వరికల్లం – అభివ్యక్తిలో సౌందర్యం
వ్యాసకర్త: తోకల రాజేశం
(నాగవర్మ ముత్యం గారి “వరికల్లం” కవితా సంకలనానికి రాసిన ముందుమాట)
***********
నాగవర్మ ముత్యం వృత్తిరీత్యా ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఈ ఉద్యోగం రాకముందు కూడా ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశాడు. దశాబ్దకాలానికి పైబడిన బోధనానుభవం కలిగిన వ్యక్తి నాగవర్మ. మిగిలిన వృత్తుల వారితో పోలిస్తే ఒక ఉపాధ్యాయునికి ఉండే లోకానుభవం విస్తృతమైంది. భిన్నమైన జీవిత నేపథ్యాల నుంచి– విభిన్నమైన సంస్కృతుల నుంచి వచ్చిన విద్యార్థులు– వాళ్లతో వ్యవహరించే సందర్భంలో కలిగే స్పందనలు– ఉపాధ్యాయుని వ్యక్తిత్వం మీద బలమైన ముద్రలు వేస్తాయి. ఈరకంగా వ్యక్తిత్వంలో పొడసూపే విలక్షణతకు ఈ నేపథ్యం కారణమవుతుంది. అందుకే ఉపాధ్యాయుడైన కవి రాసిన కవిత్వం తప్పకుండా విశిష్టంగా ఉంటుంది. అలా రాసిన కవితల సమాహారమే నాగవర్మ ముత్యం రాసిన ‘వరికల్లం’.
నాగవర్మ ముత్యం కవిత్వం చదివినప్పుడు కలిగే అనుభూతి విలక్షణమైనది. అది ఇతని కవిత్వంలోని ప్రత్యేకత వల్ల వచ్చింది. ఆ ప్రత్యేకత ఇతని జీవితంలో నుంచి వచ్చింది. జీవిత సాహిత్యాలు అవిభాజ్యాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మట్టి విలువ తెలిసిన రైతుబిడ్డగా – నానమ్మ దగ్గర ప్రేమని జుర్రుకొని పెరిగిన మనవనిగా– ఆడవాళ్ళ పట్ల సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా– ఉపాధ్యాయునిగా వైవిధ్యంతో కూడిన జీవితానుభవాన్ని సొంతం చేసుకున్న కవి నాగవర్మ. ఈ వైవిధ్యం ఇతని కవిత్వంలో ప్రతిఫలిస్తుంది. అభివ్యక్తిలోనూ కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ నుంచి వస్తున్న కవిత్వంలో వస్తువులోనూ, అభివ్యక్తిలోనూ వైవిధ్యం తొంగిచూస్తుంది. ముందర తెలంగాణ ఉద్యమ నేపథ్యలో– తెలంగాణ కవులందరూ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వ్యక్తీకరిస్తూ రాయవలసి రావడం వల్ల– అప్పుడు కవిత్వంలో మూసధోరణి లాంటి ఒక స్థితి ఏర్పడింది. ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో కవిత్వంలో వస్తు వైవిధ్యానికి– ఇతరేతర అంశాల్లో స్పష్టమైన వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి గల అవకాశాలు చాలా తక్కువ. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ప్రస్తుత కవిత్వంలో ఎంతటి వైవిధ్యాన్ని ప్రదర్శించవచ్చో అంత వైవిధ్యంతో కూడిన కవిత్వం రచిస్తున్నారు తెలంగాణ కవులు. సరిగ్గా నాగవర్మ కూడా ఇదే దారిలో ఉన్నాడు.
