అచలపతి కథలు
అచలపతి కథలు గురించి కొన్నాళ్ళ క్రితం విన్నాను. వుడ్‍హౌజ్ తరహా హాస్య కథలు అన్న క్యాప్షన్ గుర్తు ఉంది. నిజం చెప్పాలంటే, ఆ క్యాప్షన్ చూసే నాకు ఇన్నాళ్ళూ ఆ కథలు చదవాలనిపించలేదు. కానీ, ఎమ్బీయస్ ప్రసాద్ “పడక్కుర్చీ కబుర్లు” సిరీస్ మీద ఉండే ఇష్టం కొద్దీ, ఆయన రాసిన ఈ కథల్ని చివరికి చదివాను. ఇవి వుడ్‍హౌజ్ తరహా కథలో కాదో నాకు తెలీదు కానీ, అచ్చమైన తెలుగు కథలు. వుడ్‍హౌజ్ కథలు నేనెప్పుడూ చదవలేదు (నిజం, సిగ్గులేకుండా ఒప్పుకుంటున్నాను..;) ) కనుక వాటిని వీటితో పోల్చలేను కానీ, ఇవి చదివాక అవి చదవాలన్న కుతూహలం మాత్రం కలిగింది.
విషయానికొస్తే, ఈ కథల్లోని “అచలపతి” పాత్ర అనంత్ అనబడే అనంతశయనం పాత్రకి సెక్రెటరీ తరహా పాత్ర. అనంత్ పెద్ద తెలివైన వాడని ఫోజు కొట్టుకుంటూ ఇబ్బందుల్లో ఇరుక్కున్నపుడల్లా అచలపతి తన తెలివితేటలతో అతన్ని బయట పడేస్తూ ఉంటాడు. ఇలాంటి ఒక్కో సంఘటనా ఒక్కో కథ అనమాట ఈ పుస్తకంలో. పుస్తకంలో కథలన్నీ చాలావరకు చదివించేలాగా, నవ్వించేలాగా నే ఉన్నాయి. అక్కడక్కడా భాష(ల)తో గారడీ కాస్త ఎక్కువై అతి తీపి చేదు అయినట్లు అయింది కానీ, మొత్తంగా చూస్తే, పుస్తకం చదవదగ్గది. ఈ పుస్తకానికి పరిచయవాక్యాలు ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసారు. మామూలుగా పుస్తకం ఎవరు రాసినా నాకేంటి? అన్నట్లే నా వ్యాఖ్యానం చెబుతా కానీ, ఆ పుస్తకంతోనే ప్రచురించిన ఆ పరిచయం చూస్తూ ఉంటే భయమేస్తోంది – ముళ్ళపూడిగారు సర్టిఫికెట్ ఇచ్చేసిన పుస్తకాన్ని గురించి నేను మళ్ళీ “బాగుంది” అని చెప్పడం ఏమిటి? అతి కాకపోతే? అని. అందుకే పుస్తకాలతోనే ప్రముఖులు ఆ పుస్తకాన్ని సమీక్షిస్తూ రాసిన వ్యాసాలు ప్రచురించకూడదు. భయపెట్టేస్తారు అలా చేసి!
భాష, వాక్య నిర్మాణం నాకు చాలా నచ్చాయి ఈ పుస్తకం లో. “ఆ అమ్మాయి గ్రాడ్యుయేటు. పేరు కలావతి. కళావతి అన్న పేరు నోరు తిరక్క కలావతి అనేదిట చిన్నప్పుడు. అప్పటి పగటి కలలు కనే లక్షణం చూసి అందరూ ఆ పేరే స్థిరం చేసేసారట.” “వస్తూనే ఇంగ్లీషులో సంభాషణ మొదలుపెట్టడంతో ఆయన తెలుగువాడని సులభంగా పోల్చుకోగలిగాను. కానీ నాలుగైదు వాక్యాల తరువాత కూడా ’అయామ్ నాట్ గివింగ్ ట్రబుల్ కదండీ’ వంటి ప్రయోగాలు కనబడకపోతే సందేహం కలిగింది – కాదేమోనని.” – ఇటువంటి వాక్యాలు చదివాక మీ పెదాలపై ఓ చిర్నవ్వు మెరిసిందంటే, ఈ పుస్తకాన్ని ఎంజాయ్ చేయగలరన్నట్లే. ఒక సందర్భంలో – “హైకూ అంటే ’లో-కీ’ లో ఉండే కవిత్వమేనా?” అన్న డైలాగు చదివితే కూడా నాకు నవ్వాగలేదు.
