అపూర్వమైన బహుమతి
వ్యాసకర్త: ప్రసూన రవీంద్రన్
**************
“బాల్యం నన్ను వెంటాడుతూనే ఉంది” అని త్రిపుర అన్నా, “తియ్యటి బాల్యం లోకి మరోసారి పయనించి రావాలని” ఎనభయ్యవ దశకం, అంతకు ముందు పుట్టిన మనమంతా అనుకున్నా, అందుకు కారణాలు చెప్పమంటే ఏం చెబుతాం? ఎలా చెబుతాం? ఎన్ని చెబుతాం?
బాల్యం అన్నమాట తల్చుకోగానే ఆ అనుభూతులు మరోసారి సర్రున నరాల్లో పొంగి మొహం ఎర్రగా కందిపోగా వరుసగా చెప్పెయ్యమూ ..”నది ఒడ్డూ, పిల్ల కాలువలూ, పంట పొలాల్లో ఆటలూ, మామిడి తోటలూ, తొక్కుడు బిళ్ళలూ, దాగుడు మూతలూ, కరెంటు లేని వెన్నెల రాత్రుల్లో అస్సలు విసుగంటే తెలియని పసి ఆనందాలూ(అస్సలు కరెంటుకి అంత విలువెప్పుడిచ్చాం?అందుకేనేమో బహుశా ఇన్ని అనుభూతులతో ఇప్పటి పిల్లలకన్నా గొప్ప ఐశ్వర్యవంతులమయ్యాం) ఇంకా తాతయ్యలూ, నానమ్మలూ, అమ్మమ్మలూ , వారి ప్రేమలూ, వాళ్ళు చెప్పిన కథలూ …..”
కదా…అంతే లేదు.
మరి తొంభైల తరువాతా, మరీ ముఖ్యంగా రెండువేల సంవత్సరం తరువాత పుట్టిన పిల్లల సంగతో? బాల్యం అనగానే నిజంగా అంతగా గుర్తొచ్చే ముద్దొచ్చే అనుభవాలేమైనా వాళ్ళ మస్తిష్కపు పెట్టెల్లో దాక్కుని ఉండి ఉంటాయా? మనసు పొరల కింద తొంగి చూసుకుని చెప్పమంటే, కాస్త సమయం తీసుకున్నా మూడు, నాలుగు అనుభవాలో, అనుభూతులో చెప్పగలరా గట్టిగా?
మన చిన్నప్పుడంతా ఆదివారమంటే అన్ని ఆనందాలతో పాటుగా ఏ చందమామో, బాలమిత్రో, బుజ్జాయో మన దినచెర్యలో భాగమైపోయి ఉండేది కదూ. ఆ కథలతో ఎన్ని అందమైన లోకాల్ని సృష్టించుకునేవాళ్ళం? అందులో రాజులమై, రాణీలమై, అడవులు దాటుతూ, నదుల్లో ఈదుతూ, మాయల మాంత్రికుల్ని మట్టుపెడుతూ, మాట్లాడే జంతువులతో సావాసం చేస్తూ .. ఇలా చెబుతూ పోతే ఎన్ని పుస్తకాలు వ్రాయచ్చు మనం?
మరి ఈ పిల్లలు? “టెంపుల్ రన్, కాండీ క్రష్, ఛోటా భీం, పేపా పిగ్, డోరేమాన్, వాట్స్ ఆప్, మహ అయితే వాటర్ వరల్డ్, స్నో వరల్డ్, తిండి గురించి అడిగితే మాగీ, కుర్ కురే “ ఇలా చెప్పుకుంటారా?
పోల్చి చూడండి? ఎంత వ్యత్యాసం కదా? ఎందుకలా? ఎటు తీసుకుపోతున్నాం పిల్లల్ని మనం? అసలు వాళ్ళ చెయ్యి పట్టుకుంటున్నామా? “ఇదీ దారి, ఇలా నడవాలి “ అని అసలు చెబుతున్నామా?
పోనీ, మన చిన్నతనంలో ఉన్నట్టుగా నెల తిరిగేసరికి మాంచి కథల్ని మోసుకొచ్చే పత్రికలైనా ఉన్నాయా? ఒకటో రెండో ఉన్నా, ఆ కథల్లో నాణ్యత పాళ్ళు ఎంత?
