జాటర్ ఢమాల్ (కొన్ని ప్రేమకథల్లా..)
వీడి పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. కావాలిస్తే తెలుగొచ్చిన తెలుగువాణ్ణి అడుగు.
***************
మాది అమ్మాయిల బడి. నలుగురు వాచ్‍మెన్లు, ఇద్దరు మాష్టర్లూ, ఒక కాంటీన్ వాడు తప్పించి మగపురుగు కూడా కనిపించదు. నేను ఏడో తరగతిలో ఉండగా, ఎలా వచ్చాడో మరి ఒక పిల్లాడు, మా తెలుగు టీచర్ వేలు పట్టుకొని దర్జాగా వచ్చేశాడు. “ఎవరు?”, “ఎవరు?” అన్న గుసగుసల మధ్యలోనే కబుర్లు చెప్పటం మొదలెట్టాడు.
“సరసం అంటే నాకు తెలీదనుకో.” అన్నాడు అమాయకంగా.
“మనకూ తెలీదుగా!” అన్నారు టీచరు లౌక్యంగా
“మాకు తెల్సుగా” అనుకున్నాం కొంటెగా. నవ్వుకున్నాం ముసిముసిగా.
పరీక్షలవ్వగానే, అందరికీ బై-బైలు చెప్తూ, బుడుక్కి కూడా చెప్పేయటం అయిపోయింది.
***************
పరీక్షలకు కావాల్సిన పుస్తకాలేవో దొరక్క, ఎండలో మాడు పేలిపోతుంటే, నీడకని ఓ కొట్టు దగ్గర ఆగాం. ఇంకా వేడిగాల్పు కొడుతూనే ఉంది. అందుకని పుస్తకాలను చూసే వంకతో కొట్లోకి దూరాం. కొనే ఉద్దేశ్యం లేదు కాబట్టి, పైపైన పెట్టిన పుస్తకాలే పుణుక్కుంటున్నాను. లోపలికెళ్ళిన నా స్నేహితురాలు,
“యు రిమెంబర్ హిమ్?” అనడిగింది.
“హు?” అంటూ చూశాను చేతిలో పుస్తకం.
“వావ్.. బుడుగు!” ఆనందాశ్చర్యాలకు చోటు చాలక, కళ్ళు పెద్దవయ్యాయి.
ఇంటికొచ్చాను. “చూడు, మన ఇంటికి ఎవరు వచ్చారో?!” అని అమ్మకి చూపించాను.
“నా బంగారు తండ్రే!” అని వాణ్ణి దగ్గరకు తీసుకొని, “ఏ తల్లి కన్న బిడ్డో..” అననబోయి నాలుక్కర్చుకొని నవ్వింది.
“వాళ్ళ అమ్మ పేరు రాధ. వాణ్ణీ దేవుడు తీసుకొచ్చి వాళ్ళింట్లో పడేసాడట. నాకన్నీ బస్సులోనే చెప్పేసాడు తెల్సా.. ” – నాతో ఇదో సమస్య,
నాకే కొంచెం తెల్సినా లొడలొడా వాగేస్తాను.
“వెళ్ళి కాళ్ళు కడుక్కురా.. టిఫిన్ పెడతాను.”
“నో.. ఇది చదవటం అయితే గానీ, ఏం తినను.”
చదవటం అయింది. పుస్తకం ఎక్కడ పెట్టానో..
***************
“నీ పుస్తకాలన్నీ అటూ ఇటూ పడేస్తావేం?! చూడు, నేనే సర్దాలా అన్నీ..” అక్కర్లేని నాన్న సాయం.
” ఆ పుస్తకం అక్కడ కాదు. పై అరలో. అర్రె, నేనిప్పుడా పుస్తకం చదువుతా కదా, పెట్టదు. నే చదూతాఆ! బుడుగ్గాడేడీ? ఉన్నాడా! ఒకే!” – నేను థాంక్స్ చెప్పే విధానం.
