చిరంజీవులు-అనుపల్లవి : నండూరి రామమోహనరావు సంపాదకీయాలు

నండూరి రామమోహనరావు గారి రచనలతో నా పరిచయమల్లా – ’నరావతారం’ పుస్తకంతోనే. ఆపై, ’విశ్వరూపం’ గురించీ, ఆయన తత్వశాస్త్రం గురించీ – రాసిన పుస్తకాల గురించి చదివినా, ఆ పుస్తకాలు చదవలేదు. అలాగే, పిల్లల నవల అనువాదాలు – కొన్ని చదివాను. వీటివల్ల ఇప్పటికే ఆయన విషయ పరిజ్ఞానానికీ, ఆయన దాన్ని అర్థమయ్యేలా వివరించే విధానానికీ అభిమానిని. ఇప్పుడు ’చిరంజీవులు’ డీఎల్లై లో దొరికినందువల్ల – చదవగలిగాను. అదేకోవలో ’అనుపల్లవి’ కూడా డీఎల్లై ద్వారానే చదివాను – ఈరెండు ఆంధ్రజ్యోతిలో వచ్చిన సంపాదకీయ వ్యాసాల సంకలనాలు. మొదటిది వివిధ సందర్భాల్లో వివిధ గొప్ప వ్యక్తులపై వచ్చిన సంకలనం. రెండవది – భిన్న సాంఘిక, రాజకీయాంశాలపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన లఘుసంపాదకీయాలు. ఈరెంటితోనూ నా పఠనానుభవాలను పంచుకోవడం ఈ వ్యాసం లక్ష్యం.

“అయితే సాధారణ వ్యాసాలకు, దినపత్రిక సంపాదకీయాలకు తేడా ఉంది. ’మూడు దశాబ్దాలు’ పేరుతో వెలువడిన తన సంపాదకీయ సంకలనం పీఠికలో శ్రీనార్ల రాసినట్లు – “అప్పుడె వండి, వార్చి వడ్డించిన అన్నం వంటిది దినపత్రికలోని సంపాదకీయం” బాగా వ్రాస్తే అప్పటికప్పుడు రుచిగా ఉన్నా, తరుచుగా అది ’మర్నాటి పొద్దుటికి చద్దివాసన కొడుతుంది”.

“Journalism is literature in hurry”

-రెండు పుస్తకాల్లోనూ ముందుమాటల్లో తారసపడ్డ వాక్యాలివి. కానీ, ఈవ్యాసాలన్నీ చద్ది వాసన కొట్టలేదు. తరవాణి బాగుంటుందంటారు కదా (నాకు రుచి తెలీదు) – అలాగే ఇదీనూ.

చిరంజీవులు:

’చిరంజీవులు’ లో చాలా భిన్నమైన రంగాలలోని ఎందర్నో వ్యక్తులను గురించి ఒకే వ్యక్తి సంపాదకీయాలను రాసాడని తెలిసి, ఒక పక్క ఆయన విషయ పరిజ్ఞానానికి అబ్బుర పడ్డాను. మరోవైపు, చాలా కొత్త సంగతులు కూడా తెలిశాయి. షొలొకోవ్-అర్నాల్డ్ టాయిన్‍వీ-గాలిబ్-ఐజెన్ హోవర్-సోమర్సెట్ మామ్-వివేకానంద – జూల్స్ వెర్న్-జనరల్ డిగోల్ – మాడపాటి హనుమంతరావు-డి సికా-బూర్గుల రామకృష్ణారావు-రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ – ఆలూరి బైరాగి – ఇలా ఎందరో భిన్నవ్యక్తుల గురించి చిన్న పరిచయాలు రాసారు. గాంధీ – అంటే వీరికి ప్రత్యేకాభిమానం ఉన్నట్లు తోస్తుంది. ఆయనపై ఎన్నో సంపాదకీయాలు రాసారు. ఈ పుస్తకం నా కంటబడకపోయి ఉంటే –

