ది సీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ – డెన్నిస్ రిచీ
వ్యాసం రాసిపంపినవారు: రవిచంద్ర
ప్రోగ్రామింగ్ తెలిసిన వారిలో సీ (C) లాంగ్వేజ్ తెలియని వాళ్ళుండరనడం అతిశయోక్తి కాదేమో. ప్రోగ్రామింగ్ ను చాలా మందికి చేరువ చేసింది ఈ భాషే. ఈ భాషను అభివృద్ధి చేసింది ఏటీ అండ్ టీ బెల్ ల్యాబరేటరీస్ కు చెందిన డెన్నిస్ రిచీ మరియు కెన్ థాంప్సన్ అనే పరిశోధకులు. వీరు యూనిక్స్ అభివృద్ధిలో తమకు ఒక భాష అవసరమని భావించి ఒక భాషను సృష్టించడానికి పూనుకున్నారు. అదే “సీ” భాష. వారు తాము రూపకల్పన చేసిన భాష గురించి రాసిందే ఈ పుస్తకం.
ప్రామాణిక పుస్తకాలు ఆకారంలో ఘనంగా ఉంటాయి అని ఎవరైనా అనుకుంటే ఈ పుస్తకం చూసి తమ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. అంత చిన్నగా ఉంటుందీ పుస్తకం. సీ అనేది చాలా చిన్న భాష. దానిని వివరించడానికి పెద్ద పెద్ద పుస్తకాలు అవసరం లేదని వారి భావం. మొదటి అధ్యాయంలో ఒక చిన్న ప్రోగ్రాము రాస్తూ అందులో తెర మీద “Hello world!” అని డిస్‌ప్లే చేసే ప్రోగ్రాం రాస్తారు. ప్రస్తుతం వచ్చే అన్ని ప్రోగ్రామింగ్ భాషల పుస్తకాలన్నీ ఇదే ప్రోగ్రామ్ తో అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాయి. దీన్ని బట్టి ఈ పుస్తకం సాంకేతిక రచయితలను ఎలా ప్రభావితం చేసిందో చెప్పవచ్చు.
ఈ పుస్తకంలో భాష యొక్క సింటాక్స్ (వ్యాకరణం), వివిధ విభాగాలు ఎలా పని చేస్తాయనేదే కాక వాటిని నిజజీవిత ఉదాహరణలతో వివరిస్తారు. చాలావరకు ప్రోగ్రామింగ్ పుస్తకాల్లో భాష లక్షణాలను వివరించడానికి వాస్తవ ప్రోగ్రామింగ్ తో సంబంధం లేని చిన్న చిన్న ఉదాహరణలతో సరిపెట్టేస్తుంటారు కానీ ఈ పుస్తకంలో మాత్రం సీ లైబ్రరీల కోసం వారు అభివృద్ధి చేసిన చిన్న చిన్న ప్రోగ్రాములను ఉదహరిస్తారు. ఇలా చేయడం వల్ల చదువరికి అసలు ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ ప్రోగ్రాములను యూనిక్స్ లేదా లీనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏదో పై పైనే చదువుకుంటూ పోయే పుస్తకం కాదిది. తీరిగ్గా చదివి జీర్ణించుకోవాల్సిన పుస్తకం. మూలగ్రంథంగా వాడదగినది.
అయిదో అధ్యాయంలో సీ ప్రోగ్రామింగ్ లో అత్యంత కీలకమైన పాయింటర్లు, అరేస్ (arrays) గురించి కూలంకషంగా, సోదాహరణంగా వివరిస్తారు. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలు యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టం రాసేటపుడు వాళ్ళు రాసిన చిన్న చిన్న ప్రోగ్రాములు. కాబట్టి సిస్టం ప్రోగ్రామింగ్ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. చాలా సాంకేతిక ఇంటర్వ్యూల్లో సీ భాషలో అభ్యర్థి సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఈ పుస్తకంలోని ప్రశ్నలే అడుగుతుంటారు. కాబట్టి సీ లోతైన పరిజ్ఞానం పొందదలిచిన వారు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. పుస్తకంలో సాధన కోసం ఇచ్చిన ప్రోగ్రాముల జవాబుల కోసం ది సీ ఆన్సర్ బుక్ అనే పుస్తకం కూడా ఉంది. ఈ రెండు పుస్తకాలను చదివితే వేరే పుస్తకాలను చదవనక్కర్లేదు.
ప్రోగ్రామింగ్ చేసేటపుడు ఇష్టం వచ్చినట్లు కోడింగ్ చేయకుండా కొన్ని ప్రమాణాలననుసరించడం వల్ల చాలా లాభాలున్నాయి. వీరు రాసే ప్రోగ్రాముల్లో అలాంటి ప్రమాణాలు అంతర్లీనంగా ఇమిడిపోయి ఉంటాయి. ప్రతి అధ్యాయం వెనుక ఇచ్చిన ప్రశ్నలను స్వంతంగా సాధన చేస్తే ప్రోగ్రామింగ్ పై మంచి పట్టు సాధించవచ్చు. అయితే అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏమిటో ప్రాథమిక అవగాహన లేకుండా ఈ పుస్తకం చదవాలంటే మాత్రం కష్టమే. కాబట్టి ముందుగా సీ గురించి కొంచెం సరళంగా వివరించే పుస్తకాలను చదివి మరింత లోతైన, పరిపూర్ణత కోసం ఈ పుస్తకం చదవడం మంచిది.
రావు పంగనామముల
మర్యాద వహించండి బదులు మర్యాదను పాటించండి లేదా గౌరవించండి అంటే బాగుంటుందేమో పరిశీలించండి. నెనరులు!
Lalitha
I too have learnt a lot from this book.
సౌమ్య
Good to see technical books being written about.
I will also try to write on a couple of books if possible…
(Typing from a non-personal computer which can’t write Telugu)
వీరుభొట్ల వెంకట గణేష్
5 Years back, for a technical quiz organized at JNTU campus, the University Rector came as chief guest. Below are his words on this book:
“Every time I read Dennis Ritchie, I’ll come across a new point”.
సాంకేతిక పుస్తకాల సమీక్షలు… తెలుగులో « అంతర్వాహిని
[…] సమీక్షలకు చోటివ్వడం ముదావహం. అందులో మొదటి వ్యాసం నాది కావడం అదృష్టంగా […]