రెండు తురగా జానకీరాణి పుస్తకాలు

రాసి పంపిన వారు: మాలతి నిడదవోలు (thulika.net)
1. మాతాతయ్య చలం (వ్యాసం), 2. చేతకాని నటి (కవితలు)

50, 60 దశకాల్లో ప్రసిద్ధులయిన రచయిత్రులలో తురగా జానకీరాణి ఒకరు. తిరుగుబాటు రచయితగా పేరొందిన గుడిపాటి వెంకటచలం చెల్లెలి మనుమరాలు. ప్రముఖజర్నలిస్టు తురగా కృష్ణమోహనరావు గారి ఇల్లాలు. పైరెండు పుస్తకాలూ నేను ఒకేవ్యాసంలో పరిచయం చెయ్యడానికి కారణం వుంది.

జానకీరాణిని నేను 2002లో కలుసుకున్నాను. ఇంటర్వూకోసం మా అన్నయ్యతో వారింటికి వెళ్లేను. నేను వెళ్లేవేళకి ఆవిడ ఇంట్లో లేరు. మరోపావుగంటకి కాబోలు హడావుడి పడుతూ వచ్చేరు. అత్యవసరపనిమీద బయటికి వెళ్లవలసివచ్చిందని చెప్పి కబుర్లకి సిద్ధం అయేరు.

అదే తొలిసారి నేను ఆమెని చూడడం. భారీమనిషి కాదు కానీ కళగల ముఖం, కంచుకంఠం. నేను చాలా ఇంటర్వూలే చేసేను కానీ అంత స్పష్టంగా, అంత ధృఢమైన నమ్మికతో తన అభిప్రాయాలు వ్యక్తం చేసినవారు చాలా తక్కువ. నాకు చాలా తృప్తినిచ్చిన బహుకొద్ది ఇంటర్వూలలో అది ఒకటి. అక్కడ వున్నది నేనూ, మా అన్నయ్యా – ఇద్దరమే అయినా, ఆలిండియా రేడియోలో మాట్లాడుతున్నంత ఉద్వేగంతో ఆమె చెప్తూంటే నేను టేపు రికార్ఢరు ఆన్ చేసి, ఆశ్చర్యంగా ఆమెవేపు చూస్తూ కూర్చున్నాను. ఆమె అభిప్రాయాలన్నిటితోనూ నేను ఏకీభవించలేను కానీ ఆమె వెల్లడి చేసిన తీరు మాత్రం తప్పకుండా గౌరవిస్తాను. నా ఇంటర్వూ అనువాదం తూలిక.నెట్‌లో చూడవచ్చు.

tatayya1“మాతాతయ్య చలం”లో జానకీరాణి తనకి ఆయనతో ఏర్పడిన అనుబంధం ఎంత విలక్షణమయినదో స్పష్టం చేశారు. ఇది గమనార్హం. ఎందుకంటే ఆరోజుల్లో చలం గడించిన దుష్కీర్తి మూలంగా ఆయనంటే వారి కుటుంబంలో చాలామందికి పడదు. సాంప్రదాయవాదులమీద తిరుగుబాటు ప్రకటించిన చలం ఒకపక్కా, పరమ ఛాందసుడయిన మరో తాతయ్య (మాతామహుడు, చలం బావమరిది, దుల్ల పట్టాభిరామయ్య) మరో పక్కా జానకీరాణికి మనసంస్కృతిలోని పరస్పర వ్యతిరేకాలయిన సిద్ధాంతాలని అర్థం చేసుకోడానికి తోడ్పడ్డారు. ఆవిధంగా ఆమెకి రెండు సాంప్రదాయాలు తూచి చూసుకోడానికీ, తన వ్యక్తిత్వం రూపొందించుకోడానికీ అవకాశం దొరికింది. ఆ సిద్ధాంతాలపరవడిలో పడి కొట్టుకుపోకుండా, నిలదొక్కుకుని తనకి ప్రత్యేకమయిన వ్యక్తిత్వాన్ని సంతరించుకుని రచయిత్రిగా రాణించిన తెలుగుమహిళ జానకీరాణి.

