హింసపాదుల్లోకి: “హస్బెండ్ స్టిచ్” కథా సంపుటికి ముందుమాట

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్

******

ఆడదాని శరీరం

మగవాడికి విలాసాల క్రీడా స్థలం

అధికార రాజకీయాల కేంద్రం

ఆధిపత్య నిరూపణల క్షేత్రం.

కానీ … స్త్రీకి ఆమె దేహం

ప్రాకృతిక చేతనకు పాదు

ఆత్మ గౌరవ ప్రకటనకు పతాక

అస్తిత్వ ప్రతిఘటనకు వేదిక.

స్త్రీల మనశ్శరీరాల పై అమలవుతున్న హింస గురించి డా. గీతాంజలి రాసిన కథల మీద నాలుగు మాటలు రాద్దామని కూర్చుంటే నాకు రెండు యిబ్బందులు యెదురయ్యాయి. ఒకటి : వొక సాహిత్య విద్యార్థిగా నేను నేర్చుకున్న బొటాబొటీ భాషా జ్ఞానం నాకు యే మాత్రం తోడ్పడటం లేదు. మరొకటి : జెండర్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మూడు దశాబ్దాలకు పైగా యీ నేల మీద స్త్రీవాద విమర్శ అందించిన పరికరాలు కూడా చాలడం లేదు. ఈ పరిమితుల్లోంచీ చేసే అభిప్రాయ వ్యక్తీకరణ యెంత పేలవంగా వుంటుందో తెలిసీ వొకటి రెండు విషయాలు మీతో పంచుకోడానికి సాహసిస్తున్నా. ఆమె అడవిని జయించింది దగ్గర్నుంచీ బచ్చేదానీ పహెచాన్ పాలమూరు వలస బతుకులు దాకా నిబద్ధురాలైన వొక ప్రగతిశీల రచయితగా గీతాంజలి రచనా వ్యాసంగాన్ని దగ్గరగా చూస్తున్నందువల్లే యీ సాహసమైనా. అదీగాక దాదాపు పాతికేళ్ళ స్నేహాన్ని పురస్కరించుకొని కూడా.

హస్బెండ్ స్టిచ్’ పేరుతొ గీతాంజలి అందిస్తున్న స్త్రీల లైంగిక విషాద గాథలు విహంగ వెబ్ మాగజైన్ లో వస్తున్నప్పుడు రెగ్యులర్ గా ఫాలో అయ్యాను. స్త్రీ పురుష సంబంధాల గురించి వాటిలో ఆమె లేవనెత్తిన అనేక అంశాలు చాలా ఆలోచింపజేశాయి. కానీ వాటినన్నిటినీ వొక్క చోట యిలా చదవడం మాత్రం దుర్భర వేదనా పూరితమైన అనుభవం. కథల్లో కులం మతం వయస్సు తేడా లేకుండా భిన్న వర్గాల స్త్రీలు యెదుర్కొనే అమానవీయ పరిస్థితులు నన్ను వూపిరాడనితనంలోకి నెట్టి నిద్ర లేమికి గురిచేశాయి. మూసి ఉన్న తలుపులు వెనకాల పెళ్లి , దంపత్య జీవితం , రొమాన్స్ పేర్లతో పెళ్లి , భర్త అనే చట్టబద్ధమైన లైసెన్సులతో స్త్రీల మనో దేహాల మీద జరిగే దాడి సెక్సువల్ వయోలెన్స్’ గుండెలో లోతుగా గాయం చేసింది. తీవ్రంగా బాధించింది. అందునా అవి కథలు కావు ; వాస్తవ ఘటనలని ఆధారం చేసుకొని రాసిన ‘గాథలు’ అని తెలుసుకోవడం మరింత విషాదానికి కారణమవుతుంది. స్తీల లైంగికత గురించి స్వేచ్ఛా సమానత్వాల గురించి చలం రాసిన దాదాపు తొంభై యేళ్ళ తర్వాత కూడా ఆడజన్మ శాపం అనుకోవాల్సిన పరిస్థితే కొనసాగడం చూస్తే దు:ఖం రెట్టింపు అవుతుంది.

