A Book of Urban Colonial Poetry

నిశ్శబ్ద: నరేష్కుమార్ సూఫీ

వ్యాసకర్త: గూండ్ల వెంకటనారాయణ

***********

ఇందులోని కవిత్వమంతా మానవుని ఒంటరితనపు యుద్దాన్ని చూపిస్తుంది. నిజానికి ఇటువంటి కవిత్వం భద్ర జీవితం, నైతిక విలువల సరిహద్దులలో తిరిగేవాళ్లకు అంతగా రుచించకపోవచ్చు.

ఎక్కువగా పల్లె నుంచి నగరం. నగరం నుంచి గ్రామం మధ్య కొట్టు మిట్టాడుతుంది. ఈ పుస్తకం వెనుక మన సామాజిక మార్పు ఇమిడి ఉంది. ఎందుకు ఈ కవిత్వం అంతా పల్లె నగరం మధ్య పెనుగులాడుతోంది? ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలు కాకుండా మిగతా శ్రామిక కుటుంబాలలో ఉన్న పిల్లలు కొత్త నేపథ్యాలలో పల్లెల్ని వదిలి నగరం చేరుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామీణం జీవితాన్ని ముందుకు తోయటం అనేది జరగని పని. శారీరిక శ్రమ నుంచి మేధో శ్రమకు బట్వాడా అయ్యే సమయంలో నగరాలు ఆర్థిక, గౌరవ జీవన వెసులుబాటుకు తోడ్పడ్డాయి. ఫ్యూడల్, కుల గ్రామీణ సమాజం నుంచి నగర క్యాపిటల్ సమాజానికి జీవితం మార్పు చెందింది. 21వ శతాబ్దం నుంచి – కొంత అంతకు ముందు దశాబ్దం కూడా ఉన్నప్పటికీ – వలసలు ముఖ్యంగా పెరిగాయి. నగర జనాభా పెరిగింది. ఈ నేపథ్యంలో ఒక నగర వలసవాది చెప్పిన కవితలు ఇవి.

‘నువ్వు నగరం సగం రాత్రిలో పాడుకునే పల్లె గీతానివి’ అనే వాక్యం వెనుక ఈ నేపథ్యమే ఉంది. ఈ నేపథ్యాన్ని మరి కాస్త అర్థం చేసుకోవడానికి ఒక కాస్మోపాలిటన్ జానపదం అనే ఈ కవితలోనే తను ఎవరు అనేది గుర్తు చేసుకుంటూ

‘పిల్లిపెసరు శేన్ల ఆకులమధ్య అనామకంగా/ పడివున్న పూరేడుపిట్ట గుడ్డు లెక్క/ ఈ అనంతాంత అబద్ధపు లోకం కొసంచుల మీద/ ఒంటరిగా మొలిచిన చెన్నంగిచెట్టు లెక్క/ మసకబారిన పూరి గుడిసె గుడ్డిదీపపు వెలుగు అస్తిత్వానివిరా నువ్వు’ అంటాడు.

ఇంకా దీనికి సరిగ్గా సరిపోయే మాటలు ముగింపు లేని అనే కవిత మొదటి పేరాలో చూడొచ్చు.

‘గాలి చేతులతో కమ్ముకొంటావు నిన్ను నువ్వే/ కన్నీటిని వర్షిస్తూ శరీరమొక వానమబ్బు/ మట్టికన్ను కలల్లా కొన్ని చెట్లని కని/ చెట్టు విత్తనసంజాత అనీ/ తానో సర్రోగేట్ గర్భకుహరమని చెబుతుండగానే/ నీ శరీరం అడ్డంగా నరకబడి, నీ పాదాల మీదుగా సిమెంటు రోడ్డు వేయబడి/ నువ్వూ ఒక చెట్టునని నీకూ తెలియకముందే/ సమయం ముగిసిపోయి…’ అనటంలో అతని మార్పు చూడవచ్చు.

పల్లెను వదిలి నగరంలో పడ్డాక అందులో ఇమడటానికి తల మునకలు అవ్వటం. ఒంటరి తనం, పిచ్చితనం, నగర హిపోక్రసీ మీద ఏవగింపు, పల్లెను స్మరణ చేసుకోవడం, ప్రేమల్ను తలచుకోడం, మనుషులకు దగ్గర అవ్వాలనుకోడం. ఒకటి కాదు.తీవ్రమైన మానసిక వలపోత ఈ కవిత్వంలో ఉంది.అందుకే ‘ఎవ్వర్రా…? నన్ను నానుంచి తెచ్చి నగరం/ నాలుగు రోడ్ల మధ్య శిల్పారామాన్ని చేసిందీ’ అని తెలియని అవేశంతో అరుస్తాడు తనలో తాను.ఈ ప్రశ్న గ్రామీణ చరిత్రను, క్యాప్టలిస్ట్ చరిత్రను తవ్వి తీసేది. మన సామాజిక మార్పులోని శూన్యతను చెప్పేది.

