రాయలనాటి రసికతా జీవనము

వ్యాసకర్త: Halley
*****************

ఈ పరిచయం “సరస్వతి పుత్ర” పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన “రాయలనాటి రసికతా జీవనము” అన్న పుస్తకం గురించి. అరవై డెబ్భై పేజీల చిన్న పుస్తకం అయినప్పటికీ ఎన్నో మంచి విషయాలు చర్చించారు ఇందులో. రాయలసీమ శాసనాల గురించిన పుస్తకం గురించి అంతర్జాలంలో వెతుకుతూ ఉంటే ఈ పుస్తకం తారస పడింది నాకు. ప్రచురణదారులు వారి విజ్ఞప్తిలో పేర్కొనట్టుగా “రాయలనాటి రసికతా జీవనమును నాడు వెలువడిన మహా కవుల కావ్యములలో ప్రతిబింబించిన తీరును సమన్వయించి కళాత్మకముగా రచించిన గ్రంథం ఇది”.

విద్యానగరములో రాత్రులు ఊరంతా వేయి కనులతో తలారులు తిరిగే వారట. ఏ ఇంటనైనా దొంగతనము జరిగితే కోల్పోయిన వస్తువుల విలువకు సరితూగే సంపద ముందుగా తలారి ఇవ్వాలట. అటు తర్వాత దొంగని పట్టుకోవాలట. ఒకసారి దారి దొంగలు వ్యాపారులను దోచుకుంటే ఆ ప్రాంతపు తలారి ఆ నష్టము భర్తీ చేయవలసి వచ్చిందట. వాడు తన ఆస్తి అంతా అమ్మి చివరికి భార్యతో కలిసి బిక్షమెత్తి ఆ వస్తువుల అప్పు తీర్చాడట. రాజుల ఆజ్ఞ అంత నిష్కరుణమైనది అని అంటారు పుట్టపర్తి వారు. ఈ ఉదాహరణను పక్కన పెడితే ఈ పాలసీ నాకు బాగా నచ్చింది. ముందు తమ జేబుకే నష్టం అంటే ఏ పోలీసు అయినా ఎందుకు పని చేయడు? దొంగలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు అప్పుడు మొదట నష్టపోయేది ప్రజలు మాత్రమే కాదు తాను కూడా అని తెలిస్తే. మన కాలంలో ఎక్కడన్నా అమలు చేయాలి పైలట్ ప్రాతిపదికన. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

రాజుల దివాణము సమీపంలో ఉండే బలగాల గురించి చెబుతూ, అంతఃపురంలో అమ్మగార్లకు కావలసిన సొమ్ములు చేయించే కంసాలి వారు రెండు వేలమంది వంటవాళ్ళు రెండు నూర్లు ఉండేవారు అని రాశారు. ఇది చదివిన వెంటనే “అబ్బా ఛా! ఇది మరీ టూ మచ్” అని అనుకుంటాము మనం. మనం ఇలా అనుకుంటాం అని రచయితకి కూడా తెల్సు అందుకే ఇలా ఒక చురక అంటించారు. “పై మాటలన్నియు నాటి విదేశ యాత్రికులు వ్రాసిన వ్రాతలు. మనవారే ఈ మాటలని యున్నచో “పర ప్రత్యయనేయ బుద్ధులైన” మనము వాని నెన్నడో యుత్ప్రేక్షల క్రింద జమ కట్టియుందుము” అని అన్నారు. బేసిక్ గా మనం అంతే కదా మరి. ఈ పుస్తకం నిండా రెఫరెన్సు కోసం పుట్టపర్తివారు ఆముక్త మాల్యద, తెనాలి రామకృష్ణ కవి కృతులు, పాండురంగ మహత్యము, పారిజాతాపహరణము, వసు చరిత్ర, ధూర్జటి కాళహస్తి మహత్యము వంటి రచనల నుంచి ప్రమాణాలు చూపుతూ వచ్చారు. అయితే మనం అవన్నీ నమ్ముతామా ఏమి. ఇంగ్లీషులో ఎవడో పాశ్చాత్య చరిత్రకారుడు రాస్తేనే కదా మనకి ప్రమాణం. అసలు తెలుగులో నిజాలు ఎక్కడ ఉంటాయండీ! తెలుగు కవులవి అన్నీ అభూత కల్పనలు కదా. నిజనిర్ధారణకు మొదటి గీటురాయి అది ఇంగిలీషులో ఉండటమే! వాడు రాముడయినా సరే, బొమికలు, పుర్రె దొరికి కార్బన్ డేటింగ్ లాంటిది ఏదో చేసి రుజువు చేయాలి మనకి. సరే నిజా నిజాలను పక్కన బెట్టి ఇది కల్పనే అనుకుందాం కవి ఊహను మెచ్చుకుందాం పోనీ!

