Four arguments for the elimination of television

రాసిన వారు: Halley
**********
జెర్రీ మందర్ (Jerry Mander) 1978 లో రాసిన “Four arguments for the elimination of television” గురించి ఈ పరిచయం. రచయిత ప్రకటన రంగంలో తనకి ఉన్న 15 ఏళ్ళ అనుభవంతో రాసిన పుస్తకం ఇది. పుస్తకం పేరు చూడగానే ఖచ్చితంగా చదవాలి అని అనుకున్నాను. అందునా ప్రకటన రంగంలో ఎంతో ఉన్నత స్థానంలో పని చేసిన మనిషి రాసినది అంటే ఎంతో కొంత సహేతుకమైన వాదనలే ఉంటాయిలే అనుకోని చదివాను. చాలా మంచి పుస్తకం. ఎంతో ఆలోచింపజేసే పుస్తకం. అయితే రచయిత అప్పటికే ఎంతో కొంత పేరు మోసిన యాక్టివిస్టు కాబట్టి కొంచెం విప్లవ భావాలూ ఎక్కువగా కనిపిస్తాయి ఈ పుస్తకంలో. ఇంటెర్నెట్టు వచ్చాక టీ.వీ ప్రాబల్యం కొంత తగ్గిన మాట నిజమే కానీ ఇప్పటికిని టీ.వీ అనే మాంత్రికుడు ఆడించినట్టుగా ఆడే వాళ్ళు లేకపోలేదు.

టీ.వీ వచ్చాక మనిషి జీవితం లో వచ్చిన పెను మార్పుల గురించి చెబుతూ రచయిత ఇలా అన్నారు. కేవలం ఒకటి రెండు తరాలలో మనవ జాతి చరిత్రలో ఎపుడు లేనంతగా మనిషి ప్రత్యక్షానుభావం కంటే కూడా పరోక్షానుభావం ద్వారా ఎన్నో విషయాల గురించి తెల్సుకుంటున్నాడు. ఈ రెండిటికి తేడాను గురించి కూడా ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. చాలామంది టీ.వీ వచ్చాకనే మేము ఎన్నో విషయాలను అనుభవించగలుగుతున్నాము అని ఆనందిస్తున్నారు తప్పితే తాము చూస్తున్నది ఆ విషయం యొక్క “చిత్రం/బింబము” మాత్రమే అన్న విషయాన్ని గుర్తించట్లేదు. టీ.వీ లో ప్రకృతి అందాల బింబాన్ని చూసేసి ఆ అనుభూతితో సంతృప్తి చెందితే ఏదో ఒక నాడు ప్రకృతే పెద్ద ప్రమాదం లో పడుతుందని అభిప్రాయపడ్డారు. కొన్ని లక్షల మంది ప్రతి రోజు టీ.వీ ముందు కూర్చొని ఒక ఛానెలులో క్రికెట్టు చూసి మరో ఛానెలులో ప్రపంచ యుద్ధం గురించి వార్తలు చూసి ఏదో రక రకాల అనుభూతులు పొందుతున్నట్టుగా భ్రమపడుతున్నారే కాని నిజానికి వారంతానూ కూడా ఒక చీకటి గదిలో ఒకటే పని చేస్తున్నారు: “టీ.వీ చూడటం” అని అన్నారు.

లక్షల కోట్ల మందిని కృత్రిమ అనుభూతి ద్వారా కట్టి పడేసే సత్తా ఉన్న ఈ టీ.వీ వలన సమాజానికి ఎటువంటి లాభం కలగుతుంది అన్న విషయం మీద కూలంకషంగా చర్చించవలసిన అవసరం అప్పటిలో ఉండింది (అంటే అమెరికాలో టీ.వీ ప్రాబల్యం బాగా పెరిగిన ’60 లలో). అయితే ప్రతి వర్గము ఈ టీ.వీ అనే శక్తి తనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అని ఆలోచించింది తప్పితే దీనిలోని లోటుపాట్ల గురించి ఎవరు ఆలోచించలేదు అని వాపోయారు జెర్రీ మందర్. టీ.వీ లో ఒక్క ముప్పై క్షణాలు వేసే ప్రకటనకి ఉన్న బలమేమిటో అప్పటికే ప్రస్పుటమైందనీ, ఒక వంద పత్రిక ప్రకటనలు ఇచ్చే బదులు ఒక నాలుగు చౌరస్తాలలో గొంతు చించుకొని అరిచే బదులు హాయిగా ఒక ప్రకటన ఇస్తే చాలును కదా అని అభిప్రాయపడ సాగారట కంపెనీల వారు రాజకీయ పార్టీల వారు వగైరాలు.

