ఇదే కారణమని కొందరు పరిశోధకుల అభిప్రాయం[42]. సంస్కృతంలో లిపులు, రాత పుట్టుపూర్వోత్తరాలు, రాయడంలోని పద్ధతులు, మెలకువలు, రాతని బోధించే గ్రంథాలు ఆశ్చర్యం గొలిపేటంత తక్కువగా లభిస్తున్నాయి. వ్యాకరణం, భాష, చంధస్సు, పదార్థశాస్త్రాలపై ఎంతో కృషిచేసిన వైదిక సంప్రదాయం లిపుల గురించీ, రాతగురించీ పెద్దగా పట్టించుకోలేదనే పరిశోధకుల, పండితుల, చరిత్రకారుల అభిప్రాయం. అంతేకాకుండా, శిలాశాసనాలలోనూ, ప్రాచీన గ్రంథాలలోనూ, ఇప్పటికీ పుస్తకాలలోనూ, న్యూసుపేపర్లలోనూ దొర్లే అచ్చుతప్పులు – రాతపై ఈ సంస్కృతికున్న నిర్లక్ష్యానికి నిదర్శనం అనుకోవాలేమో! కానీ రాతపై గురి, గౌరవం, శ్రద్ధ బౌద్ధ, జైన సంప్రదాయలలో ఎక్కువగా కనిపిస్తుంది. మొదటినుంచీ రచనా ప్రక్రియపై శ్రద్ధ కనబరచినదీ, వాటిని సేకరించినదీ, గ్రంథాలయాలలో పదిలపరిచినదీ బౌద్ధ భిక్షకులు, జైన శ్రమణకులే. బౌద్ధ, జైన గ్రంథాలలోనే కొంతవరకూ లిపుల ప్రస్తావన ఉంది. సంస్కృతానికి సిద్ధం అనే కాలిగ్రఫిక్ దస్తూరిని తయారుచేసింది కూడా బౌద్ధులే.

ఏమయినప్పటికీ, మౌఖిక సంప్రదాయంలోకూడా రాయడం ప్రకియ ఉంటుంది, ఈ సంప్రదాయంలోనూ పుస్తకాలు ఉంటాయి – అయితే, వాటికి ఉన్న ప్రాధాన్యం, లిఖిత సంప్రదాయాల్లో పుస్తకానికున్న ప్రాధాన్యంవలె ఉండదు. అందుకని, లిఖిత సంప్రదాయంలోని బిబ్లియోగ్రాఫిక్ పరిశోధనాపద్ధతులు, పుస్తకాలని, వాటి చరిత్రని, వాటిల్లో భద్రపరచబడిన చరిత్రగతిని విశ్లేషించే పద్ధతులు యథాతథంగా మౌఖిక సంప్రదాయంలోని పుస్తకం పాత్రని అధ్యయనం చెయ్యడానికి పనిచెయ్యకపోవచ్చు. అయితే, ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన సాహిత్య, సాంస్కృతిక చరిత్ర అధ్యయనంలో ఈ మౌలికమైన తేడాలని గుర్తించకుండా, లిఖిత సంప్రదాయానికి వర్తించే పరిశోధనా సూత్రాలని, సిద్ధాంతాలనే మన చరిత్ర రచనకి కూడా వర్తించడం వల్ల కొన్ని అసందర్భమైన సమస్యలు ఉత్పన్నమవుతాయంటారు వెల్చేరు నారాయణరావు గారు [43]. మన సంస్కృతిలో పుస్తకంయొక్క సాంస్కృతక, సామాజిక చరిత్రని లోతుగా అధ్యయనం చెయ్యవలసిన అవసరమైతే ఉంది. ఆ వివరాలన్నీ రాబోయే వ్యాసాలలో మరింత విపులంగా చర్చిద్దాం.

Acknowledgements

ఈవ్యాసం కోసం పెట్రార్క్ ఇటాలియన్లో రాసిన సానెట్ అనువదించవలసి వచ్చింది. ఎంత ప్రయత్నించినా సానెట్ లయ తెలుగులో వచ్చింది కాదు. నర్సు ఆపరేషను చేస్తే అసలుకే మోసం వస్తుందని సురేశ్ కొలిచాలగారిని, భైరవభట్ల కామేశ్వరరావుగారిని అడిగాం. అడిగినవెంటనే, ఇద్దరూ అనువాదం చేసి పంపారు. కామేశ్వరరావుగారు, సానెట్ లయని తెలుగు ఛందస్సులోకి అవలీలగా అనువదించారు.

