World book day

పుస్తకాలకో రోజు 🙂 పుస్తకాలకి ఓ రోజేంటి, ప్రతి రోజూ ఇచ్చేయొచ్చు అనిపించింది World book day అన్న పేరు చూడగానే. తరువాత, ఏమిటీ రోజు, ఏమా కథ అని తేల్చుకుందామని దాని ఇంటిపుట (అదేలెద్దురూ, హోం పేజీ..) లో కాసేపు తిరగడం మొదలుపెడితే చాలా విషయాలు తెలిసాయి.

ఏమిటీ పుస్తకాల రోజు?: దాదాపు డెబ్భై ఏళ్ళ క్రితం నుండీ St George Day నాడు Catalonia ప్రాంతంలో రోజాపూలు, పుస్తకాలు బహుమతిగా ఇచ్చేవారట. కాలక్రమంలో ఇదే ఐర్లండ్ మరియు ఇంగ్లండ్ లలో ప్రతి ఏటా మార్చి ఐదవతేదీన పుస్తకాల దినంగా జరుపుకోడానికి నాంది అయింది. పుస్తకాన్నీ, చదివే గుణాన్నీ సెలబ్రేట్ చేసుకునే రోజు ఇది. అయితే, UNESCO ఈ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలలో ఏప్రిల్ 23 ను పుస్తకాల దినంగా జరపాలని నిర్ణయించింది. ఈ వేడుక కొందరు ప్రచురణసంస్థలు, అమ్మకం దారులు, ఇతర ఆసక్తిపరులు కలిసి పఠనాభిలాషను జనాల్లో పెంపొందించేందుకు ఏర్పరిచినది.

ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇంగ్లండ్, ఐర్లండ్ దేశాల్లోని పిల్లల్లో పఠనాసక్తిని పెంచి వారికి పుస్తకాలతో పరిచయం కలిగించడం. దీనికోసం వీరి వద్ద నమోదు చేసుకున్న పాఠశాలలు అన్నింటికీ ఐడియాలు, సూచనలూ ఉన్న ఓ స్కూల్ పాక్ పంపుతారు. తరువాత దేశవ్యాప్తంగా పుస్తకాలకి సంబంధించి రకరకాల ఆటపాటలు వగైరా ఉంటాయి. కాలక్రమేణా ఇందులో పిల్లలే కాక పెద్దలనీ కలుపుకుంటూ పోయారు. ఈ వేడుకల్లో జరిగే కార్యక్రమాల వివరాలు ఇక్కడ చూడవచ్చు.

అన్నట్లు ఈ రోజుకి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి, చారిత్రికంగా. షేక్స్పియర్ మరణించిన రోజట. ఇంకా వివరాలు కావాలంటే యునెస్కో వారు ఈ రోజు గురించి పొందుపరిచిన చరిత్రను ఇక్కడ చూడండి.

ఆ వంద దేశాల్లో భారతదేశం ఉందో లేదో అన్నది అక్కడ తెలియట్లేదు. కానీ, ఇలాంటి ఓ వేడుక ప్రతి ఏటా మన ప్రభుత్వ పాఠశాలల్లో జరిగితే అది అక్కడి విద్యాప్రమాణాల్లోనూ, అక్కడి పిల్లలకి ఇవ్వగలిగే exposure లోనూ ఎంత మార్పును కలిగించగలదో ఊహించలేమా? పైన చెప్పినట్లు, ఇది ఆ దేశాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం కాదు. కనుక, ఇక్కడ కూడా మనం ప్రభుత్వం కోసం ఎదురుచూడాలి అన్న నియమమేమీ లేదు. మన ప్రచురణకర్తలు కూడా ఇలాంటి కార్యక్రమమేదైనా చేస్తూ ఉన్నట్లైతే, అది మీకు తెలిసినట్లైతే ఇక్కడ దాని వివరాలు తెలుపండి. సుధామూర్తి గారు ఇంఫోసిస్ ఫౌండేషన్ తరపున ఇలాంటిదే లైబ్రరీలకి పుస్తకాలిచ్చే కార్యక్రమం ఏదో చేస్తున్నట్లు ఇదివరలో తెలిసిన విషయమే.

సారాంశమేమిటంటే, ఇవాళ ప్రపంచ పుస్తకాల దినం (తల్లిదినం ఏంటి, తద్దినం లాగా…అన్న పడమటి సంధ్యా రాగం డైలాగ్ గుర్తొస్తోంది పుస్తకాల దినం అంటూ ఉంటే.) కనుక, మనమందరం కలిసి పుస్తకానికి జైహో అందాం.

You Might Also Like

8 Comments

  1. పుస్తకం » Blog Archive » ప్రపంచ పుస్తక దినం

    […] నాడు పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసాలు ఇక్కడ (2009) మరియు ఇక్కడ (2010) చదవచ్చు. (No Ratings Yet) […]

  2. పుస్తకం » Blog Archive » అబ్బబ్బ పుస్తకం!

    […] (గత ఏడు పుస్తకాల దినోత్సవం నాడు పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం ఇక్కడ). […]

  3. Pustakam

    “జైహో” అన్నది ఇటీవలి కాలం లో ప్రాచూర్యం పొందిన పాటని దృష్టిలో ఉంచుకుని రాసినదండీ.

  4. నెటిజన్

    “పుస్తకానికి జైహో”

    పుస్తకానికి జయహొ

  5. పుస్తకం.నెట్

    నెటిజన్ గారికి:

    మీ సూచనలకు నెనర్లు! అక్షరదోషాలను సరిచేశాము.

  6. నెటిజెన్

    అక్షరం మీద ప్రేమతో ఇక్కడికి వచ్చేవారికి అక్షరదోషాలే ముందు ఎందుకు కనబడతాయో! ఆరు నెలల పసిపాపకి స్వర్ణాభరణాలు తొడిగి, అవి రాసుకుని, ఒళ్ళు కందిపోయి, బాధతో ఏడుస్తుంటే, ఆ పాప తల్లి, ఎంత అందంగా ఉందో అని నవ్వుకుంటున్నట్టు..

  7. మాలతి

    కొత్తవిషయాలు తెలిసాయి. ధాంక్స్. నిజమే దినదినమూ పుస్తకదినమే కావాలి. 🙂

  8. chavakiran

    Happy Book Day.

    – back to work now. 🙂

Leave a Reply