వందనం! అమ్మా వందనం!
వ్యాసకర్త: డా. మూర్తి రేమిళ్ళ
**********
ఏదో ఒక రోజుని అమ్మ కోసం కేటాయించి, హడావుడి చేసి వదిలేయడం మన సంస్కృతీ కాదు, సంప్రదాయమూ కాదు .. రోజూ అన్నం తింటున్నా పండుగనాడు పరమాన్నం తిన్నట్లుగా, అయినా అందరితో బాటు ఈ రోజు (మదర్స్ డే) ఇంకొంచెం శ్రద్ధగా, అమ్మ వున్న అదృష్టవంతులు అమ్మని చూసుకోవడంలో, లేని నిర్భాగ్యులు మాతృమూర్తిని తలచుకొని కొలవడంలో తప్పు లేదేమో అనిపించింది. ఈ మధ్య నేను చదివిన అమ్మ పదం కవితా సంకలనం నుంచి కొన్ని కదిలించే పదాల పేటిక ….
అమ్మ గురించి చెప్పాలంటే ఎక్కడ ఎలా మొదలు పెట్టాలి? ఎలా మొదలు పెట్టాలి? ఇదో సమాధానం తెలీని ప్రహేళిక! ఒక్కొక్కరిది ఒక్కో దృక్పథం! ఒక్కో అనుభవం! ఒకరు తమ సుందర భావాలు,మధుర అనుభవాలు రాస్తే, వేరే వారి బాధల్నీ, అమ్మల బాధల్నీ తమవిగా చేసుకుని పరకాయ ప్రవేశం చేసినట్లు రాసినవారు మరి కొందరు!
అందమైన బాపు బొమ్మల్తో రూపు దిద్దుకున్న వాయుపురాణంలోని షోడశ మాతృకలతో మొదలవుతుందీ సంకలనం. ఈ, నా భావాలు కూడా పదారు పుటల పొత్తం ! అవి రంగు రంగుల చిత్రాలైతే, ఈ అమ్మ పదం లో చెప్పినవన్నీ పద చిత్రాలు !
ఎక్కడ అమ్మని చూసుకోవాలి అనిపించిన వారికి ఒక తేలికైన ఊరట –
“అమ్మ ఒక జ్ఞాపకమే కాదు .. అనంతానంత అనుభవం
రోజూ నా నోట్లోకెళ్ళే ప్రతి అన్నపు మెతుకులోనూ అమ్మే బియ్యపు గింజ” (బియ్యపుగింజ- జి. సుబ్బారావు)
చిన్నప్పుడు పెద్దయ్యేక కూడా అమ్మల్ని ఏడిపించే పిల్ల రాక్షసుల గురించి –
ఆమె తల్లి
అతడు బిడ్డ
చిన్నప్పుడు
ఏడిపించాడామెని
అన్నం తిననని
ఇప్పుడూ
ఏడిపిస్తున్నాడామెని
అన్నం పెట్టనని !
(జోశ్యభట్ల)
అమ్మ ఎన్ని చేసినా వృధ్ద్ధాప్యంలో విలువ నివ్వని ప్రబుద్ధుల్ని కూడా ప్రేమించే అమ్మ గురించి చెప్పిన ‘అమ్మంటే అంతేనేమో’ లో ఈ పదాలు అలాంటి వాళ్ళను కూడా కదిలిస్తాయా అనేది సందేహమే –
“ఇల్లూ వాకిలీ మంచమూ కంచమూ అన్నీ అరుగే ఐన
ముసలితల్లి మీకెక్కడైనా కనిపించిందా ?
ఆమె గుండెకోత మీకెప్పుడైనా వినిపించిందా …
ముద్దులిచ్చినందుకూ మమతా కౌగిళ్ళిచ్చినందుకూ
దిగులు లేని జీవితాన్నిచ్చినందుకూ హోదానిచ్చినందుకూ
తల్లిని దోషిని చేసిన స్వంత ఇంటి అరుగునే చెరసాల చేసి…కన్నకొడుకు కసాయి వాడయ్యాడు
అయినా …. ఆమె పెదవి శిఖరం మీద చిరునవ్వు జెండా అవనతం కాదు
అమ్మ కదా మరి !
