కవితాభూషణం-రెండో భాగం

మొదటి భాగం లంకె ఇక్కడ.

చదువరి గా అనుభవాలు :

౧. చిన్నప్పుడు ’బాలసాహిత్యం’ తో మీ అనుభవాలు చెబుతారా?

చందమామ మొదలుకొని అన్ని పత్రికలూ చదివేవాణ్ణి. పాకెట్ పుస్తకాలు, డిటెక్టివ్ నవలలు తెగ చదివే వాణ్ణి.. నానా పత్రికల్లో వచ్చే సీరియల్స్ చదవడం ఒక వ్యసనంగా ఉండేది. ప్రతి నెలా వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనే వాణ్ణి.. (బాల భారతిలో కార్టూన్ కు కాప్షన్ రాసే పోటీ లో గెలుపొందడం నాకు ఎంతో ఉత్సాహం కలిగించింది.)

రంగుల బొమ్మలు చూసి మురిసి పోయేవాణ్ణి. నాకు నచ్చిన బొమ్మలు మళ్ళీ చిత్రించి మా డ్రాయింగ్ మాస్టర్ (పుల్లయ్య సారు)కు చూపించే వాణ్ణి. నా స్నేహితుడు రాజు వాటర్ కలర్స్ / ఆయిల్స్ లో చక్కగా బొమ్మలు వేసే వాడు. నేను వాటర్ కలర్స్ లో బొమ్మలు వేసే వాణ్ణి. కార్టూన్లు గీయడం నేర్చుకోవాలని తెగ ఉబలాట పడే వాణ్ణి. వెంకట్రావు అన్న కార్టూనిస్ట్ కొన్ని పాఠాలు ప్రచురించారు, అవి సాధన చేసేవాణ్ణి.అమర చిత్ర కథ వారి బొమ్మల పుస్తకాలు అద్భుతంగా అనిపించేవి.

అలాగే సిందబద్ సాహస యాత్ర, గలివర్ ట్రావెల్స్ ఎంతో ఇష్టంగా చదవడం ఇప్పటికీ గుర్తుంది. ఉపవాచకాలు Oliver Twist,Tom Sawyer, Alice in the wonderland గొప్ప అనుభూతిని మిగిలించాయి.చిన్నవయసులో హిందీ సాహిత్యం చదువుకున్నాను, కొన్ని హిందీ కథలు ,ఏకాంకికలు ఆకట్టుకోనేవి.ముఖ్యంగా జయశంకర్ ప్రసాద్ రాసిన ఆకాశ దీపం అద్భుతమనిపించేది. (నేను అనువాదం చేసిన తొలి కథ ఇదే ). బాల్యం ఆటపాటలతో, అందమైన పుస్తకాలతో రంగుల మేఘంలా అందకుండా అలా తేలిపోయింది.

౨. మీకు సాహిత్యం పట్ల, కవిత్వం పట్ల, ఆసక్తి కలిగిన తొలినాళ్ళలో – పుస్తకాల ఎంపిక వగైరాలు ఎలా చేసుకునేవారు? (peer network- వంటివి ఎలా ఉండేవి?)

లైబ్రరీ లో అన్ని రకాల పుస్తకాలు చదివే వాణ్ణి. అనంతపురం నుండి విశాలాంధ్ర సంచార వాహనం వచ్చేది. దిన, వార, మాస పత్రికల్లో సాహితీ వేత్తలగురించి రాస్తూ ఉండేవారు . జ్యోతి మాస పత్రిక లో చక్కని ఇంటర్వ్యూలు వేసేవారు. కాబట్టి సాహిత్య రంగంలో ఏమి జరుగుతుందో బాగానే తెలుస్తుండేది.

వల్లంపాటి వెంకట సుబ్భయ్య గారి నవలా శిల్పం అప్పుడు పుంఖానుపుంఖాలుగా వస్తున్న సీరియల్ సాహిత్యానికి, సీరియస్ సాహిత్యానికి మధ్య తేడాను విశదీకరించి మంచి విచక్షణ కలిగించింది.రచనకు తగు స్థానాన్ని కల్పించడమే విమర్శకుడు చేయగలిగిన పని. అప్పుడు గాని సాధారణ పాఠకుడు ఒక మెట్టు పైకి ఎక్కలేడు.

