శ్రీమదాంధ్రమహాభారతం – ఎందుకు చదవాలి? ఆరణ్యపర్వం – నన్నయకృతం – ప్రథమాశ్వాసం

రాసిన వారు: మల్లిన నరసింహారావు
(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు). ఆది సభా పర్వాల పరిచయం ముగిసింది. అరణ్య పర్వం ప్రారంభం.
*********************
వ్యాస భారతంలో 13664 శ్లోకాల ఆరణ్య పర్వాన్ని నన్నయ,ఎఱ్ఱనలు 2894 గద్యపద్యాలతో రచించారు. టి.టి.డి వారు నన్నయ కృతమైన భాగాన్నీ, ఎఱ్ఱన నన్నయ పేరుమీదుగా ఆంధ్రీకరించిన భాగాన్నీ వేఱు వేఱు సంపుటాలుగా ముద్రించారు. అంటే 1వ ఆశ్వాసం నుండి నాల్గవ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకూ ఒక సంపుటంగానూ, నాల్గవ ఆశ్వాసంలోని 143వ పద్యం నుండి 8వ ఆశ్వాసం చివరివఱకూ రెండవ సంపుటం గానూ ముద్రించటం జరిగింది. ప్రస్తుతం మనం నన్నయ ఆరణ్యపర్వం లోనికి ప్రవేశిద్దాం.

పాండవులు వనవాసానికి బయలుదేరినప్పుడు ఆ నగర ప్రజలందరూ పాండవులవెనుకనే బయలుదేరి వారితో వస్తామని చెపుతూ—

‘ వీరులార! మమ్ము విడిచి మీ కరుగంగఁ ! జనునె, మాకు నొండు శరణమెద్ది?
సాధులకు నసాధుసహవాసమునఁ బాప ! సంప్రయోగ మగుట సందియంబె ? 3-1-5

(ఓ వీరులారా మమ్మల్ని విడిచి వెళ్ళటం మీకు న్యాయం కాదు. మాకు వేరే దిక్కు లేదు. దుర్జన సహవాసం వలన మంచివారికి కూడా పాపం సంప్రాప్తిస్తుందనటంలో సందేహం లేదు)

తిలలును నీళ్ళును వస్త్రం ! బులుఁ బుష్ప సుగంధ వాసమున సౌరభముం
బొలు పెసఁగఁ దాల్చుఁ గావున ! నలయక సత్సంగమమున నగు సద్గుణముల్. 3-1-6

(నువ్వులు, నీళ్ళు, బట్టలు – పువ్వుల పరిమళ సంపర్కంవలన సుగంధాన్ని సంపాదించుకొన్నట్లు సజ్జన సహవాసంచేత అశ్రమంగా జనులకు సద్గుణాలు అలవడతాయి.)

మహాభారతంలోని నీతిపద్యాలలో ఈ కందం మిక్కిలి హృదయంగమమైనది. తనవెంట వస్తున్న విప్రులను ధర్మరాజు వెనుకకు మరలమని అర్థించినపుడు వారతనితో—

ఆశ్రితులను భక్తులగువారి నెప్పుడు! నన్యులైన విడువ; రట్టి విప్ర
వరుల భక్తిపరుల వసుధేశ! మీ యట్టి ! ధార్మికులకు విడువఁదగునె చెపుమ. 3-1-16

(తమ ప్రాపు గోరి చేరినవాళ్ళను, తమపట్ల భక్తి కలవాళ్ళను ఇతరులు కూడ ఎన్నడూ విడనాడరు కదా! అటువంటప్పుడు బ్రాహ్మణోత్తములను, మీపట్ల భక్తికలవాళ్ళను ఓ ధర్మరాజా! మీబోటి ధర్మాత్ములు విడిచిపెట్టటం భావ్యమా!) అంటారు.

‘ శోకభయస్థానంబు ల! నేకంబులు గలిగినను విహీన వివేకుం
డాకులతఁ బొందునట్లు వి ! వేకము గలవాఁడు బుద్ధి వికలుం డగునే? ’ 3-1-20

( దుఃఖం, భయం పొందదగిన పట్టులు పెక్కులు దాపురించినప్పటికినీ అవివేకివలె వివేకి వికలుడు కాడు.)

శారీర మానస మహా ! దారుణ దుఃఖములఁ జేసి తఱిఁగి శరీరుల్
క్రూరతరబాధఁ బొందుదు ! రా రెంటిని జెఱుతు రార్యు లమలినబుద్ధిన్.3-1-21

(కేవలం దేహధారులని చెప్పతగిన సామాన్యమానవులు శారీరక, మానసిక బాధలచేత క్రుంగి కృశిస్తారు. ఆర్యులు ఆ రెంటిని నిర్మలబుద్ధితో నిగ్రహించగలుగుతారు.)