ఈ పుస్తకంలో తనకి చలం స్వదస్తూరీతో రాసిన వుత్తరాలూ, ఆయనకి ఆమెయందు గల అభిమానంతో పాటు, ఆయనధోరణినీ, వాదాలనీ తాను తీవ్రంగా ప్రశ్నించిన సన్నివేశాలు కూడా పొందుపరిచారు. జానకీరాణి ఈపుస్తకం రాయడానికి ముఖ్యకారణం పాఠకులకీ, చలం అభిమానులకీ, ఆయన్ని గర్హించేవారికీ కూడా తన సందేశం అందించడం అంటున్నారామె. ఆమె సందేశం – చలాన్ని అర్థం చేసుకోవాలంటే, ఆయన్నీ, ఆయన బోధలనీ నెత్తిన పెట్టుకోడమే కాదు, ఆయనలో ఏవి లోపాలు అనుకుంటున్నారో వాటిని కూడా సూక్ష్మదృష్టితో పరిశీలించి వాటినేపథ్యాన్ని కూడా గమనికలోకి తీసుకున్నప్పుడే ఆయనని సంపూర్ణంగా అర్థం చేసుకోడం సాధ్యం అంటారు.

ఒకప్పుడు తిరుగుబాటు ప్రదర్శించిన చలం చివరిరోజుల్లో ఈశ్వరసేవలో మునిగిపోవడం. తన భార్యా, పిల్లలజీవితాలు అస్తవ్యస్తమవడంలో ఆయన పాత్ర – ఇవి చలాన్ని విమర్శించేవారు పదే పదే ఎత్తిచూపుతారు. జానకీరాణి ఈవిషయాన్ని సంపూర్ణచిత్రంలో ఒక భాగంగా అంగీకరించమంటారు.

ఈపుస్తకం చదివితరవాత నాకు కలిగిన అభిప్రాయం బహుశా జానకీరాణి ఆమోదించకపోవచ్చు. నామటుకు నాకు ఆమె “తాతయ్య అందరిలాగే మొత్తం మానవాళిలో ఒక మానవుడు” అంటున్నట్టు అనిపిస్తోంది. విస్తృతపరిధిలో ఆలోచిస్తే మానవజీవితం శైశవం, బాల్యం, కౌమార్యం, యౌవనం, వార్థక్యం – ఇలా ఒక క్రమంలో సాగిపోతుంది కదా. పుట్టడంనించీ గిట్టేవరకూ ప్రయాణం ఇది. ఇందులో అమాయకత్వం, కౌతుకం, ప్రయోగం, అనుభవం, అనుభూతి, చివరికి నిర్మోహంతో కూడిన ముగింపు – ఇవన్నీ ప్రతిఒక్కరిజీవితంలోనూ ఆవిష్కృతమయే స్థాయీబేధాలు. అందుకే చలాన్ని “అప్పుడలా ఎందుకు రాసేవు?” అని అడిగితే, “అప్పుడలా అనిపించింది.” అంటారాయన. “ఇప్పుడీ వైరాగ్యం ఏమిటి?” అంటే “ఇప్పుడు ఇలా అనిపిస్తోంది” అంటారు ఆయనే. ఇది జీవనసత్యం.

రచయిత్రి చివరలో “ఎందుకింత దీర్ఘంగా రాస్తున్నానంటే చలం పేరు మీద, కలుసుకుంటూ, పిచిక, నెమలి .. చలం చూట్టూ వున్న పరిసరాలు, వాటిలో నవ్యత … పదే పదే చెప్పుకొంటున్న భక్తులందరూ, మరో మాటలో ఉన్మాదులందరూ – గుర్తించవలసినది ఒకటుంది. ఆ రొమాన్సును మించి, ఆయన తత్త్వం, సిద్ధాంతం, భోధన, జీవనశైలీ వున్నాయి” అంటూ వాటిని గుర్తించి, వాటిని తమకి అన్వయించుకునేముందు ఆత్మవివేచన చేసుకోవాలి అంటారు ఆమె.

