రెబెకా హార్డింగ్ డేవిస్ చరిత్ర్యాత్మక రచన “లైఫ్ ఇన్ ది ఐరన్ మిల్స్”

రాసిన వారు: నిడదవోలు మాలతి
**********************************
Rebecca Harding Davis (1831-1910) సమాజంలో స్త్రీల స్థితిగతులూ, మిల్లుకూలీలూ, బానిసలజీవితాలని ప్రతిభావంతంగా చిత్రించి మానవతావాదిగా గణుతికెక్కిన తొలి అమెరికన్ రచయిత్రి.

నాకు గుర్తున్నంతలో నేను రెండోసారి చదివిన ఇంగ్లీషు కథ “Life in the Iron Mills” ఒక్కటే. నేను 80వ దశకంలో తెలుగురచయిత్రుల గురించి రాయడానికి పూనుకున్నప్పుడు, అమెరికన్ రచయిత్రుల చరిత్ర ఎలా మొదలయిందో తెలుసుకోడానికి చదువుతున్నప్పుడు ఈకథ తొలిసారి చదివేను. ఇప్పుడు మళ్లీ టిల్లీ ఓల్సన్ రచయిత్రి రెబెకా హార్డింగ్ జీవితాన్ని విశ్లేషిస్తూ సుదీర్ఘంగా రాసి ప్రచురించిన పుస్తకం చూడడం తటస్థించింది. కథ మళ్లీ చదివేను. అందుకు కారణాలు రెండు. మొదటిది రెబెకా హార్ఢింగ్ భాషాపాటవం. ఈమె రచనలో భావుకత వుంది. స్ఫూర్తి వుంది. సూక్ష్మ పరిశీలనాదృష్టి వుంది. మేటికవులలో గోచరమయే ఆవేదన వుంది. అన్నిటికీ మించి తాను సాధారణమైన స్త్రీ మాత్రమేనన్న వినయం వుంది.

లైఫ్ ఇన్ ద ఐరన్ మిల్స్ కథతో రెబెకా హార్డింగ్ అమెరికన్ కథాసాహిత్యాన్ని రొమాంటిజమ్, సెంటిమెంటల్ కథలనుండి వాస్తవికతవైపుకి మళ్లించిన రచయిత్రిగా గుర్తింపబడింది. స్త్రీలు సామాజిక అవగాహనతో కథలూ, నవలలూ రాయగలరని నిరూపించిన తొలి అమెరికన్ రచయిత్రి రెబెకా హార్డింగ్.

రెబెకా హార్డింగ్ రచనలనీ, జీవితాన్నీ సూక్ష్మదృష్టితో నిశితంగా పరిశీలించి ఎంతో విపులంగా చర్చించిన టిల్లీ ఓల్సన్ ఈకథని కనుగొన్నవిధానం కూడా చెప్పుకోదగ్గ కథే. మొదట రెబెకా హార్డింగ్ డేవిస్ జీవితంగురించి చెబుతాను.

రెబెకా వాషింగ్టన్, పెన్సిల్వేనియాలో 1830లో రిచర్డ్, రేచల్ హార్డింగ్ దపంతులకు జన్మించింది. అయిదుగురు పిల్లల్లో తొలిసంతానం. తండ్రి ఐర్లండ్‌నించి వలస వచ్చినవాడు. వ్యాపారదక్షుడు. సంపన్నుడు. అమెరికాలో అప్పుడే మొదలయి అభివృద్ధి చెందుతున్న వాణిజ్యం, మెషీన్ సంస్కృతులు ఆయనకి నచ్చక “వల్గర్ అమెరికా” అని తిట్టి, వాటికి దూరంగా జీవితం మొదలుపెట్టేడుట చివరిదశలో. ఆయనకి ఇంగ్లీషు సాహిత్యం మాత్రమే సాహిత్యం. అతని సాహిత్యపఠనం షేక్స్పియర్‌వరకే. రెబెకా తల్లి మర్యాదలూ మన్ననలూ ఎరిగిన ఉత్తమురాలు (genteel woman). రెబెకాకి ఐయిదేళ్లవయసులో వెస్ట్ వర్జీనియాలో వీలింగ్‌కి మారేరు వాళ్లు. వీలింగ్ ఒక ఉక్కు కర్మాగారంచుట్టూ అల్లుకున్న చిన్న వూరు.

