గెలుపు దారిలో ….

వ్యాసకర్త:‌ ఎ.కె.ప్రభాకర్

(ఈ నెల 25 న విడుదల కానున్న శిరంశెట్టి కాంతారావు నవలకు ముందుమాట. పదవీ విరమణ సందర్భంగా శుభాభినందనలతో …)
**************

అజ్ఞానపుటంధ యుగంలో కనిపించని తీవ్ర శక్తులేవో నడిపిస్తే నడిచిన మనుషులు యెవరో యెప్పుడో తెలిసో తెలీకో చేసిన చేయని నేరాలకే కాదు చేయబోయే నేరాలకు కూడా శిక్షలనుభవించే జాతులు దేశంలో చాలా వున్నాయి. వ్యవసాయం చేయక కులాధిపత్యాలకు లొంగక లోకం పోకడలోని మాయా మర్మం తెలీక వేటకో ఆహారసేకరణకో పరిమితమైన జాతుల్ని నాగరిక సమాజం నేరస్తులని ముద్రవేసి వూరికి దూరం వుంచింది. డి నోటిఫికేషన్ చట్టాలెన్ని వచ్చినా వూరి బయటి అంచుల్లోనే జీవిస్తున్న జాతుల్లో ఎరుకల జాతి కూడా వొకటి.
ఎరుకల వారంటే ఎరుక గలవారు. ఎరుక (సోదె) చెప్పేవారు. భూత భవిష్యద్ వర్తమానాల్ని చూడగలిగినవారు. కానీ వారికి గతం అందదు. వర్తమానం అనుకూలించదు. భవిష్యత్తు గోచరించదు. బతుకంతా దినదిన గండం. కాలంతో నిమిత్తం లేని కష్టాలే. అనుదిన పోరాటమే. నిత్య సంఘర్షణే. ఆ సంఘర్షణకి అక్షర రూపమే శిరంశెట్టి కాంతారావు ‘వాళ్ళు గెలవాలి’ నవల.

ఎరుకలు అడివికి పొయ్యి ఈత మెల్లె , ఈతాకూ కోసుకొచ్చి మెల్లె తోటి పెండ తట్టలు, చిన్న చిన్న గుల్లలు, గంపలు అల్లుతారు. ఈతాకుతో చాపలు అల్లుతారు. చీపురుకట్టలు కడతారు. వాటిని చుట్టుపక్కలున్న వూళ్ళల్లో సంతల్లో తిరిగి అమ్ముకుంటారు. పందులు పెంచుతారు. పంది పెంటని అమ్ముతారు. అటు పూర్తిగా అడవికి చెందినవాళ్ళు కాదు. ఇటు వూరూ వీరిని దగ్గరకు తీయదు. వూరికి పెడగా గుడిసెల్లో పందులతో సహజీవనం. వూరికి వెలిగా దూరంగా పందుల్లో పందుల్లా బతికినంతకాలం వూరి పెత్తందార్లకి పట్టింపులేదు. వూరికి దగ్గరయ్యే క్రమంలోనే ఘర్షణ. కూలి పనులకు వెళ్తారు కానీ వారికి వూరు యెప్పుడూ అంటరానిదే. యెప్పటికీ కలుపుకోదు. అట్లని ప్రిమిటీవ్ ట్రైబల్స్ లా అడవికీ చెందరు.

