మనిషిలో మనిషి – అంతర్ముఖం

రాసిన వారు: సాయి బ్రహ్మానందం గొర్తి
*********************
యండమూరి వీరేంద్రనాధ్ రాసిన నవలలన్నింటిలోనూ ఋషి, వెన్నెల్లో ఆడపిల్ల నాకు బాగా నచ్చినవి. మిగతా నవలల్లో సంఘటనలూ, పాత్రలూ వాస్తవానికి దూరంగా ఉన్నా, ఈ రెండు నవలలూ మాత్రం భిన్నంగా ఉంటాయి. తులసీదళంతో పేరొచ్చాక అంతకు ముందు రాసిన ఋషి, పర్ణశాల పునర్ముద్రితాలయ్యి వాటికీ మంచి పేరొచ్చింది. ఇవన్నీ కొన్ని పత్రికల్లో సీరియల్స్‌గా వచ్చినప్పుడు పట్టించుకున్న పాఠకుడే లేడు. తులసీదళంతో వచ్చిన పాపులారిటీ అంతకుముందు రాసిన వాటికి గిరాకీ తెచ్చిపెట్టింది. తెలుగు పాఠకులకి లోతైన సాహిత్యం కన్నా పాపులర్ రచనల మీదే ఆసక్తి ఎక్కువ అన్నదానికిదే నిదర్శనం. నవలలు మానేసి సినిమా స్క్రిప్టుల వైపు వెళ్ళి, దర్శకత్వం చేసి తనవీ, నిర్మాతవీ చేతులు కాల్చుకున్నాక మరలా ఒక్క మంచి నవలా వీరేంద్రనాథ్ రాయలేదు. ప్రస్తుతం పెర్సనాలిటీ డవలెప్‌మెంటు మీద ఎడాపెడా రాసి పడేస్తున్నారు. అది వేరే విషయం. యండమూరి రచనలు ఎక్కువగా సీరియల్సుగానే వచ్చేవి. ఆ దరిలోనే సీరియల్‌గా కాకుండా ఒక డైరెక్టు నవల వచ్చింది. దీని పేరే అంతర్ముఖం. మంచి పేరే వచ్చింది కానీ మిగతా వాటికొచ్చిన పేరు రాలేదు. నాకు నచ్చిన అతి కొద్ది నవలల్లో ఇదొకటి. మిగతా నవలలన్నింటిలోనీ ఈ నవలే అత్యుత్తమమైనదని నా అభిప్రాయం. చిత్రం ఏమిటంటే, వీరేంద్రనాథ్‌ కూడా తను రాసిన వాటిల్లో ఈ నవలే బాగా నచ్చినదని ఎక్కడో రాయగా చదివాను. అందులో విశేషాలు పంచుకోడమే ఈ నవలా పరిచయ ఉద్దేశ్యం.

ముఖం మనిషి మనసుకి ప్రతిరూపం అంటారు. ప్రతీ మనిషికీ రెండు ముఖాలు ఉంటాయి. పైకి కనిపించేది కృత్రిమమైన చిరునవ్వుని పులుముకున్న అందమైన ముఖం. రోజు రోజుకీ కుళ్ళిపోయి వికృత రూపం దాల్చేది లోపలి ముఖం – అదే అంతర్ముఖం.

మనిషి బాహ్య ప్రవర్తననీ, అంతర్లీనంగా మనిషిలో జరిగే సంఘర్షణనీ, అతని చుట్టూ అల్లుకున్న బంధాలనీ, ప్రేమ గొప్పతనాన్ని, ప్రేమిస్తున్నావన్న భ్రమలో తమని తమే మోసం చేసుకునే వ్యక్తుల్నీ, నిజాయితీ చచ్చిపొతే మనుషుల మధ్య పెరిగే దూరాలనీ – ఇవన్నీ సమగ్రంగా ఒక కథా రూపంలో కూరిస్తే ఆ నవల ఖచ్చితంగా గుండె లోతుల్ని తాకుతుంది అన్న దానికి నిదర్శనం “అంతర్ముఖం”.

