కవితాభూషణం – మూడోభాగం

(యదుకులభూషణ్ గారి బాల్యం కబుర్లతో కూడిన మొదటి భాగం ఇక్కడ. ఆయనలోని చదువరిని పరిచయం చేసే రెండో భాగం ఇక్కడ.)

కవిత్వం:
(కవిగా ప్రస్థానం, మార్చుకున్న పద్ధతులు, నేర్చుకున్న విషయాలు, మంచి కవిత్వానికి/కవికి ఉండవలసిన లక్షణాలు, దృక్పథం, తెలుగు కవిత్వం లో గత కొన్ని దశాబ్ధాల్లో వచ్చిన చెప్పుకోదగ్గ మార్పులు,కవులకి సూచనలు గట్రా, కవిత్వం లో క్లుప్తత/చిక్కదనం/గాఢత వంటి వాటి పరిమితులు -వీటి గురించి)

౧. మీరు కవిగా గుర్తింపడిన నాటి నుండీ, మీకు మీరు పూర్తిగా తృప్తి కలిగించే కవిగా ఒప్పుకోవడానికి మధ్య మీ ప్రస్థానమేమిటి?

చీకట్లు కమ్ముకొస్తున్న ఒకానొక సాయంత్రం
డాబా మీద వెలిగే బల్బు;విరిగిన పాత కుర్చీ
హాయిగొలిపే కొబ్బరాకుల మృదువైన చప్పుడు …

సాధారణ వస్తువుల్లో కూడా ఒక అలౌకిక సౌందర్యం ఉందన్న విషయం స్ఫురించింది. ఆనాటి నుండి (౧౯౮౨) ఉపేక్షించకుండా రాయడం మొదలు పెట్టాను. నేను కవిత్వం రాసే తొలినాళ్ళలో నా కవిత చదివి వినిపించి -‘ఎవరు రాశారీ కవిత ‘ అని అడిగే వాణ్ణి. వారితో నాలుగయిదు కవుల పేర్లు చెప్పించి, చివరికి ‘ కవిత రాసింది నేనే ‘ అంటే వారి మొహాల్లో ఒకింత ఆశ్చర్యం తొంగి చూసేది. అలా మొదలయింది నా ప్రస్థానం. అమరకోశం చదివే వాణ్ణి, కాబట్టి శబ్దశక్తికి వచ్చిన లోటు లేదు.పత్రికలు మరీ ఇప్పటిలా తయారు కాలేదు. భారతి ఇంకా ఆగిపోలేదు. లైబ్రరీలో సరుకున్న పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటా బయటా పూర్తిగా తెలుగే. కాబట్టి, నిరాటంకంగా తెలుగులో ఊహా శక్తి పారడానికి అనువైన వాతావరణం ఉంది.

సొంత గొంతుక కోసం తడుముకొంటున్న రోజులవి. శబ్దాల కోసం శ్రీ శ్రీ ;భావాల కోసం తిలక్. బైరాగి పంథా వేరు. కొద్దో గొప్పో తిలక్ ప్రభావంతో రాజకీయ కవిత్వాలు (సంఘటనలకు స్పందించి రాసేవి ), వైయక్తిక అనుభూతులతో కూడిన కవిత్వాలు రాశాను. ఇతర ప్రభావాలతో ( హిందీ /ఇంగ్లిష్ ) రాత్రిని ,బాల్యాన్ని personify చేస్తూ రాసినవి కొన్ని. పూవు గుర్తు పద్యాలే కాదు, మొత్తం పద్యాలన్నీ నోటికి వస్తే గాని తనివి తీరేది కాదు. ప్రాచీన దేవాలయాల్లో మనం చెక్కలేని శిల్పాల్లాంటి ఈ పద్యాల్లో కూడా, ఒక వింత ఆకర్షణ దోబూచులాడేది. ఆ నడక, తూగు మనసుకు పట్టేవి . కవిత్వానికి ఒక లయ, నడక ఎంత అవసరమో తెలిసివచ్చింది అలాగే.

౧౯౮౬ లో అనుకొంటాను. ” వెలుగు రేఖల వెంట / వెనుదిరిగి నీవు / వేదనలే మిగిలించి/ వెళ్ళిపోయావా ప్రియా ”
అన్న కవిత అప్రయత్నంగా వెలువడింది. (నేను రాసిందే అంటే ఎవరూ నమ్మేలా లేరు).౧౯౮౮ లో ‘నిశ్శబ్దంలో నీ నవ్వులు’ , ‘నేను బ్రతికే ఉన్నాను’ కవితలు ఒక సొంత గొంతుక కోసం నా వెతుకులాట ముగియబోతుంది అన్నదానికి సంకేతాలు.౧౯౯౦ లో నా దీర్ఘ నిరీక్షణ ఫలించి, కవిత్వ ధారల్లో పూర్తిగా తడిచి పోయాను. అప్పుడు నేనున్నది నా కలల రాజధాని విజయవాడలో; ఆ తర్వాత, బలమైన ఏకాంతపు బిగికౌగిలిలో పడి నలిగి పోయాను. నా ఊహలను కట్టడి చేస్తూ వచ్చిన సకల ప్రభావాలు భస్మీపటలమై కొత్తలోకాలకు దారులు తెరచుకున్నాయి. నాదైనటువంటి జీవితానుభవాలు ,మోహోద్రేకాలు,ఆశలు నిరాశలు,భయాలు భ్రాంతులను పెకలించుకొని వచ్చి కవిత్వంలో బలంగా ప్రవేశ పెట్టగలిగిన భాష పట్టుబడింది. ఆ దశలో నేను ఎన్నో కవితలు రాశాను.

