సామల సదాశివ ముచ్చట్లు – “మలయ మారుతాలు”

రాసిన వారు: చంద్రహాస్
**************
Dr. సామల సదాశివ అదిలాబాద్ నివాసి. ఉపాధ్యాయులుగా వారు ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దిన అనుభవజ్ఞులు. ఉర్దూ, ఫారసీ భాషల్లో మంచి ప్రవేశం వున్నవారు. పత్రికలకు గేయాలు, వ్యాసాలు విరివిగా రాసేవారు. వయసు ఏడు పదులు దాటి చాన్నాళ్ళే అయినా ఇప్పటికీ ముచ్చట్లు రాస్తూనే వున్నారు. 1990 ప్రాంతంలో ఆంధ్రప్రభ పత్రికలో కళాకారుల గురించి, రచయితల గురించి వారు కొన్ని ముచ్చట్లు రాశారు. వాటిని 2001లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం “మలయ మారుతాలు” పేరుతో పుస్తకంగా ప్రచురించారు.

మీకు సంగీతం అంటే ఇష్టమా? అయితే, “మలయ మారుతాలు” పుస్తకం మీకు నచ్చుతుంది. ఒకవేళ మీకు సంగీతమంటే పరిచయం లేకపోయినా ఇందులో సాక్షాత్కరించే కళాకారుల ఔన్నత్యాన్ని తెలుసుకుని ముగ్ధులవుతారని, ఆశ్చర్యపోతారనీ నా నమ్మకం. ఇందులో వున్న nuggets చాలా సరళంగా, మనసుకు హత్తుకునేలా రాసారు సదాశివ గారు. పుస్తకాన్ని ప్రచురించేముందు సదాశివ గారి బయోడాటా అడిగితే ‘అదెందుకు సార్?’ అని వారి సమాధానం. నిగర్వి. ఆయన జాబుని ‘నా మాట’ అనే శీర్షికతో పుస్తకంలో పూర్తిగా ప్రచురించారు. పుస్తకంలో రాసినవన్నీ అక్కడక్కడా చదివినవని, కొన్ని విన్నవనీ, కొందరు తెలిసిన మిత్రుల అనుభవాలని, కొన్ని స్వానుభవాలనీ తెలిపారు.
‘మిత్రవాక్యం’ వాకాటి పాండురంగారావు గారు రాశారు. ఇది మూడుపేజీల classic. బీథోవెన్ ప్రస్తావనతో మొదలవుతుంది. బీథోవెన్ అప్పుడు కోలోన్ ప్రిన్స్ ఆస్థాన విద్వాంసుడు. తన మిత్రులకోసం సంగీతం వినిపించమమని ప్రిన్స్ ఆజ్ఞ జారీ చేశాడు. బీథోవెన్ కు అది ఇష్టం లేదు. వాయించకపోతే అంతఃపురంలో బందీగా ఉంచేస్తానని హాస్యానికి అంటాడు ప్రిన్స్.

తర్వాత వాకాటిగారి మాటల్లోనే: “ఆ సంగీతజ్ఞుడి ఆత్మాభిమానం పడగవిప్పిన పాము అయింది. ఆ రాత్రికి రాత్రే అంతఃపురం విడిచి, భోరున కురుస్తున్న వర్షంలో నడుచుకుంటూ పక్క గ్రామానికి వెళ్ళిపోయాడు. అక్కడనుండి ఆ రాజుకో ఉత్తరం రాశాడు. ‘నువ్వు కాకతాళీయంగా రాజువి అయ్యావు. నేను అట్లా కాదు. నాకు నేనుగా నేనయ్యాను. ఇంక రాజులంటావా, వందలమంది వచ్చారు, పోయారు. మున్ముందు వస్తారు. కాని కలకాలానికి ఒక్కడే బీథోవెన్ ఉంటాడు.’ “దీనినేమంటారు చక్రవర్తిత్వమా?” ఆ ఉత్తరం వుందే అది మేధావుల పాలిటి మేగ్నకార్టా. సంగీతాకాశాన సూర్యబింబం. పండితులకు శిరోభూషణం.”

