రవీంద్రుని క్రిసెంట్ మూన్
వ్యాసం రాసి పంపినవారు: బొల్లోజు బాబా
Crescent Moon అనే వచన గీతాల సంకలనం 1903 లో రవీంద్రనాధ్ టాగోర్ రచించిన “శిశు అనే బెంగాలీ రచనకు స్వీయ ఇంగ్లీషు అనువాదం.
ఈ గీతాలలో టాగోర్ ఒక అద్భుతమైన చిన్నారి ప్రపంచాన్ని సృష్టించి అనేక పాత్రల్ని అందులో సంచరింపచేస్తాడు. ఒక్కో గీతం చదువుతూంటే మన బాల్యమో లేక మనకు తటస్థించే చిన్నారుల చేష్టలో మదిలో మెదులుతాయి. గీతాంజలి, గార్డెనర్, స్ట్రే బర్డ్స్ లలో కనిపించే అధ్యాత్మిక ప్రతీకలు, అలౌకిక మార్మికతలు క్రిసెంట్ మూన్ లో కనిపించవు. అయినప్పటికీ ఈ గీతాలు ఎన్నో లోతైన ఆలోచనల్ని కలిగిస్తాయి. పెద్దలుగా మనమేం కోల్పోతున్నామో, ఎలా జీవించలేకపోతున్నామో చెపుతున్నట్లుగా అనిపిస్తాయి.
ఒక చిన్నపిల్లాడు ఈ లోకాన్ని ఎలా దర్శిస్తాడో, అంతే సరళంగా, స్వచ్ఛంగా, ఈ గీతాలన్నీ ఉంటాయి.
మాతృప్రేమ, అమాయకత్వం, మంచితనం, అల్లరి, జాలి, సంతోషాలు, ఆటలు, సాహసాలు వంటివి ఒక్కోగీతంలోంచి తొంగిచూస్తూ చదువరిని జ్ఞాపకాల సరస్సులలో ఈదులాడిస్తాయి.
ఈ సంకలనం లోని కొన్ని గీతాలనుంచి కొన్ని వాక్యాలు………
పిసినారి సాయింసంధ్య తన స్వర్ణ వర్ణాలను వెనక్కి తీసేసుకొంటున్నవేళ,
ఆ మైదానపు మార్గాన ఏకాకినై నేను సాగుతున్నాను. //
ఉన్నట్టుండి ఒక పిల్లగాని కీచు స్వరం గాలిలోకి లేచింది.
ఆ సాయింత్రపు నిశ్శబ్ధంలోకి తన పాట జాడను విడిచి
అగుపించని చీకట్లలోకి వాడు కనుమరుగయ్యాడు. (THE HOME)
ఆంటూ ఈ గీతమాలిక మొదలౌతుంది. ఆపిల్లగాని స్వరమే మన చిన్ననాటి జ్ఞాపకాలు. వాటినే కవి తన గీతాల ద్వారా మనకందిస్తున్నాడు.
పిల్లలు ఈ లోకంలో జరిగే వివిధ కపటాలు, మోసాలకు అతీతులు. తిలక్ అన్నటువంటి “అకలుషిత దినాలు ” లో వారు విహరిస్తూంటారు. సాగరతీరంలో ఆటలాడుకొనే బాలలను ఉద్దేశించి టాగోర్ ఇలా అంటాడు.
వీరికి ఈతలు రావు, వలలు వేయటమూ తెలియదు.
గజఈతగాళ్ళు ముత్యాలను శోధిస్తూంటారు.
ఓడల్లో వ్యాపారం జరుగుతూంటుంది.
పిల్లగాండ్రు మాత్రం గులకరాళ్ళను సేకరించి మరలా విసిరేస్తూంటారు.
గుప్త సంపదకై ఆరాటపడరు. ఉచ్చులు వేయటం రాదు.
(ON THE SEASHORE : ఇదే గీతం గీతాంజలి లో కూడా ఉంటుంది)
చిన్నపిల్లలు ఈ భూమిపైకి అరుదెంచిన దేవతల మారురూపాలేనన్న విషయం, వారు అలా రావటానికి కారణం మాతృప్రేమే నన్న సంగతి, ఓ గీతంలో చాలా హృద్యంగా చెపుతారు టాగోర్.
శిశువు తలచుకొంటే ఈ క్షణమే స్వర్గానికి ఎగురుకుంటూ పోగలడు.
మనలను విడువకపోవటం మరెందుకోకాదు.
తల్లి చనవులపై తలాన్చి పరుండటం తనకెంతో ఇష్టం కనుక. (Baby’s way)
పిల్లలు కావాలి అనుకుంటూ ఎన్నో రకాలుగా ప్రార్ధనలు చేస్తున్నవారిని కాదని, తననే తల్లిగా ఎంచుకొన్న శిశువు పట్ల ఆ తల్లికి ఉండే కృతజ్ఞత ఎన్నటికీ తరగనిది. అలా తను తల్లినవ్వటం ఒక అదృష్టంగానూ, ఒక అద్భుత ఇంద్రజాలం గానూ ఆ తల్లి భావించటం ఒక గొప్ప ఊహ.