వస్తువులోని వైవిధ్యం నాగవర్మ కవిత్వంలోని విశాలత్వానికి సంకేతం. కవిలోని వివిధరకాల అస్తిత్వాల పరివేదనలు కూడా ఈ కవిత్వ వైశాల్యానికి కారణం. ఒకే సందర్భంలో అనేక అస్తిత్వాలను ప్రదర్శించవలసి రావటం కూడా ఇవాళ్టి కవికి తప్పనిసరైంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణ నుంచి వస్తున్న కవిత్వంలో పుష్కలమైన వస్తువైవిధ్యానికి ఆస్కారం ఏర్పడింది. వస్తువులోని వైవిధ్యానికి తోడు– నాగవర్మ ప్రదర్శించిన అభివ్యక్తిలోని వైవిధ్యం అనితర సాధ్యమైంది. వస్తువుకు తగిన అభివ్యక్తి రూపాన్ని ఎన్నుకున్నాడు వర్మ. అయితే అది ప్రయత్నపూర్వకంగా సాధించింది కాకపోవచ్చు. కానీ వస్తుశిల్పాల ఐక్యతకు– నాగవర్మ గ్రహించిన అభివ్యక్తి రీతులు వందకు వందశాతం న్యాయం చేశాయి. ప్రతీకలు, భావచిత్రాలు, ఉపమానాలు– అన్నీ ఈ కవిత్వంలో సరికొత్తగా దర్శనమిస్తాయి. వస్తువుకు తగిన శిల్పాన్ని ఎన్నుకోవటంతో పాటు– శిల్పరీతుల్లో కూడా వైవిధ్యాన్ని ప్రదర్శించటం ఈ కవిత్వంలోని విశిష్టత.
బతుకుల్లో కవిత్వాన్ని దర్శించడం – కవిత్వంలో బతుకుని చిత్రించడం – విత్తనం, మొక్కల మధ్య సంబంధం – అన్న అవగాహన కలిగిన కవి నాగవర్మ. కవిత్వం కోసం బతుకు దగ్గరకు పరుగులు తీయలేదు ఈ కవి. ఆ బతుకును చిన్నప్పటి నుంచి చూసీ చూసీ చలించి, అనుభవించి తనని తాను వ్యక్తీకరించుకోవటానికి కవిత్వం రాస్తున్నాడు. అందుకే
‘గోంతెండిన గోదాట్ల చాపలు దొరకని బెత్త బానయ్య బతుకు కవిత్వం‘ అంటున్నాడు.
తనకు ఆ బతుకు తెలుసు. ఆ బతుకు విలువా తెలుసు. దాన్ని కవిత్వంలోకి తీసుకొచ్చే విధానమూ తెలుసు. ఈ క్రమాన్నంతా నాగవర్మ కవిత్వంలో స్పష్టంగా గమనించొచ్చు. అలాగే వ్యవసాయ కుటుంబ నేపథ్యం తోడవడం వల్ల– దానితోపాటు ఒక ఉపాధ్యాయునిగా– తాను పరిశీలించిన ప్రకృతిని– చదివిన సమాజాన్ని, ఆత్మీయంగా కవిత్వంలోకి తీసుకొస్తాడు. ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన రాయపట్నం దగ్గరి పాత బ్రిడ్జి మీద ‘వారధి’ అన్న కవిత రాస్తూ– దాన్ని ఎన్నో బతుకు బండ్లు నడిపిన సారధిగా వర్ణిస్తాడు. మా వాడ ఒక పచ్చని చెట్టు/కొమ్మ మీద కిసుక్కున నవ్వే పువ్వు/మా అనిల్ సార్– అంటూ అకాల మరణం చెందిన ఉపాధ్యాయ మిత్రున్ని తలుచుకుంటాడు. ప్రజల బతుకు వెతలను రాస్తూ– సామాన్యులు అంగట్లో బతుకుని/అమ్ముక్కుంటున్నారు/కొనుక్కుంటున్నారు– అంటూ దృశ్యమానం చేస్తాడు. అయితే ఈ కవిత్వానికి బలం కవిలోని ఆత్మీయత వల్లే కాదు– ఆత్మగతమైన భాష వల్ల కూడా చేకూరింది.అచ్చమైన తెలంగాణ భాష తోడవడం వల్ల ఈ కవిత్వానికి నిసర్గమైన సౌందర్యం అదనపు ఆకర్షణగా మారింది. తెలంగాణ మట్టిభాష కవిత్వాన్ని ఎలా సుసంపన్నం చేస్తుందోనన్న దానికి దాఖలా ఈ కవిత్వం.