ఆమెనొక్కసారి కదిపితే చాలు
మాతృత్వపు వాత్సల్యం జలజలా రాలుతుంది
ఆమె ఆశీర్వచనపు పక్షి కొడుకు భుజం మీదే వాలుతుంది
వెన్నెలగూడు అల్లుతూ ఆమె కొడుకు చుట్టూరా పరిభ్రమిస్తుంది
అంతా నిశిరాత్రిలో కూడా పరాయి నోళ్ల నుండి కొడుకును కాపాడుతుంది
రోజుకొక్కసారైనా మెట్లు దిగేటప్పుడో ఎక్కేటప్పుడో
కొడుకు కళ్ల బడ్తాడన్న తృప్తి చాలు – ఆమె కళ్ళు చెమ్మగిల్లుతాయి
అమ్మంటే అంతేనేమో
బహుశా తల్లికి తప్ప
ఇంకెవరికీ సాధ్యం కాదేమో …. !
(అమ్మంటే అంతేనేమో – భగ్వాన్)
అయినా అరుగు మీద అమ్మని చూసినా కదలని వాడిని, ఈ పదాలు కదిలిస్తాయా?
ఇంటి అరుగుమీద కూడా చోటివ్వక వృధ్ద్ధాశ్రమాలకు తరలించే తామసుల తల్లుల వ్యథ ఇదీ –
వృద్ధాశ్రమాల్లో అమ్మలకు
ఏమీ తక్కువ వుండదు
కంచం, మంచం, కాలక్షేపం …
అయినా ఆ వెలితి మనకర్ధమయ్యేది కాదు
……
భగవాన్ !
వచ్చే జన్మలో బాగా పైకొచ్చే పిల్లల్ని నాకు పుట్టించకు
అవునూ – మారు జన్మలో కూడా అమ్మనేనా ??
(తపఃఫలం – ఎన్. అరుణ)
కనుమూసిన అమ్మ గురించి పడే పరివేదన – గుండెల్ని తడుతుంది
ఎక్కడో బాల్యాన్ని పారేసుకున్నాను
బతుక్కి అర్థాన్ని వెతుక్కుంటూనే వెతుక్కుంటూనే
అకస్మాత్తుగా ఆమెను జారవిడుచుకున్నాను
పొట్టిలాగూ చొక్కా తొడుక్కుని మోకాళ్లమీద పాకితే మాత్రం
జారిపోయిన బాల్యం మళ్ళీ వస్తుందా !
తిండీ తిప్పలూ మానుకుని ఎన్ని తపస్సులు చేస్తే మాత్రం
దీర్ఘనిద్రలోంచి అమ్మ మళ్ళీ కళ్ళు తెరుస్తుందా …?
(ఒక స్త్రీ మూర్తి – శీలా వీర్రాజు)
కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ ఏదీ కాదు కవితకు అనర్హం అన్నట్లు, చూసేవాడికి అన్నింటా అమ్మ కనిపిస్తుంది, ఆఖరుకి చిటికెన వెలులో కూడా –
“అమ్మలా నీరు నీరైపోయే దయాళువు చిటికెనవేలు
మా అమ్మ చేతిమీద సుతారంగా చేసి
కట్టెలపొయ్యి పెనంమీద కాల్చిన మక్కపిండి కారం రొట్టెల రుచి
ఎంత గొప్పగుండేదో ఇప్పుడు చెప్పినా మీకర్థం కాదు”
(చిటికెన వేలు – జూకంటి జగన్నాథం)
పెంచి పెద్ద చేసి వృధ్ధిలోకి రావాలని పిల్లల్ని దూరతీరాలకు పంపిన తల్లి గుండె ఘోష ఇలా వినిపిస్తుంది.
విమానంలో కూర్చున్న తల్లికి
కూటికోసం కూలిపనికెళ్లే రోజులు గుర్తొచ్చాయి
కన్నపేగులు కంటి తీగలై
తడిరెప్పలమీద పాకుతున్నాయి
నా కొడుకు చిన్నప్పుడు చెట్టుకు కట్టిన ఉయ్యాలలో
చింతచిగురులా ఊగుతూ ఉంటే
ఏ చింతా ఉండేది కాదు
నా కూతురు కొంగు కొమ్మకు వేలాడుతుంటే
ఎంత భద్రంగా ఉండేది ..!