నిన్నలా తేరిపార చూస్తే రహస్యమేదో ముంచెత్తుతుంది. అందరకూ చెందిన నీవు నాకే సొంతమైనావు.
ఏ ఇంద్రజాలం నా దుర్భల చేతులలో ఇంతటి భువనైక సౌందర్యాన్ని బంధించగలదు? (The Beginning)
ప్రకృతి అందాలన్నీ చిన్నారి శిశువులోనే ఉన్నాయన్న విషయాన్ని ఎంతో హృద్యంగా ఓ కవితలో టాగోర్ ఇలా చెప్తారు
ఎంతటి సంతసం ఆకాశం నుండి ఉదయకాంతిలో ప్రవహిస్తున్నదో,
నా దేహానికి వేసవి తెమ్మెర ఎంతటి హాయినిస్తుందో,
నిన్ను నవ్వించటానికి నీ మోమును ముద్దిడినపుడు తెలిసింది. (WHEN AND WHY)
చిన్న పిల్లల మాటలు తర్కానికతీతంగా ఉండి ఒక్కోసారి ఆశ్చర్యంతో నవ్వుతెప్పిస్తూంటాయి.
వాటికి సమాధానం చెప్పటం సాధ్యపడదు. అలాంటి సందర్భం, చందమామను పట్టి తెమ్మని కోరిన ఓ చెల్లి కీ అన్నకు మధ్య ఏర్పడుతుంది. చందమామను చాలా పెద్దదిగా ఉంటుంది దానిని పట్టుకోలేవే ఓసి పిచ్చిమొద్దా అన్న ఆ అన్న మాటకు చెల్లెలిచ్చిన సమాధానం ఇది:
“అన్నయ్యా నీకు బడిలో అర్ధంలేని విషయాలేవో చెపుతున్నారు.
అమ్మ మనల్ని ముద్దిడ వంగినపుడు ఆమె మోము చాలా పెద్దదిగా ఉంటుందా?(THE ASTRONOMER)
టాగోర్ ప్రకృతి వర్ణనలు, ఒక అద్భుతమైన వర్ణ చిత్రంలా మనకళ్లముందా దృశ్యాన్ని కనిపింపచేస్తూ, మనమూ అక్కడే సంచరిస్తున్న భావనని కలిగిస్తూంటాయి. తుఫాను సమయంలో పిల్లవానిని బయటతిరగొద్దు అని హెచ్చరిస్తున్న తల్లి మాటలను ఓ గీతంలో టాగోర్ ఇలా వర్ణిస్తాడు.
అంధకారణ్యపుటంచుల చుట్టూ కారుమబ్బులు కమ్ముకొంటున్నాయి.
ఓయ్ పిల్లవాడా బయటకు వెళ్లకు.చెరువు పక్కనున్న తాటి వరుసలు తమ తలల్ని నింగిపై బాదుకొంటున్నాయి,
తడిచిన రెక్కలతో కాకులు, చింతకొమ్మల మధ్య నిశ్శబ్ధంగా ఉన్నాయి.
తూరుపు రేవులో పెంజీకట్లు సంచరిస్తున్నాయి.
కంచె వద్ద ఆవు బెదురుతో అరుస్తోంది.
బాబూ, నేను దాన్ని పాకలోకి తీసుకు వచ్చేవరకూ ఇక్కడే ఉండే. (The Rainy Day)
పిల్లలకు కాగితపు పడవల్ని నీటిలో ఒదలటం ఒక ఆట. ఇది అందరూ బాల్యంలో చేసిన ఒక పనే. కానీ ఆకాశంలో మబ్బులనే కాగితపు పడవలను, నా పడవలతో పోటీ పడటానికై ఎవరో నాచెలికాడు వదులుతున్నట్లున్నారనటం ఒక్క టాగోర్ అవధులులేని కల్పనా శక్తికే సాధ్యమౌతుంది.
నా పడవలను నీటిపై వదిలి అలా ఆకాశం వైపు చూస్తాను.
అక్కడ చిట్టి మేఘాలు తమ తెల్లటి తెరచాపల్ని విప్పుకొని కనిపిస్తాయి.నా పడవలతో పోటీ పడటానికై వాటిని ఆకాశంలోకి ,
ఏ, నా చెలికాడు వదులుతున్నాడో నాకు తెలియదు. (PAPER BOATS)
పూవులు ఎంతైతే అందంగా ఉండి ఆహ్లాదపరుస్తాయో అంతే వేగంగా నశించిపోతాయి. ఇది ఒక సత్యం. ఇదే విషయాన్ని ఒక బాలుని దృక్కోణంలోంచి టాగోర్ ఇలా చెప్పిస్తారు.