“నాకు తెలుసులే నీకు తెలిసి ఉండదని. వాళ్ళు…వాళ్ళు…అదో బాపతు మనుషుల్లే”
“అదో బాపతంటే అదే బాపతేనా?” – ఇటువంటి డైలాగులు కోకొల్లలు ఈ పుస్తకంలో.
భాషలతో బాగా ఆడుకున్నారు ఈ పుస్తకంలో. అన్ని చోట్లా ఇంగ్లీషు-తెలుగు తోనే కానీ, “జయలలిత – వాజ్ పేయి పాలిట పేయి” (పేయి అంటే తమిళంలో దెయ్యం అని అర్థం) వంటి వాక్యాల్లో తమిళాన్నీ వాడుకున్నారు. “నా అంత కామన్ సెన్స్ లేని మనిషి, (అంటే నా ఉద్దేశ్యం – ’నాకున్నంత కామన్ సెన్స్ లేని మనిషి’ అని – తెలుగులో సింటాక్స్ బహుజాగ్రత్తగా వాడుకోవాలి సుమండీ!)..” వంటి వాక్యాల్లో ఇలా భాషతో ఆడుకోవడం కూడా తెలుస్తోంది. ఎక్కడికక్కడ వ్యంగ్యం కావలసినంతుంది. “మనవాళ్ళకి మాక్రో ఆస్ట్రో ఫిజిక్స్ (ఈ శాస్త్రం ఉందో లేదో నాకు తెలీదు. కానీ, ఏ సబ్జెక్ట్ కైనా సరే మైక్రోయో, మాక్రోయో తగిలిస్తే హుందాగా, గంభీరంగా ఉంటుందని నాకో గట్టినమ్మకం) ఇంకా సరిగా వంటబట్టలేదు.” ఇలా డైలాగులు ఇక్కడ టైపు కొట్టేస్తూ ఉంటే, ఎమ్బీయస్ గారో, శాంతా బయోటెక్ యజమాని వరప్రసాద్ గారో (ఆయన పబ్లిషర్) నామీద కాపీరైట్ ఉల్లంఘన కేసేస్తే కష్టం. ఇంకొక్క డైలాగుతో ఆపేస్తా.
” “ముందు నా విషయం విను” అంటూ గబగబా చెప్పేశా – “నాకు క్యాన్సర్ వచ్చింది. మిగిలిన ఆయుర్దయం ఓ అయిదేళ్ళేననీ తెలిసినందువల్ల పెళ్ళి మానేసి నాగేశ్వర్రావులా నిన్ను ఆశీర్వదించి పోదామని వచ్చాను” అని. అదే ఊపులో ’కుచ్చిళ్ళు బాగా కుదిరాయా, పంచె కట్టే అలవాటు పెద్దగా లేదు కదా’ అని కూడా అడిగేను. ”
– బహుశా ఈ తరహాలో నడిచే హాస్యం అంటే నాకు సహజంగా ఉండే మక్కువ వల్లనూ, దైనందిన జీవితంలో నాకు ఇలాంటి పీజే తరహా హాస్యమే ఎక్కువగా కనబడ్డం వల్లనూ ఏమో నాకు ఈ పుస్తకంలో సంభాషణలు చాలా నచ్చాయి. మొత్తానికి ఏమీ తోచనప్పుడు అలా తెరిచి కాసేపు చదువుకుని నవ్వుకునే తరహా పుస్తకం.