కొలిచాలగారు ఆశువుగా చేసిచ్చిన అనువాదం:

ఏ స్వర్గ సీమల, ఏ అద్భుత ఊహల
నమూనాగా మలిచిందో ఈ ప్రకృతి
ఆ సుందర దివ్యవదనంలో
తన ప్రతిభాశక్తులను చూపింపనెంచి

ఏ జలకన్యయో, ఏ వనదేవతో తన కేశాలను
మలయానిల వీచికకు విప్పినట్లు
ఎన్ని కళలను నేర్చిందో ఆ హృదయం
ఆ కళలమొత్తం నా మరణానికి కారణం

అప్సరసలు స్వర్గంలోనే ఉంటారని భ్రమించేవారు
ఆమె లోచనాంచల రోచుల నాలోకించలేదనే అనుకోవాలి
వారికి ఆమె ప్రేమ ఎలా బతికిస్తుందో, చంపేస్తుందో తెలియదు

వారికి ఆమె ఊర్పుల తియ్యదనం,
మాటల తియ్యదనం, నవ్వుల తియ్యదనం
తెలియనే తెలియదు

పూర్ణిమగారు పుస్తకం.నెట్ కి ఒకవ్యాసం రాసివ్వమని విసిగించకుండా గుర్తుచేస్తున్నప్పటికీ ఇదిగో, అదిగో అంటూ మూడేళ్ళు జాప్యం చేసి, వ్యాసం పంపిన మరురోజే ఎలాగైనా ప్రచురించాలంటూ ఆవిడ నెత్తిమీద కూర్చుని, ఒక రాత్రంతా ఆమెకి నిద్రలేకుండా చేసాం. ఈ వ్యాసానికి ప్రూఫులు చూడడంలో మిత్రుడు త్రివిక్రమ్ తన వెయ్యికళ్లతోనూ సాయంచేసారు. వీరి ఋణం తీర్చుకోలేనిది, స్నేహం మరువలేనిది. ఈ వ్యాసంలో ఎన్నో యూరోపియన్/ఇటాలియన్ పేర్లు రాయవలసి వచ్చింది. వాటి సరైన ఉచ్చారణ తెలుసుకునేందుకు Forvo.comఎంతగానో ఉపయోగపడింది.

Notes and References

[1], [4] Walter Ong, “Orality and literacy: The technologizing of the word” , Theatre Art Books, 2002;

Buy Orality And Literacy: The Technologizing Of The Word (New Accents) from Flipkart.com

[2] Marshall McLuhan et al, “The Gutenberg Galaxy: The making of modern typographic man”, University of Torento Press, 2011 Buy The Gutenberg Galaxy: The Making of Typographic Man from Flipkart.com

[3], [16] Alberto Manguel, “A History of Reading”, Penguin Books, 1997; అక్షరమంటే నాశనం లేనిది అని అర్థం ఉన్నప్పటికీ, అక్షరమంటే లిపికి సంబంధించినది అని మామూలుగా అందరూ అనుకునే మాట. కానీ భారతదేశపు ఊహలో అక్షరం శబ్దమే. అదే శాశ్వతమైనది. లిపి శబ్దమైనంత శాశ్వతమైనది కాదు. Buy The History of Reading from Flipkart.com

[5] Oral Literature అనే పదానికి తెలుగులో సాధారణంగా “మౌఖిక సాహిత్యం” అని వాడుతున్నారు. వెల్చేరు నారాయణరావుగారు, “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” రాసిన చివరిమాటలో ఇల్లిందిల సరస్వతీదేవిగారు “వాక్ సాహిత్యం” అనే పదం సూచించారని, ఆ పదమే మౌఖిక సాహిత్యం అనే వాడుక కంటే సమంజసమైనదని అభిప్రాయపడ్డారు.

