నేటి జాతక కథలు, కాశీ మజిలీలు
రాసిన వారు: శ్రీ గోరా శాస్త్రి
గోరాశాస్త్రి అన్న పేరుతోనే అందరికీ తెలిసిన కీర్తిశేషులు శ్రీ గోవిందు రామశాస్త్రి ప్రముఖ జర్నలిస్టు, సంపాదకుడు, సాహితీవేత్త. ఖాసా సుబ్బారావుగారి వద్ద తెలుగు స్వతంత్రలో ప్రారంభించి, తర్వాత ఆ పత్రికకే సంపాదకులయ్యారు. ఆతర్వాత 1961 నుంచి ఆంధ్రభూమి దినపత్రికకు, వారపత్రికకు 1982లో ఆయన మరణం వరకు సంపాదకులుగా పనిచేశారు. నిజాన్ని నిర్భయంగా, నిష్కర్షగా, కుండబద్దలు కొట్టినట్టు చెప్పి… సునిశిత విమర్శతో హాస్యాన్నీ, వ్యంగాన్నీ, ధర్మాగ్రహాన్నీ, సాహితీ వైదుష్యాన్నీ సమపాళ్లలో మేళవించే గోరాశాస్త్రి సంపాదకీయాలంటే పాఠకులు చెవికోసుకునేవారని ఆరోజులు తెలిసిన వారు చెపుతుంటారు.
**********************
[ఈ వ్యాసం భారత స్వాతంత్ర్య రజతోత్సవ ప్రచురణగా యువభారతి వారు వేసిన – ‘మహతి ‘ అన్న సమీక్షా వ్యాస సంకలనం నుండి స్వీకరించబడినది. ఈ వ్యాసం ప్రస్తుత కాలానికీ వర్తిస్తుందన్న అభిప్రాయంతో, దీనికి ఇదివరలో మాకు తెలిసి ఆన్లైన్ వర్షన్ లేదు కనుక ఇక్కడ దీనిని మళ్ళీ ప్రచురిస్తున్నామే తప్ప, వేరే ఉద్దేశ్యాలు లేవని గమనించగలరు. ఈ వ్యాసం కాపీరైట్ల గురించి ‘మహతి ‘ సంకలనం లో ఏమీ రాయలేదు. కానీ, ఎవరికన్నా సమస్యలుంటే మమ్మల్ని సంప్రదించిన పక్షం లో ఈ వ్యాసం తొలగించగలము. వ్యాసం యూనీకోడీకరించినందుకు Swathy Appaly కి, గోరాశాస్త్రి గారి గురించి వివరాలు తెలిపి చిన్న పరిచయం రాసినందుకు జంపాల చౌదరి గారికి మా ధన్యవాదాలు. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మ గోరా శాస్త్రి గారిది. – పుస్తకం.నెట్]
మధిర సుబ్బన్న దీక్షితులు గారు మహానుభావుడు. సందేహం లేదు. గొప్ప వాడు. ఇవాళ ఆంధ్ర మహాజనులలో చాలా మంది ఆయన పేరు కూడా తెలియని దుస్థితిలో ఉన్నారంటే, అది వాళ్ళ దురదృష్టం గాని దీక్షితులు గారి గొప్పతనానికి మచ్చ కాదు. పాపం, ఇప్పుడాయన లేరు.ఇహలోకాన్ని విడిచి చాలా కాలమైంది. తారీఖులు వగైరాలు అనవసరం. దేనికి? మనకి కావలసినదీ, కృతజ్ఞతాపూర్వకంగా తలచుకోవలసిందీ,దీక్షితులు గారు సృష్టించి అందించిన సాహిత్యం. నేటి శతాబ్దం వార్ధక్యంలో పడింది. అది తరళతారుణ్యంలో ఉన్నప్పుడు దీక్షితులుగారు దీక్ష వహించి, “కాశీ మజిలీ కథలు” కుప్పలు కుప్పలుగా రాసి సంపుటాలుగా ప్రకటించారు.అబ్బో ఎన్ని సంపుటాలు! ఎన్నెన్ని కథలు ! అల్లిక జిగిబిగిలో ఆయన సిద్ధహస్తుడు. సాహిత్య భుజబలంలో ఆయనకు ఆయనే సాటి.