రోగం, అలసట, ఇష్టంలేని వాటిని ముట్టుకోవటం, ఇష్టమున్నవాటిని వదలిపెట్టటం అనే నాల్గింటి వలన శరీరదుఃఖాలు పుట్టుతాయి. ఆ శరీరదుఃఖాలు వేగంగా అప్పటికప్పుడు చేసే విరుగుడు వలన తాత్కాలికంగా ఉపశమించవచ్చును. ఇక, స్నేహం వలన ఏర్పడిన మానసికతాపాలు. నీటివలన నిప్పు అణగినట్లుగా, విమలజ్ఞానం వలన ఉపశమనం పొందుతాయి.

స్నేహార్ణవ మగ్నుండయి ! దేహి మహాదుఃఖముల నధృతి బొందును; దుః
ఖాహతుఁడు శోకతాపవి ! మోహి యగున్ ; స్నేహమూలములు రాగాదుల్. 3-1-23

(స్నేహమనే సముద్రంలో మునిగి, మనుజుడు స్థైర్యం కోలుపోయి దుఃఖాన్ని పొందుతాడు. దుఃఖితుడు వగపువేడిమిలో ఉడికిపోయి స్పృహ తప్పుతాడు. అనురాగం మొదలయినవి స్నేహాన్ని ఆధారంగా చేసికొని పెంపొందేవి.) స్నేహమూలములు రాగాదుల్ – నన్నయ రుచిరార్థసూక్తి.

వ.స్నేహంబున రాగంబును, రాగంబునం గామంబును, గామంబునం గ్రోధంబును, గ్రోధంబునం దృష్ణయు వర్తిల్లు.
ఇక్కడ తృష్ణ అనేదానికి అత్యాశ అని అర్థం. ఈ తృష్ణ-

అది సర్వదోషముల కా ! స్పద, మది దురితక్రియానుబంధంబులకున్
మొదలు, నిరంతర దుఃఖ ! ప్రద మని మదిఁ దలఁచి తృష్ణ బాతురు సుమతుల్. 3-1-25

( అది సమస్త దోషాలకు నెలవైనదనిన్నీ, అది పాపకార్యాల అనుసంధానానికి ఆరంభమనిన్నీ, నిరంతరం అది దుఃఖాన్ని కలిగించేదనిన్నీ ఆలోచించి మంచిబుద్ధికలవారు తృష్ణను వదలిపెట్టుతారు.)

జలములందు మత్స్యంబులు, చదలఁ బక్షు ! లామిషం బెట్లు భక్షించు నట్లు దివిరి
యెల్లవారును జేరి యనేకవిధుల ! ననుదినంబును భక్షింతు రర్థవంతు. 3-1-27

(నీటిలోని చేపలు, ఆకాశంలోని పక్షులు ఏ విధంగా మాంసాన్ని భక్షిస్తాయో అదేవిధంగా మనుజులందరు ధనవంతుడి చుట్టూ చేరి పీడించి అతడి ధనాన్ని అపహరించివేస్తారు)

ధనాన్ని దొంగిలించేవారు దొంగలు. ఇది ప్రత్యక్ష ప్రమాణం. చుట్టపక్కాలు పరోక్షంగా ధనవంతుడిని పీడిస్తుంటారు. ఇది పరోక్షప్రమాణం.

అర్థమ యనర్థమూలం: ! బర్థమ మాయావిమోహనావహము: నరుం
డర్థార్జన దుఃఖమున న ! పార్థీకృతజన్ముఁ డగుట పరమార్థమిలన్. 3-1-28

(అన్ని చెడుగులకు ధనమే మూలకారణం. ధనం మాయచేత ఏర్పడే భ్రాంతికి ఆకరం. మనుజుడు ధనసంపాదనవలన కలిగే దుఃఖం వలన వ్యర్థజన్ముడవుతాడనేమాట భూలోకంలోని మేటి సత్యం.)

ఈ పద్యం లోని ధన నిరసనం సుస్పష్టం. “ధనమూల మిదం జగత్”, “నానా గుణగణము కాంచనంబున నిలుచున్” , “సర్వేగుణాః కాంచన మాశ్రయంతి” అనే సుభాషితాల అంతరార్థం కూడా వ్యంగ్య గర్భితమైన ధన నిరసనమే.“అర్థానా మార్జనే దుఃఖం”, “ఆర్జితానాం చ రక్షణే”, “ఆయే దుఃఖం, వ్యయే దుఃఖం, ధిగర్థం దుఃఖ భాజనమ్”. ధన సంగ్రహణం దుఃఖంతో కూడుకున్న పని, ఆర్జించిన ధనాన్ని రక్షించటం కూడ దుఃఖంతో కూడుకొన్నదే. ఆదాయం దుఃఖం, వ్యయం దుఃఖం, ఛీ! ఛీ! ధనం దుఃఖ భాజనం. ధనం వలన గర్వం, పిసినిగొట్టుతనం, భయం, ఉబ్బు కలుగుతాయి. అందుచేత ధన సంపాదన కూడదు అని చెప్పగా, ధర్మరాజు-