౩. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలు, రచయితలు

అనేకం ,ప్రత్యేకంగా ప్రస్తావించ వలసి వస్తే :

ప్రాచీనులు :

౧. భారత భాగవత పద్యాలు,పెద్దన,శ్రీనాథుడు ,బద్దెన ,వేమన.
౨. భర్తృహరి శతకత్రయానికి ఏనుగు లక్ష్మణ కవి చేసిన అనువాదాలు.
౩. అలంకార శాస్త్రాలు (ముఖ్యంగా జమ్మలమడక వారి తెనిగింపు).
౪. పతంజలి యోగ సూత్రాలు/చాణక్యుని అర్థ శాస్త్రం/శంకరాచార్య.
౫. తూర్పు దేశాల కవిత్వాలు, తత్వాలు.

ఆధునికులు :

౧. గురజాడ రచనలు.
౨. గిడుగు వ్యాసాలు.
౩. తెగిన జ్ఞాపకాలు -సంజీవదేవ్ ఆత్మ కథ.
౪. శ్రీపాద ఆత్మకథ – అనుభవాలు -జ్ఞాపకాలూను.
౫. నార్ల ( కవిత -పాండితి).
౬. అక్కిరాజు ,రాళ్ళపల్లి, రా.రా. ల విమర్శ.
౭. తెలుగు కథా రచయితలు (విమర్శ).
౮. వల్లంపాటి -నవలా శిల్పం.

కవిత్వం :

౧.తిలక్ -అమృతం కురిసిన రాత్రి, బైరాగి -నూతిలో గొంతుకలు.
౨. ఇస్మాయిల్- రాత్రివచ్చిన రహస్యపు వాన ,కవిత్వంలో నిశ్శబ్దం.
౩.కవిత్వానువాదాలు (శ్రీ,శ్రీ., స్మైల్ )
౪. నిస్సిం ఎజేకిల్ ( కవి, ప్రేమికుడు)

ఇతరులు :

1. How to Read a Book – బ్రాడ్ స్కీ ఉపన్యాసం (18 మే 88 ).
2. R.L.Stevenson ,Francis Bacon తదితరుల వ్యాసాలు.
3. Nietzsche, Schopenhauer (తాత్వికులు).
4. Turner , van Gough (చిత్రకారులు).
5. Trumbull Stickney (Sonnets).
6. Robert Bly – American Poetry :Wildness and Domesticity.
7. Goethe -Faust A tragedy.

౪. కొన్ని పుస్తకాలు కష్టపడి సంపాదించిన అనుభవాలేవన్నా ఉంటే – పంచుకుంటారా?

సంపాదించలేని పుస్తకాల గురించి తరచు ఆలోచిస్తుంటాను.
* చిన్న నాడు ఒక పుస్తకం వెనుక అట్ట మీద ఉన్న ఫళాన గాలిలో తేళ్ళు కురిపించుట వగైరా ఇంద్రజాల మహేంద్ర జాలాలు చేయవచ్చు అని ఉంది. చిన్న వయసులో ఆ పుస్తకం కనిపిస్తే బావుంటుంది అనుకుండే వాణ్ణి. కానీ దొరకలేదు.

* టావో టే చింగ్ కు సంస్కృతానువాదం ఉన్నట్టు ఫ్రెంచి పరిశోధకులు చెబుతున్నారు. నా జీవిత కాలంలో ఈ పుస్తకం దొరికితే ఎంతో ఆనందిస్తాను.

* తెలుగులో నన్నయకు ముందు కాలంలో కావ్యాలు ఉంటాయనే నా నమ్మకం.నా జీవితకాలంలో ఏవైనా దొరికితే ఎంతో సంతోషిస్తాను.

౫. మీరు తరుచుగా సందర్శించే పుస్తకాల షాపులు?

ఇండియా లో ఉండగా పాత పుస్తకాల షాపులు, ఆదివారం ఫుట్ పాత్ షాపులు.విశాలాంధ్ర ,నవోదయ. చీకటిలో రోడ్డు పక్క, లాంతరు వెలుతురులో తెలుగులో గొప్ప పుస్తకాలను కనుగొనడం నిజంగా ఎంత గొప్ప అనుభవం. అమెరికా వచ్చాక Barnes & Noble లో ఎండ పడే చోట కుర్చీ లాక్కుని పత్రికలూ, పుస్తకాలు చదవడం ప్రాణానికి హాయిగా ఉంటుంది.

