The Tyranny of Merit: Michael Sandel

వ్యాసకర్త: హేలీ కళ్యాణ్

Buy The Tyranny of Merit: What's Become of the Common Good? Book Online at  Low Prices in India | The Tyranny of Merit: What's Become of the Common  Good? Reviews & Ratings -

ఈ పరిచయం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మైఖేల్ సాండల్ రాసిన “The Tyranny of Merit” అన్న పుస్తకం గురించి. ఇంతకు మునుపు ఈ ప్రొఫెసర్ రాసిన రెండు పుస్తకాలు చదివాను నేను. అవి “Justice” మరియు “What Money Can’t Buy: The Moral Limits of Markets” అన్నవి. సమకాలీన అమెరికా సమాజం గురించి ఎన్నో ప్రశ్నలు సంధిస్తారు రచయిత ఈ పుస్తకాలు అన్నిటిలో. అయితే చాలా వరకు ఆయన సమాధానాల విషయంలో అంత ఆసక్తి చూపించరు. ఈ “The Tyranny of Merit” అన్న పుస్తకంలో కూడా అంతే. ఒక వ్యక్తి యొక్క యోగ్యత ఆధారంగా విద్య, సిరిసంపదలు మరియు సామాజిక స్థాయిని ఆపాదించే మెరిటోక్రసి అనే వ్యవస్థ యొక్క కష్టనష్టాల గురించి ఎంతో చర్చ చేసి ప్రత్యామ్నయంగా సరైన ప్రతిపాదన ఏది చేయకుండా చూచాయగా ఏవో ప్రతిపాదనలు చేసి వదిలేస్తారు రచయిత . 

2019లో అమెరికాలో పెద్ద దుమారం రేపిన విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షల కుంభకోణం గురించిన ప్రస్తావనతో పుస్తకం మొదలవుతుంది (చూడు: https://en.m.wikipedia.org/wiki/2019_college_admissions_bribery_scandal ). విశ్వవిద్యాలయ ప్రవేశాల కోసం డబ్బు పలుకుబడి గల కుటుంబాల వెంపర్లాట గురించిన ప్రస్తావన చేస్తారు ఇక్కడ రచయిత. అంతేకాక అమెరికాలో SAT పరీక్షకున్న క్రేజును గురించి కూడా ప్రస్తావించారాయన. ఈ SAT లో ధనిక కుటుంబాలకు చెందిన అభ్యర్థులకే అధిక మార్కులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటారు ఆయన. ఈ పరీక్షకు కావాల్సిన తర్ఫీదులు ట్యూషన్లు ఇవ్వటం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అది సాధారణంగా ధనిక ఎగువ మధ్యతరగతి కుటుంబాలకే సాధ్యమని అంటారాయన. వెరసి డబ్బుతో విద్యాలయాలలో సీటును కొనుక్కోవచ్చు. గొప్ప గొప్ప ఐవి లీగు విద్యాలయాలలో చాలా వరకు ధనిక వర్గాలకు  మరియు ఎగువ మధ్య తరగతికి చెందిన వారి పిల్లలే ఉంటారని అంటారు ఆయన. 

అసలు ఈ విశ్వవిద్యాలయ ప్రవేశాల కోసం ఎందుకు తల్లితండ్రులకు ఇంత తాపత్రయం? గత కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో ఆర్థిక అసమానతలు చాలా పెరిగాయని  కాలేజీ చదువు లేనిదే సామాజిక ఎదుగుదల ఉండదనే అభిప్రాయం బాగా పెరిగిందని అందుకే ఈ కాలేజీ అడ్మిషన్ల గురించిన తాపత్రయం అంటారాయన. 

