కాశ్మీరదీపకళిక

రాసిన వారు: వైదేహి శశిధర్
***************
ఏ సాహిత్య ప్రక్రియకైనా మొదట ఉండాల్సిన లక్షణం చక్కగా చదివించగలిగే లక్షణం. గొప్పసాహిత్యానికి ఉన్న లక్షణం మళ్ళీ మళ్ళీ చదివించగలిగే లక్షణం,చదివిన ప్రతిసారీ మన ఆలోచనల్లో జొరబడి భాగమయ్యే లక్షణం.

నాయని కృష్ణ కుమారి గారి “కాశ్మీర దీప కళిక” నిస్సందేహంగా చక్కగా చదివింపజేసే పుస్తకం. 2008 లో ఇంగ్లీష్ తూలికకు నాయని కృష్ణ కుమారి గారి మీద వ్యాసం రాయమని మాలతి గారు అడిగినప్పుడు ఈ పుస్తకం మొదటిసారి చదివాను (ఆ వ్యాసం ఇక్కడ చదవొచ్చు). పుస్తకం పేరు లోని అందం నన్ను ఆకర్షించి ఈ పుస్తకం చదవాలనే ఆసక్తిని కలుగజేసిందని ఒప్పుకోక తప్పదు. తను లెక్చరర్ గా పనిజేసే కాలేజీలోని విద్యార్ధినులను తీసుకుని రచయిత్రి మొదటిసారిగా కాశ్మీర్ యాత్రకు వెళ్ళినపుడు ,ఆమె తన యాత్రానుభవాలను ,ఆలోచనలను నమోదు చేసిన ట్రావెలోగ్ గా ఈ పుస్తకాన్ని చెప్పవచ్చు. ట్రావెలోగ్ ల సాహిత్య పరిమితులు చిన్నవి. ఒక్కొక్కసారి అవసరమే అయినా నిస్సారమైన వివరాలతో ట్రావలోగ్ లు పఠనానందానికి అడ్డు వస్తాయి . అయితే , చెయ్యి తిరిగిన రచయితలు తమ కధన నైపుణ్యంతో,చక్కటి సృజనాత్మకశైలితో దానిని అధిగమించగలరు.

” మధ్యాహ్నం ఎండ గంజిపెట్టిన నూలు గుడ్డలా ఫెళఫెళ లాడుతుంది…”
అన్న ఒక అందమైన వాక్యంతో కధలా మొదలయ్యే ఈ పుస్తకం ఆద్యంతమూ ఆసక్తికరమైన కధనంతో సాఫీగా సాగుతుంది.

మొట్టమొదటి సారి కాశ్మీర్ చూడబోతున్నానన్న సంతోషం, పదిమంది తరుణ విద్యార్ధినుల బాధ్యతను నెత్తికెత్తుకున్న గాంభీర్యం,పదిరోజులు కుటుంబానికి దూరమవుతున్నందుకు సుంత బేలతనం ,కొత్త ప్రదేశాల విశేషాలను వివరంగా చెప్పాలనే ఉత్సాహం , వీటన్నింటినీ భేషజం లేని సుందరమైన ,సరళమైన శైలిలో చెప్పటమే కాకుండా తరచుగా తళుక్కుమనే భావుకత ని కధనం లో అనాయాసంగా ఇముడ్చుకున్న ఆహ్లాదకరమైన పుస్తకం కాశ్మీర దీపకళిక.

రచయిత్రి స్వయంగా కవయిత్రి కూడా.ప్రయాణం చేస్తున్నంత సేపూ తనలో కలిగే భావసంచలనాన్ని పాఠకులతో పంచుకుంటుంది. ఎంత అందమైన యాత్రకైనా ప్రారంభంలో ఉండే అనివార్యమైన హడావుడి ,చికాకు, మానసిక అస్థిరత ఈమె ప్రయాణం మొదటలో వర్ణించిన విశేషాలలో తొంగిచూస్తూ ఉంటుంది.

