తప్పక తెలుసుకోవలసిన రెండు తెలుగు పుస్తకాలు (నా అభిప్రాయంలో!)
ఒకటి – “తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు” – తలిశెట్టి రామారావు
మరొకటి – “మరపురాని మాణిక్యాలు” బ్నిం
ఇటీవలి కాలంలో కినిగె.కాం పుణ్యమా అని నేను చదవగలిగిన పుస్తకాలలో, రెండు పుస్తకాలు ప్రతి తెలుగు ఇంటిలోనూ ఉండాల్సినవి అని నాకు అనిపించింది. తరువాతి తరాలకి తెలుగు గురించి ఆసక్తి కలిగించడానికి ప్రస్తావించాల్సిన పుస్తకాలు ఇవి రెండూ, అని నేను నమ్ముతున్నాను గనుక, ఈ రెండింటి గురించి చిన్న పరిచయం:
తలిశెట్టి రామారావు గారు తెలుగులో తొలి కార్టూనిస్టట. వారి గురించి చెబుతూ ఆరుద్ర ఇలా అన్నారు:
“తలిశెట్టి తొలిసెట్టి
దండ మతనికి పెట్టి
ఇంద రెక్కిరి ఉట్టి
ఓ కూనలమ్మా!”
“భారతీయ చిత్రకళ- తలిశెట్టి రామారావు” అని ఎక్కడో చూసాను కానీ, ఈయన గురించి ఈ పుస్తకం చూసే దాకా నాకసలు తెలీదు. పుస్తకం మొదటి కొన్ని పేజీలు ఆయన గురించి వివిధ వ్యక్తులు రాసిన ముందుమాటలు ఉన్నాయి. మామూలుగానైతే ఇలా లక్ష ముందు మాటలుంటే నాకు చిరాకు కానీ, ఈసారి మాత్రం ఆసక్తిగా చదివాను. తరువాత, తలిశెట్టి గారి బొమ్మలు, కింద ఉన్న వ్యాఖ్యానాలను చూసాను. అన్నీ అర్థమయ్యాయి అనలేను..అన్నీ బాగున్నాయనీ అనను. కానీ, కొన్ని మాత్రం కడుపుబ్బా నవ్వించడమే కాదు… చాలా సమకాలీనంగా అనిపించాయి కూడా. దానిదేముందీ అంటారా? ఎనభై ఏళ్ల నాడు గీసిన బొమ్మలకి ఇంకా సమకాలీనత ఉంది అంటే మాటలా మరి? వారి బొమ్మలు – దాని కింద వ్యాఖ్యానం : రెండు విడదీయరానివి అనుకుంటాను. ఏ ఒక్కటి తొలగించినా, రెండోదానికి విలువ ఉండదు.
కొన్ని బాగా నవ్వించే, బొమ్మ ప్రధానమైన వ్యంగ్యాస్త్రాలు (నా అభిప్రాయం: కార్టూన్లలో బొమ్మా, వ్యాఖ్యానం రెండూ అవసరం. కానీ, బొమ్మ కొంచెం ఎక్కువ అవసరం!).
“ఎలాగైతేనేమి మామా-అల్లుడూ కలుసుకున్నారు” (౧౯౩౦)
“పట్టణములలో దేహ పరిశ్రమకు వీలులేదని విచారించవద్దు.” (౧౯౩౧)
“పట్టణములలో మోటారు ప్రమాదములు లేకున్డుతకు కొన్ని సూచనలు” (౧౯౩౧)
కొన్ని మామూలు వ్యంగ్యాస్త్రాలు: (అంటే, బొమ్మ అవసరం లేకున్నా అర్థమయ్యేవి)
“గొప్పవారిని నాటకానికి పిలిచినా యెడల”
“కాబోయే వకీల్లకు కొన్ని సూచనలు”
“కాబోయే గ్రంథకర్తలకు కొన్ని సూచనలు”
“బాగుపదదల్చుకున్న వారికి కొన్ని సూచనలు”
“ప్రబంధములలోని విరహము”
“బిలియర్ద్సు ఆటగాడు పక్షిని కొట్టుట”
“కేరమ్స్ ఆటాడువారు బిస్కట్లు తినుట”
-ఇలాంటివి చూస్తూ ఉంటే చిన్నప్పటి రష్యన్ పుస్తకాల్లో ఉండే పిల్లల బొమ్మల కథలు – గుర్తొచ్చాయ్.
కొన్ని బాగున్నాయి కానీ, అంత అద్భుతంగా అనిపించలేదు. కానీ, మొత్తంగా పుస్తకం మాత్రం నాకు చాలా నచ్చింది. ఈ పుస్తకం నేను నా తరంలో తెలుగు పుస్తకాల గురించి ఆసక్తి చూపే అందరికీ సూచిస్తాను. అయినా, వందరూపాయల పుస్తకానికి పది డాలర్లు ఎందుకో అర్థం కాదు. అక్కడ నుండి షిప్పింగ్ చేయించుకుంటే, ఎలాగో ౧౦౦ రూపాయల పుస్తకం పది డాలర్ల పైనే ఖరీదు కడుతుంది. ఇంక ఉండేదే పది డాలర్లు అంటే ఎలా ఉంటుందో!