ఈ విషయం పక్కన పెడితే విజయనగర చరిత్రను గురించి ఆంగ్లములో కొన్ని మంచి చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. కె.ఏ. నీలకంఠ శాస్త్రి గారు రాసిన చరిత్ర పుస్తకాలు ఉండనే ఉన్నాయి . “A Forgotten Empire Vijayanagar: A Contribution to the History of India by Robert Sewell” అన్నది ఒకటి , A History of Vijayanagar: The Never to be Forgotten Empire – B Suryanarain rao అన్నది మరొకటి. పూర్తిగా చదవలేదు కానీ చదివినంత మేరకు ఇవి చాలా మంచి పుస్తకాలు ఈ విషయానికి సంబంధించి నాకు తెలిసిన మేర. “రాయవాచకము” ఎలాగూ ఉండనే ఉంది!

రాచనగరు ముందు సర్వకాలము నందు ఇరువది వేల పల్లకీలు వానిని గాచుకొని రెండు లక్షల బోయీలు ఉండేవారు అని అన్నారు. చూసారా బోయీలు రాజులని ఎందుకు మోయాలి ఇది వివక్ష అని నన్ను ఏకకండి. నేటి మహా నగరాలలో మెట్రో స్టేషన్ దగ్గరా బస్టాండు రైలు స్టేషన్ విమానాశ్రయాలు ఉన్న చోట్ల ఆటో స్టాండులు బస్సు ష్టాండులు ఉబర్ ఓలా ష్టాండ్లు ఉండటానికి దీనికి పెద్ద తేడా ఏమి కనపడట్లేదు నాకు. అప్పటి బోయీలది తక్కువ ఉద్యోగం అంటే ఇప్పటి డ్రైవర్లది అంతే మరి. అన్ని ఉద్యోగాలని నిర్మూలించేసి అందరం మోనార్కులము అయిపోదాము పోనీ!

ఆ కాలంలో ఇళ్లలో కోపగృహం ఉండేదట. ఇంటావిడకి కోపం వస్తే ఆ గదిలోకి వెళ్లేవారట. ఈ కాలంలో అలాంటిది వస్తే మగువల కన్నా ముందు మగవారే అక్కడికి చేరతారేమో అని అంటారు రచయిత. కారణమేంటంటే మగవారి కీనాడు సంపాదించి పెట్టలేక దినమున కొక్కసారైనా భార్యపై కోపం వస్తుంది అని అంటారు. ఆయ్! అంటే ఉద్యోగం మగ వాళ్ళు మాత్రమే చేయాలి అని కదూ ఈ రచయిత ఉద్దేశం ఇది లింగ వివక్ష అంటారేమో. పాపం 1955 రచన ఇది అప్పటికి దేశం అలా ఉండేది. కాబట్టి క్షమించేద్దాం ఆయనను. కావాలంటే రెండు కోప గృహాలు కట్టించమని చెపుదాం. ప్రభుత్వం వారు అసలే 2BHKలు కట్టి ఇస్తున్నారు కదా. అర్జీ పెట్టుకుందాం. అయితే ఈ సంపాదించి పెట్టలేని తనం ఏదైతే ఉన్నదో అది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం. అసలు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని! రెండు కోట్ల మంది లక్ష ఉద్యోగాలకి పోటీ పడటం ఏంటి అసలు. విడ్డూరం కాకపొతే. మిగిలిన వారికి ఉద్యోగాలు ఉన్నా ఎప్పుడు ఊడతాయో తెలియని పరిస్థితి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ప్రజా కోప గృహ నిర్మాణ సమితి అని ఒకటి పెట్టి నగరాలలో బాత్రూములు కట్టినా కట్టక పోయినా కోపగృహాలు మాత్రం కట్టేయాలని నేను అంతర్జాలం సాక్షిగా వేడుకుంటున్నాను. మీకు ఎవరి మీద కోపం వచ్చినా సరే అది మోడీ అయినా సరే చంద్రబాబు అయినా సరే ట్రంపు కేసీఆర్ కాంగ్రెస్ ఎవరైనా సరే వెంటనే కోప గృహంలోకి వెళ్లే సదుపాయం ఉండాలి. ఇంట్లోనైనా బయట ఎక్కడన్నా ఉన్నా సరే. మనకు కావలసింది “స్వచ్ఛ భారత్” కాదు “ఉగ్ర భారత్!”

