శ్రీమతి నండూరి ఉషా శ్రీదేవి గారి సుందరకాండము
(సుందర – కంద సుమమాలిక)
వ్యాసకర్త: సత్య పోతంశెట్టి
**********
ఆర్ష వాఙ్మయంలో శ్రీమద్రామాయణము వేదస్వరూపమైతే, అందులోని సుందరకాండము ఆ కావ్యాత్మకు హృదయ స్థానీయం. అట్టి పరమ పవిత్రమైన ఇతివృత్తాన్ని లలిత సుందరమైన కంద పద్య రూపంలో మలిచి, అమృతమయమైన భక్తిరస ధారను ప్రవహింపజేస్తూ ఉష గారు వెలువరించిన “సుందరకాండము (సుందర – కంద సుమమాలిక)” అనే పద్య మాలికను సమగ్రంగా ఆస్వాదించే అరుదైన భాగ్యం నాకు లభించింది. 75పుటలలో విస్తరించిన ఈ లఘు కావ్యం ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామివారి దివ్య పాదపద్మాలకు అంకితం కావడమే కాకుండా, కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు జగద్గురు పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారి సమ్మతిని, ఆశీస్సులను పొందడం ఎంతో సంతోషకరం. పూజ్య డా. కుప్పా శ్రీనివాస శాస్త్రి గారి ముందుమాట, మరియు ఉషగారిలోని కవయిత్రిని మేలుకొలిపి తొలి శతక రచన శ్రీనివాస శతకము (సిరులనిచ్చువాడ శ్రీనివాస అనే మకుటంతో ఆటవెలదిలో) వ్రాయించి, ఒక చక్కటి కవయిత్రిని ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీమతి లక్ష్మీ రాయవరపు గారి ‘ఆప్తవాక్యం’ ఈ కావ్య విశిష్టతకు దివ్యమైన ఆధారాలుగా నిలిచాయి.
ఉష గారు తమ తల్లిగారైన శ్రీమతి కామేశ్వరి నండూరి గారి ఆకాంక్ష మేరకు, గురువులు శ్రీ శ్రీనివాస్ రావు కాగొలను గారి సత్సంగ ప్రచోదనంతో, తన ప్రియమైన బామ్మ గారు, కీ.శే. నండూరి శ్రీదేవి గారి ఆశీస్సులతో ఈ కావ్య రచనకు పూనుకున్నట్లు ఈ పుస్తకం ద్వారా తెలుస్తోంది. ప్రతి పద్యం కింద ఆమె తల్లిగారు సమకూర్చిన సరళమైన ‘భావము’ పారాయణపరులకు కావ్యార్థాన్ని సులభంగా అవగతం చేసే ఒక సుందరమైన వారధిలా నిలిచింది.
లాక్షణిక పరిశీలన: కంద పద్య ఛందో వైభవము
సాహిత్య జగత్తులో “కందము పద్యాలకు రాజు వంటిది” అనేది ప్రసిద్ధ లాక్షణిక సూత్రం. మాత్రా ఛందస్సులోని కంద పద్యంలో నడక, లయ, ప్రాస, యతి మరియు సంధి నియమాలు అత్యంత సునిశితమైనవి. కంద పద్యంలో కేవలం చతుర్మాత్రా గణాలు (గగ, నల, భ, జ, స) మాత్రమే ప్రయోగింపబడతాయి. 1, 3 పాదాలలో 3 చతుర్మాత్రా గణాలు (12 మాత్రలు), 2, 4 పాదాలలో 5 చతుర్మాత్రా గణాలు (20 మాత్రలు) ఉంటాయి. ఆరవ గణంగా తప్పనిసరిగా ‘నల’ లేదా ‘జ’ గణమే రావాలనే నిబంధన, మరియు బేసి స్థానాల్లో ‘జ’ గణం రాకూడదనే నియమాలను పాటిస్తూనే భావౌచిత్యాన్ని కాపాడడం సామాన్యులకు సాధ్యం కాని విద్య. అందుకే ‘కందం రాసిన వాడే కవి‘ అన్న నానుడి ప్రచారంలో ఉంది.