కొడుకా జాగ్రత్త –
బిడ్డా పదిలం తల్లీ –
వలసపోయిన డాలరు దూడలకోసం
ఆవులాంటి అమ్మకు
కన్నుమూసినా తెరచినా
మనసు మాత్రం కొట్టం చుట్టూ తిరుగుతూనే వుంటుంది
(విడిచివచ్చిన పేగు – ఎడ్లూరి సుధాకర్)
బిడ్డల్ని వదిలి తల్లి పడే బాధనే కాదు, తల్లిని వదిలిన బిడ్డ తన బాధను పంచుకునే కవితలూ ఉన్నాయి –
ఊరొదిలి చదువుని చంకనెట్టుకుని నేవెళ్తుంటే
వీధిమలుపు దగ్గర సాగరాలైన నీ నేత్రాల గురించి రాయనా –
వీధి మలుపు దగ్గర అంతమై నిరంతరం నా హృదయంలో ప్రతిధ్వనించే
నీ ‘జాగ్రత్త’ శబ్దాల గురించి వర్ణించనా !
(అనంత కావ్యం – జింబో)
అమ్మని చూసి పిల్లలు మురిసిపోవడమే కాదు, పిల్లల్ని చూసి మురిసిపోయే తల్లుల గురించి ఇలా అంటారు –
నెలల శిశువుతో తల్లి ముచ్చట్లు
దీన్ని మించిన ప్రేమ కావ్యం లేదు ..
నా సెల్ లో కవిత్వం రాసింది
మా అమ్మాయి
తన నెంబరు ‘అమ్మ’ అని ఫీడ్ చేసింది
(ఆరు అమ్మలు – రెంటాల శ్రీవేంకటేశ్వర రావు)
రసాత్మకంగానో, మధురంగానో మాత్రమే కాక విప్లవాత్మకంగా చిత్రించే కవులు కొందరు –
నీవు తాపిన పాలలో లేని పిరికితనం
నాకేలవచ్చిందో అర్థం కాదు అమ్మా …
ఏదీ శాశ్వతం కానివేళ ఈ పిరికితనం క్షణికమే
తెగింపు బతుకు సంకెల బద్దలు చేస్తుంది
నేను ఒంటరిని కానని
నా చుట్టూ ఈ విశ్వాన్ని అల్లి
చివరి శ్వాసదాకా జీవనేచ్ఛతో పెనుగులాడిన
ఆమె ఊపిరి నాలో… పంచ భూతాలలో !!
(ఆమె జీవన యాత్ర – నిఖిలేశ్వర్)
ఇటువంటి మాతృ దినోత్సవాలని, ఉత్సవాలని వ్యతిరేకిస్తూ మనకు అమ్మ అపురూపమా? అమ్మకు మనం అపురూపమా? అని ప్రశ్నించే కవిత –
మనం రాయని ఉత్తరాల కోసం
మనం మాట్లాడని మాటలకోసం
మనం చెయ్యని సహాయంకోసం
మనం పొందటమే తప్ప తిరిగివ్వని ప్రేమలకోసం
మన కవితల్లో వస్తువులై కవిత శీర్షికలై
మాతృదినోత్సవాలకు గ్రీటింగ్ కార్డులై
అమ్మలు అలా ఎదురుచూస్తూనే ఉన్నారు
నాకినప్పటికీ అర్థం కాదు –
మనకు అమ్మ అపురూపమా ?
అమ్మకు మనం అపురూపమా ?
(అమ్మతో మాట్లాడని మాటలు – కల్పనా రెంటాల)
ఇదే విధంగా ‘మదర్స్ డే’ లని వ్యతిరేకించే మరో స్త్రీ వాద కవిత –
నా ఇంటిలోనే నేనొక కాందిశీకురాలిని
భగవంతుడా మదర్స్ డేలూ వద్దు ! మమకార బంధాలూ వద్దు !
వర్షంలా కురిసే ఈ కన్నీటి ధారల్లో తడవడాలూ వద్దు ..!
ఈ చూపులకు వాస్తవాలు నేర్పి , నిక్కచ్చిగా మాతృత్వానికి విషం పెట్టారు !
(ఒక అశ్రుకణం నుంచి – దోర్నాదుల సుబ్బమ్మ)
ఈ విషయాన్నే ఇంకొంత సూటిగా చెప్పేది మరొకటి –
తొమ్మిది నెలలూ మోసాను
ఏడాది పొడుగునా పాలిచ్చాను
జబ్బులు తగ్గేదాకా కళ్ళల్లో వత్తులేసి పడుక్కున్నాను
….