‘అత్మోపభోగార్థ మర్థలాభేచ్ఛ నా ! కెన్నండు లేదు; మహీసురాగ్ర
గణ్యుల నత్యుగ్ర కాననాంతరమున ! నెవ్విధంబున భరియింతు నొక్కొ
యని యిప్డు వగచెద; ననవద్యగుణయుక్తి ! ననఘ మాయట్టి గృహస్థ తతికిఁ
బోష్యుల నెయ్యెడఁ బ్రోవక యుండను ! విప్రుల నతిథుల వృథయపుచ్చఁ
జనునె? నిజధనంబు సంవిభాగించి యీ ! వలయు, సాధురక్ష వలయుఁ జేయ,
నభిమతాశ్రమంబులందు గృహస్థాశ్ర ! మంబకాదె యుత్తమంబు వినఁగ. 3-1-30

వ. మఱి యార్యునకు శయనంబును, భీతునకభయంబును, దృషితునకు జలంబును, బుభుక్షితునకు నన్నంబును, శ్రాంతునకు నాసనంబును నిచ్చుట సనాతనంబైన యుత్తమ గృహస్థ ధర్మంబు; తృణ భూ మ్యుదక ప్రియవచనాదరంబు లెల్లవారికి నవశ్యంబ: యాత్మార్థంబుగా నన్నపాకంబును, ససాక్షిక భోజనంబును, వృథాపశుఘాతంబును బాపహేతువు; లగ్నిహోత్రంబులు ననడ్వాహంబులు నతిథి బాంధవ విద్వజ్జన గురుమిత్ర భామినీనివహంబు లపూజితంబులై యెగ్గు సేయును; గావున గృహస్థుండు సర్వసంతర్పకుండు గావలయుం, గావునం బ్రతిదినంబును బక్షి శునక శ్వాపదార్థంబు సాయం ప్రాతస్సులయందు వైశ్వదేవంబు సేసి యమృతాశియు విఘసాశియుఁ గావలయు; యజ్ఞశేషం బమృతంబు నాఁబరఁగు; నతిథిభుక్త శేషంబు విఘసంబు నాఁబడు; నట్టి వృత్తి వర్తిల్లువాఁ డుత్తమగృహస్థుం’ డనినధర్మరాజునకు శౌనకుండిట్లనియె.

(‘ నేను నా స్వార్థంకొఱకు, భోగాలకొఱకు ధనాన్ని కోరుకొనటంలేదు. బ్రాహ్మణోత్తములను ఈ మహారణ్యంలో ఏవిధంగా పోషించగలను – అని మాత్రమే నా దిగులు. నాబోటి గృహస్థుడికి అవశ్య కర్తవ్యం అతిథిపూజ. అందులో నా దగ్గఱికి అతిథులుగా విచ్చేసినవారు బ్రాహ్మణోత్తములు, సాధుపురుషులు. అట్టివారిని ఊరక పంపవచ్చునా ? గృహస్థులైనవారు తమ సంపదలో కొంతభాగం అతిథులకోసం వెచ్చించాలి. సజ్జనులను రక్షించాలి. ఈ రీతిగా అన్ని ఆశ్రమాలలో గృహస్థాశ్రమమే మేల్తరమని పెద్దలు చెప్పితే వింటున్నాం కదా ! ఇచట సాధు సంరక్షణం, అతిథిసేవ కలిసివచ్చాయి. కనుక గృహస్థాశ్రమం నెరవేర్చాలి కదా ! గృహస్థుడు నిర్వహించవలసిన కర్తవ్యాలు ఉన్నాయి. ఆర్తుడికి శయ్యాసౌఖ్యం, భయపడినవాడికి శరణం, దప్పిగొన్నవాడికి నీరు, ఆకలిగొన్నవాడికి తిండి, డస్సినవాడికి ఆసనం సమకూర్చటం గృహస్థుడు నిర్వహించవలసిన సనాతన ధర్మాలు. అతిథుల పట్ల ఆదరాభిమానాలు చూపవలసిన బాధ్యత గృహస్థుడిది. పక్కన విస్తరి లేకుండ భుజించటం, తనకోసం మాత్రమే వంట చేయించటం, నిష్కారణంగా పశువులను హింసించటం, పాతకాలు. అంతేకాక అగ్నిహోత్రాలు, అతిథులు, చుట్టాలు, విద్వాంసులు, గురువులు, మిత్రులు, స్త్రీలు – వీరలకు యథోచిత మర్యాద చూపనప్పుడు ఎగ్గు చేస్తారు( కీడు కలుగుతుంది), అందుచేత గృహస్థుడు ఎల్లవారిని సంతృప్తి పరచక తప్పదు. యజ్ఞశేషానికి అమృతమని పేరు. అతిథిభుక్త శేషానికి విఘసమని పేరు. గృహమేధి అమృతాశియు, విఘసాశియు కావాలి. ఉదయాస్తమయ వేళలలో పక్షి, శునకాదులకు బలి ఆహారం ఇవ్వాలి. దానికి వైశ్వదేవ యజ్ఞమని పేరు. ఉత్తమ గృహస్థుడు నిర్వహించవలసిన ఇటువంటి కర్తవ్యాలు ఉన్నాయి గదా ‘

