తవ్వకం – సమీక్ష

రాసిన వారు: బొల్లోజు బాబా
***************

ఈ వ్యాసం “కవితా” మాస పత్రిక నవంబరు 2009 సంచికలో ప్రచురింపబడినది. ఆ పత్రికా సంపాదకులు శ్రీ విశ్వేశ్వరరావు గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను – బొల్లోజు బాబా

కవిత్వం జీవానికి సాక్ష్యం లాంటిది. జీవితం సవ్యంగా జ్వలిస్తూన్నపుడు, పేరుకొనే నివురే కవిత్వం. — లియొనార్డ్ కోహెన్

జీవితపు రణగొణధ్వనుల మధ్య జారిపోయే సున్నితానుభవాలను నేర్పుగా ఒడిసిపట్టుకోవటం – నడచి వచ్చేసిన మార్గంలోని రాలుపూల పరిమళాల్ని నెమరువేసుకొంటూ కలల మాలలల్లటం – మనిషితనం తగలకపోతుందా అంటూ లోలోపలికి తవ్వుకుంటూ పోయేతత్వం – కాస్త అమాయకత్వం, లోకం మీద ఇంత దయా తప్ప మరే అలంకారాలూ లేకపోవటం – స్వప్నాన్ని కమ్మిచ్చుగుండా సాగదీసి సాగదీసి బంగారు తీగలాంటి ఓ వాక్య చిత్రాన్ని నిర్మించటం – వంటివి శిఖామణి కవిత్వంలో మనకు అడుగడుగునా కనిపిస్తాయి.

జీవితానుభవాల్ని కవిత్వానుభవాలుగా మార్చటంలో శిఖామణి నేర్పరి. మానవీయత, తాత్వికతలను తన కవిత్వపు మిసమిసలుగా చేసి అందించిన ఆయన కొత్త సంకలనం పేరు “తవ్వకం”. దీనిలో మొత్తం 35 కవితలున్నాయి.

“దాదాపు ఇరవై సంవత్సరాల నగర జీవితం ఈ ఏకాంత గ్రామీణుని కాలిగోటిని కూడా కదిలించలేకపోయింది. ఇతని పునాదులు అనాదులు” అని శిఖామణి కవిత్వం గురించి, సౌభాగ్య గారన్న మాటలు అక్షర సత్యాలు. శిఖామణి కవిత్వం నిండా ఇప్పటికీ పల్లెటూరిలో గడిచిన తన బాల్యపు ఇమేజరీలు తళుక్కుమంటూంటాయి. “ముదురాకుపచ్చని కొబ్బరాకును సన్నగా పొడుగ్గా బూరలు చుట్టీ, చివర తుమ్మముల్లు గుచ్చీ” (స్వరమాంత్రికుడు), “పలక లాంతరు దీపం పైకప్పులో పేరుకొన్న వెలిగారం” (కనుపాప), “వర్షాకాలంలో మా పసి పాదాలకు మట్టిబూట్లు” (గుప్పెడు మట్టిని కలగంటున్నాను) వంటి పదచిత్రాలను నిర్మించటం మూలాలు మరువని కవికే సాధ్యమౌతుంది.

“గుప్పెడు మట్టిని కలగంటున్నాను” అన్న కవితలో నగరవాసంలో కనిపించకుండా పోతున్న మట్టిని కవి స్వప్నిస్తాడు. మట్టితో తన అనుబంధాన్ని నెమరువేసుకొంటాడు. ఈ కవితలో శిఖామణి భావుకతా శిఖరాగ్రాన్ని చూడవచ్చును.

“చిన్నప్పుడు పెరట్లో జామ చెట్టుకింద
కుంకుడు పులుసు తలంటు స్నానం తర్వాత
భూమిలోంచి విసవిసా బయటకొచ్చిన
వానపాముల నేలను కలగంటున్నాను”
– అనటం ఒక్క శిఖామణి మాత్రమే చేయగల ప్రయోగం.

జీవితంలో తారసపడే వ్యక్తులతో తన అనుభవాల్ని కవిత్వీకరించి, ఆ కవితను సార్వజనీనం చేయటం మామూలు విషయం కాదు, ఆ విధంగా శిఖామణి ఇదివరలో వ్రాసిన పూలబ్బాయి, ప్రమిదక్రింది చీకటి వంటి కవితలు చెప్పుకోదగ్గవి.

అలానే ఈ సంకలనంలో కూడా తమ ఆఫీసులో పనిచేసే అటెండరు బి. రామకృష్ణ, కవి మిత్రుడు ఆశారాజు కోసం, స్వరమాంత్రికుడు భిస్మిల్లా ఖాన్, పుట్టిన మూడునెలలకే చనిపోయిన కవిబంధువు కొడుకు గురించి, సంగీత సామ్రాజ్ఞి, ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి లపై వ్రాసిన కవితలు ఆ సందర్భాలను వెలిగింపచేస్తూంటాయి.

కనుపాప అన్న కవితలో నగరకూడలిలోని ఒక అంధ బిక్షుకి వర్ణన కరుణ రసార్ధ్రంగా ఉంటుంది. ఈ కవితలో –

“రోడ్డువార దోసిలిపట్టి నిల్చున్న ఆమె
పోటెత్తిన జనసముద్రం మధ్య నిలబడి
కన్నీటి అర్ఘ్యమిస్తున్నట్లే ఉంది”
— అని వర్ణించి, ఆమెను చూడగానే ఎక్కడ దానం చేయాల్సివస్తుందో అని

“మొహం తిప్పేసుకొన్న మర్యాదస్తులకు
కాస్త కరుణ కలిగి బతకండర్రా అని ఆ దోసిలి
ఇంత దయను లోకం మీదకు ఒంపుతుంది”
అనేంతటి మానవతా వాది శిఖామణి.