***************
“బుడుగా? నేను చదివాను. ఓహ్.. హీ ఈజ్ మై ఆల్-టైమ్ ఫేవరెట్. ఐ లవ్ హిమ్!” – సందర్భం వచ్చినప్పుడల్లా అవకాశం వదులుకోలేదు.
లవ్ – ఎంత తేలిగ్గా పలికేస్తుంది ఆ పదం. ఎంత అందంగా ధ్వనిస్తుంది. ఎంత బాగా అనిపిస్తుంది. గాల్లో తేలినట్టూ, ఈల వేసినట్టూ. ఏం హాయిలే హలా!
****************
లవ్. అంటే పడ్డం. ఆశ పడ్డం. పడితేగానీ తెలీదు ఎక్కడెక్కడ గాయాలవుతాయో!
మూడేళ్ళ క్రితం, జీవితం పదమూడో ఎక్కం అప్పజెప్పించుకుంటుంటే, ఉద్యోగం, ఆరోగ్యం, కొందరు మనుషులూ రాఛ్ఛసులుగా మారి, నా నవ్వులన్నీ నమిలి మింగేస్తుంటే బోలెడు ఆనందమేసింది. రెక్కల గుర్రం ఎక్కి నన్ను ఎత్తుకుపోయే టాల్-డార్క్-హాండ్‍సం హీరో నన్ను కాపాడ్డానికొచ్చే టైమ్ ఇదేనని కనిపెట్టేశాను. బ్రేక్ కూడా తీసుకోకుండా నేను కలలు కంటున్నా..
సీన్ కట్ చేస్తే.. నల్ల నిక్కరేసుకొని, చొక్కా తొడుక్కోని బుడుగు తయారు! హతవిధీ!
“నా పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. మా బామ్మ హారీ పిడుగా అంటుంది. అందుకు.”
“సో?”
“ఇంకో అసలు పేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైములేదు.”
“వినడానికి మాక్కూడా..”
“అది చాలా పొడుగు. కావాలిస్తే మా నాన్నని అడుగు.”
“లైట్..”
“అగో మా నాన్న. మా నాన్నకి నేను కొడుకు. మా నాన్న నాకు గొడుగు. ఇలా అని కొత్త ప్రెవేటు మేష్టరు చెప్పాడు. వీడు మంచివాడు కాడు.
అంటే చెడ్డవాడు….”
“ఆగాగు.. నన్ను నవ్వనీ. అంత గబగబగా అయితే నా వల్ల కాదు బాబు.”
“దా.. జట్కా బండి ఎక్కి పోదాం..” అంటూ నన్ను ఎక్కించుకొని బోల్డు, బోల్డు కబుర్లు చెప్పాడు.
వాళ్ళింట్లో వాళ్ళని పరిచయం చేశాడు. అప్పటి కాలం స్థితిగతులకి ఇప్పటికీ చాలా తేడాలున్నాయి. బామ్మలూ, బాబాయ్‍లు అతిథులై చాలా కాలమే అయింది. జీళ్ళూ, పాకాలు అంటాడు ఊరికూరికే. హేమిటో అవి. జట్కా బండట. మొట్టికాయల్లో ఇన్ని రకాలా? మా ప్రెవేట్లన్నీ నీల్ డౌన్లూ, నకల్స్ మీద కొట్టడాలు, ఎండలో నుంచోపెట్టడాలు.
మధ్యమధ్యలో కథలు చెప్పాడు.. కాదు ఖధలు! అందులో కొన్ని అనగనగనగ కథలు. కొన్ని నాన్-అనగనగనగ కథలు. నాకు కథలు చెప్పేవాళ్ళంటే చాలా ఇష్టం. (కథలు చెప్తామని చెప్పని వాళ్ళు కూడా.)