‘మిత్రవాక్యం’ చివరలో వాకాటి పాండురంగారావు గారి మాటలు: “(సదాశివ గారు) సంగీతకారుల జీవితాలలోని టుమ్రీలను ఒకదాని తర్వాత ఒకటిగా మీటుతారు. వినండి. ఆ అనుభవాలను జాగ్రత్తగా దాచుకోండి. నెనరుతో నెమరు వేసుకోండి. నేటి మన జీవితాలలో మనం క్రమంగా కోల్పోతున్నదేమిటో తెలుసుకోండి. మీ లోలోపల ఉన్న పాటల పేటికల తాళాలకై అన్వేషించండి. మీ మాటలకందని ఆ భావానుభవాల హిమశిలలను ఈ వెచ్చదనంతో పొదగండి. అందరి మధ్య ఉంటూ కూడా ‘ఒక్కరు’గా నాద తను మనిశంగా బ్రతక నేర్వండి. “ప్రతి సుమము తన్మయత్వంతో కిలకిల నవ్వగా లేనిది, ప్రతి పక్షి ఉన్మాద పరవశంతో నర్తించగా లేనిది, మీరు పలికించి పులకించి పద్నాలుగు లోకాలుగా విస్తరించలేరా ఏమిటి? “ఒక మహానుభూతికి ఇదే స్వాగతం.” ఒళ్ళు పులకరింపచేసే మిత్రవాక్యం.

పుస్తకంలో 37 చిన్న చిన్న వ్యాసాలున్నాయి. అవి కళాకారుల గురించి. వాళ్ళ చిన్న ప్రపంచాల గురించి. వాళ్ళ నిరంతర శ్రమ, సాధన గురించి. వ్యాసాలలో దర్శనమిచ్చే కళాకారులు — స్వామి హరిదాస్, తాన్ సేన్, ఉస్తాద్ బడె గులాం అలి ఖాన్, బేగం అఖ్తరిబాయి, ఉస్తాద్ కరీం ఖాన్, అంజనీబాయి, అల్లాయుద్దిన్ ఖాన్, హీరాబాయి, విద్యాధర దేవి, కేసర్ బాయి, బాల్ గంధర్వ, బుందూ ఖాన్, మాండొలిన్ శ్రీనివాస్, శంభు మహరాజ్, గోహర్ జాన్ — ఇంకా ఎందరో. అందరూ మహానుభావులే. రసికులైన కిషన్ సింగ్ చావ్ డా గురించి ఒక వ్యాసం వుంది. రాజులు, నవాబులు, జమిందార్లు, వాళ్ళ కళాపోషణ గురించి sketches వున్నాయి. పుస్తకంలో ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చొగ్తయి మీద ఒక చక్కని వాక్చిత్రం వుంది. గజల్ పై రెండు వ్యాసాలున్నాయి.

సదాశివగారు రాసిన కొన్ని ముచ్చట్లు మచ్చుకి:

గోహర్ జాన్ మలికా జాన్ కూతురు. కలకత్తాలో స్థిరపడింది. అందగత్తె. అద్భుత గాయని. ఆరోజుల్లేనే లక్షలకు లక్షలు ఆర్జించింది. స్వాతంత్ర్యోద్యమంకోసం గాంధీజీ అందరినీ చందాలు అడిగే రోజులవి. ఆయన ఈమె గురించి విన్నారు. చందాకోసం కబురు చేశారు. ఆయనే తన ఇంటిని పావనంచేస్తే అడిగినంతా యిస్తానని గోహర్ జాన్ జవాబు. దానికి గాంధీజీ ఒప్పుకున్నారు. అయితే ఒక తవయిఫ్ ఇంటికి వెళ్ళటం మంచిదికాదని వాళ్ళూ వీళ్ళూ ఆయనకు హితవుచెప్పారు. సరే అని ఆయన తన బదులుగా షౌకత్ అలిని పంపారు. ఆమె షౌకత్ అలిని ఆదరించింది. మహాత్ముడంతడివారే తన ఇంటికి వస్తానని మాట ఇచ్చి తప్పారే అంది. ఆయన వస్తే ఏమడిగినా ఇచ్చేదాన్నే కదా అంది. అయినా మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపను అంటూ ఇరవై అయిదు వేల రూపాయలు సమర్పించింది. ఇది ఏనాటి మాట? ఆమె 1930 నాటికే కలకత్తా వదిలి వెళ్ళిపోయింది. అంటే ఇది 1930 కి ముందే జరిగివుండాలి. ఇప్పుడా ధనం విలువ ఎంత వుంటుందో వూహించండి. ఒక తవయిఫ్ తన కష్టార్జితాన్ని అంత మొత్తం, అలా దానం చేసిందంటే నమ్మశక్యం కాదు కదా!