టీ.వీ అనే మాధ్యమం ద్వారా ప్రజలను ఆకట్టుకొని వారిని చైతన్య పరచటం ద్వారానో లేదా అవగాహన పెంచటం ద్వారానో మార్పు తేవచ్చు అని వాదించేవారిని గురించి చెప్తూ ఇలా అన్నారు. అప్పట్లో (1971-73) కాలంలో అమెరికాలో “హొపి” అని తెగ వారికీ ప్రభుత్వంతో ఏదో తగాదా ఉండేది అట. ఇప్పటికి లాగానే మీడియా వారు కెమెరాలతో వెళ్లి ఆ తెగ వారి జీవన శైలిని చిత్రీకరిస్తూ ఒక చిన్న “న్యూస్ స్టొరీ” చేసారట. సరే ఇది ఎలా ఉంటుందో చూద్దామని రచయితా ఆ ఫలానా రోజు టీ.వీలో ఆ ఛానల్ చూసారట. కేవలం నాలుగు నిముషాలు ఆ తెగ వారి కష్టాల గురించి చూపించి వెంటనే ఒక విద్యుత్తు కంపెనీ ప్రకటన వేసి వెనువెంటనే ఒక బ్యాంకు దొంగతనం గురించి మరొక స్టొరీ వేసారట ఆ ఛానల్ వారు. అంతట జెర్రీ మందర్ గారు ఈ మాధ్యమం ద్వారా ఇంతకంటే బాగా ఈ విషయాన్నీ బహుశ ఎవరు చెప్పలేరేమో అని బాధ పడి అసలు ఈ నాలుగు నిమిషాల స్టొరీ వలన ఆ తెగ వాళ్ళ పోరాటానికి ఎం న్యాయం జరిగింది అని ఆలోచనలో పడ్డారట. అంతే కాదు ఇదే నాలుగు నిమిషాలలో ఏ కారు గురించో కొత్త టీ.వీ గురించో ప్రకటన ఇవ్వవలసి వస్తే మాత్రం భేషుగ్గా ఇవచ్చే అన్న విషయం కూడా అయన స్పురణలోకి వచిందట. ఇలా టీ.వీ అనే మాధ్యమానికి ఉన్న పరిమితుల గురించి వివరిస్తూ అది కొన్ని విషయాలు చెప్పటానికి కొన్ని వర్గాల ప్రయోజనాలకి ఇతరుల కంటే ఎక్కువగా సహాయపడగలదు అని అభిప్రాయపడ్డారు. ఇదే అధ్యాయంలో “The illusion of neutral technology” అనే భాగంలో తటస్థమైన టెక్నాలజీ అంటూ ఏది ఉండదని ఉదాహరణలతో సహా ఒక సరికొత్త వాదాన్ని వినిపించారు.

ఇదిలా ఉంటే పుస్తకంలోని అసలు అంశాలు అంటే జెర్రీ మందర్ గారి నాలుగు వాదనల గురించి వివరిస్తూ పుస్తకంలోని మిగిలిన అధ్యాయాలు సాగిపోతాయి. మొదటి వాదము/తర్కము “Mediation of experience” అంటే మనిషి కృత్రిమ పరిసరాలకు ఆధునిక యుగంలో ఎలా అలవాటు పడిపోయాడు, ప్రత్యక్షనుభుతికి ఎలా దూరం ఐపోయాడు అన్ని విషయం గురించి. ఈ దూరాన్ని టీ.వీ అన్నది మరింత వేగంగా ఎలా పెంచుతోంది అన్నది వివరించటం ఈ అధ్యాయం ముఖ్యోద్దేశం. ఆధునిక నగర జీవనం లో ని కృత్రిమ ప్రపంచం గురించి చెబుతూ ఇలా అన్నారు. “In three generations since edison we have become creatures of light alone” అని. నిజమే కదా!