కవి బంధువు యొక్క మూడునెలల పసిబిడ్డ చనిపోవటం మీద వ్రాసిన “నిదురించిన చిన్నిముద్దు” అన్న కవితలో

“ఈ చిన్నారి శిశువు కోసం తవ్విన గోతిని చూసి
వానలకు పైవర వరకు ఉబికొచ్చిన నూతి నీటిలా
దు:ఖం జీవితపు ఇంత పై పొరల్లోనే ఉంటుందనుకోలేదు”

-అన్న అత్యంత విషాదవాక్యాలతో సందర్భాన్ని కళ్లకు కడతాడు కవి. చిన్న పిల్లవానిని ఖననం చేయటానికి చిన్నగొయ్యి సరిపోయింది అన్న సూచనకూడా గుండెల్ని పిండే ఒక వాస్తవం.

బట్టలూ….. బంగారమూ…. అన్న కవితలో వెర్రితలలు వేస్తున్ననేటికాలపు వినిమయ సంస్కృతిని కవి ప్రశ్నించి, “ఇన్ని బయటవి కొనటానికి, ఎన్ని లోపలకు అమ్ముకొన్నామో” అంటూ అంతర్ బహిర్ లోకాల మధ్య సంఘర్షణను ఉత్త మామూలు మాటలలో చాలా లోతుగా ఆవిష్కరిస్తాడు.

ఇరవై ఏళ్లక్రితం వ్రాసిన “అంతరంగికుని ఉత్తరం” అన్న కవితలో పట్నవాసానికని భయంభయంగా బయలుదేరుతున్న ఓ పల్లెటూరి వ్యక్తి ని “అక్కడ ఆవు తలలు తగిలించుకొన్న పులులమధ్యకు, ఎందుకైనా మంచిదని వెళ్తూ వెళ్తూ ఓ పులి తలకాయ కూడా కొనుక్కేళ్లావా? లేదా” అంటూ హెచ్చరిస్తాడు. ఇపుడు ఈ సంకలనంలో “జీవితం జీవించటానికే” అన్న కవితలో –

“మనకు కావల్సిన వాడే
నమ్మకం బ్లేడుతో నొప్పీ గాయం తెలియకుండానే
మన చర్మాన్ని చాకచక్యంగా వొలిచేస్తూంటాడు
అయినా జీవితం జీవించటానికే”
—- అనటం ద్వారా జీవితం పట్ల, జీవన వైరుధ్యాలపట్లా, జీవితంలో మనకు ఎదురయ్యే ఎదురుదెబ్బలపట్ల కవి అలవర్చుకొన్న తాత్వికతను అర్ధం చేసుకోవచ్చు. మానవత్వం పై గొప్పగౌరవం, జీవితంపై ఆరాధనా ఈ కవితలో కనిపిస్తాయి.

ఊరెళ్లాలి, తవ్వకం అనే కవితలు శిఖామణిని ప్రాంతీయ పరిధుల నుంచీ, కుల బంధనాల నుంచీ విముక్తుడను చేసి ఒక విశ్వమానవునిగా నిలబెడతాయి.

“మానవ మహేతిహాసం” అన్న కవితలో

“మనిషి చీకటి దేహంలో
ప్రేమ దీపాన్ని వెలిగించాలి”
మానవ మహేతిహాసాన్ని గానం చెయ్యటమే
ఈ యుగ లక్షణం అని చాటి చెప్పాలి” అంటూన్న శిఖామణి, కరుణ, మానవత్వాలు అనే మణులను పొదుగుకొన్న దీపస్థంభంలా అగుపిస్తాడు.

“కవులేం చేసారు” అన్న కవితలో ఈ మానవజాతికి కవులు ఏమేం చేసారని వర్ణిస్తాడో వాటన్నింటినీ శిఖామణి అంతే నిబద్దతతో చేసారు, చేస్తున్నారు అనిపించక మానదు.
ఇంకా ఈ సంకలనంలో మట్టి బంధం, ఒక స్వప్నం అనే రెండు అనువాద కవితలు కూడా ఉన్నాయి. ఈ సంకలనానికి డా. వడలి మందేశ్వర రావు గారు ముందుమాట వ్రాసారు.
చక్కని, చిక్కని కవిత్వం ఇష్టపడేవారికి “తవ్వకం” తప్పక నచ్చుతుంది.

కవి చిరునామా:
ప్రొఫసర్ & డైరక్టర్ ఇంచార్జ్
తులనాత్మక అధ్యయన కేంద్రం
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ
హైదరాబాద్.
ఇ.మెయిల్: poetsikhamani@gmail.com
కాపీల కొరకు : విశాలాంద్ర అన్ని బ్రాంచీలలో, నవోదయా బుక్ హౌస్, హైదరాబాద్
వెల: 75 రూపాయిలు
(Sikhamani – Tavvakam)

You Might Also Like

One Comment

  1. రామ

    చాలా బాగుంది. కొన్ని సార్లు కవితలని చదవడమే కాకుండా, వాటి గురించి మీవంటి వారు చర్చిస్తూ ఉంటె వినడం కూడా బాగుంటుంది.

Leave a Reply