Amy Waldman – The Submission

సెప్టెంబరు 11, 2001 న అల్‌కెయిదాకు చెందిన టెర్రరిస్టులు వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగన్‌ల పై దాడిచేసిన తరువాత అమెరికన్ సమాజంలో ముస్లిం వ్యతిరేక భావం ఒక వెల్లువలా వచ్చింది. ఈ వ్యతిరేకతను మతవాదం ఇంకా పెంచింది. టవర్ల కూల్చివేత తర్వాత, కొన్నిరోజులపాటు ముస్లిముల్లా కనిపించేవారిపట్ల అవాంఛనీయ ఘటనలు చాలా జరిగాయి. అదే సమయంలో అమెరికన్ సమాజంలో బలంగా ఉన్న ఉదారవాదం ఈ ధోరణుల్ని తీవ్రంగా ప్రతిఘటించింది. కాలక్రమేణా ఈ ముస్లిం వ్యతిరేకత, భయాలు, అనుమానాలు నేపధ్యంలోకి వెళ్ళినా, అవి పూర్తిగా మాయమవ్వలేదని చెదురుమదురుగా జరిగే సంఘటనలు గుర్తు చేస్తూనే ఉంటాయి.

ఇటువంటి చారిత్రక సంఘటన సమాజంలో, సంఘజీవనంలో, మానవసంబంధాల్లో చూపించే ప్రభావాన్ని చక్కగా పట్టుకొని నిష్పక్షపాతంగా చూపించే పుస్తకంకోసం కొంతకాలంగా నిరీక్షణ ఉంది. Amy Waldman వ్రాసిన The Submission అనే పుస్తకం ఈ లోటును తీరుస్తుందంటూ నేషనల్ పబ్లిక్ రేడియోలో Maureen Corrigan, గత సెప్టెంబరులో – ఈ సంఘటనల పదవ వార్షికోత్సవం సందర్భంగా గ్రౌండ్ జీరోలో స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించటానికి ఒక వారం ముందు, పరిచయం చేసింది. ఆ తర్వాత ఈ పుస్తకం గురించి మంచి సమీక్షలు చాలా పత్రికలలో కూడా కనిపించాయి. కొన్ని రోజులక్రితం నాసీ అని మేం పిల్చుకునే కొత్తపాళీ ఉరఫ్ శంకగిరి నారాయణస్వామి కూడా తన బ్లాగులో ఈ పుస్తకం బాగుందని వ్రాశాక, ఇక ఆగకుండా (ఆగలేక?) పుస్తకం సంపాదించుకుని చదివాను.

కథా వస్తువు:
న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ సెప్టెంబరు 11 దాడులలో కూలిపోయిన తరువాత ఆ ప్రదేశంలో (గ్రౌండ్ జీరో) ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించటానికి న్యూయార్క్ గవర్నర్ ఒక కమిటీని నియమిస్తుంది. వచ్చిన డిజైనులనుంచి అత్యుత్తమమైన డిజైన్‌ను ఎన్నుకోవటానికి ఆ కమిటీ సభ్యులు సమావేశమౌతారు. ఆఖరు దశలో రెండు డిజైన్లు మిగిలాయి. శిల్పకారిణి యారియన్న్ ఒక డిజైన్‌ను గట్టిగా సమర్థిస్తుండగా, దాడిలో చనిపోయిన మృతుల తరపున కమిటీలో ఉన్న వితంతువు క్లేయ్‌ర్ బర్వెల్ ఇంకోడిజైన్‌కోసం పోరాడుతుంది. చివరికి కమిటీలో మెజారిటీ సభ్యులు క్లేయ్‌ర్ సమర్థించిన స్మారక ఉద్యానవనం (The Garden) డిజైన్‌ను విజేతగా ఎన్నుకొంటారు. కమిటీ ఛైర్మన్ పాల్ రుబిన్ సీలుచేసిన కవర్ లోంచి ఆ గార్డెన్‌ను డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ పేరు బయటకు తీస్తాడు. ఆ పేరు చూసిన కమిటీ సభ్యులు ఆశ్చర్యానికీ, ఆందోళనకీ లోనవుతారు. ఆ ఆర్కిటెక్ట్ పేరు మొహమ్మద్ ఖాన్.