ఊరిలో పూలమ్మే స్త్రీలతో సరసములాడి ఇంటికి వచ్చాక తమ సరస సంభాషణలు ఇంటావిడ తో చెప్పేవారట అప్పటి మగవారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇలా అంటారు పుట్టపర్తి వారు.

“ఈ జీవన విధానము నేడు మనకు సరిపడదు. ఇట్టి వారినందరిని వరుసగా పోకిరీ రాయళ్ళ క్రింద గట్టి వేయుదుము. కేవలము నీరసమై, అనుత్సాహము యెముకలంట గొరికి వేయగా ఉండియు ఊడినట్లున్న జీవితము నేడు మనకు కావలసినది. ఇట్టి పనులు ఈనాడు మన మసహ్యించు కొనునది కేవలము “ధర్మ వీరులమై” కాదు. మన ప్రాచీనులు సాధించిన “ధర్మపుమేరలు” చాల గొప్పవి. మరి మన “స్మశాన వైరాగ్యమునకు” గారణము శారీరక మానసిక బలము తగ్గిపోవుటయే. అరకప్పు కాఫీతో ఆకలి దీర్చుకొను జాతికి అరసిక జీవనము గాక మరి ఏమి లభ్యమగును! కానీ, నా బాధ ఏమనగా, మన పతన స్థితిని దలపోసి, గట్టిగ నేడ్చుటకు కూడా మనకు తెలయదే అని “ అని అంటారాయన.

వెరసి చెప్పొచ్చేది ఏమంటే రసికత తగ్గిన స్థితిలో ఉన్నాము అని. మనం ఏం కోల్పోయామో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము అని.

రత్నములు ముత్యములు మొదలైనవి కుప్పలు పోసికొని అమ్మేవారట సాయంకాలాలలో. ఆదిత్య 369 సినిమాలో మేమూ చూసాం లేవోయ్ ఈ విషయం అంటారేమో సింగీతం అభిమానులు!

విద్యానగరంలో మడి సంత యొకటి, మైల సంత యొకటి, మైల సంతలో మాంసము మొదలైన పదార్థములు దొరుకును అని రాశారు రచయిత. నేడు రాజ్యం చేస్తున్న ప్రభువులు దేశాన్నంతా శాకాహారులుగా మార్చేద్దాం అని చూస్తున్నారు కదా. వారు ఆలోచించాలి ఈ విషయం గురించి. అందరూ ఒకటే రకం తిండి తినాలి అని ఆలోచించడాన్ని మించిన దౌర్భాగ్యపు ఊహ లేదు నా ఉద్దేశంలో.

ఒక్క విజయనగరంనందే నాలుగు వేల కోవెలలు ఉండెడివి అని రాసారునారాయణాచార్యులు గారు. ఉభయ సంధ్యలయందు నచట దేవదాసిల నృత్యముండెడిది అని అన్నారు రచయిత. దేవదాసీలూ నృత్యమూ అంటాడేంటి! వేశ్యలు కదా వారు! అందుకే కదా ఇరవయ్యో శతాబ్దంలో నిర్మూలించేసాం వీళ్ళని అని అంటారేమో.

దేవదాసీల గురించి కొన్ని విషయాలు పేర్కొన్నారు ఈ పుస్తకంలో. భోగము వారివి సంగీత నాట్యములలో అందె వేసిన చేతులన్నారు. అంతః పురాలలో వీరికి నిరాటంక ప్రవేశము ఉండేదట. యెంత గొప్ప సామంతుడైనను రాజాజ్ఞ లేనిదే సభలో గూర్చుండుటకు వీలు లేదట. అయినా భోగము వారు మాత్రము గూర్చుందురు అని అన్నారు. మల్లురకు కూడా ఈ అధికారము ఉండేదట. వీరిద్దరూ రాజుల ఎదుట తాంబూల సేవనం చేయవచ్చునట. అప్పటి రాజులకు రాణులకు అభ్యంగనాదులైన సర్వోపచారములు “నట్టువ కత్తులే “ తీర్చేవారని రాసారు.