తాతయ్యని తాను అర్థం చేసుకున్నానని ప్రగాఢంగా నమ్మిన ఈ రచయిత్రి చివరలో “ఆయన ప్రేమని కిందు చేసి, నానామాటలూ అంటున్నందుకు” క్షమించమనడంలో ఔచిత్యం వుందా అని ప్రశ్నించుకుని, నాకు నేను చెప్పుకున్న సమాధానం – అది మనరక్తంలో జీర్ణించుకుపోయిన సాంప్రదాయపు ఛాయ అని. వినయం ఒక వైయక్తిక విలువ. “అప్పుడలా అనిపించింది” “ఇప్పుడు ఇలా అనిపిస్తోంది” అన్న చలం మాటలే ఆమె తనకి తాను అన్వయించుకుని వుంటే, ఆనాడు తాను ఆప్రశ్నలు వేయబట్టే, ఆజవాబులు రాబట్టగలిగారు అని అనుకోడానికి వీలుంది కదా. ఆ జవాబులు పొందబట్టే ఇప్పుడు ఈ సదసద్వివేచనకి నాంది పలికింది అని కూడా తోస్తోంది నాకు. ఇప్పుడు చలం వుండి వుంటే, “క్షమించు తాతయ్యా” అని ఈ మనుమరాలు అని వుంటే, ఆయన జవాబు ఏమిటి అయివుండేది? ఇలాటి చర్చ కేవలం తిలకాష్ఠబంధనమేమో!

tjrani_001తురగా కృష్ణమోహనరావుతో జానకీరాణి వివాహానికి పెద్దలు అభ్యంతరం చెప్పినా పెళ్లి జరిగింది, చలం ప్రోత్సాహించారు. 16 సంవత్సరాల సాంసారికజీవనం ఆకస్మికంగా ఘోరమైన రైలుప్రమాదంతో తల్లకిందులపోయింది. అప్పటికి అమ్మాయిలిద్దరు చిన్నవాళ్లు. వాళ్లకి ఎలా చెప్పడం “అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు?” అంటే? ఎవరినయినా పట్టి కుదిపివేయగల ఈ దుర్భరవేదనని అక్షరగతం చేసారు జానకీరాణి “చేతకాని నటి” అన్న కవితాసంపుటిలో.

ఈశీర్షికలో “చేతకాని” అన్నది కేవలం దుఃఖాతిశయంతో అన్నదే కానీ జానకీరాణి “చేతకాని” వ్యక్తి కారు. నాలుగు నిముషాలపాటు రంగస్థలంమీద ఏవో భావాలు నటించేసి తనపని అయిపోయిందనుకునే “నటి” అసలే కారు. క్షణాలమీద ఒక రైలుప్రమాదం కారణంగా తారుమారయిన తనజీవితాన్ని అందిపుచ్చుకుని, తనవ్యధని తనలోనే దాచుకుని, ఇద్దరు పసివాళ్ల ఆలనా పాలనా చూసుకుంటూ, సాహిత్యసేవ కొనసాగిస్తున్న సిసలు తెలుగునారి ఆమె. ఆమెని వక్తగా పిలిస్తే హాలు కిటకిటలాడిపోతుందిట శ్రోతలతో.

“నాన్న వచ్చాక కంచం పెట్టాలా?” అని అడిగిన చిన్నారిప్రశ్నతో

“గిర్రున కడుపులో చిచ్చు సుడులై తిరిగి కన్నీరు

చూపు దానిని మూయగా, లెక్క తెలియక

ఒకటి తక్కువగా అన్ని కంచాలు పెట్టేశాను”

అన్నప్పటి వ్యథ,

నువ్విక్కడికి ఎప్పుడొస్తావు?” అంటూ వుత్తరం వచ్చిందిట. దానికి సుదీర్ఘమయిన జవాబు

“వస్తాను .. కానీ త్వరగా వద్దామంటే కుదరడం లేదు” అంటారు. కారణం “ఎన్నో పనులు”, “జంట కలువలు రెండు కంటికగుపించాయి”. “ఇవి ముద్దుగా, ఏపుగా ఎదిగేదెప్పుడో”, … అంతవరకూ వేచివుండాలి. ఇవీ మనకి నిత్యం ఎదురయ్యే కటికసత్యాలు.

