వాళ్ళు… వీళ్ళు… పారిజాతాలు — చంద్రలత
జూన్ నెల చతుర ముఖపత్రం చూస్తే కొద్దిగా ఆశ్చర్యం వేసింది. ఈ సారి నవల చంద్రలతగారి వాళ్ళు… వీళ్ళు… పారిజాతాలు. చంద్రలతగారి మొదటి నవల, వర్ధని, చతురలోనే (1996లో) ప్రచురింపబడినా, ఆ తరువాత ఆమె వ్రాసిన రెండు నవలలు – రేగడి విత్తులు(1997), దృశ్యాదృశ్యం (2003) – విస్తృతిలో చతుర పరిమితుల్ని అధిగమించినవి. మళ్ళీ చతుర పరిధిలో ఆమె ఇంకో నవల వ్రాయగలగటం ఆశ్చర్యమే.
వాళ్ళు… వీళ్ళు… పారిజాతాలు ఇద్దరు ‘నీలు’ల కథ. కాదు కాదు, ఎంతో మంది నీలుల కథ. వాళ్ళు -, వీళ్ళు -, పారిజాతాలు అని మూడు ప్రకరణాలు. మొదటి రెండు భాగాల్లోనూ నీలు అనే అమాయకపు ఆడపిల్ల -పారిజాతం చెట్టు చుట్టూ రాలిన పూలని ఏరుకొని మాలలు కట్టి అలంకరించి ఆడుకుంటూ ఆనందించే అమాయకపు ఆడపిల్ల(ల) – కథ. ఇద్దరు నీలుల కథలూ ఒక్కలా మొదలై ఒక్కలానే ముగుస్తాయి. కానీ ఒకరు పుట్టిపెరిగింది తూర్పుతీరంలో, ఇంకొకరు పశ్చిమతీరంలో. వారి భాషలు వేరు. వారి మతాలు వేరు. ఒకరు పేదింటి బిడ్డ; ఇంకొకరు పెద్దింటి బిడ్డ. ఐతేనేం, ఇద్దరూ ఆడపిల్లలే. సాంప్రదాయపు ఉక్కు ప్రాకారాల మధ్య, ఆ సంప్రదాయ రక్షకుల కనుసన్నల మధ్య జీవించిన వారే. చీకటి కూపాల్లో బంధితులైనప్పుడు వారికి కనబడ్డ మిణుగురు పురుగుల్ని వెలుగురేఖలని భ్రమించి వాటి వెంబడి స్వేఛ్ఛా వాయువుల్ని వెతుక్కొంటూ పరుగెత్తినవారే. అప్పుడు వారికి పూర్తిగా తెలియదు ఆ పరుగులు తమను చేర్చే గమ్యస్థానం స్మశానమేనని. రక్తసంబంధానికన్నా దురభిమానానికే శక్తి ఎక్కువన్న సత్యం వారికి అర్థం కాలేదు. ఈ రెండు రాలిన పారిజాతపు పువ్వులు పరువు హత్యలు అని చెప్పబడుతున్న ఆభిజాత్యపు కిరాతకాల బాధితులకు ప్రతీకలు. ఆ హత్యల విషాద పర్యవసానాల గురించి మూడో భాగంలో పారిజాతాలు చెబుతాయి.
ఈ కథలు ఇలాగే ఉండటానికి వెనుకాల చాలా శక్తులే ఉన్నాయి. సంప్రదాయం, దురభిమానం, వెనుకబాటుతనం, అసహనం, మౌఢ్యం, భయం. వీటన్నిటినీ ఒకోసారి సూటిగా, ఒకోసారి సూచ్యంగా రచయిత్రి ప్రస్తావిస్తారు. ఈ హత్యల్లో చచ్చిపోయేది ఒక్క స్త్రీయే అనుకుంటే పొరపాటని, ఈ హత్యల పర్యవసానాలు తరతరాల్లో ప్రతిఫలిస్తాయని విశదంగా తెలియపరుస్తారు.
ఈ కథ చెప్పటానికి రచయిత్రి ఎన్నుకొన్న ప్రక్రియ బాగుంది. రెండు కథల స్థలాల్లోనూ, పాత్రల్లోనూ చాలా వైవిధ్యం ఉన్నట్లు కనిపించినా, ఆంతకు మించిన సారూపత ఉందన్న విషయాన్ని చెప్పకుండానే నిరూపించారు. కుంచించుకుపోతున్న మొదటి నీలు జీవిత వాతావరణాన్ని, విశాలమౌతున్న రెండో నీలు ప్రపంచాన్ని చక్కగా చిత్రీకరించారు. మొదట్లో కొంచెం చిక్కుగా అనిపించినా కథ కొంత ముందుకు వెళ్ళాక సాఫీగా సాగుతుంది. మధ్య మధ్యలో రచయిత్రికి అభిమానమైన, అవసరమనిపించిన విషయాల మీద చిన్న చిన్న ఉపన్యాసాలు (మిగతా పుస్తకాలలో లాగానే) ఉన్నా, వాటిని కూడా విసుగు అనిపించకుండా ఇమడ్చటం ఈవిడకు తెలుసు.