కలభాషిణి గురించిన ప్రస్తావన చేశారిక్కడ. కలభాషిణి ద్వారకా పట్టణమున ఒక నటముఖ్యుని కూతురని, ఆమె గాత్ర సౌభాగ్యమునకు మెచ్చిన కృష్ణ భగవానుడు జాంబవతి మొదలైన యష్ట మహిషలకు కలభాషిణిని “రెకమెండు” చేసెను అని రాశారు రచయిత. కృష్ణుని అంతఃపురమున కలభాషిణికి అంత చనువు అని అన్నారు. షో మీ ప్రూఫ్ ఐ సే అని అంటారేమో! నాకు తెలియదు మహాప్రభో! ఇందాకే చెప్పా కదా, ఆ ఊహాశక్తిని మెచ్చుకోండి అని. అది కూడా చేతకాకపోతే ఇందాక చెప్పిన కోపగృహమునకు వెళ్లి ప్రాచీన వ్యవస్ధల మీద మీ కోపం వ్యక్తం చేయండి!

ఈ సమాజమునందు భోగమువారు దూష్యము కాదని వారికి సమాజమున గౌరవముండేదని అన్నారు. దేవరాయల కాలానికి ఇరువది వేల పైగా దేవదాసీలు ఉండేవారని, వారి వృత్తి వలన రాచ వారికి వచ్చెడి పన్నుతో పన్నెండు వేల మంది తలారులు నిర్వహింపబడే వారని అన్నారు. మనమెలాగూ ఇటువంటివి తెలుగులో చెబితే వినమని 1955లోనే గ్రహించిన పుట్టపర్తి వారు టర్కీ కి చెందిన రచయిత రాసిన Jehan Numa or the World of Mirror నుంచి ఒక వాక్యం పేర్కొన్నారు “in the city there are not lacking courtesans so wealthy that a single of them from her own wealth pays for several thousand of soldiers and dispatches them from war”. అదనమాట. ఇంగిలీషులో ఉంది. అది కూడా విదేశీయుడు రాసినది. నమ్మాల్సిందే మరి !

ఈ విషయం పైన పుట్టపర్తి వారు రాసిన కొన్ని వాక్యాలు యథాతథంగా:

““దేవదాసీలు” సమాజమునకు కళంకమను వాదము ఈనాడు ప్రబలముగా వ్యాపించినది. ఈ ప్రచారముపై నాకు కళా దృష్టి తోనూ సామాజిక దృష్టితోనూ ఎక్కువ సానుభూతి లేదు. సమాజమునందు మంచి చెడ్డలు రెండును చాలా కాలముగ స్థానమును సంపాదించుకొన్నవి. దాని స్వరూపమే యది. యెంత వారికైనను మానవ జాతి “యిట్లే యుండవలెనని” శాసించుట అసాధ్యము, అనవసరం గూడ. కానీ మన మొక చిక్కును దొలఁగించు కొనుటకై వేరొక కొత్త బాధను కొని తెచ్చుకొందుము. దానిని పోగొట్టు కొనుటకు మరియొక మార్గమన్వేషింతుము. ఈ అన్వేషణ హనుమంతుని తోక వలె రాను రాను పెరుగుచునే యుండును. దీనికి దుదియెక్కడ.

ఈ మాటలు నేననుటలో నన్నొక యభివృద్ధి నిరోధకునిగా ఇంద్రియ లోలునిగా జాల మంది వ్యాఖ్యనింతురని నేనెఱుగుదును. నాకు సంఘ సంస్కారము పనికి రాదని గాదు. సాధ్యము గాదనియే గొడవ. నాకును గూడ స్త్రీలందరును సీతమ్మ లై మగవారందరును శ్రీ రామచంద్రులైన సమాజమును జూచి యానందింతమనియే ఉన్నది. కానీ వాల్మీకి కాలమునందును యట్టి సమాజముండెనో లేదో యని నా యనుమానము.

