తేరా నామ్ ఏక్ సహారా?! అను protagonist ప్రారబ్ధం!
ఇటీవల వచ్చిన మో స్మృతిసంచిక ‘నమో’ కోసం ఒక కవి మిత్రుడిని అడిగితే నమో తో పాటు ఈ ‘తేరా నాం సహారా?!’ పుస్తకం కూడా బోనస్ గా తెచ్చిచ్చాడు. అప్పటికే ఒకరిద్దరి ద్వారా ఈ పుస్తకం గురించి విని ఉండటంతో ఆసక్తిగా చదివాను. రాయాలని అనిపించడం కాదు, రాయకుండా ఉండలేకపోవటం అటుంచి ఈ పుస్తకం నాలో ఏదో తెలియని మూడ్ ని రేపెట్టింది. కొన్ని సందేహాలను కూడా కలిగించింది.
ముందు ఇది నాలో కలిగించిన మూడ్ – ఒక దిగులు లాంటిది. – నడిరాత్రి సుదూర వాయిద్యసంగీతం రేపే దిగులది. ఒక ప్రేమ కావ్యానికుండే అన్ని రంగులూ ఇందులో ఉన్నాయి. తరచూ పఠిత సహనాన్ని పరీక్షించే రచయిత మితిమీరిన పరికల్పనా పైత్యం ఇక్కడమాత్రం మనసును దిగులు పరిచే ఒక ప్రేమకావ్యంలా మలిచింది.
ఇక నా సందేహాలకి వస్తే –
ఇది కథా! లేక నవలకు తక్కువైన నవలికా? నిజ జీవితంలో ఎదురైన వ్యక్తుల పేర్లు సరాసరి రచనలలోకి చొప్పిస్తే వచ్చే పరిణామాలేంటి? ఇవన్నీ రచయిత ప్రశ్నలు. అవసరానికో అనుమానానికో అనవసరమైన ప్రశ్నలు. ఇదంతా రచయిత పుస్తకం చివరలో తను రాసుకున్న వెనుకమాట. ఇది లేకుంటే కథని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోడానికి బావుండేది. రచయితలు తమ రచనలమీద నిశ్శబ్దం పాటించినట్లైతే తమ రచనలకు న్యాయం చేకూర్చినవారవుతారనిపించింది.
ఈ మొత్తం కథనంలో అసలుకథ ఆరంభానికి ముందు నేపథ్యం ఎక్కువ. అదే పుస్తకాన్ని సగం ఆక్రమించింది. కథ మొదలయ్యాక నేపథ్యం కంటే అసలు కథ తక్కువ. అందుకే ఇదొక నవలికై కూర్చుంది. మరి ఈ హెచ్చుతగ్గులు ఎక్కడనుంచి వచ్చాయి? ఈ అసమతూకం వలన ఈ మొత్తం పుస్తకానికి వచ్చిన నష్టమేమీ లేదు కానీ కథాకాలానికి రచనాకాలానికి మధ్య సుదీర్ఘమైన ఇరవై ఏళ్ళ కాలం ఉన్నా కథకుడి జ్ఞాపకశక్తి, గాఢత చెదరని కథనశక్తి ఆశ్చర్యం గొలుపుతుంది. పుస్తకపరిచయానికి క్లుప్తంగానైనా పునఃకథనం అవసరమనుకుంటున్నాను.
ముగింపుతో మొదలయ్యే కథ ఇది. ఎలా ముగుస్తుందన్న సమస్యలేదు. ఒక బంధం తెంచుకోవడంతో ‘ఏ భరోసా ఇవ్వలేని అనాలోచిత ప్రియుడి (కథకుడి) పయనం మొదలవుతుంది. హైదరాబాదు నుండి పుట్టపర్తిలో మూన్నాళ్ళ ముచ్చట ఉద్యోగం అటునుంచి బెంగుళూరు సత్యసాయి వైట్ ఫీల్డ్ బృందావనం చేరతాడు. సత్యసాయి వేసవి విడిదికి విచ్చేయడంతో సజావుగా సాగుతున్న కథకుడి రొటీన్ లో కలకలం రేగుతుంది. బాబా తన నివాస మందిరం నుంచి నడుచుకుంటూ వచ్చి తిరణాలలో తప్పిపోయిన పిల్లవాడిలా భక్తులకు దర్శనం ఇస్తుంటారు, భక్తుల మధ్య తిరుగుతూ విన్నపాల్ని స్వీకరిస్తూ, కొందరిని అనుగ్రహిస్తూ కొందరికి పాద నమస్కారమే ప్రసాదిస్తూ. ఏళ్ళ తరబడి వస్తున్నా కన్నెత్తి చూడకపొవచ్చు. మొదటిసారి వచ్చినవాడిని ఠక్కున అనుగ్రహించవచ్చు. ఈ అనుగ్రహ తతంగాన్ని ప్రాబబిలిటి సిద్ధాంతానికి కథకుడిలాంటి అవిశ్వాసి అన్వయించుకుంటే, కర్మ సిద్ధాంతానికి అన్వయించుకునేవారు బాబా అమాయక భక్తులు.