ఉత్పత్తి పునరుత్పత్తి విషయాల్లో దోపిడి గురించి ఇంటి పనికి సంబంధించిన అదనపు శ్రమ విలువ గురించి గృహ హింస గురించి సాహిత్యీకరించిన స్త్రీవాదులు సైతం వులిక్కి పడేలా లైంగిక హింసకి సంబంధించిన అనేక కోణాల్ని గీతాంజలి యీ సంపుటిలోని కథల్లో చర్చకి పెట్టింది. దాంపత్య జీవితంలోని లైంగికత గురించి నియంత్రణల గురించి పురుషానుకూలంగా యేక పక్షంగా పాతుకుపోయిన విలువల గురించి సామాజిక చట్రాల గురించి భావజాలం గురించి పాఠకుల్లో సవాలక్ష ఆలోచనలు , ప్రశ్నలు పుట్టాడానికి అవకాశం యిచ్చే భిన్న సంఘటనల్ని ఆమె వొక తీవ్ర దు:ఖ స్వరంతో విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించింది. పడగ్గదులు హింస పాదులుగా నరక కూపాలుగా ఆధిపత్య కేంద్రాలుగా యుద్ధభూములుగా తయారు కావడానికి కారణాల్ని యీ కథల్లో అన్వేషిస్తుంది. సమాజం కుటుంబం మతం రాజ్యం యిలా అన్ని వ్యవస్థలూ స్త్రీల గర్భసంచుల మీద పునరుత్పత్తి మీద అమలుచేస్తున్న విధి నిషేధాల గురించి దృశ్యాదృశ్య నియంత్రణల గురించి యెన్నో బలమైన ప్రశ్నల్ని సంధించింది. అయిదారేడేళ్ళ పసిపాప దగ్గరనుంచి అరవై యేళ్ళ వృద్ధురాలి వరకూ అత్యాచారానికి గురవుతున్న క్రూర అమానవీయ పరిస్థితుల్ని రచయిత్రి గుండె లోతుల్లోంచి ద్వేషిస్తోంది.

స్థూలంగా ఇంటా బయటా భద్రత లేని స్త్రీల జీవితాల్లో అనునిత్యం చోటుచేసుకుంటున్న హింస చుట్టూ అల్లిన కథలివి. అయితే సమాజం నాగరికమయ్యే క్రమంలో ఆధిపత్యాలకు తావులేని మానవీయ విలువలు పెంపొందాల్సి వుండగా రానురానూ దిగాజారిపోతున్నందుకు రచయితగా డా. గీతాంజలి అనుభవించే వేదన సైతం యీ కథల్లో ప్రత్యక్షరంలోనూ వినిపిస్తుంది. స్త్రీ పురుష సంబంధాల్లో చోటుచేసుకొంటున్న హింసని ప్రత్యక్షంగా వర్ణిస్తూనే హింసకి కారణమయ్యే మూలాల్లోకి చూసేలా చేస్తున్న రచయిత స్వరంలోని తీవ్రత తీక్ష్ణత చాలామందిని కలవరపెడతాయి. పాఠకుల్లో అటువంటి డిస్ట్రబెన్స్ ని వొక విధమైన కల్లోలాన్నీ సృష్టించి ఆలోచింపజేయడమే ఆమె ధ్యేయం. అందుకే ఆమె తాను చెప్పదలచుకున్న విషయాల్ని అందమైన పదాల మాటునో ఆలంకారిక శైలి వెనకో ప్రతీకల చాటునో మరుగు పరచదలచ లేదు. ఆ కారణంగానే అన్ని రకాల సాహిత్య విధి నిషేధాలనూ ఛేదించిన డిక్షన్ వొకటి యీ కథల్లో సహజంగా చోటుచేసుకొంది.

పంచ కన్యల పురాణ గాథలు వాత్స్యాయన కామసూత్రాలు మొదలుకొని ఇవ్వాళ్టి వయాగ్రా మాత్రలు , సిలికాన్ యింప్లాంటేషన్ లు వెజైనోప్లాస్టీ ఎక్స్ ట్రా నాట్ ల వరకూ అన్నీ లైంగిక తృప్తిని పురుష కేంద్రంగానే నిర్వచించి డిజైన్ చేయడంలో భాగంగానే పడగ్గదుల్లోకి ప్రవేశిస్తున్నాయనే స్పృహతో రాసిన కథలివి. జెండర్ స్వేచ్ఛా సమానత్వాల గురించి, సహజమైన ప్రేమాభిమానాలతో పరస్పరం గౌరవించుకొనే దాంపత్య సంబంధాల గురించి, సున్నితమైన దేహ భాషతో పరిమళించాల్సిన లైంగికత గురించి మగవాళ్ళని సెన్సిటైజ్ చేయడానికి ఆమె యీ వ్యూహాన్ని యెన్నుకొంది. ఇవాళ యీ గొంతు అవసరం.