[6] T.P. Mahadevan, “The rishi index of the Vedic Anukramaṇī system and the Pravara lists: Toward a Pre-history of the Brahmans”, Electronic Journal of Vedic Studies, Vol. 18, Issue 2, 2011; Though Mahadevan’s work is interesting and provides a fresh perspective, it is a fairly new proposal and is in direct conflict with the established and seminal works of Kosambi and Brough

[7] Andrew Robinson, “Writing Systems“, The Oxford Companion to the Book (OCB), OUP, 2010 Buy The Oxford Companion to the Book from Flipkart.com

[8] తిరుమల రామచంద్ర, “మన లిపి పుట్టు పూరోత్తరాలు“, ViSalandhra Publishing House, Hyderabad, 1957 (2.ed. 1990)

[9] కొడవటిగంటి రోహిణీప్రసాద్, “అక్షరాస్యత“, “మౌఖిక సాహిత్యం, లిపుల ఆవిర్భావం“, “రాసినది చదవడం

[10] Steve Farmer, Richard Sproat, Micheal Witzel, “The Collapse of the Indus-Script Thesis: The Myth of a literate Harappan Civilization“, ; స్టీవ్ ఫార్మర్ రాసిన ఈ పరిశోధనా పత్రం చాలా వివాదానికి దారితీసింది. ఈ వ్యాసంలో ఫార్మర్ సింధునాగరికత “లిఖిత సమాజం” కాదని, సింధులోయలో బయటపడిన “రాత” ఆనవాళ్ళు లిఖిత వ్యవస్థకి చెందినవి కావని వాదించాడు. ఈ వివాదం గురించి, భారతీయ లిపుల గురించీ రాబోయే వ్యాసాలలో విపులమైన చర్చ ఉంటుంది.

[11] James Raven, “The Resonance of Loss“, Lost Libraries: The Destruction of Great Book Collections Since Antiquity, Edited by James Raven, Palgrave, 2004

[12] Craig Kallendorf, “The Ancient Book“, The Oxford Companion to the Book, OUP, 2010

[13] Noegel, Scott B., “Text, Script and Media: New observations on scribal activity in the ancient near east“, in Modiano et al (Eds), Voice, Text, Hypertext: Emerging practices in textual studies,   U. of Washington Press, 2004, p. 133-143

[14] Steven Roger Fischer, “A History of Writing“, Reaktion Books, 2001 Buy A History of Writing from Flipkart.com

[15] Plato, “Apology“;

[17] T.Keith Dix, “Aristotle’s ‘Peripatetic’ Library“, Lost Libraries: The Destruction of Great Book Collections Since Antiquity, Edited by James Raven, Palgrave, 2004 Buy Lost Libraries: The Destruction of Great Book Collections Since Antiguity from Flipkart.com

[18] Donald Anderson, “Alphabet to Rome“, ch-3, Calligraphy: The Art of Letter Forms, Dover, 1969

[19], [42] Richard Saloman, “Indian Epigraphy“, OUP, 1998 Buy Indian Epigraphy: A Guide To The Study Of Inscriptions In Sanskrit, Prakrit, And The Other Indo-Aryan Languages from Flipkart.com

[20] Carl Olson, “The Sacred Book“, The Oxford Companion to the Book, OUP, 2010

[21] James Hayes, “The Roman Letter“, Lakeside Press Galleries, 1951

[22] Donald Anderson, “Writing in the late Middle Ages“, ch-4, Calligraphy: The Art of Letter Forms, Dover, 1969

[23], [28] Will Durant, “The Renaissance“, Story of Civilization, Vol-5, Simon and Schuster, 1957 Buy the Story Of Civilization, Vol-5 from Flipkart.com

[24]. N.G. Wilson, “History of Book in Byzantium“, The Oxford Companion to the Book, OUP, 2010

[25] Will Durant, “The Age of Faith“, Story of Civilization, Vol-4 , Simon and Schuster, 1957 Buy Story of Civilization, Vol-4 from Flipkart.com

[26],[30], [31], [32] Donald Anderson, “Renaissance and Change“, Ch-5, Calligraphy: The Art of Letter Forms, Dover, 1969

[27] వెల్చేరు నారాయణరావు, “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం“, తానా ప్రచురణలు, 2008