నవల్లో ఎరుకల వెంకటయ్య కుటుంబం యెదుర్కొన్న ప్రధాన సమస్య అదే. సామాజికంగా అతను తమకొక గుర్తింపు కోరుకున్నాడు. అదే నేరమైంది. ఒక స్థిర నివాసంకోసం, నిలవ నీడకోసం, సేద్యానికి చారెడు నేలకోసం, నాలుగు అక్షరమ్ముక్కలు నేర్చుకొని మంచి బట్ట కట్టుకొని తలెత్తుకొని హుందాగా బతకడం కోసం, సామాజిక భద్రత కోసం, మెరుగైన జీవిక కోసం, ఆత్మ గౌరవంతో స్వతంత్రంగా జీవించడం కోసం వొంటరి పోరాటం చేసిన వెంకటయ్య యీ అసమ సమాజంలో యెప్పటికైనా గెలవాలి అన్న ఆకాంక్షతో శిరంశెట్టి రాసిన యీ నవల ‘నవతెలంగాణా’ మూడో వార్షికోత్సవాల సందర్భంగా ప్రథమ బహుమతి పొందింది. అణగారిన జాతులు సామాజిక న్యాయంకోసం చేసే పెనుగులాటనీ యెదుర్కొనే సంఘర్షణనీ వాస్తవదూరం గాని జీవిత సంఘటనలతో చిత్రించడంవల్ల రచన ప్రామాణికంగా రూపొందింది. ఎరుకలు లాంటి జాతి ప్రజల అభివృద్ధి మార్గాల గురించి, చట్టబద్ధమైన హక్కుల గురించి, వాటి సాధన గురించి నవల్లో రచయిత యెన్నోఅంశాల్ని చర్చకు పెట్టాడు. అనేక యథార్థ సంఘటనలని నేపథ్యం చేసుకొని దాదాపు ముప్పై యేళ్ళకు పూర్వం ఎరుకల జీవితాల్లో చోటుచేసుకున్న సామాజిక చలనాన్ని వ్యాఖ్యానించినందువల్ల యిది విలక్షణమైనది.

ఏ రచయితకైనా తనది కాని జీవితాన్ని సాహిత్యీకరించం కత్తిమీద సామే. ఆ విద్యని శీరంశెట్టి వొక పూనికతో సాధిస్తున్నాడని అతని యింతకు ముందు రచనలు కూడా తెలియజేస్తున్నాయి. ఉత్తరాంధ్ర బీల భూముల్లో థర్మల్ పవర్ ప్రాజెక్టు స్థాపనకోసం పాలకులు సృష్టించిన ‘ఆకుపచ్చ విధ్వంసం’ గురించి ఆ ప్రాంతపు రచయితలే పెద్దగా రాయనప్పుడు (అట్టాడ అప్పల్నాయుడు లాంటి వొకరిద్దరు మినహాయించి) కాంతారావు పాల్వంచ నుంచి సోంపేట కాకరపల్లి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలతో మమేకమై వుద్యమంలో పాల్గొన్న జన జీవితాన్ని అనేక కోణాల్లో అధ్యయనం చేసి నవల రాశారు. ఇప్పుడు ‘వాళ్ళు గెలవాలి’ కోసం కూడా అంతకంటే యెక్కువే కష్టపడ్డారు. ఎరుకల సామాజిక జీవితాన్నీ సంస్కృతినీ ఆచార వ్యవహారాల్నీ ప్రత్యక్షంగా స్వయంగా చూసి అవగాహన చేసికొని వాటికి నవలా రూపం ఇవ్వడంలో ఆయనలోని నిబద్ధరచయిత యెక్కడా స్వీయకల్పనకి చోటివ్వలేదు. యథార్థ ఘటనలకు సాహిత్య రూపం యివ్వడానికి పాత్రోచితమైన భాషతో, కమ్మటి తెలంగాణ నుడికారాన్ని మేళవించి పాపులర్ రచనా శైలిని యెన్నుకున్నాడు. ఇంతకు ముందు ఎరుకల జీవితం యితివృత్తంగా అరుణ ‘ఎల్లి’ నవల వచ్చింది. ఎరుకల ఘనీభవించిన సంస్కృతిలో స్త్రీ పురుష సంబంధాల గురించి లోతుగా విశ్లేషించిన నవల అది. ఎరుకల సాంస్కృతిక జీవిత నేపథ్యం ఆ నవల్లో గొప్పగా ఆవిష్కృతమైంది.

కానీ చుట్టూ వున్న సమాజంలో చోటు చేసుకొనే అనేక పరిణామాలు ఎరుకల జీవితాలపై చూపిన ప్రభావాన్ని, తెచ్చిన ఆర్థిక సాంస్కృతిక ఆవరణలో పొరల్లో సంభవించిన కదలికను గుర్తించి చిత్రించిన నవల ‘వాళ్ళు గెలవాలి’. సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా పైకి యెదగడానికి పట్టుదలతో ప్రయత్నించి గెలిచిన వ్యక్తుల జీవన పోరాటం యీ నవలకు ప్రధాన సూత్రం. అట్టడుగు వర్గాలు అడుగడుగునా యెదురయ్యే వోటముల్ని అధిగమించి జీవితాన్ని గెల్చుకోడానికి వొక నిర్దిష్టమైన దారి చూపే ప్రయత్నంలో చేసిన రచనయిది. అందువల్ల యిది ఫిర్యాదు నవల కాదు; మూడు తరాల బతుకు పోరాట కథ.