Achalapathi Kathalu – MBS Prasad
పేజీలు: 136
హాసం ప్రచురణలు.
varaprasaad.k
పుస్తకం chadavakapoyinaa
Kinige Newsletter 07 April 2012 | Kinige Blog
[…] అచలపతి కథలుసమీక్ష ‘కినిగె’పై […]
chavakiran
ఈ పుస్తకం ఇప్పుడు ఈ-పుస్తకంగా కినిగెలో లభిస్తుంది. ఈ లింకు ఫాలో అవ్వండి. http://kinige.com/kbook.php?id=568
MBS Prasad
Dear All, I am MBS Prasad, author of Achalapathi… I stumbled upon this review accidentally. Thanks to reviewer and all those who responded.
90% of Achalapathi Kathalu were serialized in “Rachana” in 1995-96. I never thought they would be accepted by normal readers. Did not venture to bring them out in book form till 2005. But, within 3 months it came for reprint. Now in Dec 2009 I am bringing out 3rd print.
It is difficult to enjoy Achalapathi… So I wrote “Pogabothu Bharya” (anthology of familial humorous stories) for general consumption. Ramapandu Leelalu were serialized in Haasam. They were based on Bingo Little And Freddy PGW characters. Standard-wise they do not match Achalapathi.. but when Visalandhra brought out in book form, within 3 years, it came for reprint.
So far 23 books of mine are in market. I rate Achalapathi.. (fiction) and “History Made Easy” (non-fiction) as my best. I have taken only the style of PGW for Achalapathi.. Everything in local milieu. Some thought I copied/translated him. Unfortunate.
Thanks for the platform you provided. Regards
గీతాచార్య
hahaha. Good review.
వల్లూరి
మంచి పుస్తకాన్ని జ్ఞపకం చేసినందుకు కృతజ్ఞతలు (థాంక్స్ కాదు). ఎమ్బియస్ ప్రసాద్ గారి హస్యరచనాశైలి అద్భుతం. ‘హసం’ పత్రిక వచ్చినన్నాళ్ళు, క్రమం తప్పకుండా ఎమ్బియస్ ప్రసాద్ గారి రచనలు చదివెవాడిని. ఆ తర్వత, వర్ల్డ్ స్పేస్ రెడియో ద్వారా ప్రసారం కాబడిన ఎమ్బియస్ ప్రసాద్ గారి’పడకుర్చి కబుర్లు’ తలుచుకొని ఇప్పటికి నాలో నేను నవ్వుకుంటుంటాను.
రవి
బావుంది. ఈ పుస్తకం చూసి కూడా వదిలేశాను, చాలా సార్లు. ఈ సారి కొనాలి. యోగి గారికి నెనర్లు, మంచి లంకె బిందెనిచ్చారు.
పూర్ణిమ
నీ పుస్తకం గురించి రెండు రోజుల ముందే విన్నాను. అయ్యో.. కొనుండాల్సిందీ అనుకుంటుండగా ఇక్కడ దాని టేస్ట్ కాస్తా తగిలింది. ఇక కొనేయాలి! వ్యాసం బాగుంది. ముఖ్యంగా..
““వస్తూనే ఇంగ్లీషులో సంభాషణ మొదలుపెట్టడంతో ఆయన తెలుగువాడని సులభంగా పోల్చుకోగలిగాను. కానీ నాలుగైదు వాక్యాల తరువాత కూడా ’అయామ్ నాట్ గివింగ్ ట్రబుల్ కదండీ’” నాకు నేనే గుర్తొచ్చాను! 🙂
యోగి గారు: థాంకులు!
యోగి
ఉడ్‌హౌస్ రచనలు చదవాలనుకునే వారికి ఉపయుక్తం గా ఉండవచ్చు!
ఆనందించండి!!