ఉష గారు సుందరకాండ కథా సంవిధానమంతటినీ 174 కంద పద్యాలు, ముగింపులో ఒక సీస పద్యంతో కలిపి మొత్తం 175 పద్యాల నవ సుమమాలికగా అల్లడం అభినందనీయం. వీరి పద్యాలలో ఆధునిక సులభ శైలి, వీనులవిందైన నాద సౌందర్యం, నిత్య పారాయణకు అనువైన భక్తిరస ధార స్పష్టంగా కనిపిస్తాయి.
కావ్యారంభంలో ప్రార్థనా ఘట్టాలలో మత్తకోకిల, ఆటవెలది పద్యాలను, ముగింపులో పట్టాభిషేక వర్ణనకు ధారాళమైన సీస పద్యాన్ని ప్రయోగించినప్పటికీ, ఈ లఘు కావ్యం మొత్తం కంద పద్యపు నడకలోనే స్వర్ణప్రవాహమై సాగింది.
శబ్దాలంకార రమణీయత: నాద సౌందర్యం
కవిత్వానికి శబ్దాలంకారాలు శ్రావ్యతను తెచ్చే ప్రాణవాయువులు. ఉష గారి రచనలో వృత్త్యానుప్రాస, పదాల పునరావృత్తి ప్రయోగం ఒక మనోజ్ఞమైన శబ్ద తరంగాన్ని సృష్టించింది.
లయబద్ధమైన వృత్త్యానుప్రాసకు అద్భుతమైన ఉదాహరణగా మహేంద్ర గిరిపై హనుమంతుని ఆకాశయానాన్ని చూపించవచ్చును:
కం.
జలధిని లంఘించుటకును
నిలిపి మహేంద్ర గిరిపైన నిండుగ పదముల్
బలముగ నొత్తుచు మారుతి
సులువుగ తారాపథముకు సూటిగ నెగసెన్ (పద్యం #9)
ఈ పద్యంలో ‘లంఘించుటకును’, ‘నిండుగ’, ‘బలముగ’, ‘సులువుగ’, ‘సూటిగ’ అనే పదబంధాలు హనుమంతుని తారాపథ యాన వేగాన్ని మన కళ్లముందు నిలుపుతాయి.
అలాగే సురసను ఎదుర్కొనే సన్నివేశంలో ‘స-కార / సు-కార’ అనుప్రాస పద్యానికి తెచ్చిన మృదుత్వాన్ని మనం ఆస్వాదించవలసినదే:
కం.
వందనలందగ జేయుచు
సుందరమగు రామకథను సుమధుర రీతిన్
డెందమునుప్పొంగునటుల
సుందరుడతి వినయముగను సురసకుదెలిపెన్ (పద్యం #21)
త్రిజట సీతమ్మను ఊరడించే ఘట్టంలోనూ శబ్దావృత్తి భావానికి చక్కగా తోడ్పడింది:
కం.
కలగంటి నిదుర నందున
కలవర పడబోకుమమ్మ కలతయె దీరున్
కలయిక పతితో త్వరలో
కలకంఠివి నీకు గల్గు, కామితమీడున్ (పద్యం #85)
‘కలగంటి’, ‘కలవర’, ‘కలయిక’, ‘కలకంఠివి’ అంటూ నాలుగు పాదాలలోనూ వినిపించే ‘కల’ శబ్దం పద్యానికి మృదువైన నడకను ఇచ్చింది. కలలో కనిపించిన శుభం నుంచి పతితో కలయికపై ఆశకు నడిపించే ఈ పలుకులలో త్రిజట ఆప్యాయత చక్కగా ఒదిగింది.