కులం కట్టుబాట్ల నుంచి తలరాతల భావజాలం నుంచి బయటపడడానికి భయపడే ముత్తవ్వయిందులో తొలి తరానికి ప్రతినిధి. ‘మేం ఏకలవ్యుని సంతతోల్లం. ఎనకటి కాలంల మేం రాజులం.’ అన్న స్పృహ వెంకటయ్య తరానికి యేర్పడింది. నవల్లో అది తొలి ఆత్మ గౌరవ ప్రకటన. అయితే ‘ఎప్పటిదో ఏకలవ్యుని కాలం నాటి ముచ్చట, లేకుంటె కాకతీయులకాలం నాటి ముచ్చెట ముందలబెట్టుకొని మనం రాజులం , మొగదీరులం అంకుంట ఇప్పుడు పెగ్గెలు గొడితె నడవది’ అన్న గ్రహింపుకు వచ్చి ప్రభుత్వం నడిపే సంక్షేమ హాస్టల్లో పెట్టి పిల్లల్ని చదివించాడు. అయితే అదంత తేలిగ్గా జరిగే పని కాదు. ‘వీళ్ళ పిలగాండ్లు బాగ సద్వి కలెక్టర్లయితరంట’ వంటి ఎగతాళి మాటల మధ్య, ‘వాల్లను జూసి ఊల్లె ఇంకొంతమంది అలగాజనం గూడ అట్లనే వాళ్ళ పోరగాళ్ళను గూడ సదువుల్ల బెడితె రాబోయే రోజుల్ల మన పశుల కాడ జీతగాని పోరలకు కరువొస్తది’ అన్న దుర్మార్గపు ఆలోచనల్ని యెదుర్కొంటూ … పొద్దున్నే లేచి పేపర్ వేస్తూనో సాయంత్రం పూట సినిమా హాల్లో షోడాలమ్ముకుంటూనో సంపాదించుకున్న పైసలతో ఒక పూట తిని ఒక పూట తినక అర్ధాకలితో సరస్వతీ నిలయాల మెట్లెక్కి చదువు నేర్చుకోవడం, నేర్చి వుపాధి సమకూర్చుకోవడం వొక భీకర యుద్ధమే. పందులు కాసుకొనే వాడికి చదువెందుకు అనే అవహేళనలు యెంతగా కుంగదీస్తాయో ఆ అవమానాలు స్వయంగా అనుభవిస్తేనే గానీ తెలీదు.
దళిత క్రిస్టియన్ టీచర్ దంపతులు జాన్సన్ జయవాణి వెంకటయ్య కుటుంబానికి ఆసరాగా నిలిచారు. పిల్లల్ని సొంత బిడ్డల్లా తమ ఇంట బెట్టుకొని విద్యా బుద్ధులు నేర్పారు. ఎస్సీ ఎస్టీల మధ్య వెల్లివిరియాల్సిన ఐక్యతని సుహృద్భావ బాంధవ్యాన్ని ఆదర్శీకరించడంలో భాగంగా నవల్లో యీ సంఘటన చోటుచేసుకుంది.