“ఈ స్టేషనులో నేనెంత పెద్ద జబ్బు పడ్డానో చూశారా?”

చూడ్డానికి వీలేదీ? దొరకని రైలెక్కి మీరు

వెళ్లిపోయారుగా?”

అంటూ వేదన పడి, పడి, ఆకాశవాణిమీద తన కసి వెళ్లబోసుకుంటారు. ఆకాశవాణిలో చాలాకాలం ఉద్యోగి అయిన ఈ రచయిత్రికి ఆ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో ఒకరకమయిన కృతకధోరణి కూడా స్ఫురించడంలో ఆశ్చర్యంలేదు. అందుకే దాన్ని రాకాసివాణి అంటారు.

“నాది పాతకలమే కదా అని”, “కాఫీ కొంచెమే వుందండీ”, “నిన్ననే పౌర్ణమి వెళ్లిందని మరిచి” వంటి అర్థవంతమయిన శీర్షికలతో 18 కవితలూ చిన్నవే అయినా చెప్పలేనంత బరువుని నింపుకున్న వేదనాశకలాలు వున్నాయి ఈ చిన్నిపుస్తకంలో. ప్రతి కవితకీ అనుబంధంగా జతపరిచిన చిత్రం (family albumనించి) ఆ కవితలో భావుకతని ఘనతరం చేసి, పాఠకుల మనసులమీద బలమైన ముద్ర వేస్తుంది.

నటి అన్నపదం ఆమె బహుశా భరతనాట్యం నేర్చిననాటి స్ఫూర్తి కావచ్చు. “జీవితం నాటకం, మనమందరం నటీనటులం” అన్న విస్తృతార్థంలో కావచ్చు. ఈరెండో అర్థంలో ఆలోచిస్తే, సాధారణంగా ప్రతిభాశాలి అయిన నటుడు తాను తనపాత్ర ఎంతో సమర్థవంతంగా నిర్వహించినతరవాత కూడా, ఇంకా బాగా చెయ్యగలనేమో అనుకుంటూ రవంత చింతించక మానడు. రచయిత్రి ఈ పుస్తకంలో అదేవిధమయిన సందేహమో, అనుభూతో వ్యక్తం చేస్తున్నారేమో అనిపించింది నాకు.

ఇప్పుడు చెప్తాను రెండు పుస్తకాలు ఒకే వ్యాసంలో పొదగడానికి కారణం. మొదటిపుస్తకం చదివిన తరవాత, నాకు చలంగురించి కంటే జానకీరాణిగురించే ఎక్కువ తెలిసింది. ఎవరీవిడ?, ఈమె విద్యావ్యాసంగం ఎటువంటిది? తనకుటుంబంవారిలో ఎవరితో ఎటివంటి సాన్నిహిత్యం వుంది? ఆమెలోని ఏ ఆలోచనాధోరణికి ఎవరు కారకులు? – ఇలాటి విషయాలు ఎన్నో తెలుస్తాయి మనకి “మాతాతయ్య చలం” చదివితే.

రెండో పుస్తకం, “చేతకాని నటి”లో ఆమెకి భర్త, ఆప్తమిత్రుడు అయిన కృష్ణమోహనరావుతో గల సాన్నిహిత్యం, మానసికంగా ఆమె ఎదుగుదల, బలమైన వ్యక్తిత్వం దృగ్గోచరమవుతాయి. పదహారు సంవత్సరాలపాటు ఎంత చక్కని బాంధవ్యం వారిద్దరూ కలసి సంతరించుకున్నారో తెలుస్తుంది. జానకీరాణివ్యక్తిత్వం రూపు కట్టడానికీ, అందుకు కారకులయిన వ్యక్తులకీ ఈ రెండు పుస్తకాలూ అద్భుతమయిన అద్దం పడుతాయి.