తెలంగాణ కవిత్వంలో అన్నవరం దేవేందర్ ఎలాగైతే తనదైన సొంత కవిత్వ నిర్మాణపద్ధతి ఒకదానిని రూపొందించుకున్నాడో అలానే నాగవర్మ ముత్యం కూడా తనదైన కవితానిర్మాణ పద్ధతిని సృష్టించుకున్నాడు. ఇంత విశాలమైన తెలుగు కవితా ప్రపంచంలో అన్నవరంతోనే పోలిక పెట్టడమెందుకంటే– అచ్చం అన్నవరం కవిత్వంలో వలె నాగవర్మ కవితల్లో కూడా వస్తువులోనూ, అభివ్యక్తిలోనూ తెలంగాణతనం కనిపిస్తుంది. అయితే తనదైన కంఠస్వరంతో కవిత్వాన్ని సృజించడం నాగవర్మ పద్ధతి. ఏక కాలంలో భిన్న అస్తిత్వాలకు సంబంధించిన పలు అంశాల్ని ప్రతిఫలిస్తుంది ఇతని కవిత్వం. తెలంగాణ వాదిగా, స్త్రీ జనపక్షపాతిగా, బహుజన తాత్వికునిగా– నాగవర్మ ప్రదర్శించిన భిన్నమైన అస్తిత్వాల మేలుకలయికని ఈ కవిత్వంలో చూస్తాం. తెలంగాణ పోరాటాన్ని– “ఇది లాభనష్టాల లెక్క తెల్వని/మనుషుల బతుకుపోరాటం”గా అభివర్ణిస్తాడు ‘సల్లారని ఎల్గడి’ అన్న కవితలో. తెలంగాణ కవిత్వంలోని మేలిమిని సూచించే బలమైన కవిత ఇది.
అడవాళ్ల వైపు నుంచి రాసిన అయిదారు కవితలు ఇందులో చోటు చేసుకున్నాయి. ఈ కవితల్లో నాగవర్మ ప్రదర్శించిన ఒడుపు సామాన్యమైనది కాదు. అడవాళ్లకు ఇవ్వవలసిన గౌరవం– జన్మతః వాళ్లు పొందవలసిన హక్కుల గురించి రాసిన కవితల్లో నిజాయితీ, ఆర్ద్రత పాఠకుల్ని కదిలిస్తాయి.
నువ్వు నడిచే పత్తి చేన్లల్ల, కంది సాళ్ళల్ల
మాటేసిన మగనాగులుంటాయి
ముంగిసనై నీ ముంగట నడ్త
……………………………..
నిన్ను తాకాలని పాకే వేళ్ళకు
ముండ్ల చెట్టునై గుచ్చుకుంట
అంటున్నాడు కవి. స్త్రీ సమాజం పట్ల తన బాధ్యతని వ్యక్తీకరించడానికి ఇంతకు మించిన మాటల్లో– దీనికి మించిన పద్ధతిలో చెప్పే అవకాశాలు లేవు. ఇంత ఉన్నతమైన వ్యక్తీకరణ నాగవర్మలోని నిజాయితీ వల్ల మాత్రమే సాధ్యమయింది. ఈ నేపథ్యంలోనే నాగవర్మ తన నానమ్మ మీద రాసిన కవితలో తెలంగాణ జీవితం– అనేక రూపాల్లో వ్యక్తమైంది. ఇప్పటికీ తెలంగాణ పల్లెలకు బలం ఈ ముసలవ్వలే. వాళ్ళ బతుకు మనకు పుస్తకమై ఎలా దారి చూపుతుందో– తన పలవరింతలో రూపు కట్టిస్తాడు కవి. ఆ క్రమంలోనే మట్టి మీద, రైతు జీవితం మీద రాసిన కవితల్లో ఇదే రకమైన ఆత్మీయత కనిపిస్తుంది. తన జీవితాన్ని తాను ఏ అరమరికలూ లేకుండా చెప్పగలిగిన స్థితి ఉన్నప్పుడు ఆ చెప్పే విషయంలో ఆత్మీయత ప్రతిఫలిస్తుంది. అయితే అలాంటి స్థితిని పతాక స్థానానికి తీసుకెళ్ళిన కవిత ‘ వరికల్లం ‘.
