ఇల్లాలి ముచ్చట్లు
నాటి ఆంధ్రజ్యోతి పాఠకులకి ఈ పేరు సుపరిచితం అనుకుంటాను. పాతికేళ్ళపాటు విజయవంతంగా వచ్చిందట ఈ కాలమ్. ‘పురాణం సీత’ గా దీన్ని నిర్వహించిన వారు పురాణం సుబ్రమణ్యశర్మ గారు. పేరుకి తగ్గట్లే ఇవి ఇల్లాలి ముచ్చట్లు. అదీ, ఇదీ అని లేకుండా, ఏదీ వదలకుండా, ఎన్ని ముచ్చట్లు చెబుతుందో పురాణం వారి ఇల్లాలు! నేనీ పుస్తకం 2006ప్రాంతంలో చదివాను. అప్పట్లో దీన్ని గురించి రాసుకున్న డైరీ ఎంట్రీ మొన్న పురావస్తు తవ్వకాల్లో బయటపడితేనూ, దాదాపు యథాతథంగా టైపు చేసి మీ ముందుంచుతున్నాను. ఇదీ సమీక్షా, పరిచయమూ – ఏదీ కాదు. నాకు నచ్చిన వాక్యాలను రాసుకునే అలవాటు ఉండేది అప్పట్లో – దాని ఫలితం మాత్రమే!
సునిశితమైన హాస్యం, పదునైన వ్యంగ్యం, భిన్న విషయాలపై అవగాహన, సీరియస్ ఆలోచనా, బోలెడన్ని సలహాలూ, సూచనలూ – అన్నింటి కలబోత ఈ పుస్తకం. ప్రముఖులెందరో ఇదివరలోనే ఎంతో పొగిడిన ఈ పుస్తకాన్ని మళ్ళీనేను రికమెండ్ చేస్తున్నాను అంటేనే నాకున్న పొగరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి మరి!! 🙂
నోనోనో… ఇది సర్టిఫికెట్ కాదు. నాకు బాగా నచ్చిన వాక్యాలు కోట్ చేస్తున్నానంతే! పొగరూ,వగరూ వంటి జిగురు నాకు లేదండోయ్!
’14 ఏళ్ళ ఆడపిల్ల గుమ్మం దగ్గర నిల్చుంటే కవులూ కుర్రవాళ్ళూ హర్షిస్తారేమో కానీ, తల్లిదండ్రులు హర్షించరు’
‘బావులేదంటే తీసిన వారికి కోపం. పోనీ, ఆ బొమ్మలు సరిగా ఉన్నాయని సరిపెట్టుకుందామంటే ఆ ఫొటోలో ఉన్నంత వికారంగా ఉన్నామా అని మనసులో దిగులు..’
‘…అవి బురదలో పడుకున్నప్పుడు ఒక్కొక్కటీ అరడజను బాక్సాఫీసు హిట్లు తీసిన సినిమా ప్రొడ్యూసర్లలా నిర్లక్ష్యంగా చూస్తాయి మనకేసి..’
‘తడిపి కొత్తచీరను ఫెన్సింగు మీద ఆరేస్తే దూడ వచ్చి కసిదీరా నమిలి మింగేస్తుంది. అది నాకున్న ఒకటే మంచి చీర అని దూడకెలా తెలిసిందో!..’
-అంటున్నప్పుడు ఫక్కుమన్న మన నవ్వు మనమే విన్నప్పుడు కలిగే ఆనందమే వేరు.
‘…కానీ స్వర్గం, మోక్షం ఎంత మంచివైనా ఎవరో దిక్కుమాలిన వాళ్ళకూ, అభాగ్యులకూ తప్ప ఎవరికీ స్వర్గస్థులు కావాలని ఉండదు’
‘..మన ఆంధ్రాలో పల్లెటూర్లు తెలుసో తెలియకో సానిదానిలా షోకు చేసుకున్న శాస్తుర్లు గారి కూతుర్లా ఉంటాయి’
– అంటున్నప్పుడు తగిలే వ్యంగ్యం తెలియట్లేదూ?
