The Good Earth – Pearl S.Buck
స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుండి ఈ పుస్తకం గురించి వినడమే కానీ, ఎప్పుడూ చదవలేదు. ఇన్నాళ్ళకి ఇప్పటికి చదవడానికి ఐంది. కథ గురించిన వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఈ పుస్తకం గురించి – ఈ పుస్తకానికి 1932 లో పులిట్జర్ ప్రైజు, 1938 లో నోబెల్ బహుమతి వచ్చాయి.
కథ: (Spoilers Ahead) ఈ నవల వాంగ్ లంగ్ అన్న రైతు పెళ్ళిరోజుతో మొదలౌతుంది.వాంగ్ పెళ్ళిరోజునుండి, ఆఖరురోజులదాకా ఉన్న కథ. ఓ మనిషి జీవితకాలం. అతని కాబోయే భార్య ఓ-లాన్ ఆ ప్రాంతపు జమిందారీ కుటుంబంలో బానిసగా ఉంటుంది. వాంగ్ లంగ్ ఆ ఇంటికి వెళ్ళి, వారి ప్రవర్తనకు, దర్పానికీ కాస్త భయపడి, తనను తాను వాళ్ళ పక్కన చూస్కుని కొంత సిగ్గుపడి, ఏదైతేనేం, భార్యను ఇంటికి తీసుకొస్తాడు. భార్య వచ్చాక ఇంటి పరిస్థితి కాస్త మెరుగుపడ్డట్లు అనిపిస్తుంది. వాంగ్ కొద్ది కొద్దిగా భూమి కొంటూ ఉంటాడు. పిల్లలూ పుట్టుకొస్తూ ఉంటారు. అయితే, ఒకానొక దశలో వచ్చిన కరువు, వాంగ్ లంగ్ ను తన భార్యా, పిల్లలు, తండ్రితో సహా తమ ఊరు వదిలిపెట్టి దక్షిణప్రాంతానికి వెళ్ళేలా చేస్తుంది. కానీ, వాంగ్ ఎప్పటికైనా తన భూమి తనదేననీ తప్పక తాము అక్కడికి తిరిగి వస్తామనీ నమ్మి, డబ్బు అవసరం ఉన్నా, భూమిని అమ్మడానికి ఇష్టపడక దక్షిణానికి వలస వెళ్తాడు.
అదో కొత్త ప్రపంచం. అక్కడ ఈ కుటుంబానికి వాంగ్ రిక్షా తొక్కడం, తక్కిన వాళ్ళు భిక్షాటన చేయడం -ద్వారా తిండికి తగ్గ డబ్బు దొరుకుతుంది కానీ, అంతకు మించి ఎదుగూ బొదుగూ ఉండదు. అదే సమయంలో అక్కడ మిషనరీలూ, కమ్యూనిజం – వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కానీ, వాంగ్ ఆ ప్రభావానికి గురి అవడు. అతని ధ్యాస అంతా వర్షం పడ్డం, కరువు పోవడం, తాను తిరిగి తన నేలతల్లి వద్దకు చేరడం – దీనిపైనే ఉంటుంది. అయితే, అనుకోకుండా జరిగిన పరిణామాల్లో వాంగ్ కుటుంబానికి బోలెడు డబ్బు చేరుతుంది. ఆసరికి వీళ్ళు తమ ఊరికి తిరుగు ప్రయాణం ఔతారు కూడా. వాంగ్ కు కాలం కలిసొచ్చి, అతని పొలాల్లో మంచి పంటలు పండి, అతని చేతుల్లో ఎప్పుడూ డబ్బు ఆడుతూ, భూమి కొనడం, ఇల్లు భవనంలా మారడం – అంతా జరుగుతూ ఉంటుంది.
పిల్లలు పెద్దౌతూ ఉంటారు. అతని ముగ్గురు కొడుకుల్లో మొదటి ఇద్దరూ చిన్నతనంలోనే పొలానికి దూరంగా, చదువుకునేందుకు వెళ్ళిపోతారు. కొన్నాళ్ళు పొలంలో పని చేసినప్పటికీ మూడోకొడుకు కూడా చివరకు చదువు బాట పడతాడు. వాంగ్ తనకు ఒకప్పటి పక్కింటాయన, ప్రస్తుతం తన పనివాడు, అన్నింటినీ మించి దగ్గరి స్నేహితుడూ అయిన చింగ్ మీద పొలం బాధ్యతలు వదుల్తాడు. నడివయసులో లోటస్ అన్న అమ్మాయి వైపు ఆకర్షితుడై ఆమెని తన ఇంట్లోకి తీసుకొస్తాడు. ఈ మధ్య కాలంలో ఓ-లాన్ గురించి పట్టించుకోడు. కొన్నాళ్ళకి ఓ-లాన్ జబ్బుపడి కన్నుమూస్తుంది. ఆఖరు దశలో ఓ-లాన్ అతనికి బాగా అర్థమవడం మొదలుపెడుతుంది. తన కుటుంబం కోసం ఓ-లాన్ ఎంత శ్రమపడిందీ, అసలు ఓ-లాన్ లేకుంటే తనకి డబ్బే ఉండేది కాదన్న నిజం – ఇవన్నీ గుర్తుకు వస్తాయి. ఓ-లాన్ పోయిన కొన్నాళ్ళకే వాంగ్ తండ్రి కూడా మరణిస్తాడు.