మన దేశంలోనూ ఇదే పరిస్థితి . కార్పొరేటు ఫ్యాక్టరీ ఇంటర్మీడియేట్ కాలేజీల ఒకటి ఒకటి ఒకటి రెండు రెండు రెండు అని ర్యాంకుల గురించిన ప్రచార హోరు తెలియనిది ఎవరికి. ప్రతిభ ఆధారిత ప్రవేశ పరీక్షలలో ప్యాసు అవటమే మన చదువుల పరమార్థం. దీనికి బీజం 1950లోని అమెరికాలో ఉంది అని చెప్పుకొస్తున్నారు మైకేల్ సాండల్. వర్గరహిత సమాజం సృష్టించాలనే ఆశయంతో SAT పరీక్షను రూపుదిద్దారట అప్పట్లో. 

ఈ మెరిటోక్రసీ లో పై స్థాయికి ఎదిగిన వారంతా తమ స్వీయ శ్రమ మరియు ప్రతిభ వల్లనే ఇదంతా సాధ్యపడింది అని అనుకుంటూ ఉంటారనీ అలాగే ఎదగలేక వెనుక పడిపోయిన వారు కూడా కేవలం తమ చేతకానితనం వల్లనే ఇలా జరిగిందని బాధలో కూరుకుపోతారని ఈ రెండు రకాల ఆలోచనలు సరైనవి కావని అంటారాయన. నా విజయానికి కేవలం నా ప్రతిభ నా కష్టం మాత్రమే కారణం అని గర్వించే వారికి సమాజంలో ఇతరుల పట్ల కృతజ్ఞతా భావం మరియు వినయ విధేయతలు అన్నవి అలవడే అవకాశాలు తక్కువని అంటారాయన. ఈ మెరిట్ తో  విజయం సాధించిన వ్యక్తి వెనుక ఉన్న తల్లితండ్రుల కష్టం మాటేమిటి ? చదువు చెప్పిన ఉపాధ్యాయుల మాటేమిటి? అసలు జన్మ సిద్ధంగా  ఏదో టాలెంట్ వచ్చి ఉండచ్చు అది అదృష్టం వల్ల వచ్చిందేగా ? నీకున్న టాలెంటును గుర్తించి నీ టాలెంటుకు తగిన పారితోషికం లభించే సమాజంలో పుట్టటం కూడా ఒక అదృష్టమే కదా? ( హిందువులు కర్మ సిద్దాంతం అనచ్చును అది వేరే విషయం) అంటూ రకరకాల ప్రశ్నలతో మొదలవుతుంది ఈ పుస్తకం.

ఎటువంటి సామాజిక తరగతిలో పుట్టిన వారైనా సరే కావలసిన టాలెంట్ ఉండి వారికి కష్టపడే తత్వం ఉంటే వారి సామాజిక ఎదుగుదలకు అడ్డే లేదు అన్న నమ్మకం అమెరికాలో ఉంటుందనీ ఆ విధంగా ఎవరన్నా పైకి వచ్చి అనంతమైన సంపద సంపాదించినా కూడా వారు సంపదలో ఈ తేడాను అసమానతగా పరిగణించరని అది ఆ వ్యక్తి మెరిట్ కు మార్కెట్టు ఇచ్చిన న్యాయమైన పారితోషికంగా భావిస్తారని అంటారాయన. 

అయితే ఈ మధ్య కాలంలో నాలో సత్తా ఉంటే నా సామాజిక ఎదుగుదల సాధ్యమే అనే ఈ అమెరికన్ స్వప్నం చాలా మందికి అందని ద్రాక్షగా మారిందని ఈ నిరాశా నిస్పృహను వాడుకొనే ట్రంపు వంటి నాయకుడు అధ్యక్షుడు అవ్వగలిగాడని వాదిస్తారు రచయిత. ట్రంప్ ను ఎన్నుకున్న వారిలో చాలా మంది ఈ మెరిటొక్రసి ఫలాలు దక్కక నిరాశతో ఉన్నవారేనని అంటారాయన.