” దీపాల మసక వెలుగులో జెర్రిగొడ్డులా రైలు….”

“…..భారంగా జీవితాన్ని వెళ్ళదీసే డబ్బు లేని బహుకుటుంబీకుడిలా ఉంది రైలు.ఎప్పుడూ ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతూ పరిష్కారం కనుక్కోలేని అస్థిరచిత్తుడిమల్లే ఊగిపోతుంది రైలు.మెల్లగా కదిలేటప్పుడు చేసే చప్పుడు లో ఏదో జాలి….”

“…ఎవరిదో అదృశ్యహస్తం గాఢమైన నల్లరంగు పులిమినట్లు చీకటి…..”

కొంత ప్రయాణం సాగాక స్థిమితచిత్తంతో ప్రకృతిని పరికించినపుడు వర్ణించిన తీరులో ఆహ్లాదం స్ఫురిస్తుంది.
“వింధ్య శ్రేణిని దాటుకుంటూ పోతున్నది రైలు.తల్లినేల నడుమున పచ్చల వడ్డాణం లాంటి వింధ్యపర్వత బాహ్యరేఖ చూపు ప్రసరించినంతమేరా ఆ చివరనుండి ఈ చివర వరకూ పరచుకుని ఉంది…”

“…కొండల ఎత్తుపల్లాలలో అక్కడక్కడా విసరి నట్లున్న పెంకుటిళ్ళు అందమైన బొమ్మరిళ్ళలా కనిపించసాగాయి….”

“… ఆ కొండల ఆవల అంచున మనంచూడని ఆ భగవంతుడు వాత్సల్యం నిండిన కళ్ళతో చేతులు చాచి మనల్ని దగ్గరగా పొదువుకుంటాడేమోననీ, అంతులేని ప్రేమతో మనల్ని తన గుండెలకు హత్తుకుంటాడేమో ననీ ….”

“చేలగట్లకు కంచెలుగా నాటిన గ్రామఫోన్ పూలచెట్లు విరియ బూచి మనోహరంగా ఉన్నాయి.వాలిపోయిన అందగత్తె పల్చని చెక్కిళ్ళలాంటి మెత్తని రేకులతో నవ్వలేక నవ్వే ఆ పువ్వుల్లో అమ్మాయకమైన శోభ……”

ప్రయాణంలోని వివిధ అంచెలలోని తన విభిన్న భావ సంచలానాలని స్ఫురింపజేసేటట్లు ప్రకృతి విశేషాలను నమోదు చేయటంతో ఔచిత్యం, ఒక సహజత్వం కధనానికి ఏర్పడింది. అలాగే మధ్యలో ఆగ్రాలో దిగి తాజ్ మహల్ చూసినప్పటి ఆమె ఆలోచనలు చెప్పుకోదగ్గవి.తాజ్ లోని పనితనాన్ని,సౌందర్యాన్ని ప్రశంసిచదగినవి అంటూనే –

“….. అక్కడ ప్రతి అణువునూ నింపి పొంగుతూ ఉండేది స్మృతి !అనంతరాజకార్యాల మధ్య వ్యగ్రుడైన ఒక మకుటాధిపతి హృదయంలో విశ్వరూపం వహించి చిందులు తొక్కిన ఆయన భార్య స్మృతి. తాజ్ ను చూసినప్పుడల్లా నాకు దాని సౌందర్యం గుర్తుకు రాదు,భర్త మనసులో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ముంతాజ్ వ్యక్తిత్వం నన్ను కదిలిస్తుంది.” – అని చెబ్తారు.