రెబెకాచదువు చిన్నతనంలో తల్లిదగ్గరా, తరవాత తమ్ముళ్లకోసం పెట్టిన ట్యూటర్ల ద్వారాను సాగింది. పధ్నాలుగేళ్లు వచ్చేక, వాషింగ్టన్‌లో స్త్రీల సెమినరీకి పంపించారు. ఆకాలేజీలో పాఠ్యాంశాలు స్త్రీలని స్త్రీలుగా తీర్చిదిద్దడానికే గానీ మానసికంగా ఎదగడానికి గానీ జ్ఞానసముపార్జనకి గాని పనికొచ్చేవి కావు. ఆవిడ క్లాసులో వెలడిక్టేరియన్. డిగ్రీ పుచ్చుకుని కాలేజీ వదిలేనాటికి ఆమె వయసు పదిహేడు.

తల్లి పెంపకంలో చిన్నతనంలో హారియెట్ బీచర్ స్టౌ, మేరీ కమిన్స్ రచనలమూలంగా ప్రభావితురాలయింది. తరవాతికాలంలో, జేమ్స్ టి. ఫీల్డ్స్, నథానియల్ హాథార్న్, ఎమర్సన్, ఆల్కాట్ వంటి ప్రముఖరచయితల మన్ననలూ, స్నేహమూ పొందింది.

సంపన్నులే అయినా, దాసీలు వున్నా, ఇంకా ఇంట్లో చెయ్యవలసినపనులు చాలా వుండేవి. తండ్రి రిచర్డ్ హార్డింగ్‌కి అభిజాత్యం. యజమానిగా తన ఆధిపత్యానికి ఇంట్లో అందరూ తల ఒగ్గాలి. భార్య రేచెల్, పెద్దకూతురు రెబెకా చివరివరకూ ఆయనకి అలా జరిపించేరు. రెబెకా హార్డింగ్‌కి చిన్నప్పటినుండీ జీవితాన్నిగురించి అనేకప్రశ్నలు. తనప్రశ్నలకి సమాధానాలు కాలేజీ పుస్తకాల్లో లేవు. తల్లి తనచేత చదివించిన మూడు మోరల్ స్టోరీస్ ఆమెని ప్రభావితం చేసిన మొదటి కథలు. అవి హాథార్న్ రాసేడని అప్పట్లో తెలీదు. ఆతరవాత లెమోయన్ తండ్రితో చర్చించినవిషయాలు వింటూ అమెరికన్ సమాజంలో గల అసమానతలూ, బానిసబతుకులగురించి తెలుసుకుంది.

ఇంటి పనులూ, తండ్రి సేవలూ ముగించుకుని, కిటికీలోంచి చూస్తూనూ, సాయంత్రాలూ షికారుగా నడుస్తూనూ బయటి ప్రపంచంలో జీవితాల గురించిన తాత్త్వికచింతనతో చాలా మధనపడింది అంటుంది టిల్లీ ఓల్సన్. వీథుల్లో వచ్చే పోయే ఉక్కు కార్ఖానా కూలీలని గమనించీ, సాయంత్రాలు షికారు‌ వెళ్తూ వాళ్లమాటలు వినిపించినంతవరకూ వినీ, ఆపైన తనమేథతో ఊహించుకునీ అత్యంత వాస్తవికంగా కథలు అల్లిన ద్రష్ట ఆమె. (ఇక్కడ మనం చెప్పుకునే నానృషిః కురుతే కావ్యం అన్న నానుడి వర్తిస్తుందేమో). వాస్తవిక రచన అంటే వున్నదున్నట్టు, చూసింది చూసినట్టు రాయడం కాదు. ఒకవిధమైన అంతర్దృష్టి (Vision) కావాలి. ఇది అందరికీ సాధ్యం కాదు. రెబెకాకి వుంది కనకనే తనకి ప్రత్యక్షంగా పరిచయం లేని కూలీల బతుకులూ, భాషా కూడా అమె అంకించుకుని అంత ప్రతిభావంతంగా ఆవిష్కరించగలిగింది అంటుంది టిల్లీ ఓల్సన్.