నాంపల్లి స్టేషన్ దాటి బయటికి వస్తూ కాస్త తలెత్తి చూస్తే అజీజియా లాడ్జి కనపడుతుంది. ఈసారి అటు వెళ్ళినప్పుడు ఆ లాడ్జి వేపు కాస్త గౌరవంగా చూడండి. ఎందుకంటే, ఉస్తాద్ బడేగులాం అలి ఖాన్ హైదరాబాదు వచ్చినఫ్పుడు అందులో దిగేవారు. తర్వాత్తర్వాత, బషీర్ బాగ్ పేలెస్ లో అతిథిగా వుండేవారు. ఈ ఉస్తాద్ మీకు తెలుసా? పేద్ద మీసాలు, చిన్న కళ్ళు, భారీ విగ్రహం — వస్తాదు కాదు. ఉస్తాదు. హిందూస్తానీ గాయకుడు. ఈ ఉస్తాద్ పాడిన ‘యాద్ పియాకీ ఆయె’ అనే ఠుమ్రీ సంగీత ప్రేమికులందరికీ పరిచయమే. హైదరాబాదుకు చెందిన నవాబు జహీర్ యార్ జంగ్ సంగీత రసికుడు. వారి బషీర్ బాగ్ పేలెస్ లో బడే గులాం అలి ఖాన్ నెలల తరబడి వుండి సంగీతం వినిపించేవారు. ఉస్తాదుకు పక్షవాతం వస్తే ఆ నవాబు డబ్బును నీళ్ళలాగా ఖర్చుపెట్టి వైద్యం చేయించారు. ఫలితం లేదు. 23-4-1968న ఆయన దివంగతులయ్యారు. “నవాబు బషీర్ బాగ్ పేలెస్ నుండి ‘దాయెరా – మీర్ మోమిన్’ వరకు సాగిన అతని శవయాత్రలో హైదరాబాదు నగరంలోని ప్రముఖులు, సంగీత ప్రియులు పాల్గొన్నారు. ఉస్తాద్ సమాధి మీద నవాబు జహీర్ యార్ జంగ్ సుందరమైన కట్టడం నిర్మింపజేసినాడు. రుణం తీరిపోయింది.” బడే గులాం అలి ఖాన్ సమాధి హైదరాబాదులో ఎక్కడుందో?

