ప్రయోగ ప్రయోజనాల మధ్య నలుగుతున్న తెలుగు నవల
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
(ఈ నెల 28 న విడుదల కానున్న కె.పి. అశోక్ కుమార్ ‘తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం’ పుస్తకానికి రాసిన ముందుమాట.)
***********
‘సాహిత్య రంగంలోనే కాదు, ఏ రంగంలోనూ శాశ్వత సూత్రాలు ఉండవు. అప్పటికి మనకున్న జ్ఞానాన్ని బట్టి ఏదో ఒక విషయం మీద ఒక సిద్ధాంతం చేస్తాం. ఒక అభిప్రాయం చెపుతాం. ఇక ఆ విషయం మీద ఎంతకాలం గడిచినా ఆ సిద్ధాంతమే ఆ అభిప్రాయమే చెపుతూ పోకూడదు. ఎప్పటికప్పుడు పునర్విమర్శ చేసుకోవాలి. అభివృద్ధి పొందిన జ్ఞానం, నూతన జీవితానుభవాల వెలుగులో అంతకు పూర్వం మనమే చెప్పిన ప్రతివిషయాన్నీ చర్చించుకోవాలి. అవసరమైతే పూర్వాభిప్రాయాల్ని వదులుకోవటానికి సిద్ధపడాలి.’
-త్రిపురనేని మధుసూదనరావు
తెలుగులో మేగ్నం వోపస్ (magnum opus) అనదగ్గ నవల రాలేదని ప్రసిద్ధ నవలా రచయిత డా. కేశవరెడ్డి తరచుగా ప్రస్తావిస్తుండేవారు. తెలుగు సమాజాన్ని ప్రతిబింబిస్తూనో వ్యాఖ్యానిస్తూనో కొత్త నవల పుట్టిన ప్రతి సందర్భంలోనూ దీన్ని పునర్విమర్శ చేసుకుంటూనే వున్నాం. కావాల్సినంత – తవ్వి తీయాల్సిన గతం, సంక్లిష్ట భరితమైన వర్తమానం వున్న సమాజంలో ఆధునిక మహేతిహాసం పుట్టకపోవడం ఆశ్చర్యమే. కేశవరెడ్డి అభిప్రాయంతో విభేదించేవాళ్లైనా ప్రపంచస్థాయిలో కాకపోయినా కనీసం పొరుగున వున్న కన్నడ తమిళ భాషల్లో గానీ యితర భారతీయ భాషల్లో వెలువడ్డ నవలల్తో పోటీ పడగల రచననైనా తెలుగులో చూపించలేరు. బాలగోపాల్ మరో అడుగు ముందుకు వేసి డాస్తయెవ్ స్కీకి పదోవంతు సరితూగగల నవలా రచయిత తెలుగులో లేడని నిర్మొహమాటంగా తీర్మానించాడు. నవల ప్రధానంగా బూర్జువా సాహిత్య రూపం కాబట్టి ప్రగతిశీలంగల బలమైన బూర్జువా వర్గం మన దగ్గర లేకపోవడమే ఆ లోటుకి కారణమేమోనని కాస్త సందేహిస్తూనే కుండ బద్దలు కొట్టాడు. ప్రజా వుద్యమాలు బలపడితే మంచి నవలలు వస్తాయని ఆశంసించాడు. ఆ విధంగా మంచి సాహిత్యం పుట్టుక కోసమైనా బలమైన ప్రజా వుద్యమాలు అవసరమని తెలుస్తోంది. మరో పాతికేళ్ళు గడిచాకా చినవీరభద్రుడు యిటీవల ‘నీల’ నవలకి ముందుమాటలో తెలుగు నవల వికాసం గురించి రాస్తూ ‘తెలుగు నవల ఇంకా విక్టోరియన్ కాలపు శిల్పం దగ్గరే ఆగిపోయింది’ అని వాపోయాడు. నూట యాభై సంవత్సరాల తెలుగు నవలా చరిత్రలో వస్తు శిల్పాల్లో నవీనత , వైవిధ్యం ప్రదర్శించిన రచనలు కొన్ని వున్నప్పటికీ , దాదాపు నలభై వేల నవలలు గుట్టలుగా పోగుపడినప్పటికీ రచయితల్లో మౌలికమైన ఆలోచనలు పురుడుపోసుకోక పోవడంవల్ల సొంతదనం మచ్చుకైనా కనిపించక పోవడం వల్ల యీ దు:స్థితి దాపురించిందేమో! ఆభిజాత్యానికి పోకుండా యీ చేదు వాస్తవాన్ని స్వీకరించడానికి సిద్ధంగా వున్నామా అన్నది మరో ప్రశ్న.