[28] The Original Verse by Petrarch in Italian:

In qual porte del ciel in quale idea
Era l’essempio, onde Natura tolse
quel bel viso leggiadro, in ch’ ella volse
mostrar qua giu quaanto lassu potea?
Qual ninfa in fonti, in selve mai qual dea,
chiome d’oro so fino a l’aura sciolse?
quando un cor tante in se vertuti accolse?
benche la somma e di mia morte rea.
per divina bellezza indarno mira
chi gli occhi de costei gia mai non vide
come soavemente ella gli gira;
non sa come Amor sana, e come ancide,
chi non sa come dolce ella sospira,
e come dolce parla, e dolce ride.

An excellent English Translation by Joseph Auslander:

In what bright realm, what sphere of radiant thought
Did Nature find the model whence she drew
That delicate dazzling image where we view
Here on this earth what she in heaven wrought?
What fountain-haunting nymph, what dryad sought
In groves, such golden tresses ever threw
Upon the gust? What heart such virtues knew? –
Though her chief virtue with my death is wraught.
He looks in vain for heavnly beauty, he
Who never looked upon her perfect eyes,
The vivid blue orbs burning brilliantly-
He does not know how Love yields and denies;
He only knows who knows how sweetly she
Can talk and laugh, the sweetness of her sighs

[33] [34] [35] Christopher De Hamel, “Medieval Craftsman: Scribes and Illuminators“, British Museum Press, 1992; Hamel wrote many influential books on Medieval Manuscripts. A short video of him talking about medieval manuscripts is available on youtube.

[36] Csaba Csapodi, “The Description of Surviving Authentic Corvinian Manuscripts“, Bibliotheca Corviniana, Corvina Press, 1969, (Translated by Zsuzsanna Horn)

[37] Csaba Csapodi, “The History of the Bibliotheca Corviniana“, Bibliotheca Corviniana, Corvina Press, 1969;

[38] Klara Csapodi-Gardonyi, “The Script and Illumination of Corvinian Manuscripts“, Bibliotheca Corviniana, Corvina Press, 1969

[39] Martyn Rady, “The Corvina Library and the lost Royal Hungarian Archive“, Lost Libraries, edited by James Raven, Palgrave, 2004

[40] There are more than 30 publishers, who brought many illuminated manuscripts in print. Some examples can be found in the following links:
http://grandiopere.fcp.it/facsimili/en//la-biblioteca-impossibile/ http://grandiopere.fcp.it/facsimili/en/the-impossible-library/le-caratteristiche-2/ http://www.scriptorium.net/en/index.php http://www.skriptorium.at/catalog/ http://www.faksimile.de/verlag/wie_entsteht_ein_faksimile/index.php http://www.faksimile.de/index.php

[41] The British Musuam has organized a special exhibition on Illuminated Manuscripts. The details of the exhibition can be found here: http://www.bl.uk/whatson/exhibitions/royalman/about/index.html

[43] Velcheru Narayana Rao, David Shulman, Sanjay Subrahmanyam, “Textures of Time“, Permanent Black, 2001 Buy TEXTURES OF TIME from Flipkart.com

You Might Also Like

15 Comments

  1. పుస్తకం.నెట్ నాలుగో వార్షికోత్సవం | పుస్తకం

    […] పప్పుగారు, శ్రీనివాస్ పరుచూరిగారి “అచ్చుయంత్రానికి పూర్వం పాశ్చాత్య …లాంటి పరిశోధనాత్మక వ్యాసం రావటం […]

