బాపూ కార్టూన్లు – (ఒక్క కార్టూన్ సమీక్ష)

వ్యాసం రాసిపంపినవారు: అరిపిరాల సత్యప్రసాద్

(బాపుగారి పుట్టినరోజు (డిసెంబరు 15వ తారీఖు) నాడు మాకీ సమీక్షను పంపిన అరిపిరాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు)

కొంత కాలం క్రితం నా సాహితీ వ్యాసంగం కార్టూన్లతోనే మొదలుపెట్టాను. ఆ సంధర్భంలో ఒకానొక శుభదినాన “అసలు మంచి కార్టూన్ అంటే ఏమిటి?” అనే ప్రశ్న వుదయించింది. ఆ అనుమానం తీర్చుకోవడంకోసం కొన్ని పుస్తకాలు, కొంతమంది కార్టూనిష్టులను చదువుతుండగా బాపుగారి కార్టూన్ ఒకటి కనపడింది. “మీకోసం ఎవరొచ్చారో చెప్పుకోండి చూద్దాం” అనేదే ఆ కార్టూన్. ముందు నవ్వొచ్చింది. తరువాత ఇంకా నవ్వొచ్చింది. ఆ తరువాత నాకు జ్ఞానోదయం అయ్యింది. మంచి కార్టూన్ అంటే ఏమిటో తెలిసిపోయింది. ఇంక అక్కడినుంచి అలాంటి మంచి కార్టూన్ల కోసం ప్రతి పత్రికలో వెతికాను. బాపు గీసినవే మరి కొన్ని కనిపించాయి. అక్కడక్కడ మరికొందరు వేసినవి కనిపించినా ఎక్కువ శాతం బాపూవే “అసలైన” కార్టూన్లుగా గుర్తించాను. దాంతో నేను కార్టూన్లను వదిలిపెట్టి కథలలోకి దిగాను.

ఏమిటీ అసలైన కార్టూన్లు అనుకుంటున్నారా? ఇందాక చెప్పానుగా – “మీ కోసం ఎవరొచ్చారో చెప్పుకోండి చూద్దాం” ఇలాంటివే మంచి – అసలైన – కార్టూన్లు.

cartoon

ఈ కార్టూన్ వింటే మీకు నవ్వు రాలేదా? అందుకే అది అసలైన కార్టూన్ అంటున్నాను. అవును – చూస్తే తప్ప చదివితే నవ్వు రానిదే కార్టూన్. ఇది నా అభిప్రాయం, నమ్మకం కూడా.

పత్రికల్లో చాలా కథలు చదువుతుంటాము. దానికి తగ్గట్టుగా ఆ కథలోని పాత్రలను బొమ్మగా గీసి పక్కనే ఇస్తుంటారు. కథకు తగ్గట్టుగా బొమ్మ వెయ్యడం ఈ
ఆర్టిస్ట్ పని. అలాగే ఒక జోకు వుందనుకుందాం –

టీచర్: రామూ పాలిచ్చే జంతువులు అయిదు చెప్పు
రాము: ఆవు, గేదె, మూడు మేకలు టీచర్

ఇదీ జోకు. ఇదే జోకుని ఒక పత్రికలో వేసేటప్పుడు కొంచెం స్థలం మిగిలిందని ఒక ఆర్టిస్ట్‌ని బొమ్మ గీయమన్నారనుకోండి. అతను “దిమ్మ తిరిగి పోయిన ఒక టీచర్ బొమ్మో, ఒక ఆవు, ఒక గేదె, మూడు మేకల బొమ్మో” వెయ్యొచ్చు. ఇది ఇందాక నేను చెప్పినట్లు కథకి బొమ్మ వేసినట్లే జోకుకి బొమ్మ వెయ్యడం అన్నమాట. ఈ జోకు చదవగానే మీరు నవ్వొచ్చు. బొమ్మ వల్ల మరికొంచెం నవ్వు రావచ్చు. కానీ నవ్వు పుట్టేది టీచర్, రాముల సంభాషణలోనించే.

కార్టూన్ అలా కదు. బొమ్మ చూపించకుండా కేవలం సంభాషణ చెప్తే నవ్వు రాకూడదు. ఒక వేళా నవ్వు వస్తే దాన్ని కార్టూన్‌లా కంటే జోకుగా వేస్తే బాగుంటుంది. ఏ కార్టూన్‌కైనా ఇది పరీక్ష. బొమ్మ చూపించకుండా అందులో వున్న సంభాషణ ఎవరికైనా చదివి వినిపించండి. అవతలి వ్యక్తి నవ్వాడా? ఆ కార్టూనిస్ట్ వేసింది కార్టూన్ కాదు – జోకు, జోకుకి బొమ్మ అంతే.

