ఆతుకూరి మొల్ల – మొదటిభాగం

రాసిన వారు: నిడదవోలు మాలతి

**************************
“కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ లేని కథలు చాలానే ఉన్నాయి. నిజానికి రాధికాస్వాంతనం రాసిన ముద్దుపళనిని తప్పిస్తే, పూర్వకవయిత్రులలో ఇంతటి ప్రాచుర్యం పొందిన స్త్రీలు లేరేమో.

మొల్ల రామాయణం ఒక్కటే అందరికీ తెలిసిన ఆమెరచన. ఆమె ఇంకా ఏమైనా రచనలు చేసిందో, లేదో, అవి దొరుకుతాయో లేదో తెలీదు. కానీ తెలుగుకవయిత్రులలో మొల్ల తెలుగులు కాని పండితులదృష్టిని ఆకర్షించడం విశేషం. తొలిసారిగా నేను గమనించింది -మొల్ల రామాయణంలో 2400 శ్లోకాలు రాసిందని “మానుషి” అన్న ఇంగ్లీషు పత్రికలో చూసినప్పుడు. ఇప్పుడు ఆవాక్యం తొలగించబడింది. ఆతరవాత లలిత, తారూ రాసిన “Women writing” అన్న పుస్తకంలో కూడా శ్లోకాలనే వ్యవహరించేరు మొల్ల రామాయణంలో పద్యాలని. అప్పుడే నాకు మొల్లగురించిన ఆసక్తి మొదలయింది. ఇవి చదివినప్పుడు నాకు తోచిన మొదటి ఆలోచన శ్లోకం అన్నది సంస్కృత సాంప్రదాయవిశేషం. మొల్ల సంస్కృతాన్ని వదలి, జానుతెలుగులో రాయపూనుకున్న కవయిత్రి. ఆమె రచనని శ్లోకాలు అనడం ఆమెకి ఒక పాండిత్యస్థాయిని కల్పించడంకోసమేమో అనిపించింది. ఆరుద్ర మొల్ల రామాయణంలో ఉన్నవి 871 గద్యపద్యాలు అనీ, ప్రస్తుతం లభ్యమయిన ప్రతులు సమగ్రమయినవి కాకపోవచ్చు అనీ రాశారు (సమగ్రాంధ్ర సాహిత్యం, సం.2.). నాకు దొరికిన ప్రతిలో పద్యాలూ, వచనం ఒకే వరసలో లెక్కించి, మొత్తం ఆరుకాండలలో 880 ఉన్నట్టు చూపించారు. అందులో వచనంగా గుర్తించిన భాగాలు 208. అవి కొన్ని కేవలం ఒకటి రెండు మాటలు “అట్టి సమయంబున,” “అని మఱియును” లాటివి అయితే, కొన్ని దాదాపు ఒకపేజీ నిడివి ఉన్నాయి. మరో రెండు, మూడు చోట్ల గద్య అని కూడా ఉంది. దీనికి పీఠిక రాసినవారు (పరిష్కర్త కావచ్చు) క.కో.రా. అని ఉంది కానీ ఆయనెవరో నాకు తెలీదు. కోరాడ రామకృష్టయ్యగారేమో.

మొల్లనిగురించి తెలిసింది చాలా తక్కువ అని మొదట్లో చెప్పేను. చదువుతున్నకొద్దీ, నాకు అబ్బురం అనిపించిన కొన్ని విషయాలు ముందు ప్రస్తావిస్తాను.

మొదటిది ఆమెపేరు, “కుమ్మర” మొల్లగా ప్రచారం కావడం. నేను చూసినంతవరకూ మరే ఇతర కవిని గానీ కవయిత్రిని గానీ కుల, వృత్తులపేరుమీదుగా ప్రస్తావించినట్టు కనిపించదు. ఆమె తనకు తానై ఎక్కడా తనపేరు “కుమ్మర మొల్ల” అని చెప్పుకోలేదు. మరి ఈ కుమ్మర అన్నపదం ఇంటిపేరుకి మారుగా ప్రాచుర్యంలోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు.