నా ఒంట్లో రక్తమాంసాలన్నీ నూరి ముద్ద చేసి ఔషధం చేసి
నీ అణువనువూ పూశాను
ఇప్పుడు నువ్వు వస్తాదు వయ్యావు .. వజీరు వయ్యావు … శాసకుడి వయ్యావు
తాత ముత్తాతల భావాలమరిగి సిసలైన ‘మగాడి’ వయ్యావు
యేడాది కొక్కరోజు నాకు ముష్టివేసి
పేపర్లో ఒక్క పేజీ కేటాయించి వెర్రివ్యాఖ్యానాలు గుమ్మరిస్తున్నావు గానీ
కృతఘ్నుడైన కొడుకుని కనిపెంచినందుకీ ఒక్క రోజే దుఃఖించి
యేడాదంతా యెడతెగని పోరు చేస్తాను
నువ్వు కరచాలనం చేసేదాకా
కరవాలచాలనం చేస్తూనే ఉంటాను
(మాకీ ‘దినోత్సవాలు’ వద్దు- సావిత్రి)
ఇవన్నీ వద్దు కానీ, కూతుళ్ళకి కూడా అమ్మమీద హక్కు కావాలని నినదించే కుమార్తె రత్నం –
నిన్నాహ్వానించలేని ‘నా ఇంట్లో’ నేను
నన్నుంచుకోలేని ‘నీ ఇంట్లో’ నువ్వు
…
ఆస్తి హక్కుని ఇస్తామంటున్న వారికో మనవి
‘అమ్మ మీద హక్కు’ నిచ్చే చట్టాన్ని చేయమని
(ఆగర్భ పరిచితులం – వడ్లమూడి దుర్గాంబ)
మన పితృస్వామ్య వ్యవస్థలో అమ్మకి ఇవ్వవలసిన విలువ స్థానం ఇవ్వడం లేదని ఆవేదన చిందించే కవిత –
తనదికాని షష్టిపూర్తికి దిష్టిబొమ్మై నిలబడినప్పుడు –
తనకు మిగిలిన రోజులు లెక్కించబోతే –
అరిగి ఆనవాళ్ళు లేని వేళ్ళతో మొండిచేయి వెక్కిరిస్తుంది !
(అమ్మ పుట్టిన రోజు – పాటిబండ్ల రజని)
మరో కవిత అమ్మ కష్టాలను కన్నీళ్ళను తలపిస్తుంది –
తల్లిపాదాల దగ్గర స్వర్గం ఉంటుందంటారు –
మా అమ్మీ పాదాలకై వంగిన ప్రతీసారీ
చెమరిన నా చూపు
ఆమె పాదాల పగుళ్ళలో చిక్కుకుని గిలగిలలాడుతుంది !
(రెహాల్- స్కైబాబ)
కష్టమూర్తి గా కన్పించే అమ్మను గుర్తుచేసే ఇంకో కవిత –
ఎనిమిది పదులు నిందినా వండివార్చే వంటింటి బానిస
మెరలేని మైలబట్టల చాకలి – జీతంలేని అంట్లగిన్నెల చాకిరి
నీడకు కూసో, చాయ్ తాగు అంటూ అందరి క్షేమం కోరే అన్నపూర్ణ
(అస్థిత్వం లేని ఆస్తిక – జ్వలిత)
త్యాగమూర్తిని కవిత్వంతో తనివితీరా ముద్దాడే కవిత –
అమ్మను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా
వరినాటుకు పొలం వెళ్ళి
అక్కడ పెట్టిన రెండు కొబ్బరి ముక్కల్ని కూడా
నోట్లో వేసుకోకుండా చీరకొంగులో జాగ్రత్తగా కట్టి
నాకోసం తెచ్చిన నా పిచ్చితల్లి రూపం
కన్నీటి తెరలమధ్య కదలాడుతుంది !