హనుమ వినాశకరమైన రౌద్రాన్ని ప్రకటించిన లంకాదహన ఘట్టంలో ‘భ-కార’, ‘ప-కార’ వ్యంజనాల ఆవృత్తి భీకరమైన అగ్నిజ్వాలల స్వనాన్ని మన చెవులకు వినిపిస్తుంది:
కం.
భుగభుగ మంటలు యెగయగ
భగభగమని లంక రగిలి భస్మము కాగన్
వగచుచు పరుగులుదీసిరి
పగతుని కింకరులు యపుడు భయకంపితులై (పద్యం #155)
అశోకవన ధ్వంసం తరువాత తోరణ స్తంభంపై నిలిచి హనుమంతుడు చేసిన సింహనాదంలో లయబద్ధమైన విజయఘోష మనలో వీరరసాన్ని నింపక మానదు:
కం.
జయమగు రఘునందనునకు
జయమగు నాతననుజునకు జయము సఖునకున్
రయమున లంకకు చేటును
భయమును రుచిజూపుదింక బలిమిని నేడున్ (పద్యం #132)
సీతను చూసిన తరవాత, మళ్ళీ సముద్రం దాటి వానరుల వద్దకు చేరి విజయోత్సాహాన్ని ప్రకటిస్తూ మూలంలోని దృష్టా (దృష్టా సీతా) అనే పదాన్ని చూచితి నంటూ ముమ్మారు పునరావృత్తం చేసిన వాగ్ధాటి తీరు ఆమె భావసాంద్రతకు, కవితా ధారకు నిదర్శనంగా నిలిచింది:
కం.
చూచితి సీతామాతను
చూచితి రఘువరుని సతిని చూచితి ననుచున్
వేచిన కపులకు ముందుగ
నాచల్లని గాలిచూలి ఆవేదించెన్ (పద్యం #160)
అర్థ విన్యాసం: ఉపమా శిల్ప వైభవము
ఉపమాలంకారం కావ్యాంగనకు సమకూరే శ్రేష్ఠమైన ఆభరణం. ఉష గారు ప్రయోగించిన ఉపమానాలు సన్నివేశపు ఆత్మను ఎంతో పారదర్శకంగా ఆవిష్కరించాయి.
అశోకవనంలో రాక్షస స్త్రీల నడుమ కృశించి ఉన్న సీతాదేవి దివ్య తేజస్సును వర్ణించిన తీరు నన్ను ముగ్ధుణ్ణి చేసింది:
కం.
దిగువున యగుపించెనపుడు
పొగ చాటున యగ్ని కణము పొంచిన రీతిన్
సగమగు శశిరేఖ వలెను
మిగిలిన సగమేని తోడ మెరిసెడి వనితన్ (పద్యం #60)
పొగచాటున దాగిన నిప్పుకణంతోను, కృశించిన దేహంతో చంద్రరేఖలా మెరిసే సీతాదేవితోను కవయిత్రి తీర్చిదిద్దిన పోలికలు ఆమె నిశిత కవితా శిల్పానికి తార్కాణం.
అలాగే సీతాదేవి నయన సౌందర్యాన్ని, శీలమహత్యాన్ని వర్ణించేటప్పుడు ఉష గారు ఉపయోగించిన సున్నితమైన ఉపమానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది:
కం.
కమలముల వంటి కనులను
మమతలు కురిపించునట్టి మా జానకియే
భ్రమరములబోలు కురులు
సమమౌ రామునికి యీమె సర్వగుణములన్ (పద్యం #62)
శింశుపా వృక్షంపై నుండి హనుమంతుడు శ్రీరామచరితామృతాన్ని వినిపించగానే సీతాదేవి పొందిన ఆనందోత్సాహాలను వర్ణించే సన్నివేశంలో కవయిత్రి తీర్చిదిద్దిన చిత్రణ అద్భుతమైనది:
కం.
