ఏడు కొండల కింది వెంకన్న!
రాసిన వారు: అఫ్సర్
***********
(ఇటీవల వెలువడిన యంవీ రమణ కవిత్వ సంపుటి ” ఒక అసంబద్ధ కల ” కి అఫ్సర్ రాసిన ముందు మాట)
’ఆనుభవిక సంభాషణ’ అనే మాటని వెంకన్న ఈ పుస్తకంలో ఎక్కడో వొక చోట వాడాడు. కాని, ఈ పుస్తకంలోని ప్రతి పంక్తీ వొక ఆనుభవిక సంభాషణా శకలమే. అనుభూతి అనే మాటని గత కవిత్వ సందర్భాల్లో ఎక్కువగా వినే వాళ్ళం. ఇప్పుడు ఆ మాట తొలగిపోయి, దాని బదులు అనుభవం అనే మాట ఎక్కువ వాడుకలోకి వస్తోంది. ఆ మాటని కూడా తొలగించి, ఆనుభవిక సంభాషణ అనే మాటని ప్రవేశ పెడుతున్నాడు వెంకన్న. ఆ మాటకి వున్న భిన్న సందర్భాల మూట ఈ కవిత్వ పుస్తకం. సాధారణ అనుభవానికీ, కవి అనుభవానికీ మధ్య వ్యత్యాసం వుంటుందా? వుంటే, అది కవిత్వంలోకి ఎట్లా వ్యక్తం అవుతుందన్న ప్రశ్నకి వివిధ రకాల సమాధానాలు వెంకన్న కవిత్వంలో దొరుకుతాయి. కనీసం వొక సమాధానం అయినా వెతికే ప్రయత్నం ఈ నాలుగు మాటలు.
ఇప్పుడు ఈ పుస్తకంలో ఎం.వీ. రమణగా కనిపిస్తున్న వెంకన్నని రమణ అని పిలవడం నాకు కొంచెం దూరంగా అనిపిస్తుంది. ఆ మాటకొస్తే, వెంకన్న కవిత్వం ఆయా పత్రికలలో రమణ సంతకంతో అచ్చు అయినప్పుడు కూడా అదే దూరాన్ని నేను ఫీల్ అయ్యాను. ఆ దూరాన్ని చెరిపేస్తూ, ఈ కాసేపు కూడా వెంకన్న అనే పిలుస్తాను. వెంకన్న అనే పిలవబడే సాధారణ వ్యక్తికీ, రమణ అని పిలవబడే కవికీ మధ్య వుండే లాంటి వ్యత్యాసమే – సాధారణ అనుభవానికీ, కవిత్వంలో వ్యక్తమయ్యే అనుభవానికీ వుండే వ్యత్యాసం. అసలు అనుభవానికీ, కవిత్వ వ్యక్త అనుభవానికీ వ్యత్యాసం వుంటుందన్నది నా అభిప్రాయం. ఆ వ్యత్యాసాన్ని చెరిపే అసంబద్ధ కల కవిత్వం అనుకుంటాను.
1
కొత్త రచయితలకీ, కవులకీ ఆట్టే అనుభవాలు లేవు అనే మాట ఈ మధ్య తరచూ వింటున్నాను. అనుభవ రాహిత్యం అనేది కొత్త సాహిత్యంలో వొక శాపం అంటారు వీళ్ళు. ఇది నిజం కాదు. ఒక రకంగా ‘అనుభవం’ అనే మాటకి వొక చట్రం బిగించే ప్రయత్నం కూడా. అనుభవం అనేది యెప్పుడూ వొకే మాదిరి వుండదు. మరీ ముఖ్యంగా కాలం, విలువలు, మనుషులు మారుతున్నప్పుడు అనుభవం మారుతుంది. అలాంటి మార్పుని తక్షణం పట్టుకునే శక్తి కవిత్వానికి మాత్రమే వుంది. అందుకే, కవిత్వం మిగిలిన సాహిత్య రూపాల కంటే వేగంగా మారుతుంది. ఈ కొత్త అనుభవాన్ని అందుకునే స్థితిలోకి వెళ్ళలేక కొత్త కవిత్వాన్ని మనం నిరాకరిస్తాం. అలాంటి నిరాకరణల కాలంలో కన్ను తెరిచిన కవి వెంకన్న. అనేక ‘కాదు…కాదు ‘ ల నించి వొక కొత్త ‘అవును ‘ ని నిర్మించుకున్న కవి వెంకన్న.