త్యాగాల చరిత్రలో నాలుగక్షరాలకు నోచుకోని అమ్మ
పాకీ పనులు పాచి పనులు చేసి దగా పడిన అమ్మ చేతుల్ని
నా కవిత్వం తనివితీరా ముద్దాడుతుంది
(దగాపడ్డ అమ్మ – చల్లపల్లి స్వరూపరాణి)
తల్లి త్యాగాల కల్పవల్లి అని మరో మారు, మరో రకంగా చూపించే కవిత కుసుమం ఇది –
తినడానికి
మూడే రొట్టెలున్నప్పుడు
తినే వాళ్లు నలుగురైనప్పుడు
తనకి ఆకలి లేదన్న వ్యక్తి
తప్పకుండా అయి వుంటుంది
మాతృమూర్తి
(జోశ్యభట్ల)
మంచి చెడూ, మొత్తం మీద రెండు రకాల స్మృతుల్నీ కలగలిపి మూటగట్టుకుని అందించిన కవి ఒకరు –
నీ స్తన్యం గ్రోలినప్పటినుంచి
నీకు తల కొరివి పెట్టేదాకా మధ్యదూరమంతా
మధుర స్మృతులు కొన్ని విషాద స్మృతులు మరికొన్ని
కలిమిలోనివైనా లేమిలోనివైనా కరిగిపోని స్నృతులే అన్నీ
(స్మృతి దీపం – జి. వెంకటేశ్వర్లు)
వెళ్ళి పోయిన అమ్మ గురించి వాస్తవాన్ని జీర్ణించుకోలేని పసిపిల్లల మనస్తత్వాన్ని ప్రతిబింబించే కవిత ఒకటైతే
అమ్మా!
మా క్షేమం పట్టకనే – బాధ్యతల్నుంచి మెడ మీద కాడినుంచి
చల్లగా తప్పుకొని ఏ లోకాలకూ వెళ్ళిపోయిన నువ్వు
క్షేమమే అనుకుంటాం ..!
(చిన్నారుల ఉత్తరం – పప్పుల రాజి రెడ్డి)
అది జీర్ణించుకుని వైరాగ్య మనస్తత్వాన్ని ప్రతిబింబించే కవిత ఇది –
నిదుర లేపకండి !
దయచేసి నిదుర లేపకండి !
దశాబ్దాల ప్రయాణపు ఆఖరి మజిలీ అది
కన్నీటి చారికలతో సాగిన ప్రయాణమది
ఆమెను దయచేసి నిదుర లేపకండి !
(ప్రవహించే నది – అరసవిల్లి కృష్ణ)
తల్లితనాన్ని ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ అది ఎటువంటిదో తేల్చుకోలేని తల్లి మనసుని చూపిస్తుంది-
మాతృత్వం వరమో శాపమో స్వర్గమో నరకమో తేల్చిచెప్పడమంటే
కత్తి అంచుమీద నుంచి సుతారంగా గాయపడకుండా నడవడమే కదూ
(మాతృత్వం – ఓల్గా)
అమ్మను కోల్పోడమంటే ఒక వ్యక్తిని కోల్పోడం కాదు అమృతత్వాన్ని కోల్పోడమని, అయినా అంతర్నేత్రంతో చూడవచ్చని చెప్పేది ‘అమ్మ అక్షరం’ –
అమ్మను కోల్పోవడమంటే అమృతత్వాన్ని కోల్పోవటం –
మమతను కోల్పోవటం మనిషితనాన్ని కోల్పోవటం !
అంతర్ణేత్రం విచ్చుకుంటే అణువణువులో అమ్మ లాలిపాట వినబడుతుంది
అమ్మ ఒడిలో తూగుతున్న అనంతవిశ్వం కనబడుతుంది
(అమ్మ అక్షరం – రాజు)
అంతర్నేత్రంతోనే కాదు, ఇంటి పెరటి తులసిలో అమ్మను చూపిస్తుంది మరో కవిత –
పెరట్లో తులసి కోటని చూడగానే కంట్లో అమ్మ కొలువు తీరుతుంది
ప్రశ్నార్థకానికి ప్రతీకలా ఉండే మా అమ్మ సమస్యలకు తక్షణ పరిష్కారమయ్యేది
గోమయంతో అలికిన పూజగదిలో నిత్యం ముత్యాల ముగ్గయిపోయేది
మా ఇంటి నిండా అమ్మ జ్ఞాపకాలే
నా మనోముకురాన్ని భళ్ళున ముక్కలు చేసి
మృత్యు స్పర్శతో జీవితం చివరి పంక్తిని దాటింది మా అమ్మ!
అమ్మ ముందు అన్నీ సూక్ష్మాతి సూక్ష్మాలే ..