తెలుగువాళ్ళు సంప్రదాయాల గీతల్నే ప్రేమిస్తారు. కొత్తదనానికి దూరంగా నిలబడి వింతగా గమనిస్తూ వుంటారు. ప్రయోగాలంటే భయపడతారు. మొదటినుంచీ మన సాహిత్యం అంతా అనువాదం లేదా అనుకరణే. ఎక్కడైనా యెవరైనా కొత్త స్వరం వినిపిస్తే, స్వయం కల్పన గావిస్తే కృత్రిమ రత్నాలని యెద్దేవ చేయడం కూడా కద్దు. తొలి రోజుల్లో సంస్కృతం. తర్వాత ఇంగ్లీషు. వీటి చత్రచ్ఛాయలో కులాసాగా బానిసల్లా బతికినా వాళ్ళం కదా! దిగుమతికి అలవాటు పడిన వాళ్ళకి వుత్పత్తి మీద ఆసక్తి వుండదు. ఆధిపత్యాల్ని అంగీకరించిన వాళ్ళకి సొంత ఆలోచనలు తక్కువ. అలా అని ధిక్కార స్వరాలు లేవా అంటే వున్నాయి. వున్నాయి కాబట్టే అడపా తడపా కొత్త దారుల్లో కొత్తదనం కోసం అన్వేషణ కొద్దిగానైనా జరిగింది. ఆ కొద్దిపాటిదానికే మురిసిపోతాం. ముచ్చటపడతాం. భుజాలు చరుచుకుంటాం. మనవాళ్ళు వెధవాయిలు కాదోయ్ అని వుబ్బి తబ్బిబ్బవుతాం. అటువంటి మురిపాల్లోంచీ మన నవలా రచయితలు అరుదుగానైనా చేసిన ప్రయోగాలేంటి – వాటిలో మౌలికత యెంత – కొత్తదనం యేమిటి – వాటికి కొనసాగింపులు గానీ పొడిగింపులు గానీ వున్నాయా వంటి ఆలోచనాత్మకమైన ప్రశ్నలు ఆసక్తికరంగా వుంటాయి. సరిగ్గా అలాంటి ఆలోచనల పరంపరలోంచి పుట్టిన వ్యాస సముదాయమే ‘తెలుగు నవల – ప్రయోగ వైవిధ్యం’. సాహిత్యంలో కొత్తదనం పట్ల ప్రయోగ వైచిత్రి పట్ల అంతులేని ప్రేమ వొక రకమైన అబ్సెషన్ గల కె పి అశోక్ కుమార్ వీటి రచయిత.
2
లోతైన విషయ పరిజ్ఞానం, సమ్యగ్ దృక్పథంతో కూడిన సూక్ష్మ పరిశీలన, విస్పష్ట వివరణ నైపుణ్యం, విమర్శనాత్మక విశ్లేషణా సామర్థ్యం, ఫలితాంశాల ప్రకటనలో నిజాయితీ కల్గిన నిష్పక్షపాత వైఖరీ విమర్శకుడికి వుండాల్సిన మౌలిక లక్షణాలైతే అవి నిండుగా వున్న సమకాలీన విమర్శకుడు కె. పి. అశోక్ కుమార్. బాధిత సమాజం పట్ల సహానుభూతీ ప్రేమా అతని విమర్శకు అంతస్సూత్రం. పఠనీయత ఆరో ప్రాణం. పుస్తక పరిచయం , గ్రంథ సమీక్ష , విమర్శా వ్యాసం , పరిశోధనాత్మక వ్యాఖ్యానం – రూపం యేదైనా సమగ్రతని సాధించడానికి అశోక్ కుమార్ చేసే ప్రయత్నం అప్రమేయం.
అశోక్ కుమార్ యింతకు ముందు ప్రచురించిన ‘కథావలోకనం’ వచన సాహిత్య విమర్శలో అతని పరిణతికి దర్పణం పట్టింది. వస్తు శిల్పాల్లో నవీనత , వైవిధ్యం వున్న సృజనాత్మక రచనలు అతన్ని ఆకట్టుకొంటాయని ఆ వ్యాస సంపుటి స్పష్టం చేసింది. ‘తెలుగు నవల – ప్రయోగ వైవిధ్యం’ గ్రంథం కూడా అదే స్ఫూర్తితో వెలువడుతోంది. మనోవిశ్లేషణ దగ్గర్నుంచీ ఆత్మ కథనాత్మక ధోరణి వరకు యెందరో ప్రముఖ రచయితలు భిన్న కాలాల్లో నవలా రచనలో చేసిన భిన్న ప్రయోగాలు తెలుగు నవలకు సాధించిపెట్టిన విశిష్టతనీ విస్తృతినీ అశోక్ కుమార్ యీ వ్యాసాల్లో అపూర్వంగా అనితరంగా ఆవిష్కరించాడు.
అశోక్ స్వతహాగా సాహిత్య ప్రేమికుడు. కన్న విన్న మంచి రచనని దేన్నీ వదలడు. ఈ పుస్తకాల పురుగు వృత్తి రీత్యా గ్రంథాలయ పాలకుడు కావడంతో చదవడానికీ రాయడానికీ కావలసినంత వెసులుబాటు లభించింది. రోజూ మైళ్ళకొద్దీ చేసే బస్సు ప్రయాణాల్లో పుస్తకాల్ని నమిలి మింగే సమయం దొరికింది. అన్నిటికీ మించి అతని చూపు యెప్పుడూ అరుదైన గ్రంథాల వైపే. వాటి లోతుల్లోకే. అతని వెతుకులాట అంతా వైవిధ్యం కోసమే. అజ్ఞాతంగా వుండిపోయిన వైవిధ్య భరితమైన పాత రచనల్ని కొత్త తరానికి పరిచయం చేయాలని అతని ఆరాటం. ఆ ఆరాటమే అతణ్ణి తెలుగు నవలల్లోని ప్రయోగాల గురించి పరిశీలించడానికి పురిగొల్పిందనుకుంటాను.