ఇందాక ప్రస్తావించిన ఆరుద్ర కూనలమ్మ పదాల్లో తక్కిన భాగం:
“యస్.బ్రహ్మ ‘యో’ వ.పా.
గీయ ఒక్కొక్క తఫా
ప్రతి మనిషి బేవఫా
ఓ కూనలమ్మా!
గుర్తేనఝ “కే యస్సు”
గుర్తుంది ఓయస్సు
అతడో? ఒయాసిస్సు
ఓ కూనలమ్మా!
చేట్టాను ఊమెన్ను
శ్రీభరుండు రవన్ను
తెలుగు ఫన్నీ మెన్ను
ఓ కూనలమ్మా!”
అప్పట్లో నా బ్లాగులో ఇక్కడ ప్రస్తావించిన వల్ల గురించి ఆరాలు అడిగాను కానీ, ఎస్.బ్రహ్మ, కే.ఎస్., రవన్ ఎవరొ మాత్రం తెలుసుకోలేకపోయాను. మీకేమన్నా తెలిస్తే రాయగలరు. అలాగే, సదరు భారతీయ చిత్రకళా పుస్తకాన్ని చదివిన వారెవరన్నా కాస్త పరిచయం చేయగలరు!
పుస్తకం వివరాలు:
తొలితెలుగు వ్యంగ్య చిత్రాలు – తలిశెట్టి రామారావు
ముద్రణ: ఏప్రిల్ 2011
ప్రచురణ: ముల్లంగి రమణారెడ్డి, మానవధార, విశాఖపట్నం. (ఫోను: 0891-2722189)
ప్రతులకు: ప్రచురణ కర్త, విశాలాంధ్ర, నవోదయ బ్రాంచీలు
ఆన్లైన్ ఎడిషన్: కినిగె.కాం
100 Rs/10 $
AVKF Link here.
***************************
మరపురాని మాణిక్యాలు – బ్నిం
ఈ పుస్తకం నేను చూసిన తెలుగు పుస్తకాల్లో ఒక కొత్త ప్రయోగం. ఇందులో వందకు పైచిలుకు ప్రముఖ తెలుగువారిని తీసుకుని (పుస్తక ముద్రణ సమయానికి జీవించి లేని వారిని మాత్రమే పరిగణించారు), వారి గురించి నాలుగు ముక్కల్లో ఆంధ్రాంగ్ల భాషల్లో పరిచయాలు, వారి ఫోటోలు, బ్నిం గారి క్యారికేచర్లు ఉంటాయి. ఇదిగో, సాంపిల్ కి, పేజీలు ఇలా ఉంటాయన్నమాట. ఒక్కోపేజీలో ఒక్కొక్కరి గురించి ఈ పద్ధతిలో రాస్తారు.
ఇందులో నాకు ప్రధానంగా నచ్చినవి రెండు అంశాలు.
౧) క్యారికేచర్లు కొన్ని చోట్ల అద్భుతంగా కుదిరాయి. ఉదాహరణకి కాంతారావు కు గీసింది, వేటూరికి గీసింది జత చేస్తున్నాను.
౨) ఇక్కడ వాడిన ఇంగ్లీషు అంత గొప్పగా లేకపోయినా, ఏదో ఒక ప్రయత్నం అన్నా చేసారు కనుక, ఆ ఆలోచన కలిగినందుకు బ్నిం గారికి నమస్కారాలు. తెలుగు తెలిసిన వారిలో, తెలుగు చదవడం అలవాటు లేని వారు కోకొల్లలు. కాస్త మెరుగైన ఇంగ్లీషు గనక ఉంది ఉంటే, డైరెక్టుగా అందరికీ ఈ పుస్తకం రికమెండ్ చెయ్యొచ్చు – తెలుగేతరులకి కూడా!!
ఇక, ఇంత మంది గురించి రాసి, వీళ్ళ ఫోటోలు సేకరించి, చక్కని కేరికేచర్లు గీయడం అంటే మాటలు కాదు. అన్ని కేరికేచర్లు బాగున్నాయ్ అని నేను అనను. అయితే, గీయడంలో చాలా సృజనాత్మకత చూపించారు అనిపించింది. ముందుకు సాగే కొద్దీ, ఎందఱో తెలుగు వారి గురించి కొత్తగా తెలుసుకున్నాను.