పూర్వకవులు తమగ్రంథాదిని కులగోత్రాలు, వంశక్రమం చెప్పుకోడం సాంప్రదాయం. మొల్ల తాను రచించిన రామాయణానికి అవతారికలో “గురులింగజంగమార్చనపరుడు, శివభక్తరతుడు, బాంధవహితుడు” అయిన కేసయసెట్టి తనయనని చెప్పుకుంది. తండ్రినిగురించి రాస్తున్నప్పుడు కూడా కులప్రసక్తి కానీ వృత్తి ప్రసక్తి కానీ లేదు. అంచేత, ఈ కుమ్మర నామవిశేషణం ఆమెపేరుకి ముందు తగిలించడం, పరిష్కర్తలూ, ప్రచురణకర్తలూ చేసిన నిర్ణయంగానే కనిపిస్తోంది తప్ప మొల్ల అభిమతంగా తోచదు.

రెండవ అంశం “మొల్ల” అన్న పేరు ఆధారంగా పండితులు ఆమెవృత్తి లేక కులం నిర్ణయించ పూనుకోడం. ఈవిషయం ఆండ్ర శేషగిరిరావుగారు “ఆంధ్రవిదుషీమణులు” అన్న గ్రంథంలో విపులంగా చర్చించేరు. స్థూలంగా – మొల్ల మల్లియజాతికి చెందినపువ్వు. పూర్వకాలంలో పువ్వులపేర్లు వేశ్యలు మాత్రమే పెట్టుకునేవారుట. అంచేత ఆమె వేశ్య కావచ్చునని ఒక వాదన. ఈవాదనకి ప్రతిగా కనుపర్తి వరలక్ష్మమ్మగారు మొల్ల తన రామాయణంలో వేశ్యలగురించి ప్రస్తావించినతీరు చూస్తే, ఆమె వేశ్య కాదని స్పష్టంగా తెలుస్తుంటారు. శేషగిరిరావుగారు కూడా ఆమె కులటాంగన కాదనే నిర్ధారించేరు.

మొల్ల కాలనిర్ణయం చేసినప్పుడు కూడా ఆమె రామాయణంలోని అవతారికే ఆధారమయింది. అందులో ఆమె గౌరవపురస్సరంగా పేర్కొన్న పూర్వకవులు ఆధారంగా ఆమె పదహారవ శతాబ్దం కృష్టదేవరాయలకాలంలో జీవించి ఉండవచ్చునని నిర్ణయించేరు. ఇక్కడ నాకు కలిగిన సందేహం – మొల్ల తన రామాయణంలో పేర్కొన్నకవులు గుర్తుగా వారి జీవితకాలం ఆధారంగా ఆమె కాలనిర్ణయం చేసేరు కానీ ఆమెతరవాత కవులు ఎవరైనా ఆమెని పేర్కొన్నారో లేదో వివరించలేదు. నేను సాహిత్యమంతా తరిచి చూడలేదు కానీ పైన పేర్కొన్న పండితులు పేరెన్నిక గన్నవారే. వారి వ్యాసాలలో ఈ ప్రస్తావన లేదు. శేషగిరిరావుగారు ఏదో ఒక ఉదాహరణ చెప్పేరు కానీ మళ్లీ అది మొల్లగురించి కాదేమోనన్న సందేహం కూడా వెలిబుచ్చారు. మరి మొల్లని ఆమెకాలంలోనూ, ఆ తరవాతా ఎవరైనా ఆమెను రామాయణకర్త్రిగా గుర్తించి ప్రశంసించేరా లేదా, ఈ విషయంలో పరిశోధన ఏమైనా జరిగిందా లేదా అన్నది తెలిసినవారెవరైనా చెప్పాలి.

విద్య మాటకొస్తే, తాను అట్టే చదువుకోలేదని ఆమె వినయంగా చెప్పుకున్నా, ఆమెరచనలో చమత్కారాలూ, పాండిత్యప్రకర్షా, పూర్వకవుల గ్రంథాల్లో భాషగురించి ఆమె చేసిన వ్యాఖ్యానాలు చూస్తే, ఆమె విస్తృతంగా కావ్యాలూ, ప్రబంధాలూ చదువుకున్నట్టే కనిపిస్తుంది. ఉదాహరణకి, అవతారికలో ఈ పద్యం చూడండి.

దేశీయపదములు దెనుగు సాంస్కృతుల్
సంధులు ప్రాజ్ఞుల శబ్దవితతి
శయ్యలు రీతులుఁ జాటు ప్రపంధము
లాయా సమాసంబులర్థములును
భావార్థములుఁ గావ్యపరిపాకములు రస
భావచమత్కృతుల్ పలుకుసరవి
బహువర్ణములును విభక్తులు ధాతు లం
లంకృతి చ్ఛంధోవిలక్షణములుఁ
గావ్యసంపదక్రియలు నిఘంటువులును
గ్రమములేవియు నెఱుఁగ విఖ్యాత
గోపవరపు శ్రీకంఠమల్లేశు వరముచేత
నెఱి కవిత్వంబు జెప్పఁగా నేర్చికొంటి.