ఆ రోజుల్లో సంజీవ దేవ్, ఇస్మాయిల్ గార్ల లేఖలు వేరే లోకం నుండి వచ్చి పడుతుండేవి.గట్టు మీద పసుపు పచ్చ పూవులు పూసే పొడవాటి చెట్టు హృదయంలో అలౌకిక ఆనందాన్ని నింపేది.కాలేజీ వెనుక చెరుకు పొలాలు, అందమైన పరిసరాలు, కృష్ణానది, రైల్వే స్టేషన్, ఏలూరు రోడ్డు, చీకటి సందులు, దారి వెంబడి మసక దీపం వెలుతురులో పుస్తకాలు.. అనేక ప్రాంతాల స్నేహితులు.. రకరకాల యాసలు .. ఎండ సోకని వనంలా యవ్వనం.. అల్లరిగా నవ్వే అమ్మాయిల కళ్ళు చెరగని ముద్ర వేశాయి.నేను దర్శించిన లోకం నా కవిత్వంలో దరులొరుసుకొని పారే నదిలా పరవళ్ళు తొక్కుతూ ప్రవహించ సాగింది. ౧౯౯౨ లో నా కవిత ‘అభావం’ ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చింది.(త్రిపురనేని శ్రీనివాస్ సంపాదకుడు.కవిత్వం ప్రచురణలు పేరుతో అందమైన పుస్తకాలు వేస్తూ ఉండేవాడు).అప్పుడు నేను ఇంజనీరింగ్ చివరి సంవత్సరం; ఒక రెండేళ్ళు అనేక పత్రికల్లో నా కవితలు వచ్చాయి. ౧౯౯౪ లో ముత్యాల సరాలు రాశాను. పత్రికలకు కవితలు పంపడం మాని వేశాను.మళ్ళీ ఏకాంతంలో కవితా రచన, మెరుగులు దిద్దడం ఇవన్నీ మామూలే. ఇదీ నా కవితా ప్రస్థానం !!

౨ ప్రధానంగా మీరు మార్చుకున్న పద్ధతులు, నేర్చుకొన్న విషయాలు ఏమిటి ??

abstract ideas ను అవతలకు నెట్టి concrete గా రాయడంలో గట్టి సాధన చేశాను. సాధనలో భాగంగా- పాశ్చాత్య చిత్రకళా రీతులను, మధ్య యుగాల భారతీయ శిల్పకళను అధ్యయనం చేశాను; నానా భాషల్లో వచ్చిన కవిత్వాలను, విమర్శను ఆకళించుకొని మహాకవుల రచనలు తెలుగులోకి అనువదించాను; కవిత్వ మూలాన్ని, ప్రకృతిని,పరిమితులను, పద్ధతులను లోతుగా అర్థం చేసుకోవడానికి తూర్పు దేశాల అలంకార, తత్వ శాస్త్రాలను తుదముట్ట చదువు కున్నాను. నేను ముఖ్యంగా గ్రహించినది కవికి గొప్ప observation, హెచ్చు స్థాయిలో objectivity కావాలి. లేనిదే ఆధునిక కవిత్వం అలవోకగా సృష్టించ లేడు.

౩. ఒక ఔత్సాహిక కవికి కవిత్వం పట్ల ఉండవలసిన దృక్పథం ఏమిటి?

కవిత్వం పేరిట వచనం రాయడం వచన కవిత్వం కాదు. కవిత్వం వృత్తమయితే వచనం కేవలం సరళ రేఖ మాత్రమే. అంటే కవిత్వానికి నియమితాకృతి ఉంది. దానికి భిన్నంగా వచనాన్ని ఎంత దూరమైనా పొడిగించవచ్చు. ఇంకా బాగా అర్థమయేలా చెప్పాలంటే రైలు పట్టాలా కదలక పడివుండేది వచనమైతే, పట్టాల మీద చక్రంలా కదిలిపోయేది కవిత్వం.

లయలేనిదే కవిత్వం లేదు. ప్రాచీన కాలంలో కవులు ఛందస్సు ద్వారా లయను సాధించే వారు. ఫ్రెంచి కవులు verse libre అని ఛందస్సును వదిలి స్వంత పద్ధతుల్లో లయను సాధించారు.ఇతర భాషల్లో దీని ప్రతి ధ్వనులు వినిపించాయి.(ఐతే రష్యన్లు తమ సంప్రదాయానికే కట్టు బడ్డారు). verse libre స్ఫూర్తితో ఎజ్రా పౌండ్ లాంటి వారు ఆంగ్ల కవిత్వాన్ని అంత్యప్రాసల నిరంకుశత్వం నుండి, అరిగిపోయిన పదబంధాల నుండి కాపాడ జూశారు. free verse అలా
పుట్టుకొచ్చిందే. దీనికి అసమర్థ అనువాదమే వచన కవిత్వం.

కాబట్టి, వచన కవిత్వమంటే వచనం రాయలేక కవిత్వం రాయడం కాదు.కవిత్వాన్ని వచనంలోకి దించడం కాదు.కవిత్వంలో లయను సృష్టించే ఛందస్సులాంటి పాత సాధనాలను వదిలి,తనదైనటువంటి భావనా శక్తితో, భాషా పటిమతో కవిత్వంలో లయను పునః ప్రతిష్ఠించడం.