తమలపాకు దొన్నెలో జుర్రిన తేనె తీపి, చెరుకు రసంలో నానిన మామిడిపండు రుచి
అమ్మ గుండెలో ఇంకిపోని పాలవాసనల ముందు దిగదుడుపే ..!
(హృదయమానం- ఎస్. ఆర్. భల్లం)
బిడ్డ గురించి పడే తల్లి ఆరాటాన్ని వర్షించేది మరోటి –
అమ్మ గుండె లబ్ డబ్ అనదు
బిడ్డ బిడ్డా అంటుంది
అమ్మ కళ్ళు కన్నీళ్ళు కార్చవు
మమతల పువ్వులు వర్షిస్తాయి
(విశ్వ కమలా పరాగం – ముని సుందరం)
బిడ్డ గెలుపే తన గెలుపని మురిసి పోయే పిచ్చితల్లి గొప్పతనాన్ని గుర్తించిన బిడ్డ ప్రమాణపత్రం మరోటి –
నన్ను గెలిపించడానికి తను ఓడిపోతుంది
అలా ఓడిపోవడమే గెలుపనుకుంటుంది
అమ్మ ఎప్పుడూ అంతే ..!
………
అమ్మను గెలిపిస్తాను
అమ్మా! అని పిలుస్తాను
అలక తీరుస్తాను …
ఆమె పక్కన కూర్చుని కాసేపు మాట్లాడతాను
ఆరోగ్యం ఎలా వుంది అమ్మా…. అని అడుగుతాను
అమ్మే గెలుస్తుంది … గెలిచి నన్ను గెలిపిస్తుంది !
(అమ్మ ఎప్పుడూ అంతే- పూడి శ్రీనివాసరావు)
తెలిసో తెలియకో అమ్మని ఏడిపించిన వాళ్ళు, బాధపెట్టిన వాళ్ళు చెందే పరితాపం ప్రతిబింబించేది –
నాకు నేనై మాడి మసై పోవాలనిపిస్తుంది
ఏదైనా తిరుగులేని దండన వింధించుకోవా లనిపిస్తుంది
అమ్మను కసురుకున్న అనంతరం
మనస్సంతా నల్లగా కమిలిన ట్లవుతుంది
బాధంతా ఊపిరయినట్లుంటుంది
(అమ్మను విసుక్కున్న పిమ్మట – వంజువాక సతీష్ కుమార్ రెడ్డి)
అమ్మని గుర్తు పెట్టుకుని ఆమె చర్యల్ని, ప్రేమని గుర్తు తెచ్చేవి కొన్నయితే, ఆమె చీర కొంగుని గుర్తుంచుకుని కూడా మురిసిపోయే బిడ్డ మరొకరు –
బుడిబుడి నడకల ఆదిమ ఆలంబనం అమ్మ పైట కొంగు
అపరిచితుల పలకరింపులకు సిగ్గుల పరదా
చిరుతిండాకలికి తాయిలం భరిణె
జీడీలకు డబ్బులు దొరికే అక్షయపాత్ర
అర్థరాత్రి చలిలో నులివెచ్చని భోగిమంట
మధ్యాహ్నపు మంచుటెండలో మమతల గొడుగు
రోజులో అమ్మకెన్ని పనులో అమ్మకొంగుకు అన్ని రూపాలు
నిత్యం జ్ఞాపకాల్లో వేలాడే అమ్మ కొంగులో
ఎప్పటికీ నే పసిబొమ్మనే …!
(తన కొంగు – నెలకపూడి ఉషారాణి)
ఎన్ని తప్పులు చేసినా బిడ్డ గెలుపునే కోరే తల్లిని చూపించేది –
నాన్నకు తద్దినం పెట్టినరోజు
ఒక లీవ్ పోయిందే –
ఆదివారం వస్తే బాగుండునన్నప్పుడు
నాన్న ప్రతిబింబమున్న అమ్మ మనసు
ఎన్ని ముక్కలై వుంటుందో ఊహించలేకపోయాను !
….
నా కోసం ఒక జీవితకాలం శ్రమించిన అమ్మ దగ్గర
పట్టుమని పదినిమిషాలు కూచొని
ఆమె మనసును మునివేళ్ళతోనన్నా కళ్ళకద్దుకోలేకపోయాను !
ఇంత చేసినా –
నన్ను ఇప్పటికీ
‘అడ్డాలనాటి బిడ్డవేరా’ అంటుంది అమ్మ !
