Sapiens – A brief history of Humankind by Yuval Noah Harari
వ్యాసకర్త: అమిధేపురం సుధీర్
**********
ఈ పుస్తకం చదవిన తర్వాత ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. మనకి తెలియని విషయాలను నేర్చుకున్నప్పుడు వచ్చే అనుభవం అది. అంతకంటే ఎక్కువగా, చాలా చోట్ల ఇది ఆశ్చర్యాన్ని, అక్కడక్కడా చిన్న, చిన్న షాక్ ల ని కూడా ఇచ్చింది.
ఒక పుస్తకం చదివాక, అది మనల్ని దాంతో పాటే తీసుకెళ్ళి, ఆ తర్వాత కూడా మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది అంటే, ఖచ్చితంగా అది మంచి పుస్తకమే అయి వుండాలి. చదివిన రెండేళ్ళ తర్వాత కూడా ఈ పుస్తకం అలానే చేస్తుంది, మంచి పుస్తకమే.
ఈ భూమ్మీద, ‘Homo’ అనే ప్రజాతి లో (Genus), ఇప్పుడు మనుగడ లో వున్న ఏకైక జాతి (Species) అయిన ‘Homo Sapiens’, అంటే ‘మనిషి’ గురించిన పరిణామ క్రమాన్ని ఎక్కువగా చెప్పే పుస్తకం ఇది.
సృష్టి లోని చాలా జంతువులతో పోలిస్తే, చాలా అర్భకమైన ‘మనిషి ‘ అనే జంతువు, ఈ రోజు ప్రపంచాన్ని శాసించే విధంగా ఎలా ఎదిగాడు? ఇందుకు తోడ్పడిన వివిధ కారణాలను ఈ పుస్తకంలో చాలా బాగా విశ్లేషించారు.
దయచేసి పొరపడకండి. ఇది మనిషి ని పొగిడే పుస్తకమో, మనిషి పరిణామాన్ని గ్లోరిఫై చేసి చెప్పే పుస్తకమో కాదు. మనిషి యొక్క ఎదుగుదలలో వివిధ క్రమాలు, జన్యు పరంగా, సామాజికం గా, సాంస్కృతికంగా, ఎలా జరిగాయో, దానికి గల కారణాలని సైంటిఫిక్ గా చెప్పడానికి ప్రయత్నం చేసారు.
ఈ పుస్తకం మొత్తం చదివిన తర్వాత మనిషి ఇంత ఎదిగినందుకు కలిగే సంతోషం కంటే, ఈ ఎదుగుదల క్రమంలో ప్రపంచానికి మనిషి చేసిన చేటు తెలుసుకుంటే కలిగే బాధే ఎక్కువ.
మనిషి సాంఘికంగా ఎదగడానికి కారణం, మనిషి యొక్క ‘కల్పనా శక్తి ‘ (Fiction) అని చెప్పి, దానికి కావల్సినన్ని ఉదాహరణలు చూపెట్టాడు.
దేవుడు, డబ్బు, దేశ భక్తి, కంపెనీ, కట్టుబాట్లు, పద్దతులు, ప్రభుత్వం, ఇలా ఇవన్నీ కేవలం మన కల్పనా శక్తి రూపాలే అంటాడు. భక్తి కోసం కొందరు, డబ్బు కోసం కొందరు, కంపెనీ లో ముక్కూ మొహం తెలియని వారితో పని చేస్తూ కొందరు, మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, దేశం పేరుతో, ఇలా ప్రతీ మనిషి తన యొక్క కల్పనా శక్తి పరిధిలో మరో మనిషితో సంబందం కొనసాగిస్తున్నాడు. కేవలం ఈ కల్పనా శక్తి వల్లే, మిగతా జంతువులకు సాధ్యం కాని పని చేసి, ప్రపంచాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు మనిషి.
నిజంగా ఈ వాదన నాకు ఒక కొత్త కోణాన్ని చూపెట్టింది.
నిన్నటి వరకు వున్న ఒక రాష్ట్రం, ఈ రోజు రెండయ్యింది. కొత్తగా భూమి సృష్టించబడలేదు లేదా వున్న భూమి మాయమవ్వలేదు. కానీ ఈ రోజు అందరం, ఒక సంఘం లా రెండు రాష్ట్రాలు అని నమ్ముతున్నాం.
ఇలానే, ప్రభుత్వం, డబ్బు, మతం, కులం ఇవన్నీ కల్పనలే. ఇలా ప్రతీ మనిషి సమాజం అంగీకరించిన కల్పనలను నమ్మడం వల్ల ప్రతి మనిషి, మరో మనిషి తో సంబందం పెట్టుకోగలుతున్నాడు. దాని వలననే సమాజం ఏర్పడింది. అదే మనిషిని వేరే జంతువుల నుండి వేరు చేసింది.