బందా కనకలింగేశ్వరావు – అన్న ప్రముఖ నటుడు ఉండేవారని
ఒకానొకప్పుడు పాకిస్తాన్ లో ’రబీంద్ర సంగీత్’ నిషేధించారని
షేక్స్పియర్, అలెగ్జాండర్ డ్యూమా రచనల ఆధారంగా తీసిన చిత్రాలను చైనాలో నిషేధించారని
బెంగాలీ రచయిత – బుద్ధదేవబోసు రచించిన ’రాత్ బోరే బృష్టి” అన్న నవల అశ్లీలమైనదని ఇటీవల కలకత్తాలో అడిశనల్ చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ నిర్ణయించి, రచయితలు రెండువందల రూపాయల జరిమానా, లేకపోతె ఒక నెల జైలు శిక్ష విధించారని
ఒకప్పుడు కొన్ని ప్రబంధాలను ముద్రించినందుకు వావిళ్లవారిపై కేసు పెట్టడం జరిగిందని
బెంగాలీ నుంచి శరత్ నవలలను అనువదించిన తొలితరం రచయితల్లో వేలూరి శివరామశాస్త్రి ఒకరని
బెంగళూరులో ఎప్పుడూ చూసే టి.చౌడయ్య హాలు వెనుక ఉన్న చౌడయ్య గొప్ప వయొలిన్ విద్వాంసులని
-ఇలాంటి రకరకాల విషయాలు తెలిసేవే కాదు.

అలాగే, అక్కడక్కడా నండూరి గారు సమకాలీన రాజకీయ నాయకుల పై రాసినపుడు – వ్యక్తపరచిన అభిప్రాయాలు కూడా ఎన్నదగ్గవి. ఉదాహరణకి – పారిశ్రామికీకరణకీ,గాంధీ స్వయం ఉపాధి మార్గాలకు మధ్య ఉన్న ఫ్రిక్షన్ గురించి ఆయన అన్న మాటలు – ఇటువంటివి నాకు చాలా నిష్పక్షపాతంగా ఉన్నట్లు అనిపించాయి.

అనుపల్లవి:

’చిరంజీవులు’ తో పోలిస్తే, ఇందులో వైవిధ్యం చాలా ఎక్కువ. ఎందుకంటే, ఇవి అప్పటి వార్తా విశేషాల ఆధారంగా రాసిన లఘు సంపాదకీయాలు కనుక. ’చిరంజీవులు’లో అంత గమనించలేదు కానీ, ఈ వ్యాసాల్లో మాత్రం నండూరి గారి హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ – రుచి చూడగలిగాను. ఆపరంగా – ఈపుస్తకం చదువుతూంటే సమయం తెలీలేదు. సింగిల్ సిట్టింగ్ లోనే అవగొట్టేశాను -కంప్యూటర్లో చూస్తూ చదివినా కూడా. హాస్యంతో పాటే, సామాజిక స్పృహా, ఎంటర్టైన్మెంట్ – ఇలా అన్ని రుచులూ కలిసిన వ్యాసాలివి. ఇవి చదువుతూ ఉంటే – ఆసక్తికరమైన వార్తాకథనాలే కాదు, ఒకట్రెండు సామెతలు కూడా (ఉదా: “ఆడది అబద్దం ఆడితే గోడ కట్టినట్లు, మగాడు అబద్ధమాడితే తడిక పెట్టినట్లు”, “నవ్వని వాడిని నమ్మరాదు” మొదలైనవి) తెలిసాయి. 1968లోనే ఎల్ ఐ సీ – కంప్యూటరీకరించాలని ఆలోచించారని – ఇప్పుడే తెలిసింది.

ఇందులోంచి కొన్ని వాక్యాలు –
…”ఏమైనా అంధ్రప్రదేశ్ శాసనసభను అందమైన స్త్రీ వదనంగానూ ఇటీవల శాసనసభ ప్రారంభమైన మొదటిరోజునే మొదటిసారిగా దాన్ని వాయిదా వేయవలసి రావడం ఆ స్త్రీ ముఖంపై చుక్కగానూ వర్ణించడం సభాపతి శ్రీ వి.వి.సుబ్బారెడ్డి గారి కవితా హృదయానికే చెల్లింది.”

“బ్రిటీషువారిని మన దేశం నుండి సాగనంపడానికి గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహ పద్ధతి ఒక రకమైన చిట్కా వైద్యమే కదా? అయితే, పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రమన్నట్లు ప్రతి సందర్భానికీ అదే చిట్కా ఉపయోగించకూడదనుకోండి..”