  2. Krishna Rao Maddipati

    “చెప్పేవాడికి చేసేవాడు లోకువ”
    వృత్తి రీత్య శాస్త్రీయ పరిశోధనా వ్యాసాలు చదవడం అలవాటు కావడంతో, ఈ వ్యాసం చదువుతూ ఇందులో ఉదహరించిన ప్రతి విషయానికీ ఆధారాలున్నాయా అని ముందుగా అనుమానించాను. దీనిక్కారణం తెలుగులో ‘పరిశోధనా’ వ్యాసాలు వ్రాసేవారికి ఆధారాలతో అంతగా పనిలేదన్నది నేను చదివినంతలో ఏర్పరచుకున్న అభిప్రాయం. నేను ఎంతగానో నమ్మే పరిశోధకుల వ్యాసాలలో కూడా మూలాధారాలైన గ్రంథాలను, వ్యాసాలను ఉటంకించడంలో అలసత్వం చూశాను. (‘నేను చెప్పిందే వేదం’ అనే సంస్కృతితో కలిగిన అహంభావం కావచ్చునేమోగానీ, శాస్త్ర చర్చకు కావలసిన ఆధారాలకు వ్యక్తిగత నమ్మకాలకు పొంతన లేదన్న విషయం చాలా మంది పండితులకు తట్టకపోవడం శోచనీయం!). శాస్త్రీయ పరిశోధనా సంస్కృతిలో పెరిగిన ఈ రచయితలిద్దరూ, ఆధారాల ఆవశ్యకతను సహజంగా గుర్తించి, ఈ వ్యాసంలో పొందు పరచారు. వ్యాసంలో వివరించిన విషయాలకు సంబంధించిన ఆధారాలలోకి వెళ్ళే అవసరం అందరికీ లేకపోవచ్చు. కానీ చూడదలుచుకుంటే కనిపించేది ‘బృహన్నారదీయాలు’ మాత్రం కాదు. అది, సమగ్రమైన శాస్త్రీయ వ్యాసం. నాకు తెలియని విషయాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకున్నవి చెప్పాలంటే వ్యాసం తిరిగి రాయాలి!అంత ఓపిక ఎలాగూ లేదు గానీ, సాధారణంగా విసుగు పుట్టించే చరిత్రను ఆసక్తికరమైన వస్తువుగా మలచి విజ్ఞానాన్నందించిన మితృలిద్దరికీ అభినందనలు, అభివందనలు తెలుపుతూ, ఈ వరుసలో రాబోయే వ్యాసలకు ఎదురు చూస్తూ ఉంటాను. అందుకే ముందే చెప్పాను, చెప్పేవాడికి చేసేవాడు లోకువని!

  3. Dr. sairam

    Nice article. Please make it in PDF form for downloading and printing. Worth keeping a copy in library.

  4. vivina murthy

    ఇంతమంచి వ్యాసపరంపర ఇటీవలి కాలంలో తారసపడలేదు. ముందుగా గుర్తు వచ్చింది తిరుమల రామచంద్ర గారే.ఆ తర్వాత వల్లంపాటి మనసులో నిండారు. కేవలం మొదటి పుట చదివి రాస్తున్న మాటలివి. పూర్తిగా చదవి ఆకళింపు చేసుకోగలిగింది చేసుకుని, చేర్చవలసినదున్నా, చర్చించ వలసింది ఉన్నా తప్పక రాస్తాను. అభినందనలతో వివిన మూర్తి

  5. sivasankar ayyalasomayajula

    Hello Nagaraju & suresh Gaaru – Your efforts are very much appreciated. You have given us exhaustive information which is very very useful when anyone wanted dwell into history of books. We are looking forward more from you.

    Reg
    Siva

  6. nagamurali

    Spellbound by this article. Hats off to Nagaraju garu and Sreenivas gaaru. Look forward to next parts.