భావకవిత్వంలోని ప్రధానాంగాలైన ప్రణయం దేశభక్తి ప్రకృతి ప్రేమ వంటి వాటిని వచనంలోకి , ముఖ్యంగా నవలల్లోకి తెచ్చిన రచయిత అడవి బాపిరాజు దగ్గరనుంచీ శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాట రాజకీయాల్ని సునిశితంగా వివరించిన అట్టాడ అప్పలనాయుడు వరకూ ఇరవై మందికి పైగా రచయితల నవలల్లో కనిపించే విలక్షణ ప్రయోగ రీతుల్ని విశ్లేషణాత్మకంగా వివరిస్తుందీ గ్రంథం.
శీలా వీర్రాజు , వాసిరెడ్డి సీతాదేవి , అప్పల్నాయుడు , యం వి తిరుపతయ్య మొ. రచయితల మొత్తం నవలల్ని సమగ్రంగా పరిచయం చేసే ఆలోచనాత్మక వ్యాసాలతో పాటు – దళిత జీవిత చిత్రణ చేసిన ‘అద్దంలో చందమామ’ (చిలుకూరు దేవపుత్ర), మహిళా వుద్యమ భావజాలం వెలుగులో వచ్చిన ‘ఆమె అడవిని జయించింది’ (గీతాంజలి), తొలి ముస్లిం మైనారిటీ నవలగా గుర్తింపు పొందిన ‘వెండి మేఘం’ (సలీం), అసమ సమాజంలో న్యాయం – న్యాయ వ్యవస్థ ‘చీకట్లో నల్లపిల్లి’ లాంటివే అని నిర్ధారించిన నందిగం కృష్ణారావు నవలల పై రాసిన సమీక్షా వ్యాసాలూ యీ గ్రంథంలో చోటుచేసుకొన్నాయి. అదేవిధంగా జిగిరి (పెద్దింటి అశోక్ కుమార్)లో రాజ్యాంగ నైతికత, మహీధర రామమోహనరావు నవలల్లో ప్రతిఫలించిన గ్రంథాలయోద్యమం , గిజూ భాయి ‘పగటి కల’లో చిత్రితమైన ఆధునిక విద్యా విధానం వంటి విలక్షణమైన అంశాల్ని లోతుగా పరామర్శించిన వ్యాసాలు తెలుగు నవలా పరిశోధకులకు యెంతగానో వుపయోగ పడతాయి.
అలాగే వ్యాపార నవల వికృత రీతుల్ని విమర్శించిన వ్యాసం , తొలి మలి యాత్రా నవలల గురించిన వ్యాసం, అకిరా కురసోవా సినిమా టెక్నిక్ ని అనుసరించిన నవీన్ కొత్త దృక్కోణం వివరించిన వ్యాసం యీ గ్రంథంలో విశిష్ట రచనలు. వీటిలో కొన్ని అశోక్ కుమార్ మాత్రమే రాయగలిగినవి. మూడు దశాబ్దాలపాటు గ్రంథాలయ అధికారిగా పనిచేసిన అనుభవం నుంచి పుట్టిన వ్యాసం ‘మహీధర రామమోహనరావు నవలల్లో గ్రంథాలయోద్యమ చిత్రణ’. సామాజిక శాస్త్రాల్ని సాహిత్యానికి అన్వయిస్తూ చరిత్ర రాజకీయాలు మొ. అనేకాంశాల లోతుల్లోకి వెలుగుప్రసరింపజేసే పరిశోధనాత్మక వ్యాసం అది. ఒకప్పుడు అటు బ్రిటిష్ ఆంధ్రాలోనైనా యిటు నైజాం రాష్ట్రంలోనైనా అనేక సామాజిక వుద్యమాలు గ్రంథాలయాల్లోనే పురుడుపోసుకున్నాయి. అవి అక్షరాస్య నిరక్షరాస్యులపైన సమంగా ప్రభావం చూపాయి. వాటి నిర్వహణలో ప్రజలు గొప్ప స్ఫూర్తిని చూపించారు. ఎన్నో కష్ట నష్టాలు యెదుర్కొన్నారు. వీటన్నిటినీ మహీధర పాఠ్యం నుంచి అశోక్ చక్కగా యెత్తి పట్టుకోగలిగాడు. వట్టికోట లాంటి వారి రచనల్లో కనిపించే గ్రంథాలయోద్యమ చైతన్యాన్నిపరిశోధకులు విశ్లేషించారు గానీ మహీధర నవలలపై యిటువంటి పరిశీలన యెవరూ చేయలేదు. ప్రపంచ సినిమాలోనూ సాహిత్యంలోనూ గాఢమైన అభినివేశం వున్నందువల్లే అశోక్ ‘రషోమాన్’ మూవీతో ‘దృక్కోణాలు’ నవలని పోల్చి చూడగలిగాడు. అంతేకాదు – జేమ్స్ జాయిస్ ని అనుకరిస్తూ రామాయణాన్ని సాంఘిక విషయాలకి అనువర్తిస్తూ ఆరుద్ర రాసిన ‘గ్రామాయణం’ విశిష్టతనీ , తొలిసారిగా చైతన్య స్రవంతి ధోరణిలో వెలువడ్డ అంపశయ్య నవీన్ రచనల్లో కానవచ్చే మనో విశ్లేషణ సిద్ధాంత ప్రాధాన్యాన్నీ, కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకి గవర్నర్ గా పనిచేసిన రచయిత్రి వి యస్ రమాదేవి సీక్వెల్ నవలల్లో వర్ణితమైన మహిళా బ్యూరాక్రాట్ జీవన వాస్తవికతనీ, కథా నవలా శిల్పాల విమర్శకుడిగా మాత్రమే పరిచితుడైన వల్లంపాటి సుబ్బయ్య తొలిరోజుల్లో ప్రయోగాత్మకంగా రాసిన నవలల ప్రత్యేకతల్నీ , సంచలనాత్మక జర్నలిస్టుగా నలుగురికీ తెలిసిన వినుకొండ నాగరాజు నవలా శిల్పంలో చేసిన వినూత్న ప్రయోగాల్ని , ఆత్మ కథని నవలగా తీర్చిదిద్దిన దేవులపల్లి కృష్ణమూర్తి ‘ఊరూ వాడా బతుకు’ లోని భాషా శిల్ప రీతుల్నీ పరిచయం చేస్తూ యీ వ్యాసాల్లో ప్రతిపాదించిన సూత్రీకరణలు నవల అధ్యయనానికి కొత్త ద్వారాలు తెరుస్తాయి.