“కాశీమజిలీ కథలు” కేవలం కాలక్షేపం కథలే కావచ్చును. ఆంధ్ర సాహిత్య సమీక్షలలో దీక్షితులుగారి పేరు కనబడకపోవచ్చును. అయితేనేం, ఒక దినుసు సాహిత్యం కాలక్షేపానికి పనికొచ్చినా, అదెంతకాదు ? అభూత సంఘటనలతో, అసహజ వ్యక్తులతో గమ్మత్తు కథలు అల్లుకుంటూ పోవడానికి అదొక రకం ప్రతిభ కావాలి.
శివశంకరశాస్త్రి గారు అనువదించిన ” జాతక కథలు” కూడా అలాంటివే. శాస్త్రిగారి భాష సారస్వత పరిమళాలను వెదజిమ్ముతుంది .వ్యత్యాసం అంత వరకే. ఐతే, కాశీమజిలీ కథలే ఎక్కువ రుచివంతంగా ఉంటాయి. చదివే వాళ్ళను ఆకట్టుకుంటాయి.
“బ్రహ్మమానసపుత్రుడు” అంటారే, అలాగే మధిర దీక్షిత మానస పుత్రులు,పుత్రికలు, ఇవాళ ఆంధ్ర సాహిత్య రంగంలో శతాదికంగా వెలిసి, వీరవిహారం చేస్తున్నారు. సారస్వత క్షేత్రాన్ని భీషణంగా దున్నేస్తున్నారు. కథలు, కథానికలు , నవలలు పండించేస్తున్నారు.రచయిత్రులు మరీ మరీ విజృంభించారు. మరుగున పడిన పాతకాలపు ఇంగ్లీషు నవలలు, కథల సంపుటాలు గాలించి వెదికి, బూజు దులిపి, వాటిలోని ఇతివృత్తాన్ని, పాత్రల్ని తీసికొని, కాస్తంత “స్వదేశీయత” ద్రావకంలో ముంచి , రసాయనిక ఎరువులవలె ఉపయోగించి, కథల పొట్లకాయలు , నవలల గుమ్మడికాయలు పండిస్తున్నారు. సాంద్ర వ్యవసాయం జోరుగా సాగుతోంది. లారీలకొద్దీ పొట్లకాయలూ,గుమ్మడికాయలూ, ఆనపకాయలూ తెలుగు సాహిత్య మార్కెటులోకి తరలిస్తున్నారు. దుకాణాలు కళకళలాడుతున్నాయి. దుకాణాలవాళ్ళు తమ దినుసుల్ని తెగ పొగుడుతున్నారు. సాహిత్యం కొనుక్కునేవారిని రకరకాలుగా ఆకర్షించి మొహమాట పెడుతున్నారు. ఓ సాహిత్య గుమ్మడికాయ కొంటే నాలుగు దొండకాయలు ఉచితంగా ఇస్తామంటున్నారు.
ఈ రకం ” సాహిత్య పంట” సంరంభంలో అకాడమీలూ,ప్రభుత్వాలూ, తలదూర్చాయి. వ్యవసాయ ఖర్చులకు ఋణాలిస్తున్నాయి. పండించిన బుట్టెడు వంకాయాల్లో రెండు కిలోలు విధిగా కొంటున్నాయి.మొత్తంమీద తతంగం యావత్తూ మూడు పళ్ళూ, ఆరు కాయలుగా సాగుతోంది. క్షేత్రాలు సారవంతంకావు. ఊసరక్షేత్రాలకు అమాంతము ఉత్సాహము వచ్చింది. గాలిలో తేలి వచ్చిపడిన పుచ్చు చచ్చు విత్తనాలకు మొలకలూరుకొస్తున్నాయి. ఈరకం సాహిత్య దినుసు చూడ్డానికి బాగుంటుంది. విశిష్టత అంతవరకే. రసాయనిక ఎరువుల దోహధంతో పండాయేమో, నిగనిగ మెరుస్తాయి. ఐతే పొట్లకాయ గునపంలా ఉంటుంది. త్రవ్వకానికి పనికిరాదు. పోనీ పొట్లకాయ అనుకుంటే తినడానికి బాగుండదు. గుమ్మటంలాంటి గుమ్మడికాయ దూదివలె మెత్తగావున్నా, రాయివలె గట్టిగావున్నా, దేనికి కొరగాదు. రుచీ, పసా రెండు అభావం. చప్పగా, నిస్సారంగా ఉంటుంది.