౬. “ఈ బిజీ జీవితంలో పుస్తకాలు చదవడానికి కూడా టైమా?” – అంటే ఏం చెబుతారు?

జీవితంలో ఒక గమ్యం లేని వారు బిజీగా ఉంటారు; లేదా ఉన్నట్టు నటిస్తారు. పుస్తకాలు చేయగలిగిన పని ఆలోచనకు పురిగొలపడం. పుస్తకాల అవసరం లేకుండానే కొందరు ఆలోచించగలరు. అటువంటి వారు పుస్తకాలు చదవక పోయినా వచ్చిన నష్టం లేదు. తతిమ్మా వారికి పుస్తకాలు చదవడానికి వీలు చిక్కడం లేదంటే వారి జీవితం కొంత అస్తవ్యస్తంగా మారిపోయిందని అర్థం. అటువంటి వారి సంఖ్య పెరిగితే ప్రమాదం.

౭. అనుభవం కలిగే కొద్దీ, ఓ పుస్తకాన్ని గానీ, రచయితని గానీ – కొంతవరకూ అంచనా వేయగలమంటారా? (ఆ రచన/రచయితది మనం ఇదివరకు ఏదీ చదవకున్నా కూడా).

లేము. పోనీ వేయగలమే అనుకొన్నా, మన అంచనా తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు.

ఎందుకడుగుతున్నాను అంటే – ఇప్పుడేదన్నా పుస్తకాల కొట్టుకు వెళ్తే, వందల వేల కొద్దీ పుస్తకాలుంటాయి. ఒక్కోసారి మనకసలు ఊరూ పేరూ తెలీని రచయితల పుస్తకాలు చూసి కూడా – ఏ కవర్ పేజీ చూసో, టైటిల్ చూసో ఆకర్షితులమై, అట్టవెనుక కథ చూసి కొనాలి అనుకోవచ్చు. తీరా కొన్నాక అది చెత్త అని తేలొచ్చు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలని చదువరిగా అనుభవం పెరిగే కొద్దీ అరికట్టగలమంటారా?

చీకటి గదిలో అడుగు పెట్టినప్పుడు- ఏ వస్తువు ఎక్కడుందో వెంటనే అర్థం కాదు. తడుముకోవలసి వస్తుంది. దీపం వెలిగితే గాని చూపు సరిగా ఆనదు. ఇలాంటి పరిస్థితి చదువరికి, తొలినాళ్ళలో ఎదురు కావచ్చు. వందల వేల పుస్తకాల మధ్య మనకు కావలసిన పుస్తకం ఎంపిక చేసుకోవడం ఎలా అన్నది సమస్య. ఈ సమస్యకు సమాధానంగా ప్రపంచ వ్యాప్తంగా పత్రికలు లెక్కలేనన్ని పుస్తక సమీక్షలు ప్రచురిస్తున్నాయి.పుస్తకాల ఎంపికలో సమీక్షలకు తగు స్థానం ఉంది. కవర్ పేజీ, టైటిల్ చూసి కొనడం అంటే ఇంకా దీపం వెలగలేదనే అర్థం.అట్ట వెనుక కథ /వివరాలు చదివి కొనడం గుడ్డి లో మెల్ల. సమీక్షలు చదివి పుస్తకాలను ఎంపిక చేసుకోవడం మంచి పద్ధతే. ఐతే, ఈ సమస్యకు రష్యన్ మహాకవి బ్రాడ్ స్కీ ఇచ్చిన సమాధానం తెగ నచ్చి అతని వ్యాసం అనువాదం చేశాను .ఆసక్తి ఉన్నవారు చదువుకోగలరు (లంకె ఇక్కడ).

౮. ఒక పుస్తకం ఎన్నుకునే ముందు రచయిత జీవితం గురించి – తెలిసి ఉండటం ఎంతవరకూ అవసరమంటారు?

రచన మీద ఆసక్తి చూపాలి, రచయిత మీద కాదు. కారణం రచయిత జీవితం పరిమితం. తద్భిన్నంగా, రచన శాశ్వతంగా నిలిచిపోతుంది. ఉదాత్త రచనలు చేసిన రచయిత జీవితం ఉదాత్తంగా ఉండాలనుకోవడంలో తప్పు లేదు; కానీ, అది అన్ని వేళలా సాధ్యం కాదు.

౯. మీకు బాగా నచ్చే సాహిత్యం?

