కైవల్యం – శ్రీవల్లీ రాధిక

(శ్రీవల్లీ రాధిక గారి కవితా సంకలనం “కైవల్యం” ఇటీవలే విడుదలైంది. ఆ పుస్తకంపై – సామవేదం షణ్ముఖశర్మ, తనికెళ్ళ భరణి గార్ల అభిప్రాయాలు ఇవి – పుస్తకం.నెట్)
******************************

పలుకు పదను తెలిసిన వారి చేతిలో వచన కవిత శక్తిమంతమైన ప్రక్రియ అవుతుంది – అని ఋజువు చేసిన వారిలో శ్రీమతి శ్రీవల్లీ రాధిక గారు ఒకరు.
హాయిగా చదివించి, లోతుగా ఆలోచింపజేసే కవితలివి.
సామాజిక రీతుల్ని విశ్లేషించి ఎత్తి చూపుతూ, మానవ పృకృతిలోని వికృతుల్నీ, వివిధ మనోభావాల వెలుగు నీడల్నీ – కవిత్వపు విలువలు కదిలిపోకుండా, పకడ్బందీగా వీటిలో పరామర్శించారు.
ముఖ్యంగా- భక్తి, తాత్విక చింతన కలిసిన కవితలు సౌరభమరందాలను దాచుకున్న పద్మ మాలికల్లా సుతిమెత్తగా హృదయాన్ని తాకి, గాఢంగా లోలో పరిమళించాయి.
ఇంత చక్కని కవితా సంకలనాన్ని రచించి, తన పరిణత ప్రజ్ఞను చాటిన ఈ సారస్వత మూర్తి, మరిన్ని మంచి రచనలను వెలువరించి తెలుగు భారతిని అలంకరించాలని ఆశిస్తూ –

అభినందనలతో
సామవేదం షణ్ముఖ శర్మ

*******************************
శ్రీ… కైవల్య పదంబు… చేరుటకునై…

కవిత్వం కళల్లో పరాకాష్టగా నేను నమ్ముతాను. ఓ గుప్పెడు అక్షరాల్ని చితక్కొట్టేసీ.. నలగ్గొట్టేసీ.. చిత్రిక పట్టేసీ… మెలితిప్పేసీ… తిరగమోత పెట్టేస్తే… కవిత్వం పుస్తకం అచ్చోసుకుని బైటికొస్తుందేమో గానీ.. కవిత్వం రాదు. అది కవిత్వం కాదు. కవిత్వం అనుభూతిలోంచి రావాలి. దేన్నైనా చూస్తే స్పందించీ.. రాయాలనిపించాలి. దానికి రంగూ, రుచీ, వాసనా… మానవత్వపు రంగు…జీవతత్వపు రుచీ… కన్నీటి పరిమళం కలగలిపితే.. కవిత్వం. అది శాశ్వతం కూడా.
ఇప్పటికీ … అమృతం కురిసిన రాత్రే .. అమ్ముడుపోతోంది. ఎప్పటికీ మహాప్రస్థానమే కొంటారు. అంటే ఏంటీ… ఒకటి వెన్నెల.. ఒకటి వేడిమి. రెండూ కావాలి బతుక్కి.
కైవల్యం.. కైతలు.. కొన్ని సాదా.. కొన్ని సీద… కొన్ని అద్భుతాలు… కొన్ని అమృతాలు. మొత్తానికి ఏకబిగిన చదవడం కుదర్దు. ఒక్కొక్కదాన్నీ.. ఆస్వాదిస్తూ.. ఆనందిస్తూ సాగాలి.
కైవల్యం అనగానే భక్తి కవితలు మాత్రమే కాదూ.. ఒక్కో బిందువులా ఆరంభమై… అన్ని రుచుల్నీ, అన్ని అనుభూతుల్నీ కలబోసి.. చివరికి ‘అనంతం’ వైపుకి ఆకర్షించే ఆణిముత్యాలు. రాధిక ధన్య.

భవదీయుడు,
తనికెళ్ళ భరణి.
********************************

పుస్తకం వివరాలు:

KAIVALYAM
Poetry by T. Srivalli Radhika
First Edition : 2011
Price : Rs. 60/-

For Copies :
T. Srivalli Radhika
5-4-345, Road No. 5
Kamala Nagar, Vanasthalipuram,
Hyderabad – 500 070
Ph : 040 – 2412 4124
& All leading Book shops

For ebook purchase: Kinige

Cover Design : Bapu

Published by : Pramatha Publications, Hyderabad – 500070
Printed at : Karshak Art Printers, Vidyanagar, Hyderabad – 500044

You Might Also Like

Leave a Reply