ఇదేమంత సులభమైన విషయం కాదు, కాబట్టి వచనంలో ఆరితేరిన తర్వాతే వచన కవిత్వం. అదలా ఉండనిస్తే, కవిత్వానిది ఒక స్థాయి; కవులు పాఠకులు, ఉభయులూ ఆ స్థాయికి ఎదగవలసిందే. ఇది వర్తమాన కవులకు వచనకవిత్వం పట్ల ఉండవలసిన దృక్పథం.

౪. మంచి కవిత్వానికి గీటురాయి ?

భావనా శక్తి. అది లేనిదే కవితా సృష్టి లేదు. దానికి లోబడే ఉంటాయి- సకల కవిత్వ లక్షణాలు.పదాల చీకటిని చీల్చే సూర్యకాంతి లాంటిది భావనా శక్తి. భావాల కాంతి సోకిన మేర పదాలు వెలిగి పోతాయి. లేదంటే ఆ చీకటికి అంతు లేదు.

౫. తెలుగు కవిత్వం లో గత కొన్ని దశాబ్దాల్లో వచ్చిన చెప్పుకోదగ్గ మార్పులేవి ??

అడుగుజాడ గురజాడది; శ్రీ శ్రీ లాంటి వారు గురజాడకు గురుస్థానమిచ్చినా, కవితా రీతుల్లో గురుశిష్యుల దారులు వేరు. ఇదిలా ఉండగా, తెలుగు కవిత్వంలో భావ కవిత్వం ఒక మైలురాయి. కృష్ణ శాస్త్రి ప్రభృతులు భావకవులుగా పేరు పొందిన వారే. ఆ కవిత్వం మీద వచ్చిన బలమైన విమర్శ అక్కిరాజు ఉమాకాంతం గారి నేటి కాలపు కవిత్వం (౧౯౨౬). కవులు దిద్దుకోగలిగిన ఘరానా దోషాలను బలంగా ప్రస్తావించిన ఆ పుస్తకాన్ని అటకెక్కించి చెడిపోయారు తెలుగు కవులు. ఈ సంరంభంలో (౧౯౩౪) కలం పట్టిన వాడు శ్రీ.శ్రీ. ఇతనిలోని చేవ కేవలం ముప్ఫైలకు పరిమితం. విశ్వనాథకు ఇతని కవిత్వం నచ్చింది అంటే మనం అర్థం చేసుకోవలసింది- శ్రీ శ్రీ లో వదలవలసిన పాత పద్ధతులు, గ్రాంధిక వాసనలు అనేకం ఉన్నాయని. ఇతనిలో పెద్ద లోపం శబ్దాలను దాట లేకపోవడం, అర్థాన్ని అధ్వాన్నపుటెడారిలో వదిలేయడం. ‘ ఈ శతాబ్దం నాది’ అనడం పదిరెట్లు అతిశయోక్తి. ఈ దశాబ్దం నాది అంటే సరిపోయేది.

తిలక్ తిక్కనలా విశేష భారం మోసిన వాడు.ఆ కాలంలోనే, శ్రీ శ్రీ ని ధైర్యంగా విమర్శించిన వాడు.(‘ఖడ్గ మృగోదగ్ర విరావం ఆలకించ లేను. పులిచంపిన లేడి నెత్తురు పులుముకోలేను’).తతిమ్మా అందరూ శ్రీ శ్రీ కి హారతులిచ్చి చేతులు దులుపుకున్న వారే. తిలక్ లో ఎంత వైవిధ్యముంది ? శ్రీ శ్రీలో ఎక్కడ చూసినా ఏకరీతి కనిపిస్తుంది. తిలక్ ఎక్కువ కాలం బ్రతకలేదు.శ్రీ శ్రీ సప్తతి పూర్తి చేసుకున్నాడు. తిలక్ కొస ఊపిరి దాకా కవి. ఈ శతాబ్దం నాదన్నవాడి కవిత్వ వాదర ఒక దశాబ్దం దాటాక వినిపించదు! అజంతా రాసింది తక్కువైనా ఎంతో నిష్ఠగా రాసినవాడు. తెలుగు కవిత్వంలో బైరాగి నీషే లాంటి వాడు (‘ నీ ఆత్మకు ఆహారం వనస్పతి వంటకాలా’ ?).

ఈ లోపు దిగంబరులు, నానా వర్గ కవులు సమాజాన్ని మార్చాలని (అదీ కవిత్వంతో) బయల్దేరారు. ఆ హడావిడికి ‘ ఆకులందున అణిగి మణిగి ‘ పలుక వలసిన కవిత కోకిల దీర్ఘకాలం వలస పోయింది. కుందుర్తి లాంటి వారు వచనకవిత్వంలో ఏమేమో చేయాలని బయల్దేరి, చివరికి భారత రాజకీయాల్లో వినోబా భావేలా ఎందుకూ కొరగాకుండా పోయారు.

ఇస్మాయిల్ పాతాళానికి దిగజారుతున్న తెలుగు కవిత్వాన్ని పైకెత్తి నిలిపాడు. దాదాపు పాతికేళ్ళ సాధన తర్వాత ఇప్పుడిప్పుడే శివారెడ్డి కవిత్వంలో పరిణతి కనిపిస్తోంది. ఎన్ని దోషాలున్నా అరుదైన భావుకత జయప్రభ సొంతం. అఫ్సర్
కవిత్వంలో అయోమయానికి అంతులేదు. గోపీ సినారేలు కుకవినిందకు కూడా కొరగారు.అందరూ మరచిన కవి వజీర్ రెహమాన్. మో బాణీయే వేరు. నానా వాదాల కవులు (స్త్రీ / దళిత /మైనారిటీ.. ) కవిత్వ పరిధిని సంకుచితంగా
మార్చాలని చూసినా వారిలో బలమైన గొంతులు లేకపోలేదు. శిఖామణి చిక్కని కవిత్వాన్ని రాశాడు. వీరభద్రుడు గద్య ప్రవృత్తిని వదిలించుకొని ఇటీవల కవిత్వంలోకి జారి పడ్డాడు.