-అని ఈ విధంగా ధర్మరాజు శౌనకునితో అనగా – చూడండి. గృహస్థాశ్రమ ధర్మాల్ని గుఱించి ధర్మరాజు యెంత విపులంగానూ, వివరంగానూ చెప్పాడో – ఇటువంటి మంచి విషయాలను తెలుసుకోవటం కోసమనే మనమందరం మహా భారతాన్ని చదవాల్సి ఉంది. సనాతన ధర్మం ప్రకారం ఆశ్రమాలు నాలుగు. అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. వీటిలో గృహస్థాశ్రమం మిగిలిన ఆశ్రమాలవారికి పోషణ కల్పిస్తుంది – ఆశ్రమాలలో గృహస్థాశ్రమం ఎలానో, కావ్యాలలో మహాభారతం అలా – అని పెద్దలు అంటారు. వ్యాసమహర్షి మహా భారతాన్ని గృహస్థులకోసమే వ్రాసినట్లనిపిస్తుంది పై వర్ణన చదివినప్పుడు. పై వాక్యాలవలన పాండవ జ్యేష్ఠుడైన యుధిష్టిరునికి ధర్మరాజు అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియవస్తుంది.

శౌనకమహర్షి – ఇంద్రియసౌఖ్యాలపై కోరిక మూలంగా మానవులు ఎంతటి జ్ఞానం కలవారైనప్పటికీ, ఇంద్రియాలు వశం కావు కాబట్టి, వారించటానికి వీలులేని వికారాన్ని పొందుతారు అని అంటూ వేదచోదితాలయిన కర్మానుష్ఠానాలు ఏవో చెపుతాడు. అవి 8. సమ్యక్సంకల్ప సంబంధం, ఇంద్రియనిగ్రహం, వ్రతవిశేషం, గురుసేవనం, ఆహారయోగం, అధ్యయనాగమం, కర్మసంన్యాసం, చిత్తనిరోధం. బౌద్ధదర్శనం ప్రతిపాదించిన అష్టాంగయోగం ఒకటి. దానిలో చెప్పబడిన 8. సమ్యగ్దృష్టి, సమ్యక్సంకల్పం, సమ్యగ్వచనం, సమ్యక్కర్మ, సమ్యగ్జీవిక, సమ్యక్కృషి, సమ్యక్స్మృతి, సమ్యక్సమాధి అనేవి. పతంజలి యోగశాస్త్రంలోని అష్టాంగయోగం లోవి – యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, సమాధి అనేవి.

ధర్మరాజు తనవెంటపడి ఎన్నిచెప్పినా మానకుండా వనవాసానికి వచ్చే బ్రాహ్మణులకందరికీ భోజన సదుపాయాల ఏర్పాటును గుఱించి బాధపడుతుండగా ఆయన పురోహితుడైన ధౌమ్యుడు ఇలా అన్నాడు. సూర్యభగవానుడు ఉత్తర దిక్కుగా పయనించి భూసారాన్ని క్రోలి, దక్షిణదిక్కుగా పయనించి మేఘరూపుడై ఓషధులను సమీకరించి, చంద్రకిరణాలద్వారా ఆ ఓషధులను పెంపొందించి, వాటినుండి అన్నాన్ని పుట్టించాడు. తద్ద్వారా ప్రజారక్షణం చేసాడు. అందువలన అన్నం సూర్యమయమని తెలిసికొని పూర్వకాలంలో భీమ, వైన్య, కార్తవీర్య, నహుషాదులు సూర్యుడిని ఆరాధించి ఆహారాన్ని సాధించి ప్రజలను కాపాడారు. నీవుకూడా అలా చెయ్యి అని మంత్రపూర్వకమైన ఆదిత్యనామాలను ఉపదేశిస్తాడు. ధర్మరాజు సూర్యుడిని ఆరాధించగా, సూర్యభగవానుడు ప్రత్యక్షమై ఒక అక్షయమైన రాగిపాత్రను ఇచ్చి ద్రౌపదిచేత ప్రార్థితములై భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములైన నాలుగు రకముల ఆహారపదార్ధాలు దానినుండి వారికి వనవాసంకాలం లోని 12 సంవత్సరాలూ లభిస్తాయని వరమిస్తాడు. అప్పటినుండి పాండవులు పెక్కువేలమంది బ్రాహ్మణులను ఆ అడవులలో పోషించగలిగేవారు. కొంతకాలం అక్కడ గడిపిన తర్వాత పాండవులు కామ్యకవనానికి వెళ్ళారు.