వ్యవస్థీ కృతమైన పురుషాధిపత్య విలువల్ని ప్రశ్నించడానికే యీ కథల్లో రచయిత గొంతు కరకుగా ధ్వనిస్తుంది. అది ఆమె తప్పు కాదు. ఆగ్రహ ప్రకటనకి అవసరమైన కాఠిన్యమే ఆమె నిర్మించిన వాక్యాల్లో కనిపిస్తుంది. బాధిత స్త్రీల గుండె ఘోషని విన్పించడానికి ఉద్దేశ్య పూర్వకంగానే ఆమె ఆ శైలిని స్వీకరించింది. స్త్రీ పురుషల మధ్య చోటుచేసుకొనే రహస్య దేహ భాషకి చెందిన పదజాలం లేని చోట బయటికి మాట్లాడమే పాపం అయిన చోట సమస్త సున్నితత్వాల్నీ లాలిత్యాల్నీ బద్దలుకొట్టి అనేక చీకటి తప్పుల్ని బహిరంగపరచింది. స్త్రీల శరీరాలపై అమలవుతున్న హింసని అంత బాహాటంగా చెప్పడంవల్ల కొందరు పాఠకులు ఆమె రచనకు దూరమయ్యే ప్రమాదం వుందని కొందరు భావించే అవకాశం లేకపోలేదు. కానీ వాస్తవ స్థితి అంత కంటే బీభత్సంగానూ క్రూరంగానూ భీతావాహంగానూ వుంది. విచ్ఛిన్నమైన పిండాలు చిరిగిన గర్భాశయాలు చీలిన జననాంగాలు పగిలిన ఇంప్లాంటెడ్ రాతి గుండెలు చిట్లిన పెదాలు విరిగిన పక్కటెముకలు కళ్ళ ముందు స్త్రీ దేహంపై జరిగె హింస అలాగే వుంది. అదే సాహిత్యంలోకి వచ్చింది. రాయక తప్పని వొక అనివార్యత నుంచి వచ్చిన రచనలివి.

దాంపత్య సంబంధంలో లైంగిక ప్రక్రియలో మాధుర్యం గురించి పురుష దృష్టికోణం నుంచే నిర్వచించే భావజాలాన్ని నిరసిస్తూ పురుషాధిపత్య లైంగిక రాజకీయాల మూలాల్ని యింతకు మునుపు స్త్రీవాద సాహిత్యం చాల చోట్ల చర్చకి పెట్టినప్పటికీ మాయదారి సంసారాల్లో దాగున్న మోసాన్ని గ్రహించలేక అనారోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టక ఎక్స్ ట్రా నాట్ కి సిద్ధపడి అందుకు తాహతుకి మించిన అప్పుచేసి డాక్టర్ హెచ్చరించినా వినక ప్రాణం మీదకి తెచ్చుకొన్న స్త్రీల గాథలు (హస్బెండ్ స్టిచ్) యిప్పటికీ యింకా తెలియకుండానే వుండిపోయాయి. అలాగే దారిన పోయేవాళ్ళ చూపుల్తో చేతలతో ‘గుండెల్ని పిండే’ అవమానాల్ని భరించలేక మాతృత్వ భావన సైతం కోల్పోయి పాలింకిపోయిన స్త్రీల కథలు కూడా చదువుకున్నాం కానీ, స్త్రీలను రెండు రొమ్ముల మాంసం ముద్దలుగా మాత్రమే గుర్తించే భర్తల కోర్కెలు తీర్చడానికి సిలికాన్ ద్రవాన్ని రొమ్ముల్లో నింపుకొని క్యాన్సర్ బారిన పడి శరీరాన్ని ఛిద్రం చేసుకోన్నవాళ్ళ బాధలు (శిలకాని శిల) కూడా సాహిత్యంలోకి యెక్కలేదు. ఈ వస్తువులు తొలిసారిగా గీతాంజలి ద్వారానే కథలయ్యాయి. స్త్రీ పురుషుల కలయికని సంయోగం అనకుండా సంభోగం అనడంలోనే ఆడది మగవాడికి సుఖాలందించే యంత్రంగానో భోగ వస్తువుగానో భావించే పురుష కేంద్రమైన ఆలోచన దాగుందన్న స్పష్టమైన అవగాహనతో రాసిన కథలివి.

వర్క్ ప్లేస్ లో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల్ని మించిన ఘోరాలు యిళ్ళలో జరుగుతున్నాయి. కూతుళ్ళనీ కూతుళ్ళతో సమానమైన పిల్లల్ని కామోన్మాదానికి గురిచేసే తండ్రులో చిన్నాన్నలో మావయ్యలో పొరుగింటి అంకుల్సో తాత వయస్సు సీనియర్ సిటిజన్సో ప్రతి నిమిషం దాడికి పొంచివున్నారన్న భయం అభద్రత సర్వత్రా గాల్లో నిండి వుంది. వాళ్ళ ప్రవర్తనని విపరీత మానసిక ధోరణిగానో అసహజ లైంగిక ప్రవృత్తిగానో sexual perversion గానో కొట్టిపారేయలేం. వాళ్ళ ప్రవృత్తిని నిర్ధారించే వ్యవస్థలున్నాయి. పెళ్లి ఆ వ్యవస్థల్లో అతి ప్రధానమైందని వొక డాక్టర్ గా కౌన్సెలర్ గా సెక్సాలజిస్టుగా సామాజిక కార్యకర్తగా తాను విన్న కన్న సంఘటనల ద్వారా రచయిత్రి పదే పదే నిర్ధారిస్తోంది. భార్యలపై అత్యాచారం చేసే భర్తలు లైసెన్స్డ్ రేపిస్టులు అని కుండబద్దలుకొడుతుంది.