2
అవును…అంత తేలిక కాదు, అవును దాకా ప్రయాణించడం! ఒకే దుప్పటి, ఒకే అన్నం ముద్ద పంచుకున్న చలం చనిపోయాడా? అవునా? కాదేమో?! అవునేమో! జీవితం అంటే సక్సెసా? అవునేమో? కాదేమో? డబ్బు అవసరమా? అవునేమో? కాదేమో? ఈ మూడింటి మధ్య వూగిసలాట ఈ తరం వెంకన్నల బతుకు అనుభవం. పట్టెడన్నం కూడా పుట్టని తెలుగు పంతులు బతుకా? గంటల్ని వందల రూపాయల కింద అమ్మేసుకునే కంప్యూటరు సుఖ వధ్య శిల ఎక్కాలా? అవునో…కాదో? వీటిలో చాలా వాటికి ‘కాదు ‘ అని కచ్చితంగా అనుకొని, తను అనుకున్న ‘అవును ‘ ని చేరుకోవాలన్న ఏడు కొండల ఎదురు ప్రయాణం ఈ వెంకన్నది.
చెరిగిపోని గుర్తులు కొన్ని…… నా కాలేజీ రోజుల్లో ఖమ్మంలో వైరా రోడ్డుకీ, లైబ్రరీకి మధ్య ఈ పొడుగాటి అమాయక చక్రవర్తి స్వచ్చంగా నవ్వుతూ ఎదురుపడే వాడు. లేకపోతే, ఏ సాయంకాలమో అప్పుడే స్నానం చేసి, నా చెవి వెనకాల సబ్బు నురగ కూడా కరక్కముందే సీతారాం కోసం పరుగు తీస్తూ వెళ్ళిన వేళల ఈ వెంకన్న “అన్నా” అని ముందుకు దూసుకు వచ్చే వాడు. ఆ తరవాత నేను బెజవాడ నించి వస్తూ పోతున్నప్పుడు నా కంటే ముందే మా ఇంటి దగ్గిర తోరణంలా వేలాడుతూ కనిపించే వాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. జీవితాలు మారాయి, కలలు తలకిందులయ్యాయి,వెంకన్న చూస్తూండగానే! వీటన్నిటికి మించిన మార్పు…బతుకు స్వరూపం మారింది. అఫ్సర్లూ, సీతారాంలూ, ప్రసేన్లూ, యాకూబులూ, వంశీ, రమణ మూర్తులు, శిఖామణులూ, సుధాకర్లూ చెప్పినట్టు – బతుకు కవిత్వ కేంద్రితం కాదనీ, రూపాయి కేంద్రితమనీ ముక్కు బద్దలయ్యేట్టు కొత్త బతుకు మారింది. ఈ రెండు ధృవాల మధ్యన నిలబడిన సందిగ్ధ కేక ఈ వెంకన్న కవిత్వం. (మనసారా, నవ్వుకుంటున్నావా, నిహిలిస్టు చక్రపాణీ? చిద్విలాసంగా వున్నావా యదార్థవాదీ రామచంద్ర ప్రభూ? సత్యం ఇంతే అంటున్నావా సత్య ప్రసాద రాయడా?)
బహుశా, వెంకన్న ఆనుభవిక సంభాషణా శకలాలు ఈ సందిగ్ధ విస్ఫోటనంలోంచి ఎగసి పడ్డవి. అందుకే, ఒక ఆధునిక జీవన విధ్వంసంతో ఈ పుస్తకం మొదలవుతుంది. స్థానికతా, గ్లోబలీకతా రెండూ కలగలిసిన బిందువు దగ్గిర కవి వెంకన్న బయలుదేరుతున్నాడు. తనకి తెలిసిన పూర్వ కవులు ప్రపంచ వినియోగ దారులు కాదు. వాళ్ళకి భిన్నంగా, తను ప్రపంచ పటం మీద అమ్మకం సరుకు అవుతున్నాడన్న ఉనికి వేదన వొక వెంకన్నది కాదు. అనేక మంది వెంకన్నల గొడవ. ఈ కొత్త సందర్భం, అనుభవం వెంకన్న పునాది. మధ్యలో అమ్మ పిలుపూ, బాల్యపు ఆకాశమూ తెంపుకొని, ‘మరో ఆకాశం ‘ కింద పక్షులవుతున్న తరం శోకం ఇది. వెంకన్న చెప్పాలనుకున్న అనుభవం సరళమయింది కాదు, సరళ రేఖలాంటిదీ కాదు. తను గీయాలనుకున్న గ్రాఫు మాటి మాటికీ వక్రమవుతోంది. అందుకే, ఈ పుస్తకంలోని మొదటి కవిత పఠనం నించి మీ ఈసీజీ తీస్తే, దానికి వొక నిలకడ వుండదు.