పైపద్యంలో వ్యాకరణ ఛందోరీతులు, దేశీయాలూ, సంధులు, శయ్యలు, సమాసములు, విభక్తులూ, భావ చమత్కృతులూ, వాటి క్రమం తెలియదంటూనే అంత చిట్టాఆవర్జాలు వల్లించడం ఏమీ తెలీనివారికి సాధ్యం కాదు కదా. అంతే కాదు, తాను సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణానికి తెలుగుసేత చేస్తూ, మళ్లీ అందులో సంస్కృత సమాసాలు వాడడం సముచితం కాదంటుంది.

తాను అలా “కావ్యసంపదక్రియల” జోలికి పోనని చెప్పి, పదం చూడగానే పాఠకుడికి అర్థం తోచని భాషలో రాస్తే అది మూగ, చెవిటివారు ముచ్చటలాడినట్టే ఉంటుందంటూ హాస్యమాడుతుంది..

తేనె సోఁక నోరు తీయన యగురీతి
తోడ నర్థమెల్లఁ దోఁచకుండ
గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము
మూఁగచెవిటివారి ముచ్చట యగును.

నాలుకకి తేనె తగలగానే నోరు తీయన అయినట్టే పదానికి అర్థం చదువుతుండగానే పాఠకుడికి స్ఫురించాలి అని ఆమె అభిమతం!

తెలుగుదనం ఉట్టిపడే పదకేళి “రాముడు గీముడుంచు”, “విల్లా ఇది కొండా”, “సందుగొందులు దూరిరి” లాటివి ఉన్నాయి. సాయంశోభని వివరిస్తూ చెప్పినపద్యాలలో మచ్చుకి ఒకటి –


మేలిమి సంధ్యారాగము
వ్రాలిన చీకటియు గఁలిసి వరుణునివంకన్
నీలముఁ గెంపును నతికిన
పోలికఁ జూపట్టే నట నభోమణి తలగన్.

సాయంకాలపు నీరెండ, కమ్ముతున్న చీకటులతో కలిసి నీలాలూ, కెంపులూ అతికినట్టున్నాయిట ఆకాశంలో.

పాఠకులమనసుని అలరించే చమత్కారాలూ (కందువలు) సామెతలూ కూర్చి అందంగా చెప్తే వీనులవిందుగా ఉంటుంది అంటుంది మొల్ల.

కందువమాటలు సామెత
లందముగాఁ గూర్చి చెప్ప నది తెలుఁగునకుం
బొందై రుచియై వీనుల
విందై మరి కానుపించు విబుధులమదికిన్.

ఆండ్ర శేషగిరిరావు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మవంటి అనేక ప్రముఖులు మొల్ల తన రామాయణాన్ని జానుతెనుగులో, సులభశైలిలో సకలజనులకూ అర్థమయేరీతిలో రాసింది అని మెచ్చుకున్నారు. మొల్ల కూడా అలాగే తన రామాయణం “మూగ చెవిటి ముచ్చట” కాకుండా ఉండేలా రాయదల్చుకున్నట్టు చెప్పుకుంది. ఆమెరచనలో చవులుఁ బుట్టు జాతీయాలు కోకొల్లలుగానే ఉన్నా, సంస్కృత సమాసాలు, ముఖ్యంగా యుద్ధవర్ణనలో, నాయకీ, నాయకుల వర్ణనలలో క్లిష్ట భూయిష్టమయిన సంస్కృతసమాసాలు చాలానే కనిపించేయి. నేను చాలాచోట్ల తడుముకోవలసివచ్చింది అర్థంకోసం. “జాను తెనుగు,” “వాడుకభాష” లాటి పదాలకి ఆనాడు ఉన్న అర్థాలు ఈనాడు అన్వయించుకోలేం అనుకోవాలి.

మూలరామాయణంలో లేని కొన్ని సన్నివేశాలు మొల్ల స్వతంత్రించి ఇతర రామాయణాలనుండి స్వీకరించడం జరిగింది. అయోధ్యకాండలో రాముడు స్వర్ణనది దాటేముందు గుహుడు ఆయనపాదాలు కడగడం వాటిలో ఒకటి.
సుడిగొని రాముపాదములు సోఁకి ధూళివహించి ఱాయెయే
యేర్పడ నొక కాంతనయ్యెనఁట పన్నుగనీతని పాదరేణువి
య్యడవడి నోడసోఁకనిదియేమగునో యని సంశయాత్ముఁడై
కడిగెగుహుండు రాముపదకంజయుగంబు భయమ్ముపెంపునన్.