నిజాయితీ లేని ప్రేమ ఎంత భయంకరంగా మారుతుందో; ఎంతో ప్రేమతో హృదయాన్ని హత్తుకున్న కన్న పిల్లలే, ఓపిక క్షీణిస్తే, చివరి దశలో ఎంత గట్టిగా గుండెల్ని తన్నుతారో; ప్రేమ ముసుగు వేసి ఎంతో నాటకీయతనీ, తెలివితేటల్ని ప్రదర్శిస్తారో కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ, పాఠకుడి అంతర్ముఖాన్ని ఒక్కసారి తన జీవిత దర్పణంలో చూసుకునేలా చేస్తుందీ “అంతర్ముఖం”.

ఈ నవల స్వగతంలో నడుస్తుంది. ఈ నాయకుడు వయసు మీరి అంత్య దశలో మరణానికి దగ్గర్గా ఉంటాడు. కన్న కూతురూ, కొడుకులూ ఎప్పుడు ఆ మరణం సంభవిస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు.

నాయకుడుకి మెల్ల మెల్లగా అతని జీవితంలో ఒక్కో సంఘటన అతని ముందు కనిపిస్తుంది. మరణం తరవాత అతను భగవంతుడి వద్దకు చేరుతాడు. అక్కడ – ‘మనవాళ్ళపై ఉన్న ప్రేమని చెరిపివేయడం ఆ భగవంతుడి తరం కూడా కాదనీ దేముడితో వాగ్వాదం చేసి ప్రేమ గొప్పదని, తన సంతానం తను పోయినా ఇంకా ప్రేమిస్తూనే ఉంటారని చెప్పి, దేముడితో వాదించి, మరల చచ్చి- బ్రతికి ఈ భూమ్మీదకి వస్తాడు.

అసలు కథ ఇక్కడే ప్రారంభం అవుతుంది. చచ్చిపోతాడనుకున్న వ్యక్తి మరలా బ్రతికాడు, అదీ కాక ఎవరో ఒకరి ఆసరా లేకుండా ఈ వయసులో జీవితం గడపడం కష్టం అనిపించే వ్యక్తి మరలా బ్రతికి వచ్చాడు.

ఆతని పునర్జీవితమే వారి పట్ల నరకంగా మారుతోందని భయపడి, కన్న కూతురు, కొడుకులూ ఎంత నీచానికి దిగజారుతారో, ఎంతో హేయంగా ప్రవర్తిస్తారో కదా అని అతనికి అవగతమవుతుంది. అంపశయ్య మీద నిస్తేజంగా పడున్న అతనికి గతం గుర్తుకొస్తుంది. బాల్యంలో తన తల్లి ప్రేమ, తండ్రి వదిలేస్తే తల్లి పడ్డ కష్టాలు, తనపై వాటి ప్రభావం ఇవన్నీ అతన్ని ఒక స్థితప్రజ్ఞుడిలా తయారుచేస్తాయి. ప్రణవితో అతని పరిచయం, ప్రణవితో ప్రేమ, అతని ఆరోగ్యం చెడిపోవడం, అతను చేసిన ఒక హత్య, దానివల్ల అతనికి ఉరి శిక్ష పడడం, దానినుండి తప్పించడానికి ప్రణవి చూపించిన నిస్వార్థమైన ప్రేమ…ఆ తరువాత ప్రణవి చివరికోరిక తను తీర్చడానికి మనిషిలా మారడం స్థూలంగా కథ ఇదే అయినా, ప్రతీ సంఘటన మన మధ్య జరిగినవే, జరుగుతున్నవే అనే భావం కలుగుతుంది.

అంతే కాదు, ‘ఒక్కోసారి మనం కూడా అలాంటి సంఘటనల్లో అలాగే ఆలోచించే వాళ్ళం కదా?, లేదా మన ప్రవర్తన కూడా ఇలాగే ఉండేది కదా?’ అని అనిపించే బిగి సడలని కథనం మనసు లోతుల్నే కాదు, మానవత్వపు శిఖరాలను కూడా చూపిస్తుంది. ఈ నవల్లో, స్నేహం పేరుతో కన్న కూతుర్నే వ్యభిచరించడానికి ప్రోత్సహించే పరంధామయ్య, ప్రేమించి పెళ్ళాడిన భర్తకి దూరమైన సుశీల, అతని తల్లి, ఫాదర్ మార్టిన్, స్నేహితుడు శ్రీనాధ్ ఇవన్నీ ఒకరకంగా కథలోని పాత్రలుకావు, మన మధ్య రోజూ మసిలే మనుష్యులే అనిపిస్తుంది.