వాడూ, నేనూ బాఘా ’కనెక్ట్’ విషయం ఒకటుంది. వాడికి ఒక బాబాయ్. నాకు బోలెడు స్నేహాలు. రెండు జెళ్ళ సీతలూ, ఇందిరల కథలు నాకు చెప్పాడు.
“అగో.. గోడ మీద కూర్చున్న బాబాయ్‍గాడులు. సీతల కోసం.” అంటాడు.
“ఇదో.. వీణ్ణి చూడు. కారులో ఉన్నాడుగా. కిటికీ వేసుందా. బయటవేం సరిగ్గా కనిపించటం లేదా? అయినా క్రాఫ్ దువ్వుకుంటాడు చూడు, అక్కడ బైకి మీద అమ్మాయి ఉందనీ..” అని నేను.
అప్పులోళ్ళ చుట్టూ అప్పుడు తిరిగినా, లోన్లంటూ ఇప్పుడు తిప్పించుకున్నా, బాబాయ్‍లు అలానే ఉన్నారు; ముఖ్యంగా రెండు జెళ్ళ సీతల
విషయంలో. అప్పట్నుండీ ఒకటే గోల. పడ్డం-దులుపుకొని లేవడం లేదా పడ్డం-పడుండడం. హమ్మ్..
బుడుగ్గాడి జట్కా దిగేసి, వాణ్ణి అల్మారా పెట్టేస్తుంటే, మనసు చివుక్కుమనిపించింది. అప్పటి నుండి, రోజూ నాతో ఉండడం మొదలెట్టాడు. నేను
పనిజేసుకుంటున్నా, చదువుకుంటున్నా, ప్రయాణం చేస్తున్నా, నిద్ర పోతున్నా.. వాడుండాల్సిందే! ఇంత చనువిచ్చాక, ఊరుకుంటాడా?
మనసెక్కి మహరాజులా కూర్చుంటాడు.
ఊరికే ఉన్నదాన్ని నన్ను నవ్విస్తాడు. నేను “హహ్హహాహహ” అని నవ్వితే, “యమ్మే.. రాచ్చచడు” అని మా అమ్మ దగ్గరకి పరిగెడత్తాడు.
“రాచ్చచుడు కాదు నాన్నా. భయం లేదు. మన రాచ్ఛసేలే!” అని అమ్మ. (రాక్షసినని ఫిక్స్ చేసేసారిద్దరూ.)
***************
కొన్నాళ్ళకు:
ఇంటికి రాగానే, “రాధోయ్.. ఆకలీఈఈఈఈఈ!” అని అరవటం మొదలెట్టాను.
“మీ అప్పుడు రెండు జెళ్ళ సీతలు ఎలా ఉండేవారూ, డాడ్?” అని అమ్మ ఎదురుగా అడగడం.
“అబ్బ.. రోఝూ (ఆఫీసుకి) వెళ్ళాలా?” అని విసుక్కోవటం.
“ఏం. ఇప్పుడు నేను ఉన్నానా. నేను నీకులా కాదు. నువ్వు పూర్వకాలంలో అంటే నీ చిన్నప్పుడు బుడుగు. ఇప్పుడు గోపాళం. నీకో రాద. తవ్వాత నీకో బుడుగు. వాడూ రేపో ఫదిరోలకో ఇలా బేద్దవాడై గోపాళం అవుతాడనుకో. వాడికో రాద వచ్చేస్తుందిలే. అప్పుడు ఇంకో బుడుగు.” : త్రివిక్రమ్ పెళ్ళి-హనీమూన్-పిల్లల జీవిత చక్రానికి బుడుగానువాదం ఇలా ఉంటుందా?
“కాని నేను చిన్నవాడినా చితకవాడినా. నా అంతవాడు నేడు. నేను బుడుగులకే బుడుగు. నేను ఎప్పటికీ బుడుగు. అందరికీ బుడుగు. నీకూ, నీ బుడుక్కీ, నీ బుడిబుడిక్కీ నేనే బుడుగు. నాకు వెయ్యి డెబ్బయ్యి పది యిళ్ళున్నాయటగా.” – పోదువోయ్ బడాయ్!