‘అందరిముందూ గెలవాలి రా’
అన్నవి అమ్మ మాటలు –
అక్క అమ్మ ముందే గెలవలేక పోయాన్నేను
(అమ్మకు క్షమాపణలతో – దాసరాజు రామారావు)
అమ్మ వెళ్లిపోగానే అంతా అయిపోలేదు, ఏదో విధంగా ఆమె మనతోనే వుంటుంది అనేవి కొన్ని –
ఒక్కోసారి
లోకానికీ నాకూ మధ్య ఉండే దారం బలహీన మైనప్పుడు
బంధాలేవో బలహీన మవుతున్నప్పుడు
మళ్ళీ అమ్మనుంచి అమ్మలోకం లోంచి
సన్నని దారమేదో వురివేసుకుని గట్టిపడుతుంది …
(లాలన పావనం – యాకూబ్)
అమ్మ జ్ఞాపకాలు కూడా మారుమోళ్ళకెళ్లి పోయాయని ఒప్పుకునే వ్యథ ఒకరిది –
అమ్మా! నీ జ్ఞాపకం
ఫోటోలా దుమ్ము పడుతోంది
ఒకప్పుడు వేల చిత్రాలై నన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన జ్ఞాపకం
ఒకే ఒక గమనింపబడటం గా మారి
మనసులో ఏ మారుమూల గొడకో వ్రేలాడుతోంది
(జ్ఞాపకం- విన్నకోట రవిశంకర్)
అలాగే,
ఆకలి తీర్చి – నడకలు నేర్పి
బుధ్ధులు తీర్చి – మమతలు నేర్పి
మనిషిని మలిచే దైవంచేతి ఉలి “అమ్మ” !
నా కోసం
కళ్ళు చెలమల్ని చేసుకున్నా కన్నీటి ప్రార్థన – అమ్మ !
(జీవ వృక్షం – కొండెపోగు డేవిడ్ లివింగ్ స్టన్)
మాతృమూర్తి ఆఖరి క్షణాలను గుర్తుచేసే కవిత
ఆ రోజు మధ్యాహ్నం
ఆ కళ్ళు అలా తెరుచుకునే నిశ్చలమై
తన శరీరం తప్ప మరెవ్వరూ లేని ఆ గదిలో
బలహీనమైన శ్వాస తప్ప మరో తోడు లేని ఆ ఒంటరితనంలో
ఇంకా ప్రాణం పోలేదా! అని
అవతలినుంచి అప్పుడప్పుడూ తొంగిచూసిన వాళ్ళను
నిశ్చలంగా నిలబడిపోయిన ఆమె కళ్ళు
నిశితంగా చూస్తూనే ఉన్నాయి
అందరి ప్రవర్తనల్నూ అవి రికార్డు చేసే వుంటాయి
చివరకు మృత్యువొక్కటే ఆమెను అక్కున చేర్చుకుంది
ప్రాణం పోయిన తర్వాత కూడా
మనుషుల నటనల్నీ , నాటకాల్నీ , కపటాల్నీ
చూడాలనుకుంటున్నట్లు
ఆమె కళ్ళు మూసుకునే లేదు !
(మా అమ్మ – వి. ఆర్. శర్మ)
పెద్ద పెద్ద వాక్యాలు , అతిశయోక్తులూ లేకుండా రెండు ముక్కల్లో అమ్మని పొగిడిన కవిత –
రూపాయి కంటే చిన్నదే అయినా
దేశంకంటే మా అమ్మ పెద్దదే !
(కొత్త వారసత్వం- నాళేశ్వరం శంకరం)
అమ్మ జ్ఞాపకాల ఉయ్యాలలో ఊగించేవి కొన్ని –
మా చిన్నప్పుడు విజయదశమి అంటే –
‘ముందు లేచిన వాళ్ళు ముత్యాల కొండ’లంటూ
అమ్మ పలికే సుప్రభాతాల కిలకిలారావాలు
‘వెనుక లేచినవాళ్లు వెండికొండ’ లంటూ
లేటు శాల్తీల్ని చిన్నబుచ్చని అమ్మ లౌక్యపు బుజ్జగింపులు
మేం పెద్దయ్యాక విజయదశమి అంటే
అమ్మకి టెలిఫోన్లో కురిపించే శుభాకాంక్షలు
చిన్నప్పటి జ్ఞాపకాల ఉయ్యాల్లో కులుకులు !
