వైవిధ్యమే కవిత్వానికైనా ప్రజాస్వామ్యానికైనా ప్రాణం
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
(ముకుంద రామారావు తాజా రచన “అదే నేల – భారతీయ కవిత్వం నేపథ్యం”కి ముందుమాట.)
**************
‘రూపం అదే
ఆత్మ పరాధీనమైంది!
నేనిప్పుడు
మైదానం ముందు మోకరిల్లిన సాంస్కృతిక దు:ఖాన్ని.
భాష అదే
అక్షరం అంటరానిదైంది!
నేనిప్పుడు
అస్తిత్వాన్ని కోల్పోయిన మౌఖికాన్ని.’
ఇది కోయ కవయిత్రి పద్దం అనసూయ (తెలంగాణ) ‘ఆత్మఘోష’. ఈ ఘోష కేవలం ఆమెది మాత్రమే కాదు. భాషా సంస్కృతులు పరాయీకరణకి గురైన ఆదివాసీ జాతులందరిదీ. దేశంలో ఖాండవ దహనం జరుగుతోంది. మైదానాలు అడవిని మింగేస్తున్నాయి. హింసాత్మకంగా చొచ్చుకొస్తున్న కార్పోరేటీకరణలో అడవి అదృశ్యమై పోతుంది. అడవిలోని ఆదివాసి మాయం. వారి సంస్కృతి మాయం. వారి భాషలు మాయం. తర తరాలుగా ఆదివాసీ సమాజం పుక్కిట పట్టి కాపాడుకుంటూ వస్తున్న విజ్ఞానం, సాహిత్యం, చారిత్రిక గాథలు, స్మృతులూ అన్నీ మాయమైపోతున్నాయి. నాగరిక సమాజానికి యెడంగా జీవించే భిన్న ప్రజా సమూహాల దుర్భర జీవితాల గురించి, వారి అస్తిత్వ వేదనల గురించి, హక్కుల గురించి, మనుగడ కోసం వారు చేసే పోరాటాల గురించి, వారి సంచిత జ్ఞానం గురించి ప్రధాన స్రవంతి అని చెప్పుకునేవారికి పట్టదు. ఏ సున్నిత మనస్కులో పట్టించుకున్నా ఆధిపత్య వ్యవస్థలు అంగీకరించవు. క్రూర నిర్బంధాన్ని అమలుజేస్తాయి. భావవ్యక్తీకరణ స్వేఛ్చను హరించడానికి పూనుకుంటాయి. అభివృద్ధి యాగంలో మనిషి ఆగమై పోతున్న అమానవీయమైన కర్కశ సందర్భంలో, బుద్ధిజీవులు దీనికి పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్న తరుణంలో సహస్రాబ్దాల చరిత్ర వున్న భారతీయ కవిత్వాన్ని అంతటినీ ఒక చోట గుదిగుచ్చి తెలుగులోకి అనువదించి ‘అదే నేల’ పేరుతో వొక వుద్గ్రంథాన్ని అందిస్తున్నారు ముకుంద రామారావు. అనేక భాషల భారతీయ కవిత్వానువాదం అందించే నెపంతో యీ దేశ జన జీవనవిధానంలోని విశిష్టతనీ విలక్షణతనీ వివిధతనీ యెత్తిచూపుతూ విద్వేషాల మధ్య నిలబడి సామరస్య గీతాన్ని ఆలపిస్తున్న రామారావు కవిగా అనువాదకుడిగా సాహిత్య లోకంలో పదుగురి మన్నన పొందినవాడు.
అదే గాలి, అదే ఆకాశం, శతాబ్దాల సూఫీ కవిత్వం, నోబెల్ కవిత్వం, చర్యాపదాలు గ్రంథాల ద్వారా అనేక దేశాల కవిత్వాన్నీ, సాహిత్య చరిత్రనీ, సూఫీ తత్త్వ సారాన్నీ, నోబెల్ కవుల కవిత్వ జీవితాల్నీ, సాంధ్య భాషలో మహాయాన బౌద్ధ సిద్ధాచార్యుల ఉపదేశాల్నీ క్రోడీకరించి – అనువదించి తెలుగు నేలకు యింతకుముందే అందించిన విశిష్ట కవి, అనువాదకుడు ముకుంద రామారావు. స్వయంగా ఎనిమిది కవితా సంపుటాలు వెలువరించిన కవిత్వ పరుసవేది ముకుంద రామారావు అనువాదాలకు సైతం సృజనాత్మక శైలినీ సహజత్వ శోభనీ అద్దుతున్నారు. అనేక భారతీయ భాషల్లోకి ఆయన కవిత్వం అనువాదమయింది.