ఎవరికీ తెలియని చోటులనుండి అకస్మాత్తుగా బయటకు వచ్చిన సుమ సమూహాలు
పచ్చికపై వెర్రి ఆనందంతో నాట్యం చేస్తున్నాయి.
తారలు వసించే ఆ గగనమే వాని స్వస్థలమని నీకు తెలుసా అమ్మా?
అక్కడకు వెళ్లిపోవటానికి అవెంత ఆత్రపడతాయో నీవు చూడలేదా?
అవి ఎందుకంత తొందర పడతాయో నీకు తెలియదా, అమ్మా?
అవి ఎవరికొరకై తమ చేతుల్ని చాచుతున్నాయో నేనూహించగలను.
నాకు అమ్మ ఉన్నట్లు గానే వాటికీ ఒకరున్నారు, అక్కడ.(THE FLOWER-SCHOOL)
మరణించిన చిన్నారి గురించి గుండెల్ని పిండేసే ఒక గీతం ఉంటుంది. అది ఇలా మొదలౌతుంది.
అమ్మా!
వేళయింది. నేను వెళిపోతున్నాను.
ఒంటరి ఉదయపు చీకట్లు పాలిపోతున్న సమయాన, నీవు చేతులు సారించి
నీ చిన్నారికై నిదురలో తడుముకొని “పాపాయి ఇక్కడ లేదేమి ” అనుకొనేవు. (THE END)
బాల్యం ఎవరికైనా ఒక గొప్ప స్వప్నం వంటిదే. ఎప్పుడైతే పెద్దవాళ్లమైపోతామో ఇక బాల్యపు జ్ఞాపకాలన్నీ అప్పుడప్పుడూ మనసులో మల్లెల వాసనలా గుప్పుమంటూనే ఉంటాయి. దానినే టాగోర్ ఇలా చెపుతారు. (THE FIRST JASMINES)
నా జీవితంలో ఎన్నో సంతస దినాలు పరిమళించాయి.
ఎన్నో వసంతోత్సవ రాత్రులని మిత్రులతో కూడి హసించాను.
వాన ముసిరిన ఉదయాల్లో , ఎన్నో వృధా గీతాలు పాడుకొన్నాను.
ప్రేమతో అల్లిన, సాయింకాల పొగడ పూల మాలలనెన్నో మెడలో ధరించాను.
అయినప్పటికీ,
నా బాల్యపు చేతిలో మొదటిసారిగా నేనింపుకొన్న తెల్లని మల్లెపూల జ్ఞాపకం ఇంకా తీయగానే ఉంది.
తాను పెద్దయ్యాకా రేవుబోయిని , తోటమాలి, కాపలాదారుడుని, గాజులమ్మే అబ్బాయిని, నాన్నంత మనిషి ని అవ్వాలని వివిధ గీతాలలో చెప్పటం జరుగుతుంది. ఆయా ఊహలు ఎంతో చక్కగా ఆయా గీతాలలో అమరిపోయి ఒక నిష్కల్మష హృదయాన్ని మనముందు పరచుతాయి.
బాల్యంలో స్వేచ్ఛగా విహరించే ఆలోచనలను, టాగోర్ ఒడిసిపట్టుకొని ఈ గీతాలలో నింపాడా అన్నంత ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కోసారి ఈ గీతాలలోని చిన్నారుల ద్వారా మరో కొత్తజీవితాన్ని టాగోర్ మనకు సూచిస్తున్నాడా అని కూడా అనిపించక మానదు. అలాంటి అద్భుత విశాల ప్రపంచాన్ని సొంతం చేసుకొన్న చిన్నారులపట్ల కించిత్ అసూయ కూడా కలుగుతుంది.
ప్రోజెక్ట్ గుటెన్ బెర్గ్ ఆర్చైవులలో క్రెసెంట్ మూన్ లభించే లింక్ ఇది.
http://www.gutenberg.org/etext/6520
టాగోర్ స్ట్రే బర్డ్స్ తెలుగు అనువాదం ఇక్కడ చూడవచ్చు.
http://www.scribd.com/doc/9674265/Tagore-Stray-Birds-Telugu-Translation
ఉష
మీకు కరతలామలకమైన అనువాదపు కళ ఇది. అభినందనలు. పూర్తి అనువాదాలకై ప్రతీక్షిస్తూ..
మాలతి
మంచి పరిచయం చేశారు బుల్లోజుబాబా, తమకి అలవాటయిన కమ్మనితెలుగుఅనువాదాలతో.ధన్యవాదాలు.
రవి
(నెలవంక) చంద్రుణ్ణి గురించి చెప్పటానికి సూర్యుడి(రవీంద్రుడి)కన్నా వేరెవరున్నారు? సూర్యుడి వెలుగే కదా, నెలవంక ప్రతిఫలించేది!
అనువాదాలు చాలా బావున్నాయి. ధన్యవాదాలు.