ధృతరాష్ట్రుడు విదురుడిని పాండవుల గుఱించిన విషయాలను అడగ్గా అతడు పాండవుల గొప్పతనం చెప్పి వారిని తిరిగి వనాలనుండి రప్పించి వారి రాజ్యం వారికి ఇచ్చివేయమని, దుర్యోధనుడు చెడ్డవాడు కాబట్టి అతనిని విడిచి పెట్టమనీ హితోపదేశం చేస్తాడు. దానికి గుడ్డిరాజు అంగీకరించడు. విదురుడు కోపించి ధృతరాష్ట్రుడ్ని విడిచి అడవులలో ఉన్న పాండవుల దగ్గఱికి వెళ్తాడు. అప్పుడు పాండవులతోడి సంభాషణలో విదురుడు –

కార్యగతుల తెఱఁగు కలరూపు సెప్పిన ! నధికమతులు దాని నాదరింతు
రల్పకార్యబుద్ధు లగువారలకు నది ! విరసకారణంబు విషమ పోలె. 3-1-59

( ఉన్నదున్నట్లు చెబితే గొప్పబుద్ధి కలవాళ్ళు ఆదరించగలరు. కాని, నీచకృత్యాలకు పాల్పడేవారికి అది రక్తాన్ని విఱిచే విషంవలె, బుద్ధికి విరసంగా ఉంటుంది.) నన్నయ సూక్తిరత్నాల్లో ఒకటి.

వ్యాసుడు ధృతరాష్ట్రునికి చెప్పిన ఇంద్రసురభి సంవాదంలో –

ఎల్లనెయ్యములకుఁ దల్లిదండ్రులయందు ! సుతులవలని నెయ్య మతిశయంబు
ధనము లెంత గలిగినను సుతరహితుల ! కెమ్మెయిని మనఃప్రియమ్ము లేదు. 3-1-81

( తల్లిదండ్రులకు మమకారబంధాలన్నింటిలో పుత్రస్నేహం మిక్కిలి గాఢమైనది.కొడుకులు లేనివారికి ఎంత సంపద ఉన్నప్పటికి మనశ్శాంతి లభించదు.)

ఈషణత్రయం : దారేషణ, ధనేషణ, పుత్రేషణ. పక్షులలో దారేషణ, పశువులలో పుత్రేషణ, మనుజులలో ధనేషణ ఎక్కువ అని పెద్దల ప్రవచనం. మానవులలో ఈషణత్రయం ప్రభావం చూపుతుంది. ధృతరాష్ట్రుని విషయంలో పుత్రేషణ అధికం. వ్యాసమహర్షి ధృతరాష్ట్రునితో పాండవుల్ని వెనక్కు పిలిపించి వారి రాజ్యం వారికిస్తే మంచి కలుగుతుందని చెప్తూ-

సుజనుల సహవాసంబునఁ ! గుజనులు సద్ధర్మమతు లగుట నిక్కము: ధ
ర్మజునొద్ద నుండి నీ యా ! త్మజుఁడు ప్రశాంతుండు ధర్మమార్గుండు నగున్. 3-1-88

-అని బోధిస్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆపని తనవల్లకాదనీ, వ్యాసులవారే ఆపని చెయ్యాలనీ ప్రార్థిస్తాడు. అప్పుడాయన మైత్రేయ మహాముని వచ్చి దుర్యోధనుడికి హితబోధ చెయ్యగలడని చెప్పి అంతర్ధానమౌతాడు. తరువాత మైత్రేయ మహాముని వచ్చి దుర్యోధనునికి హితబోధ చేస్తున్నప్పుడు దుర్యోధనుడు నిర్లక్ష్యంగా ఆయన మాటలు వినకుండా తన కాలి బొటన వ్రేలితో నేలపై వ్రాస్తూ చేయెత్తి తన తొడలపై చరచి చప్పుడు చేస్తూ మైత్రేయుడిని పరిహసిస్తాడు. అప్పుడు ఆ మహర్షి కోపించి – ఈ అపరాధం వలన ఘోరయుద్ధంలో భీమ గదాఘాతం వలన నీ తొడలు విఱుగగలవని – శాపం ఇస్తాడు.