అనువాద కళని ఆపోశన పట్టిన రామారావు యిప్పుడు ‘అదే నేల’ ద్వారా భారత దేశంలోని భిన్నభాషల్లో విలసిల్లిన కవిత్వాల్ని వాటి చారిత్రక నేపథ్యంతో సహా మనముందు కుప్పబోసి దేశీయ సాహిత్య ప్రపంచంలోకి తనదైన శైలితో ఆహ్వానిస్తున్నారు. వందలాది భారతీయ భాషల నుంచి దాదాపు మూడు వేల మంది కవుల్ని యీ గ్రంథం ద్వారా ఆయన పరిచయం చేస్తున్నారు. ఏడు వందలకు పైగా కవితల్ని అనువదించి దేశంలోని భిన్న జాతుల అస్తిత్వాన్ని గుర్తించి గౌరవిస్తూనే వాటిమధ్య ఐక్యత కోసం సాంస్కృతిక వారధిని నిర్మిస్తున్నారు.
పొరుగున వున్న భాషల్లో వచ్చే సాహిత్యం గురించిన యెరుక ఆసక్తి మనకు తక్కువ. సంచలం కల్గించిన వచన రచనలనైనా అనువదించి తెచ్చుకుంటాం గానీ కవిత్వమైతే గ్రహాంతరానికి సంబంధించిన సరుకే. ఒకప్పుడు బెంగాలీ నుంచి కొన్ని రచనల్ని అనువదించుకున్నాం గానీ యిప్పుడు దానికీ దూరంయ్యాం. బయటి భాషల్లో జరిగే సాహితీ వ్యాసంగం విషయికంగా అంధత్వాన్ని ప్రదర్శిస్తోన్న కారణంగా ఆదాన ప్రదానాలు ఆగిపోయాయి. అధ్యయనం అడుగంటింది. అధ్యయనం లేమి యే భాషా సాహిత్యాలకైనా మంచిది కాదు. బావిలో కప్పల బెక బెకల్లో సృజనాత్మకత తగ్గుముఖం పట్టింది. ఈ నేలపై పెరిగిపోతున్న యీ సాహిత్య సాంస్కృతిక దూరాల్ని అధిగమించడానికి గత దశాబ్ద కాలంగా ముకుందరామారావు చేసున్న ప్రయాణంలో ‘అదే నేల – భారతీయ కవిత్వం : నేపథ్యం’ గుర్తుండిపోయే మలుపు.
నేల అదే – నేల కడుపులో దాగిన విత్తనాలు వేరు , పెరిగే పైరు వేరు. పండే పంట వేరు; కానీ పంచుకొని తీర్చుకోవాల్సిన క్షుధార్తి మాత్రం వొకటే. ఆకలి తీరాకా ఆస్వాదించే కవిత్వ మాధుర్యం వొకటే. దాని అనుభూతి వొకటే.
***
‘అదే నేల’ కేవలం భారతీయ భాషల్లో వచ్చిన కవిత్వ అనువాద రచన మాత్రమే కాదు. కవిత్వ అనువాదంతో పాటు ఆ యా భాషల సాహిత్య చరిత్రని కవిత్వ నేపథ్యాల్ని సైతం నమోదు చేస్తుంది. భిన్న కాలాల్లో ఆ యా భాషల కవిత్వంలో చోటుచేసుకున్న పరిణామాల్ని గుర్తిస్తూ అందుకు కారణమైన బాహ్య – ఆంతర పరిస్థితుల్ని వివరిస్తుంది. ఆనుషంగికంగా కాలానుగుణంగా లేదా కాలానికి యెదురీదుతూ నిర్మించుకొన్న భారతీయ కవిత్వ రీతుల్ని విశదీకరిస్తుంది. అంతిమంగా కవిత్వం ద్వారా ఆవిష్కారమైన భారతీయ ఆత్మని సాక్షాత్కరింపజేస్తుంది.