అధోజగత్ శ్రామిక జనావళితో సంపర్కంలేని కారణంగా, సుఖంగా టెక్నికల్ పనులు చూసుకుంటూ కాలం గడిచిపోతున్న రోజుల్లో మానవసంచారం అట్టే ఉండని పరిసరాల్లో ఆకులు చల్లుతూ అల్లరల్లరి చేస్తున్న కొంటెకొమ్మల నీడన కూర్చొని ‘ద టెంప్టేషన్ ఆఫ్ సెయింట్ ఆంటోనీ’ తిరగేస్తుంటె అనుకోని వెర్రిగాలికి పుటుక్కుమన్న పుచ్చుకొమ్మ విరిగి పడినట్లు వస్తుంది సౌభాగ్యమ్మ. మితిమీరిన స్వీయరక్షణా స్పృహలో పైట సర్దుకుంటూ, మోతాదు మించిన నైతిక కషాయాన్ని పట్టిస్తూ, కెంపురంగు ముతకనేత చీర భుజం చుట్టూ కప్పుకుని ఒద్దిగ్గా కప్పుకుని పొత్తికడుపు పియానో మడతల్ని మాత్రం భక్తుల వక్రదృక్కుల కొదిలేసిన చద్మవేషధారి – ఏం చేస్తున్నావు బాబూ.. అంటూ వస్తే ఎదో రకంగా కెలకాలన్నది అతడి కుతి.
సర్వసంగ పరిత్యాగులు, లేదా పరిత్యాగులమని బొంకే వాళ్ళలో కాముడు రగిలించే రంధి గురించి రంజుగా చెప్పుకొస్తూ- పరిహసిస్తూ “వాళ్ళ సంగతి అటుంచండి సౌభాగ్య గారూ, మన సత్యసాయి వారు ఇప్పుడు ‘వృద్ధయోగీ బ్రహ్మచారీ’ తరహా మాటలు చెబుతున్నారుగానీ, యవ్వనంలో మంచి గ్రంథసాంగుడయ్యే ఉంటాడంటారా?’ అని పరాచికాలాడుతూంటాడు. కొట్టుకునేంతవరకు కనిపించని ఎదుర్రాయిలా అప్పుడే ఊడిపడతారు సత్యసాయిబాబా. వేళకానివేళ బాబాని చూసిన దిగ్బ్రమలో చేతులుజోడించిన సౌభాగ్యమ్మ ఒక మూలకి జరిగిపోగా తప్పించుకోడానికి వీల్లేని స్థితిలో సత్యసాయి మనో వికారాల ఆరా తీస్తున్నప్పుడే బాబా అక్కడ ప్రత్యక్షమవడాన్ని కాకతాళీయంగా సరిపుచ్చుకోలేక, బాబా ఒక సర్వంతర్యామి అని నమ్మలేక పోతాడు. ఇటువంటి నమ్మకం అపనమ్మకాల ద్వైదీభావలతో కథకుడు కొట్టుమిట్టులాడుతున్నప్ప్పుడు –
తెగిన హారంలోంచి దూకిన రంగు ముత్యాలుగచ్చు మీద గంతులేసినట్లు ఆడపిల్లలు బస్సులోంచి గెంతి బిలబిలా వస్తుంటే కారణాలు తోచని యాతనలో కళ్ళు చంచలమయి, వేసవిశిబిరం ఒక సహనాన్ని పరీక్షించే బాబా ప్రసంగాల ఉక్కపోత చికాకే అనుకున్నా, రంగుల పూలతో పిగిలిపోయే కాగితపు పొట్లాం అని అర్థమయి అందులో పాలుపంచుకోవాలన్న యావ కుదురుగా నిలవనీయక బాబాని అడగడానికి బుద్ధిగా సిద్ధమై కనీసం తన మందిరంలోకి వెళ్లేముందు చూస్తారేమోనన్న ఆశతో త్రయి బృందావన్ ప్రధాన ద్వారం చేరువగా చెతులుజోడించి చేరి మరీ ఎదురుచూస్తుంటే అతడి ఊగిసలాటల ఉద్రేకాల్ని ఓ మూలకి ఊడ్చేసినట్లు నడిచొచ్చిందొక మూర్తి. కంచి పట్టు చీరలో, స్వభావాన్ని సూచిస్తున్న మెత్తని నడకతో వస్తుంది రాగాన్ని వెదుక్కుంటున్న పదం, పరాన్ని అన్వేషిస్తున్న ఇహం – ఎమ్మెస్ సుబ్బులక్ష్మి. ఆమెకు సాష్టాంగపడినంతలో ఎప్పుడొచ్చారో బాబా “వాడికి తమిళం రాదు కుంజమ్మా”.. ఇటువంటి హఠాత్ దర్శనాలు ఏమాత్రం కొత్తకానట్లు అదే నగుమోముతో ఎమ్మెస్ ఆయన పాదాల్ని తాకుతుంటే తేరుకోడవడానికి కష్టసాధ్యమైన ఆశ్చర్యభారంతో మోకాళ్ళమీద కూలబడిపోయిన కథకుడు –