ఇక కళాదృష్టితో జూచినపు డీ ప్రచారములో గలుగు నష్టము పేక్షింపదగినది కాదు. ఆ కథయే వారికి కాబట్టదు. కావలసినచో వారి స్థితిని మనము జక్క బరుపవచ్చును. కళా దృష్టిని వారికింతకంటే ఎక్కువ గలిగించుటకై పాటు పడవచ్చును. సంఘము నందు వారికి గల యమర్యాదను దొలఁగించుటకై ప్రయత్నింప వచ్చును. మన ప్రాచీన సంఘము నందు శైవులు ముఖ్యముగా వైష్ణవులు, దేవదాసికిచ్చిన గౌరవము చాల గొప్పది వారేర్పరచిన నియమములను చక్కగా ననుసరించుచున్న ఏ దేవదాసి యైన నేడున్నచో నామెకు జేయెత్తి మ్రొక్కుటకు నాకెట్టి యాక్షేపణము లేదు. ఏ నియమముకైనను హృదయ ధర్మము మారవలెను. అది లేని ఏ ప్రయత్నము గూడ కేవల విడంబమే. ఈ నాడును “మద్యపాన నిషేధ ప్రచారము” వంటివి మనమెన్నియో చేయుచున్నాము గదా! అది యట్లుండె.“

ఈ వాక్యాలు రాసినందుకు పుట్టపర్తి వారికీ చేయెత్తి మ్రొక్కుటకు నాకెట్టి యాక్షేపణము లేదు! వ్యవస్థల్ని నిర్మూలించటంలో చూపిన ఉత్సుకత ఆ వ్యవస్థల ఆశయాలని, ఆదర్శాలని అర్థం చేసుకోటంలో చూపలేదు మన సంస్కర్తలు. ప్రత్యామ్నయ వ్యవస్థలు రూపొందించనూ లేదు. ఆలోచనా చేయలేదు. చివరకు మిగిలింది సాంస్కృతిక విధ్వంసం, అరసికత, స్మశాన వైరాగ్యం! పోనీ సంస్కర్తలు ఆశించినట్టు వేశ్యా వృత్తిని నిర్మూలించేసారా? జారత్వాన్ని కట్టుబాటు చేయగలిగారా? అదీ లేదు. ఈ మధ్యనే జారత్వము నేరం కాదు, కావాలంటే విడాకులు తీసుకోండి పొండి అన్నాయి మన కోర్టులు. అది మనం సాధించిన ప్రగతి! ఇక వ్యభిచార నిర్మూలన సంగతి సరేసరి. పోర్నోగ్రఫీ ప్రభావిత విశృంఖలత్వం గురించి యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక ఆ దేవదాసీల సంగీత నాట్య పరంపరల సంగతి దేవుడెరుగు. పుట్టపర్తి వారనట్టు అందరిని సీతమ్మ లాగానో, రాముడిలాగానో ఉండమని కోర్టు ఉత్తర్వులు ఇస్తే అందరు మాట వింటారని ఊహించారు కాబోలు అప్పటి సంస్కర్తలు. కళంకాలని నిర్మూలించామని సంకలు గుద్దుకున్నాం కళంకితులనే అపప్రథ పొందిన కళకే అంకితమైన మహా కళాకారులను పోగుట్టుకున్నాం. ఫెమినిస్టులు కూడా ఊహించలేని ఉన్నతమైన మాతృస్వామ్య వ్యవస్థ యొక్క ఆనవాళ్లు కూడా లేకుండా చేసుకున్నాం. పుట్టపర్తి వారు అన్నట్టు “ఈనాటి భావసంపత్తి తో మనము వారిని నిందించినచో మనకు అలత గలిగి ఒక గ్లాసు మంచి నీళ్ల ఖర్చే తప్ప చచ్చినవారి కే నష్టమును లేదు”.

“విజయనగరం వారి భాగ్యమనంతము. అప్పుడు గూడా ధనిక దారిద్ర బేధము దండిగా లేకపోలేదు. కానీ జీవితమునకవసరమైన “కూడూ గుడ్డలు”లు అందరికి అందుబాటులో ఉండెను” అని అన్నారు రచయిత. ధూర్జటి కాళహస్తి మహత్యము నుంచి కొన్ని వాక్యాలు పేర్కొంటూ నాటి భిల్ల కాంతలు గూడా పట్టు చీరలు గట్టు భాగ్యంబు గలవారే, చెంచుల దగ్గర కూడా ఎంతో విలువైన ప్రకృతి సిద్ధమైన సంపద ఉండేదని అన్నారు. ఈ మాటలకు మనమాశ్చర్య పోవలసిన అవసరము లేదంటూ ఆనాటి శాసనములను కొంచము పెద్ద మనసు జేసుకొని మనము దిలకించినచో విప్ర వినోదులు, వీర ముష్టి వారు, దొమ్మరులు దేవాలయములకిచ్చిన దానములెన్నో మన కంటబడును అని అంటారు రచయిత. కడుపు కాల్చుకొను వారు దానములొసగుటకు కర్ణులా ఏమి? అని ఎదురు ప్రశ్నిస్తారు కూడాను. నిజమే! దొమ్మరి వారు దేవాలయాలకి దానము ఇవ్వటం ఏంటి వారు కటిక పేదరికంలో మ్రగ్గు వారు కదా అని మనకు అనుమానము వస్తుంది. అయినప్పటికీ ఇటువంటి విషయం అప్పటి కాలంలో సాధ్యమయింది మరి. సరే ఇటువంటి విషయాలు మనము ఆట్టే నమ్మము కదా.