***

bapu1ఇక మన పుస్తకంలోకి వద్దాం. ఈ రెండు సంపుటాలలో ఎన్నో కార్టూన్‌లు వున్నాయి (ఎన్నో లెక్కపెట్టలేదు). అక్కడక్కడ జోకులు – జోకులకి బొమ్మలు కూడా
వున్నాయి. అయితే అవి చాలా తక్కువ. అందువల్ల ఇది నిఖార్సైన కార్టూన్ల పుస్తకం.

ఇంతకీ ఇందాక నేను చెప్పిన కార్టూన్ వివరం చెప్పకపోతే మీకు కోపం రావచ్చు – సరే వినండి అయితే –

అది ఒక హాస్పిటల్. మంచం మీద ఒక మకరం (తెలుగులో చెప్పాలంటే క్రోకోడైల్) వుంది. దాని మెడకి పట్టీ వేసి వుంది. గుమ్మం దగ్గర ఒక ఏనుగు కాలు మాత్రం కనిపిస్తోంది. ఆ కాలికీ కట్టు కట్టి వుంది. డైలాగు చెప్తున్నదేమో ఒక నర్స్.. సిగ్గుతో మెలికలు తిరుగుతూ మకరితో “మీకోసం ఎవరొచ్చారో చెప్పుకోండి చూద్దాం” అంటోంది.

విజ్ఞులైన పాఠకులకి విషయం అర్థమయ్యే వుంటుంది. అర్థం కానివారు విజ్ఞులు కాదని కాదుగాని – నా తుత్తి కోసం వివరిస్తాను. గజేంద్ర మోక్షం తరువాతి
సీను ఇది. మకరి పట్టిన గజేంద్రుడు మొర పెట్టగా వచ్చిన శ్రీమహావిష్ణువు తన సుదర్శనంతో ముసలి గొంతు తుంచాడు. గాయపడ్డ ముసలి, గజేంద్రుణ్ణి ఎవరో
ధర్మాత్ములు హాస్పిటల్లో చేర్చారు. ఇది బాపుగారి కార్టూన్‌కి వెనక వున్న కథ.

అసలు ఇంత వివరంగా చెప్తే ఏ జోకైనా కార్టూన్ అయినా అభాసుపాలౌతుంది. అయినా తప్పట్లేదు.

కార్టూన్‌కి వెనక కథ ఇదైతే ముందు జరగబోయేది ఏమిటి? ముసలి నీటిలో బలవంతురాలు (బలవంతుడు?) ఏనుగు భూమి మీద బలం కలిగినది. నీటిలో దిగిన
గజేంద్రుణ్ణి తన స్థాన బలైమితో పట్టి పీడించింది ముసలి. ఇప్పుడు హాస్పిటల్లో ముసలి వుంది – నీళ్ళు లేవు. ఇక్కడ గజేంద్రుడు బలవంతుడు. కాబట్టే ముసలి ముఖంలో ఖంగారు, నర్స్ మాటల్లో సెటైరు.

ఇవీ ఆ కార్టూన్ పూర్వాపరాలు. ఇంత వివరంగా తెలిస్తే తప్ప ఆ కార్టూన్ అర్థంకాదు. అర్థం కాకూడదు కూడా. ఎందుకంటే అది కార్టూన్ – ఒక సన్నివేశం. ఆ ఒక్క సన్నివేశంలో నించి చూసే ప్రేక్షకుడికి (అవును అచ్చులో వున్నా ఇది దృశ్య ప్రధాన మాధ్యమం కాబట్టి ప్రేక్షకుడే అనాలి) ఒక కథ మొత్తం అర్థం అవ్వాలి. నవ్వు రావాలి. ఇది సాధించిన ఒక గొప్ఫ కార్టూనిస్ట్ మన బాపూగారు.