సమాజంలోని అసమానతలను అన్నిటినీ నిర్మూలించి అందరూ ఆర్థికంగా సామాజికంగా ఎదగాలంటే వారి వారి ఎదుగుదలకు అవసరమైన సమానావకాశాలు అందరికి లభించాలంటే అందరికి సరైన సమానమైన విద్య లభించేలా చూడాలి అన్న నమ్మకం కొన్నేళ్లుగా అమెరికాలో బాగా బలపడిందని అంటారు సాండల్. అందుకనే 1990 2000 దశాబ్దాలలోని అమెరికా అధ్యక్షులు అందరూ కూడా విద్యా వ్యవస్థలోనే అన్ని సమస్యలకూ సమాధానం ఉందని ప్రగాఢంగా విశ్వసించారని అంటారు రచయిత.

చాలా వరకు మనం మెరిటోక్రసి యొక్క 

ఆదర్శాన్ని అంటే యోగ్యతకు అనుగుణమైన అవకాశాలు ఇవ్వటం అనే ఆదర్శాన్ని తప్పుపట్టమనీ, అయ్యో నా సమాజం ఆ ఆదర్శాన్ని అందుకోలేకపోయిందే అని మదనపడి ఎలాగోలా అందరి ఎదుగుదలకు సమానావకాశాలు రావాలని ఏవో సంస్కరణలు చేయటం వంటి విషయాల మీద దృష్టి పెడతామనీ అయితే అసలు ఆ అదర్శమే తప్పేమో అసలు మెరిటోక్రసి అనేది నిజానికి అంత గొప్ప ఆశయం కాదేమో ఆలోచించండి అని పాఠకులని ప్రశ్నిస్తారు రచయిత సాండల్.

ఈ మెరిట్ ఆధారిత వ్యవస్థలో ఉన్నత వర్గాల వారంతా తాము సాధించినది అంతాను కేవలం తమ ప్రతిభ ఆధారంగానే సాధించిన న్యాయమైన సంపదని గర్వంతో విర్రవీగుతూ ఉంటే ఈ వ్యవస్థలో సంపద దక్కని క్రింది వర్గాల వారంతా తమ చేతకానితనం వల్లనే తమకీ దౌర్భాగ్యం అని ఆత్మన్యూన్యతతో కొట్టుమిట్టాడతుంటారని అంటారు రచయిత.

“Would a perfect Meritocracy be just?” అని ప్రశ్నిస్తారు మరో చోట. అంటే యోగ్యత ఆధారిత వ్యవస్థ అన్నది అత్యున్నత స్థాయికి చేరినా నిజానికి అటువంటి వ్యవస్థలో న్యాయం ఎంత అని సూటిగా ప్రశ్నిస్తారు సాండల్. నిజానికి అందరికీ వారి వారి ఎదుగుదలకు సమానావకాశాలు సమాన విద్య  ఇవ్వటం అన్నది అంత అషామాషి విషయం కాదని ఉన్నత వర్గాల కుటుంబాలలోని తల్లితండ్రులు తమ పిల్లల పెంపకంలో చేసుకొనే జోక్యం వారు వారి పిల్లలకు అందించే సదుపాయాల వలన ఆ వర్గాల పిల్లలకి కలిగే లాభం ఎంతో ఉంటుందని పిల్లల పెంపకంలో ఉండే ఈ అసమానతలు నిర్మూలించడం దాదాపుగా అసాధ్యమేనని అంటారు రచయిత. ఇది కేవలం వంశ పారంపర్యంగా లభించే డబ్బు అస్తి పాస్తుల గురించి కాదని అంతకు మించిన ప్రయోజనాలెన్నో ఉన్నత వర్గాలలో పెరిగే పిల్లలకు ఉన్నాయని అవన్నీ అందరికి సమపాళ్ళలో దొరికేలా చేయటం అసాధ్యమని అంటారు ఆయన.