నా అల్లుడు ఏమన్నా పరాయి ఆడదాన్ని రేప్ చేసిండా చెప్పు. కాదు గదా సొంత భార్యనే కదా అతని భార్యని ఆయన ఏమన్నా చేస్కుంటడు’ భర్త చేతిలో బలాత్కారానికి గురైన కూతురు విషయంలో తండ్రి చేసిన తీర్మానం యిది. అంతే కాదు ; ఇది ఘరేలూ మామ్లా అందులో పోలీసులు సైతం కల్పించుకోగూడదు అంటాడు (మై హస్బెండ్ రేప్డ్ మి). భార్యపై భర్త అధికారాన్ని ప్రశ్నించడానికి వీల్లేని హక్కుగా భావించే అసమ ఫ్యూడల్ సమాజంలోనే యిటువంటి భావజాలం జీవించి వుంటుందన్నది రచయిత భావన.

ఇంట్లో అయినా బయటైనా స్త్రీ నో అంటే అర్థం నో అనే – అన్న స్పృహని కలగజేయడానికి యిటువంటి కథలు యెన్ని రావాలో !

స్త్రీకి ప్రత్యేకమైన ఉనికి లేదు . స్త్రీ పురుషుని ఎముకలో ఎముక . మాంసంలో మాంసం. జీవితాంతం పంటలు పండిస్తూ పురుషుని ఇంట్లో వంటలు చేస్తూ గొడ్డు చాకిరీ చేస్తూ పురుషుడి ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ బతకాలి అని దైవమే శపించాడని మతం నమ్మబలుకుతుంది. అంతేకాదు; పురుషుడి పతనానికి కూడా కారణం స్త్రీయే అని ప్రచారం చేస్తుంది. అందుకు చిలవలుపలవలుగా కథలు అల్లుతుంది. అటువంటి పుక్కిటి పురాణాల్ని ఖండిస్తూ ప్రతీకాత్మకంగా రాసిన కథ ‘ఫాల్ ఆఫ్ ది మేన్’. మెనోపాజ్ కి చేరిన భార్యల మానసిక శారీరిక కల్లోల పరిస్థితుల్ని అలజడినీ ఆందోళననీ అర్థం చేసుకోక సెక్స్ కి పనికిరాకుండా పోయారని తృణీకరిస్తూ వారిపట్ల హేయంగా ప్రవర్తించే భర్తలకు యీ కథ గొప్ప గుణపాఠం.

వయస్సు పెరిగే కొద్దీ స్త్రీలు మగవాళ్ళకి వదులవుతారు యెండిపోతారు వొడిలిపోతారు వాడిపోతారు వొంగిపోతారు వొట్టిపోతారు సడలిపోతారు జారిపోతారు. అంతా దేహభాషే. కానీ లైంగిక అనాసక్తి అశక్తత హార్మోన్ల సమస్యలు ‘మిడ్ లైఫ్ క్రైసిస్’ స్త్రీ పురుషులిద్దరికీ సహజమేనన్న గ్రహింపు వుండదు. స్త్రీలకు మెనోపాజ్ కేవలం జీవితంలో వొక దశ మాత్రమే స్త్రీత్వం లేకుండా పోవడం కాదు అన్న స్పృహ వుండదు. మగవాళ్ళకి సైతం ఆండ్రోపాజ్ సమస్యలు వస్తాయి వాటిని అధిగమించడానికి తంటాలు పడుతుంటారు. ఆ లోటుని కప్పిపుచ్చుకోడానికి జుగుప్సాకరమైన ప్రయత్నాలు చేస్తారు. జారిపోయే ఆధిపత్యాన్ని నిలుపుకోడానికి అడ్డమైన దారులు తొక్కుతారు. మందాకినీ వంటి స్త్రీలు తిరగబడేవరకు తమ అసమర్థతని వొప్పుకోరు. కానీ అంతవరకూ వాళ్ళు అనుభవించే వేదనని అర్థం చేసుకొనే నాథుడే వుండడు. ఆ నరక యాతనని గీతాంజలి మాటల్లోనే విందాం:

నెలసరి ఆగిపోయి మనసే కాదు; దేహం, దేహంలోని అన్ని పొరలూ ద్రవాలూ ఎండిపోయి తానొక తేమ ఎండిపోయిన బావిలా, నదిలా ఉంటే అతనొక చురకత్తిలా, గునపంలా, తన ఎండిపోయిన దేహాన్ని సర్రుమని కోస్తే ఎంత మంటో! వద్దు వద్దు అంటున్నా వినకుండా అర్ధగంట పాటు సాగే పోట్లకు తన యోని చీలిపోయి, ఎండిన దేహపు కుహరం రక్తంతో చెమ్మబారి, విలవిలలాడ్తూ, పెదాలు బిగించి భరిస్తూ, కన్నీళ్లు కారుస్తూ, అంతసేపూ ఎత్తిపట్టిన తొడలు, నడుమూ గుంజుతున్నా ఆపడే! గాయం లోపలికి సూదిని గుచ్చుతున్నట్లే.’