“’బ’కు కొమ్మిస్తే బు.. బుడుగు. బుడుగు చాలా మంచివాడు.” డామిట్, టీనేజ్ కూడా ఎవళ్ళ పేర్లు రాయలేదే ఇలా?!
ఊరికూరికే ముద్దొచ్చేస్తుంటాడు. మరీ పేరా, పేరాకీ అంటే కష్టం కదూ! సచిన్, రోజర్లకి కూడా ఇన్ని ఫ్లయింగ్ కిసెస్ ఇవ్వలేదు. ఇలా, అలా అని చెప్పడానికి వీల్లేకుండా అలవాటయ్యిపోయాడు. స్నేహితులతో మాట్లాడుతుంటే మధ్యలో దూరతాడు. మీటింగ్లో ఉండగా నవ్విస్తాడు. రాసుకుంటుంటే, మాటలుగా మారిపోతాడు. లోకులూరుకుంటారా? “ఏం జరుగుతోంది ఇక్కడ? మాకు తెలియాలి.” అనేశారు.
“అల్లరి వద్దంటే విన్నావా? ఇప్పుడు చూడు” అన్నాను.
“నేను అల్లరి మానేసి చాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆలా సమస్తరాలు అవుతుందిలే. నువ్వేమో చకచకా పెద్దవాడివైపోయావూ. బాబాయేమో పెళ్ళివాడయ్యిపోయాడు. ఎవళ్ళన్నా నన్ను గ్నాపకం చేసుకుంటే గాని, అల్లరి చేయటం లేదు మరి. జాలేస్తుంది నన్ను నేను చూసి.” అనంటాడు.
“నీకు రాధంటే ఎంత ఇష్టమో, మాకు తెలుగంటే అంత ఇష్టమయ్యుంటే ఎంత బాగుండేది?!” అని అనుకుంటాను స్వగతంలో..
ఊరికే ఆటపట్టిదామని, కాళ్ళు కాస్త ఎడంగా పెట్టి నుంచొని, రెండు చేతులూ వెనక్కి పెట్టుకొని, ఓ కన్ను కొడుతూ అడిగాను..
“వురేయ్ బుడుగూ.. నన్ను పెళ్ళాడతావురా అండి” అని.
చుట్టుతా వెతికేసుకున్నాడు, సీగానపెసూనాంబ వినేసిందేమోనని, బయ్యంగా.
“పెసూనాంబ లైట్. నేను రైట్!” అన్నా..
తుర్రుమని మాయమయ్యాడు.
********************
నిద్రపోతే కదా పీడకలలు రావాలి?! ఆ రోజు పొద్దున్న లేస్తూనే పీడకల. టివిలో. అబద్ధం! మొబైల్‍లో మెసేజ్. నో! మెయిల్స్. గాడ్!
రమణగారింట్లో.. బాపూగారి ముందు గదిలో. అంతా వస్తున్నారు. చూస్తున్నారు. వెళ్తున్నారు. పాపం, వీళ్ళెప్పుడూ రమణగారింటికి రాలేదనుకుంట. మేం వెళ్ళాం కదా! బోలెడు కబుర్లు చెప్పాక, “అమ్మాయిలూ, నాకు నిద్ర వచ్చేస్తుంది. కాసేపు పడుకోనా?” అని అడుగుతారు. మనం, “అలాగేనండి.” అని చెప్పాలి. అప్పుడు అల్లరి చేయకూడదు. నవ్వొస్తే నవ్వచ్చు గానీ, మనక్కూడా వినిపించకూడదు. కాసేపయ్యాక, ఆయనొచ్చి, ఇంకొన్ని కబుర్లు చెప్తారు. అంతే! అంతదానికి వీళ్ళంతా ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? People, don’t make noise. He’s asleep! Can’t you see that?