ముస్లిం టెర్రరిస్టులు కూల్చిన భవనాలకు ఒక ముస్లిం ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిన స్మారకచిహ్నం సబబు కాదని యారియన్న్‌తో సహా కొందరు సభ్యులు అభిప్రాయపడతారు. పోటీలో సక్రమంగా గెలిచిన వాడి మతం విషయం అనవసరమనీ, గెలిచిన డిజైన్‌ను నిర్మించటమే సబబు అని క్లేయ్‌ర్‌తో కలిసి కొందరి వాదన. పాల్ రుబిన్ తటస్థంగానే ఉన్నా, ఈ ఎంపిక తప్పకుండా వివాదాస్పదమవుతుందని అతనికి తెలుసు. దీనివల్ల అవసరమైన నిధులు సమకూరక అసలు స్మారకచిహ్న నిర్మాణమే ఆగిపోతుందేమో అని అతని భయం.

ఎంపికలో గెలిచిన డిజైను పూర్తిగా ఆమోదింపబడటానికి ముందు ఇంకా చాలా తతంగం ఉంది. డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ‘తగినవాడై’ ఉండాలి. ప్రజలు – ముఖ్యంగా మృతుల కుటుంబీకులు – ఆ డిజైన్ మీద తమ అభిప్రాయం తెలిపిన తరువాత గవర్నరు ఆఖరు నిర్ణయం తీసుకుంటుంది. డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ నేపధ్య విచారణ పూర్తయ్యేంత వరకూ ఈ ఎంపిక విషయాన్ని గోప్యంగా ఉంచమని రుబిన్ సభ్యుల్ని కోరుతాడు.

ఐనా ఎవరో రహస్యంగా యలిస్సా స్పియెర్ అనే పత్రికా విలేఖరికి ఈ వార్త చేరవేస్తారు. ఆమెకు గెలిచిన వ్యక్తి పేరు తెలియకపోయినా, ఒక ముస్లిం ఆర్కిటెక్ట్ డిజైని్‌ను కమిటీ ఎన్నుకొంది అని దినపత్రికలో పతాక శీర్షికలో ప్రకటిస్తుంది. అక్కడనుంచి మూడు రంగస్థలాల సర్కస్ ప్రారంభమౌతుంది. మృతుల కుటుంబ సభ్యులూ, ముస్లిం వ్యతిరేకులూ, ముస్లిము సంఘాలూ, ఇతర మతసంఘాలూ, లౌకిక వాదులూ, సరళవాదులూ, ఉదారవాదులూ, మితవాదులూ, అతివాదులూ, రాజకీయ నాయకులూ, మీడియా ప్రతినిధులూ, లాయర్లూ, పౌరహక్కుల సంఘాలూ, ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలను బలంగా వినిపించటానికీ, తమ వాదాన్ని నెగ్గించుకోవటానికీ అవసరమైన ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నో పుకార్లు, అపోహలు, ఆవేశకావేషాలు. ఈ డిజైన్ అర్థమేమిటీ, దీని వెనుక ముస్లిముల కుట్ర ఏమైనా ఉందా అన్న అనుమానాలు. కొన్ని హింసాత్మక ఘటనలు కూడా జరుగుతాయి. ఈ చిక్కుముడి చివరకు ఎలా విడిపోతుందన్నది ఈ పుస్తకంలో ఉత్కంఠ కలిగించే అంశం.