వికసించెను సీత ముఖము
మకరందము గ్రోలినట్టి మధుపము వోలెన్
ప్రకటముగ రామచరితను
చకచక వినిపించ హనుమ సదమల భక్తిన్ (పద్యం #101)
దుఃఖసముద్రంలో ఉన్న సీతాదేవి ముఖం రామకథను వినగానే తేనెను గ్రోలిన తుమ్మెద (మధుపము) వలె వికసించిందనడం కవితాత్మకమైన ఒక దృశ్యకావ్యం.
ఇక రావణుని అహంకారాన్ని తిరస్కరిస్తూ సీతాదేవి సంభాషించిన దృశ్యంలో ప్రయోగించిన ఉపమానం లాక్షణికమైన ఔచిత్య శోభను సంతరించుకుంది:
కం.
గణనీయపు కాంతి మెరయ
మణిపూసను బోలునట్టి మానినియపుడున్
తృణమును యడ్డుగ నుంచుచు
గుణహీనుడి తోడ మాట కునుపున గలిపెన్ (పద్యం #73)
సీతాదేవి పాతివ్రత్యాన్ని ‘మణిపూస’తోను, రావణుని నీచత్వాన్ని ‘తృణము’ (గడ్డిపరక)తోను సాదృశ్యపరుస్తూ ఆ భావాలను కంద పద్య చట్రంలో బిగించిన తీరు అత్యంత ప్రశంసనీయం.
రస పరిపోషణ, రాముని రూప గుణ గానము మరియు దౌత్య ప్రావీణ్యం:
ఈ కావ్య కథాగమనంలో భక్తి, వీర, అద్భుత, కరుణ రసాలు చక్కగా సమ్మేళనమయ్యాయి. హనుమంతుడు సీతాదేవి వద్ద శ్రీరాముని సద్గుణాలను కొనియాడిన పద్యం చదువుతున్నప్పుడు మనలో అనిర్వచనీయమైన భక్తిరసం వెల్లివిరుస్తుంది:
కం.
ఎల్లరి మనములు దోచెడి
నల్లని దేహంబు వాడు నలినపు కనులున్
చల్లని పలుకుల మెలగును
కొల్లగ ప్రేమామృతమును గుప్పించుచునే (పద్యం #111)
‘నల్లని దేహంబు’, ‘నలినపు కనులు’, ‘చల్లని పలుకుల’, ‘కొల్లగ ప్రేమామృతము’ వంటి సున్నితమైన పదబంధాలు పద్యానికి అనల్పమైన భావ మాధుర్యాన్ని అందించాయి.
అలాగే శ్రీరామచంద్రుని పితృవాక్య పరిపాలనను, ధర్మనిష్ఠను హనుమంతుడు ప్రశంసించిన తీరు నా మనస్సులోనిలిచిపోయింది:
కం.
ఆడిన మాటను దప్పడు
పోడిమి సౌఖ్యము త్యజించె పూజ్యుల యానన్
పాడిగ వేగపు శరముల
వాడుచు నసురులను దృంచు భద్రుడు తానే (పద్యం #112)
అదే హనుమంతుడు సీతమ్మకు రాముని విరహవేదనను తెలియజేసిన పద్యంలో దాంపత్యానురాగం ఎంతో మృదువుగా పలికింది:
కం.
విరహము తోడను రాముడు
మరిమరి నీనామము మది మననము జేయున్
ఇరు పక్కల గమనించక
మరచెను నిదురను సహితము మరచెను భుక్తిన్ (పద్యం #113)
మనకు రామనామస్మరణ సుపరిచితం. అయితే, ఇక్కడ రాముడే సీతా నామాన్ని మరిమరి మననం చేస్తున్నాడన్న భావం ఎంత మధురమైనది! చివరి పాదంలో ‘మరచెను’ అనే పదాన్ని రెండుసార్లు ప్రయోగించడం వల్ల, నిద్రాహారాలను సైతం మరిపించిన ఆ విరహవేదన మన మనసుకు హత్తుకుంటుంది.