రెబెకా హార్డింగ్ తన తొలి కథ లైఫ్ ఇన్ ద ఐరన్ మిల్స్ రాసి ప్రచురణకి పంపేనాటికి ఆమెవయసు ముఫ్పైఒకటి. తనకథ మామూలుగా అన్ని పత్రికలూ ప్రచురించే సెంటిమెంటల్ కథలకంటే భిన్నమయినది. అట్లాంటిక్ మంత్లీ ఒక్కటే అటువంటి అసాధారణమయిన కథని ప్రచురించగలదు. కానీ ఆపత్రిక అంత తేలిగ్గా వేటినీ అంగీకరించదు – ఇలాటి ఆలోచనలతో సతమతమవుతూనే వారికి పంపింది రెబెకా హార్డింగ్ తనకథ, వారిదగ్గరినుండి కవరు వచ్చింది. ఆవిడ ఆ ఉత్తరం తీసుకుని, వాక్‌కి బయల్దేరింది. అది తప్పనిసరిగా తిరస్కారమే అయివుంటుందని ఓపూటంతా కవరు విప్పి చూడలేదుట!

అట్లాంటిక్ మంత్లీ సంపాదకుడు జేమ్స్ టి. ఫీల్డ్స్ ఆ కథని మెచ్చుకుని, తప్పకుండా వేసుకుంటామనీ, అయితే, చిన్న సలహా, కథ పేరు మార్చమనీ రాసేడు. రెబెకా హార్డింగ్ కథ పేరు తను పెట్టిందే తనకి చాలా నచ్చిందనీ, కావలిస్తే క్రోల్ వుమన్ అని మార్చవచ్చనీ జవాబిచ్చింది. క్రోల్ అన్నది ఉక్కుకర్మాగారంలో స్టీలు తయారీలో మిగిలే పిప్పి–బంకమట్టిలాటి ముడిపదార్థం. కథలో ప్రధానపాత్ర హ్యూ వుల్ఫ్ విరామసమయాల్లో ఆ క్రోల్‌తో బొమ్మలు చేస్తూంటాడు. అతను చేసిన ఒక స్త్రీ బొమ్మ యజమాని స్నేహితులదృష్టినాకర్షించడం కథలో ఒక ముఖ్యమయిన అంశం. అదీ ఆసూచనకి కారణం.

జేమ్స్ ఫీల్డ్స్ మొదటిశీర్షికనే అంగీకరించి, యాభై డాలర్లు పారితోషికం కూడా పంపుతూ, ప్రతినెలా నెలకొకటి చొప్పున రాయమనీ, కథకి వంద డాలర్లు చొప్పున ఇస్తామనీ రాసాడు. ఆరోజుల్లో పత్రికలు రచయితలపేర్లు ప్రచురించేవి కావు. రెబెకా హార్డింగ్ కథని చాలామంది మగవాడు రాసిన కథ అనే అనుకున్నారు చాలాకాలం.