(అమ్మ కబుర్లు – జి. వల్లీశ్వర్)
నిస్వార్ధంగా పెంచి పెద్ద చేసిన అమ్మ దగ్గర కూడా తన స్వార్ధాన్ని వెళ్ళబోసుకున్న సంతానరత్నం తీరు ఇదీ –
అమ్మా నువ్వు జాగ్రత్త !
జ్వరమింకా పూర్తిగా తగ్గలేదనుకో
కాలివాపు బొత్తిగా తియ్యలేదనుకో
అయినా నే వెళ్ళాలి – నాదని అందరూ అనుకునే ఇంటికి !
—-
వెళ్లొస్తా –నువు జాగ్రత్త మరి !
(జాగ్రత్త అమ్మా- ఘంటసాల నిర్మల)
అమ్మ లేనితనం అసలైన లేమి అనీ, అది ఇజాలకు అతీతమని చెప్పే నిజం ‘మాతృగీతం’ –
అమ్మా! నిను చూడాలని ఉంది
నువ్వింక మా ఇంటికి లేవన్న ఊహ
నాలో ఒక వింతైన నవ్వుగా పరిణమిస్తున్నది
భయమూ, దుఃఖమో బాధో తెలియని ఏవో తీవ్ర భావాలు
నా గుండెనదిలో వచ్చిన వరదలా పొంగిపోతున్నవి
నరనరాల్లో జీర్ణించిన నా మార్క్సిస్టు మధురోహలు
భారతీయ వేదాంత భావనకు లొంగిపోతున్నవి
(మాతృ గీతం – కుందుర్తి)
నా అమ్మను ఎలా వెతుక్కోవాలి అని ఆరాట పడే బిడ్డ మనసు –
ఇప్పుడు ఇంతమంది తల్లుల్లో మా అమ్మ కోసం ఎక్కడని వెతుక్కోను ?
ఇంతమంది తల్లుల్లో మా అమ్మ ఎవరో ఎలా పోల్చుకోను?
రక్తంలో నిక్షిప్తమైన వారసత్వంలో
ఒక సుందర స్వప్నం కదా అమ్మ !
(అమ్మ చల్లని చూపు – ఆవంత్స సోమసుందర్)
వెళ్ళిపోయిన అమ్మకి బొమ్మ కూడా లేని బిడ్డడి ఆవేదన ప్రతిబింబించేది –
అమ్మ పోతూ పోతూ తన బొమ్మ ఇచ్చి పోలేదు
అసలు బొమ్మంటూ వుంటే కదా ఇవ్వడానికి !
అమ్మ బొమ్మ దిగవే అంటే ఆణిముత్యంలా నవ్వేసేది
నువ్వు నా బొమ్మవు కావా అంటూ !
(అమ్మ బొమ్మ – సి.నా.రె)
అమ్మ లేదని బెంగ పెట్టుకోవక్కర్లేదు, కానీ ఆమెను తలచుకుని కలం పట్టుకున్నప్పుడల్లా అక్షరాల్లో బ్రతికే వుంటుందని చెప్పేది –
అమ్మ గురించి నాకేం తెల్సు ?
అమ్మ నుంచి వచ్చాను ! అమ్మని చూశాను!
ఎప్పటికీ అమ్మని కాలేను నేను –
కలం పట్టుకున్నప్పుడల్లా అమ్మ కాకపోతే–
అక్షరాలెట్టా బతుకుతాయి ! ఎట్టా ఎదుగుతాయి ! ఎట్టా ఎగురుతాయి !
(అమ్మ – శివారెడ్డి)
చివరిగా నా వ్యధ –
అమ్మా ఇంతకు ముందు కోకిల ఎలా కనిపించేదో – నేనేమేమి తప్పులు చేసేనో తెలీదు కానీ
నువ్వు వెళ్ళిన తర్వాత కాకి కూడా కోకిల లాగే కనిపిస్తోంది నాకు – వినిపిస్తోంది నాకు !
క్షమించు నన్ను – క్షమించు నా తప్పుల్ని !
( మూర్తి రేమిళ్ళ)
***
విశ్వనాధ శాస్త్రి లొల్ల
బాగుంది, వివిధ రచయితల మనోభావాలను ఒకచోట గుదిగుచ్చినందుకు ధన్యవాదాలువి
Dr. Murthy Remilla
ధన్యవాదాలు