కథలో ముఖ్య పాత్రలు:

ఆర్కిటెక్టు: మో అని అందరూ పిలచే మొహమ్మద్ ఖాన్ అమెరికాలో పుట్టిపెరిగిన వాడు. తల్లితండ్రులు ఇండియానుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. తండ్రి ఇంజనీరు. మతం గురించి పెద్దగా ఎక్కువగా పట్టించుకున్న కుటుంబం కాదు. అమెరికాలో ఏ మతం వారైనా స్వేచ్ఛగా జీవించగలరనే నమ్మకం ఉన్న తండ్రి కొడుక్కు మొహమ్మద్ అనే మత సంబంధమైన పేరును పెట్టటానికి సంకోచించలేదు. చాలా ప్రతిభ ఉన్న ఆర్కిటెక్టుగా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న మో న్యూయార్క్ నగరంలో చాలా కాలంగా నివసిస్తున్నాడు. సెప్టెంబరు 11 ఘటనలు అతన్ని చాలా కలచివేశాయి. అప్పుడప్పుడు ఏర్‌పోర్ట్‌లో నిశితంగా సోదా చేయబడడం వంటి ఇబ్బందులకు తన పేరు మూలాన గురవుతున్నా, అతను ఆ విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ తను పనిచేస్తున్న సంస్థలో తప్పనిసరిగా తనకు వస్తుందనుకున్న ప్రమోషన్ రాకపోవడం అతనికి కొంత అసంతృప్తిని కలిగించింది. ఆ సమయంలో, స్మారకచిహ్నపు డిజైన్ పోటీ గురించి తెలుస్తుంది. ఎవ్వరికీ చెప్పకుండా, స్మారకచిహ్నానికి సరైనదని తనకు తోచిన భావనకు రూపాన్ని ఇచ్చి డిజైను తయారుచేసి పోటీకి పంపాడు. ఆ పోటీలో గెలిస్తే తన జీవితం మారిపోతుందని భావించాడే కాని ఆ మార్పు నిజజీవితంలో ఎలా ఉంటుందో అతను ఏ మాత్రమూ ఊహించలేదు. తన చుట్టూ జరుగుతున్న వివాదమూ, కల్లోలమూ అతని ఆత్మాభిమానంపై దాడి చేశాయి. తన దేశభక్తిని నిరూపించుకోవాలన్న సూచన అతనికి కోపం తెప్పించింది. అతని మొండితనం, ఆత్మస్థైర్యం అతనికి సహకరిస్తాయా లేక అదనపు అవాంతరాలని కలుగజేస్తాయా?

మృతుల (అమరుల) కుటుంబీకులు:

క్లేయ్‌ర్ బర్వెల్: అందంగా, హుందాగా ఉండే క్లేయ్‌ర్ మధ్య తరగతి నుంచి వచ్చినా స్వశక్తితో పైకి వచ్చింది. లా చదివిన సహాధ్యాయి క్లారెన్స్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. క్లారెన్స్ మంచి మనిషి, ఉదారవాది, అమిత భాగ్యవంతుడు. ఇద్దరు చిన్న పిల్లలు. భర్త అకస్మాత్తుగా టవర్స్ కూలినప్పుడు చనిపోయాడు. క్రమేణా ఆమె మృతుల కుటుంబాలు ప్రభుత్వంతో సంప్రదింపులు చేసేటప్పుడు వారి ముఖ్య ప్రతినిధుల్లో ఒకరయ్యింది. స్మారకచిహ్నం కమిటీలో మృతుల కుటుంబాల ప్రతినిధిగా గవర్నరు మంచి అభిరుచి ఉన్న ఈ వితంతువును నియమించింది. తన భర్తకు, ఇతర మృతులకు సరైన స్మారకచిహ్నమని తాను నమ్మిన డిజైన్ ఎన్నిక కావటానికి శాయశక్తులా కృషి చేసింది క్లేయ్‌ర్. ఆ డిజైన్ సృష్టించిన ఆర్కిటెక్ట్ ముస్లిం ఐనా ఆమెకు అభ్యంతరం కాదు. కానీ మిగతా మృతుల కుటుంబాలకు ముస్లిం ఆర్కిటెక్టు మింగుడుపడక పోవడం, ఆ ఉద్యానవనపు డిజైను, ఇస్లాం చెప్పిన స్వర్గపు ఉద్యానవనం డిజైన్ అని సర్వత్రా వినిపిస్తున్న అనుమానాలు, వివరణలివ్వటానికి నిరాకరిస్తున్న మో మౌనం ఆమెను అసందిగ్ధ స్థితిలోకి తోస్తున్నాయి.