రచయిత్రి ఈకథలో ఒక మిల్లు కూలీ, హ్యూ వుల్ఫ్ జీవితాన్ని చిత్రిస్తూ, ఆనాటి మిల్లుకూలీల జీవితాలు–ఆడా, మగా కూడా–ఎంత దుర్భరమయినవో చూపిస్తుంది. అంతేకాదు. వారిలో, ఉన్నతవర్గాల్లో వుండే తాత్త్విక చింతన–జీవితానికి అర్థం ఏమిటి, తమబతుకులు ఎందుకు ఇంత దుర్భరంగా వున్నాయి అన్న ఆందోళన కూడా ఎంత తీవ్రంగా వుంటుందో ఎత్తి చూపడం ఈకథలో రచయిత్రి సాధించిన ప్రతేకత.
ఆమె శైలి పాఠకులని బలంగా ఆకట్టుకోగలదని మొదట్లో చెప్పేను. ఆమె వాక్యాలు అనువదించడం కంటే, ఆమెభాషలోనే చూపడం న్యాయం అని ఇక్కడ నాలుగు వాక్యాలు ఇస్తున్నాను (ఇక్కడ భాష, punctuation, spelling యథాతథంగా ఇస్తున్నాను).

A cloudy day: do you know what is in a town of iron-works? The sky sank down before dawn, muddy, flat, immovable. The air is thick, clammy with the breath of crowded human beings. It stifles me, I open the window, and looking out, can scarcely see through the rain the grocer’s shop opposite, where a crowd of drunken Irishmen are puffing Lynchburg tobacco in their pipes …

– అంటూ మొదలవుతుంది నవల. కిటికీదగ్గర కూర్చుని వీధిలోకి చూస్తున్న రచయిత్రికి కార్ఘానాకి వెళ్తున్న కార్మికులు కనిపిస్తారు. వాళ్లు ఎలా వున్నారంటే –

When I was a child, I used to fancy a look of weary, dumb appeal upon the face of the negro-like river slavishly bearing its burden day after day. Some of the same idle notion comes to me to-day, when from the street-window I look on the slow stream of human life creeping feet, night and morning, to the great mills. Masses of men, with dull, besotted faces bent to the ground, sharpened here and there by pain or cunning, skin and muscle and flesh begrimed with smoke and ashes; stooping all nigh over boiling caldrons of metal, laired by day in dens of drunkenness and infamy, breathing from infancy to death an air saturated with for and grease and soot, vileness for soul and body. What do you make of a case like that, amateur psychologist?

పూర్తి కథ నెట్‌లో వుంది. లింకు ఇస్తున్నాను.

హ్యూవయసు పదిహేడు, పద్ధెనిమిది వుండొచ్చు (ఓల్సన్). కొలిమిలో కాలుతున్న ఉక్కుని ఎగదోయడం అతనిపని. మధ్యలో కూటికోసం ఇచ్చిన విరామసమయంలో క్రోల్‌ బొమ్మలు చేస్తుంటాడు. హ్యూకి కజిన్ డెబోరా (ఇంగ్లీషులో అనేక సంబంధాలకి ఈపదం వాడతారు కనక హ్యూకీ డెబొరాకీ మధ్య సంబంధం మనకి స్పష్టం కాదు).

అర్థరాత్రి డెబొరా హ్యూకి కూడు తెచ్చి, అతను తినేవరకూ ఆపక్కన ఓమూల పడుకుంటుంది. ఆ సమయంలో యజమానికొడుకు మరోముగ్గురిని తీసుకొస్తాడు కార్ఘానా చూపించడానికి. వారిలో ఒకరు హ్యూ క్రోల్‌తో చేసిన స్త్రీ బొమ్మ చూసి, మెచ్చుకుని ఉపన్యాసం ఇస్తాడు. సారాంశం – హ్యూదగ్గర మంచికళ వుంది. ఇలా కూలీలా పడివుండడంకంటే బయటికి వెళ్లి తనప్రతిభతో మంచి జీవితాన్ని దక్కించుకోవచ్చు. … మార్పు అన్నది పైతరగతివారి సొల్లు కబుర్లతో రాదు. కిందితరగతివారినుంచే రావాలి. బాధలు పడేవారే లేచి మార్పు తేగలరు. లోకంలో ఆస్తిమీద మిగతావారికెంత హక్కు వుందో హ్యూకి కూడా అంత హక్కూ వుంది. ఇది అతని కష్టార్జితం. ..