పాత తరం రచయితల్ని యిప్పటి పాఠకులకు పరిచయం చేసే సందర్భాల్లో అశోక్ కి అతనిలోని అధ్యయన విస్తృతి పరిశోధనా దృష్టి యెంతగానో తోడ్పడ్డాయి. వాటివల్ల వినుకొండ నాగరాజు, తిరుపతయ్య, అడవి బాపిరాజు లాంటి రచయితలకు సంబంధించిన యెన్నో జీవిత విశేషాలపై కొత్త వెలుగు ప్రసరింపజేయడానికి వీలైంది. వినుకొండ నాగరాజు గురించి యీ తరం వారికి తెలియదు. తెలిసినా అతని ‘ఊబిలో దున్న’ గురించో ‘కమాండో’ పత్రికా నిర్వహణ గురించో మాత్రమే విని వుంటారు. అశోక్ నాగరాజు జీవిత సాహిత్యాల లోతుల్లోకెళ్ళి అతను రాసిన మరో నాలుగు నవలల్ని వాటి ప్రత్యేకతల్ని పేర్కొంటూ ప్రయోగాత్మక నవలా రచయితగా అతని స్థానాన్ని అంచనా కడతాడు.
3
వ్యాస రచనకు అశోక్ వొక చక్కటి ప్రణాళికని రచించుకుంటాడని యీ సంపుటిలోని చాలా వ్యాసాలు రుజువు చేస్తాయి. అది వ్యాసమైనా సమీక్షైనా పరిశోధన పత్రమైనా సమగ్రమైన సమాచారంతో వొక నిండుదనం గోచరిస్తుంది. ముందు రచయిత జీవిత సాహిత్యాలని అతను స్థూలంగా పరిచయం చేస్తాడు. తర్వాత రచనలోని సారాంశాన్ని అందిస్తాడు. వస్తువులోని ప్రత్యేకతని వివరిస్తాడు. శిల్ప పరంగా రచయిత చూపిన వైవిధ్యాన్ని యెత్తిపడతాడు. ఆ నవలా రచనలో రచయిత లక్ష్యాన్ని దాని మంచి చెడ్డల్ని విశ్లేషిస్తాడు. అది పాఠకుడి చేరడంలో యే మేరకు సఫలమైందో నిర్ధారిస్తాడు. చివరికి సాహిత్యంలో ఆ నవల స్థానాన్నీ విశిష్టతని బేరీజు వేస్తూ వ్యాసాన్ని ముగిస్తాడు.