దుర్భరమైన యీ హింసకి మూలాలెక్కడున్నాయో తెలియజెప్పి వాటిని వేళ్ళతో సహా పెకలించడానికి అవసరమైన ఆలోచనలు రేకేత్తించడమే యీ రచనల వుద్దేశ్యం. రచయిత్రి తన అభిప్రాయ వ్యక్తీకరణకి యిన్నాళ్ళూ సాహిత్యంలోకి యెక్కని పదునైన భాషని కూడా తోడు తెచ్చుకున్న విషయాన్ని ప్రత్యేకంగా గమనించాలి (పోనీ యిలా చెప్పకూడదంటే ప్రత్యామ్నాయమైనా చూపించాలి). స్త్రీల శరీరాలపై జరిగే యిటువంటి అనేక లైంగిక దాడులకి కారణమౌతోన్న మనుస్మృతి కాలంనాటి పితృస్వామ్య ఆధిపత్య భావజాలాన్ని భిన్న కోణాల్లోంచీ గీతాంజలి విమర్శనాత్మకంగా విశ్లేషించడంతో ఆగిపోలేదు. కొత్తగా స్త్రీ శరీర కేంద్రకంగా విస్తరిస్తోన్న కామోత్ప్రేరక ఔషధ వ్యాపారాల లోగుట్టుని సైతం నగ్నంగా ఆవిష్కరించింది. కాన్పులనీ , కుట్లనీ , సిజేరియన్లు , హిస్టెరెక్టమీలు ట్యూబెక్టమీలు రీకేనలైజేషన్లనీ అన్ని గాట్లు, కాట్లు ఆడవాళ్ళకు అవుతూనే ఉంటాయనీ’ అలా స్త్రీ శరీరం పెద్ద వైద్య వ్యాపారపు సరుకైందన్న మరో కోణాన్ని కూడా నిరసించింది.

గడప దాటి బయటకు రావడమే ఆడపిల్లలపై అత్యాచారాలకి కారణమని గీతలు గీసే మనువాద భావజాలం రాజకీయాల్లో విధి విధానాలని నిర్ధారించే స్థానాల్లో వున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయ సంస్కృతిని అన్ని రంగాల్లోనూ బలంగా ప్రవేశ పెట్టాల్సిన అవసరాన్ని ఆమె గుర్తించింది.

అమ్మా నాకూ ఆరేళ్ళేగా నాపైనా అత్యాచారం చేస్తారా?’ అని కూతురు తల్లిని ప్రశ్నించే సమాజంలో మనం బతుకుతున్నాం. పాత ప్రశ్నపదే పదే మళ్ళీ కొత్తగా ముందుకు వస్తే తల్లులు ఏం సమాధానం చెప్పాలి? ఈ సంపుటిలో మొదటి కథ ‘ప్రశ్న’ లో కూతురికి జాగ్రత్తలు చెబుతూ ఆ తల్లి పడిన వేదన చూడండి:

ఆడపిల్లలను శరీరాలుగా చూడద్దని మగపిల్లలతో సమానంగా వ్యక్తులుగా చూడాలని కథలు వ్యాసాలూ రాసే తను (స్వరూప) తన కూతురుకు అదీ ఆరేళ్ళయినా దాటని పసిదానికి, మగవాడినుంచి తన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో …. మనసుకు గాయం కాకుండా ఎలా చూస్కోవాలో నేర్పిస్తోంది. చిన్నపిల్లలు శరీరాలుగా ఎదగక ముందే , ఆరేళ్ళకే వయసోచ్చేసినట్లు జాగ్రత్తలు చెప్పటం ఎంత దుర్భరంగా వుంది? ఆడపిల్ల అంటే, మళ్ళీ శరీరమనే చెప్పాల్సిన స్థితిలోకి తనను తోసేసిన పరిస్థితుల్లో ఎప్పటికి మార్పు వస్తుంది?

పరోక్షంగా ఆ పసి మనసులో భయం విత్తనాలను …. పురుషున్ని పురుషుడిగా – అంటే బలం కల దృఢమైన వ్యక్తిగా చూసే సజెషన్ని తనని స్త్రీగా బలహీనురాలిగా , శరీరంగా మాత్రమే చూస్కుంటూ శరీరాన్ని రక్షించుకునే భావజాలాన్ని ఆ పసి మనసులోని అంతశ్చేతనంపై అన్యాపదేశంగా ముద్రించింది.’

చిన్నారి ఆసిఫా మరణం పచ్చిగా వున్న సమయంలో, పసిబిడ్డ స్పందన చిద్రమైన శరీరం కళ్ళముందు కదులుతూ వుండగా స్వరూప వ్యక్తం చేసిన వేదన ఆమె వొక్కదానిదే కాదు. దేశంలో తల్లులందరిదీ.