రావణుని సభలో బంధితుడై నిలిచినప్పటికీ, ధైర్యంతో శ్రీరాముని శరణు కోరమని హనుమంతుడు పలికే నీతిబోధలో రామదూత కార్యదక్షతను ఉష గారు ఎంతో ప్రౌఢంగా ఆవిష్కరించారు:
కం.
వినుమిదె నా హిత వాక్యము
దనుజేంద్రా! రామ విభుడు ధర్మాత్ముండౌ
ఇనకుల గుణ భూషణుడా
తని శరణర్థించుము తన తరుణిని వీడచీ (పద్యం #148)
హనుమంతుని తోకకు రాక్షసులు నిప్పు పెట్టినప్పుడు, సీతాదేవి ప్రార్థనా మహిమ వలన అది చల్లగా మంచులా అనిపించిందనే భక్తి భావనకు ప్రాధాన్యమిచ్చిన తీరు ఆకట్టుకుంది.
ఆ ఘట్టాన్ని కవయిత్రి ఇలా వర్ణించారు:
కం.
చల్లగ తోచెను మంటలు
మెల్లగ వాలమ్ము మార మిహిక సమముగన్
ఉల్లమునందున మ్రొక్కెను
మల్లుల యోధుండు దలచి మాత మహిమగన్ (పద్యం #154)
‘చల్లగ’, ‘మెల్లగ’ అనే పలుకులలోనే ఆ ఉపశమనం వినిపిస్తుంది. మండుతున్న తోక ‘మిహిక సమముగన్’ చల్లగా తోచడం సీతమ్మ మహిమను సూచిస్తే, ఆమెను తలచి మనసులోనే మ్రొక్కిన హనుమంతుని వినయం భక్తిరసాన్ని మరింత పండించింది.
మూల విధేయత
ఆప్తవాక్యంలో లక్ష్మీ రాయవరపు గారు చెప్పినట్లుగా వాల్మీకి రామాయణంలోని ప్రధాన కథాఘట్టాలను అనుసరిస్తూ ఉష గారు ఈ కావ్యాన్ని భక్తిరస ప్రధానంగా తీర్చిదిద్దారు. జానపద లేదా కల్పిత కథలకు తావివ్వకుండా, శ్రీరామాయణ దివ్య శోభను కాపాడారు.
సుందరకాండ కథ ముగిసిన తదుపరి, నిత్య పారాయణ చేసే భక్తులకు పరిపూర్ణమైన మంగళ ఫలితం లభించేలా లంకా యుద్ధం, రావణ సంహారాలను స్పృశిస్తూ, సీస పద్య రూపంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని కళ్లకట్టేలా వర్ణించి మంగళాచరణంతో కావ్యాన్ని నిష్ఠతో ముగించారు.
సారాంశం చెప్పాలంటే…
శ్రీమతి ఉషా శ్రీదేవి గారి “సుందరకాండము” కేవలం గణబద్ధమైన అక్షరాల కూర్పు కాదు. అది పద్య కవిత్వ విమర్శకులను సైతం మెప్పించగల ఛందో శిల్ప భరితమైన అద్భుత కావ్య కళాఖండం. సకల గుణ శోభితమై, నిత్య పారాయణకు అత్యంత అనువుగా మలచబడిన ఈ లఘు కావ్యం తెలుగు పద్య సాహిత్య చరిత్రలో పదిలంగా నిలిచిపోతుందని ఆశిద్దాము.
ఈ గ్రంథ పరిచయంలో నేను ఉదహరించిన పద్యాలు కేవలం మచ్చుతునకలు మాత్రమే. ఈ కావ్యంలోని మొత్తం 175 పద్యాలూ ఆస్వాదించదగిన రసగుళికలే. ప్రతి తెలుగువారూ చదివి తరించాల్సిన భక్తిరస పంచామృతం ఈ కంద సుమమాలిక!
ప్రతులకు సంప్రదించవలసినది:
శ్రీమతి ఉషా శ్రీదేవి నండూరి
Ph: 1 647-230-9866

Leave a Reply