షాన్: జీవితంలో అనుకొన్న గమ్యాలు చేరుకోలేక, ఆల్కహాల్‌కు అలవాటు పడి రికామీ జీవితం గడుపుతున్న షాన్‌కి తల్లిత్రండ్రులన్నా, అన్న ప్యాట్రిక్ అన్నా అమితమైన ప్రేమ. న్యూయార్క్ నగరంలో ఫైర్‌మన్‌గా పని చేస్తూ టవర్స్‌లో ఉన్నవారిని రక్షించటానికి వెళ్ళిన అన్న టవర్స్ కూలినప్పుడు మరణించాడు. అప్పటినుండీ షాన్ జీవితమంతా మృతుల స్మారకానికీ, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికీ పోరాడటానికే అంకితం చేశాడు. ఈ క్రమంలో అతని భార్య అతనికి విడాకులు ఇచ్చేసింది. తాగుడు మానేశాడు. అన్నకోసం తల్లి తండ్రులు – ముఖ్యంగా తల్లి పడే బాధ అతన్ని చాలా కష్టపెడుతుంది. స్మారక చిహ్నపు ఎన్నిక సంఘంలో తానుంటే మృతుల స్మృతికి న్యాయం జరుగుతుందని అతని నమ్మకం. కానీ గవర్నరు అతన్ని నియమించకుండా ఆ స్థానాన్ని క్లేయ్‌ర్ కి ఇచ్చింది. ఆ అవమానానికి తోడు, ఆ కమిటీ ఒక ముస్లిం సృష్టించిన డిజైన్‌ని ఎంపిక చేయటం అతనికి సహించరానిదిగా అనిపించింది. అతని తల్లికీ ఇది నచ్చలేదు. ఆ డిజైన్ నిర్మించబడకుండా చేయమని కోరిన తల్లికి షాన్ మాట ఇచ్చాడు. అసలే నియంత్రణ లేని స్వభావం ఉన్న షాన్‌కు ఇప్పుడు ఒకటే ధ్యేయం – ఈ డిజైన్‌తో స్మారకచిహ్నం నిర్మించకుండా ఆపటం.

ఆస్మా అన్వర్: బంగ్లాదేశ్‌లో పుట్టి పెరిగిన ఆస్మా కొత్తగా పెళ్ళి చేసుకున్న భర్త ఈనాంతో కలసి న్యూయార్క్‌లో, బంగ్లాదేశీయులు ఎక్కువగా ఉండే బస్తీలో, నివసిస్తూంటుంది. వీసా లేకుండా చట్ట వ్యతిరేకంగా అమెరికాలో నివసిస్తున్న లక్షలమందిలో వారిద్దరూ ఉన్నారు. ఈనాం టవర్స్‌లో క్లీనర్‌గా పనిచేస్తూ ఉండేవాడు. టవర్స్ కూలినప్పుడు మరణించాడు. అప్పుడు ఆమె గర్భవతి. చట్ట వ్యతిరేకంగా ఉంటున్న ఈనాం మృతిని ముందు గుర్తించటానికి ప్రభుత్వాధికారులు నిరాకరించారు. బస్తీలో ఒక పెద్దాయన, ఒక ముస్లిం మహిళా న్యాయవాది ఆమెకు తోడుగా నిలచి, ఆమెకు మృతుల కుటుంబానికి ఇచ్చే నష్టపరిహారం ఇప్పించారు. ఆమె చట్ట వ్యతిరేకంగా దేశంలో ఉంటున్న సంగతి తెలిస్తే ఆమెను బంగ్లాదేశ్ తిరిగి పంపివేస్తారు; అది ఆమెకు ఇష్టం లేదు. అందుకని తన సంగతి గోప్యంగా ఉంచుకుంటూ ఒదిగి ఉంటూ జీవిస్తూంది. స్మారకచిహ్నం నిర్మించబడితే దానిలో భర్త స్మృతిని చూసుకోవలని ఆమె కోరిక. ముస్లిం ఆర్కిటెక్ట్ గురించి జరుగుతున్న వివాదాలు, ముస్లిం వ్యతిరేక ఆందోళనలు ఆమెను కలచివేస్తున్నాయి. కాని బయటపడి తన మనసులో మాట చెప్పుకోవటానికి వీలు లేదు – సరిగా ఇంగ్లీషు రాదు; పైగా తన చట్టవ్యతిరేక జీవితాన్ని రహస్యంగా ఉంచవలసిన అవసరం ఉంది.