విన్నకోట రవిశంకర్ కవిత్వంలోని విలక్షణత, ఒక తలపోత, ఒక తరహా తాత్విక ధోరణి ఉంది. రమణ జీవి అసంగత భావధారను పట్టుకున్నాడు.తలభారం వదిలించుకోగలిగితే బలమైన కవిత్వం రాయగల చేవ స్వామిలో ఉంది. ముకుంద రామారావు కుటుంబ చింతను కవిత్వంలోకి ప్రవేశ పెట్టారు. హెచ్చార్కెలో సంఘర్షణ నేపథ్యం కనిపిస్తుంది. నాసర రెడ్డి, ప్రసాద్, గోపిరెడ్డి హైకూ కవిత్వంలో ముందున్నారు.

ఈ దశాబ్దంలో తెలుగు కవిత్వం ఆశావహంగానే ఉంది. మొదటిపుస్తకంలోని కవిత్వం చూసి చెప్పవచ్చు ఒకరు కవిగా ఎంత బలహీనులో/బలవంతులో (శివారెడ్డి ,జయప్రభల మొదటి పుస్తకాలు చూడండి). పాలపర్తి ఇంద్రాణి ,గరికపాటి పవన్ ,ఇక్బాల్ చంద్, ఎమ్మెస్ నాయుడు, వైదేహి, మోహన్ తదితరుల మొదటి పుస్తకాలు గమనిస్తే ముందు తరాల కవులకు భిన్నంగా వీరందరూ కవిత్వంలో బలమైన పునాది ఏర్పరచుకొన్నారని తెలుస్తుంది. అంతే గాక, పత్రికల్లో అప్పుడప్పుడు కనిపించే విడి కవితల్లో ఎంతో ప్రతిభ ద్యోతకమవుతుంది.

ప్రపంచంలో ప్రాచీన కవితాసంప్రదాయం గల అతి కొద్ది భాషల్లో తెలుగు ఒకటి. మన స్థాయి గుర్తించి కవితా సాధనలో నిమగ్నమయితే నిస్సందేహంగా ఒక మెట్టు పైకెక్కవచ్చు. తెలుగులో ప్రతి రెండవ వాడు కవే ఐనా, ముందు నుండి కవిత్వం కన్నా కథ బలంగా ఉందని నా అభిప్రాయం.కారణం, మన వారికి free verse వెనుక ఉన్న spirit అర్థం కాలేదు.ఇటువంటి సందేహాలు తొలినాళ్ళలో పరిష్కరించి ఉన్నత సంప్రదాయం నెలకొల్పగల వివేచన ఆ నాటి కవుల్లో, విమర్శకుల్లో కొరవడటంతో వ్యవహారం గాడి తప్పింది .

వచన కవిత్వం పేరిట కవులది ఆడింది ఆటగా పాడింది పాటగా ఉంది. నానీలని ఒకడు, రెక్కలని మరొకడు పూటకొక పేరుతో కవులమని చెప్పుకొనే పగటి వేషగాళ్ళు తయారవుతున్నారు. ఇక కవిత్వ విమర్శ తెలుగులో బలంగా లేదని వేరే చెప్పుకోవాలా ?? వర్తమాన కవిత్వాన్ని ఎదుర్కొన్న జోదు అక్కిరాజు ఉమాకాంతాన్ని వదిలితే, తెలుగులో కవిత్వ విమర్శ లేదనే చెప్పాలి. రాళ్ళపల్లి, కట్టమంచి కవిత్వంలో ప్రాథమిక భావనలను తేట పరిచినా అంతకు మించి వారు ముందుకు సాగలేదు. రా.రా. కవిత్వం మీద కన్నా కథా సాహిత్యం మీద గొప్ప విమర్శ రాశాడు. చే.రా. ప్రధానంగా సమీక్షకుడు. వేల్చేరు లెక్కలోకి రాడు.

మనకు గొప్ప కథకులు ఉన్నారు. కథల మీద సద్విమర్శ వుంది. ఈ రెండు పరస్పర పోషకాలు. కవిత్వ విమర్శ బలపడితే గానీ గొప్ప కవిత్వం పుట్టదు.దారాన్ని వెనక్కు లాగనిదే గాలిపటం ఆకాశాన్ని తాకదు. కవిత్వానికి విమర్శ చేసే దోహదమదే. చాలా కాలంగా మన కవిత్వ గాలిపటాలు చెట్లలో చిక్కుకొని ఎగరడం మానేశాయి. ఇప్పుడిప్పుడే కొత్త గాలి వీస్తోంది. శుభం.

౬.కవిత్వం పైన విమర్శకులు, సమీక్షకులు ఎలా వ్యవహరించాలి. కవిత ను ఎడిట్ చేస్తున్నప్పుడు
ఏ అంశాలు దృష్టి లో ఉంచుకోవాలి?