ఆ పద్ధతికి భిన్నంగా రాసిన వ్యాసాలు కూడా వున్నాయి. వాటిలో గిజూభాయి ‘పగటి కల’ని విశ్లేషిస్తూ రాసిన వ్యాసం విశిష్టమైంది. ఈ వ్యాసంలో అశోక్ కేవలం రచనపై విమర్శకి పరిమితం కాలేదు. విద్యావ్యవస్థలో మొత్తం ప్రాథమిక మాధ్యమిక విద్యారంగం యెదుర్కొంటున్న అనేక సవాళ్ళను చర్చకు పెట్టాడు. చిన్న వయస్సులో విద్యార్థుల మానసిక శారీరిక స్థితిని బట్టీ రూపొందించుకోవాల్సిన విభిన్న బోధనాపద్ధతుల్ని లోతుగా సమీక్షించాడు. విద్యార్థి కేంద్రంగా వుండాల్సిన శిక్షణ పిల్లలకు శిక్షగా పరిణమిస్తున్న వైనాన్ని నిరసించాడు. ప్రపంచ వ్యాప్తంగా చేసున్న యెన్నో పరిశోధనల ఫలితాలకు స్వీయానుభావాన్ని జోడించి గిజూభాయి ప్రతిపాదించిన అనేక తీర్మానాల పట్ల అశోక్ కి యేకీభావం వుంది. అశోక్ తొలి వుద్యోగ జీవితం వుపాధ్యాయ వృత్తిలో గడిపాడు. అందువల్ల మన చదువులు పసి పిల్లలకు గుదిబండలుగా మారకుండా ఆనందప్రదంగా వుండాలంటే యేం చేయాలో స్వయంగా గ్రహించాడు. విద్యా వ్యవస్థలో వున్నతమైన విలువల గురించి, వుదాత్తమైన శిక్షణా పద్ధతుల గురించి తాను స్వయంగా కన్న స్వప్నాన్ని గిజూభాయి పగటికలలో చూసుకున్నందువల్లనే అతను ఆ వ్యాసాన్ని రాయగలిగాడు. అసలు పగటికలని నవలగా స్వీకరించడంలోనే విమర్శకుడిగా అశోక్ ది విలక్షణమైన దృష్టి అని తెలుస్తుంది. ఈ వ్యాస నిర్మితిలో సైతం కొత్తదనం వుంది. సాహిత్య సమీక్షలా కాకుండా లోతైన విద్యాత్మక రచనలా సాగింది. ఒక పుస్తకాన్ని సమీక్షించే నెపమ్మీద క్రమశిక్షణ, నైతికత, ఆటపాటలు, ఆరోగ్యం- పరిశుభ్రత, పరీక్షా విధానం, వుపాధ్యాయుల నిబద్ధత వంటి అనేకాంశాల పట్ల అశోక్ తనవైన అభిప్రాయాల్ని స్పష్టం చేశాడు. వ్యాసంలో యేది గిజూభాయి ఆలోచనో యేది అశోక్ అవగాహనో తెలీనంతగా చిక్కని అల్లిక కనిపిస్తుంది. ఇదొక వ్యాస రచనా శైలి. అది అశోక్ కే సొంతం.
చైతన్య స్రవంతి ధోరణిలో వచ్చిన రచనలంటే అశోక్ కి ప్రాణం. అందుకేనేమో అంపశయ్య నవీన్, వినుకొండ నాగరాజు, వల్లంపాటి వెంకట సుబ్బయ్య, గీతాంజలి నవలల్లో చైతన్య స్రవంతి లక్షణాల్ని విమర్శనాత్మకంగా పరిశీలించాడు. అవసరానుగుణంగా చైతన్య స్రవంతి టెక్నిక్ ని నిర్వచించాడు. ఆ నిర్వచానాల్లోకి యే రచనలు యిముడుతాయో యేవి యిమడవో అతివ్యాప్తి అవ్యాప్తి దోషాల్ని యెత్తి చూపుతూ సోదాహరణంగా నిరూపించాడు. బుచ్చిబాబు దగ్గరనుంచీ తెలుగులో చైతన్య స్రవంతి ధోరణిలో వచ్చిన రచనలన్నీ అశోక్ రసనాగ్రం మీదో, వేళ్ళ చివరో సదా ఆడుతూనే వుంటాయి – తాకి చూడండి ; యీ సంపుటిలోనే అనేకం కనిపిస్తాయి.
తులనాత్మక అధ్యయనం కె పి కి యిష్టమైన ఏరియా. వినుకొండ నాగరాజు నవలల్లో కనిపించే చైతన్య స్రవంతి టెక్నిక్ ని విశ్లేషిస్తూ ఎర్నెస్ట్ హెమింగ్వే రచనా శైలితో అతని శైలిని పోలుస్తాడు. బుచ్చిబాబు ప్రభావం నాగరాజుపై లేదనీ ఆ శైలి అతనికే ప్రత్యేకమనీ ఆ తర్వాతికాలంలో వచ్చిన వడ్డెర చండీదాస్ రచనల్లో ఆ తరహా పద్ధతిని చూడగలమనీ తీర్మానిస్తాడు. విస్తృతమైన అధ్యయనం వున్నవాళ్ళే యిటువంటి వ్యాఖ్య చేయగలరు. ఇప్పటి కొత్త విమర్శకుల్లో లోపించిన ముడిసరుకు అదే. ఆరుద్ర గ్రామాయణానికీ జేమ్స్ జాయిస్ యులిసిస్ కీ వున్న సామ్యాల్ని యెత్తి చూపిన వ్యాసం, నవీన్ ‘దృక్కోణాలు’ నవలని అకిరా కురుసోవా రషోమాన్ సినిమాతో పోల్చి చూపిన వ్యాసం, బొల్లిముంత ‘మృత్యుంజయులు’ నవలని