సరే మాటవరసకు ఇటువంటి అసమానతలను అన్నిటినీ రూపుమాపి అందరికి వారి వారి యోగ్యతను అనుసరించి సామాజిక ఎదుగుదల లభించే వ్యవస్థ వచ్చిందే అనుకుందాం అందులో న్యాయమెంత అని ఎదురు ప్రశ్నిస్తారు రచయిత. మెరిటోక్రసి అన్నది సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి పనికి రాదని పైపెచ్చు ఈ అసమానతలను మెరిట్ లేదా యోగ్యత అన్న ఒక కారణం చూపించి సమాధానపరుస్తుందని అంటారు రచయిత. అలా అని తానేమీ మెరిటోక్రసిను తప్పు పట్టట్లేదని అది నిచ్చెన మెట్ల అసమానతలను నిర్మూలించడానకి పనికి రాదనీ అందరికీ నిచ్చెన మెట్టు ఎక్కడానికి సమానావకాశం ఇచ్చినట్టే ఇస్తుంది కానీ మెట్టుకు మెట్టుకు నడుమ ఉన్న అంతరాలను గురించి మెరిటోక్రసి వ్యవస్థలో సమాధానం ఉండదని అంటారు. సరే ఎవరి టాలెంట్ బట్టి ఎవరి మెరిట్ బట్టి వారికి తగిన స్థాయి స్థోమత లభించటం న్యాయమే కదా అంటారా అప్పుడు “Do we deserve our talents” అని ఎదురు ప్రశ్న వస్తుంది రచయిత నుంచి.

Two alternatives to Meritocracy అని మెరిటోక్రసి కి ప్రత్యామ్నయాల గురించిన చర్చ చేస్తారు సాండెల్ మరొక చోట. హాయెక్ (Hayek) ప్రతిపాదించిన ఫ్రీ మార్కెట్ లిబరలిజం గురించి రాల్స్ ( Rawls) ప్రతిపాదించిన వెల్ఫేర్ స్టేట్ లిబరలిజం గురించి ప్రస్తావిస్తారు ఈ పుస్తకంలోని ఈ అంకంలో. 

న్యాయాన్యాయల విచక్షణకు సంబంధించిన ప్రశ్నలకు మార్కెట్టు వ్యవస్థ సమాధానం ఇవ్వలేదని ఫలానా వస్తువుకు లేదా సేవకు (సర్వీసు) మార్కెట్లో ఫలానా ధర పలికినంత మాత్రాన ఆ సంపద సాధించిన వ్యక్తులు  గొప్పవారైపోరని కేవలం  డబ్బుల ఆస్తుల లెక్కలకు నైతిక విలువలు ఆపాదించలేమని  అంటారు రచయిత. మాదకద్రవ్యాలు అమ్ముకునే వ్యాపారికి స్కూలు టీచర్ కంటే ఎన్నో రెట్లు సంపద ఉండచ్చని అలాగే జూద గృహం (కేసినో) యజమానికి వైద్యుని కంటే ఎన్నో రెట్లు ఆస్తులు ఉండచ్చని అంత మాత్రం చేత వైద్యుని కంటే జూద గృహం యజమాని గొప్ప అనుకోటంలో అర్థం లేదని నైతిక ప్రమాణాలకు అనుగుణంగా సమాజం వైద్యునికి ఎక్కువ విలువను ఆపాదిస్తుందని అంటారు రచయిత.

ఇలా న్యాయాన్యాయ మీమాంస కొనసాగుతూ ఉండగా Thomas Nagel అనే తత్వవేత్త ఆన్న మాట ఒకటి తలుచుకుంటారు రచయిత. జాతి వివక్ష లింగ వివక్ష మొదలైన అన్ని వివక్షలను వాటి తాలూకా అసమానతలను నిర్మూలించినా కూడా ఒకటే పనికి తెలివైన వాడికి తెలివి తక్కువ వాడికి ఒకటే రకమైన పారితోషికం ఎప్పటికీ లభించదని ఈ అసమానత అన్నది మనతో అలానే ఉండిపోతుందని అన్నాడట థామస్ నగెల్.