  7. gksraja

    ‘పుస్తకం’ గురించిన ప్రస్తావనతో మొదలైన వ్యాసం యావత్తూ విజ్ఞానదాయకంగా, ఆసక్తికరంగా సాగింది. ఇది ‘పుస్తకం’డాట్ నెట్ కే తలమానికమైన వ్యాసంగా నాకు అనిపిస్తోంది. అ’క్షరం’ లాగే ఇటువంటి వ్యాసాలు నాశనం లేనివిగా నిలిచి ఉంటాయి. తెలుగు తప్ప మరే భాషనూ భావంతో సహా అర్ధం చేసుకోలేని నాలాంటి ‘తెలుగు’ వాళ్లకి ఇదో కర దీపిక. ‘శబ్ద రత్నాకరం’ లాంటి పుస్తకాలు కూడ అందుబాటులో లేని రోజులొచాయన్న బెంగను తోలిపారేసే గొప్ప ‘విషయవజ్రం’ ఈ వ్యాసం. పరిశోధన, కూర్పు, అనువాదాల కోసం నాగరాజు గారు, శ్రీనివాస్ గారు పడిన తపన, శ్రమ చెప్పనలవికానివి. వ్యాస పరంపర పూర్తి అయిన తరువాత పుస్తకం.నెట్ వారితో కలిసి రచయితలు చేయాల్సిన పనులు –1. ఇది పుస్తకంగా ప్రచురించడం, 2.తెలుగు పాఠ్యాంశంగా ఇంటర్ మీడియట్ లెవెల్లో పెట్టించడానికి (కొద్ది అత్యాశే) కృషి చెయ్యడం. ఇంత గొప్ప చరిత్ర తాలూకు విషయాల్ని ఇలా చెబుతూంటే, మాలాంటి వాళ్ళ గొంతెమ్మ కోర్కెలు అలాగే వుంటాయి మరి. మరో సారి శ్రీనివాస్ గారికీ, నాగరాజు గారికీ, పుస్తకం.నెట్ వారికీ సంబంధిత కృషీవలురందరికీ ధన్యవాదాలు.
    రాజా.

  8. చంద్ర మోహన్

    అద్భుతం! పుస్తకం చరిత్ర గురించి ఇంత మంచి వ్యాసం చదివి దశాబ్దాలయింది.
    తాళపత్రం లాగా భూర్జపత్రం అని అంటారు గాని, తాటియాకుల్లాగా కాక, భూర్జవృక్షపు బెరడునుండి వలిచి తీసిన పొరలపై వ్రాసేవారు, ఆకులపై కాదు. ఈ విషయాన్ని రాహుల్ సాంకృత్యాయన్ రచన ’విస్మృత యాత్రికుడు’ లో కూడా ప్రస్తావించారు.

  9. Manasa

    కొన్ని బాగా ఆసక్తికరంగా అనిపించిన విషయాలు :

    క్రీ.పూర్వం 1800 నాటికే మొసొపొటేమియా, ఈజిప్టు, ఇస్రాయెల్ ప్రాంతాలలో మాటకి – అది పలికినా, రాసినా – ఒక బలీయమైన శక్తి ఉంటుందనే నమ్మకం దృడమైన నమ్మకం ఉండేది – వాటిని బీజాక్షరాలుగా, మహిమాన్వితమైన మంత్రాలుగా భావించేవారు. పవిత్రమైన మతపరమైన సిద్ధాంతాలను రాసినప్పుడుగానీ, పలికినప్పుడుగానీ పొరపాట్లు జరిగితే ఊహించని ఉపద్రవాలు ఎదుర్కొనవలసి వస్తుందని అనుకునేవారు. — మన సంస్కృతిలోనూ ఇలాంటి భయాలు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి కదా! వారికి అప్పట్లోనే అన్నమాట!

    2) టాత్ – ఈజిప్టు రాజుల మధ్య సంభాషణ. దానిని ప్రస్తుత వాతావరణానికి అనుసంధానిస్తూ వ్యాసకర్తల వ్యాఖ్యానం

    3)రాయడంలో ఒక ఇబ్బంది ఉందనీ, అవే చిన్నబడి అక్షరాల్లో ఆ ఇబ్బందీ లేదనీ – నిజంగా ఈ వ్యాసం చదివేవరకూ నాకు ప్రత్యేకంగా ఎప్పుడూ తోచనే లేదు. 🙂

    4) తొమ్మిదో శతాబ్దానికే ప్రపంచం చదువుని అంత సీరియస్గా తీసుకోవడం – ఒక్క న్యాయశాస్త్రం తప్ప మిగిలినవన్నే బోధించేవారట. అదీ ఉచితంగా..ఓహ్!

    5)కాలిగ్రఫీ ముందు పుట్టింది యూరప్‌లోనా? ఎక్కువగా చైనా లో విని ఉండడం వల్ల ననుకుంటాను – ఎక్కువగానే ఆశ్చర్యపోయాను.