ఆరున్నరేళ్లక్రితం ఆమె నాకు ఈరెండు పుస్తకాలూ ఇచ్చేరు ఆప్యాయంగా. వాటినిగురించి రాసే అవకాశం నాకు ఇప్పుడొచ్చింది. ఇప్పటికయినా రాయగలిగేనని తృప్తి నాకు.

పుస్తకాల వివరాలు.

1. మా తాతయ్య చలం

67 పేజీలు. 50 రూపాయలు.

ప్రచురణః 2002

2. చేతకాని నటి

43 పేజీలు. 40 రూపాయలు.

ప్రచురణః 2002

ప్రత్యూష ప్రచురణలు

29 జర్నలిస్ట్స్ కాలనీ, రోడ్ నెంబర్ 3

బంజారా హిల్స్, హైదరాబాదు 500 034

ఫోన్. 335 1153. సెల్. 98851 51153

(పుస్తకం.నెట్‌లో చూశాం అని చెప్పడం మర్చిపోకండి. ఇది స్వంతంగా ప్రచురించుకున్నవారికి ఆనందదాయకం. మనం వారికి చెయ్యగల చిన్ని సేవ లేదా ప్రోత్సాహం అనుకోండి.)

You Might Also Like

16 Comments

  1. IVATURY SIVAKUMAR(sahithi sasi)

    చాలా సంతోషం కలిగింది మాలతి గారు… ఇవ్వేళ యాదృచ్ఛికంగా స్త్రీ వాద మహాకవి గుడిపాటి వేంకట చలం గారి జీవితాన్ని చదవటం (WIKIPEDIA SOUJANYANTHO) అక్కడినుండి మీ అభిప్రాయ మాలిక (తురగా జానకి రాణి గారితో మీరు చేసిన ఇంటర్వ్యూ వివరాలు) పరిశీలించడం ఎంతో ఆనందం కలిగించాయి. మాటల్లో చెప్పలేని అనుభూతి ఇది… (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వృత్తి పరంగా నేను అందించవలసిన కొంత ఉమెన్స్ డే కాపీ , కొన్ని ప్రాధాన్యతా వాక్యాలను కూర్చుకునే పనిలో భాగంగా) చలం గారి గురించిన ముఖ్య విషయాలను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకోవటం సంభవించింది. నా చిన్నప్పుడే మ్యూజింగ్స్ , బ్రాహ్మణీకం వంటి కొన్ని చలం గారి నవలలు చదవటం జరిగింది. ఎప్పటికప్పుడు ఇంకా మరింతగా తెలుసుకోవాలనిపించే అతి అరుదైన గొప్ప నవలా రచయితలలో ‘జి.వి . చలం’ గారే ముందువరుసలో వుంటారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మాలతి గారు… ధన్యవాదాలతో సాహితీ శశి, (శివకుమార్ ఇవటూరి) (అందునా మరో విషయం, అల్ ఇండియా రేడియో – విజయవాడ లో కొద్ది కాలం పాటు (ఒక సంవత్సరానికి పైగానే-2000-2001) యువవాణి విభాగం తరపున కాజువల్ కాంపీరర్ గా పని చేయటం నా అదృష్టం)

  2. మహిళావరణం-8 « sowmyawrites ….

    […] గారు రాసిన సమీక్ష పుస్తకం.నెట్లో ఇక్కడ […]

  3. dr.gudiseva vishnu prasad

    నేను చేసిన ‘దివిసీమ కవులు సాహిత్యసేవ ‘అన్న పరిశోథనలో తురగా జానకీరాణిగారు దివిసీమ రచయితగా పరిచయం చేశాను. డా//.గుడిసేవ9441149608

  4. leo

    Can someone please update the article with this interview link – http://thulika.net/2004April/TJinterview.html

    Malathi garu thanks for introducing the books and the interview.

