A Step Away From Paradise: Thomas K Shor
వ్యాసం రాసినవారు: సంధ్య యల్లాప్రగడ
పుస్తకము మంచి మిత్రుడంటారు. కొన్ని పుస్తకాలు జీవితాలను మారుస్తాయి. కొన్ని చదివిన వారి మనసులలో నిలచిపోతాయి. కొన్ని ఆలోచనలను రేకెత్తిస్తాయి.
అలాంటిదే నేను ఈ వారంలో చదివిన “A step away from paradise”.
2018 వ సంవత్సరమునకు గానూ ఇది బెస్టు సెల్లింగు పుస్తకము, న్యూయార్క్ టైమ్స్ లో. నేను వారముగా అందులో కొట్టుకు మిట్టాడిపోయేలా చేసింది.
ఇందులో అంతగా ఏముంది? వుక్కిరి బిక్కిరి చెయ్యటానికి అని ఎవరైనా అడగవచ్చు.
అసలు ఏమి లేదు అందులో? వాస్తవికత, చరిత్ర, ఆధ్యాత్మికత,అన్వేషణ, ధైర్యం, కరుణ, సస్పెన్స్ అన్నింటికి మించి జీవితము వుంది.
ఇలాంటి చరిత్రకు సంబంధించిన జరిగిన కథలు చదువుతూ వుంటే మనము (చరిత్రను ఇష్టపడే నాలాంటి వారు) ఆ ప్రవాహములో పడి కొట్టుకుపోతాము. అంతే కదా!!
ఇది టిబెట్ కు సంబంధించిన కథ. రాసినది ఒక పశ్చిమదేశ రచయిత. అమెరికన్. అతని పేరు థామస్ షోర్.
“ప్రతిదానికి ఒక పగులుంటుంది. ఆ విధంగా కాంతి ప్రవేశించగలదు.”అన్న మాటలతో మొదలవుతుంది ఈ కథ.
షోర్ కథను డార్జిలింగులో మొదలెడుతాడు. అక్కడ ఒక మిత్రునితో పిచ్చాపాటిగా మాట్లాడుతుండగా, ఆ మిత్రుడు తన అత్తగారి తో మాట్లాడి ఆవిడ కథ వినమని సలహా ఇస్తాడు. ఆ కథ ఈ రచయితను హిమాలయాల చుట్టూ, బుద్ధ మోనెష్టరీల చుట్టూ 5 సంవత్సరాలు తిప్పుతుంది.
ఇది ‘తులషుక్ లిగ్మపా’ అనే ఒక లామా కథ. టిబెట్ లో లామా అంటే గురువు అని. చైనా దురాక్రమణతో టిబెట్ ను ఆక్రమిస్తుంది. అందుకు కొద్దికాలము ముందే తులషుక్ భారతదేశము వచ్చేస్తాడు. అతను చాలా పిచ్చివాడిగాను, కానీ ఎన్నో మహిమలు వున్న వాడిగాను ప్రజలు వర్ణిస్తూ వుంటారు. చాలా చిన్నతనము నుంచే అతనిలోని అతీంద్రియ శక్తులు పదర్శింపబడుతూనే వుంటాయి.
అతను ఆ విధంగా గురువుకు ప్రియమైన వాడు. అతడు పెళ్ళి, పిల్లలు, వివిధ విషయాలలో సమస్యలను తీర్చటము, డబ్బు మీద వ్యామోహము లేకపోవటము, గుహలలో కుటుంబముతో సహా నివసించటము ఇలాంటి వన్నీ జరుగుతూ వుంటాయి.
వీటి మధ్య చైనా ఎన్నో బుద్ధ మోనెష్టరీని నాశనము చెయ్యటము, లామాలను చంపేయ్యటము చేస్తూ వుంటారు. ఈ టిబెటన్లు రహస్యంగా భారతదేశము లోకి పారిపోయి కాందిశీకులుగా వస్తూ వుంటారు.
టిబెట్లో బుద్ధుని ప్రతి రూపముగా పద్మసంభవుని పూజిస్తారు. పద్మసంభవుడు విపత్కర పరిస్థితులలో ‘బేయుల్’ అనే ఒక రహస్య ప్రదేశానికి వలస పొమ్మని చెబుతాడట. ఆ ప్రదేశము మాములు గూగుల్ మ్యాపులో కనపడదు. ‘కాంచనజంగా’ పర్వత సానువులలో, క్రింద వుండే ఆ భూమి పరమ పవిత్రమైనది. జనన మరణాలకు, కష్ట నిష్టూరాలకు, అతీతమైనది. భువిలో స్వర్గం అది. దానికి కావలసినది స్వచ్ఛమైన హృదయము, పద్మసంభవునుపై మొక్కవోని నమ్మకము, గురువు పై గురి వుండాలి. దారి చాలా కష్టాలతో కూడుకున్నది. దానికి దారి లోపలికి గాని బయటకు వుండదు. దానికి దేవతలను శాంతి చేసుకోవటము తో పాటు ద్వారపాలకులను సంతృప్తి పరచాలి. ఇలా ఎన్నో ప్రక్రియల తరువాతనే వారు అక్కడకి చేరుకోగలరు.
ఎంతో మందిని కలసి, వారిని ఇంటర్యూ చేసి, లాజికల్ గా ఆలోచించే ఒక పశ్చిమదేశ యాత్రికునిలా రచయిత అన్వేషిస్తారు. అందుకే ఈ విషయాన్ని శోధించి కలసిన వ్యక్తులతో, దొరికిన నిజాలతో ఈ నవల రాస్తాడు.
చివరకు లామా ఆయన అనుచరులు ఏమయ్యారు. రహస్య స్వర్గధామానికి చేరారా లేదా అన్నదే ఈ కథ. మనలను చెయ్యి పట్టి నడిపించే కథనము, చివరి వరకూ నిలిచే సస్పెన్స్, నిజాల కోసం భూతద్దముతో వెతికి పాఠకులకు పంచే విధానము కట్టి పడేస్తాయి. తులషుక్ లిగ్మపా వ్యక్తిత్వము, ఆ ప్రవర్తన కూడా చాలా గుప్తంగా వుంటాయి.
“ ఎవ్వరో చెప్పిన మాటలు కాదు, మీరు నిర్ణయించుకోండి. అతీంద్రియమైన విషయాలను ధైర్యంగా చూడగలిగే నేర్పును పెంపొందించుకుంటే అన్నీ బంధాలు తొలగిపోతాయి. అప్పుడు కలిగే ఆత్మవిశ్వాసముతో, నిర్భయంగా మీరు మరో ప్రపంచపు తలుపులు తెరవగలరు” అనే తులషుక్ లిగ్మపా భోద మన మనసులలో నిలచిపోతుంది.
ఈ నవల నా కెంతగా హృదయానికి హత్తుకుపోయ్యిందంటే నేను తప్పక బుద్ధ మోనెష్టరీ వెళ్ళాలి నా తరువాతి ప్రయాణములో అని నిర్ణయించుకున్నా.
Leave a Reply