సరిపల్లె ‘మంటలు మానవత్వం’ నవలని పక్క పక్కన పెట్టి వాటిలో వస్తు రూపాల్ని బేరీజు వేసిన వ్యాసం అశోక్ తులనాత్మక అధ్యయన విస్తృతికి తార్కాణంగా నిలుస్తాయి. ఆ యా సందర్భాల్లో వాటిలోని మంచి చెడ్డల్ని విడమర్చి చెప్పడానికి అతను యెక్కడా సంశయించడు. అశోక్ లో స్పష్టంగా కనిపించే యీ నిష్పాక్షిక గుణం అతణ్ణి కొందరికి శత్రువుని చేసిందేమో కూడా. నవీన్ అతని అభిమాన రచయిత. కానీ ‘దృక్కోణాలు’ నవల తెలుగు సాహిత్యంలో వొక సరికొత్త ప్రయోగంగా నిలిచిపోతుందని ఆమోదిస్తూనే ఎనిమిది భిన్న కథనాల్ని స్టేట్మెంట్లు రూపంలో చెప్పడంలోని అవాస్తవికతని తప్పు పడతాడు. ననుమాన స్వామి ‘మోహిని’ నవల సినిమా మూసలో వుందని నిర్ధారించినప్పుడు సైతం అశోక్ లోని విమర్శకుడు చాలా ఆబ్జెక్టీవ్ గా వున్నట్టు గ్రహిస్తాం. అదే విధంగా ‘వూరూ వాడా బతుకు’ (దేవులపల్లి కృష్ణమూర్తి) రచయిత ఆత్మ కథే అయినప్పటికీ అది ఆర్ధిక సామాజిక సాంస్కృతిక రాజకీయ చరిత్రకు దర్పణమై మంచి నవలగా రూపొందిన వైనాన్ని అశోక్ గొప్ప నేర్పుతో ఆవిష్కరిస్తాడు. దానికి వరవరరావు రాసిన ముందుమాటని తారిఫ్ చేస్తూనే కృష్ణమూర్తి బాల్యాన్ని సత్యజిత్ రే ‘పథేర్ పాంచాలీ’ లో పిల్లగాని బాల్యంతో పోల్చడాన్ని అంగీకరించడు.
ఒక రచనలోని బాగోగుల్ని చాలా సందర్భాల్లో తటస్థంగా వుండి వ్యాఖ్యానించడానికి ప్రయత్నించినప్పటికీ వ్యాస రచయితగా అశోక్ స్వీయ దృక్పథాన్ని దాచుకోలేకపోవడం గమనిస్తాం. వ్యాపార నవలలకు అడ్డుకట్ట వేయడానికి చేసిన సూచనల్లో గానీ దేవపుత్ర ‘అద్దంలో చందమామ’ని సమీక్షిస్తూ రాజకీయ నాయకుల బూటకపు వాగ్దానాల్నీ సామాన్య ప్రజల పట్ల అధికారుల అలసత్వాన్నీ నిర్లక్ష్య ధోరణినీ విమర్శించినపుడు గానీ , గీతాంజలి నవల్లో మధ్యతరగతి స్త్రీల మనస్తత్వాన్ని విశ్లేషించినప్పుడు గానీ తనవైన ఆలోచనల్నీ ప్రాపంచిక దృక్పథాన్నీ బాహాటం చేశాడు – గమనించండి.
సాహిత్యాన్ని వ్యాపారం చేసే మార్కెట్ శక్తులు పాపులర్ నవలని కమర్షయలైజ్ చేసిన విధాన్ని అశోక్ తీవ్రంగా ద్వేషించాడు. పత్రికల్లో సీరియళ్ళ రూపంలో కావొచ్చు డైరెక్ట్ ప్రచురణ రూపంలో కావొచ్చు హింసనీ అశ్లీలాన్నీ క్షుద్ర విశ్వాసాల్నీ పాఠకుల మెదళ్లలోకి ఇంజెక్ట్ చేసే సాహిత్య ద్రోహాన్ని ఖండించాడు. ధన – కీర్తి ప్రలోభాలకు లోనై పతనమయ్యే ‘బడా’ రచయితల్ని అసహ్యించుకున్నాడు. రచయితల , పత్రికా సంపాదకుల దిగజారుడుతనం సమాజానికి చేసే కీడు గురించి అప్రమత్తం చేశాడు. చైతన్య శీలురైన పాఠకులే వ్యాపార నవల్ని తిరస్కరిస్తారని సోపపత్తికంగా నిరూపించాడు. సీరియస్ నవలల పాఠకులే మంచి సాహిత్యం జీవనదిలా కొనసాగడానికి తోడ్పడతారని నిర్ధారిస్తాడు. సాహిత్యం భ్రష్టు పట్టకూడదంటే సామాజిక నిబద్ధత గల రచయితలు ఆ రంగంలో తలెత్తే పెడధోరణుల్ని పరిహరించాలనీ తమని తాము యెప్పటికప్పుడు ప్రజా శ్రేయస్సు అనే గీటురాయిపై పరీక్షించుకోవాలనీ వుద్బోధించాడు. ప్రజా దృక్పథం లేని ప్రతీప శక్తుల పట్ల నిరంతరం జాగరూకులై వుండాలని హెచ్చరించాడు. ఆ వ్యాసంలో అశోక్ స్వరంలోని కాఠిన్యం విమర్శకుడిగా అతని మనస్సుని ఆవిష్కరిస్తుంది. సమాజానికి వుపయోగపడాల్సిన సాహిత్యం పట్ల అతని ప్రేమనీ నిబద్ధతనీ పట్టి యిస్తుంది. ప్రగతిశీల విమర్శకుడిగా అశోక్ ఆలోచనల్ని అంచనా కట్టడానికి యీ వ్యాసం బలమైన వుదాహరణగా నిలుస్తుంది.