కాశ్మీర్ ని సమీపించేకొద్ది గమ్యాన్ని చేరుకుంటున్న ప్రయాణీకులలో కలిగే ఉల్లాసం ఆమె కధనంలో కనబడుతుంది. మట్టిరంగు ,చెట్ల పచ్చదనం,రాళ్ళ నునుపు ,మెలికలు తిరిగిన “తవి నది “సౌందర్యం ఏవీ ఆమె దృష్టి దాటి పోవు. శ్రీనగర్ వెళ్ళేదారిలో ఉన్న ఆర్మీ కంటోన్మెంట్ ను,జవహర్ టన్నెల్ ను చూసి దేశభక్తితో, గర్వంతో ఉప్పొంగిన ఆమె స్వగతం మనల్ని మెత్తగా తాకుతుంది.
” స్వార్ధరాహిత్యానికి వీరికంటే ఉదాహరణ ఏది? శత్రుపక్ష విచ్చేదనం చేసే వీర శార్దూలాలు !”

వచనం రాస్తున్నప్పుడు సందర్భంలో ఇమడని, అనవసరమైన కవితాత్మకత ఒక కృతకమైన భావావేశాన్ని,అస్పష్టతను,అయోమయాన్ని కలుగజేస్తుంది. ఈ పుస్తకంలో నాయని కృష్ణకుమారిగారు ఎన్నో అద్భుతమైన , కవితాత్మకమైన మెటఫర్స్ ను,పదచిత్రాలను కాశ్మీర్ సౌందర్యాన్ని వర్ణించడానికి వాడుకున్నా అవి ఆకర్షణీయమైన వచనంలో కధనానికి ఇబ్బంది లేకుండా సున్నితంగా ,సహజంగా ఒదిగిపోయాయి.


“శిఖరాగ్రాన విశ్వభర్త కొలువుతీరే మణిఖచిత సింహా సనాల్లా ఉదాత్త గంభీరంగా మెరుగులీనే శిలావితర్ధికల రూపం లో ఈ ప్రకృతి రాజసం వెల్లడి అవుతుంది.”

“మంచుముసుగు వేసుకుని అవకుంఠిత శిరస్క అయిన కులీన స్త్రీ కిమల్లే కించిద్వినమ్రభావం వెలారుస్తూ ఓ పర్వత శిఖరం…”

” వెండిరేకు నొకదాన్ని భూమి ఉపరితలాన మిక్కిలి నేర్పుగా తాపడం చేసినట్లున్న ఆసరస్సు నిస్తరంగంగా ,స్తబ్దంగా శోభిస్తోంది. ఆకాశం మీద విచ్చలవిడిగా పరచుకున్న మబ్బుముక్కలు నీలివీ,తెల్లవీ ఆ నీళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి.వెండి రేకు మీద నీలాలూ,ముత్యాలూ పొదిగినట్లు అందాలు చిందిస్తుంది సరస్సు……”

” సగం నీటిలో మునిగి సగం తేలుతూ ,నీటి ఒరిపిడికి నున్నబడి మెరుస్తూ పరమేశ్వరుడు ఉదారంగా వెదజల్లిన మరకతమణుల్లా ఉన్నాయి రాళ్ళు.మెలికలు తిరుగుతూ,నురుగులు కక్కుతూ,అడ్డుబడ్డ ప్రతిశిలా ఖండాన్ని కసిగాట్లు కరుస్తూ పగబట్టిన గోధుమ వన్నె త్రాచులా భాసిస్తుంది ఏరు….”

ఈ పుస్తకం లో కాశ్మీర్ పరిసరాల్లోని చిన్న నదుల కధలు ,స్థల పురాణాల ప్రస్తావన ఉంది.వాట్ల్లో నాకు బాగా గుర్తుండిపోయిన కధ అమర్నాధ్ కు వెళ్ళే దారిలో ఉన్న “నీలగంగ” అనే వాగు గురించిన అందమైన కధ. పార్వతీ దేవి తన ఆకర్ణాంత విశాలనేత్రాలకు మరింతగా కాటుక దిద్దు కోగా ఆమె నయన సౌందర్యానికి,అనంత విలాసానికి ముగ్ధుడైన పర మేశ్వరుడు ఆమె కన్నులను చుంబించినపుడు , ఆయన పెదవులకు అంటిన కాటుకను ప్రక్కన వున్న సెలయేటిలో కడిగితే, ఆ నీరు నీలంగా మారి ఆ సెలయేటికి “నీలగంగ” అని పేరు వచ్చిందన్న మనోహరమైన కధ .మనదేశంలో మౌఖికంగా ఉన్న పిట్టకధలలో కూడా ఎంతటి రసస్ఫోరకమైన ఊహ, దానిచుట్టూ అల్లిన అందమైన కధనం ఉన్నాయా అని ఆశ్చర్యం , ఆనందం కలుగుతుంది!

