పతంజలి తలపులు
“పతంజలి తలపులు” పుస్తకం కె.ఎన్.వై.పతంజలి గారి గురించి ఆయన స్నేహితులు, అభిమానులు, తోటి ఉద్యోగులూ, ఇతరులూ రాసిన వ్యాసాలు. “పతంజలి భాష్యం” గురించి చాలా విన్నాను కానీ, ఎప్పుడూ చదవలేదు. “సాక్షి” పత్రిక పెట్టిన తొలిరోజుల్లో ఈయన పేరు తరుచూ చూశాను కానీ, అసలీయన ఎవరన్నదీ తెలియలేదు. అయితే, ఈ పుస్తకం చదువుతూ ఉంటే, అందులో అక్కడక్కడా ఆయన అన్న మాటలూ అవీ వింటూ ఉంటే, అసలేం రాసారు? అన్న కుతూహలం చాలా పెరిగిపోయింది. రెండు కథలు మాత్రం ఒక స్నేహితురాలి సాయంతో ఆంలైన్ లో చదవగలిగాను. ఇంతలో, ఆయన రచనల ఆంగ్లానువాద పుస్తకం ఒకటి దొరికింది. ఇంకా చదవడం మొదలుపెట్టలేదు.
అసలు విషయానికొస్తే, ఈ పుస్తకంలో పతంజలి గారి పాత్రలు మొదలుకుని, అభిమానులు దాకా, వ్యాసాలు, కథలూ, పద్యాలూ, జ్ఞాపకాలు ఇలా రకరకాల పద్ధతుల్లో రాశారు. కొన్ని పతంజలి గారిపై గౌరవాన్ని కలిగిస్తే, కొన్ని కుతూహలాన్ని పెంచాయి. కొన్ని రాసిన వారిని గూర్చి అయోమయంలో పడవేస్తే, కొన్నేమో మరీ భట్రాజు పొగడ్తల్లా అనిపించాయి. అసలుకే ఒకే మనిషి గురించి ఉన్న వ్యాసాలేమో, అదే పనిగా చదవడం కష్టం. అందువల్ల, అప్పుడు కొన్నీ, ఇప్పుడు కొన్నీ చదువుతూ వచ్చా కానీ, అలా కూడా, వీటిల్లో చాలా వ్యాసాలు వీరాభిమానం తప్పిస్తే మరేదీ కాదు. అలాంటివి రాకూడదని కాదు కానీ, అదే మాట చదివి చదివి…విసుగు పుట్టే అవకాశం లేకపోలేదు. నా మట్టుకు నాకు వ్యాసక్రమ పట్టిక పరంగా చూస్తే మొదట్లో చదివిన వ్యాసాలే బాగా వచ్చినట్లు అనిపించాయి.
ఆయన గురించి కొందరి మాటలు:
“మిత్రులందరికీ ఆయన స్మృతి ఒక దవనం. అది పరిమళిస్తూ ఉంటూ, నెమరువేసుకునే కొలది బాధగానూ, రుచిగానూ, శక్తి నింపేట్టుగానూ, నిలబెట్టేట్టుగానూ ఉంటుంది.” (శివారెడ్డి)
“ముందుకు మిగిలాడు పతంజలి. మనము వెనుకకు మిగిలామంతే!” – విశ్వేశ్వరరావు.
అతడి మాటలకు అక్షరాలు లేవు.
అతడొక వాక్య విస్మృతి
అతడొక వాగ్విశ్రాంతి
(-ఏం.ఎస్.నాయుడు)
ఏదో ఒక పేజీ చదివాక
మన రక్తంలోకి జోరబడతాడు!
-అరసవిల్లి కృష్ణ
“కవిత్వంలో వక్రోక్తి అంటారే, అదే పతంజలి” అంబటి సురేంద్రరాజు.
ఈ పుస్తకంలోనే ఒక చోట “గొప్ప రచయితలు సమాజానికనే మాటేమో కానీ ఋణగ్రస్థులై ఉంటారెప్పటికిన్నూ. సాహిత్యం చివరాఖరికి వారికి ఋణపడిఉంటుందనుకోండి” అంటారెవరో. చాలా బాగా చెప్పారు అనిపించింది. అలాగే, “నువ్వెప్పుడు చచ్చిపోయినా అకాల మరణమే. సకాలంలో ఎవ్వరూ మరణించరనేది అందరికీ తెలిసిన రహస్యం” – అన్న శ్రీశ్రీ మాటలను సరిగ్గా సందర్భోచితంగా వాడుకున్నట్లు అనిపించింది. ప్రత్యేకం ఈ పుస్తకంలో కొన్ని చోట్ల అభిమానం చాలా ఎక్కువైపోయినప్పుడు ఈ మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చాయి. మొత్తానికి పుస్తకం చదివాక, పతంజలిని చదవాలి అని గట్టిగా అనిపించింది.
కానీ, ఇంత చేసిన వారు, కాస్త అచ్చుతప్పుల్ని సరిచూసుకుని ఉండాల్సింది. ఒకటీ అరా అంటే పర్లేదు కానీ, నేను కావాలని చూడకపోయినా బానే కనిపించాయి నాకు.