“నేను వయస్సులో వృద్ధ శవాన్ని, జ్ఞానంతో శైశవాన్ని” అనే భావాలు, ” ప్రేమ శాశ్వతం కాదు. అది స్త్రీ కి తండ్రి మీద నుంచి భర్త మీదుగా కొడుకుల మీదకు ప్రవహిస్తుంది. అదే పురుషుడికి ప్రియురాలి మీదనుంచి భార్య మీదుగా వ్యసనం ( కెరీర్ ) మీదకు జారుతుంది” లాంటి మంచి వాక్యాలు మనసుల్లో పదిలంగా నిలిచిపోతాయి.

“నేను అమ్మకు నచ్చను. నా కొచ్చే వందల జీతంలో మూడొందలు పెట్టి, ఆమెను దినమంతా చూసుకోవడాని ఒక మనిషిని నియమించి, మిగిలిన అయుదొందల్తో ఆమెకు మందులు కొనలేక, నేనో పూట పస్తులుంటూ, ఆమె మంచం ప్రక్కన కూలబడి, ‘ నేను నిన్ను రక్షించుకోలేక పోతున్నానే అమ్మా !’ అని సెంటిమెంటల్గా ఏడిస్తే ఆమెకు సంత్రుప్తి. ప్రాణాలు త్వరగా పోయినాసరే” లాంటి మనసు చెమర్చే భావాలే ఆద్యంతం కనిపిస్తాయి.

ఈ నవల చదువుతున్నంత సేపూ బుచ్చిబాబు గారి ‘చివరకు మిగిలేది’ గుర్తుకొస్తూ ఉంటుంది. అ నవలలోని దయానిధి పాత్రకి ఈ నవలలోని నాయకుడి ( నేను ) కి దగ్గర పోలికలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రణవి పాత్ర చివరికి మిగిలేది నవలలో కోమలి పాత్రకి పోలికలు కనిపిస్తాయి. ఈ పోలికలు మినహాయిస్తే – ఒక మంచి నవల చదివిన అనుభవం మిగులుతుంది. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన అనేక నవలల్లో ఇది ఖచ్చితంగా ఎంతో ఎత్తున నిలబడ గల నవల ఇది. సొమర్సెట్ మాం’ ” ఆఫ్ హ్యూమన్ బాండేజి”, బుచ్చిబాబు గారి “చివరకు మిగిలేది” తరువాత నాకు నచ్చిన పుస్తకాల్లో ఇదొకటి. ఈ నవల ఎందుకు గొప్పదో అన్న విషయం ఒక్కసారి చదివితే పాఠకులకీ అర్థమవుతాయి అంతర్ముఖంలోని వాస్తవాలు.

ఒక పుస్తకాన్ని మొదలు పెట్టినప్పటినుండి చివరి పేజీ వరకూ పాఠకుడ్ని చదివించ గలిగితే ఆ రచన సఫలీ కతమైనట్లే. ఆ గుణం ఈ నవల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

You Might Also Like

23 Comments

  1. varaprasaad.k

    చాలా జాలేస్తుంది కొందర్ని చూస్తే,అసలు ఏమి చెప్పాలో వాళ్లకు తెలీదు,కానీ తమ వల్ల కానిదాన్ని ఎవరో సాదిస్తుంటే ఏదోలా అక్కసు వెళ్ళ గక్కటం ఒక్కటే తెలుసు వాళ్లకు అని స్పష్టంగా అర్ధం అయింది.పోనీ వాళ్ళే రాసి జనాన్ని మెప్పిస్తే ఆయన్ను పాఠకులు మరచి పోదురేమో,

  2. Mamidi Kondalu

    యండమూరి గారు నమస్కారం
    నేను మీ సరస్వతి విద్యపీట్టం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను.