“సరే ప్రపంచం మారిపోయింది. కాలం మారిపోయింది. మారుతున్న కాలంతో మనమూ మారాలి “ అని రొటీన్ మాటలు చెబుతామా? అక్కరలేదేమో ఇంక.
రెక్కల గుర్రాలు, వెండి చేపలూ, బంగారు చేపలూ, తెలివైన మనుషులూ, మంత్రగత్తెలూ, బంగారు ఆపిల్ పళ్ళూ, సున్నితమైన మనసున్న వాళ్ళూ ఇలా మన బాల్యాన్ని గుర్తుకుతెచ్చేవన్నీ ఒకే చోట ఉంటే? అంతకంటే ముఖ్యంగా పిల్లలకు మంచి మాటలూ, నీతులూ మరింత ఆసక్తికరంగా , అద్భుతంగా ఆవిష్కరించగల కథల ద్వారా చెబితే?
ఇంకా బాగా ఆ నీతిని అర్థం చేసుకుంటారు కదా. అచ్చంగా అలా మనకు సహాయపడే పుస్తకమే అనిల్ బత్తుల గారు ఏరి కోరి, అనువదించి సంకలనపరిచిన అపూర్వ రష్యన్ జానపద కథలు. నిజంగా అపూర్వమే ఈ పుస్తకం.
మనకి పరిచయంలేనివారైనా సరే ఆపదలో ఉంటే, సహాయం చేయడానికి మన దగ్గర ఏమీ లేకపోయినా, మరెవరైనా అందుకు ముందుకొస్తారేమో అని వెతుకడం ఎంత మంచితనం కదా. వెండి చేప పిల్ల కథ అదే నేర్పిస్తుంది.
లెక్కలంటే ఎంతో మక్కువున్న ఒక బుజ్జాయి కుందేలు కథ చదివేకొద్దీ మరీ ముద్దొచ్చేస్తుంది.
కోరిందల్లా దొరుకుతున్నా తృప్తి చెందకపోతే జరిగేదేమిటో జాలరీ, బంగారు చేప కథ చెబుతుంది.
మరో కథలో ఇంట్లో ఉండే నానమ్మలకీ, తాతయ్యలకీ ఒంట్లో శక్తి సన్నగిల్లినప్పుడు మందులకంటే ముందుగా వారికి మనం ఇవ్వవలసినదేమిటో చాలా హృద్యంగా చెప్పారు.
తెలివితేటలు, లౌక్యం ఉంటే అన్నిటినీ ఎలా జయించవచ్చో మరి కొన్ని కథలు చెబుతాయి.
ఇలా ఆ పుస్తకంలోని ప్రతీ కథా ఆణిముత్యమే. ఇంత అపురూపమైన కథల్ని అంతే అపురూపమైన బొమ్మలతో చాలా ముచ్చటకలిగేలా ముద్రించి అనిల్ బత్తుల గారు బాలల ప్రపంచానికి భలే మంచి బహుమతినిచ్చారు.
చిన్నతనంలో మనం ఎన్ని కథలు చదివినా, మన అమ్మమ్మలూ, తాతయ్యల దగ్గర ఎన్ని కథలు విన్నా, సమయం చాలకో, అన్నీ జ్ఞాపకం లేకనో మన పిల్లలకి అవి చేరలేదు అన్నది నిజమే కదా. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం, ఆ బహుమతిని అంది పుచ్చుకుని మన పిల్లలకి ఓ అందమైన, సున్నితమైన లోకాన్ని, అసలైన ప్రపంచాన్ని, జీవితంలో మాధుర్యాన్ని, మనం నడిచివచ్చిన దారిని పరిచయం చెయ్యడం ఇక మనకు అతి ముఖ్యమైన బాధ్యత మరి.
anuradha
హౌ తో రిజిస్టర్ ఇన్ పుస్తకం.నెట్. ఐ అం నాట్ గెట్టింగ్ ఎనీ లింక్ తో టోరెజిస్టర్.
సౌమ్య
Anuradha garu: You don’t have to register to read articles or submit articles to pustakam.net. To read, you can just browse the website and pick what you want to read. To send your article, send it to editor @ pustakam.net. Please check రచయితలకు సూచనలు page on the website before submitting.
Maithreyi
Very true… beautifully expressed…got the book. Enjoying reading telugu stories for a change.