నాకొక పనికి మాలిన హాబీ ఉంది ఇటువంటి విషయాలలో! ఆర్కైవ్ డాట్ ఆర్గ్, డిజిటల్ లైబ్రరీ . లిబ్ జెన్ వంటి వెబ్సైటులను శోధించి ఇటువంటి విషయాలకు సంబందించిన పుస్తకాలను తవ్వి తీసి ఈ విషయాల మీద రీసెర్చు చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు పుట్టపర్తి వారు దొమ్మరి వారు, వీర ముష్టి వారు (https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81 ) దేవాలయాలకు దానము లిచ్చిన విషయము ప్రస్తావించారు . నేను అది మరొక పుస్తకంలో కూడా చదివాను ఈ మధ్యన . ఆ పుస్తకం పేరు “ రాయలసీమ తెలుగు శాసనాల సాంస్కృతిక అధ్యయనం “ డా. ఎం . ఆదినారాయణ శాస్త్రి గారు రాసినది . అందులో నుంచి కొన్ని వాక్యాల సారం ఇది .

కడప జిల్లా పెద్ద ముడియం గ్రామం లోని క్రీ.శ. 1551వ సం|| శాసనంలో శివార్చన చేసి జీవించే తమ్ముళ్ళు మొదలైన జాతివారు చెల్లించే వీర ముష్టి పన్ను సోమేశ్వర దేవుని దీపారాధనకు అర్పించినట్టుగా చెప్పబడిందట. గ్రామంలో కంసాలి, వడ్రంగి, కమ్మరి, మంగలి మొదలగు వృత్తుల వారు శివభక్తితో జీవించే జాతి వారట. వీర ముష్టి పన్ను వీర శైవ భక్తుల నుంచి వసూలు చేసి, ఏదో ఒక మఠానికి అందజేస్తారట. మఠాధిపతి లేక ఆయన కార్యకర్త ఆ పన్నును ఏ దేవాలయానికో దాఖలు పరుస్తాడు. ఇది రాజుకు చెందదు అని అన్నారు రచయిత ఆ పుస్తకంలో. పుట్టపర్తి వారు చెప్పినది ఇటువంటి దానం గురించే. అదే రాయలసీమకు చెందిన శాసనం మరి!

అదే జిల్లా మోటకట్ల గ్రామంలోని క్రీ.శ . 1552 సం || నాటి శాసనంలో దొమ్మరివారు తమ 24 కులాల వారి పుణ్యానికి గాను దొమ్మరి పన్నును అదే గ్రామంలోని నరసింగ దేవునికి కానుకగా ఇచ్చినట్టుగా పేర్కొనబడింది అనమాట. కాబట్టి పుట్టపర్తి వారు రాసిన విషయాల గురించిన పిడకల వేట అనవసరం అనమాట. మనకి నమ్మశక్యంగా లేనంత మాత్రాన నిజం కాకుండా పోదు.

ఇటువంటివి ఎన్నో విషయాలు పేర్కొన్నారు పుట్టపర్తి నారాయణాచార్యులు ఈ పుస్తకంలో. ఏదో ఆ మధ్యన యధాలాపంగా రాయవాచకము తిరగేసాను కానీ ఈ పుస్తకం చదివాక విజయనగర సామ్రాజ్య చరిత్రను గురించి మళ్ళీ పునశ్చరణం చేసుకోవాలి అని అనిపించింది. సరిగ్గా దృష్టి పెట్టి చదవాలి ఈ మారు. ఈ పుస్తకము లభించు చోటు. 68 పేజీల అద్భుతం ఈ పుస్తకం!

You Might Also Like

One Comment

  1. రవి

    You may try this book. విద్యానగరచరిత్రము

    https://archive.org/details/in.ernet.dli.2015.448316/page/n45

Leave a Reply