ఐతే ఈ పరువు హత్యలు వాళ్ళకు, వీళ్ళకు సంబంధాలు ఏర్పడినప్పుడు జరిగే మాట నిజమే అయినా, వాళ్ళకూ వీళ్ళకూ మధ్య తేడా మతపరమే అవనక్కరలేదు. ఆభిజాత్యం, దురభిమానం వల్ల ఏ రకంగా మనుషులు తమని విభజించుకున్నా ఇలాటి సంఘటనలు జరిగే అవకాశం పెరుగుతుంది. ఏనాడో కల్యాణ సుందరీ జగనాధ్ గారి కథ అలరాస పుట్టిళ్ళలో మనం ఈ సంఘటన చూడలేదా? చతురలో ప్రత్యేక వ్యాసంలో ఇచ్చిన ఉదాహరణలు చూసినా ఇది తెలుస్తుంది. (ఈ ప్రత్యేక వ్యాసం రాసినవారి పేరు ఇవ్వలేదు).
లాస్ ఏంజెల్స్‌లో పదకొండవ తానా సమావేశాల (1997) సందర్భంగా సీయెస్సీ మురళి గారు నిర్వహించిన మొదటి తానా నవలల పోటీలో లక్షా ఇరవైవేల రూపాయల బహుమతికి చంద్రలతగారి రేగడి విత్తులు నవలను ఎంపిక చేసిన బృందంలో నేనూ ఒకణ్ణి. తెలుగులో వచ్చిన మంచి నవలల జాబితాలో తప్పకుండా ఉండే పుస్తకాలలో రేగడి విత్తులు ఒకటి అని ఇప్పటికీ నా అభిప్రాయం. బహుమతి ప్రకటించాక, ఆ నవల రాసింది ఒక యువరచయిత్రి అని తెలిసి చాలా ఆశ్చర్యపడ్డాను. అప్పటికే ఆమె నేనూ నాన్ననవుతా కథకు విపుల పోటీలో బహుమతి గెలుచుకొన్నారు; ఒక నవల, చాలా కథలు ప్రచురింపబడ్డాయి. ఆ తరువాత పద్నాలుగేళ్ళలో చంద్రలత హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తూ, హేతువాద, పర్యావరణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నా, మరిన్ని మంచి కథలు, దృశ్యాదృశ్యం వంటి మంచి నవల వ్రాశారు. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా రెండు పుస్తకాలు (చేప లెగరా వచ్చు, వచ్చే దారెటు) ప్రచురించారు. మడతపేజీ అన్న బ్లాగును నిర్వహిస్తున్నారు. పిల్లలలో సాహిత్యాభిలాషని పెంపొందించడానికి రకరకాలుగా కృషి చేస్తుంటారు. పుస్తకంలోనూ కొన్ని వ్యాసాలు వ్రాశారు. తానా బహుమతిని స్వీకరించడానికి లాస్ఏంజెల్స్ వచ్చినప్పటినుండీ, చంద్రలతగారు మాకు మంచి కుటుంబమిత్రులయ్యారు. వివిధ విషయాలపై ఆవిడకి ఉన్న ఆసక్తి, విశ్లేషణా శక్తి, గాఢాబిప్రాయాలు నన్ను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. తాను రాసే విషయాల గురించి శ్రద్ధగా అధ్యయనం చేయడం, నిశితంగా పరిశీలించడం, వాతావరణాన్నీ, సంఘటనలనీ, మనస్తత్వాలనీ సహజంగా చిత్రించడం చంద్రలత గారి బలం.
చతుర సైజులో, బోలెడు బొమ్మలు, ప్రకటనలు, ఛలోక్తులు, పెట్టె కథలు, పొట్టి కవితలు కలుపగా 86 పేజీలు నిడివి ఉన్న ఈ కథనాన్ని నవలగా కాకుండా పెద్ద కథగా వర్గీకరించ వచ్చేమో. ఈ కథల వస్తువు పాతదే అయినా, ఆ వస్తువు పరిచయం, విశ్లేషణ ఆసక్తికరంగా ఉన్నాయి.
—
వాళ్ళు… వీళ్ళు… పారిజాతాలు
జూన్ 2011
చతుర
వసుంధర పబ్లికేషన్స్,
ఈనాడు కాంపౌండ్, సోమాజిగూడ, హైదరాబాద్ 500 082
ఈ పుస్తకం ఎలక్ట్రానిక్ కాపీని ఇక్కడ చదువవచ్చు.
********************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానా పాలక మండలి (Board of Directors) అధ్యక్షులుగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.
********************
Leave a Reply