వీళ్ళంతా ఏదేదో చేస్తున్నారని భయం వేసి, వచ్చేశాను. చెన్నై ఎయిర్‍పోర్ట్ లో, ఒకటే మాటను ఐదారు భాషల్లో, ముగ్గురు వ్యక్తులు చెప్తున్నా, తలకెక్కలేదు. అక్కడేం జరిగిందేంటో తెలీటం లేదు. “మేడం.. ఆప్ టీక్ తొ హో?” పోలీసాయన కంగారు. తల నిలువుగా ఊపాను. “ఒంటరిగా ప్రయాణిస్త్తున్నారా?!”. తల అడ్డంగా ఊపాను. అడగ్గానే వచ్చాడు, నాతో పాటు బుడుగు.
ఇంటికొచ్చాను. కొంచెం ఏడ్చాను. కొంచెమే! ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్సూ “ఎవరికైనా తప్పదమ్మా.. ఓర్చుకోవాలి.” అని అన్నారు. దానిదేముంది? “సరే!”నన్నాను.
అంతా బానే ఉంటుంది. ఉన్నట్టనిపిస్తుంది. ఇంతలో ఏదో గుర్తొస్తుంది. వాస్తవం వెక్కిరిస్తుంది. చూడకూడదనకున్న నిజం, కళ్ళు ఎంత గట్టిగా మూసుకున్నా కనిపించిపోతుంది. ఇకఇకలూ, పకపకలూ, మందహాసాలు, అట్టహాసాలు అన్నీ మూగైపోయాయి. “హే చదివావా?”, “ఆ లైన్ ఉంది చూశావూ?”, “నవ్వలేక చచ్చిపోతున్నా బాబూ”, “తెలుగు రాదా? నేను చదివి వినిపిస్తా ఉండు..” – అన్నీ ఆగిపోయాయి. దూరంగా ఉన్న ఇద్దరం ఒకే పేజి చదివి, ఫోన్ చేసుకొని, “హలో”కి బదులుగా “హహహహ”తో మొదలెట్టి, కొనసాగించి, ముగించటం ఇక కుదరదా? వీవు నిమిరి “దేనికీ భయపడకు.” అని ధైర్యం నూరి పోసి, ఇప్పుడు రాముడే అన్యాయం చేసిపోతే ఉడతలకీ, చిలకలకీ దిక్కేది? కోతి కొమ్మచ్చి ఆడుతూ, ఆడిస్తూ, చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతే, కొమ్మకొక్కళ్ళం, కొండకొకళ్ళం అయిపోయాం. నవ్వుల్ని పంచుకున్న వాళ్ళం, ఇప్పుడు ఎవళ్ళ ఏడుపు వాళ్ళం ఏడుస్తున్నాం.
“ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో!” – అవునా? అలాగేం! మేం జీరోలం. ఏడుస్తున్నాం.. వచ్చి మందలించరేం?
ఓహ్.. మీ పుస్తకాలన్నీ మా వద్దే ఉన్నాయా? వద్దు.. మాకేం వద్దు. మీరే కావాలి. అయినా, నిద్రపోతున్న పిల్లల చేతిలో పదో, పరకో పెట్టినట్టు
వాటినిచ్చి, సైలెంటుగా వదిలి వెళ్ళిపోతే, ఊరుకోడానికి మేమేమన్నా చిన్నవాళ్ళమా? చితకవాళ్ళమా? ఊ?
మేం కొట్టిన చప్పట్లన్నీ మీ శబ్దాశ్రయ హాస్యానికి, మాటల గారడికనుకున్నారా? నో! అవ్వన్నీ మీ పొగరుకి. మీ నమ్మకానికి. మీ ధైర్యానికి. మీ జోకలికి. మీ మొండితనానికి. మీ పట్టుదలకి. కావాలనుకున్నది సాధించుకున్న తీరుకి. అందర్నీ కలుపుకుపోతూ, చంద్రబాబు నాయుడన్నట్టు, ముందుకు పోయినందుకు. చప్పట్లన్నీ మీకే!