కొసరుగా మరో విషయం. బొమ్మలకి, దృశ్యాలకి బాష లేదు. కానీ చూడగానే ఇది తెలుగు బొమ్మ అనిపించడం వీటి ప్రత్యేకత. కార్టూన్‌లో సంధర్భం, భాష, మాట,
ఆ విరుపు, వ్యంగ్యం అంతా తెలుగువాడి సొంతమని చెప్పకనే చెప్తాయి. ఇందాక చెప్పిన కార్టూన్‌లో నర్స్ సిగ్గుపడటం చూసినా – గజేంద్ర మోక్షం గురించిన
కార్టూన్ అని తెలిసినా వెంటనే ఇది మన కార్టూన్ అనిపిస్తుంది. స్థాన బలిమిగాని తన బలిమి కాదయా అనే మన వేమన పద్యం గుర్తుకువస్తుంది.

***

ఒక్క కార్టూన్ గురించి సమీక్షించి పుస్తక సమీక్ష అంటాడేమిటి అనుకోవద్దు. స్థాలిపులాక న్యాయంగా – అన్నం వుడికిందో లేదో తెలియడానికి అన్ని మెతుకులూbapu2
మెదపాల్సిన పనిలేదు కదా? ఒక్క మెతుకు చాలు. ఈ కార్టూన్ గురించి చెప్పిన విషయాలు – క్యాప్షన్ వల్ల కాక బొమ్మ వల్లే నవ్వురావటం, బొమ్మను చూడగానే
ఇంతకు ముందు ఏమి జరిగిందో ముందు ఏం జరగబోతోందో అర్థమై నవ్వురావటం, ఇది తెలుగువాడి (లేదా తెలుగువాడి మీద) కార్టూన్ అనిపించడం వల్ల నవ్వు రావటం –
అనే ఈ మూడు వుత్తమ కార్టూన్ లక్షణాలు ఇందులో వున్న 90% కార్టూన్లకి వర్తిస్తాయి. ఇవి కాక – కార్ట్యూనులు, రేఖాచిత్రాలు, మరెన్నో సరదా బొమ్మలు అదనంగా లభిస్తాయి.

రెండు  సంపుటాలు కొని పెట్టుకొని – ఆఫీసులో బాసు తిట్టినప్పుడో, స్టాక్ మార్కెట్‌లో పుట్టి మునిగినప్పుడో, పెళ్ళాం అలిగినప్పుడో – సంతోషంగా వున్నప్పుడో, సరదాగా వున్నప్పుడో – అప్పుడో ఇప్పుడో ఎందుకూ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఎన్ని కావాలంటే అన్ని నవ్వులు తీసుకోని హాయిగా దాచుకోవచ్చు.

బాపూ కార్టూన్లు (రెండు సంపుటాలు)
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
ప్రథమ ముద్రణ: డిసెంబరు 2002
వెల: రూ. 130, విదేశాలలో $13 (ఒక సంపుటి)

You Might Also Like

6 Comments

  1. శ్రీ చరణ్

    బాపు గారి ప్రత్యేకతను చాలా బాగా రాశారు.
    ధన్యవాదములు.

  2. g.ashok

    కార్ట్యూన్ మీద మీ సమీక్షా వ్యాసం చదవడం ఆనందం కలిగించింది

  3. sasi

    mee analysis baagundi.
    ‘cartoon’ ki, ‘jokuki bomma’ki difference baane chepparu.
    aithe ‘jokuki bomma’ ane kottha padam okati kanipettaanantaru.
    papam inthavaraku meeru ee padam kanipettaka povatam valla chaala mandi ee ‘jokuki bomma’lni cartoon ani anesthunnaru. entha ghoram !!!

  4. పంతుల జోగారావు

    బాపు గారి పుట్టిన రోజున వారి కార్ట్యూన్ మీద మీ సమీక్షా వ్యాసం చదవడం ఆనందం కలిగించింది …చిన్న చిన్న మాటల్లో, గీతల్లో అనల్పార్ధాలని స్ఫురింప చేసే ఆ కార్టూన్ కవి గురించి ఎవరెంత చెప్పుకున్నా తక్కువే కదా !

  5. సౌమ్య

    Good one!!!

  6. గరికపాటి పవన్ కుమార్

    సత్య ప్రసాద్ గారు, ఈ సమీక్షలో మంచి కార్టూన్ అంటే ఏమిటీ, వాటీ లక్షణాలు ఎమిటీ అని మీవంటూ కొన్ని ప్రమాణాలు పెట్టుకొని, వాటితో పుస్తకాన్ని వివరించడం చాలా బాగుంది. బాపూ గారి పుట్టిన రోజున ఈ వ్యాసం వెలువరించడం ఆనందదాయకం.

    గరికపాటి పవన్ కుమార్

Leave a Reply