మరొక చోట ఛాన్స్ vs చాయిస్ అంటే అవకాశానికి/అదృష్టానికి మరియు ఎంపికకు గల తేడాలను గురించి అది సామాజిక న్యాయాన్ని సమానావకాశాల సిద్ధాంతాన్ని మెరిట్ వ్యవస్థను ప్రభావితం చేసే తీరును గురించి చెప్పుకొస్తారు సాండెల్. ఉదాహరణకి ప్రమాదవశాత్తు ఒకతని ఇల్లు తగలబడి పోతే అది అతని దురదృష్టం వల్ల జరిగిన సంఘటన అనచ్చు. కాబట్టి అతనికి కలిగిన తీరని నష్టానికి అందువలన అతను కోల్పోయిన అవకాశాలకు సమాజం లేదా ప్రభుత్వం ఏదో నష్ట పరిహారం చెల్లించాలని అనవచ్చు. అయితే ఆ వ్యక్తి ఎంత చెప్పినా వినకుండా కావాలనే fire insurance అంటే భీమా పాలసీ కొనుగోలు చేయలేదు ఆన్న విషయం మనకి తెలిస్తే అప్పుడు అతని ఈ దురదృష్టానికి భీమా పాలసీ విషయంలో మంకుపట్టు పట్టటమే కారణం కాబట్టి అతనికి ఏ నష్ట పరిహారం ఇవ్వటానికి మేము ఒప్పుకోము అని కొందరు అభిప్రాయం మార్చుకోవచ్చు అంటారు రచయిత. 

పెరుగుతున్న ఆర్థిక అసమానతలను సమాధానంగా అందరికీ సామాజిక ఎదుగుదలకు అవకాశం లభించాలంటే అందరికీ యూనివర్సిటీలలో ఉన్నత విద్యావకాశాలు దొరికేలా చేయాలి అని దాదాపు ప్రతీ రాజకీయ నాయకుడు ఆశిస్తాడు కానీ ఇదొకరం గుడ్డి నమ్మకమని అంటారు రచయిత.  అసలు సమాజంలో ఎంతో మందికి యూనివర్సిటీ డిగ్రీ ఉండదని ఆ మాత్రానికే వారిని తక్కువ చేస్తూ నీ ఈ స్థితికి నీకు డిగ్రీ లేకపోవటమే కారణం వెళ్ళి డిగ్రీ తెచ్చుకోపో అని పదే పదే వారిని దెప్పి పొడవటం వారిని అవమానించినట్టేనని ఈ దెప్పి పొడుపుల వలన వారు స్ఫూర్తి పొందే అవకాశాలు తక్కువేనని అంటారు రచయిత.

అమెరికాలో మొదట యూనివర్సిటీ చదువులు ఇలా ఉండేవి కావని 1960 ప్రాంతం నుంచి ఈ విషయంలో చాలా మార్పులు వచ్చాయని అంటారు సాండల్. ఈ కాలంలోనే కాలేజీలు తమ ప్రతిష్టకు కొలమానంగా తాము చేర్చుకున్న విద్యార్థుల సగటు  SAT స్కోరును అంటే ప్రవేశ పరీక్ష స్కోరును వాడుకోవటం ప్రారంభించాయని అంతేకాక  తాము వేల కొద్దీ అప్లికేషన్లను తిరస్కరించామని అదే తమ గొప్పతనానికి చిహ్నంగా చూపటం అన్నది ప్రారంభం అయ్యిందని అంటారు రచయిత.

ఉన్నత వర్గాలకు చెందిన తల్లితండ్రులు ఈ విశ్వ విద్యాలయాలలో ప్రవేశానికి తమ పిల్లలకు తమ పెంపకం ద్వారా ఎంతో కొంత ఊతం ఇవ్వటానికి ప్రయత్నాలు చేయటం ప్రారంభించారని అయితే ఈ ప్రయత్నాల వలన ఆ విద్యార్థుల హై స్కూలు జీవితం అంతా ఎంతో ఒత్తిడితో ఆందోళనతో నిద్రలేమితో కూడుకున్నది గా మారిపోయిందని అంటారు రచయిత. ఈ పిల్లలకు స్కూలు వయసులోనే ఏవేవో ప్లేసుమెంటు కోర్సులు క్రీడలు లలిత కళలు మొదలైన విషయాలలో రకరకాల క్లాసులు ఇవన్నీ చెప్పించటమే తమ లక్ష్యంగా ఈ తల్లితండ్రులు భావిస్తారని అంటారు రచయిత. ఇలా చేయటం వలన రెండు సమస్యలు ఉన్నాయని అంటారు సాండల్. అన్ని సామాజిక వర్గాలకూ చెందిన పిల్లలకి ఈ సదుపాయం లేనందున ఇది లేని అసమానతలను తెచ్చిపెడుతుందని పోని ఇలా పెరిగే అవకాశం దొరికిన పిల్లలు కూడా చెప్పలేని ఒత్తిడికి గురవుతారని అంటారు రచయిత. 