రుచిలేని సాహిత్యదినుసుల్ని, అభిరుచి పరిజ్ఞానంలేనివాళ్ళు ఉత్సాహంగా ఆరగించి, “బాగున్నాయి, బాగున్నాయి ” అంటున్నారు. సరుకుల ప్యాకింగు ఆకర్షణీయంగా వుంటోంది. సాంకేతికరంగంలో వచ్చిన అభివృద్ధి ధర్మమా అని , ప్యాకింగుపద్ధతులు పసందుగా ఉన్నాయి.
మారుతున్న సమాజాన్నీ, జీవనవిధానాన్నీ దగ్గరగా చూస్తున్నా, అందులోనే ఉంటూ, ఆటుపోటులకు గురియవుతూ , తలాతోకా బోధపడక, ఉక్కిరిబిక్కిరై, కలంచేతబట్టి, కల్పనాసాహిత్యాన్ని బనాయిస్తున్నవారు కాశీమజిలీలనే అనుసరిస్తున్నారు.
కాశీమజిలీ రాజకుమారుడు సప్తసముద్రాలు దాటి, దుర్గామారణ్యంలోని మంజుఘోష సరస్సు అడుగుననున్న ముత్యాలహారం సంపాదిస్తాడు. నేటి రాజకుమారుడు!
అనగా ప్రేమలోపడిన చిట్టితల్లి మేనత్తకొడుకు- అమెరికా వెళ్ళి ” అయోవా ” యూనివర్సిటిలో రీసర్చిచేసి డిగ్రీ లాక్కొస్తాడు. అతడికోసం చిట్టి తల్లి నిరీక్షిస్తోంది. తల్లితండ్రులు వేరే సంబంధాలు చూస్తారు.వద్దంటుంది.ట్రాజెడీవిత్తనాలు పడ్డాయి. లేదా రాజకుమారుడు అమెరికా నుండి తిరిగొచ్చాక, ” నిన్ను ప్రేయసిగా భావించి ఎప్పుడూ ప్రేమించలేదు శైలజా ! (సుహాసిని ! అనితా ! అరుణా ! ఒకులాభరణ ! శేషాలినీ !) నాది సోదరప్రేమ !” – అనేస్తాడు. చిట్టితల్లి అమాంతం మొగాళ్ళస్వార్ధం మీద లెక్చర్ దంచేస్తుంది. అన్నీ ప్రేమకథలే. సదరు రసానికి స్థాయిభావం వివాహం.
కాలేజీస్నేహాలు, మేనరికాలు, అమ్మానాన్నలు, బామ్మలు, ” హనీమూన్” లు స్నేహితురాళ్లు, కాశ్మీర్, లండన్, న్యూయార్క్ – అక్కడనుండి చేటపుర్రు, పాచిపెంట, పిడుగురాళ్ళ- మద్రాసు మెరినాబీచి, హైదరాబాదు టాంక్ బండ్ వరకూ స్థలాన్ని ముడి వేస్తారు. ఆఫీసు ప్రేమలు, సెక్రటరీలు, ఆసుపత్రిప్రేమలు, త్యాగాలు- వస్తుగుణంలో అన్నీ కాశీమజిలీలే, పేదరాశి పెద్దమ్మ ఉపాఖ్యానలే.
కల్పనా సాహిత్య పేజీల సదస్సులో ఎంతదూరం వెళ్ళినా, చీలమండదాటి లోతువుండదు. గడచిన పదిహేను సంవత్సరాలలో కుప్పతెప్పలుగా వస్తున్నా కల్పనాసాహిత్యం రెండుతరాల తెలుగువారి సాహిత్యాభిరుచుల్ని దయనీయంగా దిగజార్చివేసింది .