ఈ గ్రంథ రచనలో ముకుంద రామారావు అనుసరించిన ప్రణాళిక నిర్దుష్టమైందే కాదు విద్యాత్మకమైంది కూడా.
◦ ఒక భాషలో వచ్చిన కవిత్వ ప్రారంభ వికాసాల దగ్గరనుంచి ఆధునిక – అత్యాధునిక దశల వరకూ చోటు చేసుకున్న పరిణామాలన్నిటినీ స్థూలంగా పరిచయం చేయడానికి పూనుకున్నారు .
◦ ఆ క్రమంలో ఆ భాష యే యే ప్రాంతాల్లో యే యే రూపాల్లో మాండలికాల్లో చెలామణిలో వుంది వంటి సూక్ష్మ విషయాల్ని స్పృశించారు. భిన్న కాలాల్లో ఆ భాషా లిపి సంప్రదాయాల్లో వ్యాప్తిలో వచ్చిన మార్పుల్ని గుర్తించారు.
◦ ఒక భాషకు చెందిన మొత్తం సాహిత్య చరిత్రలో కవిత్వానికున్న స్థానాన్ని అంచనా వేస్తూ ఆ రంగంలో కృషి చేసిన కవుల్ని అందరినీ వొకచోట క్రోడీకరించారు.
◦ కవిత్వానికి జ్ఞానపీఠ, సాహిత్య అకాడమీ వంటి పురస్కారాలు పొందినవారిని ప్రత్యేకంగా పేర్కొన్నారు.
◦ కవిత్వ వస్తు రూపాల్లో శైలీ శిల్పాల్లో మార్పుకి కారణమైన రాజకీయ సామాజిక కారణాలని ప్రస్తావించారు.
◦ కవితా ధోరణుల్లో పద్ధతుల్లో చోటు చేసుకున్న ప్రధానమైన మైలు రాళ్ళని వివరించారు.
◦ కవిత్వ దిశని నిర్దేశం చేసి, సాహిత్య గతిని మలుపు తిప్పిన ప్రసిద్ధ కవుల కృషిని వుగ్గడిస్తూ సమకాలీనులపై, తదనంతర కవులపై, యితర భాషా రచయితలపై వారి ప్రభావాన్ని సైతం తెలియపరిచారు.
◦ అనువాదానికి ఆయన యెంపిక చేసుకున్న కవుల జీవన రేఖల్ని సంక్షేపంగా పరిచయం చేశారు. వారి రచనల్ని వాటి ప్రత్యేకతల్ని పేర్కొంటూ వారు సాధించిన విజయాల్ని – అవార్డు రివార్డుల్ని – వుటంకించారు.
◦ చివరికి ఆ యా భాషల్లోని ప్రాతినిధ్య కవుల కవితల్ని అనువదించారు.
◦ ఆ కవితల విశ్లేషణ జోలికో మంచి చెడ్డల లోతుల్లోకో వెళ్లే పని చేయకుండా ఆ పని పాఠకులకే వదిలేశారు.
అనువాదం కోసం ముకుంద రామారావు యెంచుకునే కవితలు ప్రధానంగా అభిరుచి ప్రధానమైనవే గానీ అవి ఆయన మనోధర్మాన్ని పట్టి యిస్తాయి. అభ్యుదయ – పురోగామి కవిత్వానికే ఆయన పెద్దపీట వేయడం గమనిస్తాం. బాధితల వేదనకూ ధిక్కార స్వరాలకూ కొత్త అభివ్యక్తి రీతులకూ ప్రాధాన్యం యిచ్చారు. స్త్రీల కవిత్వం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. భిన్న వాదాలకు చోటు కల్పించారు. ఆధిపత్యాల కింద అణచివేతకు గురైన జాతులకు సరైన స్థలం కేటాయించారు. సహజంగానే దళితులకు అణగారిన వర్గాల కవిత్వానికి న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం లభించేలా జాగ్రత్త వహించారు.