“అవతలివాడు మనగురించి ఏమనుకుంటున్నాడో నిర్ధారణగా తెలియకపోబట్టిగానీ, తెలిస్తే ఇక మానవజీవితంలో ప్రశాంతి అనేదానికి తావుంటుందా?”

“ఎందరో మహానుభావులుంటారు మరి. వీరందరికీ వందనం చేయడం కూడా కష్టం”

“కాంగ్రెసు వాదులలో ఎన్ని సుగుణాలైనా ఉండవచ్చు కానీ, మితభాషిత్వం మాత్రం వాటిలో ఒకటి కాదు.”

“కనుక ఇనప్పెట్టెలకు కాపుగా సారా ఉంచితే దొంగతనాలు తగ్గిపోవచ్చు. అప్పుడది అక్షరాలా కాపుసారా కాగలదు.”

“మొరిగే కుక్క కరవదని సామెత. కానీ, ఈ సామెత తెలిస్తే కదా మొరిగే కుక్క కరవకుండా పోయేది?”

“అయినా మితిమీరిన జ్ఞాపకశక్తి ఉండటం కూడా అంత మంచిది కాదేమో! జీవితంలో మరిచిపోదగిన సంఘటనలు చాలా ఉంటాయి. ముఖ్యంగా మనస్సును రంపపుకోత కోసే కొన్ని జ్ఞాపకాలు జీవితాంతం మనల్ని వెంటాడే స్థితి దుర్భరమైనది. ”

“ఏమైనా విజయవాడ ప్రజలు అల్పసంతోషులు. ఎక్కడికక్కడికే వారు సరిపుచ్చుకోగలరు. 115 డిగ్రీల ఎండ వచ్చిన నాడు 117 డిగ్రీలు రానందుకు, 117 వచ్చిన నాడు 120 రానందుకు సంతోషిస్తారు.

“మంత్రులు పర్యటనకు బయలుదేరితే రోజుకు తేలికగా నాలుగైదు సభలలో మాట్లాడవలసి ఉంటుంది. ఎన్ని సభలలో ఎన్ని కొత్త విషయాలని మాట్లాడగలరు?”

“రూపాయి నాణేల వల్ల మరొక ఉపయోగం కూడా ఉన్నది. జేబులో నాలుగు రూపాయి నాణేలను వేసుకున్నా, జేబు ’బరువు’గా ఉన్నదనే సంతృప్తి కొందరికి కలుగవచ్చు.

-మొత్తానికి రెండూ మంచి వ్యాసాల కూర్పు. మరీ సెరెబ్రల్ కాదు. అలాగని కాలక్షేపం బఠానీలూ కావు. నన్నడిగితే – తప్పక చదువమని చెబుతాను.

ఈ పుస్తకాల డీఎల్లై లంకెలు – ఇక్కడ మరియు ఇక్కడ.

Chiranjeevulu, Anupallavi : Nanduri Ramamohana Rao

You Might Also Like

5 Comments

  1. వ్యాఖ్యావళి – నండూరి రామమోహనరావు | పుస్తకం

    […] వాటి గురించి గతంలో రాసిన పరిచయం ఇక్కడ. ఈ పుస్తకంలోనిదే “బాలసాహిత్యం” […]

  2. పుస్తకం » Blog Archive » నండూరి రామ్మోహనరావు గారితో..

    […] పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం ఇదిగో. ఆయన గురించి, ఆయన రచనల గురించి మీరంతా […]

  3. పుస్తకం » Blog Archive » 2010 – నా పుస్తక పఠనం కథ

    […] పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం ఇక్కడ చదవొచ్చు) పెన్నాతీరం – ఈతకోట […]

  4. ram n.

    దిన పత్రికల్లోని సంపాదకీయాలు – మర్నాటి పొద్దుటికి చద్దివాసన కొడతాయి!!

    అనే మాటతో ఒకప్పుడు ఏకీభవించేవాణ్ణి..

    ప్రస్తుత కాలంలో సమర్ధించలేను.

  5. రవి

    ఇవి పుస్తక రూపంలో ఒకచోట చూశాను. కొందామంటే ఇప్పుడు దొరకట్లేదు. పోనీలెండి, ఇప్పుడు డీయెల్లై లంకె అందించారు.

Leave a Reply