ముచ్చటగా మూడో మజిలీ

వ్యాసం రాసినవారు: ఏ. కె. ప్రభాకర్

దూరాల్ని అధిగమించి యింత తక్కువ వ్యవధిలోనే ‘తొవ్వముచ్చట్లు’ మూడోభాగంతో  మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా వుంది. ఈ మజిలీలో ఆగి వొకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తృప్తిగా వుంది.

ఆంధ్రభూమి దినపత్రికలో ఆరు సంవత్సరాలకు పైగా  ప్రతి ఆదివారం  వెలువడుతున్న తొవ్వముచ్చట్లు శీర్షిక   మొదలైనప్పుడూ ఆ తర్వాత రెండు భాగాలు పుస్తకరూపంలో వచ్చినప్పుడూ మరుగునపడ్డ చరిత్రని తవ్వి తీసిన అభిలేఖనాలుగా , సమకాలీన జీవన పార్శ్వాల్ని చిత్రిక పట్టిన కథనాలుగా  పదుగురిని ఆకట్టుకొన్నాయి. గతానికీ వర్తమానానికీ వారధి కట్టాయి.  అంతకుముందు నలుగురూ నడిచి నలిగినన తొవ్వ కాకపోవడంతో ప్రతి రచనా ఆసక్తి కల్గించింది. ప్రతి ఆలోచనా కొత్త చూపునిచ్చింది. సంధించిన ప్రతి ప్రశ్నా నూతన అన్వేషణకి పురిగొల్పింది. రచయితలోని సంవేదన శీలత పాఠకుల గుండెను సూటిగా తాకింది. తెలుగువారి మరీ ముఖ్యంగా  నేల మూలవాసుల భాషా చరిత్ర సంస్కృతులకి చెందిన అనేక కోణాల పై వెలుగు పరిచిన ఆ శీర్షిక రూపం మీద చర్చలు నడిచాయి.

కాల్పనికతకి తావులేకుండా సామాజిక యథార్థతకి ప్రతిబింబంగా అపురూపమైన కళా విలువల్ని జోడించుకొన్న వుద్వేగ ప్రధానమైన రచనలివి. వీటిలో కొన్ని కవితాత్మక శైలిని అద్దుకొన్నాయి. మరికొన్ని కథా రూపాన్ని దిద్దుకొన్నాయి. వ్యక్తుల నిలువెత్తు  జీవన రేఖా చిత్రాలుగా కళ్ళకు కట్టాయి. జీవితాన్నీ అందులోని సమస్త వైవిధ్యాన్నీ లోతుల్లోకి వెళ్లి పొరలు విప్పి తాత్త్వికంగా విశ్లేషించడం వల్ల   యివి  సామాజిక వ్యాసాలా – యాత్రా కథనాలా – క్షేత్ర పర్యటన అనుభవ శకలాలా  – గత కాలపు జ్ఞాపకాల మాలికలా – రాజకీయ భాష్యాలా – వార్తా వ్యాఖ్యలా అని యెవరికి తోచినరీతిలో వారు నిర్వచించుకొన్నారు. కానీ తొవ్వముచ్చట్లు యీ  ప్రక్రియలన్నిటి మేలు కలయిక.  సాహిత్యాన్నీ జర్నలిజాన్నీపరిశోధననీ ముప్పేటగా  కలనేత నేసిన వినూత్న ప్రక్రియ.

తొవ్వ ముచ్చట్లు అణగారిన వర్గాల ప్రజల మనోభావాలకి ప్రతిస్పందనగా నిలిచాయి.  మూస అకడమిక్  పరిశోధన చట్రాల్ని బద్దలు కొట్టి జానపద గిరిజన చరిత్ర సంస్కృతుల్నిఅధ్యయనం చేయడానికి కొత్త పరికరాల్ని అందించాయి. సాహిత్య కళారూపాల్ని వివిధ సామాజిక శాస్త్రాల వెలుగులో తరచి చూశాయి. ఆ యా రంగాల్లో పాతుకు పోయిన నిలవ విలువల్ని ప్రశ్నించాయి.  ఊడలు తన్నిన ఆధిపత్యాల్ని పెళ్లగించాయి.  క్షీర నీర న్యాయంగా నిజమైన  ప్రజా సంస్కృతిని వేరుచేసి చూపాయి. అసలైన   ప్రజాస్వామ్య సంస్కృతికి పట్టం గట్టాయి. నేలమాళిగల్లో దాచేసిన దేశీయ జ్ఞానానికి తలుపులు తెరిచాయి. ప్రకృతికి దగ్గరగా నడిచిన తొవ్వలు కావడంతో పాఠకుల్లో పర్యావరణ స్పృహ పెంచాయి. పేరుకి  ముచ్చట్లే గానీ అవి కాలక్షేపం కబుర్లు కావు. సంచలనం కోసం చేసిన తక్షణ స్పందనలు కావు. సంయమనంతో దీర్ఘ కాలిక స్పృహతో సమన్వయ దృష్టితో చేసిన రచనలివి. అందుకే వారం వారం కాలమ్ రూపంలో వెలువడినప్పటికీ  కాలాన్ని అధిగమించాయి. ప్రాసంగికతను కోల్పోకుండా యెప్పటికీ తాజా గానే వున్నాయి.