దేశానికి రాజకీయ స్వాతంత్ర్యంవచ్చి 25 సంవత్సరాలు నిండాయి. సంతోషంతో ఉత్సవాలు చేసుకుంటున్నాము. ఒక్కసారి వెనక్కితిరిగిచూస్తే, పాతిక సంవత్సరాలలోనూ జాతీయజీవనంలో వచ్చిన మార్పులను సింహావలోకనం చేస్తే, ఆనందించవలసిన అంశాలెన్నో ఉన్నాయి. అన్నిరంగాలలోనూ సాధించిన అభివృద్ధి బ్రహ్మాండమైనది. వస్తూత్పత్తిలోనే కాదు,నిర్మాణంలోనే కాదు, సాంఘికజీవన విధానంలోనే దేశచరిత్రలో మున్నెన్నడూ లేనంతగా రసాయనికమైన మార్పు వచ్చింది. ప్రేరణలు, అనుస్పందనలు, దృక్పథాలు అన్నీ కొత్తవి. పరిణామ గుణంతోపాటు పయనిస్తోన్న మనసున నాటి,నేటి సాంఘిక వ్యవస్థలవ్యత్యాసం పూర్తిగా అవగాహనలోనికి రాలేదు.
అలనాడు స్వాతంత్ర్యానికి పూర్వంవరకూ సమాజంలోని ఒకటో రకం మేధావుల్ని సృజనాత్మకశక్తి , ఉపజ్ఞా , వ్యుత్పత్తీ , సమస్థమూ నిండుగా ఉన్నవారిని సాహిత్యరంగం ఆకర్షించింది. అప్పటివారికున్న అవకాశాలు చాలాతక్కువ. సాంఘిక శ్రేయస్సు , ఉన్నతీగురించి ఆలోచించగలిగే చైతన్యవంతులు సంఘ సంస్కరణ కార్యక్రమాన్నో, రాజకీయ, స్వాతంత్ర్యోద్యమాన్నో, సాహిత్యేద్యాది కళాఖండాలనో చేపట్టేవారు. సాంకేతిక , వైజ్ఞానిక రంగాలలో కృషి చేసేవారు సకృత్తుగా ఉండేవారు. అవకాశాలేవి ?- ఇప్పుడున్నన్ని యూనివర్సిటీలు,కాలేజీలు, ప్రభుత్వయంత్రాంగంలో శాఖలు, అన్నీ పరిమితం. మేధావి వర్గాలవారు తమ ప్రతిభ నిరూపించడానికి చోటు యిరుగ్గావుండేది. రాజకీయరంగం _ ఆనాడు_ ప్రమాదకరమైనది. అగ్నితో చెలగాటము. అన్నివిధాలా భస్మీపటలంమవడానికి సిద్ధపడినవాళ్ళే అందులో దూకేవారు. తక్కినవాళ్ళు లాయర్లుగానో , టీచర్లుగానో , ఉద్యోగులుగానో , స్థిరపడేవాళ్ళు. వైద్యం, ఇంజనీరింగ్, సైన్సు రంగాలు చిన్నవి. పోనీ , పరిపాలనా దక్షులుగా ప్రతిభ నిరూపించాలన్నా, తెల్లదొరలు అనుమతించేవారు కాదు.
అంచేత సాహిత్యాది కళారంగాలే శరణ్యమయ్యాయి. ఒకటోరకం మేధావులు,సహజప్రతిభావంతులు వాటిలో ప్రవేశించేవారు. విశ్రాంతికి లోటు లేదు. ఆనాడు సామాజిక జీవనంలో నేడున్నంతవడీ , వేగమూ , ఆందోళన , అసంతృప్తి , తహతహ , తృష్ణా లేనేలేవు. అంచేత , ప్రతిఫలాపేక్ష లేకుండా, యావచ్చక్తీ వినియోగించి శ్రమించేవారు. అందువల్లనే సాహిత్య క్షేత్రాల్ని సుసంపన్నం చేయగల్గారు.
