శ్యామ్‍యానా
వ్రాసిన వారు: డాక్టర్ అల్లాడి మోహన్
**************************
నేను దాదాపు ముప్ఫై ఐదేళ్ళ క్రితం తెలుగు కథలు చదవడం మొదలుపెట్టినప్పటినుంచి, నన్ను ఆకట్టుకున్న రచయిత ’మెడికో’ శ్యామ్. ఆరోజుల్లో అప్పుడప్పుడూ వీరి కథలు పత్రికల్లో కనిపించేవి, చదివించేవి, కదిలించేవి. కొన్నాళ్ళ తరువాత అకస్మాత్తుగా వీరి కథాప్రవాహం ఆగిపోయింది. తిరిగి ’శ్యామ్‍యానా’ అనే పేరుతో ’మెడికో’ శ్యామ్ కథాసంకలనం వెలువడింది అని తెలియగానే గతించిన గతం గుర్తుకువచ్చి మనసులో ఎంతో ఉద్వేగం కలిగింది.
మరి, ముప్ఫై సంవత్సరాలు గడిచిపోయినా, కథకుడు ’రాయని’ భాస్కరుడైనా, ఈ కథలు ఎందుకు ఇంకా గుర్తున్నాయి? అన్న సందేహం కొందరికి కలుగవచ్చును. తెలుగు కథకుల్లో, ఎటువంటి ’ఇజం’, ’వాదం’ వంటి చట్రంలో చిక్కుకోకుండా, కథావస్తువు ఎంపికలో వైవిధ్యంతో, అక్షరాలతో ఆటలాడుతూ, కొత్తదనంతో కూడిన పదాల కూర్పుతో, వరద గోదావరి వంటి కథాగమనంతో విలక్షణమైన శైలితో కథలు వ్రాసే సత్తా ఉన్న రచయిత మెడికో శ్యామ్. ఇక్కడ ;’రాయని’ భాస్కరుడని ప్రస్తావించి మళ్ళీ వ్రాసే సత్తా అనడం విచిత్రంగా ధ్వనించవచ్చును – తిరిగి వ్రాస్తారన్న నమ్మకంతో అలా వ్రాసాను.
లబ్ధప్రతిష్ట పొందిన వైద్యులైనటువంటి మెడికో ’శ్యామ్‍యానా’ లోనికి ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ ఈ వైవిధ్యభరితమైన కథలు కొన్నిసార్లు మలయమారుతంలా, మరికొన్నిసార్లు ప్రళయాగ్నికీలల్లా, ఇంకొన్నిసార్లు ఝంఝామారుతంలా ఓ జీవితకాలం గుర్తుంచుకోదగ్గ అనుభూతిని కలిగిస్తాయి. అంతేకాదు, అసలివి కథలా? వచనరచనలా? కవితలా? అనే సంభ్రమాన్ని కలిగించినా, ప్రక్రియకు అతీతంగా అంతరంగ తరంగాలను స్పృశించి ఆలోచింపజేస్తాయి.
మెడికో శ్యామ్ కథల్లో కథాప్రవాహం సాగినంతసేపూ కథకుడి అంతర్మథనం గోచరమౌతూనే ఉంటుంది. భాషావిన్యాసం, సాహిత్య పరిచర్చ, (సినీ) సంగీతంతో మిళితమైన స్వర విన్యాసం చదువరికి కథకుడిలో అంతర్లీనంగా దాగిఉన్న బహుముఖ ప్రజ్ఞను పరిచయం చేస్తాయి. ఈ సంకలనంలో పొందుపరచిన 27కథల తేజస్సును 27నక్షత్రాల వెలుగుతో పోల్చవచ్చు. మూస కథలతో విసిగిపోయిన తెలుగు పాఠకులకు తెలుగు కథ ఇలా కూడా ఉండేదా? అన్న ఉత్సాహాన్ని ఇచ్చే స్థాయి, దిశానిర్దేశం చేయగలిగిన ప్రజ్ఞ ఉన్న కథల్ని శ్యామ్‍యానాలో మనం చదవవచ్చు.
ఈ సాహిత్య డిటెక్టివ్ విశ్లేషణ విభిన్నమైన కోణం నుంచి చూడవచ్చును. ’ఐసీసీయూ’ కథలో గోడగడియారం గంటల నేపథ్యంలో కుర్ర డాక్టరూ, పంజాబీ నర్సు సల్లాపాల మధ్య ఐదు రోగుల అంతరంగాల విశ్లేషణ స్వతహాగా వైద్యుడైన రచయిత విశ్లేషణా వైదుష్యానికి, ప్రతిభకు నిదర్శనం. సాహిత్య కారులు, సాహిత్య బురఖా గురించి వ్రాసిన ’సాహిత్యం కథ’ సామాజిక స్పృహ కథాంశంగా కలిగిన ’డౌరీ హౌమచ్?’, ’క్రేన్’ అనే మరో కథ – ఈ 27 కథానక్షత్ర హారంలో ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. ఒకసారి ఈ కథలు చదవడం ప్రారంభిస్తే, అన్నీ చదివెయ్యాలనిపిస్తుంది.
