నవపారిజాతాలు

“షట్కర్మయుక్తా కులధర్మ పత్నీ” అన్నారు మన ప్రాచీనులు. మరి ఈ మాటను ఎంతమంది పాటించారో, పాటిస్తున్నారో తెలీదు. నేటి మహిళ ఇల్లాలుగా, కోడలిగా, అమ్మగా, అత్తగా ఇంట్లో ఉండి ఎన్నో పాత్రలు విజయవంతంగా పోషిస్తుంది. తనవారిని ఆదరిస్తుంది. ప్రేమిస్తుంది. అదే విధంగా కుటుంబ నిర్వహణలో నేనున్నానంటూ భర్తకు తోడుగా పని చేయడానికి గడపదాటి బయట కూడా ఎన్నో బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఉంది. ఇలా ఎన్నో రకాల శక్తిసామర్ధ్యాలు కలిగిన స్త్రీలు ఈనాడే కాదు ప్రాచీన కాలంలో కూడా ఉన్నారు. ప్రాచీన సాహిత్యంలో ప్రస్తావించబడిన కొందరు విశిష్ట మహిళలను, స్త్రీత్వాన్ని నింపుకున్న గోవు, హంసలను కూడా కలుపుకుని నవపారిజాతాలుగా మనకు అందించారు డా. రాఘవమ్మ, డా.సీతాలక్ష్మి, డా.విజయలక్ష్మి.. ముప్పై ఏళ్లకు పైగా తెలుగు అధ్యాపక వృత్తి నిర్వహించి ప్రస్తుతం విశ్రాంత జీవితం సాగిస్తూ కూడా సాహిత్యసేవ చేస్తున్న వీరి కృషి ప్రశంసనీయం. ఈ రచన కోసం వీరు ఎంచుకున్న కావ్యాలు భోజరాజీయం, వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం, ఆంధ్రభారతం, విరాటపర్వం, గోపీనాధ రామాయణం మొదలైనవి.

ఈ పుస్తకంలోని తొమ్మిది కథలలో ఒక్కో రచయిత్రి ప్రాచీన తెలుగు సాహిత్యం నుండి మూడేసి పారిజాతాలను మనకు అందించారు. ఆ పారిజాతాల చిరు పరిచయం..

డా. వి.వి.రాఘవమ్మ.. రాసిన వ్యాసాలు..

1. ఆదర్శ సతి సీత ..

తెలుగు సాహిత్యాన్ని తేనెలూరు తీయని మాటలతో గద్యపద్యాలతో అందమైన కవ్యంగా మలచిన మొల్ల రామాయణాన్ని వాల్మీకి రామయణంతో అనుసంధించి సీతమ్మ చరిత్రను పరిశీలించారు రచయిత్రి. మానవ జీవన విధానంలో అవాంతరాలు సహజమే. అందునా కుటుంబం, సమాజంలోని వ్యక్తుల వల్లకూడా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని ఎలా అధిగమించాలో, ఆచరించాలో తమ అనుభవంతో చాటి చెప్పినవారు సీతారాములు. శ్రీరామచరిత్రలో నాయికయేగాక , రాముడికి మార్గనిర్దేశం చేసి కర్తవ్యోన్ముఖున్ని చేసిన దివ్య పాత్ర సీతది. సకల సద్గుణ రాశి, అయోనిజ ఐన సీత రామునిచే ఆరాధింపబడింది. తాను తరించి అతనిని తరింపచేసింది. శారీరక స్థితిని బట్టి స్త్రీలు అబలలు అంటారు కాని అవసరమైన వేళలో నైతిక, మానసిక బలప్రదర్శనలు చేయగల సబలలు అని ఎందరో నిరూపించారు. సీత కూడా ఆ కోవకు చెందిన ధీరవనిత.