వెంకటయ్య రెండో కొడుకు దేవేందర్ సాలె కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం నవల్లో ప్రధానమైన మలుపు. బయటి ఊళ్ళకి వెళ్లి చదువుకోడానికి యెదుర్కొన్న యిబ్బందులకన్నా క్లిష్టమైన సమస్య యిది. పోలీసుల ప్రమేయంతో వూరి పెద్దల జోక్యంతో కుటుంబం జైలు పాలైంది. దొర చేతిలో చావు దెబ్బలు తింటున్న కొడుకుని కాపాడుకొనే క్రమంలోనే వెంకటమ్మ వూరి దొర మీద తిరగబడింది. పరువు హత్యగా పరిణమించాల్సిన వాళ్ళ ప్రేమ పిల్లలు తెలివితో చాకచక్యంగా పావులు కదపడం వల్ల చివరికి పెళ్ళిగా పరిణమించింది గానీ దానికి ముందు ఆ కుటుంబం అవమానంతో వూరు వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పాత వూళ్ళో యెదుర్కొన్న సమస్యలు సామాజికమైనవి. కొత్త వూళ్ళో ఆర్ధిక పరమైన కష్టాలు తోడయ్యాయి. అడవిని కొట్టి కొంత భూమిని పొతం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించే క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు, వాటిని అమలుపరచే అధికారులు సహకరించినా వూరి పెద్ద నుంచి వ్యతిరేకత యెదుర్కో వలసి వస్తుంది. నేర్చిన కొద్దిపాటి చదువుల ద్వారా పొందిన ఉపాధి అవకాశాలతో ఆర్థికంగా వొక మెట్టు పైకి యెక్కగలిగారు కానీ సాంఘికంగా అవమానాలు కొనసాగుతూనే వుంటాయి. చదువుల ద్వారా జీవితాలకు యేర్పడ్డ భరోసా నామమాత్రమే. అటువంటి పరిస్థితుల్లో దేవేందర్ నక్సలైట్ అనుబంధ యువజన సంఘానికి దగ్గరవుతాడు. స్థానికంగా జరిగే అన్యాయాలకు యెదురు నిలుస్తాడు. కానీ అది కొద్ది కాలమే. ఆ తర్వాత కరణీకాల రద్దుతో కొత్తగా యేర్పడ్డ విలేజ్ అసిస్టెంట్ వుద్యోగంలో చేరతాడు. యువజన సంఘంలో పొందిన రాజకీయ అనుభవంతో విఏఓల సంఘానికి (గ్రామపాలనాధికారుల సమాఖ్య) రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందుతాడు. ప్రభుత్వ పథకాల్ని అర్థం చేసుకుని అందిపుచ్చుకోవడం ద్వారా యిల్లూ భూమీ లభించాయి గానీ ఎరుకల వెంకటయ్య యెదుగుదలని సహించలేని వూరి పెత్తందార్లు వాళ్ళ మీదకి కోయజాతి ఆదివాసీలను రెచ్చగొట్టి వెంకటయ్య కుటుంబానికి ఖాయం చేసిన అసైన్డ్ భూమిని ఆక్రమించుకోనేలా చేస్తారు. ఊరి ఎస్టీలకు అడవి ఎస్టీలకూ మధ్య వైరుధ్యాల్ని సృష్టించినప్పటికీ , స్థానిక భూస్వాముల్నీ, మంత్రి స్థాయి రాజకీయ నాయకుల్నీ, కలెక్టర్ స్థాయి అధికారుల్నీ, మీడియానీ యెదుర్కొని ట్రైబల్ కోర్టులో న్యాయపరమైన పరిష్కారాన్ని సాధించి వాళ్ళు గెలుస్తారు.

ఇదీ స్థూలంగా నవల్లో కథ. ఇది వెంకటయ్య కథ. వెంకటయ్య కొడుకూ కోడళ్ళ కథ. కథ చెప్పే క్రమంలో రచయిత ఆదివాసీ హక్కుల సాధనకు సంబంధించిన అనేక పార్శ్వాలను స్పృశిస్తున్నాడు. గిరిజనుడు ముందుగా రాజ్యాంగ బద్ధంగా తనకు తెలిసిన హక్కుల గురించి యెరుక కలిగి వుండాలి. తర్వాత దాన్ని సాధించుకొనే తెరువు తెలుసుకోవాలి. నవల్లో రచయిత రెండు దార్లు చూపాడు. ఒకటి సాయుధ పోరాట మార్గం. రెండు పార్లమెంటరీ పంథా. దేవేందర్ తొల్త నక్సలైట్ నాయకుడు మధుసూదన్ ప్రభావంతో యువజన సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఊళ్ళో వ్యవసాయ కూలీలకు జీతగాళ్ళకు కూలిరేట్లు పెంచడానికి పోరాటం చేసాడు , షావుకార్ల భూస్వాముల వడ్డీవ్యాపారుల దోపిడీకి యెదురునిలిచాడు. తునికాకు, కట్టె కోపుల కాంట్రాక్టర్ల దౌర్జన్యాలకు అడ్డు బడ్డాడు. పోలీసులనుండి వచ్చిన యెన్ కౌంటర్ బెదిరింపుతో తాహసీల్దారు సలహా మేరకు ప్రజోద్యమాలకు దూరమై పార్లమెంటరీ రాజకీయాల్ని అనుసరిస్తాడు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తాడు. అయితే దేవేందర్ మధుసూదన్ ఆచరణతో గానీ అతని పార్టీ భావజాలంతో గానీ యెక్కడా విభేదించినట్టు రచయిత చెప్పలేదు. పై పచ్చు వూళ్ళో జనాలకి తాసీల్దారు తో సహా మధుసూదన్ పట్ల అతని కార్యక్రమాలపట్ల సానుభూతి వున్నట్లే పేర్కొన్నాడు. ఈ వైరుధ్యాన్ని బలంగానే యెత్తి చూపినప్పటికీ రచయితగా కాంతారావు తనెటు నిలబడ్డాడో ఖండితంగా స్పష్టం చేయలేదు. ఇదీ పరిస్థితి అని మాత్రమే చెప్పి వూరుకున్నాడు. దేవేందర్ ప్రజా వుద్యమాలకు దూరమైనా అక్కడ పొందిన అనుభవాలు మాత్రం అతనికి వ్యక్తిగతంగా జీవితాన్ని గెలవడానికీ, సమాజాన్ని అర్థం చేసుకోడానికీ తోడ్పడ్డాయి.