ఇప్పటికి – ఇలా మనిషి పోయాక వెలువడ్డ స్మారక వ్యాసాల సంపుటి చదివి ఆ మనిషి గురించి కుతూహలం ఎక్కువైపోవడం ఇది మూడో కేసు. ఇదివరలో – బూదరాజు రాధాకృష్ణ గారి విషయంలోనూ, చిత్తూరు నాగయ్య గారి విషయంలోనూ కూడా ఇదే అయ్యింది. పతంజలి గారు పోయినప్పుడు (మార్చి ౨౦౦౯) అప్పుడప్పుడే అడుగులు వేయడం నేర్చుకుంటున్న పుస్తకం.నెట్కి ఎవరో “అంత పెద్ద రచయిత పోతే, ఒక సంతాప వ్యాసం అన్నా పెట్టలేదు..మీదేం పుస్తకాల సైట్” అనో అలాంటిదేదో కసరడమూ, “మాకు నిజంగానే ఆయన గురించి తెలీదు – సంతాప వ్యాసం రాయాలన్నా….పోనీ మీరు రాయండి అనగానే, అవతల జవాబు రాకపోవడమూ గుర్తొస్తోంది ఇప్పుడే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే, ఆసక్తిగలవారు, విషయాలు తెల్సినవారూ ఎవరైనా – పతంజలి గారి గురించి కాస్త వివరంగా రాయగలరు!
ఈ పుస్తకాన్ని కినిగె.కాం ద్వారా ఇక్కడ చదవొచ్చు.
Anil Reddy
Hi,
For more information on KNY Pathanjali please check: http://knypatanjali.com/
I am also a fan of KNY Pathanjali works…his works are not available in market…currently…
Long back I read Rajugoru.. Vaari Veera Bobbili(1987), Gopatrudu & Pilaka Tirugudu Puvvu(1995) , Choopunna Paata(1998). But I dont have his works now…
His complete works are published as “KNY PATHANJALI RACHANALU” in Feb 2002 by Pathanjali Mithra mandali. I am trying for this book from past 3 years. but didnot get till now…
I want to read “Khaki vanam” also.
My request to all…if any one of you has his works…please mail me anil.battula007@gmail.com.
I will come and take a photocopy and return it to u immediately….please
thanks in advance…
Anil
Anwar
బహూశా పతంజలి గారొ తెలియని అద్రుష్టం , తెలుసుకున్న అద్రుష్టం కూడా, కనీసం పతంజలిగారిని చూడకుండా మాట్లాడకుండా (పతంజలిగారి పేరు కూడా వినకుండా వుండవచ్చు) వున్న జన్మమేమి! థూ అనేంతగొప్పవాడు పతంజలి ఒక్కడే, ఒఖ్ఖడే ….. పతంజలి ప్రభువుకు ముందూ వెనుక పతంజలే .
gksraja
సౌమ్య గారూ! better late than never. ఇప్పటికయినా ఆయన ప్రస్తావన వచ్చినందుకు సంతోషం. కాని వ్యాసం సమగ్రంగా లేదనిపిస్తోంది. ఆయన రచనలు కొన్ని మీరు చదివితే చాలా వ్రాయగలరు. వ్రాస్తారు.
అందరు గొప్పవాళ్ళ గురించీ అందరికీ తెలియాలని లేదు కాని, ఇంత మంచి తెలుగు వ్రాయగలిగే, మీకు ఇంగ్లిషు అనువాదం ఎందుకు అవసరమయ్యింది? పతంజలి గారి కధల్లో వ్యంగ్యం తో బాటు యదార్ధ, వ్యదార్ధ చిత్రీకరణ అద్భుతం. అందుకోసం తప్పక చదవాల్సిన ఆయన కధలు– ‘బెబ్బులి’, ‘ఖాకీవనం’ .
dvenkat
హయ్యో! పతంజలిని చదవలేదా!ముళ్ళపూడి తర్వాత అద్భుతమైన వ్యంగ్య రచయిత ఆయన ఒక్కరేనేమో. గోపాత్రుడు టాప్.మన బండ రాజకీయ నాయకులని వెటకారం చేసే అప్పన్న సర్దార్ తప్పక చదవాలి.
తెలుగు వాళ్లకి బాపు తెలియకపోడం ఎంత నేరమో పతంజలి తెలియకపోడం అంత నేరం.:)
murali
పతంజలి పరిచయం ఉన్నప్పుడు . అతని రచనలు చదవలేదు . చదివాక మిత్రులతో తెలుగులో ఇంత అద్భుతమైన వ్యంగ్యం రాసిన వారు లేరనిపించింది . తనగురించి తాను మార్కెట్ చేసుకొనే కళలో ప్రవేశం లేకపోవడమే పతంజలి లోని పెద్ద మైనస్ అనిపించింది
sharmeela
good article
మల్లీశ్వరి.
పతంజలి సాహిత్యం మొత్తాన్ని ఒకసారి చదవండి సౌమ్యా…చెప్పడానికి మాటలుండవు..ఒట్టి పలవరింతలే…నేనూ ఆ మాయలో పడి ఇంకా తేరుకోనేలేదు…
మల్లీశ్వరి.