రాజసూయ యాగంలో శ్రీకృష్ణునిచే వధింపబడిన శిశుపాలునికి తమ్ముడు సాల్వుడు. కృష్ణుడు శిశుపాలుడిని రాజసూయ యాగ సందర్భంగా వధించాడనే కోపంతో సాల్వుడు కామగమనం కలిగిన తన సౌంభకం అనే నగరంతో సహా వచ్చి ద్వారకను ముట్టడిస్తాడు. ఆ సాల్వుడితోడి యుద్ధంలో మునిగి ఉండటం చేత కృష్ణుడు – పాండవులు, కౌరవులచేతిలో జూదంలో ఓడిపోయి అడవుల పాలైన సమయంలో వారికి దూరంగా ఉండటం జరిగింది. తఱువాత వనవాస సమయంలో కృష్ణుడు పాండవులను కలసినప్పుడు వారికి సౌంభకాఖ్యానం గుఱించి చెపుతాడు. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు మూర్ఛపోయినపుడు దారుకసుతుడయిన ఆతని సారథి అతని రథాన్ని యుద్ధభూమినుండి దూరంగా తీసుకొని వెళతాడు. ప్రద్యుమ్నుడు సేదదీరిన తఱువాత అతనిసారథితో – అలా నన్ను యుద్ధభూమి నుండి దూరంగా ఎందుకు తోడ్కొని వచ్చావు? ఎదుటివారి పరాక్రమవిజృంభణం చూచి నీవు భయపడ్డావా?- అని అంటూ ఇంకా

సమర విముఖత్వమును ! రణ విముఖులఁ జంపుటయు శరణు వేఁడిన రక్షిం
పమియును యాదవవంశో ! త్తములకుఁ గల నయినఁ గలవె దారుకతనయా ! 3-1-170

( ఓ దారుక తనయా ! యుద్ధంనుండి వెనుదిరిగి పోవటం, రణరంగంలో వెన్నుచూపి పారిపోయే వారిని సంహరించటం – యాదవ వశంలో పుట్టిన వీరశ్రేష్ఠులకు కలలో అయినను ఉన్నాయా?)
అంటాడు. దారుకుడు అనబడేవాడు శ్రీకృష్ణుని రథసారథి. దారుకుని కుమారుడు ప్రద్యుమ్నుని రథసారథి. అందుకని అతడిని ప్రద్యుమ్నుడు అలా సంబోధిస్తాడు. అప్పుడు దారుకతనయుడు –

‘ రథి కిమ్ముగాని యెడ సా! రథి ధృతిమెయిఁ గావ వలయు, రథియును దత్సా
రథిఁ గావవలయు, రథి సా ! రథులు పరస్పర శరీర రక్షకులగుటన్. 3-1-173

(వీలు చాలు కానివేళ రథికుడిని సంరక్షించే బాధ్యత సారథిపై ఉంటుంది. అలాగే సారథిని కాపాడే బాధ్యతకు రథికుడు పూనుకోవాలి. రథికుడు, సారథి ఒండొరుల శరీరరక్షణకు బాధ్యులు.)

అవనీనాథ ! తదాహవాంతరమునం దస్మత్కరాకృష్ట శా
ర్ ఙ్గ వినిర్ముక్త నిశాతసాయకశతాగ్రచ్ఛిన్నమై దైత్య దా
నవదేహప్రకరంబు వాతవిధూతార్ణఃపూర్ణ సంఘూర్ణితా
ర్ణవకుక్షిం బడియెం గపిప్రవరసైన్యక్షిప్త శైలాకృతిన్. 3-1-185

(ఓ ధర్మరాజా ! నాచేత ఎక్కుపెట్టబడిన శార్ ఙ్గమనే నా వింటి నుండి వెలువడిన వాడి బాణ సమూహాలచేత ముక్కలు ముక్కలై రాక్షసులదేహాలు, సుగ్రీవుడి సేనలచేత విసరబడిన కొండలవలె గాలిచేత చెదరగొట్టబడిన నీటిచే తిరుగుడు పడిన సముద్రమధ్యంలో పడిపోయాయి.)

ఈ పద్యంలో నన్నయ అక్షరరమ్యత, ప్రసన్నకథాకవితార్థయుక్తి గోచరిస్తున్నాయి. దానవుల= దనువుకు జన్మించినవారు, రాక్షసులు. దైత్యులు=దితి సంతానం, రాక్షసులు.

ద్రౌపది ధర్మరాజుతో ప్రహ్లాద – బలిసంవాదం చెపుతుంది. ఆ సందర్భంలో ప్రహ్లాదుడు తన మనుమడైన బలితో క్షమ, తేజస్సు అనేవాటిగుఱించి చెపుతూ ఇలా అన్నాడట.