3
నిలకడ అసాధ్యమయిన అనుభవం. అసంబద్ధత అనివార్యమయిన అనుభవం. ఇదీ వెంకన్న అనుభవంగా నాకు అర్ధం అయ్యింది. “తనని తనలోంచి తొలగింపజేస్తున్న” శక్తుల మీద నిరసన ఈ కవిత్వం. అతనే చెప్పుకున్నట్టు “కొంత కఠినత్వం, కొంత సున్నితత్వం” అతని కవిత్వంలొ కనిపిస్తాయి. అది వొకే సమయంలో ఆత్మ ఘోషా అవుతుంది, సామూహిక బృంద గానమూ అవుతుంది. కవిత్వ అనుభవానికి ఇవి రెండూ లక్షణాలు అనుకుంటే,అవి సలక్షణంగా వొదిగే సందర్భం ఇప్పుడు లేదు. “అర్ధమే తెలియని అరుపొకటి/ అరుస్తోంది అదే పనిగా” అంటాడు వొక కలకీ, మాటకీ మధ్య తెరుచుకున్న కిటికీ లాంటి కవితలో. కవిత్వ సృజన, కవిత్వ పఠనం కొత్త్ అనుభవంగా ఎట్లా మారుతున్నాయో కొన్ని కవితల్లో ఉద్దేశకపూర్వకంగానే చెప్పుకొస్తాడు వెంకన్న. ఒక ఉదాహరణ “చీలిన కన్ను”. కొత్త కవిత్వం పరస్పర విరుద్ధ అనుభూతుల మీటింగ్ పాయింట్. చదివాక మిగిలేది కలవరం.
ఈ పుస్తకంలోనే ఎక్కడొ ఎవరినించో ఒక మాట అప్పు తెచ్చుకొని “భాష ఆలోచనా వస్త్రం ” అనుకుంటున్నాడు వెంకన్న. కాని, ఆ వస్త్రం ఈ కాలంలో చిరిగిపోయిందని నాకు అనిపిస్తోంది. ఆ వస్త్రం ఇప్పుడెలా కనిపిస్తుందో తెలియదు, చీలిపోతున్న శరీరాల మీద, నగరాల మీద, తరాల స్వప్నాల మీద! ఎవరికీ చెప్పా పెట్టకుండా, అసలే కారణమూ చెప్పకుండా వెళ్ళిపోయిన చలం చివరి వొంటి మీద కప్పుకున్న చొక్కా వెంకన్నదేనా? ఇప్పుడు పంచుకోడానికి కవిత్వమే మిగిలింది చలానికీ, వెంకన్నకీ- నారాయణకీ, సీతారాముకీ! కవిత్వం వొక కలవరపు జ్వరాక్షరం. దాని టెంపరేచరు కొలవడం కష్టం. అనేక వెంకన్నల ఉష్ణ రక్త కాసారం నించి ఇదొక నిప్పు సెగ.
– డిసంబరు 25, 2009
హెచ్చార్కె
రమణా, బతుకు రాను రాను మరింత అసంబద్ధమవుతున్నప్పుడు కల సంబద్ధంగా ఉండడమే అసంబద్ధం. తలకిందులుగా నడుస్తుబ్బ ప్రపంచాన్ని పలకరించాలంటే విలోమ గతి తప్పదు. అఫ్సర్ చెప్పిన మేరకు చూస్తే మీ కవిత ఆ పని చేసిందనిపిస్తోంది. పుస్తకం వెలువడిన సందర్భంగా, అభినందనలు.