2.మహారాజ్ఞి మండోదరి

రామాయణంలో ఒక ముఖ్యపాత్ర రావణాసురుడి ధర్మపత్ని మండోదరి. గోపీనాధ రామాయణంలో శ్రీరాముడి ఔన్నత్యాన్ని, ధర్మస్వరూపాన్ని చాలా పాత్రల నోట వినిపించాడు కవి.. మండోదరి ఉత్తమ ఇల్లాలైనా ధూర్తుడైన భర్త వల్ల ఆవేదన పాలైంది. ఆమె వ్యక్తిత్వం మిక్కిలి ప్రశంసనీయమైంది. దానవకులానికి చెందిన స్త్రీ ఐనా మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. సీతవలె అయోనిజ ఐన మండోదరి పంచకన్యలలో చేర్చబడింది. ఎంత గొప్పవాడైనా నీతిహీనుడైన భర్త లభించిన కాంతలకు మిగిలేది చింతలే తప్ప సుఖం లేదన్నదానికి మండోదరి జీవితం ఒక సాక్ష్యం. నేటికీ ఎందరో స్త్రీలు ఇదే విధంగా బాధలు అనుభవిస్తూ బ్రతకలేక, చావలేక కుమిలిపోతున్నారు. “సీత నీ పాలిట కాళరాత్రి ఆమెను అపహరించి చాలా పెద్ద తప్పు చేసావు. వంశనాశనము నివారించాలంటే ఆమెను శ్రీరాముడికి అప్పగించ” మని భర్తను హెచ్చరించిన విజ్ఞానమూర్తి. గోపీనాధ రామాయణంలో మండోదరిని కవి విద్యా సంపద, సంస్కృతీ సంప్రదాయాలు, వినయాహంకారాలు అన్నింటినీ పరిపుష్టిగా సృష్టించి ఆమెనొక మహోన్నత మహిళగా సృజించాడు వేంకటకవి.

3. స్వయంప్రభ

రామాయణంలో ప్రధాన కథాగమనానికి ఎన్నో పాత్రలు తమ సహాయ సహకారాలు అందించాయి.. సుగ్రీవుడు, హనుమంతుడు, జటాయువు , శబరి . విభీషణుడు. శబరి కాక మనకు తెలీని మరో స్త్రీ కూడ రామకధకు తన వంతు సాయంచేసింది. ఆమే స్వయంప్రభ. సీతాన్వేషణకు బయలుదేరిన వానరులకు మార్గమధ్యంలో అలసిన వేళ వారి ఆకలి తీర్చి, శ్రమను పోగొట్టి మార్గాన్ని సూచిస్తుంది. తపోనిష్టతో, దివ్య తేజస్సుతో విరాజిల్లే స్వయంప్రభ హనుమకు తన జన్మవృత్తాంతాన్ని, ఋక్షబిలాన్ని, విశేషాలను వివరిస్తుంది. సీతాన్వేషణనకు బయలుదేరిన వానరులకు అగమ్యగోచరంగా ఉన్న వారి మార్గంలోని అవరోధాల్ని తొలగిస్తూ ఎలా సాగిపోవాలో వివరించి సీతాన్వేషణకు వనగమనాన్ని సుగమం చేసి తన దారిన తాను పోతుంది.

డా. సీతాలక్ష్మి

1. సైరంధ్రి.