ఇవన్నీ సాధించిన మనిషి నిజంగా వున్నతంగా వున్నాడా అంటే, ‘అవును ‘ అన్నది సమాధానం గా రాలేదు. సంచార జీవితం గడిపిన ఆది మానవుడి కంటే, ఈ రోజు విలాసవంతంగా గడిపే కార్పొరేట్ మానవుడు మరీ అంత ఆరోగ్యంగా, ఆనందంగా లేడు అనే విషయం బాధాకరమే మరి. దేని కోసం దేన్ని వదిలేసామో అర్థం కాదు.
వ్యవసాయిక విప్లవం (Agricultural Revolution) అనేది మానవ జాతి పరిణామం లోనే జరిగిన ఒక పెద్ద మోసం అంటాడు రచయిత. గోధుమ లను మనం own చెసుకున్నామా, లేక గోధుమలే మనల్ని ‘own’ చేసుకున్నాయా? అనే వాదన వింటే, నిజమే అనిపిస్తుంది.
దేవుడు ఒక కల్పనే అంటూనే అందులో ‘Poly theism‘ మంచి కల్పనా లేక ‘Mono theism‘ మంచి కల్పనా అన్న అర్గుమెంట్ బావుంది.
పురాతన సమాజం లోని పద్దతుల తో పాటు ప్రస్తుత సమాజం చూస్తున్న పోకడల పై కూడా విశ్లేషణలు వున్నాయి. మీడియా ప్రభావం, ‘Romantic Consumerism’ మాయలో జనాలు ఎలా ఇరుక్కున్నారో చెప్పారు.
మనిషి సాంఘికంగా ఎంత ఎదిగినా, జెనెటికల్ గా మనిషి లో యే మార్పూ జరగని విషయాన్ని, చాలా చోట్ల చెప్పారు.
తీపి పదార్థాలు చూడగానే చాలా మందికి ఎందుకు నోరు వూరుతుంది? మన శరీరంలో ఈ రకమైన జెనెటికల్ వైరింగ్ ఎలా జరిగింది? ఇలాంటి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలని మనిషి పరిణామక్రమానికి జోడించి చెప్పటం జరిగింది.
చివరగా, మనిషి సాధించిన ఇన్ని విజయాల్లో ఏది కూడా చెప్పుకోదగిన రీతిలో మనిషిని సంతృప్తి పరచలేదు. ఇతర జంతువుల బాధను వదిలెస్తే కనీసం మనిషి బాధను కూడా పూర్తిగా తీర్చలేకపోయాడు. సైన్స్ సహాయంతో ఎన్నో అద్బుతాలు చేస్తున్నాడు. ఒకప్పుడు దేవుళ్ళు మాత్రమే చేయగలిగే పనులు ఈనాడు మనిషి చేస్తూ, దేవుడి లా మారుతున్నాడు. అయినా సంత్రుప్తి లేదు. సంతృప్తి లేని మనిషికైనా, దేవుడికైనా హద్దెక్కడ?
కేవలం నాలుగు చాప్టర్లుగా విభజించిన ఈ పుస్తకం వ్రాయడానికి ఎన్నో సైంటిఫిక్ పేపర్స్, ఆర్టికల్స్ మరియు పుస్తకాలు రిఫర్ చేసారు. ఉత్సాహం కొద్దీ, నోట్స్ లో ఇచ్చిన రెఫరెన్స్ లు లెక్కపెడితే దరిదాపుగ, 220 తేలాయి. అంటే అన్ని పుస్తకాలు/పేపర్లు/ఆర్టికల్స్ చదివితే వచ్చే పుణ్యం ;), ఈ ఒక్క పుస్తకం చదివితే వస్తుందన్నమాట.
మొత్తమ్మీద, నా వరకూ, ఇది తప్పకుండా చదవాల్సిన పుస్తకాల లిస్టులోకి వస్తుంది. వీలయితే చదవండి. చదివినందుకు ఖచ్చితంగా ఆనందిస్తారు.
Gopalam Karamchedu
ఈ పుస్తకం ఎప్పుడో తమిళం, హిందీలలో వచ్చింది. తెలుగులో కూడా వస్తే బాగుండును.
త్వరలోనే వస్తుందని అనుకుంటున్నాను.
చాల మంచి రచన.కొత్త ధరణిలో సాగుతుంది.
ఇతను మరొక పుస్తకం మానవుల భవిత గురించి కూడా రాసాడు.