You Might Also Like

5 Comments

  1. సౌమ్య

    Nice article!
    Hope to see more such articles from you 🙂

  2. కొత్తపాళీ

    చాలా బావుంది మాలతిగారూ. ఒక అద్భుతమైన కథనీ రచయిత్రినీ పరిచయం చేశారు. మిగతా కళల్లో అమెరికన్ రినజాన్స్ 1890లలో మొదలీందని పండిత వాక్యం కానీ సాహిత్యంలో కొన్ని మౌలిక భావాలకి ఆద్యమైన రచనలో 19 వ శతాబ్దిలోనే విరివిగా వచ్చాయని నా అనుమానం.
    ఇప్పటికీ అట్లాంటిక్ మంత్లీ మంచి కథల్ని అందిస్తున్నది

  3. మాలతి

    కల్పనా, ఓపిగ్గా చదివి వ్యాఖ్య పెట్టినందుకు చాలా సంతోషం.
    ఇప్పటి కంటే రచయతలకు ఆ కాలంలోనే గౌరవ మర్యాదలు ఎక్కువగా వున్నట్లు అనిపిస్తోంది. – అవును, నాపాయింటు కూడా అదే. రెండు భిన్నసంస్కృతులలో సామ్యాలూ, వ్యత్యాసాలూ తెలుస్తాయనే ఇది రాసేను.
    రచయిత్రి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం విషయంలో మరొకసంగతి రాయడం మరిచాను. 1893లో న్యూయార్క్ ట్రిబ్యూన్ సంపాదకులు ఆమె వ్యాసంలో మార్పులు సూచిస్తే, అవి తనకి సమ్మతం కాదని, మొత్తం వుద్యోగానికే రాజీనామా ఇచ్చేసింది అని కూడా ఓల్సన్ రాసింది.
    ప్రపంచ ‘ మేధావులంతా’ ఒకేలా ఆలోచించి, ఒకేలా రాస్తారు కాబోలు. — ఇది కూడా అవును, ఎందుకంటే ఒకేమూసలోంచి వచ్చిన విమర్శనాధోరణులవల్ల. :))

    మాలతి

  4. kalpana

    మాలతి గారు,

    మీ వ్యాసం చదవటం మొదలుపెట్టి సగం పూర్తి చేసి ఈ కామెంట్ పెడుతున్నాను. నాకు చదవటానికే ఇంత సమయం పడుతుంటే మీకు రాయటానికి ఎంత సమయం పట్టిందో. రెబెకా హోర్డింగ్ రాసిన మంచి కథ “ లైఫ్ ఇన్ ది ఐరన్ మిల్స్” గురించి మాత్రమే కాకుండా రచయిత్రి జీవితం , అందులోని ముఖ్య సంఘటనలు గురించి కూడా చెప్పటం వల్ల వ్యాసానికి మంచి పట్టు వచ్చింది. అట్లాంటిక్ మంత్ లీ లాంటి ప్రసిధ్ధ పత్రిక తో కూడా రెబెకా తన మొదటి కథ కి పేరు పెట్టే విషయంలో తన నిర్ణయానికి కట్టుబడి వుండటం ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగించింది. తన కథ మీద తనకున్న ఆత్మవిశ్వాసం అలా చేయించివుండాలి. ఇప్పటి కంటే రచయతలకు ఆ కాలంలోనే గౌరవ మర్యాదలు ఎక్కువగా వున్నట్లు అనిపిస్తోంది. ఇక హాతోర్న్ వ్యాఖ్యలు తెలుగు రచయిత్రుల గురించి విమర్శకులు రాసిన వ్యాఖ్యలతో సమానం గా వున్నాయి. ప్రపంచ ‘ మేధావులంతా’ ఒకేలా ఆలోచించి, ఒకేలా రాస్తారు కాబోలు.

    కల్పనారెంటాల

  5. రచయితా, కథకుడూ « తెలుగు తూలిక

    […] ప్రముఖ రచయిత్రి. (ఈకథమీద నేను రాసిన పూర్తి వ్యాసం పుస్తకం.నెట్‌లో […]

Leave a Reply