కారణజన్మురాలై, స్వయంవరమున అర్జునుడు తనను వరించినా కుంతీ దేవి ఆదేశం మేరకు పంచపాండవులకు ఇల్లాలై వారితో పాటు కష్ట సుఖాలు పంచుకుంది ధ్రౌపది. ఉపాఖ్యానాలు లేని చక్కని , చిక్కని కథ కలిగిన ఐదాశ్వాసాల పర్వం విరాట పర్వం. మాయాద్యూతమున ఓడిన పాండవులు తమ ధర్మపత్నితో సహా మారువేషాలలో గడిపే సమయంలో ద్రౌపది ఎంచుకున్న సైరంధ్రివృత్తి కేవలం పరిచారికగా కాక మహారాణిని అలంకరించి, ఉల్లాసం కలిగించే గౌరవప్రదమైన వృత్తి. అపూర్వమైన ఆమె సౌందర్యానికి మోహితుడైన కీచకుడు నిండు సంభలో అవమానించినా నిగ్రహించుకుంటుంది. ఒకానొక సమయంలో ధర్మజుని నిందించినా తర్వాత ఆతని అసహాయతని అర్ధం చేసుకుంటుంది. తన పరాభాగ్నితో భీముని కీచకవధకు కర్తవ్యోన్ముఖున్ని చేసి దుష్టశిక్షణలో అతనికి తోడ్పడుతుంది. పంచమహాపతివ్రతల్లో ఒకతైన ద్రౌపది తక్కినవారికన్నా భిన్నమైన జీవితం గడిపింది. ప్రతి మహిళ సమస్యలను సమయస్ఫూర్థితో, సమయానుకూలంగా , సరియైన రీతిలో ధైర్యంగా ఎదిరించే పోరాడే మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని సైరంధ్రిగా ద్రౌపది హెచ్చరిస్తుంది.

2. సత్యగోవు

ధర్మానికి ప్రతినిధి ఐన గోవు హిందువులకు ఎంతో పవిత్రమైనది, పూజనీయమైనది. అనంతామాత్యుడు భోజరాజీయంలో గోవును అఖండ సత్యవ్రతగా చిత్రించాడు. ఇందులో సత్వగుణంగల గోవు, వ్యాఘ్ర సంవాదమును అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఒకనాడు కపిల అనే గోవు దారితప్పి మందనుండి విడివడి ఒక పులి చేత చిక్కుతుంది. తాను ఎలాగూ ఆ వ్యాఘ్రానికి ఆహారం కాబోతున్నందున ఒక్కసారి తన బిడ్డను చూసి, సఖులు, బంధువులందరికీ చెప్పి మరల వత్తునని ప్రమాణం చేసి ఆడిన మాట తప్పనని శపథం చేస్తుంది. చావు నుండి తప్పించుకుని వెళ్లి మళ్లీ వచ్చి తనకు ఆహారమవుతానన్న గోవు మాటలకు ఆ పులి ఆశ్చర్యపడినా నమ్మకముతో వెళ్లిరమ్మంటుంది. కపిల తన బిడ్డ వద్దకు వెళ్లి ఆకలి తీర్చి, తను లేనప్పుడు ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మెలగాలో అన్ని జాగ్రత్తలు చెప్తుంది. సఖులు, బంధువులు వెళ్లవద్దని వారించినా తిరిగి వ్యాఘ్రం వద్దకు వెళ్తుంది. భోజరాజీయములో అనంతామాత్యుడు తీర్చిదిద్దిన గోవు సత్యవాక్పరిపాలనకు, ఆదర్శ మాతృత్వానికి నిదర్శనము. భయంకరమైన వ్యాఘ్రము కూడా కపిల సత్యవాక్య మహిమచే పరమసాధువుగా మారి ఆ గోవుతో ధర్మసూత్రాలు చెప్పించుకుంటుంది.