అలా ప్రశ్నించుకున్నాక దానికి సమాధానం కూడా చెప్పుకుంటాడు ‘నీ చుట్టూ నడిచే మృతశరీరాల నడుమ సంచరిస్తావ్/ నువ్వూ ఒక పార్థీవ దేహామై/ ఒకానొక స్వప్న సంజాతుడవై’ అని.

తన చిన్ననాటి ప్రేమను తలుచుకునే క్రమంలో ‘నువ్వు యాదికచ్చినప్పుడు’ అనే గొప్ప పోయెమ్ రాసుకున్నాడు. ఈ కవిత్వంలో ఉపమలన్నీ ఊరు చుట్టూతనే తిరుగుతాయి. అయితే ఈ కవితకు గొప్పతనాన్ని అద్దినది కేవలం అతను ఆమె ప్రేమను తలుచుకుంటూ, దూరమై పోయిన విషయాన్ని చెప్పటం కాదు. తన ఊరు నుంచి వేరు పడిన బాధ ఈ కవితలో సన్నగా ధ్వనిస్తూ ఉంటుంది. వలస జీవితంలోని మనోవేదన ఈ కవిత నిండా పరుచుకుంది.ఇందులో ప్రేమ గురించి కవితలు చెప్పేతప్పుడు కూడా ఏదైనా అతి సున్నితమైన వాక్యం ఉంటుందా అని వెతికాను కానీ అలా మనల్ని మత్తులో ముంచే వాక్యాలు ఎక్కడా కనిపించవు.

I am, who she is… అనే ప్రేమ కవితలో కూడా ఆమెపై ప్రేమ ఎలా ఉందో మనకు రెండో పేరాలో తెలుస్తుంది.

‘ఉట్టినే అని అబద్దం చెప్పలేను గానీ/ బహుశా నువ్వొక స్త్రీవైనందుకూ/ కొన్ని శిథిలస్వప్న వ్రణాలని మోసే దేహానివైనందుకూ కావొచ్చు/ లేదూ…!/ నిర్మాలిన్య శూన్యాలని నాకు గుర్తు చేసినందుకూ అయ్యిండొచ్చు/ నా గది కిటికీలో వాలిన దృశ్యాన్ని నీ పేరుతో పిలుస్తాను’ శిధిలస్వప్న వ్రణాలని మోసే దేహం అనటంలో ప్రేమ యొక్క లాలిత్యం మొత్తం ధ్వంసం చేస్తాడు. ఒక ప్రియురాలను ఈ విధంగా పోల్చటం అంటే స్త్రీ అంటే మృదుత్వమైనది అనే భావాన్ని తునాతునకలు చేయడమే. ఇది మనసులో పడ్డాక ప్రేయసిని సున్నితంగా చూడలేం అనిపించింది.

దేశంలో రాజకీయాల నేపద్యంలో నేనూ నా ముస్లిం మిత్రుడూ అనే కవితలో ‘నాలుగేళ్ల కూతురు కూడా/ నువ్వు చెప్పు నమాజు చేయటం నేరమా?’ అని, ఆరేళ్ల పసివాడి చేత నేరం అంటే ఏమిటీ? అని అడిగిస్తాడు. ఇవి బదులు లేని ప్రశ్నలు. ఈ కవిత ముస్లిం కుటుంబం గురించి ఆర్ద్రంగా చెప్తూ, సంధించే ప్రశ్నలు ఊపిరి సలపనివ్వవు. ఈ దేశపు మైనారిటీ బడుగు జనాల వైపు నుంచి చెప్పబడిన అతిగొప్ప రాజకీయ కవిత. 

పోరాటాల నేపథ్యంలో చెప్పబడిన కవిత యుద్ధమూ – వొక ప్రేమగీతమూ.ఈ కవిత చెప్పబడిన విధానం గొప్పది. మాస్టర్ పీస్ లాంటి పోయెమ్ ఇది నా ఉద్దేశ్యంలో.
ఒక కాలపు నగరీకరణ చెందిన గ్రామీణ యువకుడి మానసిక చరిత్రను చెబుతుంది ఈ పుస్తకం.ఇవన్నీ ఆ యువకుని కలవరపాటున మెలుకువ వలన ముగియని కలలుగా చెప్పబడినట్లు ఉంటాయి.

దీనిని మూడు విధానాలుగా చెప్పబడిన కవిత్వం అని కూడా అనవచ్చు. పల్లె నుంచి వచ్చిన నగర జీవితం, ప్రేమ జీవితం, రాజకీయ పోరాట జీవితం.ఇది ఒక కాలపు సమాజాన్ని చూపించే సమగ్రమైన పుస్తకం.పైపైన చదివితే అస్సలు ఏ మాత్రం నచ్చని పోయెట్రీ.ఒకసారి చదవండి నచ్చకపోతే ఎప్పుడో ఇంకోసారి చదవండి. మూడోసారి మనసుపెట్టి చదవండి. అప్పటికే ఈ కవిత్వం మీలో చేరి ఉంటుంది.

You Might Also Like

Leave a Reply