అందమైన వర్ణనలతో పాటు గుల్మార్గ్,నిషాత్బాగ్,దాల్ లేక్,చార్చినార్,చష్మైషాహీ,పెహల్గావ్, వంటి వారి ప్రయాణపు ప్రతి మజిలీ లోని విశేషాలు,కొద్దిగా కాశ్మీర్ చరిత్ర, ప్రజల జీవన విధానం,నీల గంగ,పంచ తరణి,లిడ్డెర్ మొదలైన వాటి గురించిన స్థల పురాణాలు , విద్యార్ధుల అల్లరిపనులు,ఉల్లాసం,కోపతాపాల తో సహా ఎవరో దగ్గరబంధువు మనప్రక్కనకూర్చుని యాత్రావిశేషాలను ఉత్సాహంగా పూసగుచ్చి చెబుతున్నట్లు ఈ పుస్తకం సాగుతుంది. ఇంకా చెప్పాలంటే రచయిత్రి తన ఆలోచనలను,అనుభవాలను నమోదు చేసుకున్న పర్సనల్ డైరీలా అనిపిస్తుంది.

(ఈ పుస్తకం ప్రచురణా కాలం 1978.)

Kashmira Deepa Kalika – Nayani Krishnakumari

You Might Also Like

21 Comments

  1. Rohita

    I got pdf. Books print cheyyadam maanesaatu. Very sad.

    1. Swarup Kumar

      Hi,
      Can you please send the pdf or respective link of the book.

    2. Sindhu

      Please share the pdf

    3. Sunita

      If possible please share pdf link

  2. Sunitha bhupathiraju

    I was searching for this book since years.. Could you please help me out where it is available.. Kashmiri deepakalika

    1. Durga sri

      నేను 9త్ క్లాస్ లో ఉన్నప్పుడు కాశ్మీర దర్శనం అనే లెసన్ ఉండేది. కాశ్మీర దీపకళిక ఎక్కడ దొరుకుతుంది. ఎవరికైనా తెలిస్తే చెప్పండి దయచేసి

  3. yugandhar

    challa bavundi

  4. Sudha

    ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో తెలియచేయండి

  5. Narasimha Murthy

    ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో దయచేసి చెప్పవలసిందిగా కోరుచున్నాను.
    ధన్యవాదములు.

  6. Vaidehi Sasidhar

    “కాశ్మీరదీపకళిక “పై అభిప్రాయం తెలిపిన సాహితీ మిత్రులందరికీ కృతజ్ఞతలు.

    బుడుగోయ్ గారూ, “సుంత” అన్న పదం రామదాసు కీర్తనల్లో, చాలా పద్యాల్లోకూడా కనిపిస్తుంది. మా ఇంట్లో చిన్నప్పుడు విన్న “రామాంజనేయ యుద్ధం” రికార్డు లో ఒక పద్యం లో “సుంతయు అపచారమొనర్చెడు యూహ కాదె …” అని విన్న గుర్తు. కొంచెం,కాస్త,కించిత్తు అన్న అర్ధం లో వాడతారు.మా పలనాడు,గుంటూరులో కాసింత/కూసింత గా కూడా వాడతారు.ఈ పదాలకు ,”సుంత” కు సంబంధం ఉన్నదేమో స్పష్టంగా తెలియదు. అయితే నాకు తెలిసినంతవరకు “సుంత ” పదం మాండలికం కాదనే అనుకుంటున్నాను,విరివిగా పద్యాలలో వాడటం వల్ల.అయితే నాకు భాషాశాస్త్రం ఏ మాత్రం తెలియకపోవటం కూడా పూర్తిగా నిజం 🙂
    రాఘవ్ గారూ, ఈ పుస్తకం ప్రియదర్శిని ప్రచురణలు (ph:040-666688677) వద్ద దొరకవచ్చు,పిడిఎఫ్ గురించి తెలియదు.
    ఆవుల సాంబశివరావుగారి పురస్కారం సందర్భంగా కృష్ణకుమారిగారికి శుభాభినందనలు