అయితే స్వీయాభిప్రాయ ప్రకటన కంటే రచయిత ఆలోచననీ దృక్పథాన్నీ ఆవిష్కరించడానికే అశోక్ యెక్కువ ప్రాధాన్యం యిస్తాడు. రచనలో రచయిత కంఠస్వరాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తాడు. ఈ తాటస్థ్యంవల్ల విమర్శకుడు రచనలోని విషయాన్ని యథాతథంగా యెత్తి చూపడానికో, కేవలం కథని చెప్పడానికో పరిమితమయ్యే ప్రమాదం వుంది. దీన్నుంచి బయటపడటానికి అశోక్ విశ్లేషణాత్మక విమర్శ పద్ధతిని ఆశ్రయిస్తాడు. రచనలోని కథని తనదైన పద్ధతిలో వ్యాఖ్యానిస్తాడు. ఆ వ్యాఖ్యానంలో అంతర్లీనంగా వ్యక్తమయ్యే అభిప్రాయాల ద్వారా అతని దృక్పథాన్ని గుర్తిస్తాం (పాఠకులు తెలుసుకోవాల్సింది రచయిత దృక్పథాన్నా విమర్శకుడి దృక్పథాన్నా అన్నది మళ్ళీ వేరే చర్చ).
శీలా వీర్రాజు నవలల్లోని శిల్ప రీతుల్ని వివరిస్తూ అశోక చేసిన సూత్రీకరణలు పరిశీలనార్హాలు. రాయప్రోలు అమలిన సిద్ధాంత ప్రభావం , 60 లలో వెలువడ్డ బెంగాలీ నవలల ప్రభావం రచయిత సృష్టించిన పాత్రలపై వుందని సోపపత్తికంగా నిరూపిస్తాడు. సన్నివేశాల కల్పన, వాతావరణం, కథన రీతులు, పాత్రలు, సంభాషణలు, భాష, శైలి, ఎత్తుగడలు – ముగింపులు వంటి నవలా నిర్మాణంలోని వివిధ అంగాల్ని వివరణాత్మకంగా పేర్కొంటూనే నవలల్లోని ఆ యా పాత్రల్లో రచయిత వ్యక్తిగత జీవితాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తాడు. వి యస్ రమాదేవి సీక్వెల్ నవలల పరామర్శలో సైతం దీన్ని గమనిస్తాం.
వైయక్తిక జీవితానుభవాల్ని సాహిత్యీకరించే సందర్భాల్లో కాల్పనికతకీ వాస్తవికతకీ మధ్య పాటించాల్సిన దూరాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు రచయితకెప్పుడూ చాలెంజింగ్ గానే వుంటాయి. నిజానికి వాస్తవ జీవితంలోని వ్యక్తుల్ని కాల్పనిక రచనలోకి పునస్సృజించే క్లోనింగ్ విద్య చాలా కష్టమైంది, సంక్లిష్టమైంది. దాన్ని నిర్దుష్టంగా, కళాత్మకంగా నిర్వహించడానికి రచయిత భిన్న పద్ధతుల్ని ఆశ్రయిస్తాడు. ఆ పద్ధతులే సాహిత్యంలో నూత్న ప్రయోగాలకు దారి తీస్తాయి. వాసిరెడ్డి సీతాదేవి, అప్పలనాయుడు తొలి మలి రోజుల్లో రాసిన నవలల కథన రీతుల్లో సాధించిన పరిణతి దీన్ని స్పష్టం చేస్తుంది. పరిణత రచయితలు ప్రయోగాన్ని కేవలం ప్రయోగం కోసం గాక – నిర్దిష్ట ప్రయోజనం కోసం ప్రయోగాన్ని ఆశ్రయిస్తారని తెలుస్తుంది. ఆ ప్రయోజనం వ్యక్తి కేంద్రం కావచ్చు, సమాజ కేంద్రం కావచ్చు. లేదా వ్యష్టి – సమష్టి యీ రెండిటి మధ్య జరిగే సంఘర్షణలో జనించే కొత్త సారం కోసం కావచ్చు. అంతరంగ సంక్షోభాన్నీ సామాజిక చలనాన్నీ ఆవిష్కరించడానికి సందర్భాన్ని అనుసరించి పాఠకులకు చేరడానికి వ్యూహాత్మకమైన నూత్న కథన రీతుల్ని రచయితలు నిర్మించుకుంటారు. ఆ క్రమంలో సఫలమైన వ్యూహాలే సాహిత్య ప్రయోజనాన్ని సాధించి పది కాలాలు గుర్తుంటాయి. అటువంటి రచనలే నిలిచివుంటాయి.