  5. gudiseva vishnu prasad

    turaga janakee rani gari janmastalam diviseema loni mandapakala ayinanduku memu chalaa garvapadutuntamu.

  6. usha

    malati garu,

    thank you very much for the reviews. chaalaa nishitam gaa raasaaru. amma ni, ee pustakam rayadam lo amma uddeshyaanni baagaa artham chesukunnaru anipinchindi.

    ravi garu,

    aa numbers maaripoyayi. landline ki 2 add cheyali. amm mobile 98487 35124.

    alternate moboile: 98484 29169

    thank you

  7. ravigaru

    మాలతిగారు నన్ను రాజు ను చేసినందుకు సంతోషం, ఇంకా విషయానికి వస్తే landline నెంబర్ ని నెట్ లో చెక్ చేస్తే వారి అడ్రెస్స్ confirm అయ్యింది .వుహ వేరు వాస్తవం వేరు .నెంబర్ తిప్పి సినిమాటిక్ గా నేను అక్కయ్య గారు అప్పుడు బాలానందం లో మీ ఆధ్వర్యం లో యెంతో పేరు తెచుకున్న కొంత మంది లో ఒకన్ని అనడం కృతక్యుత్యం గా అని పిస్తుందేమో అని పించింది . అభిమానాన్ని హలో లో తెలపలేనేమో ఇన్నేళ్ళ తర్వాత అందుకే ఒక శనివారం వాళ్ళ ఇంటికి వెళ్లి వారిని , పిల్లల్ని (ఇప్పుడు పెద్దవాళ్ళు )కలిసి పలకరించడం సబబేమో అని పించింది వెళ్ళినప్పుడు మాలతి గారు మీ కుశలం అడగ మన్నారని కూడా చెపుతా .ధన్యవాదాలు .

  8. మాలతి

    రవిరాజుగారూ, జానకీరాణిగారితో మీకు చిన్నప్పుడు పరిచయం అంటే నాకు ఆనందంగా వుంది. నాకు తెలిసిన రేడియో అక్కయ్య న్యాయపతి కామేశ్వరిగారు మాత్రమే. నేనిక్కడ ఇచ్చిన సెల్ నెంబరు ఆవిడపుస్తకంలో ఇచ్చింది. అది కరెక్టు కాకపోయినా, ఆమె నెంబరు కనుక్కోడం కష్టం కాదనుకుంటాను. కలిస్తే నాతరఫున కూడా మరోసారి హలో చెప్పండి.

  9. ravigaru

    చినప్పుడు బాలానందం లో రేడియో అక్కయ్య గా మా అందరి చేత ఎన్నో నాటకాలు వేయించి , ఎంతొ ప్రోత్సహించిన జానకి రాణి గార్ని మళ్ళి కలుసుకునే అవకాశం రాలేదు , మీ పుస్తక పరిచయ పుణ్యమా అని మళ్ళి తలచుకునే భాగ్యం కలిగింది , మీ రిచ్చిన సెల్ నెంబర్ వారిదేనా?వారి విషాద గాధ కొంత తెలుసు గాని , కంచాలన్ని పెట్టేసా ఒక్కటి తప్ప అన్న పదం లో దాగి వున్న ఆర్ద్రత మాటల్లో వర్నించలేనిడి . రేపు అ నెంబర్ కి ఫోన్ చేసి వారిదేమో తెలుసుకుని కలవడానికి sincere గా ప్రయత్నిస్తా .

  10. Marthanda

    I am not so innocent who is not able to understand implications of your verses. నేను ఏ పరిస్థితులలో విమర్శించాల్సి వచ్చిందో నేను నా బ్లాగ్ లో వ్రాసాను. సమాధానం అక్కడ చెప్పండి.

  11. కె.మహేష్ కుమార్

    @మార్తాండ: నీకు పదాల అర్థాలు తప్ప వాటి భావాలు స్ఫురించవు. నీతో వాదించే మూర్ఖత్వం చెయ్యలేను. ఆ లంకెచూసి నీ తెలియనితనాన్ని అందరూ తెలుసకుంటారని ఆశిస్తాను.