    1. varaprasaad.k

      వీలైతే కాకినాడ ప్రక్కనే,ఒక్క సారి స్వయంగా చూస్తే మనిషి ఎంత ఎదిగినా తాను చేయదలుచు కొన్న పని పట్ల ఎంత స్పష్టంగా ఉండొచ్చో అర్ధం అవుతుంది.

  3. ram n.

    @READERS,

    Just now I could find the website (WWW.YANDAMURI.COM)

    We can read about “Saraswathy Vidya Peetham”.

    I request everyone to visit this Website without missing.

    E-mail:ramuputluri@yahoo.in

  4. ram n.

    యండమూరి గారు,

    “సరస్వతి విద్యా పీఠం” అనే పేరుతో ఒక విద్యా సంస్థను స్థాపించారు.
    పాఠకులెవరికైనా ఈ సంస్థ గురించి అవగాహన ఉంటే వివరాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను..

    E-mail:Ramuputluri@yahoo.in

  5. Gowri Kirubanandan

    ఒక పుస్తకం చదవక ముందు ఉన్న మనిషికి, చదివిన తర్వాత ఉన్న మనిషికి మార్పు ఉంటుంది. ఆ మార్పు శాశ్వతమా తాత్కాలికమా అన్నది ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంతర్ముఖం నన్ను ప్రభావితం చేసిన నవలల్లో ముఖ్యమైనది. తమిళంలో నేను అనువాదం చేసిన మొదటి నవల అంతర్ముఖం అవటం యాదృచ్చికం.
    గౌరీ కృపానందన్

  6. srikanth

    antharmukham bhagane vundi mari evarina vijayaniki idu metla gurunchi raaste chadavalanundi

  7. కత్తి మహేష్ కుమార్

    @హెచ్చార్కె:
    కాపీకీ ప్రేరణకీ చాలా తేడా ఉంది. తులసి,తులసిదళం కూడా కాపీకాదు. ప్రార్థన కొంత వరకూ ఒక ఆంగ్ల నవలని పోలివున్నా surely its different. బహుశా genre చూసి అలాంటి నవల అనుకొని “ఇది కాపీలే” అని తేల్చేసేవాళ్ళను వదిలేస్తే నిజంగా యండమూరిని చదివి “కాపీ” అనలేము.

  8. హెచ్చార్కె

    @రవి: ఔను. ముఖ్యంగా రాబిన్ కుక్ ‘ఫివర్’ చాల బాగుంటుంది. అందులో, దాదాపు ప్రారంభంలోనే అనుకుంటా, సజీవ జీవకణంలో జరిగే స్ట్రగుల్‍ను, ఆ ‘డ్రామా’ను వర్ణించిన తీరు అబ్బురపరుస్తుంది. ‘ఫివర్’గురించి మా అమ్మాయికి చాల సార్లు చెప్పాను. చదివిందో లేదో :).
    మనవాళ్లు, సైన్సు తెలిసిన వాళ్లు, అలాంటి నవలలు రాయొచ్చు కదా, ఎందుకు రాయరో? నిజాయితీగా ఆధ్యయనం చేసి, అవసర విషయ పరిజ్ఙానం సంపాదించి, చక్కని సైన్సు ఫిక్షన్ రాయొచ్చు. మార్కెట్ వుంటుంది. యువతీయువకులలో పఠనం ఒక అలవాటుగా మారడానికి, సస్టెయిన్ కావడానికి అవి చాల ఉపయోగపడతాయి.

  9. రవి

    వ్యక్తిగతంగా నాకు ఈ నవల నచ్చలేదు. మనిషి బలహీనతలు యథాతథంగా ఎత్తిచూపి వ్రాసిన ఈ నవలకన్నా, బలహీనతలను అధిగమించి, తనను చూసి, తను నవ్వుకునే స్థాయికి మనిషి వెళ్ళగలిగాడన్న సందేశం ఉన్న పర్ణశాల, ఆనందోబ్రహ్మ, ప్రార్థన వంటి నవలలు నాకు ఇష్టం. ఇవి కూడా ఒకప్పుడు నచ్చినవి మాత్రమే. ఇప్పటి పాఠకులను యండమూరి రంజింపజేసే విషయం సందేహాస్పదం.