‘అంతరించిపోతున్న కళల గురించి ఆర్తి , నిరాదరణకు గురవుతోన్న దేశీయ సంస్కృతి – విజ్ఞానాల కోసం వెంపర్లాట , మనిషి పట్ల మానవీయ విలువల పట్ల ఆవేదన – యీ సమస్త దు:ఖాలకీ కారణమైన వ్యవస్థల పట్ల ఆగ్రహం, మూలాల్ని కాపాడుకోవాలనే ఆరాటం – అందుకు అవసరమైన పనిముట్ల కోసం అన్వేషణ… కుల – వర్గ ఆధిపత్యాలపై నిరసన… ’ యివన్నీ ప్రత్యక్షరంలోనూ దట్టించి వుండడం వల్ల తొవ్వముచ్చట్లు విలక్షణ రచనగా గుర్తింపు పొందాయి.  సాహిత్య క్షేత్రాల్లోకి లిఖిత మౌఖిక ప్రవాహాలు రెండింటినీ మలపడం వల్ల యెన్నో ఖాళీలు పూరించుకోడానికి తోడ్పడ్డాయి. ప్రపంచీకరణ సందర్భంలో స్థానీయమైన ఆనవాళ్ళని అన్వేషించడానికి పూనుకోవడం వల్ల ప్రాంతీయ చైతన్యానికి దోహదం చేశాయి. దళిత బహుజనుల ఆత్మగౌరవ స్వరాలకి చిరునామాగా మారాయి. ప్రగతిశీల దృక్పథాన్ని నిర్మాణాత్మకంగా విమర్శకు పెట్టి సాంస్కృతికోద్యమాలకు దారి దీపాలయ్యాయి. ఆధిపత్య సమాజం అంచులకు నెట్టివేసిన జాతుల వుపజాతుల గుండె సవ్వడి వినిపించి అస్తిత్వోద్యమాలకు స్ఫూర్తినిచ్చాయి. విద్యాత్మక రంగంలో కృషి చేసేవారికీ సాహిత్య కళా రంగాల్లో తలమునకలై వున్నవారికీ  పరిశోధనలో ఆచరణలో కొత్త దారులు పరిచాయి.

ముంపు ముప్పుతో విస్తాపనకి గురై విచ్చిపోయిన కోయ గూడేల గుండెల్లోకి – బజారా సంచార జీవనంలో తండాల నాలుకలపై నడయాడుతోన్న మౌఖిక కథల మూలాల్లోకి –   సరైన తిండీ వైద్యం అందక అంతరించిపోయే ప్రమాదం అంచుల్లో జీవన్మరణ పోరాటం చేస్తున్న  ఆదిమ చెంచు ప్రపంచంలోకి –  ప్రాచీనమైన తమ చరిత్ర సంస్కృతుల్ని రాతసంప్రదాయాన్ని కాపాడుకోడానికి దిటవుగా నిలబడ్డ  గోండి భాషా సమూహాల్లోకి చొచ్చుకుని వ్యాపిస్తూ కొత్త సవాళ్ళని స్వీకరిస్తూ మనం నడవాల్సిన దారుల్లోకి  – పెరిగిన ముళ్ళ పొదల్నీ కట్టిన రాతి కంచెల్నీ ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్న జయధీర్ తిరుమలరావు గుండె విప్పి చెప్పుకొన్న మరికొన్ని  ఆత్మీయ సంభాషణల్నీ  పంచుకొన్న అనుభూతుల్నీ యీ సంపుటిలో చూస్తాం.

జూలై 21, 2013 నుంచి తెలంగాణ రాష్ట్రం యేర్పడే వరకు చెప్పిన ముచ్చట్లివి. ఆ తర్వాతి అధ్యాయం కొత్తది. ముచ్చట్లూ కొత్తవే.

మూడు సంపుటాల్లోనూ కలిపి మూడు యాభైలకి పైగా ముచ్చట్లు మీ ముంగిట్లోకి వచ్చాయి. మరో మూడు యాభైలు మిమ్మల్ని పలకరించడానికి సిద్ధంగా వున్నాయి. గతంలో విస్మృతికి గురైన అంశాలు అసంఖ్యాకం – వర్తమానం అనునిత్యం అనేక సంఘటనలతో ఘర్షణ పూరితం. అవన్నీ ముచ్చటించుకొంటూ నడవాల్సిన దారి సుదీర్ఘం. పయనం ఆగనిది. అందుకే యీ తొవ్వ ముచ్చట్లు వొడవనివి. మరి కొన్ని ముచ్చట్లతో త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తామనే హామీతో …

‘తొవ్వ ముచ్చట్లు’ శీర్షికకు ప్రతి ఆదివారం సంపాదకీయ పేజీలో చోటు కల్పించిన ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులకు , ఈ పుస్తకం ప్రచురణలో సహకరించిన సుప్రసిద్ధ తెలంగాణ చిత్రకారుడు తోట వైకుంఠం గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో …

తొవ్వలో కలిసి నడుస్తున్న ఆత్మీయులందరికీ వందనాలతో …

 

హైదరాబాద్                                                                             ఎ కె ప్రభాకర్

1 సెప్టెంబర్ 2018                                                                      సంపాదకుడు

You Might Also Like

Leave a Reply