* .ఒక కవికి తగు స్థానం కల్పించే వాడు విమర్శకుడు. ఇది పెద్ద పని. అందరూ చేయలేనిది. ఏది కవిత్వం, ఏది కాదు అన్న విషయంలో ఒక స్పష్టతను ఏర్పరచాలి విమర్శకుడు. కవిత్వ రూపం విషయంలో అలుముకొని ఉన్న అయోమయ చింతనను భేదించాలి. చెత్త ఎవరు రాసినా చేత్తే. కర్త శ్రీ శ్రీ కావచ్చు.చిన్న కవి కావచ్చు.నిరపేక్ష దృష్టితో విషయాన్ని నిరూపించాలి. మొహమాటాలకు తావు లేదిక్కడ. ఒక భాషలో విమర్శ బలంగా లేక పొతే గొప్ప కవిత్వాలు రావు.కావున, విమర్శకుడు కొరడా ఝలిపించవలసిందే.

*.కవిత/కవితా సంకలనం బాగోగులు చర్చించేవాడు సమీక్షకుడు. విమర్శ తో పోలిస్తే ఇది చిన్న పని. తన పరిధికి లోబడి పాఠకులకు కవిత్వమ్మీద సరైన దృష్టిని కలిగించాలి.చాలు, అంత కన్నా సమీక్షకుని నుండి మనం ఆశించలేము.

*. కవిత్వానికి సవరణలు సూచించే వాడు కవిత్వ సంపాదకుడు. ఇది నిజంగా కష్టమైన పని. అందరూ చేపట్ట కూడని పని. కవిత్వం చదవడం విధిగా సంపాదకుడికి వచ్చి తీరాలి. కవికి తోడ్పాటు అందించడమే సంపాదకుడి బాధ్యత. ప్రతి కవికి ఒక సొంత గొంతు ఉంటుంది. అది మరుగున పడని రీతిలో ఉండాలి సూచించే మార్పులు చేర్పులు.కవి స్థాయిని గుర్తించాలి.(కొత్తగా రాస్తున్నాడా, చాలా కాలంగా రాస్తున్నా, ఇటీవల కాలంలో రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడా, లేదా మరింత మెరుగు పడ్డాడా ఇలా చాలా శాస్త్రీయంగా ఆలోచించాలి ).విస్తృతంగా చదివి కవిత్వంలో తనకంటూ ఒక అభిరుచి ఏర్పరచుకొని ఉంటే గాని ఇవన్నీ సాధ్య పడవు.

౫. ఒక్కోసారి క్లుప్తత, గాఢత పేరుతో కవితల్ని కత్తిరించేయడం చూస్తుంటే ’ఇలా చేస్తే మిగిలేది హైకూలు మాత్రమే’ అనిపిస్తుంది. క్లుప్తత కి పరిమితులేమిటని మీరనుకుంటున్నారు?

క్లుప్తత అంటే ‘ కట్టె,కొట్టె ,తెచ్చె’ అని మూడుముక్కల్లో రామాయణాన్ని చెప్పడం లాంటిది కాదు. భావాంతం, పదాంతం ఒకే సారి జరిగితే క్లుప్తతకు వచ్చిన లోటు లేదు. చాలా సార్లు భావాంతం జరిగినా పదాంతం జరగదు. అప్పుడు క్లుప్తతకు భంగం వాటిల్లుతుంది. కవి అన్నవాడికి భావతీవ్రత ఉంటుంది; ఒక కవి పదసంపదను నిర్ణయించేది భావతీవ్రతే. కవితలో తొలగించ వలసిన పదాలు అధికంగా ఉన్నాయి అంటే అది భావ తీవ్రతలో లోపమే.

అణాకానీ భావాలతో కవితా సృష్టికి బయల్దేరితే రసభంగం తప్పదు. కవితను తెగ నరికితే మిగిలేది హైకూ కాదు. హైకూ రాయడానికి కావలసిన చిత్త వృత్తి వేరు. దాని సంప్రదాయాలు, కవి సమయాలు వేరు. ఈ ఎరుక లేనప్పుడు ఎంత ప్రయత్నించినా హైకూ సిద్ధించదు. భావానికి తగిన రూపం సమకూర్చుకోవడం అంత సులభం కాదు, ఎంతో సాధన కావాలి. అంత వరకు ఈ తిప్పలు తప్పవు.

కవులకు సూచనలు …

స్వేచ్చగా బ్రతకాలి. పసిపిల్లవాడిలా ప్రపంచాన్ని పరికించాలి.ముఖ్యంగా పిల్లల నుండి కవులు నేర్చుకోవలసింది పరిశీలన (observation).కవులు పరిశీలనా శక్తిని పెంచుకోకుండా, ఊరకే పుస్తకాలు చదవడం వల్ల వచ్చేలాభం లేదు. పరిశీలనాపరమైన దోషాలు కవిత్వంలోకి ప్రవేశిస్తాయి.బలమైన పరిశీలన ఉంటే కవిత్వంలో విచ్చలవిడి విశేషణాలు, అడ్డూ ఆపులేని అలంకారాలు కనిపించవు. ఒక వస్తువును నిజస్థితిలో గమనించడమే పరిశీలన. ఏకాంతం లేనిదే అది సాధ్యం కాదు. కావున, కవిత్వానికి ఏకాంతమే బలం. Robert Bly లాంటి కవులు గుర్తించినట్టు ఏకాంతం కరవైతే కవిత్వంలో లయ మాయమవుతుంది. ఏకాంతం లేనిదే నిత్యానిత్య వస్తు విచారం సాధ్యం కాదు -అది లేనిదే తత్వ నిశ్చయం కలుగదు. శాంతస్థితికి ప్రాతిపదిక ఏర్పడదు. ఉద్వేగాలు సమన్వయం చెందిన శాంతస్థితి నుండే ఉద్బవిస్తుంది కవిత్వం.
(“emotions recollected in tranquility” అన్న వర్డ్స్ వర్త్ వాక్యం దీన్నే సూచిస్తుంది.). శాంతుడైన కవి వాదాల /మతాల రొంపిలో దిగబడి ఎడా పెడా రాయడు. సకల మతాలు ( కొత్తవి : మార్క్సిజం,మావోయిజం, పాతవి : అసంఖ్యాకాలు ) గంతలే. అవి మన దృష్టిని అడ్డగిస్తాయి. గంతలు ధరించిన గాడిదలా బ్రతికి ఇతరులకు వినోదం కలిగించ రాదు. మృత్యు స్పృహ కలిగి, నిర్భయంగా బ్రతికి, ప్రశాంతంగా మరణించగల నిబ్బరాన్ని అలవరచుకొంటే గాని మన కవిత్వానికి ఒక స్థాయి కలగదు.