కవులకే కాదు అనువాదకులకు సైతం వారిదైన ప్రాపంచిక దృక్పథం వుంటుంది. కవుల, కవితల ఎంపిక కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. అనువాదకుడిగా ముకుందరామారావుది ప్రజాస్వామిక దృక్పథం. అది కవితల స్వీకరణ లోనే కాదు; యీ గ్రంథ రచన ప్రణాళికలో సైతం అగపడుతుంది. అందుకే ఆయన రాజ్యాంగం గుర్తించిన భాషలకు మాత్రమే పరిమితం కాలేదు. అలా కాకపోవడం వల్ల యీ గ్రంథానికి గొప్ప విస్తృతి లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించే భాషలకు కూడా చోటు కల్పించారు. వాడుకలో లేని భాషలను సైతం ఆయన స్వీకరించారు. అందులో భాగంగా సంస్కృతం పాలీ ప్రాకృతం వంటి ప్రాచీన భాషల్లోని సాహిత్యాన్ని సూక్ష్మంగా పరిశీలించారు. జాతుల వైషమ్యాలతోనూ పాలకుల సైనిక చర్యలతోనూ రాజకీయంగా అల్లకల్లోలంగా వుండే ఈశాన్య భారతానికి ప్రత్యేక సాహిత్య ప్రతిపత్తిని కల్పించడంలోనే రామారావు దృక్పథం వెల్లడవుతుంది. కాశ్మీరీ పంజాబీ కవిత్వాల సామాజిక నేపథ్యాల్ని వివరించిన సందర్భాల్లో సైతం ఆయన పీడిత పక్షమే వహించారని నాకనిపించింది.
అన్నిటికీ మించి నాకెంతో ఇష్టమైన ఆదివాసీ కవిత్వానికి ఆయన వొక ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించారు. అంతరించిపోయే ప్రమాదం అంచున వున్న భాషలకు గౌరవప్రదమైన స్థానం కల్పించారు . గుర్తింపుకి నోచుకోని కవుల్ని వారి కవితల్నీ గుండెకు హత్తుకున్నారు.
ఆధిపత్య భాషా సంస్కృతుల కింద నలిగే పీడిత ప్రజల అస్తిత్వ వేదనతో ఆత్మీయంగా మమేకమైనందువలనే
‘నా మాతృభాష
అమ్మ నోటిలోనే
ఖైదీ అయిపొయింది
కలల భారం కింద
మాతృభాష నలిగిపోయింది’
అని ఆవేదన చెందిన ఝార్ఖండ్ ఆదివాసీ కవయిత్రి జసింత కర్కెట్ట ఉరావ్ భాషలో వ్యక్తం చేసిన దు:ఖాన్ని గొప్ప సహానుభూతితో నమోదు చేయగలిగారు.
అంతరించిపోయే ప్రమాదం యెదుర్కుంటున్న భాషల పట్ల ప్రేమతో ముకుందరామారావు ఆ యా భాషల్లో లిఖిత – అలిఖిత రూపాల్లో లభించే కవిత్వాన్ని సేకరించే సాహసానికి పూనుకున్నారు. ఆ క్రమంలో లిపి లేని అనేక భాషల్లో మౌఖికంగా ప్రచారంలో వున్న మరుగున పడి వున్న అమూల్య సాహిత్య రత్నాలను వెలికితీశారు. అందుకోసం రామారావు చేసిన పరిశోధన వెలలేనిది. పడిన శ్రమ అమోఘమైంది. సమాచార సేకరణకు యెదురైన ప్రతి తలుపూ తట్టారు. ఆ యా భాషలకు చెందిన యెందరో కవుల్ని ఆయన సంప్రదించారు. వెదికి వెదికి సంపాదించిన గ్రంథాలకు లెక్కే లేదు. ఇంటర్నెట్ ని తవ్విపోశారు. వందలాది సంవత్సరాల భారతీయ కవిత్వ చరిత్రలో ప్రసిద్ధులైన వేలాది కవుల పేర్లు; వారి జీవిత కాలాల వివరాలతో సహా; నమోదు చేయడం వల్ల యిది భారతీయ కవిత్వానికి సమగ్ర సూచిలా గోచరిస్తుంది. అదే విధంగా అనుబంధంలో చేర్చిన సమాచారం కూడా యెంతో విలువైనది. వెరసి యీ గ్రంథం భారతీయ భాషల కవిత్వ సర్వస్వంగా రూపొందింది అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆ విధంగా పరిశోధకులకు గొప్ప ఆకర గ్రంథంగా వుపయోగపడుతుంది.