    6_ “ఏ దివిసీమలందు చిగురించిన ఏ మధురోహ మాతృకన్..” – ఈ అనువాదం ఎవరిది? ఇంత అద్భుతంగా అనువదించడమెట్లా సాధ్యం :)- ఆ అనువాద కవి పేరొకసారి ప్రస్తావించి ఉంటే బాగుండేదనిపించింది.
    7) లేఖకులందరూ ఒకేలా రాయడంకోసం ఏర్పరుచుకున్న శైలీ సూత్రాల ఆధారంగా ఏర్పడిన దస్తూరి ఛాన్సరి — నిజమా! ఆ కాలంలోనే ఎంత ఆలోచన. మనం ఈ కంప్యూటర్ల కాలంలో పుట్టి బతికిపోయాం అనిపించింది – ఇలా అచ్చు గుద్దినట్టు రాయలేకపోతే కష్టమయిపోయేది 🙂

    8) తోలు పత్రాలు కూడా బైండ్ చేసేవారా? వాటికి వాడుక బట్టి మృదుత్వం వస్తుందనే సంగతి తెలీనిది. చదువుతుంటే అబ్బురంగా అనిపించింది. అప్పట్లోనే అంత ధరకోర్చి మరీ బైండ్ చేసేరంటే – ఆ కాలంలోనే సాహిత్యమంటే వారికి అమితమైన గౌరవం- ప్రేమ అనుకోవాలా? ఎక్కువ మందికి ఆసకతి ఉన్నట్లేనా – లేక తక్కువ మందికి ఇష్టమైనది – అభిరుచీ కాబట్టి అంత ధరా? – ఇక్కడ మాతో పంచుకున్న చిత్రాలు బాగున్నాయి.

    9) పేజీల ఎన్నిక- లే ఔట్లు – ఇవన్నీ రచయితలే చేసుకునేవారా? ఇక్కడ కుంచె ప్రస్తావన వచ్చింది కనుక – చైనీస్ కాలిగ్రఫీలో ఇంతే – పిడికిలి పుస్తకానికి ఆనకూడడు. అది నియమం. కుంచె పట్టుకున్నట్టే పై నుండీ పట్టుకుని, చేయంతా కదుపుతూ అక్షరాలు రాస్తూ పోవాలి.

    10 ) “కొంత ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, ఆ రోజుల్లో లేఖర్లగా చాలామంది స్త్రీలు కూడా ఉండేవారు.” — ఆశ్చర్యం అని వ్యాసకర్తలు ఎందుకన్నారో తెలుసుకోవాలని ఉబలాటంగా ఉంది. కళల్లో, ముఖ్యంగా చిత్రలేఖనం వంటి వాటిలో స్త్రీలకు చక్కటి ప్రావీణ్యం ఉంటుంది కదా! అటువంటప్పుడు – ఎక్కువ మంది స్త్రీలే లేఖరులుగా ఉండడం సమంజసమైనదిగానే కనపడుతోంది కదా..?

    11) ఆఖరులో కొలిచాల వారు చేసిన అనువాదమూ అద్భుతం 🙂

    — నిడివితో నిమిత్తం లేకుండా, హాయిగా చదువుకుపోతూ, ఆశ్చర్యపోతూ, ఆ కాలపు రహస్యాలను చదువుతూ – – – టైం మిషన్‌లో విహరిస్తున్నంత అందమైన అనుభూతినిచ్చిందీ వ్యాసం. మిగిలిన భాగాల కోసం చూస్తూంటాం.

    Thank you!

    1. పుస్తకం.నెట్

      >> 6_ “ఏ దివిసీమలందు చిగురించిన ఏ మధురోహ మాతృకన్..” – ఈ అనువాదం ఎవరిది? ఇంత అద్భుతంగా అనువదించడమెట్లా సాధ్యం – ఆ అనువాద కవి పేరొకసారి ప్రస్తావించి ఉంటే బాగుండేదనిపించింది.

      అనువాదకులు భైరవభట్ల కామేశ్వరరావుగారు. వ్యాసకర్తలు వారి పేరు Acknowledgments భాగంలో ప్రస్తావించారు.