టీ.వీ అనే ఈ మాధ్యమాన్ని చాలా కొద్ది కంపెనీలు ఎలా తమ గుప్పెట్లో పెట్టుకున్నాయో వివరిస్తూ రాసినది “The colonization of experience” అన్న అధ్యాయం. ఆ అధ్యాయం తన అడ్వర్టైజింగ్ అనుభవాన్ని అంతా రంగరించి రాసారు అన్నది స్పష్టం. ఇందులో పెట్టుబడిదారు వ్యవస్థకు వ్యతిరేకంగా కొన్ని వాక్యాలు ఉన్నాయి అవి కొంచెం కటువుగా ఉన్నట్టుగా అనిపించింది. ఈ అధ్యాయంలో నన్ను ఎంతగానో ఆలోచింపజేసిన “The inherent need to create need” అన్న భాగానికి లంకె ఇది. ఇలా మనలో లేని పోనీ అవసరాలను సృష్టించే ఒక వ్యవస్థ అవసరమని ఆ వ్యవస్థ పేరే అడ్వర్టైజింగ్ అనీ అది వృద్ధి చెందటానికి టీ.వీని మించిన యంత్రము లేదనీ అభిప్రాయ పడ్డారు ఈ అధ్యాయంలో. ఈ విషయాన్ని ఎన్నో గణాంకాలతో విశ్లేషించారు. టీ.వీ ప్రకటనలలో ఏ కంపెనీలు ఎంత వెచ్చిస్తున్నాయి వీటిలో అతి పెద్ద కంపెనీల శాతం ఎంత ఇటువంటివి అనమాట. అంటే అధిక ధన బలం గల పెట్టుబడి దారులు అప్పటి అమెరికన్ టీ.వీ మాధ్యమాన్ని ఎలా శాసించారో చెప్పారు. ఇప్పటి మన స్థితిగతులకు మనం అది అన్వయించుకోవచ్చు. మన కాలంలో ప్రకటనల ద్వారా వచ్చే డబ్బు ప్రాముఖ్యతను తెల్పుతూ, అంతర్జాలం లో గూగుల్ వంటి కంపెనీలకు కావాల్సింది వినియోగదారుడి డబ్బు కాదు అతని సమయం అనీ మరియు మనమంతా ఫేసుబుక్కు వాడుకదారులం కాము, పై పెచ్చు ఫేసుబుక్కు కంపెనీలకి అమ్మే ప్రొడక్టులమనీ వాదించేవారు కూడా లేకపోలేదు!

అటు తర్వాత టీ.వీ వీక్షణ వలన మానసిక శారిరిక ఆరోగ్యానికి కలిగే హాని గురించి గురించి చర్చిస్తూ మరొక అధ్యాయం. చివరాఖరిగా ఆ మాధ్యమంలో స్వతహాగా ఉండే పక్షపాతాల (Inherent Biases) గురించి ఒక అధ్యాయం.

370 పేజీలు టీ.వీని సహేతుకంగా విమర్శిస్తూ ఎక్కడా శ్రుతి మించకుండా తార్కిక విశ్లేషణతో రాసిన పుస్తకం ఇది. అయితే ఇది చదివి ప్రపంచం ఎమన్నా టీ.వీ చూడటం మానేసిందా అంటే లేదనే చెప్పాలి. అప్పటి అమెరికన్ సమాజంలో ఒక చిన్న సైజు దుమారమే రేగిందట ఈ పుస్తకం పై. ఇప్పటికి చాలా మంది యాక్టివిస్టులు ఈ పుస్తకాన్ని గురించి అడపాదడపా రాస్తూనే ఉన్నారు. నాకూ అలానే తెల్సింది మరి! ఈ జాతి యాక్టివిస్టులను “నియో-లుడ్డైటులు” అందురట. వీరిలో కొందరు కంప్యుటరు గురించి అంతర్జాలం గురించి కూడా ఇటువంటి భావనలే కలిగి ఉన్నారట. ఆ పుస్తకములు చదివిన మీదట వీలు చూసుకొని వాటి గురించి కూడా పుస్తకం.నెట్ కు పరిచయటం రాయటానికి ప్రయత్నిస్తాను.

You Might Also Like

One Comment

  1. SIVARAMAPRASAD KAPPAGANTU

    నేను నా బ్లాగులో అనేక సార్లు, వ్యాపార ప్రకటనా కాలుష్యం గురించి వ్రాశాను. తాను ప్రకటనా రంగంలో పనిచేసి, ఆ విషయంలో ఆయన వ్రాసిన విషయాలు మీ ద్వారా తెలిసి సంతోషించాను. దొరికితే ఈ పుస్తకం చదవాలి.

    మీరు పుస్తక పరిచయం చేశే శైలి చాలా బాగున్నది. You are not putting off the reader by exhibiting holier than thou attitude (not even unconsciously). Thank you for that trait.

Leave a Reply