ఇతర పాత్రలు:

గవర్నర్ జెరాల్డైన్ బిట్నర్: ఎప్పటికన్నా, ఎలాగోలా, అమెరికా రాష్ట్రపతి కావాలన్న ఆశ. ప్రజల నాడి పసిగట్టి ఆ ప్రకారం నడుచుకోగల సామర్థ్యం ఉంది. స్మారక చిహ్నం మీద ఆమెకు ఉన్న ఆసక్తి అల్లా తాను రాజకీయ లబ్ధి పొందటమే. దానికోసం ఏం చేయటానికైనా సిద్ధమే.

పత్రికా విలేఖరి యలిస్సా స్పియెర్: చాలకాలంగా అజ్ఙాతంగా ఉండి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికి తహతహలాడుతున్న ఈమెకు ఉన్నట్టుండి దొరికిన అవకాశం ఈ స్మారకచిహ్హం వివాదం. ఎలాగైనా ఈ అవకాశాన్ని వాడుకోవటమే ఆమె లక్ష్యం. ఈ ప్రయత్నంలో మిగతావారేమౌతున్నారు అనే ఆలోచనకు తావు లేదు.

కమిటీ ఛైర్మన్: సంఘంలో పేరు ప్రఖ్యాతులున్న వాడు. బాగా ధనవంతుడు. నగరం మధ్యలో ఉన్న ఖాళీ స్థలం టెర్రరిస్టుల విజయానికి చిహ్నమని, ఎలాగైనా ఆ ఖాళీని పూరిస్తూ అక్కడ సరైన స్మారక చిహ్నం నిర్మించటం అతని ఆశయం. ముస్లిం ఆర్కిటెక్టు పట్ల అతనికి అభ్యంతరం లేదు కానీ, అతను తనంతట తాను పోటీనుంచి తప్పుకుంటే సమస్య పరిష్కారమౌతుందని అతని నమ్మకం. మోని పొమ్మనకుండా పొగ పెట్టే ప్రయత్నాలు కొన్ని చేసినా, తన అంతరాత్మకు సర్ది చెప్పుకోవటం కష్టంగానే ఉంది.

ముస్లిం సంఘ నాయకులు: ఎంపిక ప్రక్రియలో గెలిచిన మోకి ముస్లిం అనే ఒక్క కారణంగా తిరస్కరించటాన్ని వారు సహించలేరు. అందుచేత అతనికి బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. ఈ సమస్యవల్ల మిగతా ముస్లిములలో సంఘీభావం పెరుగుతుంది. సంస్థకు విరాళాలు పెరుగుతున్నాయి. ఐనా సమస్య సాగుతున్నకొద్దీ దేశంలో ముస్లిం వ్యతిరేకత కూడా ఎక్కువ ఔతుంది; ఇంతకు ముందు లేని హింసాకృత్యాలు మొదలయ్యాయి. ఇదంతా పోవాలంటే ఈ సమస్య త్వరగా మాయమవ్వాలి. మో తన స్వార్థమే చూసుకుంటున్నాడనీ, అతని వల్లనే ఈ కొత్త ఇబ్బందులన్నీ అని కూడా కొందరు ముస్లిముల అభిప్రాయం.

ఇంకా మో కుటుంబం, ప్రియురాలు, స్నేహితులు, బాస్, ముస్లిం వ్యతిరేక సంఘ నాయకులు, మతగురువులు, పెద్దనోరున్న మీడియా సెలెబ్రిటీస్, రిపోర్టర్లు, ఎడిటర్లు, బంగ్లాదేశీ వలసదారులు, మృతుల బంధువులు, ఉదారవాదులు, మితవాదులు, అతివాదులు, మతవాదులు, ఛాందసులు, స్వచ్ఛందసేవకులు, ఆందోళనకారులు, హింసాకారులు, వగైరా వగైరా.