అయితే తల్లితండ్రుల ఈ అత్యుత్సాహం కూడా 1975-2012 మధ్య జరిగిన మార్పేనని అంటారు సాండల్. చూడు: https://en.m.wikipedia.org/wiki/Helicopter_parent హెలికాప్టర్ పేరెంట్. ఇదంతా ఆర్థిక అసమానతలు తారాస్థాయికి చెందిన సమాజాలలోనే ఎక్కువగా కనిపిస్తుందని కొందరు మేధావుల అభిప్రాయమట. దక్షిణ కొరియా అమెరికా లో ఇది ఎక్కువగా కనిపిస్తుందని స్వీడన్ జపాన్ వంటి దేశాలలో ఈ తరహా పిల్లల  పెంపకం చేసే విధానం అంత ఉదృతంగా కనడదని అంటారు రచయిత.

అయితే తల్లితండ్రుల ఈ విధానాల వలన టీనేజ్ పిల్లల మీద చెప్పలేనంత ఒత్తిడి పెరుగుతోందని వారికి మానసిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటారు రచయిత. నిజానికి బయట ప్రపంచానికి ఏదో గొప్ప విజయం సాధించిన వారిలాగా కనిపించే యువతీ యువకులలో కూడా లోపల లోపల బయటకు చెప్పుకోలేని భయాలు ఆందోళనలు ఒత్తిళ్ళు ఉన్నాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయంటారు సాండల్. నిజానికి ఉన్నత వర్గాలకు చెందిన వారి పిల్లల్లో ఒక రకమైన మానసిక అనారోగ్యపు మహమ్మారి ఉందని వారు చెప్పలేనంత ఒత్తిడికి గురవుతున్నారని అంటారు రచయిత.గొప్ప గొప్ప విజయాలు నిరంతరం సాధిస్తునే ఉండాలి అని ఈ ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థుల మీద మితి మీరిన ఒత్తిడి ఉంటోందని నిజానికి 20-24 వయసు మధ్యన వారిలో ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య 2000 నుంచి 2017 సంవత్సరాల మధ్యలో 36% పెరిగిందని చేప్పుకొస్తారు సాండల్. 

ఇది కాక ఈ మెరిట్ పిచ్చి పట్టిన కాలేజీ విద్యార్థులలో పెర్ఫెక్షనిజం (perfectionism) అనే మరొక మహమ్మారి కూడా ఉందని అంటారట చాలా మంది మానసిక శాస్త్రవేత్తలు. ఈ వ్యవస్థలో నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చిన విద్యార్థులకి ఆత్మన్యూనత భావం ఎక్కువని తమ చుట్టు పక్క వారు తమ మీద చేసే తీర్మానాల ప్రభావం వీరిపై చాలా ఎక్కువగా పడుతుందని అంటారు రచయిత.  నిజానికి చాలా మందికి జీవితమంతా నిరంతరం ఏదో పోటీ పరీక్షలో ఉన్నట్టే ఉంటోందని ఈ విషయంలో విద్యార్థులు జాగరూకతతో వ్యవహరించాలని 2000ల సంవత్సరంలోనే ఒక వ్యాసం కూడా రాశారట హార్వర్డ్ విశ్వవిద్యాలయం వారు. 