‘మన జీవితం ఎవడోతెలివితక్కువ నాటక రచయిత రాసిన అవకతవక నాటకం కాదు కదా అని నాకు అప్పుడప్పుడూఅనిపిస్తూఉంటుంది’
‘భగవంతుడు మటుకు గొప్ప కార్టూనిస్టు ఎందుకు కాకూడదు? మనమంతా భగవంతుని కార్టూనులం’
‘మన జీవితాలను వీలనప్పుడల్లా ఓనులో పెట్టి ఆడించే రింగ్ లీడర్ కలడో లేడో’
– అని తాత్విక చింతన ఉంది కొన్ని చోట్ల
‘సర్కసు వెళ్ళిపోయిందనగానే, లాటరీలో గెలిచిందంతా ఖర్చైపోయిందనగానే ఎలా ఉంటుందో, ఆ పండుగ వెళ్ళిపోయిన రోజు బొమ్మల కొలువు ఎత్తేయాలని అంత చెడ్డ దిగులుగానూ ఉంటుంది.’
‘వెండి కంచంలో వేడి బువ్వ వేసుకుని, మంచం మీద మజ్జిగ పోసిన ఆవకాయన్నం తింటూ, అచ్చుతప్పుల్లేని పత్రిక చదూకోవడం అదృష్టంగా భావించాలి.’
‘ఆ కాలువ గట్టంట నా మనసు మీ వెనకాలే ఎలా పరుగెట్టిందోనేనిప్పుడు చెప్పలేను.’
‘బైండు కట్టించి గత స్మృతుల్ని రెండు అట్టల మధ్య బంధించగలరా?’ అని అడుగుతున్నాను
– ఇటువంటి వాక్యాలు కొన్ని తెగ నచ్చాయి నాకు.
‘చిరకాలం బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉండిపోవాలి. దీర్ఘ సుమంగళీభవ అని అంటే అందులో ఇంతకంటే నిగూడార్థం ఉండేడిసిందా?’
‘జరీఅంచు పమిట చెంగుతో మీ రెండు చేతులూగట్టిగా బిగించి, ఏ రోలుకో, మంచం కోడుకో కట్టి పడేయాలి.’
-వంటి వాక్యాలు చదువుతున్నప్పుడు అన్యోన్య దాంపత్యం ఒకటి కళ్ళ ముందు కదలాడింది.
‘మన వనితలు వంటింట్లోంచి, పొగగూట్లోంచి, తల యెత్తి సామాజిక జీవనంలో బహుళ సంఖ్యలో అడుగుపెట్టి పాలు పంచుకోనిదే భూమి మీద స్వర్గం ఎక్కడ్నుంచి వస్తుంది?’
‘ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్న స్త్రీలు చూస్తూ ఊరుకుంటే ఈ మానవ కల్యాణానికి నొసటన కుంకుమ బొట్టును ఎవరు తీర్చి దిద్దుతారు?’
‘గాలీ వెల్తురూ చొరని చీకటి కొట్లలో బంధించిన ఆడదాని మనసులోని ఊహల్లా..’
-అన్నప్పుడు స్త్రీ అభ్యుదయం కోరిన సామాజిక స్పృహ గల ఆలోచన కనబడ్డది.
ఇవిగాక, నేను విపరీతంగా ఇష్టపడ్డ వ్యాసాలు – జ్ఞాపకాలపై రాసినది, కాఫీ గురించి, ‘అమృత వర్షిణి’, ‘ఓ ఇల్లాలి ప్రార్థన’, ‘పెసరట్టు – ప్రేమకథ’ వగైరా…వగైరా..
‘వేర్ ది మైండ్ ఈజ్ విదవుట్ ఫియర్’ కు తెలుగు లో రాసిన పద్యం కూడా నాకు తెగ నచ్చింది.
నండూరి రామమోహనరావు గారు అన్నట్లు – ‘ఐ లైక్ ఇట్. ఐ టూ లైక్ ఇట్’.
తెలుగు చదవగల ప్రతి వారింట్లోనో కాస్త లైట్ రీడింగ్ కోసం ఈ పుస్తకం తప్పనిసరిగా ఉండాలని నాకు అనిపిస్తుంది.