ఈ నవల మొదటి పేజీ నుంచి ఎంతో ఉత్కంఠతో చదివిస్తుంది. నవల చదువుతుంటే – మొదట్లో – దాదాపు రెండు దశాబ్దాల క్రితం చదివిన Tom Wolfe పుస్తకం The Bonfire of Vanities గుర్తుకు వచ్చింది. ఐతే Bonfireలో సెటైర్ పాలు ఎక్కువ; పాత్రలు కేరికేచర్లుగా మిగిలిపోయాయి; సజీవంగా అనిపించలేదు. Submissionలో అలా కాదు. పాత్రల్ని చాలా బలంగా చిత్రీకరించింది రచయిత్రి. ముఖ్యంగా, మొహమ్మద్ ఖాన్, క్లేయ్‌ర్‌ల మనోభావాల్ని, సంఘర్షణలని, క్రమేణా వారిలో వచ్చిన మార్పుల్ని బాగా చిత్రీకరించింది. ఈ పుస్తకంలోనూ కొన్ని మూసపాత్రలు ఉన్నాయి – పత్రికా విలేఖరి యలిస్సా స్పియర్ వంటివి. బంగ్లాదేశీ ఆస్మా కొన్నిసార్లు మూసపాత్ర అనిపించినా మరికొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తుంది. ఐతే, ఆమె పాత్రను ముగించిన తీరు మాత్రం కృతకంగా ఉంది.

పాత్రలలో వచ్చిన పరిణామాల తీరును చిత్రించిన విధానం బాగుంది; నమ్మశక్యంగానూ ఉంది. ముఖ్య కథ పూర్తైన ఇరవైయేళ్లకు తాజాకలంగా వ్రాసినట్లున్న ఆఖరి అధ్యాయం పుస్తకానికి ఇంకొంత బలాన్నిచ్చింది.

రచయిత్రి, 32 యేళ్ళ ఏమీ వాల్డ్‌మన్, న్యూయార్క్ టైమ్స్ పత్రిక దక్షిణ ఆసియా బ్యూరో ముఖ్యవిలేకరిగా చాలాకాలం పనిచేసిందట. అందుచేత భారత ఉపఖండపు దేశాల మనుషులతో, సంస్కృతితో బాగానే పరిచయం ఉన్నట్ట్లుంది. స్పష్టంగా రచయిత్రి పక్షపాతం కథానాయకుడు, ఆస్మా పాత్రలపట్లే ఉంది అనిపించింది. ఇది ఈమె మొదటి నవల. కథా వస్తువు, నవల నిర్మాణం, భూత వర్తమానాల మధ్య కథను నడిపించిన తీరు బాగున్నాయి. కొన్ని సన్నివేశాలు, రచయిత్రి అభిప్రాయాలు, పరిశీలనలు నన్ను ఆలోచింపచేశాయి. చాలాచోట్ల భాష, ఉపమానాలు ఆకట్టుకున్నాయి.