  12. Marthanda

    కొత్తపాళీ గారి బ్లాగ్ లో చలం గారిని ఓపెన్ గా దూషించిన మహేష్ గారు ఇక్కడ చలం భక్తుని లాగ ఎలా నటిస్తున్నారు? http://kottapali.blogspot.com/2009/03/9.html నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు శిష్యులలో మహేష్ గారు కూడా ఒకరు.

  13. మాలతి

    మహేష్ కుమార్, బొల్లోజుబాబా, మీ అభిప్రాయాలకి ధన్యవాదాలు. రెండో పుస్తకం కూడా చూడండి. నిజంగా మనసుని కదిలించే కవితలవి.

  14. bollojubaba

    malathi gaariki
    amma
    mii vyaasam caalaa baagundi. mamci pustakaanni paricayam cEsaaru. aa pustakampai umde bhinna abhipraayaalaku, oka vEdikanu kalpiMcaaru.
    thankyou amma

    bollojubaba

  15. bollojubaba

    Despite mahEsh’s comment, i cannot appreciate this book.
    i read it some where in the internet.
    i could see it as an attempt to sensetionalise , rather than an attempt to see him closely.

    chalam may not be a family man. (looking after the family, securing a good bank balance, a house, two cows etc. like what he called as maryadastulu).

    that point need not be emphasised, while ignoring the works he produced for the society.

    certain grey areas might have been omitted like 1. souris was nude, during meditation 2.chalam embraced the writer like a purushudu 3.chalam anniversiry invitation was refused by his daughters 4.chalam’s son escaped due to chalam. 5.chalam encouraged his children to beat his wife etc etc. (i feel ashamed to type these here too)

    chalam should not have been expected to behave like a maryadasthudu.

    that idea it self is unfortunate.

    i read that book long back and am disguested with the views.

    chalam personal life is to be separated from his works.

    to understand great works of great people, their personal lives are usually ignored.
    asses chalam based on his works. they are sufficient enough to get drowned in an ocean of human nature.

    p.s. sorry for english, as i am away from my computer

    bollojubaba

  16. కె.మహేష్ కుమార్

    “అప్పుడాయన నన్ను దగ్గరకు తీసుకున్నారు.ఒక స్త్రీని పురుషుని వలె ముద్దు పెట్టుకున్నారు.అప్పుడు నేను ఆయనకు మనుమరాలిని కాదు, అందమైన ఆడపిల్లని – అని యిప్పుడు అనిపిస్తుంది” అనే జానకీరాణి వాక్యాల్ని చూపించి చలం ఒక incestuous bastard అన్న తరహాలో వాదనలు చేసినవారూ ఉన్నారు. బహుశా వారందరూ ఈ పుస్తకం చదవలేదు.పైపెచ్చు ఆ పుస్తకం రాయడంలోని ఉదాత్తమైన ఉద్దేశాన్ని ఎరిగి ఉండరు.చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు.

    మనుషుల్ని వారి బలహీనతలతోసహా అంగీకరించగలిగే ధైర్యం వచ్చిననాడే చలం మనకు అర్థమవుతాడు. అప్పుడూ చలంలో మిళితమై తన రాతల్ని అనుభవించాల్సిందేగానీ, సాధారణ మేధకు అర్థమయ్యే భావాలా అవి. మనసుతో అనుభవించాలేగానీ!

    prescribed విలువల్లో కుంచించుకుపోయిన మానవతలోని కొన్ని పార్శ్వాలని తన రచనలతో ఉద్దీపన చేసిన ఋషిని ఆదే విలువల్లోంచీ చూసి అర్థం చేసుకుని జడ్జి చెయ్యాలనుకోవడం ఎంత మూర్ఖత్వం తెలియనితనం. ఎప్పటికైనా చలాన్ని మనం గుర్తిస్తామా? ప్రపంచ సాహిత్యంలో చలం స్థానాన్ని దక్కిస్తామా?

Leave a Reply