(ఇంకా ఉంది)

You Might Also Like

14 Comments

  1. పుస్తకం » Blog Archive » కవితాభూషణం-నాలుగోభాగం

    […] (యదుకులభషణ్ గారి బాల్యం కబుర్లతో కూడిన మొదటి భాగం ఇక్కడ. ఆయనలోని చదువరిని పరిచయం చేసే రెండో భాగం ఇక్కడ. కవిత్వం గురించి ఆయన అభిప్రాయాలు, అనుభవాలు తెలియజేసే మూడోభాగం ఇక్కడ.) […]

  2. మాగంటి వంశీ

    బాగుందండీ. భలే చెప్పారే – తింటూ వడ్డించకూడదని. భేషుగ్గా వడ్డించొచ్చు. వ్యాస / పరిచయ పరిధి దాటిపోయినా ఒకటో, నాలుగో చెప్పాలని అనిపించటంతో ఈ క్రింద నాలుగు మాటలు …

    – వడ్డించేవాడు మనవాడైతే వంటకాలు బోల్డు రుచి. వారు గరిటతో వడ్డించినా, గంగాళమంతా వొంపినా పులకరమే. అవతలివాడైతే మటుకు వికారోపశమనం కలగడం దాదాపు అసంభవం. కాబట్టి పంక్తికి ఎటువైపు కూర్చున్నామనేది ముందు చూసుకుని, ఆ తర్వాత మనవాడా కాదా అనేది కూడా చూసుకుంటే వైతరణి దాటినట్టే. అలాగే ఇంకో రకంగా చెప్పాలంటే తను తింటూ అవతలివాడికి వడ్డించలేకపోతే అది ఖచ్చితంగా ఆ తినే మనిషి స్వార్థపరత్వమే. అర్థమయ్యిందనే నా ఊహ. కాకుంటే విపులంగా తర్వాత మరెప్పుడైనా.

    చివరిగా – ఒకడికి శాకాహారం, ఒకడికి మత్స్యాహారం, ఒకడికి గొడ్డుమాంసం, ఒకడికి సూకరమాంసం ఇష్టం. ఐతే వీడు తినేది అవతలివాడికిష్టముండదని వాణ్ణి మోటుగాడిదంటే , వాడు మరేదో అంటాడు. అదండీ సంగతి. 🙂

    ఈమాట వ్యాసం లంకె ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక తప్పక తీరిక చేసుకుని చదవాలి.

  3. Srinivas Vuruputuri

    పవన్ గారికి,
    మీ జవాబు చూసాక నా వ్యాఖ్య మళ్ళీ చదువుకుంటే, కాస్త పర్సనల్ గా తగిలేలా రాసానా అనిపించింది. తొందరలో రాసానేమో, సరిగా రాయలేదు కూడా. తప్పే!
    సున్నిత హృదయుల మనసు త్వరగా గాయపడుతుందనటంలో సందేహం లేదు. మీరే రైటు!
    నేను రాద్దామనుకుంది కోప ప్రకటన గురించే!
    ఇప్పటికి ఆపేస్తాను.
    మీ
    శ్రీనివాస్

  4. తమ్మినేని యదుకుల భూషణ్

    తింటూ వడ్డించడం లాంటి పని చేయరాదు.కావున మీ ప్రశ్నలకు సమాధానంగా ఒక దారి చూపి వదులుతాను.
    విమర్శాదర్శం

  5. అనురాగ్

    భూషణ్ గారూ,

    శ్రీనివాస్ గారి, పవన్ గారి పై వ్యాఖ్యలకు:

    మీ వాక్యాల్లో పారుష్యం లేకపోయినా, మీరనే భావాలు మాత్రం కస్సున దిగబడుతాయి (అచ్చ తెలుగులో తిట్టించుకోవడమూ మహద్భాగ్యమే ,పారుష్యం అనట్లేదు మళ్ళీ పవన్ గారు నన్ను ప్రశ్నించకుండా). కానీ వీటిని బట్టి చూస్తే మీ ప్రమాణాలు ప్రస్తుత తెలుగు కవితా ప్రంపంచంలోని, కవి, విమర్శకుల ప్రమాణాలకు చాలా వైరుధ్యంగా ఉన్నాయి. మీ విమర్శ కటవుగా ఉంటుందని కొందరి ఉద్దేశ్యం. నాకే ఉద్దేశ్యాలు లేవూ. కానీ విమర్శ ఏలా ఉండాలి? వాటికి ప్రమాణాలేమిటి?.

    విమర్శకుడి పని కవికి సాహిత్య ప్రపంచలో ఒక స్థానాన్ని కలిపించడం అన్నారు, అందుకే “కు కవి నిందకు కూడా పనికి రాకపోవడం, ఏందుకూ కొరగాకుండా పోవడం” అన్నీ ఆ కవులకు సాహిత్య చరిత్రలో స్థానాన్ని కలిపించే భాగాలే. ఆ కవి స్థాయిని ఆ వాక్యాలు మీ ప్రమాణాలననుసరించి నిర్ణయించారు.