3. పుష్పగంధి

భోజరాజీయంలోని ఉపాఖ్యానాలలో ఎన్నెన్నో ఉపకథలతో పెనవేసుకున్న అద్భుతమైన కథ పుష్పగంధి. యమునితో పొరాడి భర్త ప్రాణాలను తిరిగి దక్కించుకున్న సావిత్రితో పోల్చదగిన శీలవతి పుష్పగంధి. అపురూప సౌందర్యవతి, ప్రజ్ఞాపాటవాలు గల మనోహరమూర్తి, విద్యావతి. కాని ఆమెని వివాహమాడినవాడు వివాహమైన తొమ్మిది దినాలకే బ్రహ్మరాక్షసుని పాలపడతాడు అన్న జాతకదోషం ఉన్న దురదృష్టవంతురాలు. పుష్పగంధికి వివాహమైన తర్వాత ఒకరోజు ఏకాంతంగా ఉన్నవేళ బ్రహ్మరాక్షసుడికి చిక్కిన అమె భర్త రత్నమండనుడు అతి కష్టం మీద తన వారిని చూసి వస్తానని రాక్షసుడి దగ్గర అనుమతి పొంది పుష్పగంధి దగ్గరకు వస్తాడు. ఇది తెలుసుకున్న పుష్పగంధి అధైర్యపడక అతను రాక్షసుడికి చేసిన శపధం గురించి తెలుసుకుని అతడిని తిరిగి పంపివేస్తుంది. ఎంతమంది నిందించినా వెరవక భర్త ప్రాణరక్షణార్ధం అతడికి తెలియకుండా వెంబడించిన ధైర్యశాలి. తన భర్త చేత ఏ శపధం చేయించుకుని బ్రహ్మరాక్షసుడు అతనిని తన వద్దకు పంపాడో అదే రీతిలో రాక్షసుని గెలిచి తన పతి ప్రాణములు దక్కించుకుంటుంది. ఇక్కడ సమయానికి తగిన విధంగా పుష్పగంధి చూపిన చొరవ, ధీశక్తి, ధైర్యసాహసములు సామాన్య స్త్రీలకే కాదు రాచవనితలకు కూడా మార్గదర్శకము. ఆపదలు కలిగినప్పుడు బెదరక, దానిని ఎదుర్కొని అధిగమించుట ముఖ్యము అని పుష్పగంధి నిరూపించింది.

డా. విజయలక్ష్మి

1. కుంతీ మాతృత్వం

మహభారతంలో కుంతీ మాతృత్వం అత్యంత ప్రధానమైనది. దూర్వాస మహాముని వరప్రభావమున పెళ్లికాకముందే సూర్యుని వలన సహజ కవచకుండలాలతో ఉన్న పుత్రుని కంటుంది. కాని కన్యగా ఆ బిడ్డను పెంచి, ఆనందించలేక ఆమె పడే మానసిక ఆందోళనను ఆదిపర్వమున నన్నయ, అరణ్యపర్వమున ఎఱ్ఱన అత్యంత మనోజ్ఞంగా వర్ణించారు. లోకనిందకు భయపడి పుట్టిన బిడ్డను నదిలో వదిలేస్తుంది కుంతి. అస్త్రవిద్యాప్రదర్శనలో కర్ణుని చూసి గుర్తించినా తన పుత్రుడని చెప్పలేక తల్లడిల్లిపోతుంది. చివరికి తన పెద్దకుమారుడే శత్రువులా తన తమ్ముళ్లతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు కూడా ఆతడు తన కుమారుడని చెప్పలేకపోతుంది. కర్ణుని గురించిన హృదయవేదన కుంతీదేవిని జీవితాంతం వెంటాడుతుంది. సవతి పుత్రులైన నకులసహదేవులను కూడా తన పిల్లలతో సమానంగా పెంచింది. ప్రేమించింది. పంచపాండవులను ఎప్పుడూ కలిసి ఉండమని, ఏదైనా సరే సమానంగా పంచుకోమని చెప్తుంది. రాచబిడ్డలైన తన పుత్రులు అడవులపాలై అష్టకష్టాలు పడడం చూసి ఆ మాతృమూర్తి ఆవేదన వర్ణనాతీతమైనది. ఆ మాతృమూర్తి దుస్థితి , ఆవేదన మన కళ్లకు కట్టినట్టు కవిబ్రహ్మ చిత్రించాడు.