ప్రభుత్వాలు యెన్ని అభివృద్ధి మంత్రాలు జపించినా సంక్షేమ పథకాలు అల్లినా గిరిజనుల జీవితాల్లో వెలుగు యెందుకు నిండటం లేదు అన్న ప్రశ్నకి సమాధానం కూడా యీ నవల్లో పరోక్షంగా కనిపిస్తుంది. అధికారపార్టీలో బలమైన శక్తిగా యెదిగి మంత్రిగా మారిన వూరి దొర రెడ్డి, స్థానిక రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రకాశం , ఆదివాసీ హక్కుల్ని రక్షించాల్సిన గిరిజన మంత్రి , కలెక్టర్ , ఐ టి డి ఎ పి వొ మొ. అధికారులూ వెంకటయ్య పోడు చేసుకున్న భూమిని అతనికి దక్కకుండా చేయడానికి వొక్కటవుతారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని శాసించే అగ్రకుల ఆధిపత్య రాజకీయాలు, అధికారుల అలసత్వం, చిత్తశుద్ధి లేని పాలకుల ద్వంద్వ వైఖరి గిరిజనులకు శాపంగా పరిణమిస్తున్నాయి. సహనం కోల్పోయి ఆదివాసీలు అనివార్యంగా ఆయుధాలు అందుకుంటున్నారు. రాజ్యహింసకి బలవుతున్నారు. అయితే వెంకటయ్య కుటుంబం తెలివితో దూరదృష్టితో చట్టపరమైన హక్కుల్ని వినియోగించుకొని న్యాయపోరాటం చేసి తమ యెదుగుదలకు అడ్డం వచ్చిన ప్రతి సమస్యనీ అధిగమించారని రచయిత నవల్లో ప్రతిపాదించాడు.

న్యాయ వ్యవస్థ పై రాజకీయ వొత్తిడులు ప్రభావం చూపెట్టవు అనుకోడానికి వీల్లేదు. న్యాయదేవత సంపన్నుల దొడ్డి గుమ్మంలో తొక్కుడుబిళ్ల ఆడుకుంటోంది. ఎనభై శాతం అంగ వైకల్యంతో, తీవ్ర అనారోగ్యంతో బాధపడే విశ్వవిద్యాలయం ఆచార్యుణ్ని సైతం రాజద్రోహిగా అండా సెల్ లో బంధించగలదు. ఇవ్వాళ దేశంలో న్యాయానికి వర్గం, కులమే కాదు మతం వుంది. అలా అన్జెప్పి అణగారిన వర్గాలు హక్కుల సాధన కోసం చట్ట బద్ధమైన పోరాటాలు చేయగూడదనీ తీర్మానించలేం. అందివచ్చే అన్ని ఆయుధాల్నీ వుపయోగించుకుంటూనే ప్రత్యామ్నాయ వ్యవస్థని సాధించేదిశగా నడవాల్సి వుంటుంది.