“నువ్వు నా భక్తురాలివి. వాడు నీ భక్తుడు. నమస్కారమే చేయనివాడు నీకు సాష్టాంగపడ్డాడు. నీ పాట వాడికే వినిపించు” అన్న బాబా వాక్యానికి ఫలితంగా అతికొద్దిమందికే దక్కే బాబా ఏకాంతమందిర ప్రవేశం కథకుడికి మాత్రమే దక్కుతుంది. గడ్డిపోచ మీద గండు చీమలా తప్పించుకోడానికి తటపటాయిస్తూనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న అతడు తాదాత్మ్యంలోంచి చివుక్కునలేచి లోన గదుల్లోకి వెళ్ళడంతో పీతలా పక్కకు పక్కకు జరుగుతూ బయటపడి పొదల పక్కన సీవేజ్ పైపులు వేస్తున్న ప్లంబింగ్ వర్కర్ల చేత పని సరిచేయిస్తుండగా – అప్పుడు తేలివస్తుందో స్వరం, ఇరుకు గదుల్లోంచి బైటపడ్డ గాలి తెమ్మెరల భుజాలపై ఎక్కి.. ‘నీనె అనాధ బంధో… కారుణ్య సింధో..’ అన్న కలకూజితాన్ని తెలుసుకుందామన్న ఆసక్తితో అతడు తిరిగివెళ్తే, భక్తితోనో జంకుతోనో కళ్ళుమూసుకుని పాడుతున్న సంపెంగ – ఆమె పేరు భారతి! బాబా ఏకాంత మందిరపు గాయని కథలోకి మరొక ప్రధాన పాత్ర ప్రవేశించడంతో ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది.
ఆమెని వినడమేకాని చూడని పూటలు, రోజులు కూడా దొర్లిపోతుంటే, ఆ ఆందోళనలో దొంకదారులు వెదికే వ్యూహంలో నాగానందినిని ద్యూతికగా, నాగాస్త్రంగా సంధించి చివరికి చిక్కిన ఒకానొక సందర్భంలో ఆమెతో అంటాడు – భావం బోధపడటానికి కచ్చితంగా భాష అవసరం అనుకునేవాడిని. కాని అది తప్పని తోడైన నీ పాట చెప్పింది. పురందరదాసు నీ పాటై నన్ను మళ్ళీ కన్నాడు. కీర్తన ప్రతిపదార్థం నేను చెప్పలేకపోవచ్చు; కానీ, నీ గానంలో నాకు చేరువైన ఆ సాహిత్యం నా హృదయానికి పరాయి కాదు, నాకు నువ్వు కానట్లే…” అంటూ ఆమెని ట్రాప్ లో పెడతాడు మన కధకుడు .
ఇనుపగేట్ల బృందావనం బయట సిసలు బృందావనం సృష్టిద్దామని, అనారోగ్యాల కుంటిసాకుతో హాస్టల్ లో ఉండిపొమ్మని రోజుల తరబడి పోరగా పోరగా ఒప్పుకున్నట్లు ఆమె సంకేతాలిచ్చి కూడా సంకేతస్థలానికి చేరకుండా ఆశాభంగం కలిగిస్తుంది.
అలవాటు లేని అబద్దానికీ, చేతకాని బుకాయింపుకి మధ్య లోలకం కాలేని భారతి తల్లడిల్లిపోయింది. సత్య సాయి దృష్టి సారని సంకేతస్థలమేదైనా ఉంటుందని ఊహకి కూడా అందక ఆమె నలిగిపోయింది. సాయి సర్వజ్ఞుడు. ఆయనకు అజ్ఞాతమైంది, అజ్ఞేయమైంది లేదు – ఇది ఆమె నమ్మకం. ‘ప్రేమ’ అనే భావం ఆమెకు తప్పులా తోచలేదు. ఏకాంతంగా కలుసుకోవడంతో కూడా పేచీ లేదు. అబద్ధం సాయంతో ఆ పని చేయడం, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగడంలా అనిపించింది.