ఈ నవల శూన్యంలో పుట్టింది కాదు. ఉబుసుపోకకు చదువుకోవడానికి కూడా బావుంటుంది కానీ, చాలా ముఖ్యమైన ఆలోచించవలసిన విషయాలను మన ముందుకు తెస్తుంది ఈ పుస్తకం. అమెరికన్ సమాజంలోనూ, ప్రపంచంలోనూ, మానవసంబంధాలలోనూ ఉన్న వైరుధ్యాలపై ఈ పుస్తకం ఒక చక్కటి వ్యాఖ్యానం. సమకాలీన విషయాలే కాక చారిత్రక విషయాలు చాలావాటి ప్రస్తావన చూచాయగా కనిపిస్తుంది. ఉదార, లౌకిక, వ్యక్తిస్వేచ్ఛావాదాలకు, సంప్రదాయ, మతపర, మిత వాదాలకు మధ్య అమెరికాలో నిరంతరంగా జరిగే ఘర్షణ అనేక పార్శ్వాలతో ఈ నవలలో దర్శనమిస్తుంది. ఉదాహరణకు ఇప్ప్పుడు అమెరికాలో బాగా ప్రఖ్యాతి వహించిన వియత్నాం యుద్ధ స్మారకచిహ్నాన్ని మాయా లిన్ అనే అమెరికాలో పుట్టిపెరిగిన ఒక చైనీస్ సంతతి అమ్మాయి సృష్టించింది. అప్పుడూ చాలా వివాదాలు జరిగాయి. అలాగే, ఏడాదిక్రితం గ్రౌండ్ జీరోకు రెండు ఫర్లాంగుల దూరంలో ఇస్లామిక్ సెంటర్ కట్టడానికి ప్రయత్నించినప్పుడు చెలరేగిన గొడవలు కూడా గుర్తు చేసుకోవచ్చు. ఐతే వ్యక్తి స్వేచ్ఛకు, పౌరహక్కులకు, కళాకారుల సృజనాత్మకతకు కొమ్ము కాసేవారు అమెరికాలో కొదువ కాదు. నవల ప్రారంభంలో మొహమ్మద్ ఖాన్ డిజైన్‌ని వ్యతిరేకించిన యారియన్న్‌ కొన్నాళ్ళ తర్వాత మొహమ్మద్ ఖాన్ డిజైన్‌నే నిర్మించాలని పట్టుపట్టేవారికి నాయకత్వం వహిస్తుంది – ఎందుకంటే ఒక కళాకారిణిగా ఆమెకు కళాకారుల స్వేచ్ఛముఖ్యం. చిలికి చిలికి గాలివానగా తయారయ్యే ఇలాంటి వివాదాలను వర్ణిస్తున్నప్పుడు ఈ పుస్తకంలో కొంత ఎగతాళి ధోరణి అప్పుడప్పుడూ కనపడినా, ముఖ్యపాత్రలను బలంగా, సజీవంగా చిత్రించటంవల్ల ఈ పుస్తకం బుద్ధికి పని పెడుతుంది.

రచయిత్రి ఈ పుస్తకానికి మంచి టైటిల్‌నే ఎన్నుకొంది. Submission అన్న మాటకు ఆంగ్లంలో రెండు అర్థాలు ఉన్నాయి – దాఖలు చేయటం, లొంగిపోవటం.

పుస్తకం అందంగా ముద్రించారని, అచ్చు తప్పులు లేవని వేరే చెప్పక్కర్లేదు. పుస్తకంలో ముఖ్య అధ్యాయాలకు మధ్య ఉన్న పేజీలను అలంకరించిన విధానం నచ్చింది. ఈ పుస్తకం గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఆకర్షణీయంగా, సృజనాత్మకంగా నిర్మించిన వెబ్ సైట్ కూడా ఉంది. ఈ రచయిత్రి రాసిన ఇంకో కథ బోనస్‌గా దొరుకుతుంది అక్కడ.

ఆంగ్ల నవలల మీద కానీ, అమెరికన్ రాజకీయ, సంస్కృతి సంబంధ విషయాల పైన కానీ ఆసక్తి ఉంటే తప్పకుండా చదవతగ్గ పుస్తకం. ఊరికే కాలక్షేపానికి కూడా ఆసక్తిగా చదువుకోవచ్చు.

*********

The Submission
Amy Waldman
2011
Farrar, Straus and Giroux, New York
Hard bound; 302 pages; $ 26.

You Might Also Like

2 Comments

  1. కొత్తపాళీ

    This discussion is all the more relevant in the backdrop of the recent Lowe’s TV show sponsorship controversy. It may be a 2nd rate show on a 3rd rate channel, but a big corporate house like Lowe’s pulling its sponsorship due to pressure from some conservative groups shows how close to the precipice this American tolerance is. The response from Arab-American groups also has been interesting. One response I heard on radio posed this as a racism question.

  2. కొత్తపాళీ

    I am so glad you read the novel. Even more glad that you wrote such a detailed account of it.

Leave a Reply