    హెచ్చార్కే గారు: ప్రార్థన (రాబిన్ కుక్ ఫీవర్), దుప్పట్లో మిన్నాగు, ఇవి కూడా లిస్టులో చేర్చవచ్చు.

  10. Sai Brahmanandam

    @సాగర్:

    అంతర్ముఖం మంచి నవలనే రాసాను తప్ప, బుచ్చి బాబు “చివరకి మిగిలేది?”ని తక్కువ చేయలేదే? చివరికి మిగిలేది ఖచ్చితంగా గొప్ప నవల. ఎవరూ కాదనరు. చాలా నవలలకిది ప్రేరణ. ముఖ్యంగా పాత్రల మానసిక విశ్లేషణ రాయలనుకున్న వారికిదొక ఆదర్శ నవల. అంతర్ముఖం బావుందీ అని అంటే చివరకి మిగిలేది బావోలేదని కాదు. రెంటికీ పాత్రల పరంగానే పోలికలు చూపించాను గానీ, వస్తుపరంగా స్థాయి నిర్దేశిస్తూ రాయలేదనే అనుకుంటున్నాను.

  11. venkat

    నేనూ ఉత్సాహంగా ఈ నవల చదివాను కాని నాకు అంత గొప్పదనం కనపడలేదు. పాత్రల చిత్రీకరణ చాలా పేలవంగా జరిగింది అనిపించింది.

  12. Srinivas Vuruputuri

    హెచ్చార్కె గారికి-
    మిమ్మల్ని వ్యంగ్యంగా ఏదో అందామని రాయలేదండీ. నిజంగానే, తెలియకే (“ఇన్నేళ్ళ తరువాత కూడా, తెలియలేదా నీకు?” అని ఎవరైనా తిడతారేమో అనే జంకుతో రాసిన మాటలవి.). “మన అజ్ఙానాన్ని మనం తెలుసుకోవాలంటే చాల జ్ఙానం కావాలి.” అన్నారు. మంచి మాటే కానీ నా కేసు వేరే – తెలియనప్పుడు దూకుడుగా రాసి తల బొప్పి కట్టించుకోకూడదనే “ముందు జాగ్రత్త” అంతే! 🙂

  13. హెచ్చార్కె

    @Srinivas Vuruputuri: ఎక్సార్సిస్టు.
    మిత్రమా,
    నేరుగా మాట్లాడొచ్చు. నా అభిప్రాయం తప్పని చెప్పొచ్చు. మీకు లేని అజ్ఙానాన్ని ఆపాదించుకో నవసరం లేదు. మన అజ్ఙానాన్ని మనం తెలుసుకోవాలంటే చాల జ్ఙానం కావాలి. నేను అంతటి క్లెయిమ్ చేయలేను.

  14. Srinivas Vuruputuri

    @హెచ్చార్కె గారు: నా అజ్ఞానాన్ని మన్నించాలి. తులసి దళం, తులసి ఏ నవలలకి కాపీయో చెబుతారా? ది ఓమెన్ సినిమా? ది ఎక్సార్సిస్ట్ నవలా? రెండూనా? రెండూ కాక మరొకటా?

  15. sagar

    పుస్తకం వారి వెబ్సైట్ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. బుచ్చిబాబు చివరకుమిగిలేది నవల ఎందుకూ పనికిరాక యండమూరి అంతర్ముఖం ఎంతో చాతుర్యంతో ముందుకు వచ్చింది. దీనిని జనరేషన్ గాప్ అనొచ్చా.

    ఇక మీ పత్రికను లో తేవడమే తరువాయి.

