పాతాళ గరిగె – లోపలి మాట

వ్యాసకర్త: అల్లం రాజయ్య

(తోకల రాజేశం గారి సాహిత్య వ్యాసాల సంకలనం “పాతాళ గరిగె”కు అల్లం రాజయ్య రాసిన ముందుమాట)

******

తోకల రాజేశం కవిగా, వ్యాసకర్తగా నాకు ఇంతకుముందే తెలుసు. ఆ మాటకొస్తే సమకాలీన రచయితలు,కవులు ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలోకి వస్తారు. ఒకసారి ఒక మనిషి మన జీవితంలోకి వచ్చిన తర్వాత వారి చలనం-మానసిక స్థితి-కవిత్వం-ఒక్క మాటలో చెప్పాలంటే వారి ఆవేశ కావేశాలతో పాటు సుఖదుఃఖాలూ తెలుస్తుంటాయి.

రాజేశం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మారుమూల గ్రామం ఆవడం నుండి, కింది కులాల నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి అనేక ఇబ్బందులు ఎదుర్కొని సాహిత్యమనే కలల ప్రపంచంలోకి వచ్చాడు. ఇది రెండు రకాలుగా జరిగింది. ఒకటి: గ్రామీణ ప్రాంతంలోని కుటుంబపరమైన, కులపరమైన అననుకూల పరిస్థితులు-తద్వారా పెరుగుతూ వచ్చిన ఒత్తిడి. రెండోది: అలాంటి వాళ్లను తమ అవసరాల కోసం మార్చుకునే విద్యా విధానం. వాస్తవ జీవితానికీ, విద్య ద్వారా సంక్రమించిన ప్రపంచానికీ మధ్య పెనుగులాట-ఏతావాతా అప్పటికి తనకు అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులు- పాఠ్యపుస్తకేతర పద్య సాహిత్యం అందుబాటులోకి వచ్చి పసి బాలుడైన రాజేశం లోలోపల అతలాకుతలం చేసింది. 

అదిగో అక్కడనుండి అతని నడక పద్యం నుండి-పాల్కురికి సోమనాథుని నుండి-అభినవ పోతన వానమామలై వరదాచార్యుల నుండి-తెలంగాణ ఉద్యమంలోకి వచ్చేసరికి సాహిత్యంలో ఉన్న అన్ని దారులూ తెలిశాయి. తను ఆదారుల వెంట నడిచాడు. పల్లె పరిశీలన-ప్రపంచాన్ని,మనుషులను దుఃఖం నుండి- ఓటమి నుండి చూడటం కల్మషం కాని భాష రాజేశంకు సాహిత్య ప్రపంచంలో గుర్తింపు తెచ్చాయి. 

అనేక రకాల వ్యక్తీకరణలను, శిల్పాలను అధ్యయనం చేయడం వలన సాహిత్య కిటుకులు,ఆయంపట్లు తనకు తానే తెలుసుకోవడం వలన అనేక బహుమతులు వచ్చాయి.

ఇలాంటి సాహిత్య ప్రపంచంలోనుండి తన ప్రయాణం కొనసాగిస్తుండగానే-మళ్లీ నెన్నెల మండలం లోని పల్లెటూరికి (మెట్ పల్లి) పంతులు ఉద్యోగం-తనను కవిత్వాన్ని, ఉద్గ్రంథాలను, సాహిత్య చరిత్రను ఔపోసన పట్టినా కూడా తన అనుభవం-తన చుట్టూ ఉన్న పరిసరాలు కలవరపరుస్తున్నాయి. కవిత్వమే జీవితం- జీవితమే కవిత్వమైన తెలంగాణ విషాద విప్లవకవి అలిశెట్టి ప్రభాకర్ తెలంగాణలోని కవులకు ఎప్పుడో అప్పుడు తారసపడి-వాళ్ళ ప్రపంచాన్ని గిలకొట్టి-కవి తన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎక్కడ? ఎవరి కోసం నిలబడాలో తేల్చుకొమ్మని ప్రశ్నిస్తాడు. ముఖ్యంగా తెలంగాణ కవులకు ఆయన ఒక శక్తివంతమైన బాంబు. రాజేశం అనేకదారులు గడిచి అలిశెట్టి ప్రభాకర్ ను చేరుకున్నాడు. ఎందుకంటే అలిశెట్టి ప్రభాకర్ బెరుకు బెరుకుగా సాహిత్య వాతావరణం గుండా ప్రయాణించి- జగిత్యాల నుండి పట్నం వచ్చి కవిత్వమై కరిగిపోయాడు.