ఇదంతా చదువుతూంటే నా జీవిత కథ నా సహా విద్యార్థుల జీవిత కథ చదివినట్టు అనిపించింది . ఇది అమెరికాకు సంబంధించిన విషయం మాత్రమే కానే కాదు. మన దేశంలో పేరు మోసిన ప్రతీ యూనివర్సిటీలో ప్రతీ బ్యాచ్ విద్యార్థికి తన చదువులు మిగిల్చిన జ్ఞాపకాల దొంతరలో కనీసం ఒక సహ విద్యార్థి ఆత్మహత్య గాథ అన్నది ఉంటుంది. నమ్మలేని నిజం. ముఖ్యంగా ఐఐటీ ఐఐఎం లాగా విపరీతమైన పోటీతో ఉండే విశ్వ విద్యాలయాలలో ఇది చాలా సహజమైన విషయం. నాకు తెలిసి ఆత్మహత్య లేని బ్యాచ్ ఉండదు అనుకుంటాను ఈ కాలేజీలలో. ఇక మన ఇంటర్మీడియట్ కాలేజీల చరిత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఈ ఆత్మహత్యల విషయంలో.

1960 లలో కేలిఫోర్నియలో తాను చదువుకొనే రోజుల్లోనే ఒక మ్యాథ్స్ టీచర్ క్లాసులో మొదటి మూడు బెంచిలలో ర్యాంకుల వారీగా పిల్లలను కుర్చోపెట్టించే వారట. ప్రతి క్విజ్ లేదా పరీక్ష జరిగినపుడు ర్యాంకులు మారిన ప్రతీ సారి కూర్చునే వరుసలు మారేవట అప్పట్లోనే.

ఇక కాలేజీ విద్య ప్రాముఖ్యతను గుర్తించి ఇలా అంటారు సాండల్. 1979లో సగటు కాలేజీ విద్యార్థి హై స్కూలు వరకు మాత్రమే చదువుకున్న వ్యక్తి కంటే నలభై శాతం ఎక్కువ డబ్బు సంపాదించే వాడట ఇదే 2000 సంవత్సరానికి ఆ తేడా ఎనభై శాతంగా మారిందట. అందుకే ఇప్పటి అమెరికాలో కాలేజీ చదువు కోసం అంత వెంపర్లాట అని అంటారు రచయిత.

222 పేజీలు ఇలా మెరిటోక్రసిను ఆర్థిక అసమానతలను తూర్పార పెట్టి కేవలం మూడు పేజీలలో ఏదో ప్రత్యామ్నయాల గురించి తూతూ మంత్రంగా ప్రస్తావించి పుస్తకాన్ని ముగిస్తారు రచయిత. ఇదొక్కటే ఈయనతో సమస్య . ప్రతి పుస్తకంలోనూ ఇంతే ఈయన ఇంచుమించుగా. కాబట్టి ఏమి చేయలేము సగటు పాఠకులుగా ఈ విషయంలో మనము నిట్టూర్చడం తప్పితే.

నాకు బాగా నచ్చింది పుస్తకం మొత్తానికైతే. మన భారతీయ సమాజంలోని రుగ్మతలు అన్నిటికిని మెరిటోక్రసిలోనే సమాధానం ఉందని భ్రమించే మేధావులు ఎందరో ఉన్నారు మన దగ్గర కూడాను. మెరిట్ అనే మహా రథ చక్రాల కిందపడి నలిగిపోయే వారి గురించే కాదు రథం పైన ఉండి మింగలేక కక్కలేక మదనపడే వారి గురించి కూడా ఆలోచించమని అంటారు సాండల్. మితిమీరిన ఒత్తిడితో విజయం సాధించిన వర్గము బాధ పడుతూ ఉంటే అంతా నా చేతకాని తనమే అనే ఆత్మన్యూనత తో మెరిట్ రేసులో ఓడిపోయిన వారు ఉన్నారని తీర్మానిస్తారు రచయిత. ఈ మెరిటోక్రసి మహమ్మారి నుంచి బయటపడాలంటే ఇంకా ఎన్ని తరాలు ఆహుతి అవ్వాలో ఏమిటో! 

You Might Also Like

Leave a Reply