      “ఈవ్యాసం కోసం పెట్రార్క్ ఇటాలియన్లో రాసిన సానెట్ అనువదించవలసి వచ్చింది. ఎంత ప్రయత్నించినా సానెట్ లయ తెలుగులో వచ్చింది కాదు. నర్సు ఆపరేషను చేస్తే అసలుకే మోసం వస్తుందని సురేశ్ కొలిచాలగారిని, భైరవభట్ల కామేశ్వరరావుగారిని అడిగాం. అడిగినవెంటనే, ఇద్దరూ అనువాదం చేసి పంపారు. కామేశ్వరరావుగారు, సానెట్ లయని తెలుగు ఛందస్సులోకి అవలీలగా అనువదించారు.”

    2. Manasa

      My bad..

      నిజమే – నేను కాస్త వేరుగా అర్థం చేసుకున్నాను ఆ వాక్యాన్ని. మీరు చెప్పాక అర్థమైంది.
      Thank you for the quick response.

  10. సురేశ్ కొలిచాల

    ఈ కింది విషయాలు మీకు తెలుసా?

    — ఈనాడు వాడుకలో ఉన్న మూడువేల పైచిలుకు భాషల్లో లిఖిత సాహిత్యం ఉన్న భాషలు గట్టిగా లెక్కపెడితే వందకిలోపే.
    — క్రీ.పూ. రెండో సహస్రాబ్దినాటికే ఈజిప్టులో ఆరువందల పదచిత్రాలు, వంద ధ్వనిచిత్రాలు, ఇరవైనాలుగు అక్షర సంకేతాలతో కూడిన లిపి ఉండేది.
    — అస్సీరియాలో క్రీ.పూ. ఏడోశతాబ్దినాటికే ప్రపంచంలో అతి పెద్ద లైబ్రరీ ఉండేది; ఆ లైబ్రరీకిచెందిన కొన్ని మట్టిపలకలు ఈనాటికీ సురక్షితంగా ఉన్నాయి.
    — క్రీ.శకం 647 లో అలగ్జాండ్రియాని ఆక్రమించుకున్న కాలిఫ్ “అలగ్జాండ్రియా లైబ్రరీలో ఉన్న పుస్తకాలు కొరానుతో సమ్మతిస్తే వాటి అవసరం మనకిలేదు, విభేదిస్తే అవి మనకి అక్కరలేదు” అని అలగ్జాండ్రియా లైబ్రరీని తగలబెట్టించాడట.
    — మన వైదికసాంప్రదాయకర్తలలాగే, సోక్రటీస్ కూడ సాహిత్యాన్ని రాయకూడదని అనుకునేవాడు. రాతకన్నా వాక్కు ఎంతో గొప్పదని నమ్మేవాడు.
    — రోమన్ సామ్రాజ్య విస్తరణతో పాటు మతపరంగా క్రిస్టియన్ మతం, రాత విషయంలో ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తున్న లాటిన్‌లిపి పశ్చిమ యూరప్ అంతా విస్తరించాయి.

    ఇలాంటి ఎంతో విలువైన సమాచారం ఈ వ్యాసం చదివే తెలుసుకున్నాను. పుస్తకంయొక్క సాంస్కృతక, సామాజిక చరిత్రని లోతుగా అధ్యయనం చేసి, లిపుల ఆవిర్భావంనుంచీ, ప్రింటింగు యంత్రం కనిపెట్టడానికి పూర్వం వరకూ పాశ్చాత్య పుస్తక సంస్కృతిని చారిత్రకదృక్పథంతో సమగ్రంగా సమర్పించే గొప్ప ప్రయత్నం. నాకు తెలిసినంతవరకూ తెలుగులో ఇటువంటి సమగ్రమైన విశ్లేషణ ఇంతవరకూ ఎవరూ చేయలేదు. ఇటువంటి అధ్యయనాన్ని తలకెత్తుకున్న నాగరాజుకు, శ్రీనివాసుకు నా జోహార్లు. భారతీయ పుస్తక సంస్కృతిపై వారు రాయబోయే వ్యాసాలకై ఎదురుచూస్తుంటాను.

  11. జంపాల చౌదరి

    Wow!
    Pustakam scored a coup with this!
    Nagaraaju gaaru and Sreenivas – This is the kind of work I have always expected from you. I am eagerly looking forward to more from you!

Leave a Reply