“ష్యామ్యానా” అనే ముందుమాటలో రచయిత ’త్రిభాషా పథకాన్ని పాటిస్తూ’ కథలు రాసానని చెబుతారు. వీరి కథల్లో తెలుగే కాకుండా, ఆంగ్ల, హిందీ పదాలు పుష్కలంగా దొర్లుతాయి. సగటు పాఠకుడికి ఈ ఆంధ్రేతర పదప్రయోగం కొంత ఇబ్బంది కలుగజేయవచ్చు. కుతూహలమున్న వారు, అధ్యయనం చేసి ఈ పరభాషా ’పదార్థాలను’ తెలుసుకుంటే మంచిది – అట్టి కుతూహలాన్ని రేకెత్తించె పస ఈ రచయిత శైలిలో ఉంది. భావం భాష(ల)కతీతం. నాకు ’మెడికో శ్యామ్’ రచయితకొరకు వ్రాసే రచయిత అనిపిస్తుంది!!
తెలుగు కథకు ఆశించినంత మేరకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించకుండా పోవడానికి ఒక ముఖ్యమైన కారణం, తెలుగు కథలు అంతర్జాతీయ భాషల్లోకి, ముఖ్యంగా ఆంగ్లంలోకి అనువదించబడకపోవడం. శ్యామ్ రచనలు ఇతర భాషల్లోకి తర్జుమా చేయడం అసాధ్యమనిపిస్తుంది. అనువాదకుడు కథాంశాన్ని అనువదించగలిగినా, కథన శైలిని అందుకోవడం అనితరసాధ్యమనిపిస్తుంది!
మూడు దశాబ్దాల క్రితం వ్రాసినవే అయినా, ఈరోజే వ్రాసినవా అన్నట్లు ఉంటాయి ఈ కథలు. కానీ, హఠాత్తుగా వీరు కథలు రాయడం ఎందుకు మానేశారు? అన్నది అర్థం కాని ప్రశ్న. ఈ విరామం తాత్కాలికం అని నేననుకుంటాను. వీరి కలం నుండి (కీబోర్డు నుండి?) మరిన్ని మంచి కథలు వెలువడగలవు అని ఆశిస్తాను. తెలుగు కథకు దిశా నిర్దేశకులు, కొత్త ఒరవడికి సృష్టికర్త, అనితరసాధ్యమైన శైలి, ప్రతిభ కలిగిన రచయిత ’మెడికో’ శ్యామ్ అరుదైన కథల సంకలనాన్ని పుస్తకరూపంలో ప్రచురించిన వంగూరి ఫౌండేషన్ వరికి హృదయపూర్వక అభినందనలు. శ్యామ్‍యానా తో ప్రయాణించినా, ష్యామ్యానాలో సేదతీరినా, ఈ కథలు అలరిస్తాయి!
మెడికో శ్యాం గారిని shyamchirravoori@yahoo.com అన్న ఈ మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించవచ్చు.
ఇటీవల టెక్సస్ తెలుగు సాహిత్య సదస్సు లో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. సభ విశేషాలు, అఫ్సర్ గారి బ్లాగులో, ఇక్కడ చదవొచ్చు. ఈ వార్త గురించి సాక్షి పత్రిక వ్యాసం ఇక్కడ చదవొచ్చు.
***********
వ్యాస రచయిత డాక్టర్ అల్లాడి మోహన్ గారు వృత్తి రిత్యా తిరుపతిలోని SVIMS లో వైద్య శాస్త్ర ఆచార్యులు.
ఆరుద్ర గారి మరో అపురూపమైన నవల ‘ఆనకట్ట మీద హత్య’ | పుస్తకం
[…] కృషిచేసిన డా. చిఱ్ఱావూరి శ్యామ్ (మెడికో శ్యామ్) గారి జ్ఞాపకం. పుస్తకం.నెట్ లో […]
chavakiran
http://kinige.com/kbook.php?id=158
ఈ పుస్తకం ఇప్పుడు కినిగె పై
వంగూరి చిట్టెన్ రాజు
డా. అల్లాడి గారూ,
చాలా విషయాలని స్పృశిస్తూ మంచి సమీక్ష వ్రాసారు. మా ధన్యవాదాలు. ఈ పుస్తకం మా 43వ ప్రచురణ. కాపీలు ఇండియాలో విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలోనూ, హైదరాబాదులో నవోదయ మరియు వంగూరి ఫౌండేషన్ వారి దగ్గర (హైదరాబాదు, హ్యూస్టన్) లోనూ దొరుకుతాయి. నాకు ఈ మెయిల్ పంపిస్తే వివరాలు పంపిస్తాను.
ఈ సమీక్ష ప్రచురించిన పుస్తకం.నెట్ వారికి మా కృతజ్జ్తతలతో,
వంగూరి చిట్టెన్ రాజు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
USA phone: 832 594 9054
E-mail: vangurifoundation@gmail.com
Blog: http://www.vangurifoudation.blogpspot.com
perugu
చాలా బాగుంది మీ పరిచయం మోహన్..పుస్తకం వెంటనే చదవాలనిపించేలా…