బాధ్యతలన్నీ కొడుకులకి అప్పగించేసి, అప్పుడప్పుడూ పొలం పనులు పర్యవేక్షిస్తూ శేషజీవితం గడుపుతూ ఉంటాడు వాంగ్. కొన్నాళ్ళకి చింగ్ మరణించినప్పుడు అతని సమాధి తన భార్యా,తండ్రుల సమాధుల వద్దే పెడదామన్న వాంగ్ ప్రతిపాదనను కొడుకులు వ్యతిరేకిస్తారు – ఒక పనివాడి సమాధి తమ కుటుంబం సమాధుల పక్కన ఉండటం ఏమిటని. దానితో బాధపడ్డ వాంగ్ తన సమాధి చింగ్ సమాధికి వీలైనంత దగ్గరగా ఉండేలా చూడమని కొడుకులకు చెబుతాడు. కాలక్రమంలో వాంగ్ మరణ దశకు చేరుకుంటాడు. తాను భూమిని ఎంత నమ్ముకున్నా, తన కొడుకులకి దానిపై ఆసక్తి లేదని అర్థమౌతుంది. వాళ్ళు భూమిని అమ్ముదామని నిర్ణయించుకుంటున్నారని అర్థమౌతుంది. తాను భూమిలో పుట్టి భూమిలోనే కనుమూస్తున్నా, తన వంశం ఇక అలా ఉండదని అతనికి అర్థమవడంతో కథ ముగుస్తుంది.
కథనం: కాస్త నెమ్మదిగా అనిపించినా కూడా కథనం ఆపకుండా చదివిస్తుంది. దాదాపు నాలుగొందల పేజీలున్న ఈ పుస్తకం నేను బహుశా ఒకట్రెండుసార్ల కంటే ఎక్కువ బ్రేకులు ఇవ్వలేదనుకుంటాను. అక్కడక్కడా వాక్యాలు అద్భుతం. చదువుతూ ఉంటే, అంతా కళ్ళముందు కదలాడింది. ఒకవిధంగా చూస్తే, ఈ కథలో చాలా కోణాలు ఉన్నాయి. వాంగ్ జీవితం తో పాటు ఆ కాలం చైనా గ్రామీణ పరిస్థితులు, కుటుంబ వాతావరణం, సాంఘిక వాతావరణం, మధ్యలో ఆ ఊరు దాటితే దేశంలో ఏం జరుగుతోంది? యుద్ధం – ఇలా ఎన్నో కోణాల్లోంచి ఆలోచించవచ్చు.
ఒక రైతు తన భూమితో ఎలాంటి అనుబంధాన్ని పెంచుకుంటాడు అన్నది ఈ నవలలో చాలా హృద్యంగా చూపారు. అలాగే, పరిస్థితులు మనుషుల్ని ఎలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి అన్నది కూడా కరువు సమయంలో జరిగిన వివిధ సంఘటనల ద్వారా చెబుతారు. ఓ-లాన్ పాత్ర చిత్రణ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే.
పాత్రలు: ఒక్కో పాత్రని ఎంత శ్రద్ధగా మలిచారో! నాకు అన్నింటికంటే నచ్చేపాత్ర, అలాగే, చాలావరకు కథలోని ఇతర పాత్రల గుర్తింపుకి నోచుకోని పాత్ర – ఓ-లాన్. కుటుంబంలో యజమానురాలిది చాలా ముఖ్యపాత్ర. కానీ, కుటుంబంలో అందరికంటే under recognised పాత్ర కూడా తనదే. దీన్ని ఈ నవలలో ఎక్కడా ప్రత్యేకంగా చూపకున్నా కూడా ఆద్యంతమూ ఆ ఆలోచన కలుగుతూనే ఉండింది. ఈ నవల రచనా కాలం 1920s ఇన్నేళ్ళైనా ఇప్పటికి కూడా ఈ విషయంలో మార్పు రాలేదేమో అనే అనిపిస్తోంది నాకు.