అక్కడక్కడా ‘సీత’తనం లోపించినా కూడా, మొత్తానికి, ఒక ఆడపేరుతో, శర్మగారే ఇది రాసారంటే, అదీ అన్నేళ్ళు రాసారంటే, ఓ పట్టాన నమ్మబుద్ధి కాలేదు నాకు అప్పట్లో. నాలుగేళ్ళ తరువాత ఇప్పుడు కూడా ‘వావ్’ అనుకుంటూనే ఉన్నా అది తలుచుకుంటూంటే (ఈమధ్య కాలంలో ఈ పుస్తకం చదివే అవకాశం మళ్ళీచిక్కకపోయినా కూడా!!)
ఈ పుస్తకం చదివినప్పుడు నాకు పురాణం సీత గారిని కలవాలని మహా తహతహగా ఉండేది. అడ్రసు గురించి ప్రయత్నించాను కూడానూ. అయితే, మొన్నీమధ్యే ‘సాహిత్య అభిమానీ బ్లాగులో ఆవిడ ఇటీవలి కాలంలో మరణించారని తెలిసి, చాలా బాధపడ్డాను. 🙁 ఆవిడ రాయకపోయినా, తెర వెనుక ఆవిడ లేనిదే ఈ ముచ్చట్లు మనకి తెలిసేవా?
నేనూ, పుస్తకాలూ, రెండువేలపన్నెండూ … | పుస్తకం
[…] అనుభవం నాకు. ఈ పుస్తకం మీద ఒక పరిచయం ఇక్కడ […]
SIVARAMAPRASAD KAPPAGANTU
@SIVARAMPRASAD KAPPAGANTU: విజయవాడ పుస్తక ప్రరదర్శనలో ఇల్లాలి ముచ్చట్లు సరికొత్త సంకలనం దొరికింది. ఇంతవరకు నేను చదవని వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ప్రచురణ నవొదయా బుక్ హౌస్ వారు, వెల రెండువందల రూపాయలు.
SIVARAMPRASAD KAPPAGANTU
ఇల్లాలి ముచ్చట్లు తెలుగు పత్రికా చరిత్రలో ఒక చక్కటి ప్రయోగం. నభూతో నభవిష్యతి గా పురాణం వారు నిర్వహించారు. ఆయన వ్రాసిన ఇల్లాలి ముచ్చట్లు అక్కడక్కడా సంపుటాలుగా కనపడుతున్నాయికాని, వారు వ్రాసిన మొత్తం మొత్తం ఇల్లాలి ముచ్చట్లు అన్నీ కూడ ఒక ఆమ్నిబుస్ (omnibys) గా ప్రచురించే ప్రయత్నం ఆంధ్ర జ్యోతి (నవ్య) వారు చేస్తే బాగుండును. వారి వద్ద ఉన్న ఈ సాహిత్య రత్నం గురించి ఇప్పటి యాజమాన్యానికి తెలుసో తెలియదో మరి.
నేను మునుపు నా బ్లాగులోనూ, అంతకు ముందు తెలుగు వికీపీడియాలోనూ వ్రాసిన వ్యాసాన్ని ఈ కింది లింకు నొక్కి చదువవచ్చు.
http://saahitya-abhimaani.blogspot.com/2009/07/blog-post_22.html
పురాణం సీత గారి మరణం గురించిన వ్యాసం ఈ కింది లింకు నొక్కి చదగలరు
http://saahitya-abhimaani.blogspot.com/2010/10/blog-post_22.html
SRRao
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
– శి.రా.రావు
శిరాకదంబం
karlapalem Hanumantha rao
puranam sitha illali muchchatlu telugu sahityama lo bhanumathi gari attagari katghalu laga chirasthayiga vundataniki naku thelisina karanam:ii galpikalu rase kalam nati madhya tharagathi illallo oka madiriga chaduvu kunna inti illalla manobhavalanu premalanu kopa thapalanu ahladakaramayina appatiki kottadaina saililo samkshipthanga rayagalagatam.