నాలుగు నెలలు శ్రమించి
నాన్న సాగించే బ్రతుకు పోరుకి
పతాక సన్నివేశం
అమ్మానాన్నల చెమట చుక్కలు ఇంకి
మా బ్రతుకులు
పచ్చగా చిగురించిన నేల
అని వరికల్లాన్ని పాఠకుల మనసు మీద ప్రతిష్టింపజేస్తాడు కవి. పండిన పంటంతా ఇంటికి చేరే ముందు ధాన్యంగా తయారయ్యేది ఈ వరికల్లంలోనే. తమ కళ్ళ ముందు నిలిచిన వడ్లరాశిని చూస్తూ రైతు కుటుంబం ఆనందంతో పొంగిపొరలే ప్రదేశం అది. అలాంటి వరి కల్లం – నగలన్నీ పెట్టుకున్న సీమంతపు గర్భిణిలా కనపడింది నాగవర్మకు. కోత కోసిన కొడండ్లు, మెద మోసిన తాళ్లు– పగ్గాలు, గడ్డి గెలికె కర్నె కట్టె, బంతి తొక్కిన ఎడ్లు, పంజ గొట్టిన బండి గీరె, తూర్పారకు నిలబెట్టిన తివ్ట కర్రలు, పలక అంచెలు, చాటలు, పొలికట్టెలు– నగలుగా కనిపించాయి. ఎంత పవిత్రమైన ఊహ ఇది? వ్యక్తీకరణలోని సాంద్రతతో– దృశ్యాన్ని రూపగట్టించే విధానానికి ఉదాహరణ ఈ కవిత. అయితే అలా చెప్పీ చెప్పీ– పని అల్కగ జేసిన హార్వెస్టరు/పాత బంధుత్వాన్ని పాతర పెట్టింది– అని ముగిస్తాడు నాగవర్మ.
వర్తమానంలోని విషాదాన్ని వ్యక్తం చేయడానికి భూతకాలాన్ని అనుభవంలోకి తేవడంలో నాగవర్మ ప్రదర్శించిన ఒడుపు, చాకచక్యం పాఠకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఇదొక శిల్ప రహస్యం. ఇల్లాంటి శిల్ప రహస్యాలు తెలిసిన తనం చాలా కవితల్లో ద్యోతకమవుతుంది. సరిగ్గా ఇలాంటి వ్యూహంతోనే రాసిన కవిత ‘అనుబంధాలతో గట్టిపడిన నేల’. ఇది మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలానికి చెందిన ఎర్రగుంటపల్లిలోని ఓపెన్ కాస్ట్ వల్ల భూములు కోల్పోతున్న రైతుల ఆవేదనల నేపధ్యంలో రూపొందిన కవిత. నీకు భూమంటే మన్నే కనవడుతది/కానీ ఈ భూమే/మాకు బువ్వ వెట్టే తల్లి/అసరా వట్టే కొడుకు/ఆపతిలో ఆదుకునే సోపతి– అంటాడు ఈ కవితలో. భూమితో రైతుకు గల అనుబంధాన్ని అద్భుతమైన రీతిలో ఆవిష్కరించిన కవిత ఇది. రైతు ఇతివృత్తంగా రాసిన అన్ని కవితలూ రైతు జీవిత పట్ల మరింత గౌరవాన్ని, మమకారాన్ని ప్రోది చేసేలా రాశాడు.
ఈ రకంగా ఈ సంపుటిలో వస్తువైవిధ్యం, అభివ్యక్తిలో నవ్యత, సాంద్రత ముప్పేటగా అల్లుకొని పాఠకులకు సరికొత్త కవిత్వానుభూతులను అందిస్తాయి. “నాకైతే కవిత్వం/ఎప్పుడు కురుస్తుందో తెలియని వర్షం” అన్నాడు ‘కవిత్వం’ మీద రాసిన కవితలో నాగవర్మ. అయితే ఆ కవిత్వం మూడు కాలాలా కురవాలన్నదే నా ఆకాంక్ష.

Leave a Reply