ఎందుకంటే పాలకవర్గాలే 1/70, పెసా వంటి చట్టాల్ని తుంగలో తొక్కి దళిత గిరిజన కుటుంబాలకు అసైన్ చేసిన భూముల్ని సైతం గుంజుకుని కార్పోరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాయి. ప్రైవేట్ కంపెనీలకు దళారులై ఆదివాసీలను అడవికి దూరం చేస్తున్నాయి. అటవీ వనరుల్నీ ఖనిజ సంపదనీ మల్టీ నేషనల్స్ కి అప్పనంగా దోచిపెడుతున్నాయి. సెజ్ లు కట్టి అడవికీ ఆదివాసీకి మధ్య కంచెలు నిర్మిస్తున్నాయి. దశాబ్దాల తరబడి యెందరో ప్రాణాలిచ్చి పోరాడి సాధించుకొన్న చట్టాలకి విలువ లేకుండా చేస్తున్నాయి. బతుకు తెరువు కోల్పోడానికి సిద్ధంగాలేని అడవి బిడ్డలు జల్ జమీన్ జంగిల్ పై తమ హక్కులగురించి మాట్లాడితే తీవ్రవాదులనో అభివృద్ధి నిరోధకులనో ముద్ర వేస్తున్నాయి. సైన్యాన్ని కిరాయి హంతకుల స్థాయికి దిగజార్చి అడ్డువచ్చినవాళ్ళని అణచివేస్తున్నాయి. ఆదివాసీల మధ్య తంపులు పెడుతున్నాయి(నవల్లో ఎరుకలవారికీ కోయలకూ మధ్య సృష్టించిన వైరుధ్యం అటువంటిదే). మరిప్పుడు యే న్యాయ స్థానాల ద్వారా వెంకటయ్య గానీ అతని సంతానం గానీ తమ భూముల్ని కాపాడుకోగలరు? రాజకీయ నాయకుల అధికారుల అండదండలతో న్యాయాన్నీ చట్టాల్నీ అగ్రకుల సంపన్నులు డబ్బుతో కొనేయడం గ్రహించిన వెంకటయ్య చిన్న కొడుకు లా కోర్స్ చేస్తానని బయలుదేరతాడు. ఏదో విధంగా చదువు పూర్తి చేయగలడేమోగానీ కార్పోరేట్ లా కంపెనీల డ్రాయింగ్ రూముల్లో రూపొందే అంతిమ తీర్పుల్ని ఎలా తిరగరాయగలడు?

‘వాళ్ళు గెలవాలి’ లో న్యాయ పోరాటంలో వాళ్ళు గెల్చి వుండొచ్చు గానీ అది తుది పోరు కాదు. అంతిమ విజయం కూడా కాదు. శత్రువు దగ్గర అనేక వ్యూహాలున్నాయి. యెత్తుగడలున్నాయి. ఆయుధాలున్నాయి. మతం వాటిలో పదునైనది. ఏకలవ్యుని బొటనవేలు కాజేసినవారే రాజ్యాలేలుతున్నారు. వేళ్ళు నరకడమే కాదు; నరికిన వేళ్ళతోనే కళ్ళు పొడుస్తున్నారు. అప్పటి మనువాద భావజాలలే మరింత హింసాత్మకంగా అమలవుతున్నాయి . వాటి లక్ష్యం దళితులూ గిరిజనులే. వాళ్ళని వొకరి మీదకు మరొకర్ని వుసిగొల్పుతున్నారు. ఇప్పుడు బతకడానికీ బతికి బట్టకట్టడానికీ నిలవడానికీ నిలబడి గెలవడానికి మనం మరింత అప్రమత్తంగా వుండాలి. మరింతగా బలపడాలి. అందుకు వొంటరి పోరాటాలు చేసే వెంకటయ్యలు సమూహం కావాలి. సామూహిక స్పృహతో ప్రత్యామ్నాయ రాజకీయ పోరాటం చేయడం ద్వారానే నూతన ప్రజాస్వామిక వ్యవస్థని నెలకొల్పగలం. న్యాయ పోరాటం ద్వారా భూమి దక్కించుకున్నప్పటికీ యింకా ‘వాళ్ళు గెలవాలి’ అని కోరుకోవడంలో రచయిత వుద్దేశం అదేనేమో!

అవునో కాదో చదివి చెప్పండి.
సెలవ్.
ఎ కె ప్రభాకర్
హైదరాబాదు
జూలై 31, 2018.

You Might Also Like

One Comment

  1. వనం జానకీ దేవి

    కాంతారావు గారి శైలి అద్భుతంగా ఉంటుంది..ఏవిషయమయినా సమగ్ర పరిశోధన చేసి మనకు అందిస్తారు ..మీ రివ్యూ చాలా బాగుంది..

Leave a Reply