ఒక భావాన్ని వీలయినంత క్లుప్తంగా, బలంగా చెప్పగలిగిన రచనలు నాకిష్టం. ఒక రచన చదివాక బుద్ధి వికసించాలి. అనుభవ సంపద పెరగాలి. అటువంటి రచనలు, ఏ భాషలో ఉన్నా సంపాదించి చదువుతుంటాను. విమర్శ పుస్తకాలు ఆసక్తి గొలుపుతాయి. బుద్ధికి పదును పెడతాయి. కవిత్వం హృదయాన్ని తాకి మరింత మృదువుగా మారుస్తుంది. సాహిత్యమనే కాదు, నానా విషయాల మీద వచ్చే పత్రికలూ, పుస్తకాలు చదువుతుంటాను. ఉదాహరణకు మీ ప్రశ్నలకు
సమాధానాలు రాస్తూనే, అతుల్ గవాండే రచన చెక్ లిస్ట్ మేనిఫెస్టో ముగించాను. చక్కని పుస్తకం, తరచూ ఆపరేషన్ రూంలో చోటుచేసుకొనే పొరపాట్లను ఎలా అరికట్టాలి ?? అన్నది ప్రధాన విషయం. వైద్యులనుద్దేశించి రాసినా అందరికీ ఉపయోగ పడే పుస్తకం.

౧౦. గ్రంథాలయాలతో మీ అనుభవాల గురించి…

శుక్రవారం శలవు అన్న బోర్డు – పని వేళలు :౮-౧౧ , ౪-౭ – పెన్సిల్ తో సంతకం చేయమనే బంట్రోతు. తాడిపత్రి లైబ్రరీ లో గిడుగు, గురజాడల సంపూర్ణ సాహిత్యం చదివాను. అలాగే గోథె ఫాస్ట్ నాటకం, శబ్ద సారం, విద్వాన్ విశ్వం అనువాద కవిత్వం లాంటి అరుదైన పుస్తకాలు అక్కడే చదివాను. పిల్లల పుస్తకాలూ సరే సరి.ఎన్నో జీవితచరిత్రలు, శ్రీ.శ్రీ., బైరాగి కవిత్వాలు ,వల్లంపాటి నవలా శిల్పం, నానా పత్రికలు అక్కడే చదివాను. తమాషా ఏమిటంటే ఇస్మాయిల్ రచనలేవీ మా లైబ్రరీ లో లేవు, ఆ కారణంగా చాలా ఆలస్యంగా అంటే విజయవాడ వచ్చాక ఆయన కవిత్వం, విమర్శ (కాకాని గ్రంథాలయంలో) చదివాను. విజయవాడలో మా కాలేజి లైబ్రరీ లో అమెరికన్ కవులు ,కన్ఫ్యూజియస్ లాంటి తాత్వికుల పుస్తకాలు చదివాను.

కావలసిన పుస్తకం కోసం తాడిపత్రి లైబ్రరీ మొత్తం గాలించే వాణ్ణి. పుస్తకాన్ని తెరవగానే సదరు రచయిత నన్ను అవహించేవాడు. కాబట్టే, నేను పుస్తకాన్ని కేవలం పుస్తకంగా ఏనాడూ చూడలేదు. రచయితకు పుస్తకానికి అభేదం ఉంది అనుకొనే వాణ్ణి. ప్రతి పుస్తకం చదివాక నోట్స్ తీసుకోవడం వీలయితే సమీక్ష రాయడం నాకు అలవాటు. అలాగే అచ్చు తప్పులు గుర్తించడం ఒక సరదా ( ఇటీవల చదివిన ఇండియా ఆఫ్టర్ గాంధి అన్న పెద్ద పుస్తకంలో కేవలం రెండు అచ్చు తప్పులు గమనించాను.)

(ఇంకా ఉంది)

You Might Also Like

5 Comments

  1. పుస్తకం » Blog Archive » కవితాభూషణం-నాలుగోభాగం

    […] బాల్యం కబుర్లతో కూడిన మొదటి భాగం ఇక్కడ. ఆయనలోని చదువరిని పరిచయం చేసే రెండో […]

  2. తమ్మినేని యదుకుల భూషణ్.