    1. సౌమ్య

      సాగర్ గారికి: పుస్తకం ఎత్తు గురించి ఎందుగ్గానీ – పుస్తకప్రియులు ఎవరైనా తమ తమ అభిప్రాయాలు నిర్మొహమాటంగా వ్యక్తపరుచుకునేందుకు ఇదొక వేదిక. కనుక, ఒకళ్ళకి నచ్చిన నవల ఇంకోళ్ళకి నచ్చకున్నా, ఒకరికి నచ్చనిది ఇంకోళ్ళకి నచ్చినా…వీటిలో ఏదైనా ’క్లాసిక్’ అని పేరుపడ్డా, పడకపోయినా : పుస్తకం.నెట్ ద్వారా అభిప్రాయాలు చెప్పవచ్చు.
      ఇక పత్రిక విషయమంటారా – మీకంత ఆసక్తి ఉంటే, ఇగనేం!

  16. హెచ్చార్కె

    @కత్తి మహేష్ కుమార్: ‘కాపీ కొట్టాడనే అపవాదుకు చెంప పెట్టు’ అంటారేమిటి? కాపీ కొట్టాడు కదా? తులసి, తులసి దళం. కాపీ కొట్టనివి కూడా రాసి ఉంటే సరే. కొట్టిన వాటి గురించి మాట్లాడి వారి చెంపలకు మీ నుంచి రక్షణ ఉండదా?

  17. కత్తి మహేష్ కుమార్

    యండమూరి కాపీ కొడతాడనే అపవాదుకు చెంపపెట్టు ఈ నవల. కామూ ఔట్ సైడర్, కాఫ్కా మెటమార్ఫాసిస్ లోని మూలంతో ప్రేరణ పొందినా, అచ్చమైన ఆధునిక తెలుగు సమాజంలోని existential ప్రశ్నల్ని సంధించిన ‘అంతర్ముఖం’అంతే ఒరిజినల్ అని నా అభిప్రాయం.

    చివరకు మిగిలేదితో పోలిక గురించి కొంచెం ఆలోచించాల్సిందే!

  18. సౌమ్య

    నాకూ చదివినప్పుడు తెగ నచ్చింది. ఇప్పుడు అంత గుర్తులేదు కథా కమామిషూ. ఆపై యండమూరి నవల్లు రెండు మూడు చదివాను. అన్నీ ఎంటర్టైనింగ్ గానే ఉన్నాయి కానీ, ’అంతర్ముఖం’ నచ్చినంత నచ్చలేదు.

  19. N.N.Muralidhar

    ఖచ్చితంగా తెలుగు నవలా సాహిత్యం లో అత్యుత్తమమైన నవలలో ఒకటి అంతర్ముఖం. చదివుతూ ఉంటే మనసును మెలిపెట్టి, చదవటం పుర్తయ్యాక వెంటాడే భావాలు ఎన్నో ఉన్నాయి ఇందులో. మనం తొడుక్కున్న ముసుగులు తొలిగి మనముందు నిలబడితే ఎలా ఉంటుందో మనకి తెలుస్తుంది.

  20. kvsv

    నేను common man…సాహిత్యం అంతే ఏమిటో పెద్ద పెద్ద అర్దాలు తెలియదు..కానీ నా లైఫ్ లో మర్చిపోలేనిదీ.పోయినప్పుడల్లా కొనుక్కుని దాచుకున్న నవల ఇది..నాకు తెలిసి వీరేంద్రనాధ్ నవలల్లన్నీఒక వైపూ ఆంతర్ముఖం ఒకవైపూ…

  21. రమణ

    ఈ నవల చదివాక నేను అంతకుముందు చదివిన ఆయన చాలా రచనలు నచ్చలేదు.నేను చదివిన ఉత్తమ పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. ఆల్బర్ట్ కామూ రాసిన ఇన్ సైడర్ ఆధారంగా రాసిన నవల అని రచయిత ముందుమాటలో ఉంటుందనుకుంటా. ‘చివరకు మిగిలేది’ చదివాక, నాకు కూడా దయానిధికీ-ఇందులోని కధానాయకుడికీ, ప్రణవికి-వ్యక్తిత్వాన్ని సంతరించుకొని తిరిగివచ్చిన కోమలికీ కొంత సారూప్యత కనిపించింది.

Leave a Reply