క్షమయ తాల్చియుండఁ జన దెల్ల ప్రొద్దుఁ దే ! జంబ తాల్చియుండఁ జనదు పతికి
సంతతక్షముండు సంతతతేజుండు ! నగుట దోష మందు రనఘమతులు. 3-1-217

( సర్వకాల సర్వావస్థలలోనూ ఓర్పు వహించటం తప్పు. అట్లే ఎప్పుడూ ప్రతాపం చూపటం కూడా తప్పే. ప్రభువైనవాడు సంతతక్షముడు, సంతతతేజుడు కాకూడదని, అది దోషమని పెద్దలు చెపుతారు.)

ఎల్లప్పుడూ ఓర్పు చూపేవాడిని సేవకులు గౌరవించరు. ధనానికి సంబంధించిన విషయాలలో నియమింపబడిన అధికారులు ధనాలను అపహరిస్తారు. ఇక సదా తేజస్సునే ప్రదర్శించేవాడు మిక్కిలి కఠిన శిక్షలు విధించే వాడవటం చేత జనుల కందరికీ తీవ్రవేదన కలిగిస్తాడు. అట్టివాడు ఇంటిలో ఉన్న పామువలె నిరంతరం ఆరాటం కలిగిస్తాడు. కాబట్టి సమయానుకూలంగా క్షమ, తేజం ప్రదర్శించేవాడే ఐహికా ముష్మికసిద్ధిని పొందగలడు. ఈ సమయం క్రోధానికి సరియైనది. అందుచేత కౌరవులతో యుద్ధం చెయ్యాలంటుంది ద్రౌపది ధర్మరాజుతో. దానికాతడు—

క్రోధంబు పాపంబు, గ్రోధంబునన చేసి ! యగుఁ జువ్వె ధర్మకామార్థహాని,
గడుఁగ్రోధి గర్జంబు గానండు, క్రుద్ధుండు ! గురునైన నిందించుఁ, గ్రుద్ధుఁ డైన
వాఁ డవధ్యులనైన వధియించు, మఱి యాత్మ! ఘాతంబు సేయంగఁ గడఁగుఁ గ్రుద్ధుఁ,
డస్మాదృశులకు ధర్మానుబంధుల కిట్టి ! క్రోధంబు దాల్చుట గుణమె చెపుమ?
యెఱుక గల మహాత్ము డెఱుకయు న్జలముల ! నార్చుఁ గ్రోధ మను మహానలంబుఁ,
గ్రోధవర్జితుండు గుఱుకొని తేజంబు ! దాల్చు దేశకాలతత్త్వ మెఱిఁగి. 3-1-222

(కోపం గొప్ప పాపం. కోపం వలన మూడుపురుషార్థాలకు – ధర్మానికి, అర్థానికి, కామానికి కీడు సంభవిస్తుంది కదా ! మిక్కిలి కోపించినట్టివాడు కర్తవ్యాన్ని గ్రహించజాలడు. కోపి గురువునైనను నిందిస్తాడు. కోపం చెందినవాడు చంపకూడనివారిని సయితం చంపివేస్తాడు; మఱి ఆత్మహత్యకు పాల్పడతాడు. ధర్మంతో ముడివడిన నడవడి కల నాబోటివారికి కోపం వహించటం తగునా ? నీవే చెప్పుము. జ్ఞాని అయిన మహాత్ముడు జ్ఞానమనే నీటితో కోపమనే పెనుమంటను చల్లార్చుతాడు. క్రోధం విడనాడినవాడు సమయ సీమల నిజస్వభావం తెలిసికొని తేజస్వి అవుతాడు.)

క్షమ గల వానికి బృధ్వీ ! సమునకు నిత్యంబు విజయ సంసిద్ధి యగున్
క్షమి యైనవాని భుజవి ! క్రమము గడున్ వెలయు సర్వకార్యక్షమమై. 3-1-223

(భూదేవితో సమానమైన ఓర్పు కలవాడికి సదా విజయం సిద్ధిస్తుంది. క్షమావంతుడి పరాక్రమం అన్ని సమయాలలోను కార్యసాధకమై రాణిస్తుంది.)

కోపం, క్షమ వాటి వాటి లక్షణాలు, ఫలితాలు ఎంత బాగా వివరించాడో ధర్మరాజు. అప్పటికీ ద్రౌపది మళ్ళీ ఈ విధంగా అంటుంది.

ధర్మదూరులయిన ధార్తరాష్ట్రులయంద ! ధర్ము వేమి సేయు ధరణినాథ !
నికృతిపరులయందు నికృతి సేయనివారు ! వారి నికృతిఁజేసి వధ్యులండ్రు. 3-1-226

(ఓ రాజా ! అధర్మవర్తనులైన ధార్తరాష్ట్రులపట్ల నీ ధర్మం ఏమి లాభం ? (అధర్మం చేసినా దోషం లేదు).