4
సాహిత్య ప్రయోజనం గురించి చర్చ యెప్పుడూ కొత్తగానే వుంటుంది. ఆ విషయంలో సాంప్రదాయికుల ఆధునికుల ఆలోచనలు భిన్నంగా వుంటాయి. ప్రయోగం సంప్రదాయాల్ని ఛేదిస్తుంది. కొత్తదనాన్ని కోరుతుంది. నలిగిన దారుల్ని విడిచి కొత్త దారుల్ని పరవడానికి ప్రయత్నిస్తుంది. అయితే అది సమాజ పురోగమనానికి దోహదం చేసేదై వుండాలి. ప్రయోగ ప్రియత్వం వేరు. ప్రయోగ లోలుపత వేరు. ప్రయోగ లోలుపత రచయితని ప్రయోగవాదిగా మారుస్తుంది. ప్రయోగవాదం ప్రయోజనాన్ని దెబ్బదీస్తుంది. అది మళ్ళీ శుద్ధ కళావాదంగా పరిణమిస్తుంది. చాలా సందర్భాల్లో ఆధునికోత్తరవాదులు సైతం మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతాలతో విభేదిస్తూ శుద్ధకళావాదులుగా మారిపోతుంటారు. సామాజిక ప్రయోజనం చైతన్యం వంటి పదాల్ని బూతులుగా భావిస్తారు. ప్రత్యామ్నాయంగా సాహిత్య విలువల్ని ముందుకు తెస్తారు. రచన ప్రయోజనోద్దిష్టమై వుండాలి అనగానే కళాత్మకత దెబ్బ తింటుంది అని వాపోతారు. మంచి చెడులతో ప్రమేయం లేకుండా ప్రతి కొత్త ప్రయోగాన్నీ ఆహ్వానిస్తారు. సృజనాత్మక రచయిత ప్రయోగ ప్రయోజనాల మధ్య వైరుధ్యాన్ని గుర్తించాలి. సాహిత్య విలువలకు విఘాతం కలగనివ్వకుండా చూసుకోవాలి. ప్రయోగం జీవన వాస్తవికత చిత్రణకి ఆటంకంగా పరిణమించకుండా జాగరూకత వహించాలి. ప్రయోజనోద్దిష్ట ప్రయోగం రచనకి మరింత జీవం పోసేదిగా వుండేలా తీర్చిదిద్దుకోవాలి.
నవలా రచనలో ప్రయోగ వైవిధ్యం గురించి మాట్లాడుకొనేటప్పుడు యిన్ని విషయాలు గమనంలోకి తీసుకోవాల్సి వుంటుంది. తెలుగు నవలల్లో గోచరమయ్యే ప్రయోగ వైవిధ్యాన్ని భిన్న కోణాల్లో పరిశోధనాత్మకంగా వివరించిన చివరి వ్యాసం యీ సంపుటికి ప్రాణభూతం. ఎందరో ప్రముఖ రచయితలు భిన్న కాలాల్లో నవలా రచనలో చేసిన భిన్న ప్రయోగాలు తెలుగు నవలకు సాధించిపెట్టిన వైవిధ్య భరితమైన ప్రత్యేకతల్ని యీ వ్యాసం స్థూలంగా ఆవిష్కరించింది.
వస్తు పరంగా రూప పరంగా జరిగిన ప్రయోగాల్ని అశోక్ అయిదు విధాలుగా వింగడించాడు. వస్తు స్వీకరణ విషయికంగా చూపే కొత్తదనాన్ని కూడా అతను ప్రయోగంగానే భావించాడు. కథన ప్రయోగాల్ని శిల్ప ప్రయోగాల నుంచి, భాషా ప్రయోగాల్ని శైలీ పరమైన ప్రయోగాల నుంచి విడదీసి చూపాడు. వాటి మంచి చెడుల్ని విశ్లేషించాడు. పోయిన శతాబ్దం నాలుగో దశకంలో తెలుగు నవలా రచనలో కొత్త శకం ప్రారంభమైందని తీర్మానించాడు. అప్పట్నుంచీ గత డెబ్బై యేళ్ళగా డైరీలుగా, వుత్తరాలుగా, ఆత్మ కథనాలుగా, ప్రతీకాత్మకంగా, పున:కథనాలుగా, అధివాస్తవికంగా, అలెగరీ రూపంలో, పాత్రల పరంగా, చైతన్య స్రవంతి ధోరణిలో, మాంత్రిక వాస్తవికతతో … యిలా ప్రయోగ ప్రయోజనాల మధ్య నలుగుతూ తెలుగు నవల పోయిన పోకడల్ని విహంగ వీక్షణం చేశాడు. ఈ వ్యాసంలో అశోక పెట్టిన ప్రతి వుపశీర్షికా వొక ప్రత్యేక పరిశోధనాంశమే. తెలుగు నవల మీద భావి పరిశోధకులకు పాతిక పుటల యీ వ్యాసం వొక కరదీపికలా తోడ్పడుతుంది అనడానికి సందేహించనవసరం లేదు.
చివరగా – ప్రయోజనోద్దిష్ట ప్రయోగం వస్తువుని యెలా దీప్తిమంతం చేస్తుందో సోదాహరణంగా వివరించిన యీ వ్యాస సంపుటి అశోక్ విమర్శ ప్రస్థానంలో మైలురాయి మాత్రమే కాదు ; తెలుగు నవలా విమర్శకు మరో తురాయి. శిరస్సున ధరిద్దాం.
హైదరాబాద్, సెప్టెంబర్ 17, 2018
అభినందనలతో…
ఎ . కె . ప్రభాకర్
Mukundaramarao
ఆత్మీయంగా ఆలోచనాత్మకంగా ఉంది
ప్రభాకర్, అశోక్ గార్లకు హార్దిక ధన్యవాదాలు
,- ముకుంద రామారావు
హైదరాబాద్