పాతికేళ్ళలో అత్యంతోద్దీప్తమైన విప్లవం వచ్చింది. దేశానికి లక్షలాది సాంకేతిక, పరిపాలనా దక్షులూ . డాక్టర్లూ , ఇంజినీర్లూ , సైంటిస్టులు కావలసి వచ్చారు . అవకాశాలు పెరిగాయి. 1947 నుండి 1960 వరకూ యువతరానికి అదొక బంగారంవంటి అవకాశాల సమయం. యువతీ యువకులందరూ టెక్నికల్. అడ్మినిస్ట్రేటివ్ , రంగాలవైపు దౌడుతీశారు.ఒకటో రకం ప్రతిభావంతులు అవసరమయారు. విదేశాలలో ఉన్నతవిద్య అందుబాటులో కొచ్చింది. జాతి పునర్నిర్మాణ కార్యక్రమం జోరుగా సాగిన సమయమిది. ఉన్నతికి మార్గాలు తెరుచుకున్నాయి. రెండు మూడు తరాల ప్రతిభావంతులు ఐ.ఏ. ఎస్., ఐ,పి.ఎస్. రంగాలకు పరిగెత్తారు. వడియ , ఇంజినీరింగు , సైన్సు , రీసర్చి , బ్యాంకింగ్ , ఆర్థికశాస్త్రం , పారిశ్రామికరంగం – ఒకటేమిటి, అన్ని రంగాలు ప్రతిభావంతుల్ని ఆకర్షించాయి.
ప్రేరణలోనే మార్పువచ్చింది. అటుచూస్తే ప్రభుత్వయంత్రాంగం శాఖోపశాఖలు పెంచుకొని విస్తరించుకొంది. ప్రతిభావంతులైన యువకుల్ని పిల్పించి, సుఖజీవనాన్ని ఏర్పాటు చేసింది. అందుచేత వెన్నా, నవనీతము అటుపారిపోయాయి.అలాటి వాళ్ళని సాహిత్యరంగం ఆకర్షించలేదు. అందులో ఏముంది ? కధకుడవడంకంటె కలక్టరవడం హాయికదా ! నవనవోన్మేషంగా వికసిస్తున్న భారతదేశం ” బెస్ట్ బ్రెయిన్స్” ని సాహిత్యేతర రంగాలలోకి లాగేసింది
సాహిత్య సృష్టి మిగిలినవారి మీదపడింది. అక్షరాస్యత పెరిగినకొలదీ పత్రికలకూ, పుస్తకాలకూ , గిరాకీ హెచ్చింది. ఎక్కువ సరుకు కావాలి. తయారు చేసేవారు ఎవరో ఒకరు కావలి కదా! ” వ్యాకూమ్ ” లోకి యువకులు ప్రవేశించారు. పాతికేళ్ళలో ఏంజరిగిందో సమగ్రంగా, లోతుగా , సమ్యక్ దృష్టితో గ్రహించి, కళాత్మికంగా నివేదించ గలిగేశక్తి కొరవడింది గనుక, ఇంకా పెళ్ళిళ్ళు , బావమరదళ్ళ సరసాలు, ప్రేమ పురాణాలు, విఫల ప్రణయాలు రాసిపారేస్తున్నారు. మానాసికంగా పసివారు అంతకంటె ఏంచేస్తారు! కళాత్మక సృష్టి అంటే ఏమిటో పరిచయం లేనివారు చదివి ఆనందిస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం యువకులుగా ఉండి , సాహిత్యదండాన్ని చేపట్టిన యోధానయోధులు నేడు తలనెరిసినవారై , అలసిపోయి కూర్చున్నారు. కొత్తగా వచ్చిన పరిణామాలను పాత సులోచానాలతో చూస్తూ, అదేమిటో బోధపడక, అయోమయంగా చూస్తున్నారు. వాళ్ళలో రెండురకాల వాళ్ళున్నారు. మానవత్వాన్ని దీవించేవారు , శపించేవారు. అర్ధం తెలియకుండానే దీవిస్తున్నారు, శపిస్తున్నారు.
పాతయుగం చచ్చింది. కొత్తయుగం బోధపడదు. అంచేత నేటి సాహిత్య సర్దారులూ, సర్దారిణులు , కాశీమజిలీ పాత్రలకు టైట్ ప్యాంట్లు, మినిలంగాలు తొడుగుతున్నారు.
Leave a Reply