వంచకులపట్ల వంచనతో ప్రవర్తించనివారు, వారి వంచనచేత చంపతగినవారు అని పెద్దల అభిప్రాయం. ఆమెతో ధర్మరాజు అన్యులు ధర్మం తప్పారని నేనెందుకు ధర్మం తప్పుతాను అని అంటాడు.

ధీరమతియుక్తిఁ జేసి వి ! చారింపఁగ నిక్కువంబు సర్వజన స్వ
ర్గారోహణసోపానం ! బారఁగ ధర్మంబ సూవె యతిరమ్యంబై. 3-1-229

(తెలివితేటలతో యోచిస్తే సర్వజనులకు స్వర్గారోహణ సోపానం అతి రమ్యమైన ధర్మమే సుమా!)

మహాభారతంలో ఈ పద్యం అతి ముఖ్యమైనది. మహాభారతానికి అంతరాత్మ ధర్మం. భారతం స్వర్గారోహణ పర్వంతో అంతమౌతుంది. పాండవులలో ధర్మాన్ని సదా అంటిపెట్టుకుని ఉన్న ధర్మరాజు మాత్రమే స్వర్గం వరకూ సశరీరంతో వెళ్ళగలుగుతాడు.

మధ్యాక్కర.

కడు నిమ్ముగా దున్ని బీజములు సల్లి కర్షకుం డున్నఁ
దడయక వర్షంబు గురిసి కావించుఁ దత్ఫలసిద్ధి
నడుమఁ బర్జన్యుఁ డనుగ్రహింపనినాఁ డేమి సేయుఁ
గడఁగి చేయంగలవానిఁ జేయును గాక కర్షకుండు. 3-1-235

(మిక్కిలి అనువుగా రైతు పొలాన్ని దున్ని విత్తనాలు చల్లవచ్చును. అప్పుడు ఆలస్యం లేకుండా వర్షం కురిస్తే అతనికి ఫలసిద్ధి కలుగుతుంది. అలాకాక మేఘుడు వర్షించకపోతే కర్షకుడుఎంత శ్రమించినా ఏమి చేయగలడు ? అందుచేత కర్షకుడు పురుషకారం చేస్తుండవలసిందే కదా!) పురుషకారం దైవానుకూల్యం రెండూ ముఖ్యమే కదా!

కిరాతార్జునీయం- అంటే అర్జునునికి శివుడు ప్రత్యక్షమైనపుడు దండక రూపంలో అర్జునుడు చేసిన శివస్తుతి.

శ్రీకంఠ, లోకేశ, లోకోద్భవస్థాన సంహారకారీ, పురారీ, మురారిప్రియా, చంద్రధారీ, మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి, పుణ్యస్వరూపా, విరూపాక్ష, దక్షాధ్వరధ్వంసకా, దేవ, నీదైన తత్త్వంబు భేదించి బుద్ధిం ప్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు రీశాన, సర్వేశ్వరా, శర్వ, సర్వజ్ఞ, సర్వాత్మకా, నిర్వికల్పప్రభావా, భవానీపతీ, నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని, సోమార్కతోయంబులం జేసి కావించి సంసార చక్రక్రియా యంత్రవాహుండవై తాదిదేవా, మహాదేవ. నిత్యంబు నత్యంత యోగస్థితిన్ నిర్మలజ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధరాగాదిదోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుహధ్యాన పీయూష ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులై రవ్యయా, భవ్యసేవ్యా, భవా, భర్గ, భట్టారకా, భార్గ వాగస్త్య కుత్సాది నానామునిస్తోత్ర దత్తావధానా, లలాటేక్షణోగ్రాగ్ని భస్మేకృతానంగ, భస్మానులిప్తాంగ, గంగాధరా, నీ ప్రసాదంబునన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధసాధ్యోరగేంద్రాసురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా, విశ్వకర్తా, సురాభ్యర్చితా, నాకు నభ్యర్థిత్వంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ ! త్రిలోకైకనాథా ! నమస్తే ! నమస్తే! నమః. 3-1-324

ఇక్కడితో ఆరణ్యపర్వం – నన్నయ కృతం – ప్రథమాధ్యాయం – సమాప్తం. ఇంక రెండో అధ్యాయం లోనికి ప్రవేశిద్దాం, రండి.

You Might Also Like

One Comment

  1. పుస్తకం » Blog Archive » శ్రీమదాంధ్రమహాభారతం – ఎందుకు చదవాలి – 3.1 (ఆరణ్యపర్వం – రెండవ ఆశ్వాసం)

    […] పర్వాల పరిచయం ముగిసింది. అరణ్య పర్వం గత వ్యాసంలో ప్రారంభమైంది. ********************* వనవాసం […]

Leave a Reply