మతం యేదైనా యీ దేశంలో స్త్రీల గర్భాశయాలు ప్రయోగశాలలే. ‘హత్య’ కథలో మంజీరా, ‘మొక్కు’ కథలో మాలన్ బీ యెదుర్కొన్న మానసిక శారీరిక క్షోభ వొకే విధమైనది. మగబిడ్డని కనడం కోసమే యిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. నిజానికి రెండూ జెండర్ వివక్ష చేసిన హత్యలే అని రచయిత్రి బలంగా ప్రతిపాదించింది. మతం పేరున ఆచారాల పేరున స్త్రీలు యెదుర్కొనే అభద్రత వారినెంత దయనీయ పరిస్థితుల్లోకి నెట్టివేశాయో తెలుసుకున్నప్పుడు దు:ఖం , దు:ఖాన్ని మించిన క్రోధం కల్గుతాయి. ఆమె దేహం ఏమన్నా యంత్రమా లేక ఆమె ఏమన్నా ప్రయోగశాలలోని జంతువా’ అని అలవిగాని కోపంతో ప్రశ్నించిన డాక్టర్ గొంతు రచయిత్రిదే. ఈ రెండు కథల్లోనే కాదు రాయి , నింఫోమానియా , ఉయ్యాల కథల్లో సైతం గీతాంజలి వుపయోగించిన వైవిధ్య భరితమైన బలమైన కథన పధ్ధతులు కేవలం పురుష సమాజాన్నే కాదు మొత్తం సమాజాన్నేసెన్సిటైజ్ చేయడానికి తోడ్పడతాయి.

ఎందుకంటే – స్తీలపై అమలయ్యే హింసకి సమాజం యేదో వొక రూపంలో ఆమోదం ప్రకటిస్తుంది. చాలా సహజంగా జరిగే విషయంగా భావిస్తుంది. ‘రాయి’లో తండ్రి చేతిలో పదేళ్ళ పాటు అత్యాచారానికి గురైన అస్రా పోలీస్ కంప్లైంట్ యిచ్చినందుకు, ‘ఇంట్ల దాపెట్టవలసిన విషయం వీధిల’ పెట్టినందుకు ఆమెనూ ఆమె తల్లినీ చుట్టుపక్కల వారు రాళ్ళతో కొడతారు. ‘నింఫోమానియా’లో ప్రేమరాహిత్యంలో కొట్టుమిట్టాడుతూ తోటి మనిషి నుంచి వొక్క సాంత్వన వచనం కోసం వొక మానవీయ స్పర్శ కోసం తల్లడిల్లిన తల్లి (రుద్రా)ని ఆమె బిడ్డలే అర్థం చేసుకోరు. ఆమెను కామోన్మాదినిగా చిత్రించిన తండ్రి పక్షమే మాట్లాడి అతని పట్ల సానుభూతి చూపుతారు. ‘ఫ్రిజిడ్’ లో రాత్రంతా భార్యని శారీరికంగా పీడించి రాక్షసంగా బలవంతంగా అనుభవించిన కామేశ్వరరావు తెల్లారి పక్కింటి పిన్నిగారి నుంచి మహారసికుడు అన్న బిరుదు పొందుతాడు. ‘ఉయ్యాల’ లో తల్లిదండ్రులే తమ కూతుర్ని జోగినిగా చేసి ఆమెపై వూరుమ్మడి హక్కులు దాఖలా చేస్తారు. ‘హజ్బెండ్ స్టిచ్’ లో సుశీలా సుమతి భర్తల భావప్రాప్తి కోసం యెప్పటికప్పుడు తమను బిగుతుగా సన్నద్ధం చేసుకుంటారు. భర్తల్ని సుఖపెట్టడానికి , మగవాళ్ళు పక్కదారులు పట్టకుండా దాంపత్య బంధాన్ని నిలుపుకోడానికి ఎక్స్ ట్రా నాట్ బలమైన సాధనం అని వాళ్ళు స్వయంగా నమ్ముతారు.

అంతేకాదు మన సమాజంలో స్త్రీ పురుషుల మధ్య శృంగారం గుట్టు. చాటుమాటు వ్యవహారం. చీకటి కార్యం. దాని గురించి మాట్లాడటం నిషిద్ధం. అసభ్యం. తెగించి యెవరైనా మాట్లాడితే బరి తెగించినట్టు. నైతిక విలువలు లేనట్టు. అందుకే నాల్గు గోడల వెనక జరిగే హింస అంట చప్పున బయటికి రాదు. నోట్లో గుడ్డలు కుక్కుకొని మౌనంగా భరించే స్త్రీల వేదనకి వాగ్రూపమివ్వడం అంత తేలికైన విషయం కాదు. అందునా వొక రచయిత్రి మాట్లాడటం చాలా సాహసం చేయాలి. శృంగారమంటే రెండు స్త్రీ పురుష జననాంగాల మధ్య జరిగే రాపిడి మాత్రమే కాదు. దంపతులు ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమను స్పర్శ ద్వారా వ్యక్త పరచుకొనే దేహ భాష.’ అని చెప్పడానికి గొప్ప గుండె ధైర్యం కావాలి. స్థిరంగా వూడలు తన్నుకొని పాతుకుపోయిన పురుషాధిక్య భావజాలాన్ని తిరస్కరించడానికి గీతాంజలి లాంటి రచయితల యినప గొంతులూ వుక్కు నాల్కలూ కావాలి.