  7. మాలతి

    వైదేహీ, నేనూ చదివేను ఈపుస్తకం. చాలావిషయాలు దాటేసినట్టున్నాను. మళ్లీ చదవాలి. నాయని కృష్ణకుమారిగారికి ఆవుల సాంబశివరావుపురస్కారప్రదానం జరుగుతున్న శుభసందర్భంలో నాశుభాకాంక్షలు.

  8. శ్రీనిక

    వ్యాసం చాలా బాగుంది.
    ఒక ట్రావెలాగ్ లో రచయిత్రి ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చారిత్రక ప్రదేశాలు లేదా కట్టడాల వర్ణనలో సాధారణంగా విషయ ప్రాధాన్యతే ఉంటుంది. ఈ పుస్తకాన్ని చదివితే ఆ అభిప్రాయం తప్పనిపిస్తుంది.
    మంచి వ్యాసాన్ని అందించినందకు చాలా ధన్యవాదములు.

  9. మెహెర్

    బాగుంది. ఈ పుస్తకంలోంచి తీసిన భాగమే మా తొమ్మిదో తరగతి వాచకంలో “కాశ్మీరు యాత్ర” పేరుతో పాఠంగా వుండేది.

    1. BHAKSAR

      భాస్కర్
      తొమ్మిదో తరగతి కాదు 10వ తరగతి చివరి పాఠం .

    2. Ajay

      Idi 7th class gadyabagamloni modati patyabagam

  10. lachhimi

    aaa kaashmeeradarsanm lo
    oka chota Burda neellani iraaani chaayi to polustaaru aame polikalu bhale untaayiii

  11. సుబ్రహ్మణ్యం మూలా

    చక్కని వ్యాసం. కోట్ చేసిన వాక్యాలు చాలా కవితాత్మకంగా ఉన్నాయి.

  12. Vadapalli SeshatalpaSayee

    నాయని కృష్ణకుమారిగారికి ఆవుల సాంబశివరావుగారి పేరిట నొలకొల్పబడిన పురస్కార ప్రదానము ఈరోజు జరుగుతోంది.
    (31-మార్చి-2010 సాయంత్రం 6 గంటలకు – తెలుగు విశ్వవిద్యాలయము, పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాదు)

  13. raghav

    మాకు 7 వ తరగతి లో కాశ్మీర దర్శనం అనే పాఠం ఈ పుస్తకం లోనుండి సంగ్రహించినదే, మొదటిసారి నేను చదివిన ఒక ట్రావెలోగ్ కుడా ఇదేనేమో పిడియఫ్ రూపంలో ఈ పుస్తకం దొరికే అవకాశం ఉందా?? ఎవరైనా చెప్పగలరు

    -Raghav

    1. Durga sri

      Naku kavali andi miru anna book

  14. budugoy

    చక్కని వ్యాసం. చదివాక పుస్తకం చదవాలన్న ఆసక్తి కలుగుతుంది. బహుశా ఈ పుస్తకంలోనిదే కావొచ్చు. ఒక వ్యాసం మాకు తొమ్మిదో తరగతిలో పాఠంగా ఉండేది.
    ఒక అకడెమిక్ ప్రశ్న..”సుంత” అన్న పద ప్రయోగం రామదాసుకీర్తనల్లో విన్న తరువాత మళ్ళీ మీ వ్యాసంలో చదివాను. ఇది ఏ ప్రాంతపు యాస?

Leave a Reply