    టావో టే చింగ్ కు వచ్చిన ఇరవైయ్యవ శతాబ్ది తొలి దశకంలో (౧౯౧౩) వచ్చిన ప్రామాణిక అనువాదాల్లో ఎన్నదగినది పాల్ సారస్ అనువాదమే. ఇందులో ఫ్రెంచి పరిశోధకుడు
    Prof. Paul Pelliot ( T’oung Pao ,1912 pp. 351-430) ప్రస్తావన ఉంది. ఇతని
    పరిశోధనలో తేలిన విషయం :మగధాధీశుడు హర్ష శీలాదిత్యుని సామంతుడు -అస్సాము పాలకుడు ,కుమారకుని కొలువులో అనువాదం జరిగింది.చేసిన వాడు హ్యూయన్ త్సాంగ్ (ఇంత వరకు అది అనుపలబ్ధము). ఇతనే బౌద్ధ గ్రంథాలననేకం సంస్కృతం నుండి చైనీస్ లోకి పరివర్తించాడు. ఇతను రాసిన యాత్రా చరిత్ర ప్రసిద్ధి గాంచింది.
    టావో టే చింగ్ అనువాదంలో ఆదిలోనే హంస పాదు లాంటిది టావో శబ్దమే. నూటికి తొంభై తొమ్మిది మంది టావో ను టావో గానే పెట్టేసి బండి నడిపించారు. కానీ , టావో అన్న శబ్దం క్రియా రూపం తీసుకున్నప్పుడు వస్తుంది చిక్కు. నాక్కూడా చాలా కాలం పట్టింది టావో అన్న పదానికి అచ్చ తెనుగు అనువాదం పట్టుకునే సరికి ( దీని మీద ఒక ప్రత్యేక వ్యాసం రాసి ఉన్నాను ,వీలు వెంబడి ప్రకటిస్తాను ) . సంస్కృత కృతి మీద నాకు ఆసక్తి కలగడానికి ముఖ్య కారణం ,టావో అన్న పదాన్ని ఇరు భాషల లోతులు తెలిసిన అనువాదక శ్రేష్ఠుడు ఎలా అనువదించాడు ? ఆయన అనువాదానికి ఆధారమైన ప్రతి ఏమిటి ?? వాంగ్ పి వ్యాఖ్యానాన్ని ,భాష్యాన్ని అనుసరించాడా ?? లేదా స్వతంత్ర ధోరణి అవలంబించాడా ?
    ఆయన వ్యాఖ్యానంలో బౌద్ధ ప్రభావం ఉందా ?? ఇలా ఎన్నో చిక్కు ప్రశ్నలు విడి పోతాయి.
    ఆ అనువాదం దొరికితే.
    మిత్రుడు వినీల్ ఫ్రెంచి ప్రతి కి లింకు పంపించాడు ; ఆసక్తి గల వారు సంప్రదించ గలరు.
    http://www.archive.org/stream/s2tungpaotoungp13corduoft#page/350/mode/2up
    –తమ్మినేని యదుకుల భూషణ్.

  3. పుస్తకం » Blog Archive » కవితాభూషణం – మూడోభాగం

    […] బాల్యం కబుర్లతో కూడిన మొదటి భాగం ఇక్కడ. ఆయనలోని చదువరిని పరిచయం చేసే రెండో […]

  4. రవి

    “* టావో టే చింగ్ కు సంస్కృతానువాదం ఉన్నట్టు ఫ్రెంచి పరిశోధకులు చెబుతున్నారు. నా జీవిత కాలంలో ఈ పుస్తకం దొరికితే ఎంతో ఆనందిస్తాను.”

    Very interesting !!

    అస్టావక్ర గీత లో భావనలు కొంత అలానే ఉంటాయి.

  5. అరి సీతారామయ్య

    “ఎండ పడే చోట కుర్చీ లాక్కుని పత్రికలూ, పుస్తకాలు చదవడం ప్రాణానికి హాయిగా ఉంటుంది” – చాలా బాగా చెప్పారు భూషణ్ గారు.

    కాని, “జీవితంలో ఒక గమ్యం లేని వారు బిజీగా ఉంటారు; లేదా ఉన్నట్టు నటిస్తారు… పుస్తకాలు చదవడానికి వీలు చిక్కడం లేదంటే వారి జీవితం కొంత అస్తవ్యస్తంగా మారిపోయిందని అర్థం” – ఇది నాగురించేనేమో అనుకుంటే భయమేస్తుంది! ఈ మధ్య కాస్త బిజీ గానే ఉన్నట్లుంది నా జీవితం.

    మూడో భాగం కోసం ఎదురుచూస్తూ..

Leave a Reply