అందుకే చాలా కథల్లో విష సంస్కృతి నుంచి విముక్తిని కోరుకొనే స్త్రీ పాత్రలనే రచయిత్రి చిత్రించింది. అంతేకాదు; పురుషుడి క్రౌర్యాన్నీ దౌష్ట్యాన్ని మాత్రమే వర్ణించి ఊరుకోలేదు. ‘మగవాడి పతనా’న్ని కూడా నిర్దేశించింది. ఒకటి రెండు చిట్ల తప్ప హింసకి గురైన స్త్రీలు యెవరూ మౌనంగా ఊరుకోలేదు. చివరకి ఏదో వొక రూపంలో తిరుగుబాటు చేసి పరిష్కారాలు వెతుక్కుంటారు. అలా వెతుక్కునే వాళ్ళు మిడిల్ అప్పర్ మిడిల్ క్లాస్ దళిత ముస్లిం మైనారిటీ స్త్రీలందరూ వున్నారు. అయితే వాళ్ళ పోరాటాలూ పరిష్కారాలూ అన్నీ వైయక్తికమైనవే. ముందు హింసని వ్యతిరేకించడమూ దాన్నుంచీ బయటపడటమూ అన్నదే వారికి తక్షణ కర్తవ్యంగా గోచరిస్తుంది.

పురుషుల అసహజ లైంగిక ప్రవృత్తినీ దాంపత్య జీవితంలో మగవాడి హింసాత్మక ధోరణినీ మాత్రమే చిత్రించి వూరుకుంటే అసలు స్త్రీ పురుషుల మధ్య వుండే ప్రాకృతిక సంబంధం పట్లే భయం అయిష్టం అసహ్యం విరక్తి కలిగే అవకాశం వుంది. దాన్ని అధిగమించడానికి స్త్రీ పురుషుల మధ్య చోటు చేసుకోవాల్సిన సాన్నిహిత్యం గురించి సహజమైన ప్రేమ గురించి సమాంతరంగా వర్ణించాల్సిన అవసరాన్ని రచయిత్రి మర్చిపోలేదు( చూ. ది కిస్ , ఫ్రిజిడ్ , శిల కాని శిల). అలా చేస్తే యివి negative stories గా మిగిలిపోయేవి.

ఒక డాక్టర్ గా కౌన్సిలర్ గా గీతాంజలి తన దగ్గరకి వచ్చే స్త్రీల కష్టాల్ని వారి ముఖత:గా తెలుసుకొని రక్త గతం చేసుకొని వాటికి కథారూపాన్ని యిచ్చే క్రమంలో తీసుకొనే శ్రద్ధ అపరిమేయం. విన్న ఘటనని పునర్నిర్మించే పని చాలా కష్టం. వైయక్తిక వేదనని సమూహానికి అన్వయించడంలో సాధారణీకరించడంలో వచ్చే యిబ్బందుల్ని అధిగమించడానికి కొత్త కథన రీతుల్ని యెన్నుకోవాలి. వాస్తవంగా జరిగిన విషయాలే అయినప్పటికీ కథలుగా మలుస్తున్నప్పుడు వాటికి సాహిత్య విలువలు జోడించినప్పుడే అవి కళాత్మకతను సంతరించుకుంటాయి. నిజానికి సంఘటనలు సమాచారం వాటికవే కథలై పోవు. ముఖ్యంగా దృక్పథ పరమైన స్పష్టత లేకుంటే అవి నేరాలు ఘోరాలు ప్రోగ్రాంలా తాయారయ్యే ప్రమాదం సైతం వుంది.

రచయిత తాను స్వయంగా విన్నదాన్నో కన్నదాన్నో అనుభవించినదాన్నో సాహిత్యంగా మలచడానికి అవసరమైన నిర్మాణ రీతుల్ని ఆకళింపు చేసుకోకుండా చేసే రచన పేలవంగా రూపొందుతుంది. పాఠకులకు విసువు పుట్టిస్తుంది. అదీగాక యేక లక్ష్యంగా రాసే కథల్లో మొనాటనీ యేర్పడే అవకాశం కూడా వుంది. అందుకే రచయిత్రి కథ కథకీ విభిన్నమైన శైలిని యెంచుకొంది. ‘ఉయ్యాల’లో పెయ్యంతా పచ్చిపుండై బాధల పల్లవిగా మారిన జోగిని అనసూయ దుఃఖ భరిత వాక్ప్రవాహానికీ, ‘ది కిస్’ లో వొక సున్నితమైన తనుస్పర్శ కోసం తపించిన తపస్విని మోనోలాగ్ కథనానికీ, ‘ఫ్రిజిడ్’ లో ముకుళిత మనో దేహాలతో ప్రతి కలయికలోనూ నరకాన్ని అనుభవించే కస్తూరి చైతన్య స్రవంతి లాంటి మనోగతానికీ ‘ఫాల్ ఆఫ్ ద మేన్’ లో స్వీకరించిన ప్రతీకాత్మక నాటకీయ ముగింపుకీ మధ్య పాటించిన వైవిధ్యాన్ని గమనించండి.