    మీరు మీ విమర్శను ఏ స్థాయిలో గుర్తిస్తారు? అది కటువా? సున్నితమా? మీకు నిజంగా కోపమా, లేక బాధా?

    అనురాగ్

  6. తమ్మినేని యదుకుల భూషణ్

    తొలినాళ్ళలో కవికి రూపపరమైన సందేహాలు అనేకం ఉంటాయి. వాటికి సమాధానాలు వెతుక్కునే క్రమంలో ఇతర లలితకళలను అధ్యయనం చేయడం పరిపాటి. మహాకవి రిల్కే శిష్యరికం చేసింది మహాశిల్పి రోడిన్ దగ్గర.రోడిన్ గురుత్వం రిల్కేను అమితంగా ప్రభావితం చేసింది.రిల్కే తన చూపుకు పదును పెట్టుకున్నాడు. కవిత్వానికి అక్కరకు వచ్చే
    observation అతనికి పట్టు బడింది. అతని కవిత్వం మరింత ముర్తంగా మారింది.

    శిల్పి,చిత్రకారుడు, కవి దర్శించేది ఒకటే ప్రపంచాన్నే. శిల్పి తాను దర్శించిన ప్రపంచాన్ని కఠిన శిలను చెక్కి ప్రదర్శిస్తే ,చిత్రకారుడు వర్ణ విన్యాసంతో ,రేఖానైపుణ్యంతో ,వెలుగునీడల క్రీడతో దృశ్యమానం చేస్తాడు. కవి అదే ప్రపంచాన్ని కేవలం పద విన్యాసంతో మనసుకు అనుభూతమయేలా చేస్తాడు. ఎంచుకున్న మాధ్యమాన్ని బట్టి పరిమితులు ,పద్ధతులు వేరయినా ముగ్గురినీ కలిపేది ఊహా శక్తి. వీరు ముగ్గురు తాము దర్శించిన ప్రపంచాన్ని యథాతథంగా తమ కళలో ప్రవేశ పెడతారు. దానికి ముందు పద్ధతులను ఆకళించుకుని, పరిమితులను అర్థం చేసుకొని వాటిని దాటి పోయే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో మరింత ప్రతిభావంతులు ( ఉదా : వాన్ గో , టర్నర్) తమదైనటు వంటి నూతన పద్ధతులను సృష్టిస్తారు. అవి ఇది వరకు ప్రపంచం ఎరగనివి.వీరి చిత్రకళను అధ్యయనం చేయడం వల్ల రూపపరమైన సందేహాలు తొలగి కవిత్వం మరింత మూర్తంగా మరే అవకాశం ఉంది.

  7. అనురాగ్

    భూషణ్ గారు,

    మీ ప్రశ్నోత్తరాలను జాగ్రత్తగా, నిదానంగా చదివాను, ఎన్నో తెలిసీ తెలియని విషయాలని విడమరిచి చెప్పి అబ్బుర పరిచాయి. ఇంత చెప్పినా ఇంకా చెప్పమనడం భావ్యం కాదేమో, కానీ ఉండబట్టలేక అడుగుతున్నాను చిత్ర కళకీ, కవిత్వం నేర్చుకోవడానికీ ఏమిటి సంబంధం అంతుపట్టీ పట్టనట్టుంది. శిల్పాల్లోనూ, కవితల్లోనూ ఉండే బిగువు తెలిసినా శిల్పాలను అధ్యయనం చేసి వాటిని కవిత్వానికి ఎలా అన్వయించారు?

    అనురాగ్

  8. రాజు

    భూషణ్,

    నీ ఇంటర్వూ మూడో భాగం చదువుతూ ఉంటే బాగా నవ్వొచ్చింది. కాలం గడిచే కొద్ది బాధితుల సంఖ్య పెరుగుతోంది. చచ్చిన వాళ్ళు చచ్చి బతికి పోయారు. బతికిన వాళ్ళు చస్తూ బతుకుతున్నారు.
    చాలా మంది కవులు తొందరలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు, అనవసరంగా తిట్లుతిని పరువెందుకు పొగొట్టుకోవాలని. కొత్తగా కవులయ్యే వాళ్ళు ఇంక ఆ సాహసం చేయరు. వాళ్ళకు అర్థం అయింటుంది
    కవిత్వమంటె గారెలు తినే పని కాదని. పరిస్థితి చూస్తుంటే నీవు తొందరలో కవిత్వానికి స్కూల్ కాని,
    కాలేజి కాని పెట్టే అవకాశం ఉంది. పాపం సి నా రె కు ఒక సీటు ఖాళీ గా ఉంచు. మొత్తానికి ఈ
    ఇంటర్వూ చూస్తే అతను సంతోషిస్తాడు. ఎందుకంటే శ్రీ శ్రీ నే తిట్టాడు.తొక్కలో నేనెంత అనుకుంటాడు.
    నాలుగో భాగం కూడా చదివాను. అన్ని భాగాలూ చాలా బాగున్నాయి.

    రాజు.

  9. గరికపాటి పవన్ కుమార్

    శ్రీనివాస్ గారు,

    మీ ప్రశ్నలను ఆశ్చర్యంగా పరికిస్తే కొన్ని ప్రశ్నలు తలెత్తాయి:

    1. సున్నిత హృదయులకు కోపం ఉండదా? లేక ఉండకూడదనా?
    నా మటుకు సున్నిత హృదయులకే మనసు త్వరగా గాయపడుతుంది కాబట్టి కోపమూ ఎక్కువగా వస్తుంది. ప్రదర్శించే తీరులో తేడా ఉండవచ్చు.