‘దీవానా బనానా హై తో దీవానా బనాదే’ అన్న గజల్ తలచుకున్నప్పుడల్లా గుర్తుకొచ్చేది ఎవరు? గాయనంతో ఎందరినో దీవానా చేసిన బేగం అఖ్తర్. ఆమె గురించి ముచ్చట. ఒక జమిందార్ ఇంట్లో ముజ్రా. జమిందార్ సంతుష్టుడై డబ్బు సంచీ అందచేశాడు. అది ఆమె తన వాద్యగాండ్రకు ఇచ్చేసింది. జమిందార్ అవాక్కయి, “బాయీ, అందులో వేయి విక్టోరియా నాణేలున్నాయి. మీరు లెక్కపెట్టుకోలేదు” అన్నాడు. ఆమె అహం దెబ్బతిన్నది. జవాబుగా ఆమె తన చేతులు రెండూ పైకెత్తి అన్నది కదా — “హుజూర్ ఈ హస్తభూషణాలు అరవై పలుకుతాయి. నా ఇంటగల నగలెన్నో చెప్పలేను. ఇక్కడ ఈ వెయ్యి రూపాయలు లెక్కపెట్టే ఓపికెక్కడుంది నాకు.” బేగం అఖ్తర్ గురించే ఇంకో ముచ్చట. ఆమెను ప్రిన్స్ అజ్జంజా హైదరాబాదుకు రప్పించారు వారం రోజుల బైఠక్ కోసం. మొదటిరోజే ప్రిన్స్ వ్యవహారం ఆమెకు నచ్చలేదు. మర్నాడు పొద్దుటే పెట్టే, బేడా సర్దుకుని ఆమె ప్రయాణమయింది. ఏడువారాల నగలు, ఏడు విలువైన చీరెలు, అనుకున్న ప్రతిఫలం నాంపల్లి స్టేషన్ కి పంపించారు ప్రిన్స్. ఈ విషయం ప్రిన్స్ దర్బారు విశేషాలను రాసిన కవి చెప్పాడు. కవి ప్రిన్స్ ఔదార్యాన్ని చెప్పాడు. కానుకలను ఆమె స్వీకరించిందా లేదా అని దర్బారు కవి చెప్పలేదు. నవాబు కీర్తనలో అలాంటి వాటికి చోటులేదు. వాటినన్నిటినీ తృణీకరించి ఆమె వెళ్ళి పోయే వుంటుంది. నిస్సందేహంగా.

అంజనీబాయిది ‘అప్సరసల వంటి అందం, కిన్నెరుల కంఠం, గంధర్వుల గాయనశైలి…’ ఉస్తాద్ నజీర్ ఖాన్ శిష్యురాలి ప్రతిభను చూసి సంతోషించేవాడు. ఆమె అందాన్ని చూసి ఆందోళన చెందేవాడు. ఆమెకు ఆయన పదే పదే చేసిన హెచ్చరిక: “బేటీ. నీ ముఖాన్ని అద్దంలో చూసుకోకు. రసికులైన సంపన్నులను రంజింపచేయటానికి కాదమ్మా ఈ విద్య. భగవంతుని చేరుకునే తిన్నని బాట ఇది.” ఇంకా చిన్న వయసులోనే ఆమె కాశీ విశ్వనాథాలయంలో ‘విశ్వనాథునికి జలాభిషేకంతో పాటు స్వరాభిషేకం చేసి, శివార్పణమని తంబూరాను గవిసెనపెట్టెలో దాచిపెట్టింది.’ అదే ఆమె చివరి కచేరి. తర్వాత సంగీత సన్యాసం పుచ్చుకుంది.

ఇంకో గోహర్ జాన్ ముచ్చట. ఆమె ప్రతి సాయంకాలం 4 గుర్రాల బగ్గీలో కలకత్తా వీధుల్లో షికారు వెళ్ళేది. ఒకరోజు అలా వెళ్తూంటే, ఆమె ఏ రాజవంశస్తురాలో అయివుంటుందని అనుకుని ఒక తెల్లవాడు సలాము చేసాడు. తను విష్ చేసిన మహిళ ఒక తవయిఫ్ అని అతనికి తెలుస్తుంది. అలా గుర్రబ్బండీలో వెళ్ళడానికి ఆమెకు అనుమతి లేదు. తెల్లవాడు ఆమెపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాడు. ప్రభుత్వం వెయ్యి రూపాయల జరిమానా వేసింది. ఆమె సుబ్బరంగా రోజూ వెయ్యి కట్టి దర్జాగా వ్యాహ్యాళికి వెళ్ళేది. కొన్నాళ్ళకి ఆమె అభిమానులు, సంపన్నులు విక్టోరియా రాణికి మహజర్లు పంపారు. గోహర్ జాన్ చేసింది చట్టవిరుద్ధమైన చర్యే అని ప్రభుత్వ నిర్ణయం. కాని జరిమానా తగ్గించారు — రోజుకొక గవ్వగా. గవ్వకూడా ఆ రోజుల్లో మారకానికి పనికివచ్చేది. జరిమానా తగ్గిందికదా అని ఆమె సంతోషించాలి కదా? అలా జరగలేదు. గోహర్ జాన్ బగ్గీ, గుర్రాలూ అమ్మేసింది. షికారు బంద్. ఏమిటని అడిగితే, ఆమె జవాబిది: “రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఎదిరిస్తున్నానని ఇన్నాళ్ళు ఎదిరించాను. గవ్వకు దిగజారిన తర్వాత దాన్ని ఎదిరించడం పరువుచేటు.”