భారతి సాంగత్యానికి ముందు బాబా కథకుడికేమీ కారు. అర్హతానర్హతలు చూసుకునే వ్యవధిలేని తమకంతో వేణువులో చొరబడ్డాక గాలికి కొత్త గుర్తింపు, మరో అస్థిత్వం. అయితే వేణువులోంచి కొత్త జన్మ ఎత్తినంత మాత్రాన, బలాదూర్ గాలులన్నీ ఏకతారాగాన్ని వినిపిస్తాయా? పోనీ ఆ వేణువు ఆశించే రాగాన్నేదైనా పలికిస్తాయా – లేదు! “నేనేమి బాబాని ఆమె కళ్ళతో చూడటంలేదు. భారతే లేకపోతే బాబా నాలోకి అసలు ప్రవేశించగలిగేవారే కాదు.” అని చెప్పుకుంటాడు కథకుడు. కీర్తనలో కలసిపోయి విడదీసి చూడటానికి వీల్లేని స్వరసప్తకంలా ఉన్నారు బాబా భారతి జీవితంలో.
నుదుట భారతి ఇచ్చిన విభూతి, మెడలో భారతే ఇచ్చిన రుద్రాక్షమాల, తెల్లబట్టలు ముకుళిత హస్తాలు యావత్ భక్తశ్రేణికి అమితాశ్చర్యం. బహుశా, పాపులను ప్రక్షాళించే సాయి మహత్యాలలో ఒకానొకటి ఈ మార్పు. తనకోసం మారాడన్న తీయని అపోహలో భారతికి సగం సంతోషం. ఏ భావాలు లేనిది, లేదా కనిపించనిది బాబా ముఖానే. పాదాల మీద వాడిపోతాడు కథకుడు. ఇది కథకుడు తనంతటతానుగా చేరుకున్న గమ్యమా లేక భారతి కోసం వేసుకున్న చద్మవేషమా? కావాలని చేసిందో, అనుకోకుండా అలా జరిగిందో గానీ, కాస్త ఎడంగా ఉన్న ఆడవాళ్లలోంచి వచ్చిన భారతి కూడా పాదనమస్కారం చేస్తుంది, ఇద్దర్నీ ఆశీర్వదించమన్నట్లు!
భారతికోసం పుట్టిన భక్తి అంటూనే తనను నమ్మిన భారతిది అపోహతో కూడిన సంతోషం అంటాడు కథకుడు. ఇదొక ద్వైదీభావం. కథలో ఇదొక పారడాక్స్. ఇదొక సహజ నెయ్యమో కాదో తెలీదు. ఏదో దివ్య ఆవాహనకి లోనవుతున్నానన్న భ్రమలో అతడి రూపం మారింది. తెలీకుండా తనలోకి చొరబడిన బేలతనం భక్తితత్పరత వేషంలో పొర్లుదండాలు పెట్టిస్తూ ఉంది.
ఆమె మీద అతడికి ఎనలేని ప్రేమ. స్వంతం చేసుకోవాలనే తొందరతపన. ఆమెకు సాయిమీద అపారమైన భక్తి. తత్ఫలితంగా ఇద్దరి భావిజీవితం సాయి చేతుల్లో! ఇదంతా దేనికి? “స్వామి ప్రమేయం లేకుండా, ఆయన పాత్రని కుదించి… లెంపలేసుకుంది ఆమె. అతడినీ వేసుకోమంది. స్వామికి సగటు బలహీనతలను అంటగడుతున్నందుకు. హతవిధీ ఎవరి జీవితం ఎవరి చేతుల్లో?
ఇందులో కధకుడి ఇంకొక కన్ఫెషన్ కూడా ఉంది – పదం, భావం మధ్య పలుకుతో వంతెనలు వేసే గాంధర్వ గాత్రంతో ఆమె ఎలుగెత్తి పాడుతుంటే ఉన్నపళాన పరుగున వచ్చి వరాలివ్వనివాడు దేవుడా అన్పిస్తుంది అతడికి. భోరువానలో నిస్సహాయంగా తడిసిపోతున్న నేలకి పుట్టగోడుగులెత్తే తన ఆదుర్దాని ‘ప్రేమ’ అనే భ్రమలో ఆమె ఉంది గానీ, ఈ జగద్దాత్రికి నేను జతగాడ్నా? ఈ దివ్యగాన పారిజాతాన్ని తెంపుకెళ్ళే అర్హత నాకేముందని – అనుకుని నా పరీక్షలోనే ఓడిపోయిన నేను, సాయి ముందు కడపటి ఆశగా నిల్చుండే వాడినే కాదేమో. ఈ అసంబద్ధ దృశ్యంలో భాగాన్నయి – అంటాడు.