    2. వాక్పరుష్యం – కరాఖండీగా తెగేసి చెప్పడమే వాక్పరుష్యమా? అయితే ఆ వాక్పారుష్యం బుద్ధునికీ ఉండేదేమో.

    ఇవి నా అభిప్రాయాలే సుమా, మీ ప్రశ్నల సమాధానం భూషణ్ “లామా” కే వదులుతాను.

    గరికపాటి పవన్ కుమార్

  10. Srinivas Vuruputuri

    వాగ్భూషణమ్ భూషణమ్
    సాధారణ వస్తువుల్లో కూడా అలౌకిక సౌందర్యాన్ని చూడగలిగిన వారు ఎంతో సున్నిత హృదయులయి ఉండాలి కదా? మరి భూషణ్ గారూ, మీకెందుకింత కోపం? బుద్ధుడి బోధనలను పాళీ భాషలో కూడా చదువుకున్న బుద్ధ ప్రేమికుడిలో వాక్పారుష్యం ఒక వైరుధ్యమా లేక బలహీనతా?

    అదలా ఉంచితే…

    బావుంది ఇంటర్వ్యూ. మంచి ప్రశ్నలూ ఓపిగ్గా ఇచ్చిన జవాబులున్నూ. ఇస్మాయిల్ గారితో మీ సాహచర్యం గురించి ప్రశ్నలూ, ఎక్కువ వివరాలూ లేకపోవటం ఆశ్చర్యకరం.

  11. cbrao

    “ఆ రోజుల్లో సంజీవ దేవ్, ఇస్మాయిల్ గార్ల లేఖలు వేరే లోకం నుండి వచ్చి పడుతుండేవి.”
    -అవి లేఖలు కావు సౌగంధాలు విరజల్లే పారిజాత పుష్పాలు.

    “శ్రీశ్రీ ఈ శతాబ్దం నాది’ అనడం పదిరెట్లు అతిశయోక్తి. ఈ దశాబ్దం నాది అంటే సరిపోయేది. ”
    -ఈ శతాబ్దం శ్రీశ్రీది మాత్రమే కాకపోయినా ఈ శతాబ్దంలో తన చెరగని ముద్రవేశాడు.

    “అఫ్సర్ కవిత్వంలో అయోమయానికి అంతులేదు. గోపీ సినారేలు కుకవినిందకు కూడా కొరగారు. ”
    “వచన కవిత్వం పేరిట కవులది ఆడింది ఆటగా పాడింది పాటగా ఉంది. నానీలని ఒకడు, రెక్కలని మరొకడు పూటకొక పేరుతో కవులమని చెప్పుకొనే పగటి వేషగాళ్ళు తయారవుతున్నారు. ”

    ఈ ముఖాముఖి లో వెన్నెల కాంతులు,చెకుముకి రాళ్ల మధ్య నిప్పురవ్వలు రెండూ కనబడటం ఒక వైవిధ్యం. సినారె, గోపీ ల పై విమర్శ సహేతుకంగా లేదు.

  12. గరికపాటి పవన్ కుమార్

    వంశీ,

    భూషణ్ తన “నేటి కాలపు కవిత్వం తీరు తెన్నులు” పుస్తకంతో చాలా మంచి విమర్శను వదిలాడు తెలుగు సాహిత్య ప్రపంచం పైకి, కొన్ని మీ సందెహాలకు సమాధనం(కారనాలు మొదలైనవి)అక్కడ తప్పక దొరుకుతుందని అని నా అభిప్రాయం. కఠినమైన విమర్శ ఎందుకులే అనుకున్నా అతని మధురమైన హృదయాన్ని తన కవితలలో ఇక్కడ చూడొచ్చు.

    http://www.eemaata.com/em/category/library/nnn/

    గరికపాటి పవన్ కుమార్

  13. మాగంటి వంశీ

    ముఖాముఖిలోని కవి వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలు / పదపంక్తులు చాలా బాగున్నాయి. ఒకరిద్దరి వద్ద వీరి పేరు వినటమే కానీ పెద్దగా తెలియదు. కవిగారి కవితలేవీ ఇంతవరకూ నేను చదవలేదు – కానీ, ముఖాముఖి చాలా ఆసక్తికరంగా ఉంది. వీరి కవితలు ఎప్పటికైనా తీరిక చేసుకుని తప్పక చదవాలన్న ఆసక్తి కలిగింది.

    స్వజాతీయులైన “కవుల” గురించి కవిగారు ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు కొంతమందినైనా ఆలోచింపచేస్తే మంచిదే. కొన్నిచోట్ల పదాలు పరుషరూపం దాల్చినట్టున్నా, అనగా వ్యక్తిగత విమర్శలోకి (అదీ చాలా ఘాటుగా) దారితీసినా దానికి తగ్గ కారణం ఉన్నదేమో తెలియదు. అది సకారణమే అయ్యీ ఉండవచ్చూ, సహేతుకమూ అయ్యి ఉండవచ్చూ, కాకనూ పోవచ్చు. కవిగారిని ఎరిగినవారూ, పుస్తకం వారి చదువరులు చెప్పాలె..

    ఏదేమైనా బోల్డు “విశేషాలు” ఉన్న ముఖాముఖి…పుస్తకం వారికి అభినందనలు

Leave a Reply