ఎవరైనా పిల్లలకు తెలుగు పుస్తకం కానుక ఇవ్వాలనుకుంటే, తప్పక ఈ పుస్తకం ఇవ్వొచ్చునని అనిపించింది. బ్నిం గారికి మరోసారి ధన్యవాదాలు (ఇదివరలో టీవీ లో కథ-మాటలు బ్నిం అని చూడ్డం, అయన కథలు అనేకం చదవడం తప్పిస్తే, ఈయన ఇలాంటి పుస్తకాలు కూడా ప్రయత్నించారని తెలీదు నాకు!). ఇలాంటివి మరేవైనా పుస్తకాలుంటే తెలుపగలరు. అలాగే, బహుభాషా చదువరులకి ఒక విజ్ఞప్తి : తమిళ, కన్నడ, మళయాళ…ఇతర భారతీయ భాషల్లో ఇలాంటి పుస్తకాలు వచ్చిన దాఖలాలు ఎవన్నా ఉంటే తెలుపగలరు.
పుస్తకం వివరాలు:
మరపురాని మాణిక్యాలు – బ్నిం భావ చిత్రాలు
రచన: బ్నిం
తొలి ముద్రణ: 2010
పేజీలు: 148
వెల: 125 రూపాయలు/15 డాలర్లు!
ప్రతులకు: నవోదయ, విశాలాంధ్ర శాఖలు
ఆన్లైన్ కొనుగోలుకు: కినిగె.కాం
AVKF Link here.
sreeram murthy chaturvedula
My 2cents
S’ Brahmayo ante Sakshathu brahmyoo anu vaddai papaiah ani anukuntanu
రాజేష్ దేవభక్తుని
“మరపురాని మాణిక్యాలు” సంగతేమో నాకు తెలియదు గాని, తిరుమల రామచంద్ర గారు వ్రాసిన “మరపురాని మనీషులు” పుస్తకం మాత్రం చాల బాగుంటుంది, పరిచయం చేసిన ఇరవై, పాతిక మంది చిత్రపటాలతో సహా ….! అది ఇప్పటివరకు రెండు సార్లే ముద్రణ జరిగింది, నా దగ్గర మొదటి ముద్రణ పుస్తకం ఉంది. రెండో సారి ముద్రణ జరిగి కుడా ఆ పుస్తకం ఎక్కడా దొరకడం లేదు. నెలరోజుల క్రితం విజయవాడ వెళ్ళినప్పుడు, రెండో ముద్రణ ఒకేఒక కాపి ఉంది, అది కుడా ఇప్పుడు ఉందొ లేదో…! ఇది కుడా తప్పనిసరిగా ఉండాల్సిన పుస్తకేమే … 🙂
రాజేష్ దేవభక్తుని
….. ఆ ఒకేఒక్క కాపి ఉన్న పుస్తకాల దుకాణం ఏలూరు రోడ్ లో ఉన్న “విశాలాంధ్ర బుక్ హౌస్”
ఆనంద్
మరపురాని మాణిక్యాలు పుస్తకాన్ని మొదట చూసినప్పుడు పుస్తకం చాలా బాగుందనుకున్నాను. “తెలుగు కూడా మర్చిపోయినవాళ్ళకి ఇంగ్లీషు ఇంట్రో ఇందులో ఉంది.” కానీ తెలుగు మాత్రమే వచ్చిన వారు దీన్ని చదవలేదు ఎందుకంటే ఇంగ్లీషులో ఉన్న విషయాలు తెలుగులో లేవు కనుక. నా ఉద్ధేశంలో ఇది తెలుగు భాషకు చాలా ప్రమాదకరం. తెలుగు కవులగురించి ఇంగ్లీషు వస్తే కానీ తెలుసుకోలేని దుస్థితి పాఠకులకు రాకూడదనే కోరుకుంటున్నాను.
సౌమ్య
“యస్.బ్రహ్మ ‘యో’ వ.పా.” – Yes, Brahma అంటారా? Interesting. Let us say its that.
Yes, Chettan Oomen is Oomen, a Malayali Cartoonist, as Sivaramaprasad garu pointed out in my blog back then.
Here is a brief note he wrote on Oomen in his blog.
http://saahitya-abhimaani.blogspot.com/2009/08/blog-post_02.html
జంపాల చౌదరి
>>కానీ, ఎస్.బ్రహ్మ, కే.ఎస్., రవన్ ఎవరొ మాత్రం తెలుసుకోలేకపోయాను
>>కానీ, ఎస్.బ్రహ్మ, కే.ఎస్., రవన్ ఎవరొ మాత్రం తెలుసుకోలేకపోయాను
రెండవ చరణం వడ్డాది పాపయ్య (వ.పా) గారి గురించి అనుకుంటాను. yes బ్రహ్మయౌ వ.పా అని చదువుకోవాలేమో ఆ పాదాన్ని.
కే.ఎస్. ఎవరో నాకు తెలీదు.
నాలుగవ చరణంలో కార్టూనిస్ట్ పేరు ఊమెన్. ఆంధ్రపత్రిక దినపత్రికలోనూ, వారపత్రికలోనూ కార్టూన్లు వేసేవాడు. తెలుగువాడు కాదని గుర్తు (మళయాళీ?).