“పూర్తిగా నవ్వటం మానేస్తే, “అయ్యో.. రమణా! మీ వాళ్ళను చూడలేకపోతున్నాం. ఓ సారి కనిపించేసి రా!” అని దేవుడు పంపించడూ? అత్యాశ! మాయదారి దేవుడుకి అసలంత హృదయమే ఉంటే, ఇట్టాంటి పనులెందుకు చేస్తాడు.
తప్పు మాది కూడా. మీరంటే ఎంత ఇష్టమో చెప్పలేకపోయినందుకు. ఇప్పుడెంత ఏడిస్తే ఏం లాభం!
బుడుగొచ్చాడు. “ఏడవకు.” అన్నాడు.
ఏడుపాగలేదు. “నేనిక్కడ ఉన్నానుగా. బయ్యం లేదు. నేను నిను రష్చితాను.”
“బుడుగూ.. నువ్వూ వదిలిపోవుగా?!”
“పోనులే. ఏడవకు. మరి నాకు ప్పది కాణీలో, నిఝం జెట్కా బండో కొనివ్వాలి. ఇంకానేమో…”
“వురేయ్.. బుడుగూ..”
“ఊ”
’ఐలవ్యూ’ – హమ్మయ్య చెప్పేశాను. సిగానపెసూనాంబకి వినిపించకుండా. బుడుక్కీ వినిపించకుండా. నాకూ వినిపించకుండా.
“చెప్పూఊఊఊ..”
“జాటర్ ఢమాల్.”
“నువ్వే జాటర్ ఢమాల్.”
***********
ఏడుపొచ్చినప్పుడు నవ్వే వాడే హీరో! – రమణ
నవ్వి, నవ్వించి, ఏడవలేక నవ్వటం వేరూ – ఏడుపునే నవ్వించటం వేరూ అని చూపించి, కన్నీటి ఉప్పదనం తెలీకుండా హాస్యరసం పట్టించి, నవ్వటం నేర్పించి, నవ్వుకోవటం అలవాటు చేయించి, ఓ జీవితకాలపు నవ్వులను తెలుగువాడి కోసం ఫిక్సెడ్ డిపాజిట్ చేసిన బాపూరమణ, హీఈఈఈఈఈఈఈఈఈరోఓఓఓఓఓఓఓఓఓ!
జంపాల చౌదరి
పూర్ణిమా:
బుడుగు, సీగేన పెసూనాంబ, రాధ, గోపాళం, అప్పారావు, బాబాయిగాడు, వాడు వెంటపడే రెండుజెళ్ళ సీత, పక్కింటి లావుపాటి పిన్నిగారి ముగుడు, బంగారం, సింగారం, వరహాల్రాజు, తీతా, కంట్రాక్టరూ, వెర్రి గోపన్నా వీళ్ళంతా కోతికొమ్మచ్చులాడుతూ మనతోనే ఉంటే, రమణ గారెక్కడికో ఎట్లా వెళతారు? వీళ్ళందరితోపాటు ఆయనా మనతోనే ఉన్నారు.
రామ
రమణ గారంటే ఒక జీవిత కాలపు హాస్యం. ఇది చదివి కోతి కొమ్మచ్చి ఆడియో మళ్ళీ వినడం మొదలు పెట్టాను. చూడబోతే వారి హాస్య రచనా జ్ఞాపకాలతో జీవితం చాలా సులువుగా గడిచిపోయేలా ఉంది.
మీది చక్కటి కథనం. బజ్ చేసి మిత్రులందరినీ పుస్తకం.నెట్ వైపు తోలుకొని వస్తాను :).
C V R Mohan
Most lamenting elegy for departed soul–mohan