ఇక సాహిత్య వ్యాసాల విషయానికొస్తే పాల్కురికి సోమనాథుని ఉద్యమ ప్రజా దృక్పథం నుండి మొదలుకొని-సురవరం ప్రతాపరెడ్డి గారి బహుముఖాలైన ఉద్యమ సాహిత్య జీవితాన్ని తనకున్న పరిధిలో అద్భుతంగా చిత్రించాడు. వందల పేజీలు, అనేక పుస్తకాలు రాసిన సురవరం మనకు కళ్ళకు కట్టాడు. గురజాడ గురించి రాయని రచయిత, కవి లేరు. ఆయన ఆధునిక దృక్పథం గురించి రాజేశం రాశాడు. వానమామలై వరదాచారి గురించి ప్రభావితమైన రాజేశం ఆయన కవిత్వంతో పాటు ఆయన జీవించిన విధానాన్ని తను  అర్థం చేసుకున్న పద్ధతిలో అందించాడు. ఇట్లా దేవులాల్పల్లి రామానుజరావు, జాషువా, సదాశివ మాస్టారు, కత్తి పద్మారావుల గురించి సాహిత్యం-జీవితాలను మనకు చూపించాడు. అవన్నీ మీ ఆలోచనలకు పదును పెడతాయి.

వ్యక్తులు, వారి సాహిత్యం అధ్యయనం చేసేటప్పుడు రాజేశం దృక్పథం పూర్తిగా సాంప్రదాయకమైనది కాదు, అట్లని పూర్తిగా శాస్త్రీయమైనది కూడా కాదు. అయితే సాంప్రదాయికత నుండి ఆధునికత వైపు పూర్తి మమేకత్వంతో ప్రయాణించే క్రమంలో ఉన్నాడు రాజేశం. కవిత్వం, సాహిత్య తత్వ విచారం మీద ఐదు వ్యాసాలు రాశాడు. ఈ ఐదు వ్యాసాలలో సాహిత్యం ఎవరికోసం? ఎందుకోసం? అనే స్పష్టమైన అన్వేషణ ఉంది. బహుశా యుద్ధ బీభత్స తెలంగాణ నుండి వచ్చిన వాళ్ళు గాయాలు, నొప్పులతో ఉన్నవాళ్లు మిగతా ప్రాంతంలోని సాహిత్యకారుల్లాగా వీరోచితంగా కనబడరు. అభద్రత తెలంగాణ సృష్టికర్తలైన ప్రజల జీవితంలో తెలంగాణ సాయుధ పోరాటం నుండీ ప్రజల్లో ఉన్నది.వేల గ్రామాలు చిన్నాభిన్నమై, వేలమంది చనిపోయిన చరిత్ర కళ్ళముందే…..గుడ్లల్ల నీళ్లు గుడ్లల్ల కుక్కుకొని ఊకుండలేక,ఉద్యమించక తప్పని స్థితిలో ప్రజలూ, సాహిత్యకారులు. ఇది ఆఫ్రికన్ దేశాలు, లాటిన్ అమెరికా దేశాల సాహిత్యకారుల్లాగా తెలంగాణ సాహిత్యకారులు అనుభవిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోంచి రాజేశంను, నా కాలంలోని అనేకమంది సాహిత్య కారులను అర్థం చేసుకుంటాను. పర్వతాన్ని తొలగించే పనిలో ఉన్న ముసలి తల్లిదండ్రులు…వాళ్ళ కొడుకులు వీళ్లు…..

అయితే రాజేశం తీరని దాహంతో ప్రాచీన, ఆధునిక తెలంగాణ చరిత్రను, సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నాడు. అకడమిక్ శ్రద్ధతో పాటు, శాస్త్రీయ అన్వేషణతో పాటు, సరళంగా వ్యక్తీకరించే నేర్పు-సంఘర్షణాత్మకమైన భిన్న దృక్పథాల అధ్యయనం-సమన్వయం ఈ పదిహేడు వ్యాసాల్లో కనిపిస్తుంది.

ఈ పుస్తకం డిగ్రీ స్థాయి సాహిత్య విద్యార్థులకు పాఠంగా పెట్ట తగినది 

అయితే తెలంగాణ యుద్ధ భూమిలో నిలబడిన రచయితలు,కళాకారులు శాస్త్రీయ దృక్పథం, గతితార్కిక చారిత్రక దృష్టిని చేరకుండా ఉండలేరు. రాజేశం ఆ ప్రయాణంలో ఉన్నాడు. అతని తరాన్ని అతని రచనలతో తేజోవంతం చేయాలని కోరుకుంటూ….

You Might Also Like

Leave a Reply