ప్రాంతం, జాతి, భాష యేదైనా దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకొని దాన్ని కాపాడుకోడానికి కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకూ భిన్న కాలాల్లో వెల్లివిరిసిన భారతీయ కవిత్వం దోహదపడుతుందనీ వైవిధ్యమే యీ దేశపు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అనీ ‘అదే నేల’ గ్రంథం మరోసారి నిరూపిస్తుంది.
***
చివరిగా వొకమాట :
‘నువ్వు నా నాలుకని తీసుకున్నావు
నాకిప్పుడు భాష లేదు.’
అన్న భిల్ ఆదివాసీ కవి రంధీర్ ఖరే కి సమాధానం చెప్పాల్సిన అవసరం నుంచి ‘అదే నేల’ గ్రంథం పురుడు పోసుకుంది. సమాధానం కోసం అన్వేషించడానికి పురిగొల్పితే అనువాదకుడిగా ముకుందరామారావు శ్రమ సఫలమైనట్టే. అయితే భారతీయ కవిత్వం మహా సముద్రమంత గంభీరమైనదీ విశాలమైనదీ. ముకుందరామారావు తానొక పాత్రతో దాన్నుండి శక్తిమేరకు తోడి మనకు అందిస్తున్నారు. మనం మన పాత్రతో బయలుదేరదాం.
తెగిపడ్డ నాలుకల్ని అతికించే ప్రయత్నం యిది. భిన్న భాషల అనేక అస్తిత్వాల్ని గౌరవించే ప్రజాస్వామిక దృక్పథం నుంచి పుట్టిన రచన యిది. ఏ విశ్వవిద్యాలయమో అకాడమీనో వొక పది మంది రచయితల సామూహిక కృషిగా వెలువరించాల్సిన గ్రంథం యిది. ఇంతకు ముందు యే భారతీయ భాషలోనూ యిటువంటి ప్రయత్నం జరగలేదు. ఇంతటి బృహత్ కార్యాన్ని వొంటిచేత్తో నిర్వహించిన ముకుందరామారావు అనేకధా అభినందనీయుడు.
హైదరాబాదు ఎ. కె. ప్రభాకర్
20 జూన్ 2019 సంపాదకుడు
ఏల్చూరి మురళీధరరావు
తెలుగులో ఏ ఒక్కరూ చేపట్టి యెరుగని అపురూపమైన ప్రణాళికతో ఇంతటి బృహత్కార్యక్రమాన్ని అద్భుతావహంగా నెరవేర్చి భాషాసాహిత్యాలను సుసంపన్నం చేసిన ప్రముఖ సత్కవి శ్రీ ముకుంద రామారావు గారికి, ఆసక్తికరమైన పరిచయంతో కృత్యధ్యయనకౌతుకాన్ని కలిగించిన విద్వద్విమర్శకులు శ్రీ ప్రభాకర్ గారికి అభినందనలు. అచిరకాలంలో ఇది విశ్వవిద్యాలయాలలో పాఠ్యగ్రంథమై పఠనపాఠనముఖాన మరుగైపోతున్న భాషలకు, మరపుకు రాకూడని మంచి కవులకు చిరంజీవితను కల్పింపగలదని విశ్వసిస్తున్నాను.
ఏల్చూరి మురళీధరరావు
తెలుగులో ఏ ఒక్కరూ చేపట్టి యెరుగని అపురూపమైన ప్రణాళికతో ఇంతటి బృహత్కార్యక్రమాన్ని అద్భుతావహంగా నెరవేర్చి భాషాసాహిత్యాలను సుసంపన్నం చేసిన ప్రముఖ సత్కవి శ్రీ ముకుంద రామారామారావు గారికి, ఆసక్తికరమైన పరిచయంతో కృత్యధ్యయనకౌతుకాన్ని కలిగించిన విద్వద్విమర్శకులు శ్రీ ప్రభాకర్ గారికి అభినందనలు. అచిరకాలంలో ఇది విశ్వవిద్యాలయాలలో పాఠ్యగ్రంథమై పఠనపాఠనముఖాన మరుగైపోతున్న భాషలకు, మరపుకు రాకూడని మంచి కవులకు చిరంజీవితను కల్పింపగలదని విశ్వసిస్తున్నాను.