ఈ సన్నివేశం వాల్మీకిరామాయణంలో లేదు కానీ అధ్యాత్మరామాయణంలో ఉందని ఆరుద్ర అంటున్నారు. అలాగే మరో సన్నివేశం – పరశురాముడు రాముడిని ఎదుర్కొని కయ్యానికి కాలు దువ్వడం కూడా వ్యాస రామాయణంలో లేదనీ, భాస్కరరామాయణంనుండి తీసుకున్నదనీ అంటున్నారాయన. వీటివల్ల మొల్ల విస్తృతంగా తెలుగు, సంస్కృతగ్రంథాలు చదివిందనే అనుకోవాలి. ఈ గుహుడికథ చిన్నప్పడు నాలుగోక్లాసు, ఐదోక్లాసు వాచకాల్లో ఉండేది. ఈ కథ అంత ప్రాచుర్యం పొందడానికి మొల్ల రామాయణమే కారణం కావచ్చు.

(ఇంకా ఉంది.)

You Might Also Like

10 Comments

  1. ఆతుకూరి మొల్ల – రెండోభాగం | పుస్తకం

    […] రాసిన వారు: నిడదవోలు మాలతి ****************** మొదటి భాగం ఇక్కడ. […]

  2. Women Writing in India (Volume-1) – 1 « sowmyawrites ….

    […] గారు వివరంగా రాసిన రెండు వ్యాసాలు ఇక్కడ మరియు […]

  3. chudamani

    thanks for ur essay,
    molla is basically a devotee of Srirama.when education is bannaed for girls she wrote a great prabahndam,because of her geat madurabhakti on srirama her heart melted and poems came from her mouth like a flood.that is her greatness. more over she adopted simple language palatable for commanman.she dint go for wealth to rulers like pothana.so called sistaaachara parayanas also sing the poems of moll.it went into nthe hearts of telugu peoplefrom her period to till the date. we have to price her courage an ability. thanks alot chudamani

  4. మాలతి

    @ రాఘవ,
    విపులంగా చర్చించిన అంశాలు అన్నిటికి నేను జవాబు చెప్పలేను కానీ, కుమ్మర, కుమ్మరి ఒకటే అనుకుంటున్నాను. ఎందుకంటే, మొల్లవిషయంలో రెండురకాలుగానూ వాడుతున్నారు.
    3. మామూలుగా అన్ని పేర్లూ తెలీవనుకున్నానండీ. స్థూలంగా పాణిని వ్యాకరణం రాసేడనడం వేరూ, ఆవ్యాకరణసూత్రూలూ, పేర్లూ వరసపెట్టి చెప్పడం వేరూ కదా. పైగా దివాకర్ల వెంకటావధానిగారు తెలుగు సాహిత్యచరిత్రలో రాశారు కూడా ఆమె పాండిత్యంగురించి. అంచేత అన్నాను ఆమాట.
    5. ఏమో మరి. ఏకామ్రనాథుడు ఆమెనిగురించి రాసేడని కొడవళ్ళ హనుమంతరావుగారు నావ్యాసం రెండోభాగంలో వ్యాఖ్యానించేరు. అయితే ఆ కథ కూడా నిజమవునో, కాదో నిశ్చయంగా తెలీదు.
    ధన్యవాదాలతో.
    మాలతి

  5. రాఘవ

    ౧. కుమ్మర కుమ్మరి రెండూ ఒకటేనా అని నా అనుమానం. కుమ్మర అన్నది కుల/వృత్తినామమని ఎలా నిర్ధారించగలం, అది ఇంటిపేరే అయ్యుండవచ్చునేమో కూడా కదండీ?

    ౨. “మొల్ల” అన్న పేరు ఆధారంగా పండితులు ఆమెవృత్తి లేక కులం నిర్ణయించ పూనుకోడం… నిజమండీ, ఇదే మనం హీనచరిత్రకారులవలన అనుభవిస్తున్న దౌర్భాగ్యం!