2. రుక్మిణి

పోతన విరచితమైన మహాభారతం ఒక సమగ్ర వ్యక్తిత్వం, సార్వకాలిక ప్రయోజనమును సాధించిపెట్టిన పురాణము. భక్తి మార్గములో తీర్చబడిన ఈ పురాణంలో రుక్మిణీ కళ్యాణం దశమ స్కందములో రచించబడింది. సాక్షాత్తు లక్ష్మీ దేవి అంశ ఐన రుక్మిణి బాల్యము నుండి శ్రీకృష్ణుని ఆరాధించి తన ప్రేమను ఒక బ్రాహమణుడి ద్వారా కృష్ణుడికి పంపి తనను తీసికెళ్లమని సందేశం పంపింది. అతడిని చేపట్టింది. అతిథి సేవ, పతి సేవ,ధర్మనిష్ట, సహనశీలత, దైవభక్తి మొదలైన విశిష్ట లక్షణాలతో రుక్మిణి శ్రీకృష్ణుడికి ఆత్మ నివేదన చేసుకుని భక్తితో ఆరాధించి ధన్యురాలయింది.

3. శుచిముఖి

పింగళి సూరన రాసిన ప్రభావతీ ప్రద్యుమ్నములో ప్రధాన సూత్రధారిణి సరస్వతిదేవి పెంపకంలో పెరిగిన రాయంచ శుచిముఖి. ఇంద్రుడు తన శత్రువు వజ్రనాభుడి ప్రాంతంలో విహరించి అక్కడి వివరములు సేకరించు కార్యనిర్వహణకు శుచిముఖిని పంపిస్తాడు. వజ్రనాభుడి కుమార్తె ప్రభావతికి, శ్రీకృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నులకు అనురాగం వృద్ధి చేసి వారి వివాహమునకు కారణభూతురాలు కావలెనని దేవేంద్రుడు శుచిముఖిని కోరతాడు. దానికి అంగీకరించిన పక్షిరాజము ఇటు ప్రద్యుమ్నుని కలిసి అతనికి ప్రభావతిపై అనురాగము కలుగచేస్తుంది. అదే విధంగా ప్రభావతికి తగినవాడు ప్రద్యుమ్నుడే అని తన చమత్కారముగా తెలియచేస్తుంది. చివరకు వజ్రనాభుని కూడా తన వాక్పటిమతో వీరివురి ప్రేమవృత్తాంత్తాన్ని తెలిపి వివాహమునకు అంగీకరింపచేస్తుంది. నిర్మలహృదయంతో దేవకార్యము నెరవేర్చి దనుజ సంహారానికి దేవేంద్రుని అభ్యుదయానికి ప్రధాన భూమిక పోషించింది శుచిముఖి..

ఈ పుస్తకంలోని ఒక పారిజాతాన్ని ఆస్వాదించాలంటే ఇక్కడ చూడండి.

పుస్తకం వివరాలు


ప్రతులకు..
వెల : రూ.101 /-
Dr.V.V.Raghavamma
4-1-37 , Travvakalva Road
3rd Cross Line, SNP Agraharam
Bapatla – 5221010
Guntur District.

అమెరికాలో
Dr.Seethalakshmi (001)-401 636 0316

You Might Also Like

5 Comments

  1. psmlakshmi

    chakkani parichayam
    psmlakshmi

  2. కొత్తపాళీ

    పుస్తకాన్ని గురించి ఆసక్తి కలిగించేట్టుగా ఉంది పరిచయం

  3. శ్రీనిక

    జ్యోతిగారు,
    మంచి పుస్తకాన్ని చాలా బాగా పరిచయం చేసారు. చాలా విషయాలు తెలిసినవి. పంచ మహా
    కన్యలగురించి చదివాను కాని మిగిలినవారి గురించి చదవలేదు. ధన్యవాదములు.

  4. Srilalita

    జ్యోతీగారూ,
    మంచి పుస్తకం వివరంగా పరిచయం చేసారు. ఒక్కొక్క పారిజాతాన్ని గురించి చదువుతుంటే ఎంతో గొప్పగా అనిపించింది. పరిచయం చదువుతుంటే తప్పకుండా చదవవలసిన పుస్తకం అనిపిస్తోంది.

  5. మాలతి

    బాగుంది జ్యోతిగారూ. నాకు తెలియనివిషయాలు చాలా ఉన్నాయి ఈపుస్తకంలో. బాగా చెప్పేరు. అభినందనలు.

Leave a Reply to కొత్తపాళీ Cancel