చైతన్య క్రిష్ణ పాటూరు
ఈ పుస్తకంలోని తరహ హాస్యం నాకు కూడా ఇష్టం. రచయత అచలపతి పాత్రను ఉడ్ హౌస్ జీవ్స్ పాత్ర స్పూర్తిగా వచ్చిందని చెప్పినా, ఆ పాత్రను మన నేటివిటీకి తగినట్లుగా చక్కగా మలిచారు.
ముందుమాటలో ముళ్ళపూడి వారి మాటలు విని ఒరిజినల్ ఉడ్ హౌస్ కథలు చదవటానికి ట్రై చేసాను గానీ ఎక్కలేదు. ఉడ్ హౌస్ హాస్యం అర్థం కావాలంటే భాష వస్తే సరిపోదు, ఆ పోలికల్లోని వ్యక్తుల గురించి, సందర్భం గురించి తెలుసుంటే తప్ప ఎంజాయ్ చెయ్యలేము. పైన చెప్పినట్లు జయలలిత ఎవరో, వాజ్ పేయి ఎవరో, వాళ్ళ మధ్య గొడవేమిటో తెలీనివారికి దానిలో హాస్యం అర్థం కానట్టే, ఒరిజినల్ ఉడ్ హౌస్ కథలు పూర్తిగా అర్థం అవ్వాలంటే దాంట్లో ప్రస్తావించిన వ్యక్తుల గురించి, సందర్భాల గురించి మనకు తెలియాలి. కాబట్టి ఉడ్ హౌస్‍ని లైట్ తీసుకుని అచలపతితో సరిపెట్టుకున్నా.
ఈ పుస్తకంలో నాకు నచ్చిన డైలాగులు రాయటం మొదలుపెడితే సగం పుస్తకం రాసెయ్యాలి. పైగా టపాలోనే కాపీరైట్ హెచ్చరిక ఒకటి పడింది కాబట్టి లేనిపోని రిస్క్ ఎందుకులెండి.
దీని సీక్వెల్ లాగా “రాంపండు లీలలు” అని మరొకటి వచ్చింది. దీనిలోని క్యారక్టర్స్ అన్ని దాంట్లోను ఉంటాయి. దీనంత హాస్యం ఉండదుగానీ, పర్లేదు. ఈ పుస్తకం నచ్చితే అది కూడా నచ్చొచ్చు, ఇప్పటివరకు చదవకుండా ఉంటే ప్రయత్నించండి.
యోగి
అచలపతి కథలను అప్పుడెప్పుడో హాసం పత్రికలో ధారావాహిక గా వేసే వారు…. అప్పుడు చదివాను. ఇవి ప్.జి. ఉఢౌస్ తరహా కథలు మాత్రమే కాదు, ఉడ్ హౌస్ కథలను ఎంబీయెస్ ప్రసాద్ తెనుగీకరించారు (అంటే అనువాదం మాత్రమే కాదు, మన నేటివిటీ కి దగ్గరగా). ఉదాహరణకి మాతృకలో గుర్రప్పందాల బెట్టింగ్ ఉందనుకోండి ఇక్కడ అవి బడిపిల్లల ఆటలపోటీలు అవుతాయి… బడి పిల్లల ఆటలూ, వాటి మీద బెట్టింగ్.. నవ్వు వస్తుంది 🙂
ఉడ్ హౌస్ గారు ఇంకా గొప్ప చమత్కారి – మామూలుగా Assassination అన్న పదాన్ని రాజులనో, దేశాధినేతలనో చంపిన సందర్భం లో ఉపయోగిస్తారు. కానీ ఉడ్ హౌస్ “your aunt will be assassinated” లాంటి పదప్రయోగాలతో నవ్వు తెప్పిస్తాడు.
ప్రఖ్యాత కార్టూనిస్టు Scott Adams ఎక్కడో రాస్తాడు – “Comedy is nothing but category mistake”
మీ వ్యాసం బాగుంది.