స్వామి ఏకాంత దర్శనం తరువాత అతడికి చెపుతుందామె. “వద్దన్నారు. ఇక మీదట నిన్ను కలవడం కూడా వద్దన్నారు బాబా.”
ఆమె గొంతులో ఒక జీర… గొంతు సవరించుకుంటే పోయే జీర కాదు. అతడిలో ఒక తెర . గాలి గదమాయిస్తే తొలిగే తెరా కాదు.
ఈ మొత్తం కథనపద్ధతిలో ఆటొఫిక్షన్ ఉందేమో కాని తను కోరుకున్న వ్యక్తికి దగ్గరకావడానికి రచయిత కావాలని చేసిన నెట్ వర్క్, వంచన బోల్డంత ఉందీ కథలో. సంఘటనలను అనుకూలంగా మలుచుకున్నంతమాత్రాన చివరికి జరిగిందేమిటి? నేననుకోవడం సత్యసాయి కూడా నిమిత్తమాత్రుడే. probability కి లేక coincidental కి లోబడి జరిగిన ముగింపులో సహజన్యాయమే జరిగిందని నాకనిపిస్తూ ఉంది. unfolding itself is different from manifolding & manipulation by other self. నేను కరక్ట్ కాకపోవచ్చు కూడా.
అంతేకాక కథ మొదట్లో ఏ భరోసా (నమ్మకం) ఇవ్వలేని అనాలోచిత ప్రియుడనే అతడి మొదటి ప్రేయసి ఫిర్యాదు, ఏకతా రాగాన్ని లేక కనీసం ఆమె ఆశించే రాగాన్ని వినిపించలేని తేడా, భారతి వల్ల దగ్గరైన బాబా మీద అపనమ్మకం, తనమీద అపనమ్మకం ఇవన్నీ ముగింపుని ఎక్కడకు చేర్చాలో అక్కడకే చేరుస్తాయి. తనకు తాను దారి చేసుకున్న ముగింపు ఇది. ఇది కథకుడి చేతిలోనో, ఆమె చేతిలోనో చివరికి బాబా చేతుల్లోనో లేదు.
మరొక రకంగా ఇదంతా నమ్మకానమ్మకాల అపసవ్యపు దోబూచులాట అని కూడా అనిపిస్తుంది. కథకుడే చెప్పినట్లు ప్రపంచంలో దేవుడి మహత్యాలకన్నా దేవుడిమీద విశ్వాసం చేసిన విన్యాసాలే అద్భుతం. సాయిమీద నమ్మకం ఆమెకు మేలే చేసిందా? అతడి అపనమ్మకం తిరిగి మళ్ళీ ప్రాబబిలిటీ సిద్ధాంతానికే దారి తీసిందా? వాళ్ళు ఏకం కాకపోవడానికి కారణం అతడి అపనమ్మకమా? సమాధానాలు లేని ప్రశ్నలెన్నో. అడగకుండానే దొరికే జవాబులెన్నో. వెరసి ఇక్కడిదాకా ప్రయాణించిన మనుషులు ఎవరెటువైపు వెళ్ళిపోయారు? ఈ కలయిక లేక విడిపోవడం కేవలం అట్ట చివర చెప్పినట్లు All persons, living and dead, are purely coincidental, and should not be construed. అంతేనా?
kottapali
Totally agree with Mehar. Started reading with interest, prodded by the intriguing opening lines. However, that interest transformed into impatience and finally dissolved into apathy as I realized that it is a mere rehash or reproduction of the book.
మెహెర్
ఈ “తేరా నాం ఏక్ సహారా” పుస్తక సమీక్షలో పుస్తకంపై మీ అభిప్రాయం చెప్పిన భాగం చాలా తక్కువగా, అదీ అస్పష్టంగా వుండటం నిరాశ పరిచింది. మీరు కథ దొహరాయించే క్రమంలో దాదాపు అంతా పుస్తకంలో రచయిత వాడిన వాక్యాలనే వాడుకున్నారు; వాటిని కొటేషన్స్‌లో పెట్టి వుంటే బాగుండేది. ఏవి మీ వాక్యాలో ఏవి రచయిత వాక్యాలో పాఠకులకు విభజన తెలిసేది.