అంతేకాదు, చదివేశాక కాస్త ఆలోచిస్తే, ఈ పాత్రలు, వాటి మధ్య interplay చాలా అద్భుతంగా చూపించినట్లు అనిపిస్తుంది నాకు. చదువుతున్నంతసేపూ, కథనంలో “భాష”కు ఉన్న భాగం గురించి రకరకాల ఆలోచనలు కలిగాయి. భాష ప్రభావం ఎంత దాకా ఉంటుంది? కథనం అంటే, భాష కాక ఇంకా ఏమేం ఉంటాయి? వాక్య నిర్మాణం కొన్ని కొన్ని చోట్ల ఎలా ఉండాలి – ఇలాంటి విషయాల గురించి ఈ పుస్తకం ద్వారా చాలానే తెలుసుకోవచ్చు అనిపిస్తుంది. అయితే, ఆ దృష్టితో చదవాలంటే వేరుగా చదవాలనుకోండి మళ్ళీ!
ఇదిలా సాగుతూనే ఉండకుండా ఆగాలంటే ఒకే మార్గం – ఒక్క ముక్కలో ఈ పుస్తకం తప్పక చదవాల్సిందేనని చెప్పేయడం. 🙂
ఈ పుస్తకం గురించి పరిశోధనలూ, అనాలసిస్సులు విరివిగానే ఐనట్లు ఉన్నాయి. బహుశా ఆన్లైన్లో కూడా ఉండి ఉండొచ్చు.
Srilakshmi
అంతంత పెద్ద పుస్తకాలు చదివే సమయం లేని నాలాంటి వాళ్ళకు సూక్ష్మంలో మోక్షం లా బిందువులో సిం ధువుని చూపినట్లు ఉండే ఈ పుస్తక పరిచయాలు రచయితల వివరాలు అమృతపు చినుకులు. ధన్యవాదములు తెలుపుతూ శ్రీలక్ష్మి చివుకుల విజయనగరం
భావకుడన్
ఇవాళ ఎందుకో పుస్తకం.నెట్ పాత వ్యాసాలన్నీ శీర్షికలు చూస్తుంటే మీ వ్యాసంలో కనపడిన “ఈ పుస్తకానికి 1932 లో పులిట్జర్ ప్రైజు, 1938 లో నోబెల్ బహుమతి వచ్చాయి.” అన్న ఈ వాక్యం ఆపేసింది.
as far as I remember and I remember it distinctly :-)………Pearl S Buck was not awarded the noble prize for this book alone…I read this, if I remember it rightly – in the introduction of The Good Earth book itself, that she was awarded the prize for “the body of her work”. నాకు ఇది ఎందుకు గుర్తుండి పోయిందంటే ఎవరో ఆమెకు నోబెల్ బహుమతి ప్రకటించిన తరవాత “బాడీ అఫ్ వర్క్ ” అన్నది ఒక నవలేమో అనుకుని పుస్తకాల షాపులో ఆమెది “బాడీ ఆఫ్ వర్క్” కావాలని ఆరా తీసారు”ట.
ఆమె నోబెల్ సైటేషన్ says she was awarded the prize in 1938″for her rich and truly epic descriptions of peasant life in China and for her biographical masterpieces”. అని చెపుతోంది.
నరసింహారావు మల్లిన
నేను చదివిన మొట్టమొదటి ఆంగ్ల నవల కూడా ఇదే. ఎఁతో బాగా నచ్చిన పుస్తకం.కరువు గుఱించిన వర్ణన ఎంతో బాగా గుర్తుండిపోయింది ఈ నాటికీ.
nanich
Great introduction. Shall try to buy and complete this book over this weekend. Thanks and keep it up
–Nanich
BPhaniBabu
నేను 55 సమ్వత్సరాల క్రితం చదివిన మొట్టమొదటి ఇంగ్లీషు నవల ఇది. ఈ పుస్తకంలోని భాష ఎంత సింపుల్ అంటే, ఆరోజుల్లోనే, నాకు ఈ నవల నచ్చేసింది.మీ సమీక్ష చాలా బాగుంది.
చివరలో వ్రాసినట్లుగా ” ఇదిలా సాగుతూనే ఉండకుండా ఆగాలంటే ఒకే మార్గం – ఒక్క ముక్కలో ఈ పుస్తకం తప్పక చదవాల్సిందేనని చెప్పేయడం.”