ఈ పుస్తకం ప్రతి పేజీలో ఇలాంటి ముచ్చట్లు ఎన్నో, ఎన్నెన్నో వున్నాయి. చదివి ఆస్వాదించండి. ‘మిత్రవాక్యం’లో వాకాటి పాండురంగారావు రాసినదేదీ అతిశయోక్తి కాదని మీకూ తెలుస్తుంది. Dr. సామల సదాశివ గారు “మలయ మారుతాలు” తదనంతరం చెప్పిన సంగీతం ముచ్చట్లని ఇంకో రెండు పుస్తకాలలో ప్రచురించారు. వారి జ్ఞాపకాలు (యాదీ) కూడా పుస్తకరూపంలో వచ్చాయి. వాటిని గురించి మరెప్పుడైనా ముచ్చటించుకుందాము.

పుస్తకం వివరాలు:

మలయ మారుతాలు
రచయిత: ఎస్. సదాశివ
ముద్రణ: మే 2001
ప్రచురణ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
ధర: Rs. 50

You Might Also Like

3 Comments

  1. Chandrahas

    సదాశివగారికి ఈ సంవత్సరం సాహిత్య అకాడమి అవార్డ్ ఇచ్చారు. “మలయమారుతాలు” తర్వాత అదే ఒరవడిలో ఆయన రాసిన “స్వరలయలు” పుస్తకానికి ఈ పురస్కారం. సదాశివగారి గురించి ఆంధ్రజ్యోతి డైలీలో ఈ నెల 23న అక్కిరాజు గారి వ్యాసం, ఈరోజున అంటే 26న గూడూరి మనోజగారి వ్యాసం చదవండి.

  2. cbrao

    సదాశివుని సంగీతం ముచ్చట్లు ఆసక్తికరంగా చెప్పారు. సంగీత ప్రియులకు ఈ పుస్తకం చదువుతుంటేనే, నేపధ్యంలో, చక్కని సంగీతం వీనులకింపుగా వినిపిస్తుంది. సదాశివ వ్రాసిన సంగీత శిఖరాలు,మిర్జా గాలిబ్ (జీవితము, రచనలు) పుస్తకాలు కూడా పాఠకులను ఆకట్టుకుంటాయి. డాక్టర్ సామల సదాశివ పై వారాల ఆనంద్ తీసిన లఘు చిత్రాన్ని ఈ దిగువ గొలుసుద్వారా చూడవచ్చు.
    http://www.maganti.org/videofiles/sahityam/yadi/yadi.html

  3. సౌమ్య

    Interesting! Thanks for writing about this book!
    చాన్నాళ్ళ క్రితం, వార్త పత్రిక ఆదివారం అనుబంధంలో సదాశివ గారు ఉర్దూ కవిత్వం వగైరా గురించి రాసే వారు. మరీ తరుచుగా కాకపోయినా, అప్పుడప్పుడూ చదవడానికి ప్రయత్నించేదాన్ని. అప్పట్లో చదివినవి కొన్ని అలాగే గుర్తుండిపోయి, తర్వాత ఎన్నో సందర్భాల్లో తల్చుకున్నాను. అందువల్ల సదాశివ గారికి ఎన్నోసార్లు ధన్యవాదాలు తెలుపుకున్నాను – నా జీవితంలోకి వాటిని తెచ్చినందుకు…

Leave a Reply