అయితే కేవలం శిల్ప వైవిధ్యాన్ని చూపడం ద్వారానే యే కథలూ గొప్పవి అయిపోవు. కథలకి ప్రాణం పోసేది రచయిత దృక్పథమే. ‘సరైన ప్రాపంచిక దృక్పథం లేని రచనకి వెన్నెముక వుండదు; నిటారుగా నిలబడదు’ అని నాబోటివాడంటే అనిబద్ధ వాదులకు రుచించదు. ఈ కథల్లో రచయితగా గీతాంజలి దృక్పథం ప్రతి వాక్యంలోనూ వాచ్యంగానే కనిపిస్తుంది. నిజానికి ఆమెకు దాచిపెట్టి చెప్పడం రాదుకూడానేమో! ఆమె వచనంలో సూటిదనం యెక్కువ. పులకరింపజేసే ఆలంకారిక కవిత్వ పంక్తులుండవు. ఎక్కడా పదాలకు అంతరార్థాలు వెతుక్కోనక్కర్లేదు. వ్యాక్యాల మధ్య ఖాళీలు సైతం పూరించుకోనక్కర్లేదు. కథాంశానికి సంబంధించిన యే సూక్ష్మ సమాచారాన్ని దేన్నీ ఆమె వదిలి పెట్టదు. అంత సూటిగా చెప్పినా ఆమె దృక్పథాన్ని పక్కనపెట్టి చూడడంవల్లే యీ కథల్ని యెవరో పఠిత హింసాన్విత శృంగార కథలని అపోహపడినట్టు గ్రహించాలి.

ఈ కథలు చదువుతున్నప్పుడు ఖైర్లాంజీ అత్యాచార సంఘటనని నేపథ్యం చేసుకుని చల్లపల్లి స్వరూప రాణి రాసిన కవిత గుర్తొస్తుంది. ఇప్పుడు యిక్కడ కులం మతం పొలీసు లాఠీ న్యాయస్థానం వూరూ మొత్తం దేశమే పురుషాంగమై భయపెడుతున్నాయి అన్న స్వరూప కవిత్వ వేదనకీ, పురుషాంగాలు కత్తులై గునపాలై స్త్రీల దేహాన్ని చీల్చుతున్న విలువల్నీ బావజాలాన్నీ ద్వేషిస్తూ గొంతు పగిలేలా నినదిస్తున్న గీతాంజలి కథాగ్రహానికీ దగ్గర సంబంధం వుందనీ, వీటన్నిటి మూలాలు మనుధర్మాన్ని అమలుచేసే రాజ్య వ్యవస్థలోనే వున్నాయనీ బలంగా అనిపిస్తుంది. స్వేచ్ఛా సమానత్వాలని మౌలిక హక్కులుగా నిర్దేశించిన రాజ్యాంగాన్ని బలహీన పరచి పురుషాంగాన్ని దృఢపరచే రాజకీయాలు దేశంలో స్థిరమౌతున్న కాషాయ విషాదం కూడా కలవరపెడుతుంది. ఆధిపత్య నిరూపణకీ కుల మత దురహంకార ప్రకటనకీ పురుషాంగం వొక సాధనమైన బీభత్స సందర్భాన్ని గుండె లోతుల్లోంచీ తిరస్కరించి వ్యతిరేకించాల్సిన అవసరాన్ని యీ కథలు మరోసారి గుర్తుచేస్తున్నాయి. పడగ్గది రాజకీయాల్ని శాసిస్తోన్న కౌటుంబిక సామాజిక పురుష స్వామ్య విలువలకు వ్యతిరేకంగా చేసే వొంటరి పోరాటాలు సామూహిక స్వరాన్ని సంతరించుకొంటే తప్ప మార్పు రాదనీ హెచ్చరిస్తున్నాయి. స్త్రీ పురుష సమత్వాన్ని బోధించి మానవీయమైన ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంపొందించే భావజాలాన్ని అందించడానికి రచయితగా గీతాంజలి చేస్తున్న యీ ప్రయాణంలో మనమూ కలిసి అడుగేద్దాం.

ఎ కె ప్రభాకర్

హైదరాబాద్

జూన్ 20 , 2018

You Might Also Like

2 Comments

  1. Mukundaramarao

    Wonderful article ..which he can only write ..

    Mukundaramarao

Leave a Reply