    ౩. పద్యంలో వ్యాకరణ ఛందోరీతులు, దేశీయాలూ, సంధులు, శయ్యలు, సమాసములు, విభక్తులూ, భావ చమత్కృతులూ, వాటి క్రమం తెలియదంటూనే అంత చిట్టాఆవర్జాలు వల్లించడం ఏమీ తెలీనివారికి సాధ్యం కాదు కదా? పాణిని వ్యాకరణం వ్రాసారనీ, బాదరాయణుడు వేదాన్తసూత్రాలు చెప్పారనీ ఇత్యాదిగా వాటి ఉనికి తెలియటం వేఱు, వాటిలో అసలు విషయం తెలియటం వేఱు కదండీ!

    ౪. వాల్మీకిరామాయణంలో రాముడు అచ్చంగా మాయామానుషవిగ్రహుడైతే అధ్యాత్మరామాయణంలో రాముడు కించిత్ లీలామానుషవిగ్రహుడు (అన్నీ తెలుసు కానీ నటిస్తాడు). ఈ మౌలికమైన భేదం వలననే కథ కూడా కొంచెం మారుతుంది.

    ౫. మొల్ల కచ్చితంగా గొప్ప రచయిత్రే. ఐతే ఎవఱూ ఆమె పేరును తమ కృతులలో ప్రత్యేకంగా పేర్కొన్నట్టుగా కనబడదు. తరువాతి కవయిత్రులైమైనా ఆమెను పేర్కొన్నారో లేదో నాకు ఇదమిత్థంగా తెలియదు. తరువాతి కవులు మొల్ల పేరును ఉపేక్షించటానికి కారణం బహుశా తాము కావ్యాదిలో ఉటంకించి నమస్కరించేవారి చిట్టా చేంతాడులా పెరగకుండా అనుకుంటానండీ.

  6. మాలతి

    @ సౌమ్య, త్వరలోనే మొల్లరామాయణం చదివి నీ స్పందన కూడా రాస్తావని ఎదురు చూస్తున్నాను.
    @ మందాకిని, సంతోషమండీ. మీరు అధ్యాత్మరామాయణంగురించి వివరించగలరని ఆశిస్తున్నాను.
    @ కల్పన, అవును చాలా కథలే ఉన్నాయి కానీ, నేను ఆవిడ రాసిన గ్రంథంమీద దృష్టి పెట్టాలనుకున్నాను. ధన్యవాదాలు.
    @ ప్రతాప్, అవునండీ. నేను కూడా అందుకే ఆ కథలజోలికి పోలేదు. మీకు వ్యాసం నచ్చినందుకు సంతోషం.

  7. Pratap

    మాలతి గారికి నమస్కారం!
    రామాయణ కర్త్రి ఆతుకూరి మొల్ల గూర్చి మీరు వ్రాసిన వ్యాసం చాలా బాగుంది. మొల్ల గూర్చి నిజాల కన్నా కల్పిత కధలే మనకు ప్రచారంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాలన్ని పక్కన పెడితే మొల్ల వంటి కవయిత్రి అంధ్ర జాతి లభించడం మన అద్రుష్టం.

  8. kalpana

    మాలతి గారు, మంచి వ్యాసం మొదలుపెట్టారు. రెండో భాగం కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నాను. మొల్ల గురించి వాస్తవాలో, కల్పిత కథలో కానీ కొన్ని ప్రచారం లోవున్నాయి. బహుశా వాటి గురించి మీరు తర్వాత వ్యాసం లో ప్రస్తావిస్తారేమో.
    కల్పన

  9. మందాకిని

    మంచి విషయం ఎన్నుకున్నారు. పద్యాలు తేనెలొలుకు తెలుగు అందాల్ని తేటతెల్లం చేస్తున్నాయి. మొల్ల పేరు గురించి చిన్నప్పుడు అయోమయంగానే ఉండింది. చెన్నయ్ లో దొరికే ఒకరకం జాజుల్ని ముల్లె అంటారు. దాంతో ఇది పువ్వు పేరు అని పోల్చుకోగలిగాను.
    ఆధ్యాత్మ రామాయణం కొన్నాను. ఇంకా మొదలు పెట్టలేదు.

  10. సౌమ్య

    మీరు ఇక్కడ ఉదహరించిన పద్యాలు చాలా బాగున్నాయి. నెను నాకు అర్థమౌతుందో లేదో తెలీదు కానీ, మీరు మొల్ల గురించి చెబుతూంటె విని ఆ మధ్య మొల్ల రామాయణం కొన్నాను. త్వరలో చదవాలి అని ఈ వ్యాసం మళ్ళీ గుర్తు చేసింది.

    Keep writing such articles to enlighten us! 🙂

Leave a Reply